26, నవంబర్ 2023, ఆదివారం
నడక దారిలో -34
నడక దారిలో -34
ఓ రాత్రి మా బాత్రూమ్ పక్కనే పెరటిగోడ కూలిపోయింది.గోడని ఆనుకొని క్షత్రియ హాస్టల్ ఉండటం వలన మాకు ఇబ్బంది మొదలైంది.అక్కడే మా బాత్ రూం ఉంటుంది కనుక నాకూ,పల్లవికీ స్నానాలకు ఇబ్బంది కలిగేది.
ఇంటి ఓనర్ తో చెప్తే విసురుగా మాట్లాడింది.దాంతో వేరే ఇల్లు వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాం. పాత నల్లకుంటలో రామడుగు రాధాకృష్ణ మూర్తి గారి ఇంటికి రెండు సందులు ఇవతల ఇల్లు దొరికింది.ముందువైపు ఇంటి వాళ్ళు ఉంటారు వెనుకవైపు రెండు చిన్నచిన్న రూములు, చిన్న వంటగది.మాకు చాలా ఇరుకుగా ఉండేది.
పల్లవికి తన వయసు అమ్మాయిలు చాలా మంది స్నేహితులు అయ్యారు.అక్కడే ఉన్న రామాలయంలో ఒక ఆయన సంగీతం నేర్పిస్తారని తెలిసి అక్కడ చేర్చాను.ఈ ఇంటికి స్కూలు కొంచం దగ్గర అయ్యింది.నడిచే వెళ్ళిపోతుండేది.
అక్కడకు ఫర్లాంగు దూరంలోనే ఉన్న ఇంటిలో నా చిన్ననాటి స్నేహితురాలు జానకి వాళ్ళు ఉంటారని తెలిసింది.నాకు చాలా సంతోషం కలిగింది.మేము తరుచూ కలుసుకునే వాళ్ళం.కుమారికి ఈ విషయం చెప్తే ఆమె కూడా అప్పుడప్పుడు వస్తుండేది.చిన్ననాటి కబుర్లు కలబోసుకునేవాళ్ళం.
రాగలత చెల్లెలు హైదరాబాద్ లోనే డిగ్రీలో చేరింది.అందుచేత రాగలత కూడా తన చెల్లెలుతో కలిసి మా ఇంటికి దగ్గరలోనే రూం తీసుకొని ఉండేది.
ఒకరోజు నాకు ఉద్యోగానికి కాల్ లెటర్ వచ్చింది.ఇంకా రిజల్ట్ రాలేదు.నేను అప్లై చేయలేదు.ఎలా వచ్చిందా అనుకున్నాను.అంతలో రాగలత కూడా వచ్చి తనకు కూడా అదే స్కూల్ నుండి కార్డు వచ్చిందని చెప్పింది.ఇద్దరం నారాయణగూడ చౌరాస్తాలోని సెయింట్ పాల్ హైస్కూల్ కి వెళ్ళాము.మా ఇద్దరినీ ఇంటర్వ్యూ చేసి మేము చదివిన బియ్యీడీ కాలేజి ప్రిన్సిపల్ మా పేర్లు రికమెండ్ చేసారని చెప్పారు.ప్రస్తుతం నెలకు అయిదు వందలు ఇస్తామని, రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తే పెంచుతామని అన్నారు.సర్లే అని ఇద్దరం చేరిపోయాము.
అయితే ఆ స్కూల్ లో రోజంతా అన్ని పీరియడ్స్ క్లాసుల్తో,క్రమశిక్షణ లేని పిల్లలతో చాలా కష్టం అయ్యేది.
అంతలో మా రిజల్ట్ వచ్చింది .నేనూ,రాగలత కూడా ఫస్ట్ క్లాసులో పాసయ్యాము.నా సంతోషానికి అవధుల్లేవు.
సెయింట్ పాల్ హైస్కూల్ యాజమాన్యం కి రిజల్ట్ గురించి చెప్పి ఫస్ట్ క్లాస్ వస్తే జీతం పెంచుతామని అన్న విషయం గుర్తు చేసాం.కానీ ఆరునెలలు దాటాక జీతం పెంచుతామన్నారు.చెప్పిన మాట తప్పిన యాజమాన్యం ప్రవర్తనకి రాగలతా,నేను కొంత అసంతృప్తికి లోనయ్యాము.
కాంగ్రెసేతర పార్టీ ప్రభుత్వం ఏర్పడటం తో రాష్ట్రంలో కూడా చాలా సంచలనాలు కలగటం మొదలైంది.
చిరకాల కాంగ్రెసు ప్రభుత్వాన్ని త్రోసిరాజని తొలిప్రాంతీయపార్టీ రాష్టపగ్గాలు చేపట్టటం భరించరానిదయింది.రాష్ట్రంలో అందులోనూ హైదరాబాద్ లో మత కల్లోలాలు రాజుకొనేలా ప్రత్యర్థులు చేసారు.
ఈ లోగా మాకు ఈసారి ఇద్దరికీ వేర్వేరు స్కూల్స్ నుండి కాల్ లెటర్ వచ్చింది.ఒక రోజు సెలవు పెట్టి వెళ్ళాం.నేను న్యూ ప్రొగ్రసివ్ స్కూల్ కి వెళ్ళాను.నేనేకాక నాతో చదివిన భాగ్యలక్ష్మి,మరో అమ్మాయి ఆంధ్రావాణీ కూడా వచ్చారు. అందర్నీ తీసుకున్నారు.అయితే SGBT స్కేల్ ప్రకారమే జీతం ఇచ్చేవారు.
నాకు ప్రాధమిక తరగతులకు రెండవభాష తెలుగు,గణితం ఇచ్చారు.ఆ స్కూలు పేరుకు ఇంగ్లీష్ మీడియం.కానీ పిల్లలంతా 98 శాతం ముస్లింలు.టీచర్లలో మేం ముగ్గురం కాక హైస్కూల్ లెక్కలకు, తెలుగు టీచర్లు మాత్రమే హిందువులం.
పిల్లలకు ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు.వచ్చినా ఉర్దూ కలిసిన తెలంగాణా భాష.నాకు అంతంతమాత్రం ఇంగ్లీష్,ఉర్దూ అసలు రాదు.ఇంక నా అవస్థలు చూడాలి.ఆ ఏడాది లో నాకు మాత్రం ఉర్దూ కాస్తంత వచ్చేసింది.
ఒకవైపు మాటిమాటికీ కర్ఫ్యూలతో హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది.మా స్కూల్ టీచర్స్, విద్యార్థులు కూడా చాలా మంది పాతబస్తీకి, ముస్లిం ప్రాంతాలకూ చెందిన వాళ్లు.ఏమూలో నిప్పురవ్వపడి మతకల్లోలాలు గుప్పుమనేవి.పిల్లలకోసం తల్లిదండ్రులు బడికి పరిగెత్తుకుని వచ్చేవారు.హడావుడిగా పిల్లల్ని వదిలేసి బడి మూసేసేవారు.మేము గుండె దడదడ లాడుతుండగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏరిక్షానో మాట్లాడుకొని ఇంటికి చేరే వాళ్ళం.అదృష్టవశాత్తు లెక్కలటీచర్ ఇల్లు కూడా శంకరమఠం దగ్గరే కావటంతో ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేవాళ్ళం.
ఆ ఏడాదంతా స్కూలుకి వెళ్ళిన రోజులు తక్కువే అయ్యాయి.అయితే ఏప్రిల్ లో స్కూల్ ఆఖరి పనిదినం రోజున మమ్మల్ని పిలిచి సెలవుల్లో జీతం ఇవ్వమని చెప్పి,తిరిగి స్కూల్ తెరిచాక రమ్మన్నారు.
ఇంకా మళ్ళీ ఉద్యోగం వేట మొదలెట్టాలి అనుకున్నాను.
వీర్రాజు గారు ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి బిజీ అయి పోయారు.అంతకుముందు ముఖ్యమంత్రులకు కూడా ఈయనే ప్రసంగాలు రాసేవారు.అయితే వాళ్ళు ఏది రాస్తే అది చదివేవారు కనుక ఇబ్బంది కలుగలేదు కానీ తెలుగు దేశం వచ్చాక సినిమా డైలాగుల్లా వచ్చేవరకూ తిరిగి తిరిగి రాయవలసి వచ్చి విసుక్కునేవారు.అందువలన ఆయన ఇంట్లో ఉండటం తగ్గిపోయింది
ఒకరోజు రాగలత టీచర్లకోసం అడ్వర్టైజ్మెంట్ తీసుకుని వచ్చింది.సరే అని నేనూ,రాగలతా ఆ స్కూలుకు వెళ్ళి అప్లికేషన్ రాసి ఇచ్చాము.ఇంటర్వ్యూకి ఫలానా రోజు రమ్మని చెప్పారు.
వాళ్ళు చెప్పిన రోజుకు వెళ్దామని రాగలతని పిలుస్తే తెలుగు మీడియం స్కూల్ నేను చెప్పలేనని చెప్పి రాలేదు.నేను ఒక్కదాన్నే వెళ్ళాను.
ఇంటర్వ్యూకి ఒక్క పోష్ట్ కి నలభై మందికి పైగా వచ్చారు.నాతో ప్రోగ్రసివ్ స్కూల్ లో పనిచేసిన ఆంధ్రవాణి కూడా వచ్చింది.ఎందుకో నాతో ఆమె ఏడాదిపాటు కలిసి ఉద్యోగం చేసినా పరిచయం గానే మిగిలిపోయింది.స్నేహితురాలు కాలేదు.ఆ అమ్మాయి డామినేటింగ్ ప్రవర్తన మామధ్య దూరాన్ని పెంచింది.
ఆ అమ్మాయి చాలా మాటకారి వచ్చిన దగ్గర్నుంచి డీయీవో, డెప్యూటీ డీఈవో తనకు బాగా తెలుసును అన్నట్లుగా మాట్లాడుతూనే ఉంది.తీరా ఆరోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేందుకు వాళ్ళు రాక పోవటంతో వాయిదావేసి వారంతర్వాత రమ్మన్నారు.
వారం తర్వాత మళ్ళా వెళ్ళాను.ఈసారి ఇంటర్వ్యూకి అంతకు ముందు వచ్చినవారిలో సగం ముందే వచ్చారు.ఆంధ్రవాణి వచ్చి ఈ సారి కూడా తనకు డిప్యూటీ డీఈవో ఎంతబాగా తెలుసో జనఆంతఇకంగఆ వైనాలు వైనాలుగా చెప్తోంది.మాటిమాటికీ మమ్మల్ని కూర్చోబెట్టిన గది ద్వారం దగ్గరకు వెళ్ళి "రామచంద్రరావు గారి కారు ఇంకా రాలేదేమిటీ"అంటూ తనలో తాను అనుకున్నట్లుగా అనటమే కాక "ఈ స్కూల్లో ఎవరిని తీసుకోవాలో ముందే నిర్ణయం ఐపోయింది.ఇది కేవలం నామినల్ గా చేసే ఇంటర్వ్యూ మాత్రమే" అనటం మొదలెట్టింది.దాంతో మా అందరికీ నిరాశ కమ్మేసింది.అంతలో అటెండర్ వచ్చి "డీయీవోగారికి వేరే పని పడింది.రేపు ఇదే సమయానికి రమ్మ"ని చెప్పాడు.
ఒకవైపు ఆంధ్రవాణి మాటలు వింటుంటే మళ్ళా మర్నాడు హాజరు కావాలనిపించలేదు.నీరసంగా ఇల్లు చేరాను.రాగలత వస్తే విషయం చెప్పాను."ఆంధ్రవాణి కావాలని అలా చెప్తుందేమో" అని అనుమానంగా అంది రాగలత.
వీర్రాజు గారు కూడా అదే అన్నారు.
సరే మర్నాడు కూడా వెళ్ళాను.ఆరోజు ఓ పదిమంది మాత్రమే వచ్చారు.యథాతథంగా ఒక్కొక్కరిని పిలిచి అక్కడ ఉన్న ఆరుమంది ఇంటర్వ్యూ చేసారు.ఇంటర్వ్యూ చేసాక భౌతిక రసాయన శాస్త్రం లో ఒక పాఠం రేపు వచ్చి చెప్పమన్నారు.నమస్కారం చేసి బయటకు రాగానే ఆంధ్రవాణి ఏమన్నారని అడిగింది.సమాధానం చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను.
పదవతరగతి భౌతికశాస్త్రం లో ఒక అంశం తీసుకుని బియ్యీడీ ట్రైనింగ్ లో నేర్చుకున్న పద్ధతిలో లెసన్ ప్లాన్ తయారు చేసుకుని ,ఒక చార్ట్ కూడా వేసుకుని మర్నాడు వెళ్ళాను.
ఆంధ్రవాణి కాక మరొక అబ్బాయి కూడా వచ్చాడు.అంటే ముగ్గురిని పిలిచారన్నమాట అనుకున్నాను.
నా చేతిలో లెసన్ ప్లాన్ చూసి ఆంధ్రవాణి "అయ్యో నేను లెసన్ ప్లాన్ రాయలేదు" అంటూ పక్కనే ఆ స్కూల్ ఆఫీసు రూమ్ లోకి వెళ్ళి రెండు తెల్ల కాగితాలు తీసుకుని రాయటం మొదలుపెట్టింది.
అంతలోనే పదో తరగతి లో లెసన్ చెప్పమని పిలిచారు.ముగ్గురి పాఠం విని పంపించేసారు.
ఆంధ్రవాణి నాతో మాఇంటికి వస్తానని వచ్చింది.నాకు ఇష్టం లేకపోయినా మొగమాటంతో మౌనం వహించాను.దారిలో " డిప్యూటీ తనకు తెలుసని తనకే వస్తుందని "ఖచ్చితంగా చెప్పింది.నేనేం మాట్లాడలేదు.
మళ్ళా మర్నాడు చీకటి పడుతున్నా వేళ ఆంధ్రవాణి మాఇంటికి వచ్చింది.వీర్రాజుగారు ఇంట్లో ఉంటం వలన లోపలికి రాకుండా నాతో మాటలు మొదలుపెట్టింది.
"సుభద్రా డెప్యూటీ రామచంద్రరావు కి 2000/-రూపాయలు ఇస్తే నీకు ఉద్యోగం వచ్చేలా చేస్తారు.నీకు ఈ ఏడాది లో ప్రభుత్వ ఉద్యోగం వయసు దాటిపోతుంది.గవర్నమెంటు జాబ్ రాదు.డబ్బు నాకు ఇవ్వక్కరలేదు.నువ్వే నాతో వచ్చి ఇవ్వొచ్చు."అంది.
"పరిస్థితులరీత్యా నాకు ఉద్యోగం అవసరమే కానీ ఇలా లంచాలు ఇచ్చి తెచ్చుకోవటం ఇష్టం లేదు.ఇది కాకపోతే ప్రైవేటు స్కూల్లో చెప్పుకుంటాను.అంతేకానీ ఇటువంటి వాటికి మేం విరుద్ధం "అన్నాను.
" సుభద్రా ఆలోచించు.మంచి అవకాశం.మీవారికి కూడా చెప్పు .పోనీ నేను ఆయనతో మాట్లాడనా" అని నన్ను ఒప్పించాలని చాలా చూసింది.
"మా ఆయన ఇంట్లోనే ఉన్నారు.ఆయనతో చెప్తే నన్నే కాదు నీకు కూడా తిట్లు పడతాయి.ఇలాంటివన్నీ నాకు చెప్పకు వెళ్ళు" అని కాస్త సీరియస్ గా అన్నాను. నన్ను చూపించటానికి ఎంత ప్రయత్నించినా నేను లొంగలేదు.
అలా ఓ వారం గడిచాక ఒకరోజు పదకొండు గంటలకి నాకు ఒక కార్డు వచ్చింది. ఆ కార్డు లో "ఫలానా తేదీ రెండుగంటల లోగా జాయిన్ కావాలని లేకపోతే తర్వాత వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామ"ని ఉంది.ఆరోజే రెండుగంటల లోపునే వెళ్ళాలి.పల్లవికి వాళ్ళు తెలియని జ్వరం.వీర్రాజు గారు ఆఫీసుకి వెళ్ళిపోయారు.నాకు ఏంచెయ్యాలో తోచలేదు.పల్లవికి కొంచెం జావ చేసి ఇచ్చి తలుపు దగ్గరకు వేసి గొళ్ళెం నొక్కి పక్కసందులోనే ఉంటున్న రాగలత ఇంటికి వెళ్ళాను.అదృష్టం కొద్దీ ఇంట్లోనే ఉంది.విషయం చెప్పి నేను వచ్చేవరకు పల్లవికి తోడుగా ఉండమని అడుగుతే రాగలత వచ్చింది.నేను హడావుడిగా చీర మార్చుకుని రిక్షా ఎక్కి ఆర్టీసి హైస్కూల్ కు వెళ్ళాను.
స్కూల్ కి వెళ్ళి ప్రధానోపాధ్యాయుల గదిలో ప్రవేశించి నమస్కరించగానే ప్రధానోపాధ్యాయులు శిరోమణి థామస్ గారూ, రాజ్యలక్ష్మి గారూ మరో ఇద్దరు టీచర్లూ ఆత్మీయంగా ఆహ్వానించారు.చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మరునాటి నుంచి తొమ్మిది కల్లా స్కూల్ లో ఉండాలని చెప్పారు. ఆత్మీయంగా ప్రేమపూర్వకమైన వాళ్ళ పలకరింపుతో నా హృదయం గాలిలో తేలినట్లు గా పరవశించింది.
నేను తిరిగి ఇంటికి వెళ్ళటానికి గేటు దగ్గరకి వచ్చేసరికి ఆంధ్రవాణి ఎదురైంది.ఆర్డరు ఇచ్చారా ఏదీ చూపించు అని అడిగింది.నేను చూపించగానే అందులోని టెంపరర్లీ అన్ని పదాన్ని చూపి "నిన్ను టెంపరర్లీ తీసుకున్నారు.నన్ను పెర్మనెంట్ గా తీసుకుంటారట"అంది.
అంతకుముందు రెండు స్కూల్స్ లో అలాగే పనిచేసాను కనుక నేనేమీ సమాధానం ఇవ్వకుండానే వచ్చేసాను.
వీర్రాజు గారు వచ్చాక ఆర్డర్ చూపించి ఇది టెంపరర్లీ ఇచ్చినదా అని అడిగాను."మొదటి ఆర్డర్ ఇచ్చినప్పుడు అలాగే ఇస్తారు.తర్వాత అప్రూవల్ వస్తుంది.ఆంధ్రవాణి మాటలు పట్టించుకోకు తీసేస్తే మరోటి వెతుక్కుంటావు.అంతేకదా" అన్నారు.
అప్పటికి మనసు కుదుట పడింది.
16, నవంబర్ 2023, గురువారం
పి.సరళాదేవి నవలిక- కొమ్మా- బొమ్మా
పి.సరళాదేవి-- "కొమ్మా-బొమ్మా" యువ1989లో
తర్వాత పుస్తకంగా వచ్చింది.
జగన్నాథం చిరుద్యోగి పెద్దకూతురు నాలుగో కాన్పుకు వస్తుంది.తర్వాతకూతురు మంగ, కొడుకు గోపి.ఇక్కడే ఉండే జగన్నాథం చెల్లెలు మీనాక్షమ్మ బాలవితంతువు తన బంధువుల అబ్బాయి తో పద్నాలుగేళ్ళ ఐనా లేని మంగకి పెళ్ళికుదురుస్తుంది.అయితే మందమతి అయిన పెళ్ళికొడుకు ఆ రాత్రే పారిపోయాడు.పెద్దకూతురు పాపని కని చనిపోతుంది.అల్లుడు పెద్ద పిల్లలిద్దర్నీ తీసుకుని వెళ్ళిపోయాడు.గోపి పదోతరగతి కాగానే డబ్బున్న స్నేహితుడి తండ్రి చదివించి కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తానంటే ఇల్లొదిలి వాళ్ళింటికి పోతాడు.
మంగతల్లి బెంగ పెట్టుకొని చనిపోతుంది.అందరూ పిచ్చివాడి సంబంధం తెచ్చినందుకు మాటలంటున్నారని మీనాక్షమ్మ బంధువు ల ఇంటికి వెళ్ళిపోతుంది.
అక్క పిల్లలిద్దర్నీ, రిటైరైన తండ్రి తో కాలం గడుపుతుంది మంగ.
పక్క వాళ్ళ సలహాతో పదొతరగతి పరిక్షకట్టి టీచర్ ట్రైనింగ్ చేసి ఉద్యోగం సంపాదిస్తుంది.అలా పదిహేను ఏళ్ళు గడుస్తాయి.తండ్రి చనిపోతాడు.సహోద్యోగి మణి అన్న ఆనందరావు ,మంగ పట్ల ఆకర్షితుడయ్యాడు.కాని మంగ ఒప్పుకుంటుందో లేదో అని సంశయిస్తాడు. ఎలాగో మంగని పెళ్ళికి ఒప్పిస్తాడు.
ఈ లోగా మంగ బావ వచ్చి తనవెంట వచ్చి పిల్లలను చూసుకోమని బలవంతం పెడతుంటాడు.
అంతలో ఒక ముసలామె ఒకడ్ని మంగ భర్త అని తీసుకొస్తుంది.
చుట్టూ పట్ల వాళ్ళందరూ భర్తనే నమ్ముకోమని ఉపదేశాలు ఇస్తారు.ఆనందరావు వస్తే అందరూ నిరసనగా చూస్తారు.
చివరి కొన్నిపేజీలలో ఆమె సంఘర్షణ ఉంటుంది.భర్త అని వచ్చినవాళ్ళు తమ ప్రయత్నం ఆ ఇంట్లో సాగదని పక్క దుప్పట్లతో సహా ఎత్తుకు పోతారు.
మంగ తండ్రి స్నేహితుడు వచ్చి" నువ్వు అదృష్టవంతురాలివి.నీ నెత్తిన మరో బండ పడకుండా తప్పించుకున్నావు." అంటాడు.
మంగ బొమ్మలా ఉండిపోయింది.అని ముగించారు.
నవలలో స్త్రీ జీవితాలగురించి, వైవాహిక బంధాలగురించి, మానవస్వభావాల గురించి మంచి విశ్లేషణలు ఉంటాయి.
5, నవంబర్ 2023, ఆదివారం
సిథారెడ్డి కావ్యం -అనిమేష
~~ భయంకర స్వప్న చరిత్ర - అనిమేష~~
" ఖండిక గానీ, దీర్ఘకవిత గాని ఒక ప్రధానవస్తువును దోహదకరమైన భావపరంపరతో,చిన్న చిన్న గొలుసు ముక్కలను ఒక దానిలో ఒకటి అమర్చి పెద్దగొలుసు తయారు చేసినట్లు,ఒకదానినుండి ఒకటి ఆవిష్కరింపజేస్తూ పాఠకులహృదయాలను క్రమేణా ఆకట్టు కొనగలిగినప్పుడే కావ్యం రాణిస్తుంది.ఏ మాత్రం తోవ తప్పినా లయభంగమౌతుంది.రసభంగమౌతుంది." అంటారు కుందుర్తి ఆంజనేయులు.
కరోనాసంక్షోభం పెనుపిడుగులా పడేసరికి అల్లాడిపోయిన జనం,బిత్తర పోయిన జనం, భయకంపితులైన జనం,మౌనంలోకి కూరుకు పోయిన జనం,ఆవేదనతో గుండెలు బాదుకొన్న జనం,కన్నీళ్ళతో చిత్తడైన జనం,నేలకూలిన జనం ఇలా..ఇలా రెండు శిశిరాలు ప్రపంచ వ్యాప్తంగా కలచి వేసిన దృశ్యాల్ని ఎన్నింటినో ఆవేశం,ఆవేదన, ఆక్రందనలతో అనేక మంది సృజనకారులు తమ తమ మనోచింతనను అక్షరీకరించారు.
అయితే అవన్నీ ఒక ఎత్తు.ఆయా చిత్రాలన్నింటినీ ఒడిసిపట్టి నందిని సిధారెడ్డి అక్షరంగా వెలువరించిన "అనిమేష" ఉపద్రవం కావ్యం మరోఎత్తు.
ఆ రాయటం కూడా పైపైన రాయలేదు.ఆ దృశ్యాల్నీ,ఆ దుఃఖాల్నీ, తనలోకి ఆవాహన చేసుకుని కంఠంలో ఉండకట్టి గిరికీలు కొడ్తూ గరళంలా కాల్చేస్తున్న ఆ మృత్యు ఘోషల్ని సంబాళించుకుంటూ కవి అక్షరంగా ప్రవహింప చేసాడు.
సిధారెడ్డి కవిత్వాన్నంతటినీ చదివిన వారు ఆయన నిజాయితీని శంకించలేరు.కవిత్వం రాయటం ఆయనకి సరదా కాదు.అక్షరాల్లో పద చిత్రాలగారడీలలో దాక్కోవడం తెలియదు.అందుకే సిద్ధిపేట దాటి ,తెలంగాణా దాటి,తెలుగు రాష్ట్రాలు దాటి,దేశం ఎల్లలు దాటి కనిపించని శత్రువు చేసిన వీరవిహారానికి గజగజలాడుతోన్న జీవితాల్నీ ప్రపంచదుంఖాన్నీ దాటుకుంటూ చరిత్రమూలల్లో జరిగిన మృత్యుబీభత్సాల్ని తవ్వి తలెత్తుకుని అక్షరమై ప్రవహించిన అనిమేషుడైనాడు.
" నిశ్శబ్దం నివ్వెరపోయింది "తో అనిమేషని మొదలు పెట్టిన నందిని సిధారెడ్డి " గొళ్ళేలు భద్రమే/ మనుషులే ఛిద్రం / అందుకే జీవితం జీవకళ పోయింది" అంటూ ఊహాన్ పురావైభవం నుండి లేచి జనం పైకి ఉరికిన కనిపించని శత్రువు ప్రపంచాన్ని ఏవిధంగా ప్రమాదంలోకి నెట్టివేస్తుందనే వైనాన్నిచెప్తూ చదువరులను పంక్తులు వెంట పరిగెత్తించారు.
" ఆలింగనం లేకుండా
జననం లేదు
జీవనం లేదు
ఆలింగనమొక ఉద్వేగమే"
కవిత మొదలైన దగ్గర నుంచి ఒక లయతో కవాతు చేస్తున్నట్లుగా సాగుతుంది.ఒకసారి గాయాలతో తడిసినట్లుగా ఆర్ద్రంగా దుఃఖాన్ని మోసుకుంటూ మరోసారి ఆవేశంతోనూ పంక్తులు పంక్తులుగా ప్రవహిస్తుంది.
" మనిషి అడుగులన్నీ అలంకారాలన్నీ ప్రకృతే
ప్రకృతి నయగారాలన్నీ మనిషే"
అది తెలియని మనిషి రంగురాళ్ల కోసమో సౌఖ్యాలు కోసమో అడవుల్ని నరికి నేలతల్లి గర్భం లోకి గొట్టాలుదించి గుండెల్ని పెకిలిస్తుంటే--
"మనిషి విజృంభించేది ప్రకృతి మీదే
ప్రకృతి విజృంభించేది మనిషి మీదే" కదా
ధ్వంసపడిన ప్రకృతికి మిగిలింది ఏముంటుంది అందుకే దాని ఫలితాన్ని మనిషి అనుభవించక తప్పదు.
పొట్టకూటికోసం ఉన్నవూరు వదిలి వలసపోయిన కార్మికులు, శ్రామికులు కరోనా సంక్షోభంలో తిరిగి తమతమ గ్రామాల బాట పట్టినప్పటి దృశ్యాలు -
" ఒడవని వలపోత/వలసకూలీ రాత"అంటూ ముసలి తల్లిని ఎత్తుకొని నడుస్తున్న కొడుకు వెంట,తింటూ తింటూనే కూలిపోయిన కొడుకుని చూసి తల్లి దుఃఖం,భార్యాబిడ్డల్ని దారిలో చేజార్చుకోక తప్పని వైనం,పట్టాల వెంబడే నడుస్తూ శవాల వెతుకులాట,గ్రామాల్లో పంటహామీ లేని వ్యవసాయం తండ్లాట ఇలా వలసకార్మికుల పాదాలపగుళ్ళలో, కళ్ళల్లో ఎండిపోయిన కన్నీళ్ళలో కవి మమేకమై పోతాడు.
ఎన్నెన్నో దృశ్యపరంపరలు ఒక ఏనిమేషన్ పిక్చర్ లా ఒక్కొక్క దగ్గర దృశ్యాలుగా కథాకథనాలుగా గొలుసులు గొలుసులుగా కవిత్వీకరించుకుంటూ నడుస్తుంది.
ప్రాణాలకు తెగించిన వైద్యసిబ్బందికి మొక్కారు.
కనిపించని శత్రువు ఎలా, ఎప్పుడు,ఎక్కడ ప్రవేశించగలుగుతుందోనని అచ్చెరువొందారు.
" ప్రపంచం ప్రయోగశాల/ జీవితం చిక్కుల వల"అంటూ
" గుడి అయినా/ చర్చ్ అయినా
మసీదు అయినా/మఠమైనా
ఆరామమైనా
వైరస్ కు వ్యత్యాసం లేనేలేదు
కాపలా కాయమా
కరోనా ప్రవేశం ఖాయం"
మనిషికే ఎక్కడలేని వ్యత్యాసాలు .అందుకే ఇన్ని విపత్కరాలు .కానీ తెలియకుండానే నరాల్లో నాటుకున్న భయం జాతి మెడ మీద వాలే కత్తి అంటాడు.అయినా రాజకీయ వైరస్ అనే దానికన్నా మతం వైరస్ భయంకరమైనదా అనే చింతనలో మునిగి పోతాడు కవి.
వేల సంవత్సరాల నాటి ,రాతి యుగాలనాటి చరిత్ర అందించిన బీభత్సాలను తవ్వుకుంటూ కవి పోతాడు.ఎన్ని రకాల వైరస్సులను జనం ఎదుర్కొన్నారు.ఎన్నింటిని తట్టుకొని బయట పడ్డారు.లెక్కలూ,చిట్టాలూ తిరగేసుకుంటూపోయిన కవి చివరికి ఒక విషయం అవగాహనకి వచ్చాడు.--
"ప్రాణాలు గాల్లో వేలాడుతున్న వేళ
పరస్పర సహకారం విజ్ణత
ప్రపంచ సంరక్షణ
ప్రపంచ దేశాల బాధ్యత"
చివరికి వచ్చేసరికి కవి వేదాంతిగా మారి సత్యాన్వేషకుడయ్యాడు.కాలం మాయాజాలాన్ని దేహం,ఆత్మ,ప్రాణం,జీవితం, మృత్యువు,దుఃఖం వీటన్నింటినీ తెరిచి తరిచి తవ్వి తండ్లాడి మనిషి మనుగడలో దాగిన సత్యాన్ని వెలికి తీయటానికి సర్వవిధాలా ఆలోచనలతో,త్యాగియై,విరాగియై,తాత్వికుడై,దుఃఖితుడై కన్నీళ్ళతో కలంతో అంతరంగాన్ని శోధించి ఒక కనిపించని శత్రువు చేసిన మాయాజాలంలో చిక్కి విలవిలలాడుతోన్న ప్రపంచాన్నీ,మనిషినీ,మనిషిలోని అహంకారాన్ని ఒక భ్రాంతి లోకి వెళ్ళిపోయి దర్శించాడు కవి.
" ప్రకృతి నిరంతర
మనిషి పరంపర
ప్రయోగశాల రెప్ప వేయదు
ప్రకృతి ప్రేమ వీడదు
మనిషి బతుక్కి కాలం పూచీ
సహజీవనానికి
పూచీ పడాల్సింది మనిషి
ఈ తరానికేనా
రాబోయే తరాలకు అదే హామీ " అంటూ ఒక ఆశావహ దృక్పథాన్ని ప్రకటిస్తూ ముక్తాయింపు ఇచ్చి ముగించారు కవి సిధారెడ్డి.
చదువుతున్న పాఠకులు కూడా క్రమంగా ఆ దృశ్యాల్లో మమేకమై ఒక కవిత్వావరణలో చిక్కుకుంటారు.
దీర్ఘ కవిత మొదలు పెట్టిన దగ్గర నుంచి అర్థవంతమైన కవిత్వపంక్తులతో ఒక సామాజిక సంక్షోభసమయాన్ని ఆలోచనాత్మకంగా మార్చి ఒక కంపనను కలిగిస్తాడు.
సిధారెడ్డి ఈ కావ్య ప్రస్థానం లో ప్రస్తావించిన విషయాలు ప్రధానంగా సామాన్యుల జీవితాన్నే ప్రతిబింబించింది.కరోనా క్రమపరిణామాల్లో సంభవించిన పరిస్థితులు అందరికీ తెలిసినవే అయినా వచనాన్ని కవిత్వాన్ని సరియైన పాళ్ళలో రంగరించి దారితప్పనీకుండా ఒక పెద్ద కేన్వాస్ మీద అక్షరచిత్రంగా మార్చారు.
ఒక ప్రధాన వస్తువును తీసుకుని ఒక తాత్విక చింతన తో ఒక సందేశంతో,తగినంత విస్తారంగా అనేక భావచిత్రాలతో కథలేకుండానే కథనం కలిగి వున్న అనిమేష దీర్ఘ కావ్యాన్ని రాసారు.
నాలుగు దశాబ్దాలకు పైగా కవిత్వసృజనలో వచనకవిత్వదక్షులుగా పేర్కొనబడిన కవి కావటాన కవిత్వపు మూలతత్వం అవగాహన కలిగినవారు కావటాన దీర్ఘకావ్యం పరిధిని పెంచుకునేక్రమంలో అక్కడక్కడా సాంప్రదాయకమైన విశ్వాసాలు,భావాలూ,ప్రేమలు, తాత్విక చింతనా మొదలైనవి చోటుచేసుకున్నాయి.
ప్రజాజీవనంలో కరోనా తీసుకువచ్చిన కొత్తజీవనపరిస్థితులు ప్రతిబింబింపచేసినప్పుడు కొంతమేరకు భావతీవ్రతతో రాసారు.
సామాజిక దృష్టి, సమాజం,ప్రజలూ,మారాల్సిన దృక్పథం, ప్రభుత్వ పాలనలో రావాల్సిన, తీసుకోవాల్సిన మార్పులు మొదలైనవి కవితలో ప్రదర్శించటం గమనించదగ్గది.
ఒక్కొక్కసారి తనచుట్టూ నిరాశ, అసంతృప్తి అలుముకున్న దేశంలో చీకటి జీవితాల్లో వచ్చిన అపజయాలు,స్వీయ అనుభవాలు నుండి పుట్టిన మనో వేదనలు అక్షరీకరించే టప్పుడు కూడా తన చుట్టూ పరుచుకున్న,ఇతరుల జీవితాలను పరిశీలించగలిగే నిశితదృష్టి తొలగి పోతుందేమో
జీవితాలలో మారిపోతున్న వైవిధ్యాలను చూడగలిగే శక్తి నశించి పోతుందేమోనని కవి అసహాయతకు లోను కాలేదు.తన అనుభవాల్ని ప్రపంచములో అనుభవాలతో మేళవించి రాయటం వలన శైలికి,కవితా రీతికి మధ్య అభేదం లేకుండా ఈ దీర్ఘకావ్యం రాయటంలో ఘనవిజయం సాధించారు.
అనిమేషులు అని రెప్ప కదపని దేవతల్ని అంటారు.ఇక్కడ అనిమేష జనాన్ని రెప్పవాల్చకుండా దాడి చేసిన కరోనా వైరస్సా? రెప్పవాల్చకుండా గజగజ లాడిన ప్రపంచమా?అని పాఠకులకు సందేహం రాకుండా --
" మృత్యుదేవత
గమనిస్తూనే వుంది
ప్రకృతి రెప్పవాల్చదు
ప్రకృతి అనిమేష
వైరస్ ఒక మిష"అంటూ కవి తన కావ్యానికి అనిమేష పేరును అర్థవంతం చేసారు.
" ఆధునిక సంక్లిష్ట వచనకవితాస్వరూపాన్ని పరిపూర్ణంగానూ,సారవంతంగానూ,తాత్వికంగానూ పట్టుకున్న కవి సిధారెడ్డి" అని శివారెడ్డి గారు భూమిస్వప్నం సంపుటికి ముందుమాటలో రాసారు.ఆ మాట ఈ 'అనిమేష' కు కూడా వర్తిస్తుంది.
సిధారెడ్డి నిజాయితీతో నిక్కచ్చిగా రాసే కవిత్వాన్ని చదివిన పాఠకులు సిధారెడ్డి కవిత్వాన్ని ప్రేమించకుండా ఉండలేరు.
2, నవంబర్ 2023, గురువారం
శ్రీసుధమోదుగ- అంతర్హిత
శ్రీసుధామోదుగు నవల- అంతర్హిత
నేను నవలలు చదవటానికి కొంచెం బధ్ధకిస్తాను. కానీ జమైకా లో వైద్యవృత్తిలో ఉంటున్న శ్రీసుధామోదుగ రాసిన తొలినవల అంతర్హిత అందుకున్నాక ఊరికే పుస్తకం ఒకపేజీ చదివి తిరగేయాలనుకొన్న దాన్ని ఆపకుండా పూర్తిచేసాను.
చదువుతున్నంతసేపూ ఒకింత ఆశ్చర్యం,ఉద్వేగం పొందాను.నేను కథ చెప్పదలచుకోలేదు.ఎందుకంటే ఎవరికి వారు చదువుతుంటేనే అనుభూతి బావుంటుంది.
ఒకప్పటి జమైకా వలసజీవితం గురించి- అక్కడే ఉండటం,ఉద్యోగరీత్యా డాక్టర్ కావటం చికిత్స కోసం వచ్చే అనేక మందితో మాట్లాడే అవకాశం వీటి వలన చాలా విషయాలు రచయిత్రికి తెలుసుకోవటానికి అవకాశం ఉండే ఉంటుంది.
ఉద్యమాల్లో తిరిగి అడవి దారి పట్టిన వారి గురించి రచనల్లోని, వార్తా విశేషాలు వలన కొంత ఊహించి రాయవచ్చునేమో.
కానీ రూట్స్ నవలలోలాగ ఈ నవలలో ఒక అమ్మాయి తనమూలాల్ని తెలుసు కోవటానికి, అనేకానేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ,తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ చేసిన ప్రయాణం కథనం చేయటం అద్భుతంగా ఉంది.
ఈ ప్రయాణంలో తగిలిన అనేక పాత్రల్ని చివరకు వచ్చేసరికి ఒకే కుటుంబదారానికి కూర్చిన పూసల్లా అల్లటం సామాన్యమైన విషయం కాదు.ఒక్కొక్కప్పుడు ఎక్కువ పాత్రలవలన కొంత కన్‌ఫ్యూజన్ వచ్చే అవకాశం కూడా ఉంది.కానీ నవలారచనలో రచయిత్రి చాలా మెలకువతో, చాలా సామర్థ్యంతో ఎక్కడా టెంపో సడలకుండా చివరివరకూ కొనసాగించింది.
ఈ నవల నడిపించే అనేక అంశాల కూర్పులో సామాజిక సమస్యలైన జోగినివ్యవస్థనీ,గడీలలోని అకృత్యాల్నీ,చెరుకు తోటల్లో పనిచేయటానికి పోయిన వలసకూలీల గాయాల్ని, యూనివర్సిటీల లోని డ్రగ్ కల్చర్ లనీ,వాటిమూలాల్ని తెలుసుకోవాలనుకున్న పరిశోధనాత్మక జర్నలిజాన్నీ, వివాహ వ్యవస్థని,యువతరంపై అనేకానేక ప్రభావాల్నీ గుదిగుచ్చి నవలగా రాయటంలో పాఠకులకు ఆసక్తి సడలనీకుండా మొదటినుంచీ చివరివరకు కొనసాగించటంలో చెయ్యి తిరిగిన రచయిత్రిలాగే రచనా నైపుణ్యం ఈ నవలలోఆసాంతం సంపూర్ణంగా వ్యక్తమౌతుంది.
అయితే తెలుగు సినిమాలాగే చివరికి వచ్చేసరికి నాయికానాయకులు ఇద్దరూ మేనత్తామేనమామ పిల్లలుగా ముగింపు చేయకపోయినా కథకు వచ్చే నష్టం ఏమీ ఉండేదికాదనిపించింది.
నవలలో కాలనిర్ణయం ఎక్కడికక్కడ నమోదు చేస్తూ ప్రకటించటం కూడా చాలా బాగుంది.వైద్యవృత్తిలో, కుటుంబ బాధ్యతలలో తీరిక సమకూర్చుకొని ఇంత విషయసేకరణ ఏవిధంగా చేసి రాసారనేది ఆశ్చర్యంగానూ,ఆనందంగానూ ఉంది.
ఈ నవలను చదవటంలో పాఠకులు నవలలోని అంశాలతో మమేకం అవుతూ సందర్భానుసారంగా ప్రతిస్పందిస్తూ రసానుభూతి పొందుతారన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు.ఆ విషయంలో యువరచయిత్రి శ్రీసుధామోదుగ రచయిత్రిగా విజయవంతం అయ్యింది.
ఈ నవలలో పాత్ర చే రచయిత్రి రాసిన సంభాషణ లో భాగం తో దీనిని ముగిస్తాను.
".....పక్షుల్లో మౌల్టింగ్ అనేది ఉంటుంది. కాలానుగుణంగా పాత ఈకలు ఊడి కొత్త ఈకలు వస్తాయి. పక్షి ఎగరడానికి కొత్త శక్తి ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. ఇదంతా సహజంగా జరగాల్సిన విషయం. బలవంతంగా పీకేస్తే ఈకలు రావు. అవి ఇక ఎప్పటికీ ఎగరలేవు. ఏదైనా సాధారణంగా జరిగినప్పుడే వాటికి రెట్టింపు శక్తి వస్తుంది. ఆ సమయం కోసం ఎదురుచూడాలి. దానికి మానసికంగా మనల్ని సిద్ధం చేసుకోవాలి."
ఎంత బాగా చెప్పింది శ్రీసుధ.
27, అక్టోబర్ 2023, శుక్రవారం
పరికరాలు (నచ్చని కవిత)
~~ పరికరాలు~~
ప్రపంచంలోకి తలుపులు తెరిచామనో
మానవ సంబంధాలను అర్థం చేసుకున్నామనో ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాం
ఆలోచనా దృక్పథం ఉన్నంత మాత్రాన
అన్నీ సులువుగా అర్థమైపోతాయనీకాదు
దేనికైనా పరికరాలు మాత్రమే దొరుకుతాయ్.
అవగాహనకై వాటితో పనిచేయించటం ముఖ్యం
ఎప్పటికప్పుడు
ఆలోచనల్ని పదును పెడుతూనే ఉండాలి
మన కార్యరంగం సమాజమే కదా
ఎంత మంది మనుషులను కలిస్తే
ఎన్ని సమూహహృదయాలను హత్తుకుంటే
ఎంతదూరం ప్రయాణాలు చేస్తే
అంతగా చూపు విశాలమవుతుంది
ఆలోచన నిశితమవుతుంది.
ఎప్పటికప్పుడు
ఆలోచనల్లోని ఖాళీలను పూరించాలంటే మనోప్రపంచాన్నీశుధ్ధి చేసుకుంటూ
ఆలోచనా పరిధి విస్తరించుకుంటూ
జీవితపరిమితి తెలుసుకొంటూ
మనిషి ఎదలోతుల్లోకి
నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి
ఎప్పటికప్పుడు
మనుషుల మధ్యా
సమూహాల మధ్యాతిరుగుతూ
వారి వారి భౌతిక, సామాజిక అనుభవాలు
మనవికూడా అనుకున్నప్పుడే
మనసులోకి నింపుకునే ప్రయత్నం చేసినపుడే
సరిగ్గా అప్పుడు కదా
ఆలోచనాపరికరాలకు గుర్తింపు.
25, అక్టోబర్ 2023, బుధవారం
కాలం మింగిన కాలం పుస్తకానికి ముందుమాట
~ఎం.ఎన్. రాయ్ అడుగుజాడల్లో ఎ.ఎల్.ఎన్.రావు~
ముప్పై- నలభై ఏళ్ళ క్రితం అనుకుంటాను అత్తలూరి విజయలక్ష్మి మా ఇంటికి మా స్నేహితులు భార్గవి రావుతో తన తొలి కథలపుస్తకం తో కలిసి వచ్చింది.
ఆమె వెళ్ళిపోయిన తర్వాత వీర్రాజు గారు 'ఆమె అత్తలూరి లక్ష్మీనరసింహారావుగారి కూతురనుకుంటాను' అన్నారు.
నాముఖంలోని ప్రశ్నను గమనించి " ఆయన ఎమ్.ఎన్ రాయ్ అనుయాయి.వ్యాసాలు రాస్తారు."అన్నారు.
ఎమ్.ఎన్.రాయ్ గురించి అడుగుతే
" ఎం.ఎన్.హేతువాది, మానవవాది. రాజకీయ సిద్ధాంతకర్త, రచయిత.అప్పట్లో రాయ్ ఒకసారి విశాఖ వచ్చారు.ఆయన ప్రతిపాదించిన మానవవాద ఉద్యమం గూడవల్లి, రావిశాస్త్రి ,అబ్బూరి రామకృష్ణారావు వంటి మేధావులను ఆకర్షించింది.నిజానికి మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే భావనను కూడా ప్రతిపాదించిన మొట్టమొదటి వాడు యం.ఎన్.రాయ్.
రాయ్ వ్యాసాలు వారి అనుయాయులు చాలామంది అనువాదం చేసి ప్రజలకు అందించారు.ఆ అనువాదకులలో ఒకరు అత్తలూరి లక్ష్మీనరసింహా రావు గారు' అని ఆయన గురించి కూడా చెప్పారు.
తెలుగులో రాయ్ ప్రభావంతో వచ్చిన పత్రికలు రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, సమీక్ష, హేతువాది, ప్రసారిత, చార్వాక గురించి కూడా చెప్పారు.మా ఇంట్లో కూడా సమీక్షా, చార్వాక పత్రికలు ఉండేవి.మేము ఇళ్ళు మారటంలో ఎవరికో ఇచ్చేసారు. అవి ఉండి ఉంటే ఏ.ఎల్.నరసింహారావు గారి రచనలు ఏమైనా దొరికి ఉండేవేమో.
తన తండ్రి జ్ణాపకాల్ని వారి సమకాలీనులనుండి సేకరించి వారిని సాహిత్య రంగంలో శాస్వత పరచాలనే విజయలక్ష్మి సంకల్పం చాలా నచ్చింది.కానీ చాలా ఆలస్యంగా మొదలుపెట్టింది.ఇప్పుడు నరసింహారావు గారి సహచరులు,సమకాలీనులు అందరూ వెళ్ళిపోయారు.కనీసం వీర్రాజుగారు ఉన్నప్పుడు సంకల్పిస్తే మరికొన్ని విషయాలు ఏవైనా తెలిసేవేమో.
ఏదేమైనా కానీ రచయిత కావచ్చు కళాకారులు కావచ్చు వారి వారసులు సంకల్పిస్తే తప్ప వారంతా విస్మృతులుగా మిగిలిపోతారు.
ఎం.ఎన్. రాయ్ జీవనవిధానాన్నే జీవితాంతం అనుసరించిన తన తండ్రి అత్తలూరి లక్ష్మీనరసింహారావు గారిని అలా విస్మృతులు కానీకుండా శాశ్వత్వం కల్పించే సంకల్పానికి అత్తలూరి విజయలక్ష్మి పూనుకున్నందుకు
మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.ఎ.ఎల్.నరసింహారావుగారికి స్మృత్యంజలులు.
కుమారస్వామి గారి గురించి
మా పెద్దక్కయ్య సరళాదేవి భర్త పి.కుమారస్వామి గోపన్నపాలెం లో ఉద్యోగం చేస్తున్నప్పుడు 1964-65 లో ఒక ఏడాది పాటు యూఎస్ లో ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంస్థ నిర్వహించిన టెక్నికల్ కో-ఆపరేషన్ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ విద్యలో వరి వంగడాలు,సస్యరక్షణ మొదలైన వాటి గురించి పరిశోధనాత్మక శిక్షణ పొందటం కోసం వెళ్ళారు.వెళ్ళి వచ్చాక పొట్టి వంగడం తైచుంగ్ నేటివ్- 1 వరిని రాష్ట్రంలో ప్రధమంగా సామర్లకోట శిక్షణ కేంద్రంలోని ఫారంలో నాటించారు.
ఆయన నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయదారులకు ఉపయోగ పడేలా 1968లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు,1974లో సస్యరక్షణ, 1989లో వరిసాగు పుస్తకాలు రాసి ముద్రించారు.
కుమారస్వామి ( మామయ్య) గారికి బాపట్ల వ్యవసాయ శిక్షణాలయం లో అధ్యాపకులుగా ఉద్యోగం వచ్చింది.
ఆయన వరిసాగు గురించి తెలుగులో రాసిన ఆ పుస్తకాలు అన్నదాత మాసపత్రిక లో ధారావాహికగా ప్రచురితం అయ్యాయి.ఆ పుస్తకం పబ్లిసిటీ, మార్కెటింగ్ అన్నదాత వాళ్ళే చేసారు.ముఖచిత్రం రూపకల్పన వీర్రాజు గారే చేసారు.
1978కి అనుకుంటాను హైదరాబాద్ విత్తనాభివృధ్ధి సంస్థలో డెప్యూటీ డైరెక్టర్ గా బదిలీ మీద వచ్చారు. మా మామయ్య విత్తనాభివృధ్ధి సంస్థలో ఉద్యోగం చేసి ప్రభుత్వం పదవీవిరమణ వయస్సు తగ్గించినప్పుడు 1985 లో 55 ఏళ్ళకే రిటైర్ అయ్యాడు.తర్వాత స్వగ్రామమైన విజయనగరం వెళ్ళి స్థిరపడ్డారు.
మామయ్య వరి వంగడం మీద రాసిన ఆ పుస్తకాలు రెండుమూడు సార్లు రీప్రింట్ చేసిన అన్నదాత పత్రిక ఆ పుస్తకం అమ్మకాల్లో ఎంత భాగం ఆయనకి ఇచ్చిందో తెలియదు. అలాగే ఒక కొత్త వంగడం రాష్ట్రంలో నాటిన మా మామయ్య పి.కుమారస్వామిని గురించి కూడా ఎవరికీ తెలియదు.
13, అక్టోబర్ 2023, శుక్రవారం
తరిమెల అమర్నాథ్ రెడ్డి
తరిమెల అమర్నాథరెడ్డిగారూ
నమస్తే.
మీరు ఇచ్చిన పుస్తకాలన్నీ చదివాను.అమర్ హార్ట్,అమీర్ టాక్స్ మీ మమత సంస్థ ద్వారా జరిగిన మానవీయ సేవా కార్యక్రమాలు అనుభవాలను,కథలలోనూ రాసినవే అయినా ఒకింత వ్యంగ్యాన్నీ , హాస్యాన్ని మేళవించి రాసినవే కావటాన ఆసక్తి దాయకంగానే ఉన్నాయి.మూడు పుస్తకాలు ఒకేసారి చదివినప్పుడు కొంత చర్వితచర్వణంగా అనిపించినా మీదైన పద్ధతిలో రాయటం బాగా అనిపించింది.
ఉత్తమపురుషలో రాసిన రచన చదివినప్పుడు పాఠకులు సాధారణంగా అందులో మమేకం కావటం కద్దు.కానీ మీ ప్రసంగం ప్రత్యక్షంగా విన్నవారికి మాత్రం పాఠకుడి ముందు మీరు కూర్చుని ఆ కథలూ, కబుర్లు చెప్పిన అనుభూతి కల్గుతుంది.నేను మొన్ననే మీ ప్రసంగం ప్రత్యక్షంగా వినటం వలన నాకు అలానే అనిపించింది.అది మీ రచనా శైలీ విన్యాసం వలనే అని చెప్పొచ్చు.
గతంలో ఎస్వీ రంగారావు రాసిన వేట కథలు చదివినప్పుడు సినిమాల్లో ఎస్వీఆర్ నటన చూసినవాళ్ళం కనుక ఆ కథలు చదువుతుంటే అలాగే ఆయన ఎదురుగా కూర్చొని కథ చెప్పినట్లు గా అనిపిస్తాయి.
మంచి పఠన శైలిని కూడా మీరు ఒడిసి పట్టుకున్నందుకు అభినందనలు.
ఏ అర్థరాత్రి లేపినా విసుగు లేకుండా ( మీ శ్రీమతి కూడా)హాస్పిటల్ కి పరిగెత్తటం,కుల,మత వివక్ష లేకుండా రక్తం ఇచ్చేలా వారిని ఒప్పించిన విధానం చాలా బాగుంది.రోడ్డు పక్కన వెలిసిన దేవుళ్ళకు మొక్కి ఆక్సిడెంట్స్ చేసుకున్న కుర్రాళ్ళకు ఇంటి దగ్గరే మొక్కుకుని బయల్దేరండి అని వ్యంగ్యాత్మకంగా చెప్పటం బాగుంది.
డాక్టర్లు అలసత్వంతో రక్తాన్ని ఎక్కించటం ఆలస్యం చేయటంతో రక్తం దొరికి కూడా ప్రాణం నిలపలేకపోవటం గుండె చెమ్మగిల్లజేసాయి.
అనేక చమత్కారాలు, రక్తదాన అనుభవాలు, ప్రెస్ నిర్వహణలో హాస్యం, మూఢనమ్మకాలపై విసుర్లు, అరుదైన రక్తం కోసం అగచాట్లు, ప్రొసీజర్స్ పేరుతో డాక్టర్ల నిర్లక్ష్యం అన్నీ వాటిల్లో కనిపించాయి. సామాజిక స్థితులు, నిస్సహాయమైన పేదరికం మొదలైనవి ఉన్నాయి.
అమర్ టాక్స్ కథనాల్లో అనంతపురం జిల్లాలోని ఫ్యాక్షన్ స్వభావం, తీరుతెన్నులు ,పేదల్లోని మూఢ నమ్మకాలు, సమాజంలోని అనేకానేక విషయాలపై ప్రత్యక్ష కథనం, లేదా వ్యాఖ్యానం చదివించేలా మీదైన పద్ధతిలో వ్యంగ్య హాస్య స్పోరకంగా ఉన్నాయి.
అమర్ హ్యూమర్‌తో ఎలా నవ్వులు విరజిమ్మాయో అదే విధంగా అమర్ హార్ట్ చదువుతుంటే కొన్నికొన్ని సందర్భాల్లో బాధగా కూడా అనిపించింది. కనీస వైద్యం అందుకోలేని పేదరికం, ఆస్పత్రుల్లోని నిరాదరణ కళ్లు తడి చేసాయి.
ఆఖరుకు అమీర్ హ్యూమర్ లో కొన్ని తెలిసినవే అయినా కాపీయింగ్ లాంటి అనేక జరిగిన బాల్యచేష్టలు,అమాయకఅల్లరి ఇప్పటి వయసులో బాల్యమిత్రులతో పంచుకోవటం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా!
మొత్తంగా ఒకవైపు మమతద్వారా మీరు చేస్తున్న కృషి చాలా గొప్పది.ఒకవైపు సమాజసేవ ,మరోవైపు అనుభవాల్ని అక్షరబద్ధం చేసి పుస్తకం ప్రచురణ చేస్తున్న మీ అంకితభావానికి నమస్సులు.
నాకు నచ్చిన కథ- వానావానా కన్నీరు
నాకు నచ్చిన నాకథ -- వానా వానా కన్నీరు.
ఈ కథ రాయాలని కొద్దిగా సినాప్సిస్ రాసి పెట్టుకున్నది కాలేజీ రోజుల్లోనే . 71 లో అనుకుంటాను ఎన్నికలు జరిగాయి. కాలేజీకి వెళ్ళేదారిలో ఊరంతా ఎత్తుగా రోడ్డుకు అటూఇటూ కరెంటు స్తంభాలకు పెద్ద పెద్ద బట్టలమీద నాయకుల పేర్లు ముద్రించిన బేనర్లు కట్టి ఉండటం, అప్పట్లో రోడ్లపక్కనే వినాయకచవితి పందిళ్ళు లా తడకలతో కట్టి దాని చుట్టూరా కూడా బేనర్లు కట్టి అక్కడే కార్యకర్తలు ఉండి మైకుల్లో ఎన్నికలపాటలువేస్తూ పేకాటలాడుకుంటూ కూర్చునేవారు ,అక్కడక్కడే గోచీగుడ్డలు కట్టుకుని ఆడుకుంటున్న పేద పిల్లల్నీ కూడా చూసి దీని నేపధ్యంలో కథ రాయాలని పాయింట్స్ రాసుకున్నాను.
కానీ చదువుమధ్య లో వివాహం మళ్ళీ చదువు ఉమ్మడి కుటుంబం పిల్లలూ అనారోగ్యాలూ వీటితో రాయలేక పోయాను.
ఇటీవల ముంగారుమొలకలు సందర్భంలో ఆడవాళ్ళు రచనలు ఎక్కువగా చేయకపోవటానికి కారణాలు ఆలోచించినప్పుడు నా స్థితి కూడా మనసులోకి వచ్చింది .చదువుకునే రోజుల్లో 1970 లో రాసినదే మొదటికథ అప్పట్లోనే ఒక నాలుగు కథలు ప్రచురింపబడినా తర్వాత 76వరకూ నేను కథలు రాసేటంత సమయం సమకూర్చుకోలేక కవిత్వంలోకి వచ్చేసాను
84లో తిరిగి ఎన్నికల ప్రచారసంరంభాలు చూసి దీనికి సంబంధించిన కథ ఎన్నికల సమయంలో రాయాలనుకున్నది గుర్తొచ్చి అదే సినాప్సిస్ ని ఉత్తరాంధ్ర మాండలికం లో కథగా రాసాను.
ఈ కథలో వంటిమీద సరిగా బట్టలు కూడా లేని బడుగు జీవులు వెతలు,తానులు తానుల బట్టలను ఎన్నికల ప్రచారం బేనర్ల కోసం జండాలకోసం వృధా చేస్తూ ప్రజా జీవితాలని పట్టించుకోని నాయకులూ,వారికోసం జండాలు మోసే కార్యకర్తలు,మొదలైన ఎన్నికల సంరంభాలనీ కథలో వ్యక్తపరచడానికి ప్రయత్నం చేసాను..ఈ కథ 1987లో ప్రచురితం అయ్యింది.
ఈ కథ జ్యోతి మాసపత్రికలో చదివి మా అక్క పి.సరళాదేవి పెద్ద ఉత్తరం రాసింది."కుటుంబచట్రం లో ఇరుక్కొని వాటినే కథలుగా రాయకుండా విశాలదృక్పధం తో అట్టడుగు ప్రజల జీవిత సమస్యలను తీసుకుని నువ్వు కథ రాయటం సంతోషంగా ఉంది.ఇకపై కూడా ఈవిధంగా ఇతరసమస్యలపై దృష్టి సారించి రాస్తుండమని" సలహా ఇచ్చింది.
స్త్రీవాదానికి కట్టుబడి ఉండి పోకుండా సమాజంలోని అనేక సమస్యలు తీసుకునే నేను రచనలు చేయటానికి ఇదొక కారణం.
నేను ఉత్తరాంధ్ర లో పుట్టిపెరిగినా రెండు కథలు మాత్రమే అక్కడి మాండలికం లో రాసాను.బహుశా నాకు ఈ కథ నచ్చాటానికి అదొక కారణమేమో.
తర్వాత్తర్వాత ఉద్యోగం నా చుట్టూ విద్యార్ధులతో కలగలిసి పోవటంతో చాలా కథలను తెలంగాణ మాండలికంలో రాసాను.
8, అక్టోబర్ 2023, ఆదివారం
రంగు వెలిసిన సిత్రాలు -3
ఇప్పుడిప్పుడే వైకుంఠపాళి ఆట మొదలైంది
గవ్వల్ని గలగలమనిపించే చేతులు
దొంగ పందేలకు సన్నద్ధం అయ్యాయి
పాముల నోటికి చిక్కకుండా
ధనప్రవాహాలు పారాలి కదా
నిచ్చెన మెట్లని దొరకపుచ్చుకోవాలంటే
ఎన్ని సర్పయాగాలు చేయాలో
ఏపందెం ఎట్లా వేయాలన్నా
వెయ్యి కళ్ళ పహారాలు తప్పించుకోవాలి కదా
ఏ నిచ్చెన ఎగబాకాలన్నా
ఏ గెంతులు గెంతాలన్నా
ఆటగాళ్ళ ఆలోచన ఒకటే
ఈ పందెం బరిలో నెగ్గాలంటే
ఏ పందెం కోడికి ఎంత బేరం పెట్టాలా అని
ఏ బస్తీనేతని ఏ మొత్తంతో కొనాలా అని
ఒక్కసారిగా చైతన్యం చిచ్చుబుడ్డై
ఊరంతా వెలుగువెన్నెల వానౌతుంది
సంతరించుకున్న పెళ్ళికళతో
రహదారులన్నీ పెళ్ళిమంటపాలౌతాయి
వాహనాలన్నీ రంగులద్దుకొని
నీటిలో వదిలిన కార్తీక దీపాలౌతాయి
గొంతు సవరించుకొన్న మైకులన్నీ
మంటల్ని పిడుగులా వర్షించే
క్యుములోనింబస్ మేఘాలౌతాయి
జనంలో అలసట ఎరగని ఉత్సాహం
జనసేకరణ బేరసారాల్తో గల్లీలీడర్ల ఆర్భాటాలు
పండుగ ముస్తాబుతో కూడళ్ళంతటా భజనకీర్తనలు
వాహనాలు పూలరథాలై వీథుల్నిండా కరపత్రాలజల్లులు
విపక్షనాయకుల డొంకల్ని కదిలించి
తీగల్నిలాగుతూ అవాకులూ చవాకుల్ని
బాటకిరుపక్కలా గులకరాళ్ళుగా విసుర్తుంటే
ఎవరు నీతిమంతులో అర్థం కాక
పక్కకు తిరిగి నవ్వుల్ని బుగ్గల్లో దాచుకుంటున్న జనం
రాజకీయతంత్రంలో మిత్రులెవ్వరో
చిత్తుగా పడిపోయె శత్రువులెవ్వరో
పెర్ముటేషన్ కాంబినేషన్ లలో
క్షణక్షణానికీ మారిపోయే ఎత్తులో
రకరకాలుగా రూపొందే సమీకరణాల్తో
ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో
అర్థంకాని అయోమయంలో జనం
అంతటా ఒకటే గందరగోళం
ఎన్నికలల్లో ఎన్ని కళలో!
• *. *
రంగు వెలిసిన సిత్రాలు -2
*. *. *
ఎప్పుడో అకస్మాత్తుగా
ఎన్నికలకోడి మీడియా గూట్లోంచి కూస్తుంది
అంతే
అంతవరకూ నిశ్చింతగా నిద్రమత్తులో జోగుతున్న
బంగారుకోడిపుంజులన్నీ ఒక్కసారిగా లేచి
బద్దకపురెక్కల్ని టపటపలాడించుకుంటూ
మత్తువదిలించుకుని గొంతు సవరించుకుంటూ
కొక్కొరొకో మంటూ కూతలు మొదలెడ్తాయ్
ఎగరటం చేతకాని పక్షులన్నీ గెంతులేస్తుంటాయ్
ఎటుగెంతాలో తెలియని వన్నీ ఆలోచించి ఆలోచించి
నెమ్మదిగా గోడమీదకి ఎగబాకుతాయ్
దేనికి తోచిన కూతల్ని అదికూస్తూ
అందమైన రాగాలాపాల్ని సాధన చేస్తూ
జనాల్ని ఆకర్షించటానికి విశ్వప్రయత్నాలు చేస్తాయి
* . * *
ముందస్తుగానే అశరీరవాణో ఆకాశవాణో
శృతిపేయంగా ప్రచారగీతాల్ని
గాలిలోకి పావురాల్లా ఎగరేస్తుంటే
నట్టింట్లో కూచుని అచ్చక్క బుచ్చక్క కబుర్లు చెప్పే
ముద్దుల ప్రియదర్శిని
రంగుల పరదాలు సవరించుకుంటూ
అందమైన సీతాకోకచిలుకలు
ఎంచక్కని చిలకపలుకుల్తో?
అభివృద్ధి పథకాలు ఫలాల్ని
ముక్కున కరిచి తెచ్చిచ్చినంత సంబరంగా
పాటల్తో మాటల్తో మెస్మరిజం చేస్తూ
నృత్యాలతో కళ్ళకు పొరలు కప్పుతూ
విశ్వరూప అభినయచాతుర్యాలతో
ప్రజాస్వామ్య రంజక ప్రచారరథసారథులై
జనాల్ని ఆలోచనల్ని కొల్లగొట్టి
ఓటర్లుగా మార్చటానికి
పాములూ నిచ్చెనల
వైకుంఠపాళీ ఆటలు ఒకవైపు !
ఆవేశకావేషాల నిప్పులు కురిపిస్తూ
ఎదుటివారి అభిప్రాయాలకు బ్రేకులు వేస్తూ
ఒకరి సంభాషణల్లోకి ఇంకొకరు చొచ్చుకుపోయి
కలగాపులగంగా అర్థరహితంగా
శ్రోతలు చెవుల్ని చిల్లులు పొడుస్తూ
చర్చోపచర్చలు మరోవైపు!
ఎవరికెన్ని గెలుపు గుర్రాలో
ఎవరికెన్ని పందెంకోళ్ళో
ఏ కోటకు ఎవరు రాజో
ఏప్రాంతానికి ఎవరు మంత్రో
ఏరాజును ఎలా పడగొట్టాలో
ఏమంత్రిని ఎలా మాటెయ్యాలో
వెనకనడిచే భక్తులెందరో
చేజారే బంటులెవ్వరో
ఏగెలుపుకు ఎన్ని ఎత్తులో
ఏనాటకానికి ఎలా తెరదించాలో
ఎత్తులూ పైఎత్తులు తో
చదరంగపు జిత్తులు ఇంకోవైపు !
26, సెప్టెంబర్ 2023, మంగళవారం
అన్నయ్య ప్రధమ వర్థంతి సందర్భంగా
నా పెద్దన్నయ్య కొడవంటి లీలామోహనరావు బహుభాషా కోవిదుడు రోణంకి అప్పలస్వామిగారి శిష్యుడు.బహుశా అందువలనే కావచ్చు గణితం డిగ్రీలో అంశమే అయినా రోణంకిగారి ప్రభావం వలన ఆంగ్లంలో పట్టా, పరిశోధన చేసి విజయనగరం మహరాజా కాలేజిలో ఇంగ్లీషు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసి పదవీవిరమణ చేసాడు.
1958 ఆ ప్రాంతంలో భారతిలో వ్యాసాలు,కొన్ని కవితలు రాసినట్లు నాకు ముందుగానే తెలుసు.ఇటీవల కథానిలయంలో వెతుకులాటలో అన్నయ్య రాసిన రెండు కథలు కూడా దొరికి నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను.
ఒక కుటుంబంలో నలుగురు తోబుట్టువులూ కథకులు కావటం ఎవరైనా ఉన్నారా లేదో తెలియదు.నా తోబుట్టువులము నలుగురం కథలు రాసామని నేనెంతో గర్వపడుతున్నాను.
అన్నయ్య నా కవితలు ఒక పాతిక వరకూ ఆంగ్లంలోకి అనువదించాడు.
నేను రాసిన "యుద్ధం ఒక గుండె కోత" కవితను మా పెద్దన్నయ్యకే ఆత్మీయంగా అంకితం చేసాను.ఇది ఆంగ్లం,హిందీ,తమిళం లోనికి అనువదించబడింది.అంతే కాక యుద్ధం ఒక గుండె కోతపై ఎమ్ ఫిల్ పరిశోధన కూడా జరిగింది.
అన్నయ్య అంటే భయం,భక్తితో బాటు నన్ను డిగ్రీ వరకు చదివే అవకాశం కల్పించినందుకు ప్రేమ కూడా ఉంది. మొదటినుంచీ అన్నయ్యతో చనువుగా,చొరవగా తిరిగిన జ్ణాపకాలు తక్కువే.ఎందుకంటే అన్నయ్య చాలా రిజర్వుడుగా దూరంగా ఉండేవాడు.అటువంటి అన్నయ్య భౌతికంగా కూడా దూరమై ఏడాది అయ్యింది.
అన్నయ్య లీలామోహనరావుకి ఈసందర్భంగా నాస్మృతిగా ఈ భావాంజలి.
శ్రీదేవి కవిత్వ చిరునామా (వివిధలో)
~ శ్రీదేవి కవిత్వచిరునామా "మధుకలశమ్"~
ఆలోచన మనిషిని నిలవనీయనప్పుడు వ్యక్తిగత అనుభూతి పరిధిని అధిగమించి విశ్వవ్యాప్తమైన ఆత్మగతానుభూత సమకాలీన సామాజిక అంశాల్ని జోడించి కవిత్వీకరణం చేసి మానవ జీవితాన్ని పరిపూర్ణంగా చూపించటానికి ఉపకరించేది కవిత్వమే.
19 లో శతాబ్దానికి ముందు గేయం,పద్యకవిత్వమే తప్ప మరో సాహిత్య ప్రక్రియ లేదనే చెప్పాలి.
స్వాతంత్రోద్యమ,సంస్కరణోద్యమ ప్రభావం వలన కొన్ని వర్గాల స్త్రీలకు విద్య అందుబాటులోకి రావటంతో చైతన్యవంతమైన స్త్రీలు సాహిత్య రంగం లోకి అడుగు పెట్టి హిందూసుందరి, గృహలక్ష్మి వంటి స్త్రీలపత్రికల్లో పద్యాలు,గేయాల రూపంలో వారి భావాలు వెలువరించారు . అయితే అప్పటి దేశకాల పరిస్థితిలను బట్టి దేశభక్తి, దైవభక్తి పూరిత రచనలు మాత్రమే చేసేవారు.
2001 లో మొల్ల మొదలుకొని అప్పటి కవయిత్రులను వందమంది కవితల్ని నేనూ,డా.పి.భార్గవీరావు కలిసి సంపాదకత్వంలో "ముద్ర " పేరిట సంకలనం చేసాము.దీనికోసమై ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ గారి ఆధునిక తెలుగు కవయిత్రులను కూడా పరిశీలించటం జరిగింది.
మా పరిశీలనలో 1956 లోనే తెలుగు స్వతంత్ర సంపాదకబాధ్యత వహిస్తున్న డా.పి.శ్రీదేవి కవిత్వం రాసిందనే విషయం మాసంకలనానికి పి.సరళాదేవి అందించిన కవిత్వఖండికల ద్వారా తెలిసింది.
2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుండి భారతీయసాహిత్య నిర్మాతలు పేరిట డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయమని లేఖ రావటంతో డా.పి.శ్రీదేవి సాహిత్యం కొరకు వెతుకులాట మొదలుపెట్టాను.
అంతవరకూ పి.శ్రీదేవి అంటే కాలాతీతవ్యక్తులు నవల, ఒకటి రెండు కథలు మాత్రమే అనుకున్నాను.ఆశ్చర్యకరంగా శ్రీదేవి కథలే కాక తెలుగు స్వతంత్ర లో ధారావాహికగా ప్రచురితం అయిన దీర్ఘకావ్యం,ఒక పదివరకూ కవిత్వఖండికలూ దొరికాయి.
అంతకుముందు కొటికలపూడి సీతమ్మ,జూలూరి తులసమ్మ,చావలి బంగారమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ మొదలైన అనేక మంది కవయిత్రులు కేవలం భక్తి పూరిత రచనలు, దేశభక్తిని ప్రేరేపించే రచనలు మాత్రమే చేసారు.
అరవయ్యో దశకం వచ్చేసరికి ధనం,కీర్తి లభించే నవలా రచన వైపు రచయిత్రులు అందరూ మొగ్గు చూపారు.నాయని కృష్ణకుమారి, యశోదా రెడ్డి వంటివారు కవిసమ్మేళనాలలో జాతీయ పండుగలు, సంక్రాంతి , ఉగాది కవితలే రాసారు.
అప్పట్లోనే సమాజంలోని అనేక సమస్యల్ని ఆధునిక భావజాలంతో స్త్రీ దృష్టి కోణంలో రాసిన మొట్టమొదటి కవయిత్రిగా డా.పి.శ్రీదేవినే చెప్పాల్సిఉంది.
1956 సెప్టెంబర్ 14 తెలుగు స్వతంత్ర లో వైదేహి పేరు తో రాసిన "సౌదామిని" కవితతో పి.శ్రీదేవి కవిత్వం రంగంలోకి అడుగు పెట్టింది.ఇందులో స్త్రీని తటిల్లత పోలికతో మొదలుపెట్టి స్త్రీ పరంగా నడిపించి తటిల్లత మాయం కాగా స్త్రీ మాత్రమే మిగిలిపోవటాన్ని ఒక కథాత్మకంగా కవిత్వీకరించింది.తర్వాత వరుసగా నాలుగు వారాలు శ్రీ పేరుతో కవితలు రాసినా తదనంతరం మాత్రం పి.శ్రీదేవిగానే రచనలు చేసింది. శ్రీదేవి కవిత్వం రాసే నాటికి కవిత్వరంగాన భావకవిత్వోద్యమం ఉధృతంగానే వుంది.అందుకే శ్రీదేవి కవిత్వంలో కూడా అక్కడక్కడ ఈ పోకడలు కన్పిస్తాయి.కొన్నింటిలో మాత్రా ఛందస్సు తో ఊహలలో తేలే ప్రణయం,విరహం నిండిన కవితలు రాసినా,సామాన్యులు నేతల్ని,ఆర్తిని, వెతుకులాటనీ కూడా కవిత్వం లోకి తీసుకు వచ్చింది.
సాహిత్య ప్రజానీకం పట్ల సానుభూతితో "అంటారా!" రాసినా , "ప్రకృతి విలయం" లో ప్రణయిని అయిన యువతి విరహానల బాధని వర్ణించినా శ్రీదేవి సహజసిధ్ధమైన శైలి విన్యాసం వ్యక్తమౌతుంది.కృష్ణశాస్త్రి ప్రభావంతో కావచ్చు వాడిన పూలు,పూల బ్రతుకు కవితల్లో శ్రీదేవి భావప్రకటన ఒక కొత్త దృక్కోణంలో మృదుమధురంగా సంభాషణాత్మకంగా నడుస్తుంది. వైదేహి పేరుతో రాసిన మరో కవిత " కిణాంకస్మృతులు " పేదయువకుని హృదయవేదన సున్నితమైన భావచిత్రాలతో సాగుతుంది." కేవల స్వగతం" లో భగ్నప్రేమిక హృదయార్తిని కవయిత్రి వ్యక్తీకరించింది.
ఈ విధంగా కవితా ఖండికలలో ఆ నాటి కవయిత్రులకు భిన్నంగా విభిన్న కవితాంశాల్ని తీసుకుని తనదైన శైలిలో హృదయినిగా,మనస్వినిగా,స్నేహితగా కవయిత్రి శ్రీదేవి కనిపిస్తుంది.
ప్రత్యేకంగా చెప్పాల్సింది 4-4- 1959 నుండి 6-6--59 వరకూ ఎనిమిది వారాల పాటు ధారావాహికగా తెలుగు స్వతంత్ర లో ప్రచురితం అయిన " మధుకలశమ్ " దీర్ఘకావ్యం.
కుందుర్తి - తెలంగాణా,ఆంవత్ససోమసుందర్-మేఘరంజని 1958 ప్రాంతంలోనే వచ్చినట్లుగా తెలుస్తోంది.కాని కవయిత్రులలో ఆధునిక కవిత్వంలోకి వచ్చినవాళ్ళే అతి తక్కువ కావటమే కాక అప్పట్లో దీర్ఘకావ్యం రాసిన దాఖలా లేదు.
శ్రీదేవి తన నవల కాలాతీతవ్యక్తులలో ఆమెకు ఇష్టమైన గ్రంథం దువ్వూరి రామిరెడ్డి గారి పానశాల గురించి రెండు సార్లు ప్రస్తావించింది.ఉమర్ ఖయ్యాం రుబాయీల ఆధారంగా రామిరెడ్డి గారు పద్యకావ్యం గా పానశాల రాసారు.
శ్రీదేవి రుబాయీలలోని సారాంశాన్ని, రామిరెడ్డి గారి పద్య సారాన్ని, పానశాల ముందుమాట లోని ఖయ్యాం జీవనవిధానాన్ని ,వివిధాంశాలపట్ల ఖయ్యాం అభిప్రాయాల్నీ పరిగణలోనికి తీసుకొంది.
అనుసృజనే ఐనా స్వేఛ్ఛారీతిలో తనదైన భావనా పటిమను జోడించి ప్రేమతత్వంలో తాత్విక నేపధ్యాన్ని ఒదిగేలా అద్భుతమైన భాషా స్వాధీనత తో పాఠకుల హృదయాలను రసప్లావితంచేసేలా " మధుకలశమ్" పేరిట కావ్యం గా తీర్చింది.
' కట్టుకోడానికి మనము
కనులుమూయుట స్థిరము
బిచ్చగాడైననూ/ పిచ్చివాడైననూ
భక్తి వత్సలఉడైన/ శక్తిమంతుడైన
పుట్టినప్పుడొక్కడే/ గిట్టినప్పుడొక్కడే,--తాత్వికంగా చెప్తుంది.
'ప్రకృతి -నువ్వూ-నేనూ' అనే అధ్యాయంలో ప్రకృతి అందాల్ని పరమళభరిత పూలను వర్ణించేటప్పుడు పాపనవ్వులతోటీ,నిండుచూలాలి సిగ్గుల తోటీ పోలిక చెప్తూ అత్యంత సహజమైన స్త్రీ అనుభూతులను వర్ణించింది.
రుతువర్ణనల్ని క్లుప్తంగా అయినా సఖీసౌందర్యాన్ని తాత్విక దృక్పథం తో కవిత్వీకరించటం గమనించదగ్గ అంశం.
' నీ చకిత వీక్షణలు / నిర్మలత్వం కనిన
ఎందులోనో బాధలే/ తరలిపోవును గాదే'
ప్రణయిని గా --
ఒక వర్షానికే ఉబికి ప్రవహించేది కొండవాగును నేను '
విరహిణిగా--
మట్టిలో చేరునది/మానవులే కాదురా' అంటూ విరాగిగా--
మతము గితమంటూను/హితము చెప్పుదుమనుచు
మతబోధ చేసేవి/ మతిమంతులందరూ
మనుదురా లోకమున/ మట్టిలో కలియకనే'
అంటూ హేతువాదినిగా--
అనేక రూపాల్లో పాఠకులు కవయిత్రి ని మధుకలశమ్ లో దర్శించగలరు.
' ఒకసారైనాను/ రెప్పపాటు ఐనను
చుక్కవలె మెరిసిపోయే/ నిక్కము బతుకదే' అనే వాక్యాలు చదివినప్పుడు కవిత్వంలో తనకొక చెరగని ముద్రని వేసుకొంది.
" పండుటాకున వలెనే
మెలమెల్లగా జారీ
నిండు జీవితమెపుడో"
ఇంత తాత్విక చింతనను వెలిబుచ్చుతూ ,1959 నుండి అద్భుతశైలితో ఆరేళ్ళ సాహిత్య జీవితంలో నవలా,కథలే కాక కవిత్వంలో కూడా తనదైన చిరునామాని ప్రతిష్టించుకుంది శ్రీదేవి.
కాలాతీతవ్యక్తులతో సహృదయపాఠకుల హృదయాలను కొల్లగొట్టిన శ్రీదేవి రాసిన కవిత్వాన్ని కూడా వారికి రుచి చూపించాలనీ, లేకపోతే ఆమె కవిత్వం కాలగర్భంలో మాయమౌతుందేమోనని ఆరాటపడ్డాను.
మంచి సాహిత్యం ఎక్కడ దొరికినా హత్తుకునే అనల్ప బలరాం గారు శ్రీదేవి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకు రావాలని సంకల్పించి "మధుకలశమ్" పేరిట శ్రీదేవి కవిత్వాన్ని గ్రంథరూపంలో ప్రచురించారు.
నడక దారిలో --33
నడక దారిలో -- 33
బియ్యిడీ కాలేజీలు ఏవేవి ఉన్నాయో ఇంటికి వచ్చిన కవిమిత్రులను అడిగి తెలుసుకున్నాం.మా ఇంటికి దగ్గరగా ఉన్నది,ఫీజులు తక్కువగా ఉన్నది ఆంధ్రమహిళాసభ బియ్యీడీ కాలేజి అని తెలిసి దానికే అప్లై చేసాను.
నా సబ్జెక్టు గణితం కావటం వలన మొదటి లిస్ట్ లోనే సీటు వచ్చింది.కావలసిన డాక్యుమెంట్స్ పట్టుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాను.డిగ్రీ చదివి పదేళ్ళు అయ్యిందని ఫిజికల్ సైన్స్ చదవగలనో లేదోననే భయంతో తెలుగు ఎమ్మే చేసాను కదా గణితం, తెలుగు మెథడ్స్ గా సీటు ఇమ్మని అడిగాను.కానీ బీయస్సీ లో ఆప్షన్స్ బట్టి గణితం, భౌతిక రసాయన శాస్త్రాలు మెథడ్స్ గా చేయాల్సిందే అన్నారు.మరిక ఏమీ అనలేక ఒప్పుకున్నాను.
ఫీజుకట్టి , డాక్యుమెంట్స్ కాలేజీలో సబ్మిట్ చేసినప్పుడు తప్పనిసరిగా వివాహం అయిన వాళ్ళు అందరూ "నో ప్రెగ్నెన్సీ "అని డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ,లేకపోతే మధ్యలో నిండునెలలవల్లా,డెలివరీ వలన చదువు ఒత్తిడి తట్టుకోలేక తరగతులకు హాజరుకాకపోతే కష్టమౌతుంది అన్నారు.కాలేజీ ప్రిన్సిపాల్ చాలా సౌమ్యంగా చిన్నపిల్లలకు చెప్పినట్లుగా చెప్పారు.
ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తేవాలి అర్థం కాలేదు.నిజానికి బాబు పుట్టాక కాపర్ టీ వేయించుకున్నాను.దానికి సంబంధించిన పేపర్లు ఏవి కనిపించలేదు.నల్లకుంట మెయిన్ రోడ్ మీదే డా.కేవీ.కృష్ణకుమారి బోర్డు కనబడి అక్కడికి వెళ్ళాను.ఆమె రచయిత్రి అని తెలుసు.నేను పేషెంట్ గా నాపేరు ఎస్.సుభద్రాదేవి అని రాయించాను.నన్ను పరీక్ష చేస్తున్నంత సేపూ,అక్కడ ఉన్నంతసేపూ తన అందాన్ని, రచనల్ని ప్రశంసిస్తూ ఎన్ని ఉత్తరాలు వస్తుంటాయో, ఎలాంటి ఉత్తరాలు వస్తాయో చెప్తూనే ఉందామె.నేను మౌనంగా వింటూ కూర్చున్నాను.చివరికి " నో ప్రెగ్నెన్సీ" అని సర్టిఫికెట్ ఇచ్చింది.బతికించేవు తల్లీ అనుకుంటూ బయటపడ్డాను.
కావలసిన డాక్యుమెంట్స్ కలిపి,ఫీజు కట్టి కాలేజీలో సబ్మిట్ చేసి గుండెలనిండా ఊపిరి పీల్చు కున్నాను.
వీర్రాజు గారు తాను పెట్టిన అయిదేళ్ళ సెలవు పూర్తి కావటంతో వికాస్ అడ్వర్టైజ్మెంట్ ఆఫీస్ బాధ్యత పూర్తిగా స్నేహితునికి అప్పగించి తిరిగి ఆఫీస్ లో చేరిపోయారు.వికాస్ ఆఫీస్ లో ఇంటీరియర్ కోసం నిర్మల్ కళాకారుడి చేత లైఫ్ సైజ్ లో ఒక నెమలిని వీర్రాజు గారు ముచ్చట పడి చేయించారు.అటువంటి నెమలి బొమ్మ ఉండటం చేత ఆఫీస్ నష్టాల్లో నడిచిందనీ దాన్ని అమ్మేయాలనే స్నేహితుడి ఆలోచన తెలిసి వీర్రాజు గారు ఆ నెమలి బొమ్మని నేను తీసుకుంటానని చెప్పి ఇంటికి రిక్షాలో వేయించి తీసుకు వచ్చేసారు.చొచ్చుకుపోయేతనం, వ్యాపార నైపుణ్యం లేనివారికి స్వంతంగా ఆఫీస్ పెట్టి నెగ్గుకురావడం అంత సులభం కాదనే పాఠం నేర్చుకున్నాము మేమిద్దరం.అయితే ఆ అనుభవం వల్ల సంపాదించినది ఏమీ లేకపోయినా ఆ నెమలి బొమ్మ మాత్రం దక్కింది.
ఉదయమే వంటా ,టిఫిన్ తయారుచేసి ముగ్గురికీ బాక్సులు కట్టేసేదాన్ని.పల్లవి ఎనిమిదికే రిక్షాలో వెళ్ళిపోయేది . వీర్రాజు గారు ముఖచిత్రాలు వేయాల్సినవి ఉంటే ఆ పని చేసుకొని తాపీగా వెళ్ళేవారు.నేను తొమ్మిది కల్లా బయల్దేరి ఫీవర్ హాస్పిటల్ దగ్గర బస్సు ఎక్కి కాలేజీకి వెళ్ళే దాన్ని.
క్లాసులో కొత్తగా డిగ్రీ పూర్తిచేసిన ఇంకా యవ్వనం వీడని అమ్మాయిలంతా ఒక గ్రూపుగా ఉండేవారు.నాలాంటి పెళ్ళిళ్ళై ,పిల్లలున్న వాళ్ళం ఒక గ్రూపుగా తిరిగే వాళ్ళం.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రోగ్రాం కోసం కొందరు అమ్మాయిలు పాటలు ప్రాక్టీస్ చేస్తుంటే ఆసక్తి కొద్దీ నేనూ వెళ్ళి కూర్చున్నాను.కొంతమంది మళయాళీ అమ్మాయిలు కేరళ జానపద పాట ప్రాక్టీస్ చేస్తున్నారు.అందులోని బీట్ బాగా నచ్చి అప్రయత్నంగానే గొంతు కలిపాను.నా పక్కనే కూచున్న ఒక మేడం ఆశ్చర్యపోయి " ఎంత తొందరగా రాగాన్ని పట్టుకున్నావు! సంగీతం నేర్చుకున్నావా?" అని అడిగి నన్ను ఒక పాట పాడమన్నారు.
సుమారు పదేళ్ళ తర్వాత గొంతెత్తి లలిత గీతం పాడాను.అక్కడ ఉన్న వాళ్ళంతా అభినందించారు.ఆ తర్వాత ఒక్కొక్కప్పుడు అందరం కూర్చుని పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు నేనూ పాడుతూ ఉండేదాన్ని.అలా కొంచెం కొంచెంగా మానసికంగా కుదుటపడటం మొదలైంది.
మా కాలేజీలో స్పోర్ట్స్ డే సందర్భంగా జరుగుతున్న ఆటల్ని చూస్తూ రన్నింగ్ కామెంటరీని "నువ్వు కవయిత్రివి కనుక కవిత్వంలో చెప్పమ"ని మా మేడం మైక్ అందించారు. అప్పటికే వచ్చిన నా ఆకలినృత్యం సంపుటి కాలేజీలో ఇచ్చాను .దాని ఫలితం.దేవుడా!! అని కనిపించని వాణ్ణి తలచుకొని కాగితం మీద అప్పటికప్పుడు అప్పటికి వెలుగులో ఉన్న క్రీడాకారిణులను గుర్తు తెచ్చుకుని వారితో పోలుస్తూ నాలుగక్షరాల్ని రాసి కాసేపు చదివాను.దాంతో కాలేజీలో కవయిత్రిగా నమోదు ఐపోయాను.
నేను చదువుతున్న రోజుల్లోనే దుర్గాబాయి గారి సహచరులు చింతామణిదేశముఖ్ మరణించడంతో ఆంధ్రమహిళాసభ డిగ్రీ కళాశాల,మా బీయ్యీడికళాశాల కలిసి అదే ఆవరణలో ఉన్న గాంధీ హాల్ లో సంతాపసభ ఏర్పాటు చేసారు.ఆ సందర్భంగా ఆయన మీద కవిత రాసి చదవమన్నారు మా కాలేజీవాళ్ళు.సరేనని దుర్గాబాయి గురించి కొంత రాసి ఆయన గురించి వాళ్ళు నడుపుతోన్న సంస్థల గురించి కలిపి రాసాను.నిజానికి కవిత బాగానే వచ్చింది.కాని నేను దీనిని నా సంపుటాలలో చేర్చలేదు.డిగ్రీకాలేజీలో తెలుగుశాఖ కి పెద్ద అయిన నిడమర్తి నిర్మలాదేవి గారితో అప్పుడే పరిచయం అయ్యింది.ఆమె కూడా కవిత చదివారు.
నిర్మలాదేవి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మీద పరిశోధన చేసినట్లు తెలిసింది.ఆమె కూడా నా గురించి వివరాలు తెలుసుకున్నారు.
పూర్తిగా పాఠాల్లో మనసును లగ్నం చేసి ఏకాగ్రతతో చదువులో మునిగిపోయాను.మిగతా సబ్జెక్టులు పర్వాలేదు కానీ ఫిలాసఫీ,సైకాలజీ కొంచెం కష్టంగా అనిపించింది.అందులోనూ ఇంగ్లీష్ మీద పూర్తిగా పట్టుపోవటంతో మొదట్లో అర్థం చేసుకోవటం కష్టమే అయ్యింది.
ఒకరోజు సైకాలజీ క్లాసులో మెదడు విషయాల్ని ఎలా గ్రహిస్తుంది.ఎక్కడ భద్రపరుచుకొంటుంది.మెదడు గ్రహించలేని పరిస్థితులు,దానివలన వచ్చే బుధ్ధిమాంద్యత మొదలైనవన్నీ సోదాహరణంగా వివరిస్తున్నారు.
అప్పటికి బాబుని కోల్పోయి ఆరునెలలు కూడా కాలేదేమో మనసులోని పచ్చిదనం రేగినట్లు అయ్యింది. ఒక్కసారిగా దుఃఖం పగిలినట్లు కుమి
లి కుమిలి ఏడ్చేసాను.ఆ రోజు ముందు సీట్లు నిండిపోవడంతో చివరి బెంచీలో కూర్చున్నాము లెక్చరర్ గమనించలేదు.కానీ నా పక్కనే కూర్చున్న సహాధ్యాయి కంగారు పడింది.ఓ పది నిమిషాలకు సర్దుకొని తిరిగి పాఠంలో పడ్డాను.
బాబు పోయిన బాధ కొద్దికొద్దిగా మరపులోకి పూర్తిగా వెళ్ళక ముందే వీర్రాజు గారి సహోద్యోగే కాక ఆయన్ని కవిత్వంలోకి నడిపించిన,ఒక సోదరుడిగా ప్రేమించిన కుందుర్తి ఆంజనేయులు గారి షష్టిపూర్తి కోసం వీర్రాజు గారూ,మిత్రులు,సన్నిహితులు అందరూ కలిసి ఒక పుస్తకం కూడా వెలువరించటానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో దసరాలలో అకస్మాత్తుగా చనిపోయారు.అది వీర్రాజు గారిని బాగా కుంగదీసింది.
వీర్రాజు గారు తిరిగి ఉద్యోగంలో చేరటం, నేను కాలేజీకి వెళ్ళి రావటం,మిగతా సమయం పల్లవితో గడపటంతో జీవితం ఒక గాడిని పడింది అనుకున్నాను .
అంతలో మళ్ళా ఒక ఉత్పాతం.రెగ్యలర్ గా వచ్చే నెలసరి పదిరోజులుగా రాలేదని గమనించాను.నేను గర్భనిరోధక సాధనంగా కాపర్ టీ వేయించుకున్నాను. అదొక బెంగ అయ్యింది.కాలేజీలో చేరేటప్పుడు నో ప్రెగ్నెన్సీ సర్టిఫికెట్ ఇచ్చాను.ఇప్పుడిలా జరిగిందేమిటి అని అనుకున్నాను.
వీర్రాజు గారితో చెప్తే "మళ్ళా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు "అన్నారు.సరే అని వెళ్తే పరీక్ష చేసి "ఒక్కోసారి కాపర్ టీ ఉన్నా గర్భం వస్తుంది" అంది ఆమె .టేబ్లెట్లు రాసి "రెండు రోజులపాటు వేసుకో మరో రెండు రోజులకు పీరియడ్స్ వచ్చేస్తాయ"ని చెప్తే అవి కొనుక్కుని రెండురోజులు వాడాను .కానీ పీరియడ్స్ రాలేదు.శని ఆదివారాలు సెలవు దొరికేసరికి శుక్రవారం సాయంత్రం పల్లవిని తీసుకుని అక్కయ్య దగ్గరకు మలకపేట వెళ్ళాను.అక్కయ్యతో విషయం అంతా చెప్తే సైదాబాద్ రోడ్ మీద సాయంపూట ఒక లేడీడాక్టర్ క్లినిక్ తెరుస్తారని ,ఆమెకు మంచి పేరుంది అని చెప్పి తీసుకు వెళ్ళింది.
డాక్టర్ నన్ను పరీక్ష చేసాక, నేను వాడిన మందులు ప్రిస్క్రిప్షన్ ఆమెకు చూపించాను.ఆమె అది చూసి " ఈ మందులు ప్రిస్క్రైబ్ చేసిన ఆవిడ చదువుకున్న డాక్టరేనా?" అని ప్రశ్నించారు.
నేను ఆశ్చర్యపోయి డాక్టరే అని చెప్పి ప్రశ్నార్థకంగా చూసాను.
"ఈ టేబ్లెట్లు బేన్ చేసి రెండు మూడు సంవత్సరాలైంది.ఇవి రాసినందుకు ఆమెపై కంప్లైంట్ ఇవ్వొచ్చు." అన్నారు డాక్టర్.
మళ్ళా నావైపు చూసి అంతకుముందు నెలసరి ఎప్పుడు వచ్చిందో కనుక్కుని "గర్భం ఆరు వారాలు దాటింది.అయితే ఆ టేబ్లెట్లు వాడినందువలన పుట్టే బిడ్డకు శారీరకఅవకరం గానీ,మానసిక మాంద్యం గానీ వచ్చే అవకాశం ఉంది.ఉంచుకుంటావో,అబార్షన్ చేసుకుంటావో ఆలోచించుకో" అన్నారు.
నాకు గుండె పగిలినట్లయ్యింది.మూడున్నర సంవత్సరాలు పడిన అవస్థ కళ్ళముందు గిర్రున తిరిగింది." వద్దొద్దు.అబార్షన్ చేసుకుంటాన"ని అన్నాను.
"సరే నని "విషయం అంతా రాసి అబార్షన్ అవసరం అనేది" రాసిచ్చి ఉస్మానియా హాస్పిటల్ లో తనకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి ఉదయం ఏడున్నర కల్లా వెళ్ళమని చెప్పారు డాక్టర్.
శనివారం ఉదయమే అక్కయ్య,నేను ఉస్మానియా హాస్పిటల్ కి వెళ్ళి రిఫర్ చేసిన డాక్టర్ని కలిసాము.వెంటనే అబార్షన్ చేసారు.తిరిగి అక్కయ్య ఇంటికే వెళ్ళి శని, ఆదివారాలు అక్కడే విశ్రాంతి తీసుకుని ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను.
మర్నాటి నుంచి మళ్ళా యథావిధిగా కాలేజీకి వెళ్ళిపోయాను.
వీర్రాజు గారు కూడా ఆఫీస్ కే కనుక టైం ప్రకారం వెళ్ళిరావటంతో నాకు కొంత వెసులుబాటు కలిగింది.
అయితే సమాచారం పౌరసంబంధాల శాఖలో పనిచేస్తున్నందున, ఆంధ్రప్రదేశ్ పత్రిక చూసే బాధ్యత వలన వీర్రాజు గారికి పని ఒత్తిడి కలిగించే కొత్త మార్పులు జరిగాయి.
అవేమిటంటే 1982లో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటన జరిగింది. నలభై ఏళ్ళు గా సినిమాల్లో తన నటన ద్వారా ప్రజల ప్రశంసలు పొందిన నందమూరి తారక రామారావు మార్చి 29 న తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. 1980-82 లమధ్య కాంగ్రెస్ పార్టీ అంజయ్య,భవనం వెంకట్రామరెడ్డి,కోట్ల విజయభాస్కరరెడ్డి ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది.కాంగ్రెసు అసంతృప్త నాయకుడు నాదెండ్ల భాస్కరరావు వంటివారు ఎన్టీఆర్ తో కలిసారు. పదే పదే ముఖ్యమంత్రుల్ని మార్చి కాంగ్రెసు పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపిస్తూ, ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు ప్రజల్లోకి వచ్చారు.ఆంధ్రప్రదేశ్ అంతటా అది సంచలనం కలిగించింది.
కాలేజీలో డిగ్రీ అయిన వెంటనే బియ్యీడీలో చేరిన అమ్మాయి రాగలత ఎందుచేతనో కానీ నాకు చాలా దగ్గర అయ్యింది.ఒక చెల్లెలులా మా కుటుంబంతో కూడా కలిసిపోయింది.టీచింగ్ ప్రాక్టీస్ కూడా ఇద్దరికీ ఒకటే స్కూల్ లో పడటంతో కలిసి వెళ్ళొచ్చేవాళ్ళం.ఒకసారి నన్నూ,పల్లవిని వాళ్ళ వూరు భువనగిరికి తీసుకు వెళ్ళింది.రాగలత చెల్లెళ్ళు కూడా మాతో బాగా కలిసారు.అందరం కలిసి భువనగిరి గుట్టపై వరకూ అందరం ఎక్కాము.ఇప్పటికీ ట్రైన్ లో అటు వెళ్తున్నప్పుడు కనిపించే భువనగిరి గుట్టని చూసినప్పుడు ఆరోజులు గుర్తువస్తూ ఉంటాయి.
1983 జనవరి లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆశ్చర్యకరంగా స్థాపించిన తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం 198 స్థానాలు గెలుచుకొని అధికారానికి వచ్చింది, 60 స్థానాలతో కాంగ్రెసు ప్రతిపక్షంగా నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్‌లో మొట్ట మొదటి సారిగా కాంగ్రెసు ప్రతిపక్షం స్థానానికి చేరింది.
వీర్రాజు గారికి మాత్రం ఈ మార్పు ఉద్యోగరీత్యా సమాజజీవితానికి దూరం చేసింది.
విద్యాసంవత్సరం చివర్లో డిగ్రీ కాలేజీకి,మాకాలేజీకి కలిపి ఏర్పాటు చేసిన పెయింటింగ్, ఫేబ్రిక్ పెయింటింగ్ లలో కూడా బహుమతులు గెలుచుకుని మా కాలేజీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను.హర్డిల్ రేస్ లా సాగే నా చదువు మొత్తం మీద పూర్తి చేసాను.
నా పరీక్షలు పూర్తిఅయ్యి ఊపిరి పీల్చుకునే సరికి పెద్దాడబడుచు అయిదేళ్ళ తర్వాత కుటుంబం తో వచ్చింది.ఈ సారి మేము వేర్వేరు కుటుంబాలు అయ్యాం కనుక అన్నదమ్ముల అందరిళ్ళకి అయిదేసిరోజులు వెళ్ళొచ్చారు.
కానీ మాట వరసకైనా బాబు ప్రసక్తి తీసుకు రాకపోవటం ఆశ్చర్యం కలిగించింది.
ఒక్కొక్కరి మనస్తత్వాలు ఇన్నేళ్లలో బాగా తెలిసాయి కనుక నేను కూడా బాగా రాటుతేలాను.పూర్వంలా అన్నింటికీ మౌనం వహించకుండా నొప్పింపక తానొవ్వక మెలిగాను.అన్నీ సగౌరవంగా చేసి వాళ్ళను సాగనంపాను.
నడక దారిలో--32
నడక దారిలో --32
కొత్త ఇల్లు మాకు విశాలంగానే ఉంది.ముందుగదిని వీర్రాజుగారు ఆఫీసు రూంలా అమర్చుకున్నారు. మూడు గదులు దాటాక పెరటిలో దేశీ గులాబిచెట్టునిండా పూలతో బాగుంది.అయితే పెరటిగోడని ఆనుకొని క్షత్రియ హాస్టల్ ఉండేది.ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గోడ పక్కనే అబ్బాయిల ఆటలు,కేకలు,కబుర్లతో గోలగోల గా ఉండేది.
వీథి గుమ్మం పక్కన కూడా మొక్కలు పెంచుకొనే వీలుంది.
అదే కాంపౌండ్ లో లలితా వాళ్ళ చెల్లెలు భాగ్యలక్ష్మి కుటుంబం ,ఆమెతల్లిదండ్రులతో సహా ఉండటం నాకు కొంత ధైర్యం కలిగించింది.భాగ్యలక్ష్మి భర్త "నిజం" పేరుతో కవిత్వంరాసే జర్నలిస్టు శ్రీరామ్మూర్తి గారు.భాగ్యలక్ష్మి, శ్రీరామ్మూర్తి గార్ల పెళ్ళిమాటలు మేము రాంకోఠీలో ఉన్నప్పుడు మా ఇంట్లోనే జరిగాయి.
మా కాంపౌండ్ పక్కనే ఉన్న ఇంటిలో యువభారతి సభ్యులు బసలింగప్పగారు ఉండేవారు.ఆయనకు పల్లవి వయసు అమ్మాయిలు ఉండటంతో పల్లవి సంతోషంగా ఆడుకునేది.
ఈ ఇంటికి వచ్చాక పల్లవిని తిలక్ నగర్ లోని శ్రీవిద్యా సెకండరీ స్కూల్ లో జాయిన్ చేసాము.అదే స్కూల్లో యువభారతి సభ్యులు మాడభూషి రంగాచార్యులు గారి శ్రీమతి లలితాదేవి ఉపాధ్యాయురాలు.అప్పటినుండీ వారితో మాకు స్నేహం మరింత పెరిగింది.మా ఇంటి ఎదురుగా ఉండే అమ్మాయితో కలిసి పల్లవి స్కూల్ కి వెళ్ళేది.అక్కడకి దగ్గరలో ఎవరో సంగీతం నేర్పిస్తారని తెలిసి పల్లవిని చేర్చాను.
ఎమ్మే రెండో సంవత్సరం పరీక్షలకు కూడా ఫీజుకట్టి కొన్ని పుస్తకాలు తీసుకు వచ్చారు వీర్రాజుగారు.కానీ బాబు ఆరోగ్యం మరీ క్షీణించింది.తరుచూ ఏదో ఒక హడావుడి చేస్తుండటంతో హాస్పిటల్స్ చుట్టూ తిరగటం అవుతోంది.
మెలకువగా ఉన్నప్పుడు చాపమీద బోర్లా పడుకుని బొమ్మలతో ఆడిస్తే బాగానే ఉండేవాడు.ఈ వయసుకి గంతులు వేస్తూ ఆటలు ఆడుతూ, కబుర్లు చెప్పాల్సిన మూడున్నర ఏళ్ళ వాడు బోర్లా మాత్రమే పడి అర్థంలేని కేకలే తప్ప అమ్మా అనే పిలవటం కూడా రాని రబ్బరు బొమ్మ లాంటి వాడిని చూస్తుంటే కడుపు తరుక్కుపోయినట్లు దుఃఖం నన్ను ముంచెత్తేది.వాడిని నిద్రపోయినప్పుడు కాళ్ళమీద పడుకోబెట్టుకున్నంత సేపూ నిద్రపోయేవాడు.మెల్లగా పక్కమీద చేర్చే సరికి ఉలికి పడి ఫిట్స్ వచ్చేసేది.దాంతో రాత్రంతా నేను కొంతసేపు, వీర్రాజు గారు కొంతసేపు కాళ్ళమీద బాబుతో కూర్చునే ఉండాల్సి వచ్చింది.
పల్లవి బడికి,ఆయన ఆఫీస్ కి వెళ్ళాక పగలు కూడా కాళ్ళమీద బాబుని పడుకోబెట్టుకుని పుస్తకాలు చదువుకునేదాన్ని.ఈసారి పరీక్షలు రాయగలనా అనుకున్నాను.
పరీక్షలకు ముందు విశ్వవిద్యాలయం నిర్వహించే కాంట్రాక్ట్ తరగతులకు ఈసారి కూడా హాజరు కాలేకపోయాను.సంస్క్రతం పేపర్లో కాళిదాసురఘువంశం,హితోపదేశం లో విగ్రహము,సంధి భాగాలు పాఠ్యాంశంగా ఉన్నాయి.విశ్వవిద్యాలయం వాళ్ళు రఘువంశం నోట్స్ ఇచ్చారు కానీ సంధి ఇవ్వలేదు.బయటషాపులలో కూడా దొరకలేదు.చిన్ననాటి స్నేహితురాలు లలితకు ఉత్తరం రాసాను.ఆమెకు కూడా దొరకలేదుట.లలిత పనిచేస్తున్న స్కూల్లో సెలవు దొరక నందున ఆమె కూడా విశ్వవిద్యాలయం క్లాసులకు హాజరు కాలేదట.'హాజరైయ్యుంటే నోట్స్ దొరికేది ' అంది.ఇక నాదగ్గర ఉన్నపుస్తకాలే చదువుకున్నాను.
ఎప్పటిలాగే అమ్మని పరీక్షలసమయంలో రమ్మన్నాను.పల్లవికి స్కూలు సెలవులే కనుక బాబుని ఆడించటానికి సహాయంగా ఉంది.
ఈసారి కూడా రెడ్డి కాలేజీలోనే ఎగ్జామ్స్ సెంటరు.లలిత ఎప్పటిలాగే అక్కడ కలిస్తే మాట్లాడుకున్నాం.సంస్క్రత పరీక్ష ముందురోజు హితోపదేశంలో సంధి,విగ్రహముల భాగాలు ఎవరో కొన్ని పేజీలు పంచారు.అవికూడా చదువుకుని పరీక్షలు నిర్విఘ్నంగా రాసాను.పరీక్ష రాసి వచ్చాక అమ్మ మలకపేట పెద్దక్క ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండి వస్తానంటే వీర్రాజు గారు తీసుకు వెళ్ళి అక్కడ ఇంట్లో దింపి వచ్చారు..
"ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎలా అయితేనేం పట్టుదలతో ఎమ్మే పూర్తి చేసేసావు" అని ఆ రాత్రి ఆయన నన్ను ప్రశంసించారు."ఇకపై తిరిగి సాహిత్యం వైపు దృష్టి పెట్టు" అని హెచ్చరించారు.
ఫలితాలు గురించి ఏమూలో భయం ఉన్నా, ఎమ్మెస్సీ చేయలేకపోయినా ఏదో ఒక పీజీ చేసినందుకు నాకు తృప్తి గా అనిపించింది.
ఇంకా పడుకుందామనుకుంటూనే సరికి బాబు అకస్మాత్తుగా లేచి ఏడవటం మొదలుపెట్టాడు. ముదురుమట్టిరంగులో వాంతులు చేసుకోవటంతో మందులవలన అలా వాంతి చేసుకుంటున్నాడు అనుకున్నాం రాత్రంతా కాసేపు నిద్రపోవటం సడెన్ గా లేచి ఏడవటం ఫిట్స్ రావడం, వాంతి చేసుకోవడంతో ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ జాగరణ చేసాం.
ఉదయమే పల్లవిని పక్కనే ఉన్న శ్రీరామ్మూర్తి గారింట్లో అప్పగించి మేము బాబు చికిత్స కోసం సాధారణంగా ఎప్పుడూ తీసుకుని వెళ్ళే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాము.ఆయన చూసి నిలోఫర్ కి తీసుకు వెళ్ళమన్నారు.నిలోఫర్ హాస్పిటల్ కి తీసుకెళ్తే వెంటనే చేర్చుకుని సెలైన్ అమర్చి దానిగుండా మందులు వెళ్ళేలా చేసారు.
ఈ వార్త తెలిసి మా పెద్దమరిది రామకృష్ణా, మల్లేష్ మొదలైనవారు నిలోఫర్ హాస్పిటల్ కి వచ్చారు.ఇంట్లో పల్లవిని చూసుకోవటానికి మా అమ్మను అక్కయ్య ఇంటినుంచి పిలిపించాము.అక్కయ్య హాస్పిటల్ కి మా ఇద్దరికీ భోజనం పంపించేది.
రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడి మూడోరోజు మమ్మల్ని తన వైకల్యం చూసి ఇంక కుమిలి పోవద్దనేనేమో ఈ లోకం నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు మా చైతన్యబాబు.
ముద్దులు మూటగట్టేలా ఉన్న బాబు ని చూసి నిత్యచైతన్యవంతుడిలా ఉండాలని చైతన్య అని పేరుపెట్టుకున్నాము.ఏ స్పందనా లేని గాజుబొమ్మలా ఉండి మూడున్నర ఏళ్ళ పాటు ఎప్పటికప్పుడు మా మనసుల్లో ఆశని రాజేసుకుంటూ గడిపిన మమ్మల్ని ఇంక సెలవంటూ మా ఒడి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.
రాత్రీ పగలు నిద్రకాచుకుంటూ గడిపిన నాకు ఒక్కసారిగా ఖాళీ అయిన ఒడిని చూసుకునే సరికి నిర్వేదం ఆవరించింది.
నా పరీక్షలకు ఆటంకపరచకూడదనుకునేనేమో ప్రాణం నిలబెట్టుకుని మరీ వెళ్ళిపోయిన బాబుని గుర్తు తెచ్చుకుంటే దుఃఖం ముంచుకొచ్చింది.
మూడున్నర ఏళ్ళుగా మా యింట అడుగు పెట్టని తోటి కోడళ్ళు మిఠాయిలు పట్టుకొని పరామర్శకి వచ్చేసరికి గుండెల్లో అగ్గి రాజుకుంది దుఃఖం ఆవిరైపోయింది.
విషయం తెలిసి నాబాల్యస్నేహితురాలు కుమారి,వాళ్ళ ఆడబడుచు లక్ష్మి వచ్చారు.నన్ను ఓదారుస్తూ "సుభద్రా నువ్వు బియ్యెడ్ ఎంట్రన్స్ రాయకూడదా? నీ టేలెంట్స్ కి, మనస్తత్వానికి టీచర్ ఉద్యోగం బాగుంటుంది.పిల్లలమధ్య వుంటే నువ్వు మామూలు మనిషి వౌతావు.ఆలోచించు.పల్లవికూడా కొంచెం పెద్దదయ్యింది కనుక ఇబ్బంది ఏమీ ఉండదు"అంది.
కానీ ఇప్పుడు ఎంట్రన్స్ రాయగలనా అని సందేహం వెల్లడిస్తే "ఏమీ పర్వాలేదు సుభద్రా 8,9,10 తరగతుల పుస్తకాలు ఓసారి తిరగెయ్యు సరిపోతుంది." అంది.
నాకు కూడా ఏమైనా చేయాలనిపించింది.ఇలా నాలుగు గోడల మధ్య వుంటే ఏమైపోతానో అనిపించింది.
వీర్రాజు గారు రాగానే ఈ విషయం చెప్పాను.వీర్రాజుగారితో పాటూ వచ్చిన సిధారెడ్డి "నేను రేపు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఎంట్రెన్స్ ఫాం తీసుకు వస్తాన"న్నాడు.
అదే విధంగా సిధారెడ్డి
మర్నాడు ఉదయమే ఫాం తీసుకురావడమే కాదు అదేరోజు సబ్మిషన్ కు ఆఖరురోజని చెప్పి ఫాం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి యూనివర్సిటీ లో సబ్మిట్ చేసారు.
ఇంటికి చుట్టుపక్కల పిల్లల్ని పుస్తకాలు అడిగి చదవటం మొదలెట్టాను.బియస్సీ చేసి పదేళ్ళయ్యింది.కానీ నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు కనుక గణితం , సూత్రాలు వెంటవెంటనే గుర్తు వచ్చాయి.చదువులో పడేసరికి మనసు కొంత కుదుట పడింది.మొత్తంమీద ఎంట్రెన్స్ బాగానే సంతృప్తికరంగానే రాసాను.
ఈలోపు ఎమ్మే రిజల్ట్ వచ్చింది.సెకెండ్ క్లాస్ లో పాసయ్యాను.ఆ పరిస్థితుల్లో పరీక్షకు చదివినా మంచి మార్కులు రావటం సంతోషం కలిగింది.నా పరీక్ష పూర్తయ్యేవరకూ ప్రాణాలుగ్గబెట్టుకున్న బాబు గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి ఎంఫిల్ అడ్మిషన్ ప్రకటన చూసి మనసు అటువైపు ఊగింది.వీర్రాజుగారు కూడా "ఒక ప్రయత్నం చేయు.ఇదివస్తే ఎంఫిల్ చెయ్యు.బియ్యీడి సీటు వస్తే అదిచెయ్యు" అన్నారు.వచనకవిత్వంలో కావ్యాలు పేరుతో రెండు పేజీలు నోట్స్ తయారు చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాను.అప్పట్లో ఎంఫిల్, పీహెచ్డీ లకు ఇంటర్వ్యూ తప్ప ఎంట్రన్స్ లేదనుకుంటాను.
మొదటిసారి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కుతుంటే ఉద్వేగం ఆవరించింది.అటువైపు బస్సులోని ఆటోలోనో వెళ్ళినప్పుడల్లా ఎప్పుడన్నా ఆ మెట్లు ఎక్కి రూముల్లో చదువుకొనే అవకాశం వస్తుందా అనుకునేదాన్ని.ఎమ్మే కాంటాక్ట్ క్లాసులకి వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది.
డా.కులశేఖరరావుగారూ,డా.నాయని కోటేశ్వరి, బిరుదురాజు రామరాజు గార్లు ఇంటర్వ్యూ చేసారు. అప్పటికే పుస్తకరూపంలోకి వచ్చిన ఆకలినృత్యం కవితాసంపుటి,కథలు, వ్యాసాలు చూసారు.కానీ నాకు సీటు రాలేదు.ఆ ఏడాది రెగ్యులర్ గా ఎమ్మే చదివిన వారికే ఇచ్చారని తెలిసింది.
ఈ లోగా బియ్యిడీ ఎంట్రెన్స్ లో నాకు 56 రేంకు వచ్చినట్లు కార్డు వచ్చింది.మంచిరేంకు వచ్చింది తప్పని సరిగా కాలేజీలో సీటు వస్తుందని మిత్రులు చెప్పారు.
ఒక్కసారి సంతృప్తిగా ఊపిరి తీసుకున్నాను.
23, సెప్టెంబర్ 2023, శనివారం
ది గ్రేట్ ఇండియన్ కిచెన్
ఇప్పుడే జీ సినిమాలో "ది గ్రేట్ ఇండియన్ కిచెన్" సినీమా చూసాను.చాలా బాగా నచ్చింది.పురుషాధిక్యభావజాలం ,చాంధసభావాలు గల కుటుంబంలో కోడలుగా వచ్చిన విద్యావంతురాలైన ఆధునిక యువతి మానసిక సంఘర్షణ ఈ సినిమా.
సాధారణంగా మన సినిమాలూ, కథలలో ప్రేమలూ డ్యూయెట్ లు,అపార్థాలు,పెద్దవాళ్ళు ఒప్పుకోక పోవటం ఆ తర్వాత అడ్డంకులు తొలగో,లేకపోతే పారిపోయో జరిగిన పెళ్ళితో శుభం కార్డు పడుతుంది.
నిజానికి పెళ్ళి తర్వాతే ముసుగులు తొలగి అసలు కథ ఉంటుంది.
నాకైతే మాత్రం ఆడపిల్లలందరినీ కూర్చోబెట్టి ఈ సినిమా చూపించాలి అనిపించింది.
20, సెప్టెంబర్ 2023, బుధవారం
నత్తగుల్ల జీవులం
నత్తగుల్ల జీవులం"
జీవితం పొడవునా అమృతం కురిపిస్తుందనుకున్న వెన్నెల
ఏ అమావాస్య చీకటిలో కరిగిపోయిందో
చండప్రచండుడే కావచ్చు
కానీ ప్రాణులకి జీవనాధారుడే ఐనా
ఆకాశాన్నీ భూమినీ మండిస్తూ మండిస్తూ
ఏ సముద్రంలో కూలిపోయాడో
ఏ మారుమూల మామిడికొమ్మ చాటునో
దాగుడుమూతలాడుతూ గొంతు విప్పే కోయిల
ఏదూరతీరాలకు ఎగిరిపోయిందో
మనసుచుట్టూ కంచెల్ని విరగ్గొట్టి
పెంచుకున్న మధురపరీమళాలు
ఏ భూమిపొరల్లో వసివాడి కరిగిపొయాయో
మహావృక్షాలుగా ఎదగటానికి
ప్రోదిచేసిన అస్థిత్వమూలాలు
ఎక్కడ తెగ్గొట్టబడ్డాయో
చూపు ప్రసరిస్తున్నంత మేరా
ఊహ విస్తరిస్తున్నంతా ఆవరణా
హృదయం నిండా ప్రేమగా
పొదువుకున్న స్నేహప్రాణవాయువు
ఏ దుఃఖ నదిలో మలిగిపోయిందో
విశాలత్వం నానాటికీ కుంచించుకుంటూ
ముడుచుకు పోతోందా
మనుషుల్లో మానవీయత ఇగిరిపోతోందా
మనిషికీ మనిషికీ మధ్య
నీడకూడా ఎదగనంతగా
ఎండపొడకూడా తాకనంతగా
అపారదర్శక యానకం
దట్టంగా గోడై పేరుకుపోతుందా
అందుకేనేమో
కళ్లనిండుగా కోరుకున్న ప్రకృతివర్ణాల్ని
బుల్లిపెట్టెలో చూస్తూ మురిసిపోతున్నాం
సురభిళాలూ లేవు
సీతాకోకచిలుకలూ లేవు
తేనెపుప్పొడులూ లేవు
తేటిపాటలూ లేవు
విశాలఆవరణాల్లో విస్తరించకుండా
మూలవేరుల్ని కత్తిరించి
పునఃప్రతిష్ట కావించిన
మరుగుజ్జువృక్షాలే మనచుట్టూ
అందుకే మరి
పరిమళభరిత ఫలాలూ లేవు
పలుకుతేనెల చిట్టిచిలకలూ లేవు
అవన్నీ అశరీరవాణిలోనే వినాలి
గుల్లల్లోకి చుట్టుకు దూరే నత్తలమై
సారవంతభూగర్భాల్ని అందుకోలేని వేర్లమై
ముడుచుకుంటూ పిసరంత జాగాల్లోనే
అల్లుకోక తప్పనిపరిస్థితిలో
మిద్దెతోటల్లోకే జారుకుంటూ
అడవుల్ని కలగంటున్నాం
ఇకపై
మనచుట్టూ ఎదిగే వృక్షాలు
ఆముదపు చెట్లేనేమో.
కలుగుల్లో ప్రపంచం
కలుగుల్లో ప్రపంచం
అంతటా
ఘనీభవించిన నిశ్శబ్దం
గునగునా గంతులేస్తూ
ఆవరణంతా కలయతిరిగే
చిట్టిపొట్టి కుందేలు పిల్లలన్నీ
ఏబొరియలో బంధింపబడ్డాయో!
సూర్యుడు కిరణాలరెక్కలుసాచేవేళనుండీ
చీకటి దుప్పటి ముసుగేసుకునే వరకూ
రంగులు విరజిమ్ముతూ ఎగిరే
సీతాకోకచిలుకలన్నీ
తిరిగి ప్యూపాలలోఒదిగి పోయాయేమో!!
పించాన్ని విప్పుకుంటూ వయ్యారంగా
కొమ్మలకారిడార్లలో తిరిగే
తొలియవ్వనపు నెమలికన్నెలు
పింఛాలకొంగుల్ని ముడుచుకొని
ఏ గుబురు నీడల్లో దాక్కున్నాయో!!!
వానాకాలం ను వానచినుకుల్ని
రెక్కలతో ఒడిసిపట్టి
చంఢప్రచండుడిఉష్ణకాసారాల్లో
ఒంపుతున్నట్లు
కిలకిల నవ్వులు రాగాలతో
చిట్టిపలుకుల చిలకపాపలు
ఏ కొమ్మ గూటిలో ముక్కుల్ని కట్టేసుకున్నాయో!!!
అంతస్తుల కొమ్మలనిండా
మిణుగురుపూవుల్ని అద్దినట్లు
నవ్వుల్ని ఒంపుకుంటూ
చెణుకుల్ని విసురుకుంటూ
కలయతిరిగే వయ్యారి ఒప్పులకుప్పలు
ఏ రంగులపెట్టె లో ఒదిగిపోయారో!!!
ఏమో మరి
అంతటా గడ్డకట్టిన నిశ్శబ్దం
చిరుగాలితరగలకే సందడించే
సజీవచైతన్యంతో తలెత్తి నిలిచే
అయిదు నిలువుల మహావృక్షం
మా బిల్డింగు
నేడు ఇప్పుడు
భయంవైరస్సు కమ్ముకున్న వాల్మీకం లో
ఘోరతపస్సుతో స్తంభించిన
మౌనమునిలా వుంది.
ఇలా
ఊరూ వాడా యే కాదు
ప్రపంచమంతా....!!!?
సాకారమైన కల
సాకారమైన కల
కలలకు రెక్కలొచ్చినట్లే
మనసుకు కూడా రెక్కలొస్తే బాగుండు
నన్ను బాధిస్తున్న ఎండుబెరళ్ళ మనుషుల్ని
నిలువెల్లా ముళ్ళుతొడుక్కున్న సమూహాల్ని
ఇన్నాళ్లుగా వెంటాడుతోన్నట్లు
వెనకవెనకే అల్లుకుంటూన్న
చిక్కుసమస్యల దట్టమైన అరణ్యాల్ని దాటి
విశాలాకాసం లో
నా కోసమే పొడిచిన పొద్దులో
మనసురెక్కల్ని ఆరబెట్టుకునేదాన్ని
కలలకు రెక్కలొఛ్చినట్లే
చూపుకి కూడా రెక్కలొస్తే బాగుండు
రాత్రేగినంతకీ ఎగరేసి ఎగరేసి
సొమ్మసిల్లిన కళ్ళనీ
పుస్తకాల్లోని అక్షరాల్ని ఏరుకున్న పిట్టయి
బరువెక్కిన రెప్పల్ని
నిద్రవాలని రాత్రంతా
విసుగుకొంటూ విసురుకొంటూ
అలసిన కంటిపాపని కప్పేందుకు
దుప్పటిలా వాలిపోయే చూపులరెక్కల్ని
మెత్తగా హత్తుకునేదాన్ని
కలలకు రెక్కలొఛ్చి
ఊహకి రెక్కలొస్తే బాగుండు
సీతాకోకచిలుకని చేసి
స్నేహవసంతవనం లో పూచిన పూబాలల్ని
గిలిగింతలతో పలకరిస్తూ
పిల్లగాలిలో రాగాలుతీస్తూ
సెలయేటి పాటకు గొంతుకలుపుతూ
ఉహలరెక్కల్ని రంగురంగుల పూరేకులతో
అందంగా అలంకరించే దాన్ని
అవునవును
కలలకు రెక్కలొఛ్చినట్లే
మాటకి రెక్కలొచ్చినట్లే ఉంది
ఎవ్వరేమనుకుంటారో అని
మనసునొచ్చినా కన్నీళ్ళుచిందినా
గుండెగదిలో దాక్కున్న పిట్టలా
పెదాలతలుపుల్ని బిడాయించుకొని
బైటకి వచ్చేందుకు తడబడుతూ
లోలోపలే కునారిల్లుతూ కూచోకుండా
మాట రెక్కల్ని విదిల్చి
మాటకీమాట గా పదానికి పదమై
నిలువెల్లా పరిపూర్ణ వాక్యమై
కవిత్వమై ప్రవహిస్తూనే ఉంది .
28, జులై 2023, శుక్రవారం
నడక దారిలో --31
నడక దారిలో -- 31
వీర్రాజు గారికి తనని తాను ఉత్సాహం పరచుకోటానికి తన పుస్తకాలు ప్రచురించుకోవటం ఒక అలవాటు.అందుకని నా లోకి నేను ముడుచుకు పోవటం చూసి నా కథలను పుస్తకంగా వేయాలని తలపెట్టారు.
నా పేరు ఎవరు ప్రస్తావించారో కాని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు మచిలీపట్నంలో నిర్వహించాలని పూనుకున్న రచయిత్రుల మహాసభల్లో కవిసమ్మేళనంలో పాల్గొనమని ఉత్తరం వచ్చింది.నాకు చాలా ఆశ్చర్యం,ఆనందం కలిగించింది.కానీ బాబును తీసుకుని ఎలా వెళ్ళాలి అనేదే పెద్దప్రశ్న.
మచిలీపట్నం వాస్తవ్యులు వీర్రాజు గారికి మంచిమిత్రుడైన గుత్తికొండ సుబ్బారావు గారు తమ స్పందన సాహితీసమాఖ్య కూడా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తో కలిసి నిర్వహిస్తుందని తెలియజేసి, కుటుంబ సమేతంగా రమ్మనీ,మిగతావిషయాలు నేను చూసుకుంటానని అన్నారు.
ఉత్సాహంగా అందరం బయలుదేరాము.సుబ్బారావుగారు మమ్మల్ని రిసీవ్ చేసుకొని హొటల్ రూమ్ లో దించారు.బాబుకు ఒళ్ళు శుభ్రంచేసి పాలు తాగించి పల్లవిని కూడా తయారుచేసాను.నేనున్నపుడే వీర్రాజు గారిని కూడా రిఫ్రెష్ అవ్వమన్నాను.తర్వాత తొందరగా తయారయ్యాను.అంతలో సుబ్బారావు గారు వచ్చి సభలు జరిగే వేదికకు తీసుకువెళ్ళారు.అప్పుడే ప్రారంభసభ మొదలైంది.జస్టిస్ అమరేశ్వరి ప్రారంభించారు.దేవులపల్లి రామానుజరావు గారు పుస్తకప్రదర్శన ప్రారంభించారు.
నేను చిన్నప్పటినుండి చదువుకున్న రచయిత్రులు వసఉంధరఆదఏవఇ, కె.రామలక్ష్మీ,లత,ద్వివేదుల విశాలాక్షి,ఆనందారామం,ఐవీఎస్ అచ్యుత వల్లీ ఇలా ఎందరో ఉన్న ఆ సభామందిరంలో నేను కూడా ప్రత్యేక ఆహ్వానితురాలిగా కూర్చున్నాను.ఒక ఉద్వేగం నన్ను ఆవరించింది.సాహిత్య అకాడమీ చైర్మన్ బెజవాడ గోపాలరెడ్డి గారు వచ్చేసరికి రచయిత్రులు అందరూ ఆయన దగ్గరకు వెళ్ళి పలకరిస్తున్నారు.నేను కుర్చీకి అతుక్కుపోయినట్లు కదలలేదు.రచయిత్రులనూ పలకరించలేదు.నాకున్నమొగమాటం,చొచ్చుకుపోయే స్వభావం లేకపోవటం ఒకకారణమైతే గత కొంతకాలంగా నాలో నేను కృంగి పోతున్న మానసిక స్థితిలో ఉన్నానేమో ఒక్కదాన్నే అలా ముడుచుకుపోయి కూర్చున్నాను. రెండవసమావేశంలో నేటికథ- తీరుతెన్నులు గురించి వసుంధరాదేవీ,ఆనందరామం మొదలైన రచయిత్రులు ప్రసంగాలు చేసారు.
సాయంత్రం నాలుగింటికి నన్ను తిరిగి రూమ్ కు దిగబెట్టారు .సుబ్బారావు గారు వీర్రాజు గారితో సభల విశేషాలు చెప్పి మాకు భోజనం ఏర్పాటు చేసి వెళ్ళారు.
భోజనం చేసాక పడుకుందామని పక్కమీద ఒరిగే సరికి బాబు కెవ్వున ఏడ్చి ఎప్పటిలాగే నీలమేఘ శ్యాముడు కావటమే కాకుండా ఒళ్ళంతా వేడిగా కాల్చినట్లుగా టెంపరేచర్ పెరిగి,వాంతులు చేసుకోసాగాడు.ఏంచేయటానికీ తోచక సుబ్బారావు గారికి కబురు పెట్టాము.రెండురోజులుగా సభలనిర్వహణలో అలసిపోయి కూడా పరుగున వచ్చి ఆ అర్థరాత్రి డాక్టరుదగ్గరకు తీసుకువెళ్ళటానికి సాయం చేసారు.
ఎలా అయితేనేం డాక్టరు మందు పడ్డాక పిల్లాడు మర్నాడు ఉదయానికి తేరుకున్నాడు.మేము కూడా కుదుట పడ్డాము.
మర్నాడు సభలకు నాకు వెళ్ళాలనిపించలేదు.నేను వెళ్ళాక మళ్ళీ బాబు ఇబ్బంది పెడతాడేమోనని ఒకవిధంగా నిర్వేదం ఆవరించి రూమ్ లోనే ఉండిపోయాను.వీర్రాజుగారు ఒకసారి వెళ్ళివస్తానని ఒక సదస్సుకు హాజరయ్యారు.
మూడోరోజు ముగింపు సభలకు ముందు కవిసమ్మేళనం అన్నారు.మూడోరోజు వీర్రాజు గారు తాను బాబును చూసుకుంటానని నన్ను పంపించారు.
కవిసమ్మేళనం ప్రారంభించారు.వేదిక మీద ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ,నాయని కృష్ణకుమారి, యశోదా రెడ్డి,లక్ష్మీరమణ,సి.వేదవతి,శారదా అశోక వర్ధన్,కుసుమారామారావు,చిరంజీవినీకుమారితో బాటు నేను ఆసీనురాలినై " పల్లకీ దిగిరా" అనే కవిత చదివాను.అప్పటికే లబ్దప్రతిష్టులైన వారితో కలిసి వేదిక పంచుకోవడం కవిత్వం చదవటం నాకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది.
అప్పటికి కవయిత్రుల కవితలలో ఇంకా అభ్యుదయ భావాలు అంతగా చోటు చేసుకోలేదు.అందుచేత నా కవిత ఆ వేదికపై కొత్తదనాన్ని ఇచ్చిందని అధ్యక్షురాలు ప్రశంసించారు.
మనసంతా హర్షాతిరేకాలుతో నిండి ఉప్పొంగిపోతున్న నన్ను గుత్తికొండ సుబ్బారావు గారు తిరిగి హోటలు రూముకి దింపారు.అప్పటికే వీర్రాజుగారు బాబుకి పాలు పట్టి నిద్రపుచ్చారు.ఏడేళ్ళ పల్లవి బాబు తాలూకు సామానులు సర్ది తాను కూడా మరోవైపు బాబు పక్కనే పడుకొని జోకొడుతోంది.
రచయిత్రులమహాసభలకు వెళ్ళి వచ్చాక ఒకింత ఉత్సాహం కలిగింది.అప్పటికే నాకథల్ని రంగు వెలిసిన బొమ్మ పేరుతో సంపుటిగా వేద్దామని సమకూర్చు కున్నాము.
కాని కవిత్వసమ్మేళనంకి వెళ్ళి తిరిగి వచ్చాక వీర్రాజు గారు"కథలు తర్వాత వేద్దాము.ముందు కవితా సంపుటిని వేద్దాము.కథలు కన్నా కవిత్వం కే తొందరగా గుర్తింపు వస్తుంది.నీకు వీలున్నప్పుడల్లా నీకవితల్ని ఫేయిర్ చెయ్యి."అన్నారు.
బాబు పడుకున్నప్పుడు కవితల్ని ఫెయిర్ చేసేదాన్ని. మొదటి పుస్తకం కనుక ముందుమాట ఎవరిచేతనైనా రాయించుకుంటే బాగుంటుంది అని అనుకున్నాము.కుందుర్తి చేతరాయించాలా,శివారెడ్డి చేత రాయిస్తే బాగుంటుందా అని ఆలోచించి అప్పటికే నాలుగు కవితా సంపుటాలు వచ్చి,కుందుర్తి స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకొని ప్రజాస్వామ్య కవిగా కవితారంగంలో ఒక స్వంత ముద్రతో దూసుకుపోతున్న కవి ఆయన.అందుకని శివారెడ్డి గారిచేతే ముందుమాట రాయిస్తే బాగుంటుందనుకున్నాము.
ఎట్టకేలకు కె.శివారెడ్డిగారి ముందుమాటతో నా మొదటి కవితాసంపుటి " ఆకలినృత్యం " వెలువడింది.రెండు రకాల ముఖచిత్రాలతో పుస్తకం వచ్చింది.ఒకటి ఎర్రని హేండ్ మేడ్ పేపరు మీద పసుపురంగులో పుస్తకానికి క్రాస్ గా అందమైన వీర్రాజు గారి ముద్రతో ఉన్న అక్షరాలు,మరొకటి కిందనుండి పైకి ఇంద్రధనుస్సులా రంగులహేలతో ఉన్న అట్టమీద శీర్షికతో ముద్దొచ్చేలా ఉన్న నా తొలి సంపుటిని ప్రేమతో వీర్రాజు గారికే అంకితం చేసాను.
యువకవులను ప్రోత్సహించేందుకు కుందుర్తి ఆంజనేయులు గారు ఒక ఉద్యమంలా పనిచేసారు.1967 నుండి ఫ్రీవర్స్ ఫ్రంట్ పేరిట తొలిరోజుల్లో 116 రూపాయల చొప్పున ఆ ఏడాది వచ్చిన కవితాసంపుటిని ఎంపికచేసి ఆ కవికి మనియార్డరు చేసేవారు కుందుర్తి గారు.మొదటి పురస్కారం వీర్రాజు గారి కొడిగట్టిన సూర్యుడు కి తీసుకున్నారు.
1980 సంవత్సరానికి దేవీప్రియ రాసిన " అమ్మ చెట్టు" కు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా ద్వితీయ స్థానంలో అమ్మంగి వేణుగోపాల్ - మిణుగురుని పేర్కొన్నారు. ఆ ఏడాది వచ్చిన కవితాసంపుటాలలో ఉత్తమమైనవిగా శీలా సుభద్రాదేవి -" ఆకలి నృత్యం"; గుంటూరు శేషేంద్ర శర్మ -సముద్రం నా పేరు; విహారి-చలనం; శశికాంత్ శాతకర్ణి-చంద్రజ్యోతి.అని పేర్కొంటూ పేపర్లలో ప్రకటన ఇవ్వటమే కాకుండా నాకు కుందుర్తి సంతకంతో లేఖ రావటం అపరిమితమైన ఆనందం కలిగించింది.
1983 కుందుర్తి గారి మరణానంతరం వారి కుమారుడు సత్యమూర్తి తండ్రి ప్రారంభించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు కొనసాగించాలని సంకల్పించుకుని వీర్రాజు గారిని సంప్రదించి తనకు చేదోడువాదోడుగా ఉండమని కోరారు.
వీర్రాజు గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ పగ్గాలు చేతిలోకి తీసుకోక ముందే కుందుర్తి గారు అందించిన ఈ గుర్తింపు నాకు మరువలేని అపురూప జ్ణాపకం.
బాబు తరుచూ అనారోగ్యానికి గురౌతున్నాడు.ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి. హాస్పిటల్స్ కి , డాక్టర్లు దగ్గరకు తిరగటం,ఒకవైపు వీర్రాజు గారి ఆఫీసు వాళ్ళు ఇస్తున్న మెమోలు,ఎంతో ముచ్చటపడి స్వంతంగా పెట్టిన వికాస్ వలన తలెత్తుతున్న సమస్యలు,అంతకంతకు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులూ మా ఇద్దరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.ఇక చివరికి పెట్టిన అయిదేళ్ళ సెలవు పూర్తికాగానే తిరిగి యథావిధిగా సమాచారశాఖ లో చేరటానికి నిర్ణయించుకున్నారు.
రాంకోఠీలో మేమున్న ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తుండటంతో తెలిసిన వారందరికీ ఇల్లు చూడమని వీర్రాజు గారు చెప్పారు. ఈలోగా పెద్దమరిది సీతాఫలమండీలో ఇల్లు చూసుకొని వెళ్ళిపోయాడు.అతను మూడోసారి మరో అమ్మాయికీ తండ్రి కూడా అయ్యాడు
వీర్రాజు గారికి మాకుటుంబానికీ ఆత్మీయ మిత్రులైన రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు కొత్తనల్లకుంటలో .ఫీవర్ హాస్పిటల్ పక్కగల్లీలో ఇల్లు చూసారు.పెద్దకాంపౌండులో RCC రూఫ్ తో అద్దెల కోసం రెండుమూడు పోర్షన్ లు ఉన్నాయి.ఇంటివాళ్ళు అక్కడే ఒక పెద్దింటి లో ఉంటారు.
సరే ఇంక సామానులు పేక్ చేయటం మొదలెట్టాము.మా పెద్దమరిది రామకృష్ణా,కుటుంబమిత్రుడు వీర్రాజు గారికి సోదరసమానుడైన మల్లేషు కాక యువకవులు కూడా ఒకరిద్దరు సహకరించారు.
సామాన్లు లారీకి వేస్తున్నసమయంలో వీధి గుమ్మం లో అలికిడికి బయటకు వచ్చాను.ఇద్దరు కోయదొరలు భిక్షం కోసం అడుగుతున్నారు.నన్ను చూడగానే " అమ్మ మాయమ్మ అంటూ ఒకసారి పొగడటమే కాకుండా "అమ్మా మాయమ్మ లచ్చిమి తల్లె ఏడేళ్ళు గా పీడిస్తున్న ఏలిన్నాటి శని ఇకనుంచి నిన్ను వదలిపోతుందమ్మ "అని నన్ను పట్టుకున్నారు.ఈలోగా వీర్రాజు గారు ఇద్దరికీ చెరో అర్థరూపాయి చేతిలో పెట్టి పంపించేసారు.
కోటికలల్ని మూటకట్టుకుని ఇష్టంగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నలుగురిలో ఉన్నా కూడా తనకి తాను కల్పించుకున్న ఏకాంతంలో కుంచె,కలంపట్టి తపోదీక్షలో ఉండే ఆయనలో చలనం కలిగించిన దాన్నే అయినా కానీ దేహసంతృప్తి మాత్రమే జీవితం కాదు గదా. ఆనందకర అనుభూతులకన్నా,క్షణక్షణం అంతకంతకూ కుంగదీసి నన్ను నాలోకి ముడుచుకు పోయేలా చేసిన అనుభవాలనే చవిచూపించిందీ ఇల్లు. కలమో,కుంచెనో పట్టుకొని ఇహపరాలను మర్చిపోయి తపోదీక్షలో మునిగిపోయే ఆ తపస్వే కాదు,నా వైపే చూస్తున్న పసిపిల్లలు కూడా నన్ను అల్లుకొని ఉన్నారు.
ఒక్కొక్కప్పుడు జీవితంపట్ల విరక్తి కలిగిన పరిస్థితుల్లో నన్నూ,చిన్నక్కనూ తన రెక్కలకింద పొదువుకొని కాపాడిన అమ్మ గుర్తుకు వచ్చేది.
లోపలికి వచ్చి పల్లవిని, బాబుని ఒళ్ళోకి తీసుకుని కోయదొరల మాటలు తలచుకొని పేలవంగా నవ్వుకున్నాను.
3, జులై 2023, సోమవారం
సంచిక లో కస్తూరి మురళీకృష్ణ గారు చేసినముఖాముఖి
1)Kasturi murali k: నది ప్రయాణం పుస్తకం తయారుచేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
జ) కొందరు సాహితీవేత్తలు పోయినప్పుడు పత్రికలూ,మీడియా, సామాజిక మాధ్యమాల్లో వారి ప్రతిభని ప్రశంసిస్తూ,సాన్నిహిత్యాలనీ వెల్లడిస్తూ వచ్చే వ్యాసాల్ని చదివినప్పుడు "మనకి శిష్య ప్రశిష్యులూ లేరు,హోదాలు అధికారాలు లేవు,ఎవరితోనూ లేని ప్రేమని ఒలకబోస్తూ మాట్లాడే చాతుర్యం లేదు కనుక మనం పోయినప్పుడు పత్రికల్లో ఏమూలో చిన్న వార్త వస్తుందేమో" అని గత కొంతకాలంగా వీర్రాజు గారు అంటుండేవారు.
అటువంటిది ఆయన పోయాక ప్రతీ ప్రింటెడ్, అంతర్జాల పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో,సందేశాలతో పుంఖానుపుంఖాలుగా ఆత్మీయంగా వ్యాసాలు వచ్చేసరికి ఈయనకి ఇంత ఫాలోయింగ్ ఉందా అని నేనూ,మా అమ్మాయి విస్తుపోయాము.
నాకు ఆత్మలు,మరోలోకం పట్ల నమ్మకాలు లేవు కానీ ఇంతమంది తనగురించి ఆర్తిగా రాస్తారని ఆయనకు ముందే తెలుస్తే ఎంత బాగుండును అని మనసులో అనుకొన్నాను.
యాభై ఏళ్ళకు పైగా అక్షరాలతో కలగలిసి మేమిద్దరం జీవించాము.ఈ నాడు నా మనసులోనే,నా ఆలోచనల్లోనే ఆయన ఉన్నారని అనుకుంటున్నాను.పుస్తక ప్రచురణ అంటే పులకరించి పోయే వీర్రాజు గారికి ఆయన గురించి వచ్చిన ఆత్మీయ వ్యాసాలన్నీ కలిపి వేసే సంకలనం కన్నా మేము అందించే గొప్ప నివాళి ఇంకేమిటి ఉంటుంది.అందుకే నదిలా గుంభనంగా, నదిలా ఆత్మీయంగా ఉంటూ, గోదావరిని ప్రేమించే,గోదావరి పరిసరాలను పదేపదే తలుచుకునే వీర్రాజు గారి కోసం ఇవన్నింటినీ కలిపి నదిప్రయాణంగా నిక్షిప్తం చేయటానికి పూనుకున్నాను
2)Kasturi murali k: పుస్తకం తయారీలో మీ అనుభవాలు?
జ) ఆయన పోయిన రోజునుండి ప్రచురితమైన వన్నీ ఎవరో ఒకరు నాకు వాట్సాప్ ద్వారా పంపుతునే ఉన్నారు.వాటినన్నింటినీ ఎప్పటికప్పుడు భద్రపరచుకున్నాను.తర్వాతర్వాత కూడా ఆ పది పన్నెండు రోజుల్లో ఫేస్బుక్ ల్లో దొరుకుతూనే ఉన్నాయి.అందువల్ల ఒక పద్ధతిలో వాటిని సమకూర్చటంతో అనేకసార్లు డీటీపి ఆయన్ని సంప్రదించవలసి వచ్చింది.అంతేకాకుండా వీర్రాజు గారి తోబుట్టువులలో మిగిలిన ఒకేఒక్క తమ్ముడిచేతా,వీర్రాజు గారి బాల్యమిత్రుడిచేతా వారి జ్ణాపకాలు రాయించి చేర్చటం అవసరం అని భావించి రాయమని కోరాను.అంతేకాక మా అమ్మాయి,మనవరాలు ఆయన గురించి తమ మనసులోని మాటని చెప్పుకోదగ్గ సందర్భం ఇదొక్కటే.అందుకే వారినీ రాయమన్నాను.కుందుర్తి ఆంజనేయులు గారి కుటుంబం మాకు అత్యంత సన్నిహితులు.వారి మనవరాలు కుందుర్తి కవిత మా ఇంట్లో పిల్లలాగే బాల్యం నుండీ తిరిగింది.అందుకే ఆ అమ్మాయిని రాయమని అడిగాను.అంతే తప్ప నాకై నేను సాహిత్య లోకంలో ఎవరినీ రాయమని కోరలేదు.అన్నీ ఏదో ఒక మాధ్యమంలో అందరూ వీర్రాజు గారిపై తమ అభిమానాన్ని,ఆత్మీయతను వెల్లడిస్తూ స్వచ్ఛందంగానే రాసారు.
3) Kasturi murali k: వ్యాసాల ఎంపికలో పాటించిన ప్రామాణికాలేమిటి?
జ) నిడివి ప్రామాణికంగానే వచ్చిన నివాళి వ్యాసాలను తీసుకున్నాను.చిన్నచిన్న
సందేశాలను తీసుకోలేదు. వరుసక్రమంలో కూడా సమగ్రంగా ఉన్న వ్యాసాలను,తర్వాత చిత్రలేఖనం మీదా, సంపాదకీయాలు,సందేశాలు,కుటుంబ సభ్యులు రాసినవిగా కూర్చాను.
4) Kasturi murali k: నిర్మొహమాటంగా చెప్పండి, వీర్రాజుగారు సాహిత్య ప్రపంచానికి ఎంతో సేవ చేశారు. ఎంతమందికో పలు రూపాల సహాయం చేశారు. అజాత శత్రువువారు. అత్యంత గౌరవనీయులు. కానీ, వారికి లభించాల్సినంత గుర్తింపు లభించిందంటారా? లభించకపోతే ఎందుకని లభించలేదు?లభిస్తే ఎలా?
జ) నిజమే వీర్రాజు గారు తన ఆరోగ్యాన్ని,తన కుటుంబాన్ని కూడా ఒకదశలో పట్టించుకోకుండా ( బహుశా కుటుంబాన్ని నేను చూసుకుంటాననే ధైర్యం తోటి కావచ్చు) మిత్రుల కోసం ,కేవలం పరిచయస్తులకోసం కూడా సమయాన్ని ,ధనాన్ని వెచ్చించిన రోజులు ఉన్నాయి.ఆయన మంచితనాన్ని,స్నేహధర్మాన్నీ చేతకానితనం గా పరిగణించి ఎక్సప్లాయిట్ చేసినవారూ ఉన్నారు.అవన్నీ నేను గానీ ఆయన గానీ ఏనాడూ పట్టించుకోలేదు.
కానీ సాహిత్య వ్యాసాలలో వీర్రాజు గారి కాంట్రిబ్యూషన్ ఉన్న సందర్భాల్లో కూడా ఆయనని పట్టించుకోనప్పుడు,ఆయన సాహిత్యాన్ని ప్రస్థావించని సమయాల్లో నైరాశ్యంలో మునిగిపోయే వారు.
తర్వాత్తర్వాత సాహితీవేత్తలు చిత్రకారుడిగా,చిత్రకారులు సాహితీ వేత్తగా భావించటం వలన రావలసినంత గుర్తింపు తనకి రాలేదని పలు సందర్భాల్లో వెల్లడించారు.
అంతేకాక కాలం మారిపోతున్న సందర్భాల్లో, ప్రాతినిధ్యాలు మారుతున్న సందర్భాల్లో ఏ వ్యక్తివలన ప్రయోజనం ఉంటుందో,ఎవరివల్ల అవార్డులు,గుర్తింపులు వస్తాయో వారి చుట్టూ ప్రపంచం తిరిగే రోజులివి. డిజిటల్ ముఖచిత్రాలు మొదలు కావటం తో వీరితో ముఖచిత్రాలు వేయించుకోటానికీ రావాల్సిన అవసరం తీరింది.
మా వలన ఏ ప్రయోజనం లేనప్పుడు దూరం కావటం సహజమే కదా?
అందులోనూ మేము ఇద్దరం కూడా చొచ్చుకుపోయి పరిచయాలు,స్నేహాలు పెంచుకోలేని మొగమాటస్తులం.అందుకే మేము మా మానాన రాసుకుంటూ ఉండటమే గానీ అవార్డులకోసం,గుర్తింపులు కోసం ఏనాడూ పాకులాడ లేదు. రచనలన్నీ పుస్తకం రూపంలో ఉంటే మా సాహిత్య సృజనని ఎవరో ఒకరు ,ఎప్పడో అప్పుడు మనసుకు హత్తుకోకపోరు అనే ఆశావహ దృక్పథం మాది.
5)Kasturi murali k: ఈ సంకలనంలో వున్న వ్యాసాలు వీర్రాజుగారి సాహిత్య వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించాయా? ఈ వ్యాసాలు స్పృశించని పార్శ్వాలేమిటి?
జ) నదిప్రయాణం లోని వ్యాసాలు కేవలం వారి మరణానంతరం వీర్రాజు గారి స్మరణలో రాసినవి కనుక వీటిలో ఎక్కువగా ఆయన వ్యక్తిత్వం,స్నేహధర్మం,మంచితనం,అభిమానం తెలియజేసేవి లాగానే ఉండటం సహజం.వీటిలో సాహిత్య వివేచన ఉంటుందని ఆశించనవసరం లేదనుకుంటాను. సాహిత్యం,చిత్రలేఖనం గురించి స్పర్శించడం మాత్రమే జరిగింది.
అయితే ఒకప్పుడు కడియాల రామ్మోహన్ రాయ్,వడలిమందేశ్వరరావు,కోవెల సంపత్కుమారాచార్య,ఆంవత్స సోమసుందర్ గారి వంటి విమర్శకులు ఎవరిదైనా పుస్తకం అందుకోగానే వాళ్ళకు నచ్చితే ఆ కవి పెద్దవాడైనా, యువకవులే ఐనా చక్కటి వ్యాసం రాసి పత్రికలకు పంపేవారు.
ఆ విధంగా వీర్రాజు గారి తొలి రచనల నుండి ప్రచురితం అయిన వ్యాసాలను, సుదీర్ఘ సమీక్షలనూ సుమారు డెబ్భైకి పైగా ఏర్చికూర్చి డా.నాళేశ్వరం శంకరంగారి సంపాదకత్వం లో 2007 లో " శీలావీర్రాజు కలంచిత్రాలు" పేరిట సంకలనం వచ్చింది.అందులో వీర్రాజు గారి సాహిత్య విశ్లేషణ సంపూర్ణంగా వచ్చింది.
అదే విధంగా నా రచనలపై కూడా ప్రచురితమైన నలభై రెండు వ్యాసాలను, సుదీర్ఘ సమీక్షలనూ " గీటురాయి పై అక్షరదర్శనం" పేరిట 2016 లో వీర్రాజు గారు సంకలనం చేసారు.
6)Kasturi murali k: నిజానికి ఈ సంకలనంలో యాభై నాలుగుపైగా వ్యాసాలున్నా, అనేకం శ్రద్ధాంజలి సమర్పించినవవటంతో వాటి పరిధి పరిమితమయిందనిపిస్తుందన్న విమర్శకు మీ స్పందన ఏమిటి?
జ) కొంత వరకూ పై ప్రశ్నకు సమాధానమే దీనికి వర్తిస్తుంది.
మీరు అన్నట్లు ఆత్మీయులు, స్నేహితులు, బంధువుల శ్రద్ధాంజలికి పరిమితం అయినదే.ఆయన అనుకున్నట్లు కుల మత ప్రాంతీయవివక్షతలతో అందరూ దూరమయ్యారు అని గత కొంతకాలంగా గా బాధపడిన వీర్రాజు గారికి "మిమ్మల్ని ఎవరు దూరం చేసుకోలేదు సుమా" అని ఇప్పుడు నా ఆలోచనల్లో, నాలో ఉన్న వీర్రాజు గారికి ఉపశమనం గా అందించిన ఆత్మీయ నివాళే ఈ నదిప్రయాణం.
7)Kasturi murali k: ఈ పుస్తకం ద్వారా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? మీ లక్ష్యం ఏమిటి?
జ) వీర్రాజు గారు సంపూర్ణ జీవితాన్ని తాను ఎలా జీవించాలని అనుకున్నారో అదే విధంగా జీవించారు. తాను చిత్రకళా అభ్యసించిన జన్మస్థలం రాజమహేంద్రవరంలోని దామెర్ల రామారావు కళానికేతన్ కి తన జీవితకాలంలో వేసిన డెభ్భై ఎనిమిది తైలవర్ణ చిత్రాలను మార్చి 2022లోనే చిత్రకళాభిమానులకోసం అంకితం చేసి, గోదావరి నదిని,పోలవరం పరిసర ప్రాంతాలను కళ్ళనిండా నింపుకొని తర్వాత రెండు నెలలకే సంతృప్తి గా నిష్క్రమించారు. . వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సమావేశానికి కేవలం ఫోను ద్వారా పంపిన నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సుమారు రెండువందలమంది ఆత్మీయుల సమక్షంలో ఈ పుస్తకావిష్కరణలని ఒక సెలబ్రేషన్స్ గా జరపాలని నిశ్చయించుకొన్న నా లక్ష్యం నెరవేరింది.
8)Kasturi murali k: శీలావీర్రాజు గారు ఎప్పుడూ సన్మానాలు, ఆర్భాటాల జోలికి వెళ్ళలేదు. నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ వెళ్ళారు. వారి నిష్క్రమణ తరువాత సాహిత్య ప్రపంచం స్పందన గురించి మీ స్పందన?
జ) నాలుగవ ప్రశ్న జవాబే దీనికి సరిపోతుందను కుంటాను.
9)Kasturi murali k: ఇటీవలి కాలంలో ఒక సాహిత్యవేత్త మరణం తరువాత అతని స్మృతిని సజీవంగా వుంచే బాధ్యత సాహిత్య ప్రపంచంకాక, ఆ సాహిత్యవేత్త కుటుంబ సభ్యులే నిర్వహించాల్సివస్తోంది. ఉదాహరణకు ఘండికోట బ్రహ్మాజీరావుగారు.పురాణం సుబ్రహ్మణ్య శర్మ, పురాణం శ్రీనివాస శాస్త్రి తదితరులు. శీలా వీర్రాజు గారి మరణం తరువాత కూడా ఆయన స్మృతి సజీవంగా వుంచే బాధ్యత మీరే స్వీకరించాల్సివస్తోంది. ఇలాంటి పరిస్తితి ఎందుకని నెలకొంటున్నదంటారు? ఈ పరిస్థితి మారి, సాహితీవేత్త స్మృతిని సాహిత్య ప్రపంచమే సజీవంగా నిలిపే పరిస్థితులు నెలకొనాలంటే ఎంచేయాలంటారు?
జ) ఎందరో ప్రముఖ సాహితీవేత్తలు మరణించాక వారు కుటుంబ సభ్యులకు సాహిత్య వాసనలు లేకపోతే నెలలోపునే వాళ్ళపుస్తకాలు,ముమెంటోలు తూకానికి అమ్మేయడం కూడా చూస్తునే ఉన్నాము.
కుటుంబ సభ్యులకు సాహిత్యం పట్ల అభిరుచి,గౌరవం ఉన్నప్పుడు ఆ సాహితీస్మృతి ఆ యింట సజీవంగా ఉంటుంది.ఎవరి పుస్తకాలు వాళ్ళే మోసుకు తిరగాల్సి వస్తోన్న ఈ రోజుల్లో సాహిత్య ప్రపంచాన్ని ఆశించటం వ్యర్థమేనేమో.
నిజానికి సాహితీవేత్తల స్మృతిని,శతజయంతులనూ నిర్వహించి, మోనోగ్రాఫ్ లు రాయించి వారిని సజీవంగా ఉంచగలిగేది కేంద్ర,రాష్ట్ర సాహిత్య అకాడమీలు.అయితే అవన్నీ కమిటీసభ్యుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి జరుగుతాయి.
10)Kasturi murali k: ఒక కవిగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?
జ) మొదటినుంచీ నా సాహిత్య సృజన విస్తృతంగా నే సాగుతోంది.చాలా ఎక్కువగా చదువుతాను.అలాగే యాభై ఏళ్ళుగా రాస్తూనే ఉన్నాను.గత అయిదారు ఏళ్ళుగా ఇంచుమించు ప్రతీనెలా ఏదో ఒక రచన ప్రచురితమౌతూనేఉంది.రెండున్నర సంవత్సరాలుగా నెచ్చెలి అంతర్జాల పత్రికలో నా ఆత్మకథ రాస్తున్నాను.
ఓ నాలుగు పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.వీలు వెంట ప్రచురించుకోవాలి.
నా ఆలోచన అలసిపోలేదు,నేనూ అలసిపోలేదు,నా కలం అలసి పోలేదు.కొనసాగుతూనే ఉంటుంది.
11)Kasturi murali k: శీలావీర్రాజుగారి రచనలను సజీవంగా నిలిపే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?
జ) వీర్రాజు గారు ఉన్నప్పుడే వారి రచనలన్నీ గ్రంథరూపంలోకి వచ్చాయి.
ఆయన వేసిన తైలవర్ణ చిత్రాలు కుంచె ముద్రలు,చిత్రకారీయం పేరిట రెండుసంపుటాలుగా వచ్చాయి.లేపాక్షి శిల్పాల స్కెచ్ లు శిల్పరేఖ పేరుతో ప్రచురించారు.
వారి చిత్రలేఖనం మీద ప్రముఖులు రాసిన వ్యాసాలు ప్రచురించటానికి రెడీగా ఉన్నాయి.అవి గాక వీర్రాజు గారు వెయ్యికి పైగా ముఖచిత్రాలు వేసారు వాటిని పుస్తకం గా వేయాలని ఉంది.అవి కలర్స్ లోనే వేయాలి కనుక ఆర్థికంగా భారమే కానీ వీలువెంట వేసే ప్రయత్నం చేస్తాను.
12)Kasturi Murali Krishna:ఆయన రచనల గురించి విశ్లేషణలు చేయించి ప్రచురించటం,
జ)పైన అయిదవ ప్రశ్నలో తెలియజేసాను
13) అవార్డులివ్వటం లాంటివి......
జ) వీర్రాజు గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు నడిపిన రీతిలో ప్రతిష్టాత్మకంగా ఇవ్వాలని ఉంది.ఏప్రక్రియకు,ఏరంగానికి ఇవ్వాలి అనేది ఇంకా నిర్ణయం కాలేదు.
ఈలోగా రాజమహేంద్రవరంలోని చిత్రకళానికేతన్ లో సాయంత్రం పూట పిల్లలు వచ్చి నేర్చుకోవటం చూసాను.అందుకని వాళ్ళని ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాదీ పోటీ పెట్టి మా కుటుంబసభ్యుల పర్యవేక్షణలో బహుమతులు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాము.
14)Kasturi murali k: ఈ సంకలనంలోని వ్యాసాల్లో మీకు వ్యక్తిగతంగా నచ్చినవ్యాసం ఏమిటి?
జ) సగం వరకూ వ్యాసాలు బాగున్నాయి.అయిదారు వ్యాసాలు నాకు బాగా నచ్చాయి.కొన్నివ్యాసాలు బయోడేటా ఆధారంగానే రాసినట్లు ఉండటంతో విషయం చర్వితచర్వణంగా ఉన్నాయి.
అయితే మీరు ఒక్కటే చెప్పమన్నారు కనుక నందిని సిధారెడ్డిగారి వ్యాసం చాలాబాగుంది.
జీవించాలంటే.....
~~ జీవించాలంటే.....~~
జీవితాలకేం ప్రయాణిస్తూనే ఉంటాయ్
ఒక్కోసారి సెకెన్ల ముల్లులా పరుగులుతీస్తాయ్
మరోసారి నిమిషాలముల్లుతో పాటు
ఆచితూచి అడుగులు వేస్తూ
గంటలముల్లుతో బధ్ధకంగా
సోమరిగా కదులుతూ
కాలంతో పాటూ నడుస్తూనే ఉంటాయి.
ఈ మనసే పరమదుర్మార్గపుది
జ్ణాపకాలపుట్టని నిరంతరమూ తవ్వుతూ
జీవితం ముంగిట్లో ఆశలచెట్టు మొదల్నే
సారవంతం చేస్తున్నానంటుంది
కానీ కాసిని చిరునవ్వు పువ్వుల్ని
ఎప్పుడో గానీ పెదాలమీద అలంకరించదు
జీవితంతో చేయి చేయి కలిపి
ఈ మనసు నడవకుండా
నడక దారంతా ముళ్ళు రాలుస్తూ
సాల్వడార్ కరిగిపోతున్న కాలం గురించి
కథలు కథలు గా చెప్పి
నిరుత్సాహపు పొరల్ని
కళ్ళ మీద పరిచి చెలమల్ని అద్దుతుంది
ఎప్పుడో ఒకప్పుడు సమయం చూసి
ఈ దుర్మార్గపు మనసుని
ఒడుపుగా బంధించాలి
ఆలోచనల్ని ఎగిరిపోనీయకుండా
పిడికిట పట్టి మనసులో ఒంపి
పెంపుడు పిల్లిని చేసి మనవెనకే తిప్పుతూ
పక్కదార్లు పట్టనీకుండాచేయాలి
ఇక ఆ తర్వాత
జీవితంతో చేతులు కలిపి నడవాల్సిందే
తప్పదు గాక తప్పదు.
(ప్రజాశక్తి సాహిత్య పేజీ 3/7/23)
27, జూన్ 2023, మంగళవారం
కవన శర్మ గారి " ఆమెయిల్లు" కథపై నా స్పందన
కవనశర్మ గారి కథ "ఆమె యిల్లు"
ఈ కథ నిజానికి రచయిత్రుల కలం నుంచి రావాల్సిన కథ.ఒక రచయిత స్త్రీ మనసులోని అంతర్మధనాన్ని పట్టి చూపిన కథ.
పాతికేళ్ళకు పైగా కాపురం చేసి కొడుకు వివాహం కూడా అయ్యాక ఉద్యోగం చెయ్యాలనుకోవటమే కాక తనకంటూ ఒక ఇల్లు కేవలం నాయిల్లు అని చెప్పుకోవాలనీ ఆ ఇల్లు అద్దె యిల్లైనా సరే కావాలని అభిలషించటమే కాక పట్టు పట్టి భర్త ,కొడుకూ, తమ్ముళ్ళ మాటలను పెడచెవిన పెట్టి అనుకున్నది సాధించిన కమల కథ.
అలా ఆ వయస్సులో ఎందుకు అనుకుంది? ఎప్పటి నుండి పుట్టిల్లు అయిన తండ్రి ఇల్లు కానీ, తండ్రి తదనంతరం ఆయింటికి హక్కుదారుడైన తమ్ముడి ఇల్లు కానీ,పాతికేళ్ళకు పైగా భర్తతో కాపురం చేసి భర్తకే కాక చాకిరి చేసిన ఆయింటిని గానీ,తొమ్మిదినెలలు మోసి కనిపెంచిన కొడుకు ఇంటిని గాని తన ఇల్లు గా కమల ఎందుకు భావించలేక పోయింది. ఆమె మనసు నొచ్చుకున్న కారణం ఏమిటి అనేది ఆమెయిల్లు కథ. ఈ కథలో కమల చిన్నప్పటినుండి ఒక్కొక్కపొరనే విప్పుతున్నట్లుగా చెప్పిన విషయాలూ,చెప్పిన విధానమూ కథని చదివినప్పుడు,లేదా విన్నప్పుడు పాఠకులకు మనసులోకి సూటిగా బాణంలా దూసుకుపోతాయి.
నిజానికి ప్రతీ మహిళా తన జీవితకాలంలో కమల చెప్పినటువంటి సంఘటనలు తప్పక ఎదుర్కొనే ఉంటుంది.అందులో మనం కూడా మినహాయింపేమీ కాదు.మనం కూడా ఒక్కొక్కప్పుడు నొచ్చుకున్న అనుభవాలూ మనసులో మెదులుతాయి.పెళ్ళి కాకముందు కొంతవరకూ మనయిల్లు అనే భావించినవాళ్ళం పెళ్ళైయ్యాక పుట్టింటికి అతిథులం అయిపోతాం.అదే విధంగా ఉద్యోగం చేస్తున్నవాళ్ళు కూడా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నీడబ్బూ,నాడబ్బూ అనే లెక్కలే తప్ప భార్యాభర్తల మధ్ర్య కూడా మనడబ్బు అనుకోలేకపోవటం,తద్వారా వచ్చే భేదాభిప్రాయాలు మనకి తెలుసు.ఇలా ఎన్నో మనల్ని కథలో మమేకం చేస్తాయి.
అయితే కమలలా నిర్ణయం తీసుకోకపోవటానికి కారణం ఏమిటి? మనవారి మీద ప్రేమా? భద్రజీవితం మీద మోహమా? అభద్రతా భావమా?కథ నేను చెప్పను. మిత్రులారా కథ విని మీరు కూడా ఆలోచించండి.
నడక దారిలో -- 30
నడక దారిలో -30
సభలకు గానీ సినిమాలకు గానీ ఎక్కడకీ వెళ్ళాలనే ఉత్సాహం తగ్గిపోయింది.ఇంటికి దగ్గరగా ఉన్న పరిషత్తు భవనంలో జరిగే యువభారతి మీటింగులకు కూడా వెళ్ళటం లేదు.వీర్రాజుగారు ఒక వైపు తన స్వంత కార్యాలయం వికాస్ కి వెళ్ళటం, వచ్చినతరువాత కవులు రచయితల పుస్తకం ముఖచిత్రాలు, కుదిరినప్పుడు యథావిధిగా సభలూ , సమావేశాలతో బిజీగా ఉంటున్నారు.
ఒకసారి తప్పని పరిస్థితుల్లో బంధువుల ఇంటికి ఏదో ఫంక్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది."ఇలాంటి అనారోగ్యపు మగపిల్లాడి కన్నా ఆడపిల్లలుండటం నయం"అని అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తోడికోడలు అంది.ఆమెమాటలు నిజానికి ఉన్న మాటలే అయినా మనసు బాధగా మూల్గింది.దాంతో నేను పూర్తిగా ఎక్కడికీ ఎవ్వరి ఇంటికీ వెళ్ళటం మానేసాను.మాయింటికి కూడా ఏడాదికో రెండేళ్ళకో నెలరోజులపాటు వచ్చి ఉండే మా పెద్దాడబడుచు కుటుంబం రావటంలేదు.మా మరదులకుటుంబాలూ రావటం మానేసారు.పెద్దమరిది మాత్రం అవసరమైనప్పుడు పిల్లల ఫీజులకనో, ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదనో అన్నగారిని డబ్బు అడగటానికి వస్తుంటాడు.
పల్లవి బడికి వెళ్ళేక నేను వంటా,ఇతరపనులు పూర్తి చేసుకునే వరకూ బాబును ఆయన చూసుకునేవారు.
ఆయన వికాస్ ఆఫీసుకు వెళ్ళాక టేప్ రికార్డర్ లో లలితసంగీతం కేసెట్ లు పెట్టుకుని వచ్చిన పాటల్ని దానితో పాటూ మెల్లగా రాగాలు తీసుకుంటూ,విషాద పాటలు మనసుని మరింత భారం చేస్తే సజలాలైన కళ్ళతో బాబుని చూసుకుంటూ మౌనంలోకి జారిపోయే దాన్ని.
వీర్రాజు గారి దగ్గరకు ముఖచిత్రాలు వేయించుకోవాలని వచ్చే కవులతోనో
,వారి మిత్రులతోనో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న కొత్తగా రాస్తున్న కవులు కూడా వచ్చేవారు.వాళ్ళని చూస్తే నాకు చదువుకోవాలనే కోరిక మళ్ళా తొలచటం మొదలైంది.
ఒకరోజు ఆయనతో "నేను దూరవిద్య ద్వారా ఎమ్మే చదువుకోనా" అని అడిగాను.ఆయన ఆశ్చర్యపోయి "ఈ స్థితిలో బాబుతో....అయినా..కవిత్వం రాయటం తగ్గి పోతుందేమో"అన్నారు.
"అందుకే చదవాలని ఉంది.చదువులో పెడితే ఈ డిప్రెషన్ తగ్గుతుందేమో.తెలుగు ఎమ్మే అయితే ఎక్కువ కష్టం పడక్కర్లేదు కదా"అన్నాను. ఆయన ఏమీ మాట్లాడలేదు.
తన దగ్గరకు వస్తున్న చదువుతున్న కుర్రాళ్ళను అడిగారు.బహుశా వాళ్ళలో సిధారెడ్డి,శంకరం మొదలైన వారు ఉండేఉంటారు నేను ఆ పరిస్థితుల్లో ఎవరితోనూ మాట్లాడేటంత వెసులుబాటు లేదు,మనసూ లేదు.
ఏమైతేనేం వాళ్ళు అప్లికేషన్ తీసుకువస్తే నింపిన తర్వాత ఆయనవెళ్ళి ఫీజు కట్టి వచ్చారు.కానీ స్టడీ మెటీరియల్స్ తేలేదు.సిలబస్ మాత్రమే ఉంది.ఇంట్లో యువభారతి ప్రచురణలు ఉన్నాయి.ఆరుద్ర సమగ్రాంధ్ర సంపుటాలు ఉన్నాయి.బాబు పడుకున్న సమయంలో నాకు కావలసిన విధంగా సిలబస్ ని బట్టి నోట్సులు తయారు చేసుకున్నాను.
కానీ తరుచూ అనారోగ్యం పాలు అవుతున్న బాబుతో చదవటం ఇబ్బందిగా ఉన్నా నేను సమయం దొరికినప్పుడల్లా పుస్తకం తిరగేస్తూనే ఉన్నాను.
నాలుగింటికి పల్లవి స్కూలునుంచి వచ్చాక ఏదో తినటానికి ఇచ్చి హోంవర్క్ చేయించటం,చదివించడం చేసేదాన్ని. బాబుని పడుకోబెట్టేటప్పుడు నేను లలితగీతాలు పాడుకుంటూ రాగాలు తీస్తుంటే పల్లవి కూడా గొంతు కలిపేది.ఎక్కడా అపశృతి లేకుండా పాడుతున్న పల్లవిని చూసి సంగీతం నేర్పిస్తే బాగుండును అనుకునేదాన్ని.ఇంటికి దగ్గరలోనే సంగీత కళాశాల ఉన్నా తీసుకెళ్ళటం,తీసుకురావటం నాకు కష్టం అని ఊరుకున్నాను.
దూరవిద్య లో ఎమ్మే పరీక్షలు రాసేవాళ్ళ కోసం యూనివర్సిటీ వాళ్ళు పరీక్షలకు ముందు పదిహేను రోజులు ఓరియంటేషన్ క్లాసులు ఏర్పాటు చేశారు.కాని పదిహేను రోజులపాటు పిల్లాడిని వదిలి రోజంతా క్లాసులకి వెళ్ళే పరిస్థితి లేదు కనుక వెళ్ళలేదు.
పరీక్షలు సమయానికి అమ్మని సాయానికి రమ్మన్నాను.ఇంటికి దగ్గరలోనే ఉన్న రెడ్డి కాలేజీ లోనే సెంటర్ పడింది.బాబుకి అన్నం తినిపించి నేను పరీక్షకు వెళ్ళాను.
పరీక్ష హాలుకు వెళ్ళటానికి మెట్లు ఎక్కుతుంటే "చిన్నపాపాయీ నువ్వేనా" మెట్లపైన ఒక ఆమె పలకరించింది.
నన్ను చిన్నపాపాయీ అని పిలిచేదెవరాఅని ఆశ్చర్యంగా చూసాను.నాచిన్ననాటి స్నేహితురాలు రోణంకి అప్పలస్వామి గారి చిన్నమ్మాయి లలిత.
ఇద్దరం సంబరంగా చేతులు కలుపుకొని పరీక్ష సమయం అయిపోతుందని పరీక్ష అయ్యాక కలుద్దామనుకున్నాము.
పరీక్ష రాసిన తర్వాత కాసేపు ఇన్నాళ్ళ కబుర్లు చెప్పుకొని మర్నాడు తొందరగా వచ్చి మాట్లాడు కుందామని వీడ్కోలు చెప్పుకున్నాము.
లలిత కొత్తగూడెంలో ఉంటుందట.వాళ్ళాయన చిన్నప్పటినుండి అనుకున్న మేనత్త కొడుకూ, అప్పట్లో మాకందరకూతెలిసిన పెద్దబాబే.అతను రామగుండం లో ఇంజనీరుగా పనిచేస్తున్నాడనీ,లలిత కూడా అక్కడే స్కూల్ లో టీచరుగా పనిచేస్తున్నానని చెప్పింది.మా బాబు సంగతి తెలిసి బాధపడింది.
మొత్తం మీద ఎమ్మే మొదటి సంవత్సరం పరీక్షలు నిర్విఘ్నంగా పూర్తి చేసాను.పరీక్షలు అయ్యాక అమ్మ అక్కయ్య వాళ్ళింట్లో ఓ వారంరోజులు ఉండి విజయనగరం వెళ్ళిపోయింది.
స్వాతి పత్రిక వాళ్ళు విజయవాడ వెళ్ళిపోవటంతో మా కాంపౌండ్ లోనే ఉన్న రంగారావు గారు ఆ గదిని తీసుకున్నారు.అయితే రంగారావు గారి మిత్రుడు భక్తవత్సలం అనే స్వర్గం నరకం ఫేం మోహన్ బాబు,అతని సహనటి అయిన సరోజ వగైరాలతో సహా ఆ గదిలో రాత్రి అయ్యేసరికి చేరి రాత్రంతా పార్టీలు చేసుకుని రచ్చరచ్చ చేసేవారు.ఆ గది మాకు పక్కనే ఉండటాన రాత్రంతా ఆ వాసనలు,ఆ గందరగోళాలూ మాకు న్యూసెన్స్ గా మారింది.
ఒకరోజు సినిమాకు వెళ్ళొచ్చి "సినీమా చాలా బాగుంది.మంచిపాటలూ,డాన్సులు నీకు ఇష్టం కదా రేపు మనం వెళ్దామా" అన్నారు.బాబును తీసుకొని వెళ్ళటానికి నేను వెనకా ముందు అయ్యాను.కానీ పర్వాలేదంటూ తీసుకువెళ్ళారు.ఆ సినీమా శంకరాభరణం.
కూనిరాగాలకే పరిమితమైన నా కంఠానికి ఒక ఊపును ఇచ్చింది శంకరాభరణం చిత్రం.బాబుని పడుకోబెడుతూ అందులో పాటలన్నీ పాడుకునే దాన్ని.నేను పాడగా విని పల్లవి కూడా ఆ పాటలన్నీ చక్కగా పాడేది.ఒకవిధమైన దిగులు, నిస్తేజం అలుముకున్న ఇంటిలో మా రాగాలు సీతాకోకచిలుకల్లా అప్పుడప్పుడు ఎగురుతున్నాయి.
అంతకుముందు రాసిన కథలు ప్రచురితం అయిన రోజు ఉత్సాహం మనసునిండా ఊపిరులూదుతుంది.నెలలు గడుస్తున్నా,ఏడాదులు దొర్లుతున్నా ఎదుగు బొదుగూరెండేళ్ళు దాటినా బోర్లా పడటం తప్ప మరేమీ చేయ లేని బాబుని చూసేసరికి దుఃఖం గుండెనిండా మబ్బులా కమ్మేస్తుంది.
కవిత్వరంగంలో ఒకవైపు విరసం ప్రభావంతో ఉరకలెత్తే ఉత్సాహంతో రాస్తున్న కవులకు కుందుర్తి పిలుపు అందుకొని వచన కవిత్వం కలగలిసి ఉవ్వెత్తున కవిత్వం వస్తోంది.
వీర్రాజు గారు వేస్తున్న వచనకవిత సంపుటాల ముఖచిత్రాలు చూస్తుంటే మనసు మూగపోతోంది. నేను రాయటం మొదలు పెట్టిన రోజుల్లోనే సాహిత్యం లోకి వచ్చినవాళ్ళంతా చకచకా ఎదిగిపోతున్నారు.నేను అంతకంతకూ నాలోకి నేను కూరుకు పోయి కకూన్ ను అయిపోతున్నానన్న భావం నన్ను కుంగదీస్తోంది.
వీర్రాజు గారికి తనని తాను ఉత్సాహం పరచుకోటానికి తన పుస్తకాలు ప్రచురించుకోవటం ఒక అలవాటు.ఆ రకంగా నా లోకి నేను ముడుచుకు పోవటం చూసి నా కథలను పుస్తకంగా వేయాలని తలపెట్టారు.కథలన్నీ ఒకచోట చేర్చి అందులో అంతగా పరిణితిలేని కథలుగా అనిపించినవి తీసివేసాము.రంగు వెలిసిన బొమ్మ అని శీర్షికతో ఫైల్ చేసాము.
ఈలోగా మేము ఆ ఇంట్లోకి వచ్చి పదేళ్ళు దాటిపోవటంతో ఇల్లుగల ఆయన మమ్మల్ని ఖాళీ చేయమని ఒత్తిడి తేవటం మొదలెట్టాడు.ముందు అద్దె ఇవ్వటం లేదని కోర్టుకు వెళ్తానని బెదిరించబోయాడు.తర్వాత ఎదురు డబ్బు ఇస్తానని కాళ్ళబేరంకి వచ్చాడు.కానీ వీర్రాజు గారు వికాస్ ఆఫీస్ దగ్గరలో ఉండటం,బాబు అనారోగ్య కారణాలవలన ఇల్లు దొరుకుతే ఏడాది లోపునే ఖాళీ చేస్తామని చెప్తే అంగీకరించాడు.
28, ఏప్రిల్ 2023, శుక్రవారం
నడక దారిలో --29
నడక దారిలో --29
వీర్రాజు గారు ఉద్యోగానికి సెలవు పెట్టి వికాస్ అనే అడ్వర్టైజ్ ఆఫీసు పెట్టినా పెద్దగా సంపాదించినది ఏమీలేదు.ఆర్ట్ వర్క్ అంతా వీర్రాజుగారూ ,బైట తిరిగి వర్క్ సంపాదించడమే కాక ఆర్థిక వ్యవహారాలు స్నేహితుడు రావు చూసుకుంటున్నారు.వర్క్ బాగానే వస్తోంది.వీర్రాజు గారికి డబ్బు అడగటం మొగమాటం కనుక స్నేహితుడు వెళ్ళి కలెక్ట్ చేస్తాడు.'ఢిల్లీనుండి వచ్చేసాం ఇక్కడా ఇబ్బందులు తప్పలేదు' అన్నట్లుగా స్నేహితుని కుటుంబం వాపోతుంటారు. వీర్రాజు గారికి అతన్ని పిలిపించి ఈ ఏజెన్సీ పెట్టటం పొరపాటు చేశానేమోననే అంతర్మధనం మొదలయ్యింది.అంతేగాక డబ్బు గోల్మాల్ అవుతున్నట్లు కొందరు మా ఆత్మీయులైన వారు చెప్పటం, ఆధారాలూ కనిపిస్తుండేసరికి స్నేహితుడిని ఖచ్చితంగా అడగలేక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఒక వైపు ఆఫీసువాళ్ళు సెలవు పెట్టి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం పై మెమోలు పంపసాగారు.అయిదేళ్ళ సెలవు కాలం పూర్తి చేయాలని,లేదా వాలంటరీ పెట్టేయాలనే ఆలోచనలో సతమతం అయ్యారు.
ఎప్పటిలాగే పురిటి సమయానికి అమ్మ వచ్చింది.నాకు నెలలు నిండి మంచి రంగుతో,దట్టమైన ఉంగరాలజుట్టుతో అందాలబాబు జన్మించాడు.పల్లవికూడా ఆడుకోడానికి తమ్ముడు తోడు దొరికాడని మురిసిపోయింది.
ఇంతవరకూ వీరి అన్నదమ్ములు అందరికీ ఆడపిల్లలు కావటంచేత కుటుంబానికి మొదటి మనవడు అని వీర్రాజు గారు ముచ్చట పడ్డారు.చైతన్య అని పేరు పెడదాం అన్నారు.
మా మామయ్యకు డిప్యూటీ డైరెక్టర్ గా బాపట్ల నుండి హైదరాబాద్ కి బదిలీ అయ్యింది.అక్కయ్యకి బాపట్లలో సాహిత్యం, సమావేశాల్లోనే పోలాప్రగడ దంపతులతో స్నేహం ఉండేది. పోలాప్రగడ గారికి మలకపేట బ్రహ్మానందకాలనీలో ఒక అపార్ట్మెంట్ ఉందని అది ప్రస్తుతం ఖాళీగా ఉందనీ,మీరు కావాలంటే అద్దెకు ఉండొచ్చని పోలాప్రగడ దంపతులు చెప్పటంతో సంతోషంగా అందులో అద్దెకి దిగటానికి అక్కయ్య వాళ్ళు నిర్ణయించుకున్నారు.
వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారంటేనే నాకు కొండంత ధైర్యం వచ్చింది..
వేసవి సెలవుల్లో చిన్నక్క పిల్లలిద్దరినీ తీసుకుని హైదరాబాద్ అక్కయ్య ఇంటికి వచ్చేది.వాళ్ళు వస్తే పల్లవికి సంబరం.అప్పుడప్పుడు రిక్షా మాట్లాడుకొని పల్లవిని ,బాబుని తీసుకొని వెళ్ళే దాన్ని.ఇద్దరు అక్కయ్యల పిల్లలతో పల్లవి ఆడుకునేది.
ఒక రోజు పిల్లల్ని తీసుకొని రేడియోలో పిల్లలు కార్యక్రమంలో పాటలు,పద్యాలూ పాడించే వాళ్ళం.
అక్కయ్యా ఇంట్లో నేను ఓ రెండు రోజులు ఉండి పల్లవిని ఓ వారం రోజులు అక్కడే వదిలి వచ్చేసేదాన్ని.
మా యింటికి కూడా చిన్నక్కనీ పిల్లల్ని రమ్మనేదాన్ని.కానీ ఆ పిల్లాడితో చేసుకోలేక పోతున్నావు.ఇక్కడ కలిసాము కదా అని అనేది.
హైదరాబాద్ దూరదర్శన్ సాయంత్రం పూట తెలుగు కార్యక్రమాలు మొదలు పెట్టింది.ఆ క్రమంలో ఆదివారాలు విజయావారి సినీమాలు వేస్తున్నారని తెలిసి పొరుగుఇంట్లో ఉండే లలిత తనతో పల్లవిని అప్పుడప్పుడు పక్క కాంపౌండ్ ఉండే ఎవరింట్లోనో టీవీ ఉంటే తీసుకు వెళ్ళేది.లలితా, ఆంజనేయులు గారు ఇద్దరూ పల్లవిని బాగా చేరదీసేవారు.పల్లవి కూడా లలితత్తా అంటూ ఆమెతో కబుర్లు చెప్పేది.
తర్వాత అక్కయ్యా వాళ్ళుకూడా టీవీ కొన్నారు.దాంతో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు దూరదర్శన్ కార్యక్రమాలు అబ్బురంగా చూసేవాళ్ళం.
అక్కయ్యా వాళ్ళింట్లో కూడా మామూలు గా పూజలు చేయకపోయినా వినాయక చవితికి పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని మామామయ్య పూజ చేయించి కథ చెప్పేవాడు.ఆయన అంటే పిల్లలందరికీ చాలా ప్రేమ.కథలు చెప్పటం,సినిమాలూ , షికార్లు తిప్పటం చేసేవాడు. బాబుకి ఆరునెలలు దాటాయి.బోర్లా పడుతున్నాడు,కొద్దిగా పారాడటానికి ప్రయత్నిస్తున్నాడు.ఒకరోజు సాయంత్రం అకస్మాత్తుగా గుక్క పట్టి ఏడుస్తూ ఏడుస్తూ క్రమక్రమంగా ఒళ్ళంతా నీలి రంగులోకి మారి స్మారకం లేనట్లుగా అయిపోయాడు.నాకు ఏంచేయాలో తోచక ఎత్తుకుని ఏడుస్తూ వాకిట్లోకి వచ్చాను.వాకిట్లో పిల్లలతో ఆడుకుంటున్న పల్లవి కూడా బిక్కమొహం తో దగ్గరకు వచ్చింది.కాంపౌండులోని నాలుగు కుటుంబాలవాళ్ళూ వచ్చి బాబుముఖంమీద నీళ్ళు చల్లి కుదుపుతూ ఉంటే మెల్లమెల్లగా నీలిరంగు నుండి మామూలు అయ్యాడు.పక్కనే ఇంట్లో ఉన్న తోటి కోడలు తన పిల్లల్ని ఇంట్లోకి లాగి తలుపు వేసిందని లలిత తర్వాత చెప్పింది.
ఎవరో దగ్గరలోనే ఉన్న వికాస్ ఆఫీసుకు పరిగెత్తి వీర్రాజుగారిని పిల్చుకు వచ్చారు.అప్పటికి తిరిగి బాబును ఇంట్లోకి తీసుకు వచ్చాను.వీర్రాజు గారు వచ్చి బాబునీ వొళ్ళోకి తీసుకుని కుదుపుతుంటే కళ్ళు తెరిచాడు.అప్పుడు తీరికగా మాతోటికోడలు వచ్చి పలకరించింది.
అప్పటికైతే బాబు నార్మల్ గా అయ్యాడు కానీ అది మొదలు కొని తరుచూ ఏడుపు మొదలెట్టాడంటే గుక్క పెట్టటం,ఒళ్ళు నీలి రంగులోకి మారటం స్పృహ తప్పినట్లుగా కళ్ళు తేలేయటం ఇంచుమించుగా ప్రాణం పోయిందేమో అన్నట్లుగా వేలాడిపోవటం జరుగుతూ ఉండేది.ఇంక మాకు ఇల్లు, హాస్పిటల్,లేదా ఇల్లూ క్లినిక్ లకు తిరగటం ప్రారంభమైంది.నెలలు గడుస్తున్నా బాబు మెడని బలంగా నిలబెట్టలేక పోయేవాడు.కూర్చోలేకపోతున్నాడు.చేతితో ఏదీ పట్టుకోలేక పోతున్నాడు. ఎవరు ఏ డాక్టర్ పేరు చెబితే అక్కడకు తీసుకు వెళ్ళేవాళ్ళం.
చిక్కడపల్లిలో రామయ్య అనే మంచి హోమియోడాక్టర్ ఉన్నాడంటే అక్కడకు వెళ్ళాం.బాలపరమేశ్వరరావు అనే ఆయన పిల్లలడాక్టర్ గా ఫేమస్ అంటే అక్కడకు వెళ్ళాం. ఏ పరీక్షలు చేయమని చెప్తే ఆ పరీక్షలు చేయిస్తున్నాం
మాది మేనరికం కనుక అందువల్ల బాబు అలా ఉన్నాడేమోనని ఎవరో అనటంతో జెనెటిక్ లాబ్ కి వెళ్ళి పరీక్షచేయించాం.ఆ లోపం ఏమీ లేదన్నారు. డాక్టర్ "జెనెటిక్ లోపం ఉంటే పెద్దపాపలో కూడా ఆ ఛాయలు ఉండాలి.కానీ పాప చురుకుగా ఉంది.మీరు గర్భంతో ఉన్నప్పుడు వేసుకున్న మందులు వలన వచ్చిన ఎఫెక్ట్ " అన్నారు.నాకు ఏమీ అర్థం కాలేదు.డాక్టర్ బలానికి రాసిన మందులు తప్ప ఇంకేమీ వేసుకున్న గుర్తు లేదు.
బాబు ఏడవకుండా సమయానికి ఆహారం పెట్టటం,రాత్రి పగలు కనిపెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి.నిద్రపోతున్నప్పుడే తొందరగా పని పూర్తిచేసుకుని బాబును చూసుకోవాల్సి వచ్చేది.
ఉమ్మడి కుటుంబం తో పడిన అవస్థలు తప్పాయి అనుకుంటే మళ్ళీ నేను అఖాతంలో పడిపోతున్నాను అనిపించింది.ఇప్పుడిప్పడే మళ్ళీ నా రచనలు,నా చిత్రాల్లో పడుతున్నాను అనుకుంటే మళ్ళీ మళ్ళీ......
ఈ నిస్సహాయ పరిస్థితులలో నన్ను నేను ఎలా నిలబెట్టుకోవాలి నాకు తెలియని అయోమయంలోచిక్కుకుపోయాను.బస్సులోనో,రైల్లోనో బయటకు వెళ్తే బాబు వైపు ఎదుటివాళ్ళ జాలిచూపుల్ని తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళటం మానుకున్నాను.ఎప్పడైనా రిక్షా ఎక్కి అక్కయ్య దగ్గరకు మాత్రమే వెళ్ళేదాన్ని.
ఇంకా నాకు ఏమాత్రమైనా ఓదార్పునిచ్చేది పుస్తకాలే.ఏదో ఒక పుస్తకం పట్టుకుని బాబు పక్కనే ఉండేదాన్ని.కవిత ఏమైనా రాయాలనిపించితే రాసేదాన్ని.కానీ ఏ పత్రికలకీ పంపేదాన్ని కాదు.
చిరునవ్వు పెదాలకు తగిలించుకుంటే మనసులోని బాధని దించుకోవచ్చు అనేది తెలియనితనం.కళ్ళుఎప్పుడూ నిండుకుండల్లా ఉండేవి.ఏమూలో కాసింత కొనప్రాణం ఉన్న జీవచ్ఛవంలా ఉండేదాన్ని.
చిన్నప్పుడంతా ఆర్థిక అవకతవకలతో నాలుకని దాచుకొని ఒకరి పంచన బతకాల్సిన పరిస్థితులు దాటి ఎలాగో చదువుకుంటున్నదాన్ని చదువుకోక సాహిత్యంపై మోజుతో ప్రేమమోహంలో చిక్కుకుని గంపెడు కలల్ని మూటకట్టుకుని వచ్చాను.
"నువ్వు చదువుకున్నదానివి.రచయిత్రివి.సామాన్య ఆడదానివిలా అసూయా ద్వేషాలు పెంచుకోకూడదు" అంటే కామోసు అనుకుని ఉమ్మడి కుటుంబం లో నాలుకని దాచుకొని, ఒళ్ళు దాచుకోకుండా నా కుటుంబం అనుకుంటూ చాకిరీ చేసాను. వేరించి కాపురమేకదా ఇంక నా ఆశలు,కలలూ పండించు కోవచ్చు అని నిశ్చింతగా ఊపిరి తీసుకుంటే మళ్ళా ఈ ఉత్పాతం.ఈ జీవితం అంతా దుఃఖమేనా?
ఒక్కొక్కప్పుడు తోబుట్టువుల మీద ఆయనకిగల అలవిమాలిన ప్రేమ వలన నాకు కావలసిన సాంత్వన పొందలేక నాలోకి నేను ముడుచుకు పోయేదాన్ని.
ఏ అర్థరాత్రో దగ్గర చేరినప్పుడు " నిజంగా నన్ను ఇష్టపడే చేసుకున్నారా"అని సందేహం వెలిబుచ్చినప్పుడు "ఎందుకు ఆ సందేహం"అంటూ మరోప్రశ్నకి అవకాశం ఇవ్వనప్పుడు మౌనాన్నే ఆశ్రయించే దాన్ని.
తల్లి చనిపోయాక,ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతే ఆడదిక్కులేని సంసారానికి చాకిరీ చేసే ఆడదిక్కు కోసమే వేసిన మోహపు వలలో చిక్కుకున్నానేమో అని ఎప్పుడైనా ఒక సందేహం తేలుకొండిలా మనసులో లేచేది.కానీ తపస్విలా రంగులప్రపంచంలోనో,అక్షరలోకంలోనో తనలోకంలో తాను ఉండి మధ్యలో అనురాగం తో దగ్గరకు వచ్చే ఆయన ముఖంచూసి నా మనసును మందలించేదాన్ని.
నడక దారిలో --28
నడక దారిలో -- 28
వీర్రాజు గారు,తన స్నేహితుడితో కలిసి మొదలుపెట్టిన వికాస్ అడ్వర్టైజింగ్ ఆఫీసు కోసం ఇంటికి దగ్గర్లోనే రూమ్ తీసుకున్నందున మధ్యాహ్నం ఇంటికే భోజనానికి వచ్చేసే వెసులుబాటు కలిగింది.ఆ పనితో బాటు ముఖచిత్రాలపనీ ఉండటం వలన తీరిక మాత్రం కరువయ్యింది.ఆఫీసుకు అయిదేళ్ళు సెలవు పెట్టినందువలన అంతకుముందులాగ నెల మొదటి రోజునే వచ్చే జీతం లేదు.ప్రైవేటుగా చేస్తున్న పని ద్వారా వచ్చిన సొమ్ములో ఆఫీస్ రూము అద్దే మొదలగు వాటిని మినహాయించగా మిగిలినది ఇద్దరు మిత్రులూ చెరిసగం తీసుకునేవారు.
వీర్రాజుగారికి చేసిన పనికి డబ్బు అడగటం మొగమాటం కనుక ఆర్ధిక విషయాలు మిత్రుడు చూసుకునేవారు.
మాకు పొదుపుగా బతకటం అలవాటు కనుక పెద్దగా మాకేమీ ఇబ్బంది అనిపించలేదు.
అప్పట్లోనే తన నిర్మల్ ఆర్ట్ ప్రకటన కోసం వచ్చిన నిర్మల్ ఆర్టిష్టుని వీర్రాజు గారు ఆఫీసురూములో అడ్వర్టైజ్ ఏజెన్సీ గా పెట్టటం వలన ఇంటీరియర్ అందం కోసం సజీవంగా ఉండే నెమలి బొమ్మని తయారు చేయమని దానికి తాను విడిగా డబ్బు ఇస్తానని కోరారు.అదేవిధంగా ఆ నిర్మల్ ఆర్టిష్టు నిజంగా ఏ అడవిలోంచో దారితప్పి వచ్చిందేమో అనిపించేలా అందమైననెమలిని తయారుచేసి ఇచ్చాడు.అది చూసి వీర్రాజు గారు ఎంతగానో మురిసిపోయి నాతో చెప్పారు." మనింట్లో కి కూడా మరోటి చేయించితే బాగుంటుంది.కానీ ఈ చిన్న అద్దె ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటాం" అని నిట్టూర్చారు.
ప్రభుత్వం నుండి వస్తున్న ఒత్తిడి వలన అయిదేళ్ళు సెలవు తర్వాత వికాస్ నుండి బయటకు వచ్చేసి ఆఫీసును మిత్రుడికి అప్పగించారు.ఆ సందర్భంలో నెమలిబొమ్మ ఆఫీసులో ఉండటం వలన అభివృద్ధి చెందలేదని అది తిరిగి అమ్మేస్తానని మిత్రుడు అనేసరికి ఆ నెమలిబొమ్మ ఎగిరొచ్చే మా యింటవాలి ఇప్పటికీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆకర్షిస్తూనే ఉంది.సెలవు పెట్టిన స్వంతంగా మొదలుపెట్టిన వికాస్ కంపెనీ వలన మాకేమీ లాభించలేదు.మనసును ఆహ్లాదపరిచే ఆ నెమలి బొమ్మ తప్ప.
ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆ నిర్మల్ ఆర్టిష్టుకి కళారంగంలో జాతీయ బహుమతి వచ్చిందని తెలిసి వీర్రాజు గారు తనకే వచ్చినంతగా సంతోషపడి పోయారు.ఆ నెమలిని చూసి దాని గురించి అడిగిన వారందరికీ ఆ నెమలిబొమ్మ తయారు చేసిన నిర్మల్ ఆర్టిష్టుకి జాతీయ బహుమతి వచ్చిందని గొప్పగా చెప్పేవారు.
అప్పట్లోనే దేశరాజకీయాలలో పెనుసంచలనం ఏర్పడింది.ముఖ్యంగా ఆధునిక భావాలు ఉన్న సాహితీవేత్తలలోనూ,విరసం పట్ల సానుభూతి ఉన్న కవులలోనూ ఎమర్జెన్సీ చాలా భావసంచలనం కలిగించింది.ఆ నేపధ్యంలోనే నగ్నముని గారు రాసిన కొయ్యగుర్రం సాహితీప్రపంచంలో కూడా చాలా సంచలనం కలిగించింది.
ఇందిరాగాంధీ చేసిన అతి పెద్ద తప్పిదం అయిన ఎమర్జెన్సీ వలన జనం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. ఆ ఏడాది జరిగిన ఆరవ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పొందటమే కాకుండా1977 ఎలక్షన్లలో జనతా పార్టీగా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది భారత స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వంగా మొరార్జీ దేశాయ్ ప్రధానిగా జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది.ఎమర్జెన్సీ తొలగింపులో సాహిత్యం తిరిగి ఊపిరి పోసుకుంది.
కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద విపత్తు సంభవించింది. 1977 లో దివిసీమ ఉప్పెన ఆంధ్ర ప్రదేశ్ లో సముద్రతీరంలో విధ్వంసాన్ని సృష్టించిన అతి భయంకరమైన తుఫాను. 1977, నవంబరు 19న ఈ తుఫాను సముద్రతీరాన్ని తాకటంతో ఏర్పడిన విషయంలో అధికారికంగా పద్నాలుగు వేలకు పైగా అని ప్రభుత్వం ప్రకటించినా అనధికారికంగా సుమారు యాభై వేలకు పైగానే ప్రాణాలు కోల్పోయిఉంటారు.
ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయిట. తుపాను తర్వాత వందలాది శవాలు నీళ్ళలో తేలుతూ కనిపించాయని. గుర్తుపట్టలేని అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చిందని పేపర్లన్నీ రాసాయి.
రాష్ట్రమంతా ఒక దీన స్థితి లోకి వెళ్ళిపోయింది.అప్పుడు దృశ్యమీడియా లేకపోయినా రేడియోలో పదేపదే వచ్చే వార్తా విశేషాలు, వార్తాపత్రికల్లో వచ్చే ఛాయాచిత్రాలు, వార్తలు జనాల్లో కలవరం పెంచాయి.
బాపట్లలో ఒక చర్చిలో తలదాచుకున్న దాదాపు వందమంది ప్రజలు అది కూలడంతో మరణించారని పేపర్లో చదివి అక్కడే ఉన్న పెద్దక్క కుటుంబం గురించి కంగారుపడ్డాము.అప్పట్లో ఫోన్లు లేవు. వాళ్ళనుండి ఉత్తరం వచ్చేవరకూ మనసు మనసులో లేదు.
ఇప్పుడు మా కుటుంబమే కనుక పల్లవి స్కూలుకి వెళ్ళాక నాకు కొంచెం తీరిక చిక్కటంతో మళ్ళా మధ్యాహ్నం పూట పుస్తకాలు చదవటం,రచనలు చేయటం మొదలుపెట్టాను.
చిన్నప్పటినుండి ఎక్కువగా చిన్నన్నయ్య సేకరించిన రావిశాస్త్రి,బీనాదేవి రచనలే కాక తర్వాత కూడా ఆంధ్రజ్యోతి వారపత్రికలలో వచ్చిన పుణ్యభూమి కళ్ళుతెరు,రత్తాలు రాంబాబు మొదలైనవి చదవటం, నాకు ఇష్టమైన రంగనాయకమ్మ రాసిన ధారావాహికలు నా ఆలోచనలు మళ్ళా పదునుగా తయారవుతున్నాయి.
కవిత్వం నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది. అందులోనూ సమాజాన్ని,రాజ్యాన్ని ప్రశ్నించే వామపక్ష భావజాలం ఉన్న కవిత్వం మరింతగా ఇష్టపడేదాన్ని.
అప్పట్లోనే ఒకసారి మా యింటికి తురగా జానకీరాణి గారు వచ్చారు.తురగా జానకీరాణి గారు మాకు అత్యంత ఆత్మీయులు.వీర్రాజు గారు ఆకాశవాణి లోని ప్రోగ్రాం అధికారి అన్నమాటకు నొచ్చుకొని ఆకాశవాణి మెట్లు ఎక్కనని నిర్ణయించుకున్నారు.చివరివరకూ అదే మాటమీద నిల్చున్నారు.ఆవిషయం తెలిసిన జానకీరాణి గారు "నేను సుభద్ర కి ప్రోగ్రాం లు ఇస్తాను.ఆమె ఇలాంటి ప్రతిజ్ఞలు చేయలేదు కదా"అని సరదాగా అన్నారు.అంతేకాకుండా అప్పటినుండి ఏడాదికి నాలుగు సార్లు ప్రోగ్రాములు ఇచ్చేవారు.అందువల్లనే ఆ సమయంలో చాలా కథలు రాసాను.కవితలు కూడా ఎక్కువగానే రాసాను.ఆకాశవాణి ప్రోగ్రాములకు డబ్బు కూడా రావటంతో నా మొదటి సంపాదనగా నాకు ఆనందం కలిగించింది.
నాకు తెలిసిన ఒక కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నవలరాయాలని తలపెట్టి చాప్టర్లుగా కథని సినాప్సిస్ గా రాసుకొని అప్పుడప్పుడు రాయటం మొదలుపెట్టాను.కానీ వీర్రాజు గారు "కవిత్వం బాగా రాస్తున్నావు దానిమీద దృష్టి పెట్టు కవిత్వసంపుటో,కథలసంపుటో వచ్చాక నవలరాయొచ్చులే" అనేసరికి అది పక్కన పెట్టేసాను.
ఇంతలో పెద్ద ఆడబడుచు భర్త అల్సర్ ట్రీట్మేంటు కోసం కుటుంబ సహితంగా వచ్చి నెలరోజుల పైగానే ఉన్నారు.మళ్ళా నాకు ఊపిరి ఆడని పని మొదలైంది.చిన్నాడబడుచుకి నిండునెలలు కావటంతో రెండవకాన్పుకి ఆమె కూడా వచ్చింది. ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్ళి చూపించటం,పెద్దాడబడుచు భర్తకి ఆమెకీ భోజనం తయారుచేయటం మధ్యలో పల్లవి చంటిపిల్లకావటంతో ఆ పిల్లని పట్టించుకోలేకపోయాను. మళ్ళా నేను పనివత్తిడితో నలిగిపోయాను.ఇంకా పథ్యాలేవో సరీగా చేసి పెట్టలేదనో, పంపలేదనో మూతివిరుపులూ మామూలే. ఏమైతేనేం వాళ్ళందరూ తిరిగి శుభంగా వారివారి ఇళ్ళకు వెళ్ళేక ఊపిరి తీసుకున్నాను. మధ్యతరగతి జీవితాల్లో మామూలు ఖర్చులకు భిన్నంగా ఇటువంటి అనివార్య ఖర్చులు మీదపడేసరికి అంతంతమాత్రంగా దాచుకున్నవి కాస్తా ఆవిరైపోతూ ఉంటాయి.వాటిని కూడదీసుకునేసరికి చాలా కాలమే పడుతుంది.ఇవన్నింటితో మానసికంగా,శారీరకంగా నేను కుంగిపోయినట్లయ్యాను.
ఇంతలో నాకు మళ్ళా నెలతప్పింది.చిన్నాడబడుచు పురిటి కని వచ్చిన అమ్మ వెళ్ళేటప్పుడు " ఈసారి అయినా ఆరోగ్యం బాగా చూసుకో.ఇప్పుడు మీకుటుంబమే కనుక నీకు నచ్చినవి బలమైన ఆహారం తింటూ ఉండు"అంటూ బోలెడు జాగ్రత్తలు చెప్పింది.
ఒకరోజు కుమారీ వాళ్ళు ఆడబడుచు లక్ష్మి ని తీసుకుని వచ్చింది.లక్ష్మి బీయిడీ చదువుతుంది.టీచింగ్ ప్రాక్టీస్ కోసం నాకు చార్టులు వేస్తావా అని అడిగింది.పల్లవి బడికి వెళ్తుండటం వలన పగలు ఖాళీగానే ఉంటున్నానుకదా అని సరే అన్నాను.
లక్ష్మి చార్టులు తీసుకు వచ్చి ఇచ్చేది.తెలుగుపాఠాలు, సాంఘిక శాస్త్రం పాఠాలు కనుక బొమ్మలు ఎక్కువ గానే ఉండేవి.ఇంట్లో రంగులు ఉంటాయి కాబట్టి వర్ణచిత్రాలు వేసేదాన్ని.అవి చూసి లక్ష్మి క్లాస్ మేట్ లు కూడా వచ్చి మాకూ వేస్తారా అని అడిగి డబ్బులు కూడా ఇస్తామన్నారు.ఆ విధంగా నాకు చిరు సంపాదన మొదలైంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)