28, ఏప్రిల్ 2026, మంగళవారం
ఆదూరి-సాహిత్యపు దారి
ఆదూరి.. సాహిత్యపు దారి
గత నాలుగు దశాబ్దాల సాహిత్య చరిత్ర పరి శీలిస్తే కథాంశంలోను, కథనంలోను, భాషలోను, శైలి, వైచిత్రిలోను అనేక రకాల పరిణామాలు చెందింది. అంతేకాక ఈ క్రమంలో సాహిత్యంలో అనేక వాదాలు చోటుచేసుకోవటం ఒక విశేషం. పరిణామ క్రమంలో కొందరు సాహిత్యరంగంలో ఒక ముద్రని ఏర్పరుచుకుని పదేపదే వ్యాసాలలో ఉటంకించ బడుతున్నారు. మరికొందరు వాదాల జోలికి పోకుం డా తమదృష్టికి వచ్చిన కథాంశాలతో రాసుకునే వారు, విమర్శకుల దృష్టికి దూరంగా ఉండిపోతు న్నారు. ఆ కోవకు చెందిన రచయిత ఆదూరి వెంకట సీతారామ్మూర్తిగారు.
1969లో రచనా వ్యాసాంగాల్లో అడుగు పెట్టిన ఆదూరి సీతారామ్మూర్తి దాదాపు అయిదు దశాబ్దాలుగా నవలలూ, కథలూ రాస్తూ అదుగోపులి, వెన్నెల్లో పావురాళ్లు, వర్ణచిత్రం. ఆత్మధృతి, ఉత్సవ కానుక, అందని జాబిల్లి పేర్లతో ఆరు కథా సంపుటాలే కాక నవలలూ వెలువరించారు. స్థూలంగా పరిశీలిం చితే శైలినిబట్టి, కథాంశాన్ని బట్టి కథనాన్ని నడిపే విధానాన్ని బట్టి మూడు విధాలుగా వీరి కథలు విభజించవచ్చు. ఆ తేడా కూడా రచయిత రచనారంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ సాహిత్య ధోరణిలో వచ్చిన మార్పుకు వయస్సు రీత్యా తన ఆలోచనా రీతిలోనూ, జీవన విధానం లోనూ వచ్చిన మార్పులకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ ఉండడం ఆ కథలలో గమనించవచ్చు. రచన మొదలు పెట్టిన నాటి నుంచి ఎనభయ్యవ దశకం వరకూ రాసిన కథలు
ఆనాటి సాహిత్యంలో వెల్లువెత్తిన విప్లవ ధోరణులూ, శ్రీశ్రీ, కారా, రావిశాస్త్రి వంటి సాహితీవేత్తల్ని చదువుకున్న యువ ఆవేశం రచయిత కథలలో కనిపిస్తుంది.
తన చేతులతో పునాది రాయి అందించిన అసిరయ్య భవన నిర్మాణ పనుల్లో ప్రమాదవశత్తూ అవిటివాడైతే, మరోవైపు భవన కంట్రాక్టరు అంత కంతకూ ఎదిగి మంత్రి అయి భవన ప్రారంభోత్సవానికి రావటం చూసిన అసిరయ్య తానెందుకు అంతకంతకూ నేలబారయ్యానని అబ్బుర పడతాడు. "రాళ్ళెత్తిన కూలి" (1984)కథాంశానికి తగినట్లు కథాకథనం రచయిత ఆసక్తికరంగా నడుపుతారు.
ఇటువంటిదే మరో కథ "శిల్పి". కొడుకు గణపతిని చదువు మాన్పించి తనతో వడ్రంగి పనికి తీసుకుపోతాడు తండ్రి. పనికి రావని పడేసిన చెక్క ముక్కల్ని సాధనతో బొమ్మలుగా మార్చుతాడు గణపతి. తనకు బొమ్మలు వేయటంనేర్పిన డ్రాయింగు మాష్టారికి బొమ్మ చెక్కి ఇవ్వాలనుకుంటాడు. కానీ టింబర్ డిపో యజమాని గణపతి పనితనాన్ని గుర్తించి, చెక్కముక్కల్ని ఇచ్చి బొమ్మలు చేయించి లాభపడతాడు . ఒకసారి గణపతి చెక్కిన ప్లానెల్ శిల్పాన్ని విదేశీయుడు కొని పోటీకి పంపుతాడు. అది బహుమతికి ఎంపికౌతుంది. దాన్ని తయారు చేసింది తానేనని టింబర్ యజమాని ప్రచారం చేసుకొని సన్మానం పొందుతున్న సందర్భంలో దూరంగా నిల్చున్న గణపతిని చూసి తన నేరానికి సిగ్గుపడి గణపతిని చేరదీస్తాడు. ఈ శిల్పికథ గూర్చి ఒక సందర్భంలో వాకాటి పాండురంగారావు గారు " అసాధారణమైన విషయాన్ని అలతిపదాలతో అల్లిన శక్తివంతమైన రచన"అన్నారు.
డాక్ యార్డులోని పేదరాలి పెన్షను కోసం పడే యాతనైనా, కార్పరేటు వైద్యనీతిని ఎత్తి చూపడమైనా, నిస్వార్థ సంస్కారం గల అన్నమ్మ కథ అయినా, బాలమోటారుమెకానిక్క్ వెంకటేషు జీవన పోరాటమైనా, పల్లె పాట స్వార్థపరుల చేత చిక్కి వ్యాపార వస్తువుగా మారిన వైనమైనా ఆదూరి సీతారామ్మూర్తి చేతిలో చెక్కబడిన కథనంలో పరిమాణంలో చిన్నగా వున్నా గాఢత సంతరించుకొని స్పష్టమైన పరిపూర్ణతని సాధించటంలో విజయ వంతమయ్యాయి. సాహిత్యం వలన సమాజం మారినా మారక పోయినా అప్పట్లో వచ్చిన సాహిత్య పరంపరకు శిల్పంలోగాని, కథనంలో గాని ఏమాత్రం తీసిపోకుండా రచయితకు తనదైన గుర్తింపును ఇచ్చేటి కథలు యివి .
ఎనభై దశకం నుండి తొంభైయ్యవ దశకం
వరకూ రాసిన కథలు ఎక్కువగా దిగువ మధ్యతరగతికి చెందిన చిరుద్యోగుల జీవితాలలోని సంక్లిష్టతని, ఆర్థిక, సామాజిక రాజకీయపరంగా, కుటుంబపరంగా భిన్న దృక్కోణాలలో బహుముఖాలుగా రచయిత అనేక కథలలో వ్యక్తీకరించారు .మరికొన్ని కథలలో ముఖ్య కారణాన్ని కథాత్మకం చేసి, జీవితాన్ని తనదైన పద్ధతిలో వ్యాఖ్యానించటం మరొక విశేషం.
చదువు కొని ఉద్యోగం చేయాలని కన్న కల సుగుణకు ఇటు పుట్టింటా, అటు మెట్టినింటా వ్యతి రేకించిన నేపథ్యంలో వెలిసి పోతుంది. ఆ దశలో భర్త అనుకోకుండా మరణించటంతో కారుణ్య నియామకం వల్ల ఉద్యోగం వస్తుంది. ఆనాడు వ్యతిరేకించిన వారే నేడు సమర్ధించటంలోని పరమార్థం కేవలం ఆర్థికమే అన్న ఆలోచనలో పడుతుంది సుగుణ. ఈ కథలో మొదటినుండి చివరివరకూ సుగుణ మానసిక సంఘర్షణ, ఆలోచనల వైవిధ్యం అంతటినీ సుగుణ ఆలోచనా
కథనం గా చెప్పటం కథకు మరింత బలాన్ని యిచ్చింది .
1989 లో రాసిన ' ఆవిష్కరణ' కథలో ప్రతీ కథకుడూ మమేకం ఔతాడు. రచనల్ని పుస్తక రూపంలోకి తేవటంలోని కష్ట, నష్టాలు, ఆర్థిక పరిస్థితులూ, అన్నింటినీ అధిగమించి పిల్లలసహకారంతో పుస్తకం వెలుగు చూసినా ఆవిష్కరణ, అట్టహాసాలు సామాన్య రచయితకి ఎంత భారమో తెలుపుతుంది. అంతే కాక అధికారుల, రాజకీయ ప్రాపకాలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రతిభావంతులుగా పరిగణించబడి సన్మానాలు అందుకునే కుహనా రచయితలూ, కవుల్ని ఎత్తి చూపు వ్యంగ్యరచన యిది.
నోరు లేని జీవాలు, స్వేచ్ఛ కోసం తెగువనీ, ధైర్యాన్ని ప్రదర్శిస్తే తమపై ఆధారపడి బతికే మనుషులంతా ఏమై పోతారో అని అనుకునే ఎద్దు స్వగతంలో సాగే కథ 'ఓ మహితాత్మకథ ' (1988) ఇటీవల ఇదే పద్ధతిలా దున్నపోతుల స్వగతంగా మరొకరి కథ ఒకపత్రికలో ప్రచురితమయ్యింది ..
90 లనుండి 2000 సం. వరకూ వచ్చిన నిరికథలలో చాలా వరకూ చిరుద్యోగులు, మధ్యతరగతి వారి జీవితాలలోని ఆర్థిక
ఒడుదుడుకులతో కథలు నడుస్తాయి. అటు బడుగువర్గాలవారిలా ఇంటాల్లిపాదీ ఏపనైనా చేయటానికి వెళ్ళలేక పోవటం, ఇటు ఉన్నత వర్గాల వారిలా ఆర్థికతోడ్పాటులేక కేవలం ఇంటి పెద్ద సంపాదనే ఆధారమై సతమతమయ్యే సంక్షుభిత జీవితాల్ని అక్షరీకరించారు .
మధ్యతరగతి జీవితాల్ని ఆర్థికావసరాలు ఎలా చిన్నా భిన్నం చేస్తాయో, వీటిని అధిగమించి మాన వత్వ పరిమళాల్ని ఎలా అందుకున్నారో చెబుతాయి. పల్లెల్లోను, పట్టణాల్లోనూ కడుపు చేతపట్టుకొని బతికే చిరుద్యోగుల వెతల్నే కాక, ఛిద్రమై పోతున్న మానవ సంబంధాలనూ భిన్న దృక్కోణంతో వ్యక్తీకరించటం వీరి కథల్లోని మౌలికాంశం.
ఇరవయ్యవ శతాబ్దం తర్వాత రాసిన కథల్లో రచయిత జీవితానుభవం, ఆలోచనల్లో పరిణత, జీవన విధానం ఇలా అన్నింటిలోనూ పరిణామక్రమంలో మార్పు రావటం సహజం. మొదట్లోని ఆవేశం తగ్గి నిలకడగా ఆలోచించడం అలవడుతుంది. వయస్సుతో వచ్చే వేదాంత ధోరణి కొంత వుంటుంది.
మొదట్లో చిన్న కథలుగా గాఢత, స్పష్టతతో కూడి ఒకింత ఆవేశం, ఆవేదన, ఆర్తితో నడిచిన కథన నిర్మాణం ఆతర్వాత కొంత వివరణాత్మకంగా, ఆచితూచి కథని నడపడమే కాక కథా పరిమాణం కూడా విస్తృతం చేసి రాయటం కనిపిస్తుంది. దేవుడంటూ వుంటే ఈ తేడాలు, ఈ దరిద్రాలూ, అన్యాయాలూ ఆక్రమాలు ఉండేవా అనుకునే పరిస్థితికి రావడానికైనా, ఎవరో దయతో ఇచ్చే ప్రసాదాలు దేవుడే ఇచ్చాడని నమ్మిన పిల్లవాడు సింహాచలంకి ఒక కథలోనూ, అందరికీ ఉన్న డబ్బు తనకెందుకు లేదనే సందేహంతో సతమతమయ్యే బుజ్జికి మరోకథలోను తెలియనిది సమాజాన్ని పట్టి పీడించే వ్యవస్థే అనేది ఈ రెండు కథల్లోను రెండు వర్గాల, రెండు వర్గాల ప్రతినిధులతో సమర్ధవంతంగా నిరూపించారు రచయిత.
ముళ్లపూడినీ, మునిమాణిక్యాన్ని అభిమానించే ఆదూరి సీరియస్ కథలతో సమాంతరంగా హాస్య కథల్ని ఇష్టపడతారు. "ఎదుటి మనిషిని సంతోషపెట్టగలగటం అదీ రచనలద్వారా ఒక వరమనే భావిస్తాను అంటారు. అందుకేనేమో మొదట్లో అన్ని సీరియస్ కథలు రాసిన అదూరి 2000తర్వాత ఎక్కువగా హాస్యరచనలు చేయడం గమనార్హం. ఆకోవలో రాసిన కథలు హాస్య, వ్యంగ్య ధోరణిగా అనిపించినా కొన్నింటిలో అంతర్లీనంగా ఆవేదన సూచింపబడుతుంది.
1971 నాటికి టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి చర్చింపబడుతున్న రోజుల్లోనే అదే అంశంపై ఆర్థికావసరాలకై అందుకు ఒప్పుకున్న పెళ్లికాని యువతి చివరలో బాబుని వదలలేక తానే తీసుకెళ్లిపోతుంది. సమకాలీన అంశంపై తక్షణ స్పందన.
ఈ వాస్తవ సంఘటనల్నీ వేదాంతాన్ని సమపాళ్లలో మేళవించి, హృదయాన్ని కదిలించే కథ(1990) 'ఆత్మధృతి' వైదిక కర్మలు వేస్తూ దానాలు తీసుకుని జీవనం సాగించే పేదబ్రాహ్మణుడు, వాటిలోనూ చొచ్చుకువచ్చిన వ్యాపారధోరణితో విస్తుపోయి, ఆపరకర్మలపై విశ్వాసం సడలి చరమదశలో తనను తానే దానం చేసుకుని తన జీవితాన్ని పరిపూర్ణ జ్ఞానిగా ముగించడంతో రచయిత కథని ఏవిధమైన భావోద్వేగాలకూ లోను కాకుండా సంయమనంతో కథని నడిపించడం విశేషం.
విభిన్న కథాంశాలలతో సాధారణమైన వాక్యనిర్మాణంతో కథని నడిపించే తీరు ఒక ఎత్తైతే కథ ముగించడం ఒక ప్రత్యేకతని సంతరిం చుకోవడం చాలా కథల్లో ఉంటుంది. కొంతమంది రచయితల్లా గంభీర సమాసాల సంభాషణల్తో సమా జాన్ని ఉద్దరిస్తున్న రీతితో పేరాలకు పేరాలు ఉండవు. మరికొంతమందిలా పాఠకులు తెలివి తక్కువవారిగా పరిగణిస్తూ మొదటినుండి పండువలిచినట్టు చెప్పరు. ఇంకొంతమందిలా కథలోకి రచయిత ప్రవేశించి తన అభిప్రాయాల్ని, పాండిత్యాన్ని గుప్పించరు. ఒక స్నేహితుడిలా ముందు ఒక వాతావరణాన్ని కల్పించి పాఠకుడిని కథలో ప్రవేశపెట్టే ఒక అనుభవాన్ని కథా రూపకంగా చెప్పినట్లుగా ఉంటాయి. ఆ తర్వాత పాఠకుడు తేలికైన సంభాషణలోనికి మమేకమౌ తాడు. ఇక ముగింపు కూడా అతి తెలివిగా పాఠకుడికే వదిలేస్తాడు రచయిత.
నిజానికి రామ్మూర్తిగారి కథల్లో సింహభాగం కూటికీ, గుడ్డకీ, గూడుకీ ప్రతిదినం వెతుక్కునే చిరుద్యోగుల జీవన ప్రయాణమే దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల కథలూ తన అవగాహన, పరిశీలనతో రచయిత, తనని తాను ఆ పాత్రల్లోకి ఆవాహన చేసుకొని కరుణారసాత్మకంగా చెప్పటమే కాకుండా, పాఠకుడికి కూడా అనుభవాన్ని దృశ్యమానం చేస్తారు. కొన్ని కథల్లో ఒక సామాజిక వర్గం వారి ఆర్థిక పరిస్థితుల పట్ల కాస్తంత పక్షపాత వైఖరీ, సానుభూతి కనబరిచినా పాఠకుడు అందులోని మానవీయ దృక్కోణాన్ని దర్శించగలుగుతాడు. మనసుకి అర్ద్రత కలిగించడమే కాకుండా పాఠకుణ్ణి నేలమీదనే నడిపించి మానవత్వానికి అద్దంపడతాయి. మానవీయవిలువల పట్ల రచయితకు గల గాఢ అనురక్తి చాలా కథల్లో ప్రస్ఫుటమౌతుంది. ఉద్యమ ధోరణికి లోను కాకుండా సమాజంలో జరిగే అన్యాయాలపట్ల సానుభూతితో సామరస్య పూర్వకంగా పరిష్కారం దిశగా ఆశావాదిలా ప్రతిస్పందిస్తాడు రచయిత.
భార్య భర్తలిద్దరూ సాహిత్యరంగంలో వున్నప్పుడు ఒకరిపేరు ఎక్కువగా ప్రస్పుటమై రెండవవారు ఛాయామాత్రంగా గుర్తింపు పొందుతారు. ఈ ఛాయగా మిగలటం ఎక్కువగా భార్యల వంతు ఔతుంది కానీ ఆదూరి దంపతుల్లో సత్యవతీదేవిగారి కవయిత్రిగా వినబడినంతగా సీతారామ్మూర్తి గారి పేరు వినబడలేదేమో.
సత్యవతిదేవి భౌతికంగా దూరమయ్యాక ఆమె రచనల్నీ, ఆమె సాహిత్యంపై ప్రముఖుల ప్రశంస పూర్వక వ్యాసాల్ని ఏరి కూర్చుతూ ప్రచురించి ఆదూరి సత్యవతీదేవి పేరుని సాహిత్య రంగంలో శాశ్వతత్వం కలిగించే ప్రయత్నం నిరంతరం చేస్తున్న గొప్ప ప్రేమికుడిగా రామ్మూర్తిగారు కనిపించుతారు. కానీ తన రచనల్నీ, తన ప్రతిభని చాటుకునే ప్రయత్నం చేయలేదు. బహుశ అందువల్లే అనేక కథాసంపుటాలు, నవలలూ ఇంత కాలంగా రాసి ప్రచురిస్తున్న ఆదూరి సీతారామ్మూర్తి గారి పేరుని సాహిత్యలోకం అంతగా పట్టించుకోలేదేమో.
(లీడర్ ,ఆదివారం 7-4-2019)
శీలా సుభద్రాదేవి,
నడక దారిలో -63
నడక దారిలో -63
ఈమధ్య.సుమారు పదేళ్ళుగా వీర్రాజుగరు ముఖచిత్రాలు వేయటం మానేసారు.మా పుస్తకాలకు పిల్లలే డిజైన్ చేస్తుంది.కానీ సుశీలమ్మ గారి కిన్నెరసాని ఎమ్ ఫిల్, పరిశోధన గ్రంధానికి,'కవిత్వ పరామర్శ' విమర్శ గ్రంథానికి ఇబ్బంది పడుతూనే ముఖచిత్రం వీర్రాజు గారు వేసారు.అవే ఆయన వేసిన చివరి ముఖచిత్రాలు.
డిసెంబర్ 31, 2019 ప్రపంచమంతా ‘‘న్యూ ఇయర్’’ వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రజలంతా కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నారు.
వూహాన్ నగరం కరోనాకు కేంద్రంగా చైనాలోని ఆరోగ్య నిపుణులు కొత్తగా నమోదైన కేసును మొదటగా ‘‘న్యూమోనియా’’గా భావించి కరోనాగా నిర్ణయించారు.
అయితే అప్పుడప్పుడే ఒక వైరస్ గురించి టీవీలో కథనాలూ,చర్చలూ మొదలయ్యాయి. ప్రపంచ ప్రజల నరాల్లోకి భయం మెల్లిమెల్లిగా ఒక పురుగులా ప్రవేశించింది.
2020 జనవరి 30 న వుహాన్ నుండి తిరిగి వచ్చిన కేరళ విద్యార్థికి మొదటి పాజిటివ్ కేసు నమోదయింది అని టీవీ గగ్గోలు పెట్టింది.
అప్పుడప్పుడు రిటైర్డ్ టీచర్లు అందరికీ మా పాత హెడ్ మిస్ట్రెస్ శిరోమణీ థామస్ గారు వారింట్లో విందులో సహా సమావేశం ఏర్పాటు చేసారు.అక్కడ అందరం కలిసి సందడి చేసాము.ఆ సందర్భంలో వైరస్ గురించి కూడా మాట్లాడుకున్నాము.అంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జాగ్రత్తలు చెప్పుకొని సాయంత్రానికి ఇంటికి చేరాము.
మార్చిలో లేఖిని వార్షికోత్సవ మాతృ దినోత్సవ పురస్కారాల సమావేశానికి వెళ్ళాను.
కర్పూరం రుమాలు లో చుట్టి వాసన చూస్తుంటే వైరస్ తాకదు అని కూడా ఒకరికొకరు చెప్పుకున్నారు.
వైరస్ మన వరకూ రాదులే అనే ధీమాతో మార్చిలో కూడా అత్తలూరి విజయలక్ష్మి రాసి ప్రదర్శింపజేసిన నాటకానికి వెళ్ళి వచ్చాను.
ఇంతలోనే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక నిర్ణయాలు తీసుకుంది.మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని బయటకు రావద్దని ప్రకటించారు.ఆ ఒక్కరోజు ఇంట్లో వున్నంత మాత్రాన నన్నెవరూ కట్టడి చేయలేరులే అంటూ వైరస్ విజృంభించటం మొదలెట్టింది.
ఆ తర్వాత ప్రధాన మంత్రి మార్చి 24 నుంచి దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు.సామాన్య ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
అన్ని థియేటర్లు, విద్యాలయాలు,మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, మూసేయాలనీ విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం కావాలని, సామాజికంగా ఒకరికొకరు దూరంగా ఉండడమే కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారణకు మంచి మార్గమని నిబంధనలను ఫోన్లలో , ఛానెల్స్ లో వినిపించటం మొదలైంది.
కరోనావైరస్ వ్యాధి (COVID-19) కొత్త వైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి . దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఫ్లూ వంటిదే కానీ తీవ్రమైన సందర్భాల్లో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. దీని నివారణకు చేతులను తరచూ కడుక్కోవడం,ముఖాన్ని తాకకుండా ఉండడం ,అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం ద్వారా మాత్రమే మనల్ని రక్షించుకోవచ్చునని అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలతో ఊదరగొట్టటం ప్రారంభించారు .
నేను కాటరాక్ట్ చేసుకోవాలనుకున్నది వాయిదా పడింది.పనమ్మాయి లక్ష్మిని లాక్ డౌన్ వున్నంతకాలం రావద్దని చెప్పి ఫస్ట్ రోజున గేటు దగ్గరకి వస్తే జీతం ఇస్తానని చెప్పాను.ఇంట్లో పనులన్నీ మేమే చేసుకోవటంతో బిజీ అయ్యాము.
. ఆషీకి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి.
మళ్ళీ ఏప్రిల్ 14 న దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 3 వరకు పొడిగించారు కానీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు చేసింది.
మధ్యలో ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆపేసి దీపాలు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ చీకటి కాలంలో 130 మంది కోట్ల భారతీయుల మహా సంకల్పాన్ని చాటాలని, ఆ చీకటి వైరస్‌కు వెలుగు శక్తిని పరిచయం చేయాలని ఆయన పేర్కొన్నారు. మరోరోజు గంటలు,కంచాలు వాయించితే కరోనాని తరిమి కొట్టొచ్చని అంటే ఆ పని కూడా వందకోట్లకీ పైగా జనం ఆచరించి తమ దేశభక్తి చాటుకున్నారు.అయితే మంత్రాలకు చింతకాయలు రాలవు కదా కనిపించని ఆ శత్రువు ప్రజలమీద దాడి చేస్తూనే వున్నాడు.
అయితే ఆ సమయంలో జాతీయ దూరదర్శన్ 1990లలో' సంచలనం కలిగించిన మహాభారతం ,చాణక్య ధారావాహికాలు తిరిగి ప్రసారం చేసింది.అవి అప్పట్లో యథాలాపంగా చూసామేమో కానీ ఇప్పుడు చూస్తుంటే ఎన్నో విషయాలు ఆసక్తిగా అనిపించింది.మాకు ఇష్టమైన చారిత్రక పరిశోధనగా చాణక్యను గమనించాము.అందులో పాత్రల ఆహార్యం అబ్బుర పరిచింది.అవి అజంతా శిల్పాలు,బౌద్ధ కథలలో పాత్రల వస్త్ర,శిరోజాల అలంకరణలకు దగ్గరగా వుంది.చాణక్య పాత్రధారి చంద్రద్వివేది మౌర్య సామ్రాజ్య స్థాపనకు చెందిన అనేక పుస్తకాలు చదివి పరిశోధన చేసి వాటి ఆధారంగా తానే దర్శకత్వం వహించాడు.అందరు పాత్రధారులూ అద్భుతంగా నటించారు.ఆ నాటి రాజ్యం,నగరం,ఇళ్ళూ ఎలా వుండేదో ,ఆనాటి పంటలు, వుపయోగించిన పాత్రలు మొదలైనవన్నీ చాలా సహజంగా తీర్చి తీయటం తప్పక చూడవలసిన ధారావాహికగా అనిపించింది.విద్యార్థులూ,వాళ్ళ రూపం ఆరెస్సెస్
పక్షాన వున్న సీరియల్ అనిపిస్తే అనిపించవచ్చు కానీ ఎక్కడా మతప్రసక్తి ఉండదు.రాజనీతికి చెందిన సీరియల్.అప్పుడప్పడే బౌద్దమతం మన దేశంలోకి వస్తున్న విధం ఇందులో తెలుస్తుంది.
ఇంకా మహా భారత్ కూడా పౌరాణిక గ్రంథంగా కాకుండా ఒక రాజనీతిశాస్త్ర గ్రంథమే అనేలా ఆలోచింపజేసే బలమైన సంభాషణలతో ఆసక్తి దాయకంగా ఉండటంతో ఇంట్లో అందరం కూర్చుని రోజూ చూసాము.
కరోనా భయంతో బిల్డింగ్ అంతా ఎవరికి వారు ఇళ్లలోనే బందీలయ్యారు.అందులోను కొన్ని ఇళ్ళల్లో కరోనా బాధితులు కూడా ఉండటం కూడా ఒక కారణం.
బిల్డింగ్ లోనే సూపర్ బజార్ వుండటంతో వెచ్చాలకు కూడా ఇబ్బంది పడలేదు.సూపర్ బజార్ వాళ్ళే కూరలూ,పళ్ళూ తీసుకు రావటంతో వాటిని కడిగి ఆరబెట్టి తుడిచి ఫ్రిజ్ లో సర్దడం వీటితో రోజంతా పని లాగే వుండేది.
"అందరి ఇల్లు " డా.వింజమూరి సూర్యప్రకాష్ గారు డెబ్భై రోజుల పాటూ ప్రతీరోజూ సాయంత్రం గంటసేపు ప్రేమా, నిజాయితీ పేరుతో జూమ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. రచయితలతో ,ఆర్థికవేత్తలతో, హోమియో,ఆయుర్వేద,అల్లోపతి డాక్టర్లతో,సంగీతజ్ణులతో ఒక్కొక్క రోజు ప్రసంగాలు చే గుండెయించారు.అవి చాలా ఆసక్తికరంగా సాగాయి.ఒకరోజు వీర్రాజుగారు కూడా మాట్లాడారు.
తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాలు సరిహద్దులను మూసివేసి రవాణాను నిలిపివేసాయి.. ‘‘కోవిడ్-19’’. మానవ చరిత్రలో ఆధునిక కాలంలో మనిషి ఎప్పుడూ చూడని భయోత్పాతాన్ని సృష్టించింది. ప్రజలందర్ని కేవలం ఇళ్లకే పరిమితం చేసింది. ‘‘లాక్‌డౌన్’’తో జనజీవితం అస్తవ్యస్తమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.కడుపు చేత పట్టుకొని ఉపాధికోసం దేశంలో వివిధ ప్రాంతాలకు వలస పోయిన శ్రామికులు తమకు పనులు ఆగిపోవడంతో తట్టాబుట్టా కట్టుకొని కుటుంబాలతో సహా చనిపోతే తమ వూర్లోనే అందరి మధ్యా పోదామనే ఆలోచనతో నడక దారిలో రోడ్లమీదకు బయలుదేరారు.ఒక తీరని విషాదం ప్రపంచాన్ని చుట్టుముట్టింది.
వీర్రాజుగారు సబ్ కాన్షస్ లో కరోనా గురించి భయం,బెంగపెట్టుకున్నారనుకుంటాను.బహుశా అందువల్లనే అనుకుంటాను యూరిన్ మాటిమాటికీ రావటంతో ఇబ్బంది పడ్డారు.మేము రెగ్యులర్ లా వెళ్ళే హోమియో డాక్టర్ని ఫోన్ లో సంప్రదించగా ఆయన కారులో మా ఇంటివైపు వచ్చి గేటు దగ్గర మందులు అందజేసారు.ఒక రెండు మూడు డోసులు పడగానే వీర్రాజుగారికి యూరిన్ కంట్రోల్ లోకి వచ్చింది.దాంతో వూపిరి పీల్చుకున్నాము
మొదటే బాగా తక్కువ మాట్లాడతారేమో మరింత మౌనమునిలా అయిపోయారు.టీవీలో చాణక్య,మహాభారత్ చూస్తున్నపుడు తప్ప మిగతా సమయంలో తన రూములో ఆలోచనా నిమగ్నులై వుండిపోయేవారు.మామూలుగా వుంచటానికి చాలా ప్రయత్నం చేయాల్సివచ్చేది.బొమ్మలన్నా వేయండి,పుస్తకాలన్నా చదవండి అని అనటంతో శ్రీపాద,మల్లాది,కొకు మొదలైన వారి పుస్తకాలు చదవటం మొదలు పెట్టారు.
అప్పుడప్పుడు ఫోన్లలోనే మిత్రులతో సంభాషణలు.అవికూడా తిరిగి తిరిగి కరోనా కబుర్లతోనే ముగిసేవి.ప్రజాసాహితి మిత్రులు రామకృష్ణగానీ,లక్ష్మి గానీ పదిరోజులకు ఒకసారైనా మా క్షేమసమాచారాలు కనుక్కునే వారు.
పత్రికలన్నీ ఆగిపోయాయి.వార్తాపత్రిక మాత్రం వచ్చేది.టీవీ ప్రసారం చేస్తోన్న దృశ్యాలు చూడాలంటే కనిపించని శత్రువు ప్రపంచంపై చేస్తున్న దాడి,కుప్పకూలుతున్న జనాలు మరింత భయకంపితుల్ని చేస్తున్నాయి.
ఇక పుస్తకాలు చదవటం మాత్రమే భయంకర ఆలోచనల్ని మళ్ళించేదిగా మారింది.
కరోనా బారిన పడి ప్రాణాలు విడచిన వాళ్ళు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నృత్య దర్శకుడు శివశంకర్ వంటి సినీప్రముఖులు, శోభానాయుడు లాంటి ప్రముఖ నర్తకీ,ప్రణబ్ ముఖర్జీ, కన్యాకుమారి ప్రాంత ఎంపీ, హరిబాబు,నాయకులూ ఇలా..ఇలా..ఎందరో ఎన్నో రంగాల వాళ్ళు మాయమైపోయారు.డబ్బూ,పదవులూ,అధికారాలలూ అన్నీ వున్నా సెలబ్రిటీలే కరోనా కాటు నుండి తప్పించుకోలేక పోతున్నారంటే ఇక సామాన్య ప్రజలు పిట్టల్లా రాలిపోతూనే వున్నారు.
బాలా సుబ్రహ్మణ్యానికి అధికార లాంఛనాలతో సగౌరవంగా తమిళనాడు అంత్యక్రియలు ప్రభుత్వం నిర్వహించారు.
జీవితమంతా నాట్యానికి అంకితం చేసిన శోభానాయుడుకి ఎవరూ పట్టించుకోలేదు.ప్రభుత్వం కాదు కదా కనీసం సామాజిక మాధ్యమాల్లో కూడా ఏమంతగా ఆమెకీ నివాళులు ఎవరూ చెప్పక పోవటం చాలా బాధకలిగించింది.స్వార్థ రాజకీయాలే తప్ప కళాభిరుచి లేదు.బహుశా ఇతరేతర వివక్షలూ కారణం కావచ్చు.ఏమైతేనేం తెలుగువారు నాట్యంలో ఎన్నో ప్రయోగాలు చేసిన గొప్ప నాట్య కళాకారిణిని కోల్పోయారు.
కరోనా నుండి ఆలోచనలు మళ్ళించడానికి కవితల పోటీ నిర్వహిస్తున్నాననీ ఫోన్ చేసీ ఆ కవితల పోటీకి న్యాయనిర్ణేతగా వుండమని కోరారు.కవితలకు కవయిత్రి పేరు తొలగించి నాకు పంపించారు.బాగానే చాలా మంది కవితల పోటీలో పాల్గొన్నారు. నాకు అది సరదాగా అనిపించింది .
ఆ కవితల్ని చదివి ఫలితాలు పంపించాను.
వరంగల్ నుండి అనిశెట్టి రజిత ఫోన్ చేసి కరోనా సందర్భంలో కథలసంకలనం చేస్తున్నానని , నన్ను ఒక కథరాసి పంపమని అడిగింది.సరేనని ఆలోచించి రాస్తానన్నాను. రాయాలని అనుకోగానే కవిత గానీ,కథగానీ రాయలేను.ఫేస్బుక్ లోనూ వాట్సాప్సమూహాలలోనూ పుంఖానుపుంఖాలుగా కవితలు వెల్లువెత్తుతున్నాయి.అయినా నా ఒక్క అక్షరం మెదలలేదు.దానికి తోడూ వ్యాసాలు కోసం రచయిత్రుల కథలు చదువుతున్నానేమో అసలే కథలూ,కవితలూ రాసే మూడ్ కలగలేదు.
కరోనా కాలంలో భార్యా,భర్తా,భర్త తమ్ముడూ,ఒక పని అమ్మాయి కరోనా రేపిన ఆలోచనల్ని" నాలుగు గోడల మధ్య నలుగురు "అనే కథ రాసి పంపించాను.అదేకాకుండా నాలుగైదు కవితలీ కూడా రాసాను.
మా బిల్డింగ్ లో ఒక ఆమె కూతురు డెలివరీ కోసం వచ్చి తిరిగి వాళ్ళూరు వెళ్ళటానికి ప్రయాణానికి కరోనా నాకాబంది వలన ఇక్కడే వుండిపోయింది.తీరా ఆమెకు వైరస్ వలన సీరియస్ అయ్యి హాస్పిటల్ పాలై చనిపోయింది.ఆమె కొడుకులు విదేశాల్లో వుంటారని.ఎలాగో ఒక కొడుకు వచ్చి కర్మకాండలు చేయగలిగాడు.ఈ సంఘటన కొంత మనసును కలవరపెట్టింది.
ఇదొక్కటే కాదు. వ్యాధితో పోయిన వారి భౌతికకాయాల్ని హాస్పిటల్ వారే అంత్యక్రియలు జరిపారు.
ఈ విధంగా అనేక కుటుంబాలు పిల్లలు పోతే తల్లిదండ్రులూ, తల్లిదండ్రులు పోతే పిల్లలూ రాలేకపోవటం,ఆఖరుకు భార్యాభర్తలు కూడా చూసుకోలేక పోవటం.కలలో కూడా వూహించని మహమ్మారి చుట్టుముట్టి ప్రపంచాన్ని అతలాకుతలం
చేసింది .
మెల్లిమెల్లిగా ఆ వుధృతం తగ్గింది.కానీ పూర్తిగా సామాన్య స్థితిలోకి రాలేదు.
ఆ సమయంలో శిఖామణిగారు ఈ ఏడాది శిఖామణి పురస్కారం వీర్రాజు గారికి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు . అయితే కోవిడ్ నిబంధనల వలన మా ఇంటికే శిఖామణి గారు. వచ్చి జూమ్ సమావేశం ద్వారా బహుమతి ఇస్తానన్నారు.కె.శివారెడ్డి గారిని మా ఇంటికి తీసుకు వచ్చి వీర్రాజుగారికి ఘనంగా శిఖామణి అవార్డు ప్రదానం చేసారు.ఇంతవరకూ శిఖామణి గారి పురస్కారం వరుసగా సీనియర్లుకే ఇస్తూ వస్తున్నారు.అనేక మంది జూమ్ సమావేశంలో వీర్రాజు గారి సాహిత్యం,చిత్రలేఖనం గూర్చి మాట్లాడారు.వీర్రాజుగారు కూడా సంతోషించారు.
కోవాక్జిన్,కోవీషీల్డ్ అనే టీకా మందు దీనికి పరిష్కారంగా ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇది నాలుగు వారాలకు ఒకటిచొప్పున మూడు డోసులు వేసుకోవాలట.మార్చిలో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది.మా బిల్డింగ్ లోనే హెల్త్ వర్కర్ ఉండటంతో
ఇంటికే వచ్చి నలుగురికీ వేసారు.
క్రమక్రమంగా జనం వీధుల్లోకీ,విధుల్లోకీ వెళ్ళటానికి నిబంధనల మేరకు అలవాటు పడుతున్నారు. పబ్లిక్ పరీక్షలు కూడా కోవిడ్ నిబంధనల తోనే జరపటానికి ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సంక్రాంతికి బొమ్మలకొలువు కాస్త సింపుల్ గానేపెట్టి తక్కువ మందికి మాత్రమే చెప్పాలని అనుకుని అదేవిధంగా చేసాము.
- శీలా సుభద్రాదేవి
నడక దారిలో -62
నడక దారిలో -62
"మనం రాసిన ఏ రచనైనా పుస్తకం రూపంలో వుండాలి.లేకపోతే అవి కాలగర్భంలో కలిసిపోతాయి." అనేది వీర్రాజుగారి నినాదం.అందుకే తనను కలిసిన వారిని పుస్తకాలు వేసుకోమని ప్రోత్సహిస్తూ వుంటారు.
అందుకేనేమో వీర్రాజుగారు వరుసగా తన పుస్తకాలు ప్రచురించుకోవాలనే ఆలోచన మొదలు పెట్టారు.తాను రాసిన నాలుగు నవలలూ కలిపి నవలా కదంబం పేరుతో మూడువందల కాపీలు వేయించారు.అప్పట్లోనే ఎమెస్కో వాళ్ళు మైనా వేస్తామని పెర్మిషన్ అడిగారు.
చిన్నన్నయ్య రాసిన వాటిలో 250 పేజీలకు వచ్చేలా కథల్ని ఎంపిక చేసి పంపమని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు మమ్మల్ని కోరారు. "కొడవంటి కాశీపతిరావు కథలు" పేరును వేస్తామన్నారు.ముందుమాట ఎవరి చేత రాయించాలని అడుగుతే అన్నయ్య శిష్యుడే అయిన జగన్నాథశర్మ చేత రాయించమని చెప్పాము.ఆ విధంగా అన్నయ్య కథలు రావటం మాకు చాలా సంతోషం కలిగింది.
అంతకుముందు శీలా వీర్రాజు కవిత్వం పేరిట సమగ్ర సంపుటి వేసుకున్నారు.అయినా మళ్ళా "శీలావీ ప్రయోగకవితలు" పేరున వచన కథాసంపుటాలు హృదయం దొరికింది,కొడిగట్టిన సూర్యుడు, మళ్ళీ వెలుగు కావ్యం,పడుగుపేకలమధ్య జీవితం,వచన కవిత్వం లో నవల బతుకు బాట ఇవన్నీ కలిపి బృహత్ సంపుటిగా వేసారు ఒక వంద వేయండి అంటే వినకుండా మూడు వందలు వేసారు.నా మాదిరిగా వచనకవిత్వంలో కథా,నవల, కావ్యం ,ఆత్మకథ ఇన్ని ప్రయోగాలు చేసినవారు లేరు.అందువలన ప్రయోగ కవితలన్నీ సంపుటిగా వేయటం వలన అందరికీ తెలుస్తుంది అంటూ వాదించారు.
వీర్రాజుగారికథల ఆంగ్లానువాదం ప్రచురిస్తే నేనే మార్కెటింగ్ చేస్తాను అని ఒకాయన వచ్చాడు.ఆయన మాటలు నమ్మి "Trio" పేరిట ఐదొందల కాపీలు ప్రచురించారు."మన దగ్గర వంద వుంచుకుందాం.అనువాదకునికి వంద ఇద్దాం.మూడువందలు మార్కెట్ చేస్తానన్న అతనికి ఇచ్చేద్దాం"అని అన్నారు వీర్రాజు గారు.మరి ఇంకా ఏం మాట్లాడలేదు కానీ భయపడుతూనే వున్నాను.
అనువాదం చేసిన ఆయన వచ్చి ఒక పుస్తకం మాత్రమే తీసుకొని వెళ్ళారు.మార్కటింగ్ చేస్తానన్న వ్యక్తి ఫోన్ చేసినా దొరకలేదు.తర్వాత ఫోనుకు దొరికినా ఏవో కథలు చెప్పి అయిపు లేకుండా కనిపించలేదు.దాంతో ఇంటినిండా పుస్తకాలే అయ్యాయి.
అయిదారు అల్మారాలే కాక వార్డ్రోబ్ లలో సైతం పుస్తకాలే చేర్చారు.మా బెడ్ రూంలో స్టూలు మీద పుస్తకాల కట్టలు పేర్చి ఒక పెద్ద టేబుల్ లా అమర్చి దానిమీద ఒక టేబుల్ క్లాత్ కప్పారు. పుస్తకాలంటే విపరీతమైన ప్రేమ కలిగినదాన్నే అయిన నేనే చాలా విసిగి పోయి ఆయన మీద కోపగించాను."ఇలా అందర్నీ నమ్మేస్తే ఎలా?ఈ పుస్తకాలన్నీ ఏంచేస్తాం? తెలుగు అయినా అయితే ఎవరన్నా తీసుకుంటారు"అని చికాకు పడ్డాను.
నావి కూడా అప్పటికే ప్రచురించాల్సిన రచయిత్రుల కథలపై రాసిన వ్యాససంపుటి వుంది,ఒక నవల వుంది.కథలూ,కవితలూ వున్నాయి.వీర్రాజు గారేమో పుస్తకాలు వేసినవే మళ్ళీమళ్ళీ ప్రచురించుకుంటున్నారు.ఇంక నావన్నీ పెండింగ్ లో పెట్టేసుకున్నాను.ఇప్పుడు వేసిన పుస్తకాలు కొన్నైనా బయటకు వెళ్ళే వరకూ నేను నా పుస్తకాలు వేయననీ వేసినా వందో నూట ఏభయ్యో మాత్రమే వేయాలని పుస్తకాలు ప్రచురించారు కోన్ని గట్టి నిర్ణయం చేసుకున్నాను.
నవోదయా వంటి పుస్తకాల షాపుల వాళ్ళు పది కన్నా ఎక్కువ పుస్తకాలు తీసుకోవటం లేదు.ఈ పుస్తకాలన్నీ ఎలా బయటకు వెళ్తాయో అర్థం కాలేదు.విజయవాడలో ఎమెస్కో లక్ష్మి గారికి ఫోన్ చేస్తే నవలా కదంబం యాభై పుస్తకాలు పంపమన్నారు.వాటితో పాటూ నా ఇస్కూలు కతలు కూడా ఒక ముప్పై పంపమంటే పంపించాము.అవి మాత్రమే అమ్మకం అయినట్లు.అనుకోకుండా ఆదూరి సీతారామ్మూర్తి గారు అన్ని విశ్వవిద్యాలయాలకు తన పుస్తకాలు పంపించాను అని చెప్పారు.ఆయన దగ్గర అడ్రస్సులు తీసుకున్నాను.అంతేకాక మరి కొన్ని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖాద్యక్షుల ఫోన్ నెంబర్లను తెలుసుకుని వాళ్ళకు గ్రంధాలయాలకు మా పుస్తకాలు వితరణ చేయాలనే అభిప్రాయం చెప్పాను.వాళ్ళంతా సానుకూలంగా స్పందించారు.
అన్నింటికీ మా ఖర్చుతో మా పుస్తకాలు పార్సిల్ చేసి పంపించాను.అయితే అందుకున్న ఒక్కరూ కూడా అక్నాలడ్జ్ మెంట్ అయినా ఇవ్వలేదు.అదీ మన విశ్వవిద్యాలయాలకు తెలుగు భాషమీద గల శ్రద్ధ.
వీర్రాజుగారికి కేటరాక్ట్ అయిన తర్వాత నేత్రాలయలోనే నేను కూడా చేయించుకుందామనుకున్నాను. కానీ కొన్ని అర్జెంటుగా రాయాల్సిన వ్యాసాలు పూర్తిచేయాలని ఆగాను.
"ఈ లోపున 2018,2019సంవత్సరాలకు 49,50 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు ఇచ్చేస్తే యాభై అయిపోతాయి. ఈ ఏడాది చేసేద్దాము"అని కుందుర్తి శాంత ఫోన్ చేసింది. ఇన్నాళ్ళూ కేటరాక్ట్ వల్ల వీర్రాజు గారు వాయిదా వేసారు."ఈ రెండు సంవత్సరాలకూ న్యాయనిర్ణేతలకుపంపి ఫలితాలు వచ్చేవరకూ అంటే ఆలస్యం అవుతుంది .అందుకని మనమే నిర్ణయించేద్దాం. కవిత్వం పుస్తకాలన్నీ సేకరించి చదవటం మొదలుపెట్టాము.కొన్ని పుస్తకాలు నవోదయలో కొని తీసుకు వచ్చాము.18 సంవత్సరానికి సిరికి స్వామినాయుడికీ,19సంవత్సరానికి ఇబ్రహిమ్ నిర్గుణ్ కీ నిర్ణయించి ఫోన్ చేసి చెప్పారు.వాళ్ళను అంగీకారం తెలియజేస్తూ ఉత్తరాలు పంపమని చెప్పారు.
ఈ ఏడాది మాకు బాగా సన్నిహితులైన వారిని కోల్పోవటం ముఖ్యంగా వీర్రాజు గారిని కృంగదీసింది అనే చెప్పాలి.ఎందుకంటే ఆయన కూడా ఎనభైలలోకి వచ్చేసారు.
మే 25 న అబ్బూరి ఛాయాదేవిగారు మరణించారని తెలిసింది.అయితే ఆమె కొండాపూర్ లో సి.ఆర్.ఫౌండేషన్ కి చెందిన వృద్ధాశ్రమంలో వుంటారు.అంతకు ముందు అయిదారు సార్లు ఆమెని కలవటానికి వెళ్ళాము.అయితే ఇప్పుడు హాస్పిటల్ లో వున్నారా ,వృద్ధాశ్రమంలో వున్నారో సరిఅయిన సమాచారం తెలియలేదు.అంతదూరం వెళ్ళటానికి వీర్రాజుగారు తయారుగా లేరు.దాంతో ఆగి పోయాము.ఆ తర్వాత తెలిసింది.ఆమె ముందు రోజు కొత్తపేటలోని డా.సూర్యప్రకాష్ గారు నిర్వహిస్తున్న అందరి ఇల్లు లోనే వున్నారనీ,అక్కడే ఆ తెల్లవారు జామున కన్నుమూశారనీ, తర్వాత ఆశ్రమానికి తీసుకువెళ్ళి తదనంతరం ఛాయాదేవిగారి కోరిక ప్రకారం మెడికల్
కాలేజీ కే ఆమె దేహాన్ని ఇచ్చారని తెలిసింది.అందరియిల్లు మా ఇంటికి దగ్గరలోనే వుంది.అంతేకాక డా.సూర్యప్రకాష్ గారు దంపతులు మా కుటుంబానికి దగ్గర వారు.వారు నిర్వహించే కార్యక్రమాల్లో మేమూ పాల్గొంటూ వుంటాము.ఇంత దగ్గరలో వున్నారంటే ఆమెని కలిసి మాట్లాడేవారముకదా అని విచారించాము.
ఆ తర్వాత భూమిక సత్యవతి ఏర్పాటు చేసిన సంతాపసభకి వెళ్ళడమే కాకుండా అబ్బూరి ఛాయాదేవి ప్రత్యేక భూమిక సంచికలో ఛాయాదేవిగారితో నా సాన్నిహిత్యం రాసాను.
సరిగ్గా మరో రెండు నెలలకే నా ఆత్మీయ స్నేహితురాలు జానకీబాల సహచరుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు మరణించారని తెలియగానే వీర్రాజుగారితో కలిసి వెళ్ళాను.జీవనసాహచర్యమే కాకుండా సాహిత్యసాహచర్యం వున్నప్పుడు ఒక్కసారిగా వంటరితనం చుట్టుముట్టటం సహజమే.కానీ జానకీ బాల మరింతగా కృంగిపోయి మామూలు కాలేక పోయింది.దానికి తోడూ ఆరోగ్యరీత్యా కూడా తేరుకోలేకపోయింది.తరుచూ స్నేహితులతో సాహిత్యంలో గడుపుతే బాగుంటుంది అనే ఆలోచనతో మరో నెలరోజులకు డి.సుజాతాదేవితో కలిసి మళ్ళా జానకీ బాలను కలిసాను.
నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర్నుంచి కేబీలక్ష్మి యువభారతి వలన పరిచయమే కాకుండా కుటుంబ మిత్రురాలు.కొందరు రచయిత్రుల తో కలిసి అనంతపద్మనాభస్వామి ఆలయానికి ఏదో ప్రత్యేక దర్శనాలకని వెళ్ళి తిరుగు ప్రయాణంలో మాసివ్ హార్ట్ ఎటాక్ తో మరణించటం మిత్రబృందాలకు తట్టుకోలేని షాక్.చక్కగా గంజి పెట్టిన చీరని చెక్కుచెదరకుండా బొమ్మలా కట్టుకొని,దానికి సరిపడా మేచింగ్ గాజులు గొలుసులను ధరించి,పొడువాటి జడలో అంతే పొడవైన పూలమాల పెట్టుకొని ముఖం నిండా నవ్వుతో అందరితో కలిసిపోయి జోవియల్ గా మాట్లాడుతూ అందర్నీ కలుపుకుంటూ పోయే తత్వం కేబీ లక్ష్మి ది.అందుకనే స్నేహితులు ఎక్కువే.ఇప్పుడు ఆమె అలాంటి పరిస్థితిలో చనిపోవటం చాలామందికి షాక్ గా అయింది.అలా షాక్ కు గురైన వారిలో లక్ష్మికి యువభారతిలో వున్నప్పటి నుండీ అంటే సుమారు యాభై ఏళ్ళ నాటి సన్నిహితులూ,లక్ష్మి స్నేహ బృందంలోని వారందరూ చాలా వరకూ అరవై డెబ్భైలవాళ్ళే కావటం మరణ భయం వెంటాడింది.
వారిలో సుధామగారు బాగా డిస్టర్బ్ అయ్యారు.వాళ్ళ అబ్బాయి కోకాపేటలో వుంటాడు.ఏ రాత్రో అనారోగ్యం కలిగితే అక్కడినుంచి రావడానికే రెండు గంటలు పడుతుంది.అనే తలంపుతోనే సుధామగారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది.దాంతో అబ్బాయి ఇంటి దగ్గరే కోకాపేటలో ఇల్లు కొనుక్కుని మలకపేటనుండి మారిపోవాలనుకున్నారు.
వచ్చే విద్యా సంవత్సరానికి HCU లో మళ్ళా అప్లై చేయాలనుకుంది ఆషీ.అంతకు ముందు ఒక ఇంజినీర్ కాలేజీ సీట్ రిజర్వ్ కోసం ముందుగానే కొంత డబ్బు కట్టమని అన్నారు.కట్టటానికి వెనకా ముందై ఆగిపోయాము.ఆషీ ఇంజనీరింగ్ కాలేజీ పట్ల ఆసక్తి కనబరచలేదు.
అంతలో సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కళాశాల వారి ప్రవేశాల గురించి తెలిసింది.శైలజామిత్ర కూతురు అక్కడే చదివించాలని చెప్పిన గుర్తు.ఆమెకి ఫోన్ చేస్తే చాలా మంచి కాలేజీ అనీ,అవసరమైన ఆన్లైన్ కొర్సులు కూడా చదువుతో బాటూ సమాంతరంగా చేయిస్తారనీ చెప్పింది.
ఆ కాలేజీకి మంచి పేరుందని తెలిసి కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ గురించి వివరాలు తెలుసుకోవటానికి పల్లవీ,ఆషీ వెళ్ళారు.విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ ఓయూ కేంపస్,తార్నాక లో వున్న ఫారెన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRO) ద్వారానే చేర్చుకుంటామని,అక్కడ రిజిష్టర్ చేసుకొని,అక్కడే ఫీజ్ కట్టి రసీదు తీసుకు వచ్చి సబ్మిట్ చేయమని చెప్పారు.మాకు చాలా ఆశ్చర్యం కలిగింది.రేంకు వచ్చిన వారికి తక్కువఖర్చులోనే అవుతుండవచ్చు.కానీ తామరతంపరగా పెరిగి పోతోన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో డబ్బున్న వారు సరే మాకు తెలిసిన ఉన్నత మధ్యతరగతికి చెందిన వారు కూడా ఇంత ఖర్చు పెట్టి చదువుతున్నారా అని అనుకున్నాము.
పల్లవీ,ఆషీ వెళ్ళి FRO కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని వచ్చారు.పాస్పోర్టు,OCI కార్డు అన్నీ సబ్మిట్ చేస్తే అమెరికన్ ఎంబసీకి పంపితే యూఎస్ లోని బర్త్ ప్లేస్ కి వాటిని ఫార్వర్డ్ చేసి నిజంగా అక్కడే పుట్టిందా లేదా అని ఎంక్వైరీ చేస్తారుట.జతపరచిన సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా వున్నాయని యూ.ఎస్ నుండి నిర్థారణ వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడి FRO అడ్మిషన్ కి అంగీకారం తెలియజేస్తారట.ఈ ప్రక్రియకు అంతటికీ ఒక నెల పట్టింది. అప్పటికే కాలేజిలో సిలబస్ మొదలైపోయింది.అయితే ఏం? ఒక సక్రమపద్ధతిలో కాలేజీలో చేరింది కదా.మేము
మిగతా పిల్లలకట్టే ఫీజులకు రెట్టింపు విదేశీ విద్యార్థులు కట్టాలని తెలిసింది.విదేశీ విద్యార్థులు ప్రవేశపరీక్షలు రాయనక్కరలేదట.కేవలం FRO లో రిజిస్టర్ చేసుకొని OU పరిధిలోని ఏ డిగ్రీ/ ఇంజనీరింగ్ కాలేజీలోనైనా చేరవచ్చట.మాకు ఇవేవీ ఇంతకాలం తెలియలేదు.అనవసరంగా కష్టపడి అన్ని ప్రవేశపరీక్షలు రాసింది. ఇలా అని తెలిసి ఉంటే హాయిగా ఇంజనీరింగ్ లోనే చేరేది కదా అనుకున్నాము.అయినా సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఆడపిల్లల కాలేజీ కనుక గొడవలు కూడా వుండవు.అనుకున్నాము. ఇప్పుడు అవసరం కనుక ఆషీకోసం ఒక లాప్టాప్ కూడా కొనవలసి వచ్చింది .
దాంతో కమిటీ అంతా కలవటం కుదరక మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారం ఎంపిక కాస్త ఆలస్యం అయ్యింది.ఈసారి మానేసి వచ్చే ఏడాది ఇద్దరికి ఒకేసారి వచ్చేద్దాం కమిటి నిర్ణయం తీసుకుంది.
మరో వైపు మాడభూషి కథా పురస్కారం కొరకు కథలు పుస్తకాలు వీర్రాజు గారూ ,నేను చదవటం మొదలు పెట్టాము.ఈ పర్యాయం రెండు సంవత్సరాలు కలిపి నిర్వహించాలని కమిటీ ఆలోచన చేసింది.
కొత్తగా వచ్చిన పుస్తకాల గురించి కొందరు మిత్రులను సంప్రదించాము.మంచి పుస్తకమేనని తెలిసిన వాటిని రచయితలను సంప్రదించి పుస్తకాల్ని కొన్ని తెప్పించాము.
వెంట వచ్చునది,స్పర్శవేది కథలు పుస్తకాలు గురించి ఎవరో చెప్పారు.అతని ఫోన్ నెంబర్ తెలియదని కొందరు చెప్పారు.అతను పనిచేసే రాంకీ ఫౌండేషన్ వెబ్సైట్ కు వెళ్తే ఫోన్ నెంబర్ దొరికితే SMS ద్వారా పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని అడిగాను.ఆయన వెంటనే మీ చిరునామా ఇస్తే పంపుతానని మెసేజ్ పెట్టారు.
నేను చిరునామా ఇచ్చేసరికి "ఆ దగ్గర లోనే మా ఫ్రెండ్ వుంది.ఆమెద్వారా పంపుతాన"ని మెసేజ్ పెట్టారు.
మరో రెండు రోజుల్లోనే చక్కనినవ్వు ముఖంతో ఒక అమ్మాయి తలుపు కొట్టింది.నేను కోరిన రెండు పుస్తకాలు తీసుకువచ్చింది.ఆ అమ్మాయి కూడా పల్లవి చదివిన పద్మావతి కాలేజీలోనే చదివిందని తెలిసి పల్లవిని పిలిచాను.నేను రాసిన పుస్తకాలు అడిగితే ఇస్కూలుకతలు,బతుకు పాటలో అస్తిత్వరాగం దీర్ఘ కవిత ఇచ్చాను.వీర్రాజుగారు నాకూ పల్లవికి తెలిసిన వాళ్ళేమో అనుకొని లోపలే వున్నారు.ఆ వాణిశ్రీ అనే అమ్మాయి ఎమ్మే తెలుగు చేసాననీ, పుస్తకాలు చదవటం ఇష్టమనీ ఆ విధంగానే ఎమ్వీ రామిరెడ్డి గారితో చిరకాలస్నేహాన్నీ వివరించింది.అదే తొలి పరిచయమైనా ఎంతోకాలంగా తెలిసినట్లు గా నాతో ,పల్లవితో మాట్లాడింది.అలా పరిచయమై ఇంట్లోకి వచ్చిన వాణిశ్రీ తర్వాత్తర్వాత మా కుటుంబంలో మనిషిలా మా మనసులోకీ వచ్చేసింది.
వాణిశ్రీ తీసుకువచ్చిన రెండు కథలపుస్తకాలూ చదివాక 20 20కి ఎండ్లూరి మానస రాసిన మిళింద సంపుటినీ, 2021కి ఎమ్వీ రామిరెడ్డి రాసిన స్పర్శవేది సంపుటినీ ఎంపిక చేసాము.
- శీలా సుభద్రాదేవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)