22, జులై 2021, గురువారం

కారా మాస్టారు కు నివాళులు

 తెలుగు కథా ప్రస్థానం వయసుఎంతో కొంచెం తక్కువగా కారా మాస్టారు జీవితం అంతే.కథ గుర్తు వస్తే కారా మాస్టారు గుర్తు వస్తారు,ఆయన గుర్తు వస్తే కథానిలయం నిలువెత్తున కళ్ళ ముందుకు వస్తుంది.తెలుగు కథాసాహిత్యం లో విడదీయలేని బంధం అది.

 కారా మాస్టారి నవతి సందర్భంగా సావనీర్ కోసం వ్యాసం రాయమని అట్టాడ గారు అడిగినప్పుడు ఎంతోమంది వారి సాహిత్యం గురించి రాసారు ఇంకా నేనేమి రాస్తాను అని వారి కథలు పుస్తకం తీసి చదవటం మొదలెట్టేసరికి పేజీ పేజీకీ నాలో ఉద్వేగం కలిగింది.ఎన్ని జాతీయాలో,ఎన్ని నానుడు లో, ఇంకెన్ని సామెతలో ఉత్తరాంధ్ర మాండలీకం నింపుకుని పరిమళాలు నా మనసు చుట్టేసాయి.ఇక అంతే అవి నోట్ చేసుకుంటూ "సామెతలు,నానుడుల పరిమళం" అనే వ్యాసం రాసాను.

    అంతకు ముందు తెలుగు కథలు సరళ గ్రాంథికంలోనే ఎక్కువమంది రాసేవారు.కారా గారూ, రావిశాస్త్రి,బీనాదేవీ ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలజీవనశైలినీ, సంస్కృతి నీ,కడగండ్లనూ,వారి మనోభావాలను కళ్ళకు కట్టేలా మాండలికసొబగుతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసారు.

          ఇక వారు స్థాపించిన కథానిలయం కథా పరిశోధకులకు కల్పవృక్షం, సాహిత్య గని.నేను శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసినప్పుడు గానీ,తదనంతరం రచయిత్రుల కథలు గురించి వ్యాసాలు రాసినప్పుడు గానీ కథానిలయం ద్వారా ఎందరో కథకులు కథలను చదవ గలిగాను.కథానిలయం వలనే సమగ్రమైన వ్యాసాలు రాయగలిగాను.అందువలన కథా సాహిత్యానికి కారా మాస్టారి కృషి విలువ కట్టలేనిది.

                హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మాఇంటికి వచ్చేవారు.తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ మహాసభలలో ప్రత్యేక పురస్కారానికి  వచ్చినప్పుడు సభా ప్రాంగణం లో కలిసినప్పుడు అప్పటికే వారికి కొంత మరుపు మొదలైనా నన్ను గుర్తు పట్టి మా అక్కయ్య నీ,అన్నయ్య నీ, వీర్రాజు గారి గురించి అడిగారు.నా వ్యాసాలు పుస్తకం పంపినప్పుడు వారు ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని ఆశీర్వదించారు.

                      మరొక రెండేళ్ళలో శతవసంతాలు పూర్తి చేసుకోవాల్సిన తరుణం లో వారు వెళ్ళిపోవటం శోచనీయం.ఐతే ఈ కరోనా కష్టకాలంలో ఏమీ బాధ పడకుండా ఈవిధంగా కుమార్తె చేతిలో అనాయాసమరణం ప్రాప్తించినందుకు కొంత ఊరట.

                            ఏది ఏమైనా ఒక తెలుగుకథా మహా వృక్షం నేలకి ఒరిగింది.ఇది సాహిత్య రంగానికి తీరని లోటు.ఈ రెండు మాటలు చెప్పే అవకాశం  నాకు కలిగించిన మనలో మనం అడ్మిన్ లకు ధన్యవాదాలు.

                                   కారా మాష్టారు కి నా బాష్పాంజలులు.

సంకలన సంపాదకులు

 సంపాదకత్వం గురించి గంగిశెట్టిగారు అందించిన వ్యాసం సమగ్ర సమాచారాన్ని అవగాహననీ కల్పించేలా ఉంది.ఆ విషయం మీద సభ్యులు కూడా మంచి చర్చను ఆసక్తి కరంగా కొనసాగించుతున్నారు.

పనిలో పనిగా వివిధ సమకాలీన సంచలనాలు మీద  పుంఖానుపుంఖాలుగా కథా,కవితా సంపుటాలు వెలువరుస్తున్నారు.ఉదాహరణకు యుద్ధం మీద ఒకరు సంకలనం వేయసంకల్పించి సంపాదకత్వం వహించినవారు యుద్ధం మీద కవితల్ని ఆహ్వానిస్తూ పేపరు ప్రకటన ఇచ్చారు.అంతే అప్పటివరకూ రానివారు కూడా రాసి పంపించేసారు.యుధ్ధంమీద కవితా సంకలనం వేసేసారు సదరు సంపాదకులు.అంతే తప్ప అంతకు ముందు ఎవరైనా పాతతరం నుండీ రాసారేమో ననే వెతుకులాట లేదు.ఎంత సులభం అయిపోయింది కదా సంకలనం సంపాదకత్వం?!.నిజానికి యుద్ధం మీద నేనొక దీర్ఘ కవితే రాసాను.దాని ప్రస్తావన కూడా లేదు.

  అదేవిధంగా బియాస్ నదిలో ప్రమాదవశాత్తూ కొట్టుకు పోయిన ఇరవై అయిదు మంది విద్యార్ధుల మీద ఒక సంకలనం వచ్చింది.అందులోనూ నా కవిత రాలేదు.అంటే ప్రకటన కు స్పందించి వచ్చిన కవితల్ని వేసేయటమే తప్ప చిత్తశుద్ధి తో నిజాయితీగా, నిబద్ధతతో సంకలనకర్తలు గా , సంపాదకులుగా పేరు సాధించటం ఎక్కువైపోయింది.

    మరికొందరు కథో,కవితతో పాటూ డబ్బు కూడా ఇవ్వమంటున్నారు.అంటే మనమే,కథో,కవితో ఇవ్వటమే కాకుండా మనడబ్బు తోటే సంకలనం వేసి పనిలో పనిగా డబ్బు మిగిల్చి వాళ్ళదో పుస్తకం కూడా ప్రచురించేసుకుంటున్నారు.ఇదీ ఈ నాటి సంకలనాలకు సంపాదకత్వం వహిస్తున్న వ్యాపార కళ.

    ఏదైనా అవాంఛనీయం,అక్రమం, అన్యాయం, దుర్మార్గం,ఇలా,ఇలా.....ప్రముఖులమీదా,దినాలమీదా కాదేదీ సంకలనకనర్హం అన్నట్లు ఇటువంటి సంపాదకుల పంట పండిస్తున్నాయి.ఇంతకూ వీరూ సంపాదకులే కదా 

    గం.లా.నా. గారి వ్యాసం చూడగానే ఉండలేక రాసాను.ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యురాలిని.

విద్యార్థులతో అరకు యాత్ర

 నేను పనిచేసిన స్కూల్ ఆర్టీసీ హైస్కూల్.ప్రతీ ఏడాది దసరా సెలవుల్లో ఒక్కో సారి ఒక్కో రాష్ట్రంకు విజ్ఞాన యాత్ర కోసం మాకు రెండు బస్సులు, నలుగురు డ్రైవర్లను ఉచితంగా  ఇచ్చేవారు.

ఒకసారి అరకు వెళ్ళాము ఆడపిల్లలకు ఒక బస్సు,మగపిల్లలకు ఒక బస్సు.అరకుపైకి వెళ్ళినప్పుడే ఒక బస్సు కొంచెం ప్రోబ్లం ఉన్నట్లు అనిపించింది.మళ్ళీ కిందకు దిగేముందు డ్రైవర్లు నాకు,మరో టీచర్ కు విషయం చెప్పి చిన్న మగపిల్లలను అందరు టీచర్లను ఒక బస్సులో ఎక్కించి,8,9,10 తరగతుల పిల్లలను కొంత దూరం ఘాట్ రోడ్డు దాటేవరకూ నడిచి రమ్మని చెప్పారు.అందరూ భయపడతారని అందరికీ చెప్పలేదు.అన్నారు.

 మేము కూడా చెప్పలేదు.ఖాళీ బాస్ ముందూ,దానివెనుక మా బాస్ వెళ్ళటానికి ప్లాన్.బస్సులు బయలు దేరాక ఒక పది పదిహేను మంది పిల్లలు ఖాళీ బస్ టాప్ ఎక్కి ఛయ్య ఛయ్యా అంటూ డాన్స్ మొదలెట్టారు.బస్సు రొదలో ఆఫీస్ డ్రైవర్ గమనించలేదు .వెనక బస్ లోని ఆడపిల్లలు కూడా  డాన్స్ మొదలెట్టారు.ఘాట్ రోడ్డు లో బస్ ఆపటానికి లేదు.మా బస్ లో డ్రైవర్లు భయపడసాగారు.నాకు మరో టీచర్ కూ భయంతో చెమట్లు పట్టేసాయి. 

  కొంత దూరం అలాగే జాగ్రత్తగా నడిపి సేఫ్ ప్లేస్ చూసి ఆపారు. ఇంకా అప్పుడు టాప్ మీదున్న పిల్లలను కిందకు దింపి బాస్ పాడైన విషయం చెప్పి" మీకు ఏమైనా జరిగితే మీ పేరెంట్స్ కి ఏంచెప్పుకుంటాం" అని మొట్ట మొదటి సారి నేను కోపంతో వాళ్ళని బెత్తం తో బాది బావురుమని నేను కూడా ఏడ్చేసాను.అప్పుడు అందరూ భయంతో దుఃఖంతో గండం తప్పిందని అనుకున్నారు.

  మిమ్మల్ని విశాఖ బస్ స్టేషన్ వెయిటింగ్ రూం కి చేర్చి బాస్ రిపైర్ కి తీసుకు వెళ్ళారు.ఈ సంఘటననా నా ఇస్కూలు కథల్లో కూడా రాసాను.

 వచన కవితా ప్రక్రియ లోకి అడుగు పెట్టి క్లిష్టమైన సంస్కృత పదబంధాలూ భాషాడంబరాలతో రాస్తేనే కావ్య రూపం పొందుతుందని భావించిన ఆధునిక కవులేకాక సీనియర్ కవులు సైతం నిజాయితీగా నిర్భీతిగా చెప్పిన కుందుర్తి సరళవచనా శైలికి లొంగిపోయారు.

 ఇక తిలక్ కవిత్వంలో భావకవుల సౌందర్యకాంక్ష, అభ్యుదయ కవుల సామాజిక కర్తవ్యం రెండూ కలసి నడుస్తాయి. అందుకనే ఆయన కవిత కళాత్మకమే కాదు, కరవాలమంత పదునైనది అనే భావన పాఠకులకు కలుగుతుంది.తిలక్ నిజాయితీగా చెప్పిన

'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు

నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'

మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు.

 శ్రీ శ్రీ తొలి రోజుల్లో రాసిన కొన్ని కవితలలో సంస్కృత భాషాడంబరం,సమాసాలూ కనిపించినా "మెట్లు" కవిత సభలో చదవగా విన్న ఒక పిల్లవాడు "ఇంతేనా కవిత్వమంటే నేనూ రాయగలను " అన్నాడని , సామాన్యుడికీ అర్థమయ్యేలా కవిత ఉండాలని శ్రీశ్రీ ఓ సందర్భంలో చెప్పాడు.

    నిజానికి ఏ సాహిత్య ప్రక్రియ ఐనా సరే దానికి తగిన భాష అదే సమకూర్చుకుంటుంది.

    సామాజిక స్పృహ కవిత్వాన్ని మింగేసిందనటం,సామాజిక స్పృహ ఒక జాడ్యం గా భావించటం అనటం నేను ఒప్పుకోను.

    ఇంకా వెన్నెలా,పూవులూ,ఆమనీ,ప్రేమా,ప్రేయసీ అంటూ కవిత్వం రాయటం ప్రపంచంలో జరుగుతోన్న అనేకానేక సందర్భాలూ, సంఘటనలూ,సంక్షోభాలనుండి పలాయనవాదంగా భావించాలి.

    కవిత్వం ఎప్పుడూ ఆత్మాశ్రయంగా మొదలైనా నేను నుండి మనం లోకీ మనం నుండి జనంలోకీ మమేకం కావాలి.

    పదచిత్రాల్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించితే ఒక్కొక్కసారి వ్యతిరేకార్థం లో కి వచ్చే ప్రమాదం కూడా ఉంది.అందుకని రాసిన వెంటనే మాధ్యమాల్లోనో పత్రికలకో పంపకుండా ఎవరికి వారు తిరిగి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.

    ఏ సాహితీవేత్త కైనా వారి సాహిత్యమే వారి వ్యక్తిత్వం కావాలి,వారి వ్యక్తిత్వమే వారి జీవితం కావాలని నేను నమ్ముతాను.

14, జులై 2021, బుధవారం

నడక దారిలో--6

 నడక దారిలో-6


         ఆ ఏడాది గడిచాక తిరిగి విజయనగరం లోని కంటోన్మెంట్  మున్సిపల్ హైస్కూలులో ఫోర్త్ ఫాం (తొమ్మిదో తరగతి)లో చేరాను. స్కూలు కు అయిదారు ఇళ్ళు అవతల మా ఇల్లు ఉండేది.అదే స్కూలులో అన్నయ్య ఇంగ్లీష్ మాష్టారు.అప్పుడే చిన్నన్నయ్యకి ట్రైనింగ్ పూర్తి కావటంతో వెంటనే ప్రాధమిక పాఠశాల లో మాష్టారుగా ఉద్యోగం వచ్చింది.మామయ్య యూఎస్ కి వెళ్ళటం వలన పెద్దక్కకూడా మాతోనే కలిసి  ఉంది.
     ఏడాది పాటు సాహిత్య పఠనం వల్ల కావచ్చు.క్లాసులో తెలుగు మాధ్యమంలోని అన్ని సబ్జెక్టులలోనూ బాగా రాణించేదాన్ని. ముఖ్యంగా తెలుగులో కొత్తగా చందస్సు బోధించారు.ఆటవెలదిలో గణాలు కూర్చుకొని మా తెలుగు మాస్టారు రామకృష్ణమాచార్లులుగారి మీదే మొదటి పద్యం రాసి చూపించుతే మా మాష్టారు పొంగిపోయారు."నువ్వు కవయిత్రి వి అవుతావు తల్లీ" అని దీవించారు.మాష్టారి యిల్లు విజయనగరం కొత్తపేట మంటపం దగ్గర ఉండేది.1980 లో నా మొదటి కవితా సంపుటి " ఆకలినృత్యం" వారి ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చాను.
              1965లో భారత్ పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్దాన్ని రెండవ కాశ్మీర్ యుద్దం అని కూడా అంటారుట.భారత వాయు సేన, పాకిస్తాన్ వాయు సేనలు స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా ఈ యుద్ధంలోనే పాల్గొన్నాయిట.ఆ సమయం లో ఆకాశంలో చాలా కిందనుండి విమానాలు తిరుగుతూ ఉండేవి.నౌకాశ్రయాలపై దాడి జరుగే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చేవి.రాత్రి సమయంలో  " బ్లాకౌట్" చేయాలని అనేవారు.ఆ బ్లాకౌట్ అనేమాట మొదటిసారి వినటం.ఇంట్లోని వెలుతురు బయటకు కనబడకుండా కిటికి అద్దాలకు నల్లకాగితం అంటించాలి అని అనేవారు.మరి వైజాగ్ లో అది పాటించారో లేదో నాకైతే తెలియదు.
1965 జులైలో పాకిస్తాన్ సైన్యం, భారత పాలిత కశ్మీర్‌ను భారత్ నుంచి దూరం చేయడానికి ఒక గొరిల్లా ఆపరేషన్ ప్రారంభించింది. దానికి ‘జిబ్రాల్టర్’ అనే పేరు పెట్టారుట.ఆ యుద్ధం విశేషాల్ని తేదీ వారీగా ఒక పాత డైరీ లో కూడా రాసుకునే దాన్ని. 
              ఐదు వారాల పాటు జరిగిన యుద్దంలో ఇరు వైపుల వేలాది మంది సైనికులు చనిపోయారు. చివరికి ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్దం ముగిసింది.ఆ యుద్ధం సందర్భాన్ని, పౌరుల బాధ్యత తెలిపేలా నా రెండవ ఆటవెలది పద్యం రాసాను.బహుశా నేను ఇరవై ఏళ్ళ క్రితం "యుద్ధం ఒక గుండె కోత" దీర్ఘ కవిత ను రాసేందుకు మూలం ఆనాడు నా మనసులోనే బీజం పడిందేమో అనిపిస్తుంది.
              మా మాష్టారు అప్పట్లో  ఒక లిఖిత పత్రికను ప్రారంభించారు.దానికోసం రాయమని నన్ను ప్రోత్సహించారు.ఆ విషయాలు మరొక సందర్భం లో తెలియజేస్తాను.
             తొమ్మిదో తరగతి ఏ సెక్షన్ లో పదిమంది అమ్మాయిలం.ఆ ఏడాది నుండి గణితంలో కాంపోజిట్,జనరల్ అని రెండు కేటగిరీ లు ఉండేవి.కాంపోజిట్ లెక్కలు క్లాస్ లో  నేనూ,రాజీ తప్ప మిగతా అందరూ అబ్బాయిలే.అందువల్ల ఆ మూడేళ్ళలో రాజీ నాకు మంచి స్నేహితురాలైంది.               
            హిందీ సినిమాలు ఆడే ధియేటర్లలో ప్రేక్షకులు తక్కువగా ఉంటారు.అందుకని మేమిద్దరం హిందీ సినిమాకే వెళ్ళి ఆ సినిమా నడుస్తున్నంత సేపు బోల్డు కబుర్లతో పాటూ మనసులోని మాటలన్నీ కలబోసుకునేవాళ్ళం.ఆ స్నేహం నా చదువై నేను హైదరాబాదు వచ్చాక కూడా కొనసాగింది.రాజీ ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు దిద్దడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసే వాళ్ళం.ఐతే నేను ఆమెని సాంప్రదాయ ఆంక్షల లక్ష్మణ రేఖ దాటేందుకు చేయందిస్తున్నానని వాళ్ళింట్లో అపోహపడి మా స్నేహానికి మరొక లక్ష్మణ రేఖ గీసారు ఆమె పెద్దలు.ఐతే ఆ పెద్దలు వెళ్ళిపోయినా కూడా ఆమె ఉన్నత ఉద్యోగాలకు ఎదిగినప్పటికీ మరెందుచేతో పెద్దలు గీసిన లక్ష్మణరేఖలు దాటటానికి బదులుగా ఆ రెండు రేఖలకూ అదనంగా మరో రేఖను తనచుట్టూ తానే చుట్టుకుని ముడుచుకుపోయింది.ఆనాటి స్నేహం అలనాటి హిందీ పాటల్లో సుడులు తిరుగుతూ నా గుండెల్లో ఇంకా గుస గుస లాడుతూనే ఉన్నాయి.రాజీకి గుర్తు వస్తున్నాయో లేదో.
           పోలీస్ బారెక్స్  నుండి జానకీ, మేరీ రాజ్యలక్ష్మి కలిసి మా ఇంటికి వస్తే ముగ్గురం కలిసి రోజూ బడికి వెళ్ళే వాళ్ళం.జానకీ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత రెండో పెళ్ళి చేసుకున్న తండ్రి జానకిని పెద్దమ్మ ఇంట్లోనే ఉంచి చదివించేవారు.పెద్దమ్మకూతుళ్ళు ముగ్గురు ఉన్నా మానసికంగా ఒంటరి తనం అనుభవించేది జానకీ.
           తండ్రి పోయి ఆర్థిక స్వావలంబన లేని తల్లిదగ్గర పెరిగే ఆడపిల్లల గాధ నాదైతే,తల్లి పోయి తండ్రి మరో పెళ్ళి చేసుకుంటే పరాయి పంచన పెరిగిన బాధ జానకిది.అప్పటికి నేను చిన్నదాన్నే ఐనా నేను చదివిన సాహిత్యం లో అనేక జీవితాలు గురించి చదవటం వల్లనేమో నాకు తెలిసిన వారి జీవితాలనూ,వారి కుటుంబ పరిస్థితులను అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేసేదాన్ని. అందువలనే కాబోలు జానకి నా మనసుకు చాలా దగ్గర అయ్యింది.టిఫిన్ బాక్స్ మా ఇంట్లోనే ఉంచి మధ్యాహ్నం బెల్ అయ్యాక నాతో ఇంటికి వచ్చి రోజూ అందులోని ఎర్రని ఆవకాయ అన్నం తింటూ ఉండేది. నేను కూరగానీ, పప్పు గానీ ఇవ్వనా అని అడిగినా తీసుకునేది కాదు.పదో తరగతి తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిన జానకీ  హైదరాబాద్ లో మంచి ఉద్యోగస్తుని భార్యగా తిరిగీ కలిసింది.సుమారు ఇరవై ఏళ్ళ క్రితం వరకూ మా స్నేహం కొనసాగింది.అమాయకత్వం నిండిన పెద్ద పెద్ద కళ్ళూ,ఒత్తైన తాచుపాము లాంటి బారు జెడ తో బాపూ బొమ్మ లాంటి జానకి మాత్రమే "ఒసేవ్ సుభద్రా ఎన్నాళ్ళైందే చూసి ఎలా ఉన్నావే?" అంటూ నన్ను ఆలింగనం చేసుకుని  ఆత్మీయంగా సంభోదించే ఒకే ఒక్క  స్నేహితురాలు.నాకున్న ఇంటాబయటా తీరికలేని జీవితం తో జానకి ని మళ్ళీ కలుసుకోలేక పోయాను.పాత లేండ్ లైన్  నెంబర్ కు ఫోన్ చేస్తే బాగుండును అనుకొని కూడా ఏ వార్త వినాల్సి వస్తుందోనని నా జ్ణాపకాల లోనే జానకిని భద్రపరచుకొని గుర్తు వచ్చినప్పుడు ఆత్మీయంగా తడుముకుంటాను.
               మేరీ రాజ్యలక్ష్మి కూడా ఫిఫ్త్ ఫాం(పదోతరగతి) తర్వాత స్కూలు ఫైనల్ కి గుంటూరు వెళ్ళి పోయింది.మళ్ళీ ఎనభైలలో అనుకుంటా కవి దేవీప్రియ భార్య గా పరిచయం అయ్యింది.కానీ అప్పుడప్పుడు కలిసినా ఎందుచేతనో స్నేహం బలపడలేదు.రెండేళ్ళక్రితం ఆమె భౌతికంగా కూడా దూరమయ్యింది.
                  మరో మంచి స్నేహితురాలు కృష్ణకుమారితో స్నేహం ఆ నాటి నుండి నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. కృష్ణకుమారి ,ఆర్థికపరమైన, సామాజిక పరమైన ఏ విధమైన బాదరబందీలు గానీ ఏమీలేని మధ్య తరగతి కుటుంబానికి చెందినది.బహుశా అందువలనే కావచ్చు ఎప్పుడూ సరదాగా,జోవియల్ గా కలుపుగోలుగా నిష్కల్మషంగా ఉంటుంది.కుమారితో కబుర్లకు కూచుంటే కాలం ఇట్టే కరిగిపోయే ది.మరో స్నేహితురాలు కమల,నేనూ కుమారీ తో కలిసి ఒకసారి శివరాత్రి జాగారం కబుర్లు చెప్పుకుంటూనే పూర్తి చేయగలిగాము.అప్పుడప్పుడు నేనూ కుమారీ సినిమాలకు వెళ్ళే వాళ్ళం.
                  సినిమా అంటే గుర్తొచ్చింది.సినీమాహాల్లో  కుర్చీ టికెట్టు ఆరు అణాలో, అర్థ రూపాయో ఉండేది.చిన్నన్నయ్య ప్రతీ నెలా తీసుకు వచ్చే వెచ్చాలషాపులో ఆరోజుల్లో వార్తా పత్రికలలోనే ఆరోజుల్లో వెచ్చాలు పొట్లం కట్టి ఇచ్చేవారు.వాటిని డబ్బాల్లో వేసాక అమ్మ ఆ పేపర్లను సాపుగా చేసి దొంతు పెట్టేది.చిన్నన్నయ్య ప్రభా, ఆంధ్రజ్యోతి వారపత్రిక లు కొనే వాడు.అందులో నాకు నచ్చిన సీరియల్స్ కట్ చేయగా మిగిలిన పత్రికల్ని, దొంతి పెట్టిన పేపర్లను కలిపి  ఇంటి పక్కనే ఉన్న చిల్లర దుకాణంలో అమ్మితే రెండో మూడో రూపాయలు వచ్చేవి అందులోంచే నాకు అమ్మ సినిమాకు డబ్బులు ఇచ్చేది.
                  మా ఇద్దరికీ కాస్త బోర్ కొట్టే క్లాస్ హిందీ.కుమారీ పత్రిక ఒకటి తెచ్చేది వెనకబెంచీలో కూర్చుని జోకులు చదువుకొనేవాళ్ళం.ఒకసారి హిందీ టీచర్ కంటబడ్డాము."కూసే గాడిద మేసే గాడిదని చెడగొట్టినట్లు  సుభద్రని చదవనీకుండా చేస్తున్నావా" అని కుమారినే ఎక్కువ తిట్టేవారు." "పెద్దయ్యాక ఏ హైదరాబాద్ లాంటి ఊళ్ళోనో ఉండాల్సి వస్తే అప్పుడు హిందీ నేర్చుకోనందుకు బాధ పడతారు" అని టీచర్ తిడితే "మేము విజయనగరం దాటి వెళ్ళమండీ"అని కుమారి గొణిగేది.టీచర్ అన్నట్లు గానే కుమారీ నేనూ కూడా వివాహానంతరం ఒకేసారి హైదరాబాద్ చేరాం.అప్పట్లోఅంటే 1972 లో బజార్లో, కూరగాయలు కొనేటప్పుడూ,రిక్షావాలా తోటీ బేరం ఆడాలన్నా హిందీ రాక ఇద్దరం చాలా ఇబ్బంది పడేవాళ్ళం."హిందీ టీచర్ మనల్ని శపించేసారు సుభద్రా "అనేది కుమారీ.
                  నేను రాంకోటీ లో, కుమారి చిక్కడపల్లి లో ఉండటం వల్ల కలుసు కునే వాళ్ళం.తర్వాత మేమిద్దరం తరుచూ కలుసు కోకపోయినా, ఇప్పుడు  సింగపూర్ లో కొడుకు ఇంట్లో ఉన్నా ఏ ఏడాదికో ఫోన్ చేసుకున్నా మాస్నేహం పచ్చదనం అలాగే ఉంది.అందుకే  నేను2006 లో ప్రచురించిన నా కథలసంపుటి "రెక్కలు చూపు" ఆమెకి  అంకితం చేసాను.
                  నా చిన్ననాటి స్నేహితురాళ్ళ జ్ణాపకాలు తలచు కున్నప్పుడల్లా పెదాలమీద చిన్న చిరునవ్వు,గుండెల్లో సన్నని గిలిగింతా కలగలిసి నాచుట్టూ సురభిళాలు వెదజల్లుతూనే ఉంటాయి.మనసులోని మాట చెప్పుకో గలిగే స్నేహితులను మించిన సంపద లేదు కదా!అందుకేనేమో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు " సృష్టి లో తీయనిది స్నేహమేనోయీ" అన్నారు.

నడక దారిలో--7

 

నడక దారిలో--7

       1965-66 సంవత్సరాలలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ,మా ఇంట్లోనూ కూడా అనేక మార్పులు,సంఘటనలూ మైలురాళ్ళలా పాతుకున్నాయి.
          1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధకాలంలో దేశాన్ని ప్రధాని గా నడిపించారు లాల్ బహదూర్ శాస్త్రి .  1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయింది. ఒప్పందం జరిగిన తరువాత రాత్రే తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గుండెపోటుతో మరణించినట్లు వార్త. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యే ఆనే కథనాలు విన్నాము.
          ఆ సందర్భంగా నెలకొన్న రాజకీయ సమీకరణాల్లో ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఆ రోజు స్కూల్ లో ప్రార్థన   సమావేశం లో మొట్టమొదటి మహిళా ప్రధాని గా ఇందిరా గాంధీ గురించి చెప్పారు.తరగతి గదిలో కూడా క్లాసు కి వచ్చిన మాష్టార్లు ఆడపిల్లల కి ప్రత్యేకం గా అభినందించారు.అప్పడు ఆడపిల్లలమంతా మేమే ఆ పదవిని పొందినట్లు పొంగిపోయాము.ఆమె పాలనలో మహిళలకే మైనా ఒనగూడిందా అని ఇప్పుడు ఆలోచిస్తే నేతిబీరకాయలో నెయ్యి చెందమే.
          ఇక రాష్ట్రంలో 1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో . 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదంతో ప్రజలు ఉద్యమించారు.ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం ముందుండి నడిపించాడనీ,టి. అమృతరావు, ప్రత్తి శేషయ్య లాంటిే నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారనీ విశాఖ జిల్లా అంతటా ఎన్నెన్నో వార్తలూ,ఎన్నో సంచలనాలు.
           గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారనీ జిల్లా అంతటా ఓ విధంగా అట్టుడికి పోయిందని చెప్పొచ్చు.
       ఈ  సందర్భంలో  జరిగిన బందుల్లో( అప్పటికీ విజయనగరం విశాఖ జిల్లా లోనే ఉంది) స్కూలు మూయించటానికి వచ్చిన ఉద్యమకారులతో పాటూ సంఘీభావం గా మేము కూడా మావంతుగా కాసేపు నినాదాలు చేసాము.ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించి సాధించిన విశాఖ ఉక్కు మాత్రం ఈ నాటి పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు తుప్పు పట్టేలా ఉంది.
       నిజానికి నాకు రాజకీయాలు పట్ల ఆసక్తి ఉండేది కాదు.అయినప్పటికీ దేశంలో కానీ , రాష్ట్రంలో కానీ ఏ సంచలనాలు ఉన్నా డైరీ లో రాసుకునే అలవాటు ఉండటం ఆశ్చర్యమే .అసలు సోషల్ స్టడీస్ పుస్తకం చదివినప్పుడల్లా
        " ఆ రాణీ ప్రేమ పురాణం/
       ఈ ముట్టడి కైన ఖర్చులూ /
       తారీఖు లు దస్తావేజులు /
       ఇవి కాదోయ్ చరిత్ర సారం,"
    అనుకునేదాన్ని.అయినా ఏమాటకామాటే సోషల్ లో చాలా మంచి మార్కులే వచ్చేవి.
          ఇక మా ఇంట్లో మా చిన్నన్నయ్య  కథలు అప్పటికే  ప్రచురితం అవుతున్నా ఆ ఏడాది ఆంధ్రప్రభ దీపావళి కథలపోటీలో    బహుమతి వచ్చేసరికి ఆ ఊరులో కథకుడు గా గుర్తింపు వచ్చింది.ఆబహుమతి డబ్బు తో రేడియో కొన్నాడు.ఇంక నాకెంత సంబరమో.ఆ రోజుల్లో సాయంత్రం 5-30 కి లలిత సంగీతం ప్రసారం అయ్యేది.అవి తప్పక వింటూ ఆ పాటలు రాసుకుంటూ నేర్చుకునేదాన్ని.అప్పట్లోనే సంగీతం నేర్చుకోవాలని కోరిక మనసుని తొలిచేసింది.
          అన్నయ్య కథలు ప్రచురితం అవుతున్నప్పుడల్లా నాకూ కథలు రాయాలని అనిపించేది.రావిశాస్త్రికి ఏకలవ్య శిష్యుడిగా రాసే అన్నయ్యకథలే కాక,అతను సేకరించే రావిశాస్త్రి,కారా,చాసో,బీనాదేవి పుస్తకాలూ నేను కూడా చదవటం వలన నా ఆలోచనల్లో,నా దృక్పథం లో బాగా మార్పు రావటం నాకే తెలుస్తోంది. మళ్ళా ఇప్పుడిప్పుడే చదువులో కుదురు కున్నాను కదా మళ్ళా ఆగిపోతుందేమోనని భయపడ్డాను.కానీ నాకు తోచిన ఆలోచనల్ని కాగితాల మీద పెట్టి పుస్తకాలు అడుగున దాచేసేదాన్ని.
          ఆరోజుల్లోనే జరిగిన చిన్నక్క వివాహం మరో సంచలనం.కోటబొమ్మాళిలో మా స్కూల్లో మాష్టారు వాసుదేవరావు గారు అప్పటి నుండి అక్కని ఇష్టపడ్డారు.విజయనగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ లో 1962 లో సైనిక్ స్కూలు స్థాపించినప్పుడు ఆయనకి అందులో ఉద్యోగం వచ్చింది.మొదటి నుండి ఆయన హార్దికంగా,ఆర్థికంగా అమ్మకి ఆసరాగా ఉన్నారు.పెద్దక్కయ్య తాను మా ఇంట్లో ఉన్నప్పుడే వారి వివాహం నిశ్చయం చేసింది. విశాఖ పట్నం లో రిజిష్టర్ కార్యాలయం లో వివాహం జరిగింది.వాసుదేవరావుగారి తరపున ఆయన సహోద్యోగులు,మా కుటుంబం మాత్రమే హాజరయ్యాము.ఆ వెంటనే చిన్నక్క కోరుకొండ వెళ్ళిపోయింది.  వర్ణాంతర వివాహం కావటాన కుటుంబ పెద్ద ఒకరు మావంశవృక్షం రాస్తూ తులసివనం  లో గంజాయి మొక్కగా అభివర్ణించారు కానీ తదనంతరం ఆయన కుటుంబంలోనే  వర్ణాంతరమేకాదు మతాంతరం, రాష్ట్రాంతరం ,దేశాంతరం వివాహాలు కూడా జరిగాయి.ముఖ్యంగా మా నాన్నగారి తరపు బంధువులు మా చిన్నక్క కుటుంబాన్ని సంపూర్ణంగా,మాకుటుంబాన్ని పాక్షికంగా దూరం పెట్టారు. ఈ సంఘటన వలన కుటుంబ వ్యవస్థపై ముఖ్యంగా మహిళలపై సంప్రదాయాలు,సమాజం వేసే సంకెళ్ళ ప్రభావం గురించి నన్ను ఆలోచింపచేయటం మొదలు పెట్టింది.
          నా వ్యక్తిత్వాన్ని సానపెట్టటం మొదలు పెట్టింది అప్పుడే.కోటబొమ్మాళి లో ఉన్నప్పుడూ నేను మాష్టారి చెల్లెలుగా గుర్తింపబడినా నన్ను బాధించలేదు.బహుశా అప్పటికి చిన్నపిల్లనేకావటంవలనకావచ్చు.                                                                     .      ఓ ఇద్దరు ముగ్గురు అన్నయ్య మిత్రులైన స్కూలు మాస్టర్లు మధ్యాహ్నం టిఫిన్ డబ్బాలు తీసుకొని మా ఇంటికి వచ్చి తినేవారు.స్కూలులో నాకు మంచి మార్కులు రావటానికి నేను మాష్టారి చెల్లెల్ని కావటం వల్లే అని కొందరు గుసగుసలు మొదలు పెట్టారు. అది నన్ను చాలా బాధ పెట్టింది.ఇప్పుడు హైస్కూలు చదువు కు వచ్చాను కనుక వయసుతో పాటూ మనసు,ఆలోచన పరిణితి చెందటం నాకే తెలుస్తోంది  .SSLC లో ఫైనల్ పరీక్ష పేపర్లు బయట వేల్యుయేషన్ కి ఎక్కడికో పంపుతే ఎవరో దిద్దుతారుకదా అందులోఎలా అయినా నా తెలివితేటల్ని నిరూపించు కోవాలనే పంతం వచ్చింది.
      అప్పట్లో SSLC లో మార్కులు హిందీలో కలిపి,హిందీ కలప కుండా అని రెండు విధాలుగా  ఫైనల్ లోమార్కులు ఇచ్చేవారు.     ఆ విధంగానే పరీక్షల్లో స్కూలు ఫైనల్లో హిందీ కలిపి ఐతే మూడవ స్థానంలో, హిందీ మార్కులు కలప కుండా ఐతే మొదటి  స్థానం  లో  వచ్చాను.
      అప్పటి నుండే నన్ను నేను నిరూపించుకోవడానికి,నన్ను నేను నిలబెట్టుకోవడానికి  అస్తిత్వ పోరాటానికి బీజం పడింది.

3, జులై 2021, శనివారం

సిరికోనభారతి లో ప్రచురితం

 వచన కవితా ప్రక్రియ లోకి అడుగు పెట్టి క్లిష్టమైన సంస్కృత పదబంధాలూ భాషాడంబరాలతో రాస్తేనే కావ్య రూపం పొందుతుందని భావించిన ఆధునిక కవులేకాక సీనియర్ కవులు సైతం నిజాయితీగా నిర్భీతిగా చెప్పిన కుందుర్తి సరళవచనా శైలికి లొంగిపోయారు.

 ఇక తిలక్ కవిత్వంలో భావకవుల సౌందర్యకాంక్ష, అభ్యుదయ కవుల సామాజిక కర్తవ్యం రెండూ కలసి నడుస్తాయి. అందుకనే ఆయన కవిత కళాత్మకమే కాదు, కరవాలమంత పదునైనది అనే భావన పాఠకులకు కలుగుతుంది.తిలక్ నిజాయితీగా చెప్పిన

'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు

నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'

మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు.

 శ్రీ శ్రీ తొలి రోజుల్లో రాసిన కొన్ని కవితలలో సంస్కృత భాషాడంబరం,సమాసాలూ కనిపించినా "మెట్లు" కవిత సభలో చదవగా విన్న ఒక పిల్లవాడు "ఇంతేనా కవిత్వమంటే నేనూ రాయగలను " అన్నాడని , సామాన్యుడికీ అర్థమయ్యేలా కవిత ఉండాలని శ్రీశ్రీ ఓ సందర్భంలో చెప్పాడు.

    నిజానికి ఏ సాహిత్య ప్రక్రియ ఐనా సరే దానికి తగిన భాష అదే సమకూర్చుకుంటుంది.

    సామాజిక స్పృహ కవిత్వాన్ని మింగేసిందనటం,సామాజిక స్పృహ ఒక జాడ్యం గా భావించటం అనటం నేను ఒప్పుకోను.

    ఇంకా వెన్నెలా,పూవులూ,ఆమనీ,ప్రేమా,ప్రేయసీ అంటూ కవిత్వం రాయటం ప్రపంచంలో జరుగుతోన్న అనేకానేక సందర్భాలూ, సంఘటనలూ,సంక్షోభాలనుండి పలాయనవాదంగా భావించాలి.

    కవిత్వం ఎప్పుడూ ఆత్మాశ్రయంగా మొదలైనా నేను నుండి మనం లోకీ మనం నుండి జనంలోకీ మమేకం కావాలి.

    పదచిత్రాల్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించితే ఒక్కొక్కసారి వ్యతిరేకార్థం లో కి వచ్చే ప్రమాదం కూడా ఉంది.అందుకని రాసిన వెంటనే మాధ్యమాల్లోనో పత్రికలకో పంపకుండా ఎవరికి వారు తిరిగి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.

    ఏ సాహితీవేత్త కైనా వారి సాహిత్యమే వారి వ్యక్తిత్వం కావాలి,వారి వ్యక్తిత్వమే వారి జీవితం కావాలని నేను నమ్ముతాను.