16, నవంబర్ 2013, శనివారం

emarupaatu tagadu

ఏమరుపాటు తగదు




ప్రతి మనిషి లోనూ

అంతరాంతరాలలో ఏమూలో

ఎక్కదో దాక్కునే వుంటుంది

రక్తంలో కణప్రవాహం లోనా

మనసులో ఎగిరే వూహల రెక్కలక్రిందనా

హ్రుదయ కవాట శబ్ధతరంగాలవెనకనా

కనురెప్పలకింద కలల అలజడి గానా

ఏ నిస్సహాయ క్షణం లోనో సూక్ష్మశరీరమై దూరి

శరీరమంతటా సంచరిస్తూనే వుండివుంటుంది

నవమాసాలూ మోసి రక్తం తోపాటూ

ఆకారాన్నీ అస్తిత్వాన్నీ పోతపోసిన

తల్లి నుండి అండరూపమై కలిసిందా

స్త్రీగర్భం లోకి సరాసరి బీజరూపమై జారిందా

అమాయకంగా కన్నిప్పిన శిశువు

పాలతోపాటూ విషాన్నీ తాగాడా

ఎదుగుతూ ఎదుగుతూ

ఇంతతి కసినీ కార్పణ్యాన్నీ

ఎక్కడనుండి సేకరించుకొని తనలో నిక్షిప్తం చేసుకొన్నాడు

ఏ అపజయమో గుందెనికోసిందనో

ఏ ఆగ్రహమో దావానలమై నిలువెల్లా దహించిందనో

ఏ అవమానమో హ్రుదయాన్ని చీల్చిందనో

ఎప్పుడో ఏక్షణం లోనో నిస్ప్రుహ

మనసుని ఆవరించిన సమయం లో

ప్రవేశించ్ విశ్వరూపమై

సుడిగాలిలా శరీరాన్ని చుట్టేసి

మనసునీ మస్తిష్కాన్నీ ఆక్రమించి

ఆధిపత్యం సాధించే యత్నం చేస్తునేవుంటుంది



నేలానీరు వాయువుల్నే కాదు

మనిషి తనలోని మనిషినీ

కాలుష్యం లోనే పెంచి పోషిస్తున్నాడేమో

అందుకే మరందుకేనేమో

కామ క్రోధ మద మాత్స్యర్యాలతో

ఒళ్లంతా కళ్లైన ఇంద్రుళ్లు

మన చుట్టూ నిశాచరులై తిరుగు తున్నారు

దంతాలు సాగి సాచిన కోరల్నీ

పదునుగోల్లు విచ్చిన పంజాల్నీసారిస్తూ ద్రాకులాలు

వీధుల్నిండా కవాతు చేస్తున్నారు

సీసాల్లో కదిలేవి దాహం తీర్చే నీళ్లు కావు

మత్తుని తలకెక్కించేవో

మల్లెల్ని మసి చేశే ఆంలా లొ

హస్తభూషణాల్ని చేసుకొని

కన్నవారి కంటి దీపాలు

దేశానికి రేపటి నాయకులు

సమాజాన్ని నడపాల్సిన నవ యువత

మాదక ద్రవ్యాల మత్తు లో నిర్వీర్యమైపోతూ

కురుక్షేత్రయుద్ధం లో చీలిన గుండెనుండి

ప్రతి రక్తబిందువూ రూపెత్తిన దుశ్శాసనుళ్లలా మారి

భూమి మీద ప్రతి ప్రాంతానా

వస్త్రాపహరణ సన్నడ్ధులై

చేతులు చాపుతూ తిరుగుతూనే వున్నారు

నిజానికి దానవత్వం కళ్లుతెరవడానికి

అర్ధరాత్రో అపరాత్రో కానక్కర్లేదు

పచ్చటి కుటుంబాల మధ్య

తల్లీపిల్లల్కీ

తంద్రీకూతుళ్లకీ

అక్కాతమ్ముళ్లకీ

అన్నాచెల్లెళ్లకీ

ఒక్కటొక్కటిగా

పరిమళించాల్సిన మానవసంబంధాలనన్నింటినీ

నిర్ధాక్షిణ్యం గా చిధ్రం చేస్తూ

కుట్రలతో కుతంత్రాలతో రగిలి పోవడం

కళాత్మకంగా రంగుల్లో చూపే మాన్ ష్టర్లని

నోరెళ్లబెట్టి చూడటం వరకైతే బాగానే వుంటుంది

చూస్తూ ...... చూస్తుండగానే

ఏదో ఒకనాడు

మానసికం గా మనని కూడా చంపి

మానవత్వం పై యుద్ధం ప్రకటించేందుకు

మనలో ఏ రక్తకణం చాటునో

మరో రక్తపిశాచి అవకాసం కోసం

పొంచి వుండే వుంటూంది

తస్మాత్ ... జాగ్రత్త