23, ఫిబ్రవరి 2016, మంగళవారం

9th chaptar

    నియంతౄత్వ భావన తో జనాన్ని పెంపుడు జంతువుల్ని చేస్తే

యుద్ధం ఒక గుండె కోత--9 వ చాప్టర్


దేశాలన్నిటినీ పెంపుడుజంతువుల్ని చేసి
ఇంటి చుట్టూ కాపలాగా పెట్టుకొని
తిరుగులేని నియతృత్వభావనతో ఆదమరచి నిశ్చింతగా
పెంపుడుజంతువులకు గారడి ఆటలు నేర్పి
కాలాన్ని కొనగోట నిలిపి
దానిమిద భూగొళాన్ని బొంగరం గా తిప్పాలని
అహంకిరీటం ధరించి
రింగుమాష్టర్ వి కావటమే కాక
జగన్నాటకసూత్రధారుడివి అనుకున్నావు

నియంతవి కావటానికై క్షుద్రబుద్దితో
నువ్వునేర్పిన విద్య లక్ష్యం తప్పి
నీ పైనే ప్రయోగింపబడేసరికి
మకుటం జారేసరికి
తల్లడిల్లి చిందులేస్తున్నావు
చర్యకి ప్రతిచర్య తప్పదు కదా
అసలు చర్య ఎక్కడ మొదలైందో తేలాలి ఇప్పుడు

నీగుండె నువ్వు నిజాయితీగా
ఒక్కసరి తడుము కొని చూడు
కనిపించని గాయాలు
ఏ గుండెను ముందు తాకాయో
స్కెనింగులు తీసి పరిశీలించాలి
ఏ ఇంట్లో పొయ్యి బోర్లించె పరిస్థితి వచ్చిందో
ఏ పెరటిచెట్టు వేళ్ళు హక్కులు కోల్పోతున్నాయో
ఏ తల్లి గుండే రిమోట్ లేకుండానే పిగిలి పోయిందో
కనిపించని లెక్కలన్నీ తేలాలిప్పుడు
దేశాల్ని కబ్జా చేసినంత సులువు కాదు
కన్నవాళ్ళ స్వప్నాల్ని స్వాధీనం చేసుకోవడం
బ్రెడ్ ముక్క ఎరవేసి
ప్రపంచాన్ని సర్కస్ ఎరీనా చేసి
గారడీ నడుపుదామనుకున్నావ్
నొరు లేని జంతువుల్ని మూగదెబ్బకొడితే
నీ ఆయువు పట్టు దగ్గరే గాయం చేస్తాయ్
భద్రం సుమా!
ఇంక అప్పుడు
నిన్ను నువ్వు కాపాడు కోటానికి
బొడ్డు చుట్టూ నువ్వే సూదులు గుచ్చు కోవాలి 



 

19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

yuddham oka gunde kota---8th chaptar


 యుద్ధం ఒక గుండె కోత---8వ  చాప్టర్


మనిషికి మనిషికీ మధ్య
మతం కత్తుల వంతెన నిర్మిస్తోంది
ఆత్మీయం గా హృదయాల్ని పెనవేసుకునే
స్నేహ ఆలింగనాల్ని మర్చిపోతున్నాం
మనసుని మైమరపింపజేయాల్సిన
వెన్నెలరాత్రులలో సైతం
యుద్ధసెగ స్నేహపరిమళాల్ని కాల్చేస్తోంది
ఇక పై జీవనయానమంతా
ఎర్రని క్రోధాగ్నులతో కాలే
ఎడారిభూముల మీదేనేమో
మనసుతెరచి అభిప్రాయప్రకటన చేయటానికి
అనుమానం బురఖాలో
ముఖాన్ని దాచుకోవాల్సిన పరిస్థితి!
జనాలమధ్య అంతరం
అగాథం గా మారిపోతున్న దుస్థితి!
ప్రశాంత సాగరాన్ని కల్లోల పరుస్తోన్న
మరిగె బడబానలం ప్రతి గుండె లో-
కడుపు లో ఆందోళన వాయుగుండాలూ-
కనుకొలకుల్లోంచి భావప్రకంపనలు
ఎక్కడ కన్నీరై జారిపోతాయోనని
అందరం ఒకే మాదిరి నల్లద్దాలు ధరించేస్తాం
నిజానికి
అందరం రాజకీయ పరిస్థితుల్ని
కాలక్షేపం బఠణీల్ని చేసి
నోట్లోంచి చెవుల్లోకి ఎగరేస్తూనే వుంటాం
చెప్తున్న మాటలకి
గుండెలో అభిప్రాయ ప్రతిబింబం వుండదు
కెలిడో స్కోపులో లాగ మాటలు గింగిరాలు తిరుగుతూ
చిత్ర విచిత్రరూపాల్ని సంతరించుకుంటూనే వుంటాయ్
మాటల్లో భయం ప్రకంపిస్తూ వుంటుంది
మనం మనలాగ బ్రతకడం మర్చిపోతుంటాం
మతం వైపు ముఖం తిప్పాలో
ఆధిపత్యానికి చెయ్యి అందించాలో
అర్ధం కాని అయోమయం లో మునిగిపోతూ వుంటాం
గుండె మానవత్వాన్ని కొట్టుకుంటూ
మనసులోకి లాక్కొస్తూ వుంటుంది
మాటమాత్రం  పంటి కింద నలిగి
నాలుక అడుగునే దాగి పోతుంది 
 

16, ఫిబ్రవరి 2016, మంగళవారం

7th chapter

   నిశ్శబ్దహింశ  కు తార్కాణం
    యుద్ధం ఒక గుండె కోత---7 వ చాప్టర్

రెక్కవిప్పని పక్షిలా తనలోకి తానే
ముడుచుకొని నిద్రిస్తున్న భూమి!
కలతనిద్రలోనో దొంగ నిద్ర లోనో
అరవిచ్చీ కనురెప్పల్లోంచి తొంగి చూస్తోన్న
నెలవంక కంటిపాప లో ఆకశం మధ్య
రెప్పవాలనియని భయం కోరలకి వేలాడుతూ జనం 

సంవత్సరాల తరబడి
తపోదీక్షలో వుండి
అర్ధనిమీలిత నేత్రాల గుండా
కరుణామృతాన్ని కురిపిస్తూ
అరవిరసిన పెదాల అంచులనుంచి
జాలువారుతున్న చిరునవ్వుని
ఫిరంగులు తూట్లు పొడుస్తున్నా
చెక్కచెదరని శాంతిమూర్తిని
మందుగుండ్లతో పేల్చి
గుండెని చిధ్రం చేసినప్పుడే మొదలైంది

అది ఒకచోట మసీదు కావచ్చు
మరోచోట తధాగతుడు కావచ్చు
వెరే చోట మందిరం కావచ్హు
ఇంకోచోట
నిబ్బరం గా ఠీవీ గా ఆకాశాన్ని అందుకొంటున్నానని
అహంకారం పూనిన ఆధిపత్య బహుళ అంతస్తులు కావచ్చు

అప్పుడె విరిగిన సూదిములుకు
తెలియకుండానే మనరక్తం లోకి ప్రవేశించింది
కళ్ళల్లో ఆందోళన
లేతపొరలా అల్లుకొవడం మొదలైంది
చరిత్రరాసిన కట్టడాల్ని కూల్చేసినప్పుడే
గుండెల్లొ చురకత్తై దిగినట్లైంది
సూదిమొన లాంటి బాధ
గునపమై
జీవితం కొసవరకూ చెరిగిపోనీ గాయం చేసినట్లైంది
ప్రపంచమానవగుండె కవాటాలను
కల్లొలతరంగిణులు వురుకులతో ఢికొంటూ
రక్తప్రవాహాల వుప్పెన్లను సృష్టించింది అప్పుడె
అలలు వువ్వెత్తున పైకి లేచి
నిశ్శబ్దహింశకు బలై
జనహృదయాలు
మౌనాన్ని ఆశ్రయిస్తున్న మునులైంది అప్పుడె
బాష్పిభవించిన ఆలోచనలుంపైకెగసి
.అంతరంగాల్ని శూన్యమందిరాల్ని చేసింది కూడా అప్పుదే.