8, ఆగస్టు 2021, ఆదివారం

నా పని-నా ఆనందం

 నాపని-నాఆనందం 

                             పనిఅంటే ఇంటి పనా,పిల్లల పనా,ఉద్యోగమా,రచనారంగమా దేని గురించి చెప్పాలి.గొప్ప డైలమాలో పడ్డాను.

       నిజానికి   work is worship అనేది నాసిద్ధాంతం.ఏ పని ఐనా అంకితం భావం తోనే చేస్తాను.ఎందుకొచ్చిన బాధరా బాబూ అనుకునే మనిషిని కాదు.ఏదైనా పని నాకు అప్పగించినప్పుడు నేను చేయగలిగినది ఐతే వప్పుకొని ఆనందంగానే చేస్తాను.నచ్చకపోతే ముందే ఖచ్చితంగా చేయనని చెప్పేస్తాను.

       ఇంటిపనీ,పిల్లలపనీ ఇవి ప్రతీ స్త్రీ కి తప్పని, తప్పించుకోలేని బాధ్యత.అయినా ప్రతీ మహిళా తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా బాధ్యతంతా భుజాన వేసుకుని ఇష్టపూర్వకంగా చేస్తుంది. ఇది చేయటంలో సంతోషమూ ఉంటుంది.ఒకింత స్వార్థమూ ఉంటుంది.అలాగే నేనూ చేసాను.

       అమ్మకి ఆర్ధిక స్వావలంబన లేక చిన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు చూడటం, అనుభవించటం వలన చదువుకొని ఉద్యోగం చేయాలనే గాఢమైన పట్టుదలని వివాహానంతరం పదేళ్ళకి గాని సాకారం చేసుకోలేకపోయాను.అందుకని టీచరు ఉద్యోగంలో పిల్లలతో మమేకం అవుతూ పాఠాలు చెప్పటం లోనూ, స్కూలు కి సంబంధించిన విజ్ఞాన ప్రదర్శనలూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం లో సంతోషం పొందాను. స్కూల్ లో ఉన్నంతసేపూ ఇంకేం విషయాలూ గుర్తు రానంతగా ఆనందం పొందాను.

           కొందరు టీచర్లు ఎప్పుడు రిటైర్ అవుతామో అని సంవత్సరాలు,నెలలూ లెక్కబెట్టుకుంటుంటే అంత బాధ పడి బడికి రావటం మెందుకు? ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకోవచ్చు కదా మరొకరికి ఉద్యోగం అన్నా వస్తుంది అనుకునేదాన్ని.

           నేను ఫ్రెండ్ అనుకున్న ఆమె అప్పట్లో హెడ్ మిస్ట్రెస్ గా ఉంది.ఆమె ప్రమోషన్  నాకు రాకుండా  నన్ను టార్చర్ పెట్టటానికీ,నాకై నేను ఉద్యోగం మానేసేలా  ప్రయత్నం చేసినా ఎదుర్కొని నిలదొక్కుకున్నానే కానీ ఉద్యోగం వదిలి పారిపోలేదు. నిబద్ధతతో పాఠాలు చెప్తూ విద్యార్ధులతో కలిసి మెలిసి ఉండటం లోని ఆనందాన్ని కోల్పోలేదు.

        ఇక నా ప్రవృత్తి రచనా రంగం .1970 లో కథాప్రచురణతో మొదలై యాభై ఏళ్ళు దాటిన నా రచనా ప్రస్ధానం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూనే వుంది.ఉద్యోగవిరమణ అనంతరం నాకు సంతోషం కలిగించే లలిత సంగీతం, చిత్రలేఖనంలో కూడా సాధనచేయాలనుకున్నా అంతగా కుదరలేదు.అందుకే  మరింతగా రచనా వ్యాసంగం లోనే నా ఆనందాన్ని నింపుకున్నాను.

      చిన్నప్పటి నుంచి నన్ను నేను తీర్చిదిద్దుకున్నది పుస్తక పఠనం వలనే.  ఎప్పుడైనా మనసు నొచ్చుకున్నా,చికాకుగా ఉన్నా కాసేపు ఏ పుస్తకమైనా చదువుకుంటే స్నేహితురాలి వలన ఓదార్పు పొందినట్లు మనసు తేలికైపోతుంది.అందుకే ఎంత పని ఒత్తిడిలో తీరికలేకుండా ఉన్నా,అనారోగ్యంగా ఉన్నా   రాత్రి తప్పని సరిగా ఓ నాలుగైదు కవితలో ఓ రెండు కథలో చదివిన తర్వాతే నిద్రకు ఉపక్రమించటం చిన్నప్పటి నుంచీ అలవాటు.

        నా ఆవేదన,నా ఆవేశం,నా దుఃఖం,నా ఆక్రోశం,నన్ను కలవరపరిచే అన్ని అనుభూతులను మరిపించి ఆనందాన్నీ, సంతృప్తినీ కలిగించి మనసుతేలికపరచేది నా సాహిత్య పఠనమూ,రచనలే.ఎన్ని ఒడుదుడుకుల్ని నా జీవితపర్యంతమూ  ఎదుర్కొన్నా నా ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరకుండా సంయమనంతో ఉండేలా చేసినవి నాకు తోడుగా ఉన్న నా అక్షరాలే.

3, ఆగస్టు 2021, మంగళవారం

భయం భయం

 



    "భయం భయం "
          
ఎందుకో తెలియదు
ఏనాడూ ఎరుగను 
ఎప్పుడు ఎలా
నా మనసులో దూరిందో తెలియదు
ఆకాశం నుండి ఉల్కై రాలిపడిందో
మొన్న రాత్రి ఎక్కడో వానకి పడిన పిడుగు
ఎటునుండో వచ్చి గుండెల్ని కాల్చేసిందో
తోచనీయనితనం
ఏపనీ చేయనీయదూ
మనసు ఒకటే ఊగిసలాట

మనసుని ఒక రాటకి కట్టేయడానికి
వార్తాపత్రిక తెచ్చి తెరిచాను
చెమ్మచెమ్మగా ఉన్న పేజీలు తిప్పుతుంటే 
వేళ్ళ కొసలు తడితడిగా ఎర్రబడే సరికి
మనసు పుంజీలు తెంపుకొని
ఇంకావేగాన్ని పెంచుకు ఊగుతోంది

హృదయాన్ని మడిచి
మెదడు పెట్టిలో దాచి
ఇడియట్ బాక్స్ మూత విప్పాను
తూటాల పేలుళ్ళ పొగ
మాటల దుర్గంధం
మరణమృదంగ ధ్వని
బాధితుల ఆర్తనాదాలు
ఇల్లంతా వ్యాపించేస్తున్నాయి
మళ్ళీ అదే తోచనితనం
మళ్ళా మళ్ళా మనసు అదే ఊగిసలాట

 ఏ ద్వారాలనుండైనా ఎగిరొచ్చే
ఓఆత్మీయ పలకరింపు కోసం
వాకిట్లోకెళ్ళి నిల్చున్నాను
ఎక్కడా ఏ అలికిడీలేదు
అన్ని గుమ్మాలకు మరణభయం 
తాళం కప్పలా వేలాడుతోంది
మళ్ళీ అదే మనసు ఊగిసలాట

 స్నేహహస్తాన్ని అందుకుందామని
 చేతియంత్రాన్ని ప్రేమగా నిమిరాను
 ఎవరిని పలకరించినా
 అటుతిరిగీ ఇటు తిరిగీ
 ప్రతీ ఒక్కరి కంఠంలోనూ
 గుండెల్లోంచి పాకి వస్తున్న 
 భయం ప్రతిధ్వనే ఠంగున మోగుతుంది

ఇప్పుడు అర్థమైంది
ఈ తోచనితనం
ఈ మనసు ఊగిసలాట
నా ఒక్కదానిదే కాదని
మరణభయం గుప్పిట్లో చిక్కిన
ప్రపంచానిదని.