19, ఏప్రిల్ 2022, మంగళవారం

నడక దారిలో --15

 నడక దారిలో-15


 నా ఉత్తరం అందగానే ఆఘమేఘాల మీద ఆ వారాంతం వస్తున్నానని రాసారు.

         అలాగే అప్పట్లో హైదరాబాద్ నుండి విజయనగరానికి  ఇరవైనాలుగు గంటల రైలుప్రయాణం . ముందురోజు సాయంత్రం రైలు ఎక్కితే మర్నాడు సాయంత్రం ఆరున్నరకి చేరారు.అన్నయ్య స్టేషనుకు వెళ్ళి తీసుకువచ్చాడు.

         ఇంటికి వచ్చి స్నానపానాదులు,భోజనం అయ్యేసరికే రాత్రి పడుకునే సమయం అయ్యింది.

           మర్నాడు టిఫిన్లు చేసి అన్నయ్యలు ఇద్దరూ బయటకు వెళ్ళారు.అమ్మ ఇచ్చిన కాఫీ తీసుకుని అన్నయ్య గదిలో ఉన్న వీర్రాజు గారికి ఇవ్వటానికి వెళ్ళాను. నాకు మొదటినుంచీ చొచ్చుకు పోయి మాట్లాడే స్వభావం లేకపోవటం వలన మనసులో ఉన్నది పేపర్ మీద పెట్టగలను. మాట మాత్రం గొంతులోంచి పెగల్లేదు. ఎప్పుడూ లేనిది గుండె కొట్టుకుంటున్న చప్పుడు నాకే వినిపిస్తుంది.

               నేను మాట్లాడలేదు సరే ఆయనా చాలా సేపు మాట్లాడలేదు. ‘స్త్రీ మనస్తత్వ విశ్లేషణతో ఇన్ని ప్రేమకథలు ఎలా రాసారబ్బా’ అని మనసులోనే అనుకున్నాను. కొన్ని నిముషాల తర్వాత “నువ్వు రాసిన కథలు తీసుకురా చదువుతాను” గోడతో అన్నట్లు అన్నారు.

                మాట్లాడకుండా వెళ్ళి తీసుకు వచ్చి ఇచ్చాను. ఎందుకో నాకు అసంతృప్తిగా అనిపించింది. నా మనసు చదివినట్లు ఆయన మళ్ళా ఎందుకనో “తర్వాత చదువుతానులే” అని అవి పక్కన పెట్టి నా ముఖంలోకి చూసి ” నువ్వని తెలిసి భలే ఆశ్చర్యపోయాను తెలుసా. నువ్వు మరీ ఇంత చిన్నపిల్లలా ఉంటావనుకోలేదు” అన్నారు.

            నేను చిన్నగా నవ్వి ఊరుకున్నాను.

             “మనం సభా వివాహం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. నువ్వేమంటావు?”

             మాటలతో కాకుండా తల ఊపి “నా చదువు పూర్తయ్యాక” మెల్లగా అన్నాను.              

             “పెళ్ళయ్యాక ఇక్కడే ఉండి చదువుకోవచ్చులే. మా అమ్మ సంవత్సరీకాలకు ముందే చేసుకోవాలని  అనుకుంటున్నాను. అందుకే ఏప్రిల్ లోపున చేసుకుందామని. “అంటూ నా ముఖంలోకి చూసారు.

              ‘ఆధునికంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రాలపెళ్ళి వద్దు అని, మళ్ళీ ఈ సెంటిమెంట్ ఏమిటి. నమ్మకం, సెంటిమెంట్ వేర్వేరేనా’ ఆలోచనలో పడ్డాను. నా నా చదువు సక్రమంగా కొనసాగుతుందా అనే సందిగ్ధంలో కూరుకుపోయి ఏమీ  సమాధానం చెప్పలేకపోయాను. మొదటిసారి కలిసిన సందర్భం ఇలా మరీ ఇంత పొడిగా ఉండటం నాకేమీ బాగా అనిపించలేదు.

                ఆరోజు సాయంత్రం పెద్దమామయ్య వచ్చారు.అన్నయ్యలూ, వీర్రాజు గారూ అమ్మ అందరు కలిసి సంప్రదించుకున్నారు. ఆ సందర్భంలోనే వీర్రాజు గారు తన చెల్లెల్ని చిన్నన్నయ్య కిచ్చి పెళ్ళి చేయటాన్ని ప్రస్తావించారు.

                పక్కగదిలో కూర్చుని వారి మాటలు వింటున్న నాకు ఒక్కసారి మనసుకి ముల్లు గుచ్చుకున్నట్లు అయ్యింది. ‘ ఈయన నాకోసం వచ్చారా? చెల్లెలి పెళ్ళి సంబంధం స్థిరపరచుకోటం కోసం వచ్చారా?  ఇప్పుడే ఈ ప్రస్తావన తేవాల్సిన అవసరం ఉందా? మా పెళ్ళి తర్వాతైనా అడగొచ్చు కదా?’ మొదట్లోనే అసంతృప్తి మనసులోకి వస్తుంటే నన్ను నేను సరి చేసుకోటానికి ప్రయత్నించాను.

               అంతలో చిన్నన్నయ్య “చేసుకుంటాను గానీ అన్నయ్యకీ, చెల్లెలికీ  అయ్యే వరకూ ఎన్నాళ్ళు అయినాసరే  చేసుకోను. అది మీకు ఇష్టమైతేనే.”అన్నాడు.

                  తర్వాత వివాహ విధానం గురించి చర్చ జరిగింది. మామయ్య అందరూ కలిసి మాఘమాసం లో తేదిని నిర్ణయించుకుందాం అనుకున్నారు. రెండుమూడు రోజుల్లో తేదీ చెప్తానని మామయ్య అన్నారు.

           అందరి అంగీకారంతో చర్చముగించారు.

              ఆ మర్నాడు నేను రాసిన నా కథలలో మూడు కథల్ని ఎంపిక చేసి ఒకటి తాను తీసుకు వెళ్ళి ఎమ్. రాజేంద్ర సంపాదకత్వం తో వస్తున్న పొలికేక వారపత్రిక కు ఇస్తాననీ, మిగతా రెండు నన్నే జ్యోతి మాసపత్రిక కు పంపమన్నారు.         

              తర్వాతి రోజు నా చెంపల పై ఒక తీపి సంతకం వేసి తిరుగు ప్రయాణమయ్యారు.        

           మళ్ళీ మర్నాటి నుంచి కాలేజీ కి వెళ్ళటం కొనసాగించాను. ఉషా వలనా, కుమారి వలనా విషయం తెలుసుకున్న మిత్రులు నన్ను ఆట పట్టించారు. “చదువూ, ఉద్యోగం అని అప్పుడే పెళ్ళి చేసేసుకుంటున్నావేంటోయ్ ” అంటూ.            

              “నిజమే ఎందుకు తొందరపడ్డాను. పరీక్షలు అయ్యాకే చేసుకుంటే బాగుండేది. అదేమిటీ మనసులోని మాట ఎందుకు చెప్పలేకపోయాను.”          

              అప్పుడప్పుడు మనసు నన్ను ప్రశ్నిస్తూనే ఉంది.         

             ఎదురుగా చెప్పలేక మూగపోయాను. కానీ మళ్ళీ ఉత్తరంలో ఈ విషయం ప్రస్తావించాను. “పెళ్ళయినా చదువుకుందూగానిలే. మళ్ళీ అనుమానమెందుకు” అన్నారు.    

             మాటిమాటికీ అదే విషయాన్ని ప్రస్తావించటం బాగుండదని ఊరుకున్నాను.                                                 

           అక్టోబర్ నెలలో ఒకవారం పొలికేక సంచిక లో నామొట్టమొదటి కథ కొడవంటి సుభద్రా దేవి పేరుతో  “పరాజిత” ప్రచురితం అయ్యింది. నాకు ఒక రెండు సంచికలు పంపారు. అందులో ఒకటి కాలేజీకి తీసుకువెళ్ళి నామిత్రులకీ, మాతెలుగు లెక్చరర్ సుందరీమేడం కి చూపించాను. అందరూ సంతోషంగా అభినందించారు. అంతకు ముందు కాలేజీ మాగజైన్ల లో తప్పని సరిగా ఒక రచన ప్రచురితం అవుతున్నా ఇలా ఒక వారపత్రికలో నాపేరు చూసుకోవటం భలే సంతోషం కలిగింది. 

          ఈకథకూ ఒక నేపధ్యం ఉంది. కొడవటిగంటి కుటుంబరావు గారి కురూపి నవలలో కథానాయిక అందంగా ఉండదు. కాని ఎమ్మే చదివిందని రాసారు. అది చదివాక నిజమే కదా! కథానాయిక తప్పని సరిగా సకల సద్గణవంతురాలూ, సౌందర్యరాశి అయి ఉండాలా? ఈ ఆలోచనలతో మాకాలేజీలో నా సహాధ్యాయి అయిన ఒక మరుగుజ్జు అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని పరాజిత కథని రాసాను.                                                       మొత్తంమీద మా కాలేజీ లో రచయిత్రిని ఐపోయాను. మిగిలిన రెండు కథల్నికూడా జ్యోతి పత్రికకి పోస్ట్ చేసాను. అవి నా వివాహం అయ్యాకే ప్రచురితం అయ్యాయి.

             మా మధ్య ఉత్తరాలు కొనసాగుతున్నాయి అయితే ఆయన రాసే ఉత్తరాల థోరణి కొంత మారింది. నేను చదువు ఒత్తిడి వల్లా వెంటనే రాయలేక పోయాను. అయినా యథా ప్రకారం నేను చదివిన పుస్తకాల గురించి, నేను విన్నా నేర్చుకున్న పాటలు గురించి కాలేజీ విషయాలూ, స్నేహితులు విషయాలూ రాస్తూనే ఉన్నాను. ఒక రోజు ఆయననుండి చాలా చాలా పెద్ద ఉత్తరం వచ్చింది అది చదువుతూ చదువుతూంటే భయకంపితురాలిని ఐపోయాను. చివరకు వచ్చేసరికి ఒక పెద్ద నిట్టూర్పుతో తేలిక పడ్డాను. ఇంతకీ అదేమిటంటే సెప్టెంబర్ 24 వతేదీ గురువారం రోజు సాయంత్రం ఆరు గంటల సమయం అకస్మాత్తుగా రోడ్లమీద  ఒగురుస్తూ, ఒకరినొకరు తోసుకుంటూ ప్రజలంతా పరుగులు తీస్తూ “గండిపేట తెగింది, పానీ ఆ రహా హై” అంటూ లక్షల సంఖ్యలో పరుగులు తీస్తూ జంటనగరాల్లోని అందరూ ఎత్తైన ప్రదేశాలకూ, ఇళ్ళపైకీ, డాబాలమీదకీ ప్రాణాల్ని పిడికిట్లో పట్టుకుని పైపైకి పల్లపు ప్రాంతం నుండేకాక అన్ని ప్రాంతాల నుండీ పరుగులు తీసారు. ఆ తోపులాటలో తొక్కిసలాట లో పరిగెత్తటం లో వాహనాలకింద పడి గాయాలపాలయ్యారు. ఏవీథిలో చూసినా జనప్రవాహాలే. చార్మీనారు పై శిఖరం వరకూ నీరు వచ్చేసిందని సుల్తాన్ బజార్ కొట్లు మునిగిపోయాయనీ చెప్పుకుంటూ పరుగులు తీస్తున్నారు. అంతకుముందు మూడురోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలతో హుస్సేన్ సాగర్, గండిపేట నిండిపోవటం ఒక భవనం కూలటం వలన వర్ధిల్లాలని చాలామంది చనిపోవటం వల్ల ఈ పుకారు ప్రజల్ని భయకంపితులను చేసింది.

             వీర్రాజుగారూ వాళ్ళు కూడా వాళ్ళింటి పైన డాబా పైకి ముఖ్యమైన వస్తువులతో చేరుకున్నారట.హైదరాబాద్ అంతటా సందట్లో సడేమియా అని లూటీలూ, దొంగతనాలూ, దోపిడీలతో అల్లకల్లోలం అయిపోయింది. నలభై నిముషాలు తర్వాత పోలీసులూ, ఆతర్వాత రేడియోలద్వారా అదంతా పుకార్లేనని పదేపదే ప్రకటనలు చేస్తే అందరూ ఊపిరి పీల్చుకున్నారట. అప్పట్లో వార్తల కి రేడియోనే ఆధారం. మాకు విజయవాడ రేడియో ప్రసారాలు వస్తాయి కనుక ఈ విషయాలు మాకు తెలియలేదు.        

             అప్పట్లోనే ఈసంఘటన ఆధారంగా వాసిరెడ్డి సీతాదేవి “పానీ ఆ రహా హై” అని మంచికథ  రాసింది. డిసెంబర్లో నా పుట్టినరోజు మరో వారం రోజులు ఉందనగా అనుకోకుండా నాకు వీర్రాజు గారినుండి పార్సిల్ ద్వారా లేత నిమ్మపండు రంగు ఫుల్ వాయిల్ చీర అందుకున్నాను. ఏదో తప్పనిసరి బాధ్యతగా ఇంట్లో ఏడాదికొకసారిి కొనే చీర  కాకుండా ఆత్మీయంగా అచ్చంగా నాకోసం అందుకున్న ఆ చీరతో ఆ ఏడాది నాపుట్టిన రోజు నాకు చాలా ప్రత్యేకం గా అనిపించింది. ఆ సంతోషాన్ని అక్షరాల్లో నింపి  రాజధాని నగరానికి ఓ లేఖని  పావురంలా ఎగరేసాను.


*****



నడక దారిలో --16

 నడక దారిలో-16-శీలా సుభద్రా దేవి


          ఇద్దరి మధ్యా లేఖలు పావురాలై ఎగరటం మొదలై ఆరునెలల పైనే అయ్యింది. కొత్త ఏడాది కొత్త ఊహలను ప్రోది చేసుకుంటూ అడుగు పెట్టింది. ఈ కొత్త సంవత్సరం నా జీవితంలో ఎన్నెన్ని మార్పులనో తీసుకువచ్చేలానే అనిపించింది. ఎన్నెన్ని  కొత్త అనుభవాలనో తొలి అడుగులోనే రుచి చూపిస్తూ కొంగ్రొత్త మలుపులను తీసుకు వచ్చేలానే ఉంది. అవి నాకు శుభసంతోషాలనే ఇస్తుందో , కష్టాల కడగండ్లు పాదాల ముందు పరుస్తుందో. అన్నింటినీ ఎదుర్కోగలిగే మనోబలాన్ని ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూనే ఉన్నాను.                   మామయ్య, అన్నయ్య ‘ఒకసారి విజయనగరం రమ్మని పెళ్ళి ఎప్పుడు ఎలా చేయాలో నిర్ణయించు కుందామని’ ఆయనకు ఉత్తరం రాసారు. ఉత్తరం అందగానే సంక్రాంతి, శని, ఆది వారాలు కలిసివచ్చేలా చూసుకుని రెక్కలు కట్టుకుని వచ్చారు.

          ఫిబ్రవరి 14 వ తేదీ ఆదివారం ఉదయం 8-30 గంటలకు మంచి ముహూర్తం ఉందని మామయ్య చెప్పారు. ముందు రోజు రెండవ శనివారము కనుక పెళ్ళికి వచ్చే వారికి వీలుగా ఉంటుంది కనుక అదేరోజు నిర్ణయించారు. పెళ్ళి విజయనగరంలోని ప్రముఖ బహుభాషావేత్త, పండితుడు, మా కుటుంబానికి సన్నిహితులు అయిన రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభా వివాహం చేసుకుని బంధుమిత్రులకు విందు ఇచ్చేలా నిర్ణయం చేసారు.పెళ్ళి తర్వాత హైదరాబాద్ కు నన్ను తీసుకువెళ్ళి అక్కడ  సాహితీ మిత్రులకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని ఆయన చెప్పారు

          ఇవన్నీ చాలావరకూ నాతో ఉత్తరాల్లో సంప్రదించినవే. అయితే మాత్రం ఉత్తరాల్లో అన్ని కబుర్లు చెప్పేసరికి  ఇంకేమీ చెప్పేందుకు ఏమీ లేదో ఏమిటో అన్నీ పొడిపొడి మాటలే. మా దగ్గరలో  ఏమనిషి గాలి అయినా ఉందనుకుంటే అత్తిపత్తి లా ముడుచుకు పోయే ఈ వ్యక్తి తర్వాత్తర్వాత నా మనసులోకి  రాకుండానే బయటే నిలబడిపోతారో ఏమిటో అని నా లోలోపల సంశయం మొలకెత్తింది. అలా అని సినీమాల్లోలా హత్తుకొనే వుండాలని కాదు గానీ నాకోసం నాదైన మనిషిగా  నాకు అవసరమైనప్పుడు భరోసాగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు. సంసారం అంటేనే ఒకరిమీద ఒకరికి గాఢమైన నమ్మకం అనీ ఆ నమ్మకం సడలకుండా చూసుకోవాల్సిన బాధ్యత దాంపత్య ముడితో ఒక్కటైన భార్యాభర్తలదే అని  నా ఉద్దేశ్యం.

        ఇంక అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో నాతో  పెళ్ళికి ఏమేమి కొనాలో, తర్వాత సంసారం లో ఏమిటి సమకూర్చుకోవాలో సంప్రదించారు.

          ఒకరోజు చిన్నన్నయ్య మా ఇద్దరినీ ఫస్ట్ షో సినిమాకు తీసుకువెళ్ళాడు. పుత్సల వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు బహుశా ఆ వీధిలో ఉన్న బంధువుల చూపులన్నీ మా వెంట వెంటనే నడిచి శల్యపరీక్ష చేసే ఉంటాయి. సినీమా అయిపోయాక ఇద్దరం ఎత్తుగా ఉండే అక్కడి రిక్షాలో ప్రయాణం ఒక కొత్త అనుభవం కలిగించింది. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి పది దాటింది. అన్నయ్యా, అమ్మా నిద్రపోయారు. గేటు తలుపు కొట్టినా లేవలేదు.ఆయన చటుక్కున గేటు ఎక్కి గోడ దూకి గేటు తీసారు. నేనూ, చిన్నన్నయ్య ఆశ్చర్యపోయాము. నా దగ్గర తన హీరోయిజం చూపించటానికి ఇలా చేసారా అని ముసిముసిగా నవ్వు కున్నాను.

          ఎవరూ దగ్గర్లో లేనప్పుడు అంటే అన్నయ్యలు సాయంత్రం బైటకు వెళ్ళినప్పుడు మాత్రం డాబా మీద సూర్యుడు చీకటి దుప్పటి కప్పుకునేవరకూ, చిరువెన్నెల తుప్పర్లలో తడుస్తూ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం. నేను పాడిన లలిత గీతాలు వినేవారు. పండుగ మూడురోజులూ నిముషాలలాగే గడిచిపోయాయి.

          ‘డిగ్రీ మూడవ సంవత్సరంకి హైదరాబాద్ లో ఏదైనా కాలేజీ లో చదవటానికి కుదురుతుందేమో స్నేహితులను  కనుక్కుంటాను’ అన్నారు కానీ ‘రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజన జరిగేలాగే కనిపిస్తుంది. అలా జరుగుతే మా ఆఫీసులో కూడా మార్పు వస్తుందేమో. అప్పుడు ఎక్కడ చదవాలనేది ఆలోచిద్దాం. అయితే నా దగ్గరే ఉండి చదువు కుంటేనే బాగుంటుంది.” అనే అభిప్రాయం వెలిబుచ్చారు..

          డిగ్రీ మూడవ సంవత్సరం హైదరాబాద్ లో చదవటానికి కుదురుతుందా’ అని మాకు ఫిజిక్స్ చెప్పే మా ప్రిన్సిపాల్ సీతాకుమారి గారిని అడిగాను. యూనివర్సిటీలు వేర్వేరు  కనుక అది కుదరదని, అందులోనూ హైదరాబాద్ లోని ఉద్యమం నేపధ్యంలో  అసలు కుదరదనీ, ఈ ఒక్క ఏడాది ఇక్కడే చదవటమే మంచిదని అన్నారు ఆమె.

        హైదరాబాద్ లో తెలంగాణా ఉద్యమం తీవ్రంగానే ఉందని,ప్రత్యేక తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ నుండి గ్రామాలకు విస్తరిస్తున్న వైనం కొంత, కొంతగా తెలుసు కుంటున్న కొద్దీ మనసును దిగులు కమ్ముకుంది.

          ఆంధ్రాలోనూ విశ్వవిద్యాలయాల పరిధిలో అసహనాలూ ఆందోళనలూ అప్పుడప్పుడు రాజుకుంటున్నా ఎక్కువగా తీవ్రతరం కాలేదు.

          ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీ మారటం మంచిది కాదనే మిత్రులు అభిప్రాయం వెలిబుచ్చారు. ఆయనతో’ ‘ ఒక యూనివర్సిటీ కాలేజీలో చదువుతూ మరో యూనివర్సిటీ కాలేజీలో తర్వాతి సంవత్సరం చదవటానికి వీల్లేదట’ అన్నాను. అది నిజమేనని అందరూ చెప్పారు. ఇక మూడవ సంవత్సరం విజయనగరం లోనే చదవటం తప్పదేమో. అయితే పెళ్ళయ్యాక కూడా అన్నయ్యల మీద నా చదువు భారం పడకూడదని భావించాను. అందుకు ఆయనకూడా అవసరమైన డబ్బు పంపుతానని అన్నారు కానీ పెళ్ళయ్యాక కూడా మరో ఏడాది దూరంగా ఉండటానికి నా మాట తీసేయలేక ఆయన అతి కష్టం మీద ఒప్పుకున్నారు

          ఫస్ట్ ఇయర్ లోనే పెళ్ళిచేసుకుని చదువు మానేసిన నా సహాధ్యాయి సూర్యకాంతం పరిస్థితి నాకు రాకుంటే చాలు అనుకున్నాను.

          రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన ‘తెలుగు అకాడమీ’ మెంబర్లు ఆ ఏడాది నుండి కొత్తగా మొదలైన  తెలుగు మాధ్యమం కి అవసరమైన ఇంటర్ పుస్తకాలు తెలుగులో ప్రచురించాలని వాటికి చిత్రాలు వేయాలని ఆయనని అడిగారట. అవి వేస్తే డబ్బులు వస్తాయని,పెళ్ళి ఖర్చులకు ఉపయోగ పడుతుందని సంబరంగా అన్నారు. అందుకని ఇంకా ఉండాలని ఉన్నా వెళ్ళక తప్పదని తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. వెళ్ళేటప్పుడు యథాప్రకారం నేను రాయటానికి అశ్రద్ధ చేస్తానేమోనని ప్రతీ వారం ఉత్తరం రాయమని చెప్పి కవర్లు కూడా కొని ఇచ్చారు.

          మళ్ళా యథాప్రకారం నేనూ, నా కాలేజీ చదువు మొదలైంది.పెళ్ళి సమయంలోనూ, ఆతర్వాత హైదరాబాద్ కి వెళ్తే చదువు కుదరదని ఈలోపునే నోట్స్, రికార్డులు పూర్తి చేయటం హడావుడిలో పడిపోయాను.

          హైదరాబాద్ నుండీ పెద్దపెద్ద రెక్కలతో ఎగిరొచ్చిన పావురాలు ప్రతీ వారం ఒలకబోసిన అనురాగాల మూటలు నా దోసిట్లో తొణికిసలాడుతూనే ఉన్నాయి.

        అన్నింటికీ సమయం సమకూర్చుకోలేక సంగీత కళాశాలకు వెళ్ళటం మానేసాను. ఒకరోజు అక్కయ్య దగ్గర నుండి వచ్చిన ఉత్తరం నాకు మరింత కంగారు తెచ్చిపెట్టింది.

“నువ్వు చదువు మధ్యలో పెళ్ళి చేసుకుంటున్నావు. చదువు మానేసే ఉద్దేశం ఉందా? ఒకవేళ గర్భం వేస్తే అప్పుడైనా మానేయాల్సి ఉంటుంది. చదువు పూర్తి అయ్యేవరకూ పిల్లలు వద్దనుకుంటే సూర్యారావు మామయ్య కూతురు డాక్టర్ కదా ఆమె సలహా ముందుగానే తీసుకో. వీర్రాజుతో ఈ విషయం సంప్రదించి నిర్ణయించుకో” అని రాసింది అక్కయ్య. ఈ విషయం ఇంతకు ముందు ఆలోచించనే లేదే అనుకున్నాను. వెంటనే ఆయనకి ఈవిషయం రాస్తే ఆయనకూడా నా ఆలోచనను సమర్థించారు. నేను మామయ్య కూతురు కి ఉత్తరం రాసాను.ఆమె వెంటనే సమాధానం రాసింది. బహిష్టు తర్వాత ఆరవరోజు రాత్రి  నుండి ఇరవైఒక్క రోజులు రోజుకొక మాత్ర చొప్పున వాడి ఆపేయాలనీ, తర్వాత రెండోరోజు మామూలుగా బహిష్టు వస్తుందనీ, ఈ రకంగా అవసరమైనంత కాలం వాడవచ్చని చెప్పింది. వివాహం తర్వాత విజయనగరం వచ్చేస్తే మరి వాడఖ్ఖరలేదని, నీభర్త వచ్చిన నెల మాత్రం మళ్ళా వాడమని చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసి పంపింది. ఆ మాత్రలు వాడుతున్నప్పుడు కడుపులో తిప్పినట్లుగా ఉండొచ్చు అటువంటప్పుడు చప్పరించే సి-విటమిన్ మాత్రలు కూడా వాడమని రాసింది. ఆ ప్రిస్క్రిప్షన్ ను వీర్రాజుగారికి పంపాను. వెంటనే కొని పార్సిల్ లో పంపారు.

          అటు హైదరాబాద్ లోనూ,ఇటు విజయనగరం లోనూ నిముషాలు గంటలుగా, గంటలు రోజులుగా  పొడవుగా సాగిపోయాయో ఏమిటో  ఎదురు చూస్తున్న రోజు ఎంతకీ రానట్లే అనిపించింది.

*****



17, ఏప్రిల్ 2022, ఆదివారం

సహృదయ విమర్శకులు రామమోహనరాయ్

 ~ సహృదయ విమర్శకులు రామ్మోహన రాయ్ ~


       కడియాల రామ్మోహన రాయ్ 1944, ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కడియాల భద్రయ్య నాస్తికుడు, హేతువాది, సాహిత్యాభిలాషి, కమ్యూనిస్టు పార్టీ అభిమాని కావటంతో ఆయన ప్రభావం వలన హేతువాదం, నాస్తికత్వం, మార్క్సిజం దృక్పథం గల రామ్మోహన రాయ్ సాహిత్యమూ,రచనలూ కూడా అదే పంథాలో సాగాయి.

           రామ్మోహన రాయ్ మృదుస్వభావి కావటాన ఎప్పుడూ కఠినంగా, పరుషంగా మాట్లాడరు.తాను చదివిన రచన నచ్చినప్పుడు ఆ రచయితగా నీ,కవిగానీ వయస్సులనూ,పాతకొత్తలను ఎంచకుండా ఫోన్ చేసి అభినందించే నైజం ఆయనది.

      యువ కవులకు ఆధునిక సాహిత్యం పట్ల అవగాహన కల్పించే పెద్ద బాలశిక్ష గా 'తెలుగు కవితా వికాసం' గ్రంథాన్ని చెప్పుకోవచ్చు.

వర్తమాన కవిత్వంపై గల అభిమానంతో ప్రచురితమైన కవిత్వాన్ని, కవితా సంపుటాలను ప్రతీ ఏడాదీ శ్రధ్ధగా చదవటమే కాకుండా విశ్లేషణ చేస్తూ చాలా కాలంపాటు వ్యాసాలు రాశారు.

         కవులూ,రచయితల పట్ల నిష్పక్షపాతంగా రచనలను ఆసాంతం చదివి తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేసేలా వ్యాసాలు రాసే సహృదయ విమర్శకులు రామమోహనరాయ్.

         సాహిత్యం పట్ల చక్కని అభిరుచి కలిగేలా పన్నెండు విమర్శగ్రంధాలను సాహిత్య లోకానికి అందించిన ప్రముఖ సాహితీవేత్త.అంతే కాక అనేక అముద్రిత సాహిత్య వ్యాసగ్రంథాలు కూడా ఉన్నాయి.అవికూడా గ్రంథం రూపంలో వస్తే విమర్శకులకు మార్గదర్శకంగా ఉంటుంది.

     సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ ప్రచురించిన ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ లిటరేచర్ లో రామ్మోహన రాయ్ గారు రాసిన 28 వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

         కడియాల రామ్మోహన రాయ్ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలలో లోని సాహిత్యవిమర్శను పరామర్శిస్తూ సుదీర్ఘమైన,సవివరణాత్మకంగా రాసిన "మానసోల్లాసం"కవిత్వం,నవలా,నాటకం, వ్యాసం మొదలైన సాహిత్యప్రక్రియలపై విమర్శ చేయాలంటే విమర్శకులకు గురుతరమైన బాధ్యతను తెలియజేసే విధంగా రాసిన గ్రంథం.450 పేజీలు గల ఈ గ్రంథంలో 1966-2016 వరకూ అనగా అర్థశతాబ్ది తెలుగు సాహిత్యవిమర్శకు చెందిన అమూల్యమైన వ్యాసాలు తెలుగును ప్రధాన భాషగా అభ్యసించే విద్యార్ధులకూ, పరిశోధకులకు మాత్రమే కాకుండా విమర్శకులకు కూడా రిసోర్స్ పుస్తకంగా ఉపయుక్తంగా ఉంటుంది.సాహిత్యవిమర్శ ఒక కళ అని ప్రతిపాదించిన ఈ గ్రంథాన్ని ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురించి సాహితీవిమర్శకు ఒక దారిదీపంగా అందించింది.అందుకే ఆచార్య ఈడిగ సత్యనారాయణ గారు " పద సౌష్టవం,అర్థగాంభీర్యం కలిగి మానసోల్లాసానికి అద్దం పడుతున్న ఈ వ్యాస సంపుటి సాహిత్యలోకానికి కడియాల రామ్మోహన్ రాయ్ గారు అందించిన అపురూపమైన కానుక గా అభినందించారు.

            తెలుగు నవలశతజయంతి సందర్భంగా1972 లో విజయనగరం మహారాజావారి సంస్కృతాంధ్ర కళాశాలలో "నూరేళ్ళ తెలుగు నవల తీరుతెన్నులు" అనే అంశం గురించి ప్రసంగించమని గూడపాటి సాంబశివరావు గారు కోరగా రామ్మోహన రాయ్ అప్పట్లో వచ్చిన గ్రంథాలను అధ్యయనం చేసారు.తెలుగు నవల లక్షణాలూ,స్వరూపస్వభావాలే కాక భాషా పరిశీలనలో భాగంగా వివిధ మాండలీకాలను,వర్గ మాండలికాలనూ పరిశీలించటమే కాకుండా వివిధ ప్రాంతాల సాహిత్య మిత్రులతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపారు.

         తెలుగు నవలలు(1872-2010) వరకూ నవలా ప్రారంభం, పరిణామక్రమం,సమాజంపై ఆయా నవలలు కలిగించిన ప్రభావం ప్రాతిపదికన తెలుగు లోని అత్యుత్తమమైన వంద నవలల గురించి అధ్యయనం చేసి రచించిన గొప్ప పుస్తకం " మన తెలుగు నవలలు"

          ఒక జాతి సంస్కృతి నీ, తెలుగు ప్రజలజీవనవిధానం, తెలుగు జాతి చరిత్ర,సమాజం, పరిణామక్రమంలో ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులు,సమాజంలో సమూలమైన మార్పులకు కారణమైన సామాజిక సంఘటనలను సాహిత్యం ఏవిధంగా ఒడిసిపట్టి ప్రతిబింబించింది మొదలైనవన్నీ ఈ నవలల ద్వారా తెలుస్తాయని రామ్మోహన రాయ్ ఈ వ్యాసాల్లో ప్రస్తావించారు.

               వివిధ తెలుగు ప్రాంతాల్లోని ప్రజలభాషలోని జాతీయాలూ,సామెతలూ,పలుకుబళ్ళూ రచయితలు వ్యక్తీకరించిన విధానాన్ని వివిధ రాజకీయ, ఆర్థిక,సామాజిక పరిస్థితులకు రచయితల ప్రతిస్పందన సాహిత్యం ద్వారా తెలియజేయడాన్ని రామ్మోహన రాయ్ గారు ఇందులో చూపించారు.

                సాహిత్యం లో 1872 నుండివ2010 వరకు వచ్చిన వివిధ వాదాలను ఆయా కాలంలో రచయితలు ప్రస్తావించిన విధానాన్ని ప్రశంసించారు.

                కర్నూలు లో డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న నరహరి గోపాలకృష్ణమ సెట్టి రచించి ప్రచురించిన "శ్రీ రంగరాజు చరిత్ర (క్రీ.శ. 1872) " నే మొదటి నవలగా వీరు ప్రస్తావించారు.అయితే అప్పటికి నవల అని కాక నవీన ప్రబంధం అన్నారని పేర్కొన్నారు. వీరేశలింగం గారు తన స్వీయచరిత్ర ము లోకూడా శ్రీ రంగరాజు చరిత్ర గురించి చెప్పక పోయినా ఈ రెండింటిలో గల పోలికలు ఈ గ్రంథాన్నిి వీరేశలింగం గారు చదివారనేది తెలుస్తుందని శ్రీ కొత్తపల్లి వీరభద్రరావు గారు తెలిపారనేవిషయాన్ని రామ్మోహన్ రాయ్ తో వ్యాసం లో ప్రముఖంగా పేర్కోన్నారు.

                ఈ విధంగా తెలుగులోన ఆణిముత్యాలు లాంటిి వంద ప్రముఖ నవలల గురించి రామ్మోహన్ రాయ్ గారు రాసిన వ్యాసాలు మన నవలా సాహిత్యం ప్రాముఖ్యత,ఆయా నవలాకారుల ప్రతిభా పాటవాలను తెలియజేసేలా ఉన్నాయి.138 ఏళ్ల తెలుగు ప్రజల సాహిత్యం, సంస్కృతినీ తెలుసు కోవటానికి ఒక గొప్పగ్రంథంగా రామ్మోహన రాయ్ గారి " మన తెలుగు నవలలు"ఉపయోగ పడుతుంది.

                ఇటీవల రామ్మోహన రాయ్ గారు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడి మీ కవిత్వం మీద సమగ్రమైన వ్యాసం రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను" అన్నారు. కానీ నేనే ఈ విధంగా వారికి శ్రద్ధాంజలిగా రాయవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను.