26, సెప్టెంబర్ 2023, మంగళవారం

అన్నయ్య ప్రధమ వర్థంతి సందర్భంగా

నా పెద్దన్నయ్య కొడవంటి లీలామోహనరావు బహుభాషా కోవిదుడు రోణంకి అప్పలస్వామిగారి శిష్యుడు.బహుశా అందువలనే కావచ్చు గణితం డిగ్రీలో అంశమే అయినా రోణంకిగారి ప్రభావం వలన ఆంగ్లంలో పట్టా, పరిశోధన చేసి విజయనగరం మహరాజా కాలేజిలో ఇంగ్లీషు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసి పదవీవిరమణ చేసాడు. 1958 ఆ ప్రాంతంలో భారతిలో వ్యాసాలు,కొన్ని కవితలు రాసినట్లు నాకు ముందుగానే తెలుసు.ఇటీవల కథానిలయంలో వెతుకులాటలో అన్నయ్య రాసిన రెండు కథలు కూడా దొరికి నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఒక కుటుంబంలో నలుగురు తోబుట్టువులూ కథకులు కావటం ఎవరైనా ఉన్నారా లేదో తెలియదు.నా తోబుట్టువులము నలుగురం కథలు రాసామని నేనెంతో గర్వపడుతున్నాను. అన్నయ్య నా కవితలు ఒక పాతిక వరకూ ఆంగ్లంలోకి అనువదించాడు. నేను రాసిన "యుద్ధం ఒక గుండె కోత" కవితను మా పెద్దన్నయ్యకే ఆత్మీయంగా అంకితం చేసాను.ఇది ఆంగ్లం,హిందీ,తమిళం లోనికి అనువదించబడింది.అంతే కాక యుద్ధం ఒక గుండె కోతపై ఎమ్ ఫిల్ పరిశోధన కూడా జరిగింది. అన్నయ్య అంటే భయం,భక్తితో బాటు నన్ను డిగ్రీ వరకు చదివే అవకాశం కల్పించినందుకు ప్రేమ కూడా ఉంది. మొదటినుంచీ అన్నయ్యతో చనువుగా,చొరవగా తిరిగిన జ్ణాపకాలు తక్కువే.ఎందుకంటే అన్నయ్య చాలా రిజర్వుడుగా దూరంగా ఉండేవాడు.అటువంటి అన్నయ్య భౌతికంగా కూడా దూరమై ఏడాది అయ్యింది. అన్నయ్య లీలామోహనరావుకి ఈసందర్భంగా నాస్మృతిగా ఈ భావాంజలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి