12, ఆగస్టు 2022, శుక్రవారం

శీలా వీర్రాజు తో నా ప్రయాణం

 ~~ శీలా వీర్రాజు గారితో నా ప్రయాణం ~~


       మా అక్కయ్య పి.సరళాదేవి ప్రభావం వలన అతి చిన్నప్పుడే అఆలతో పాటే సోవియట్ లాండ్ ప్రచురణల బొమ్మల పుస్తకాల్ని చూస్తూ కథలు ఊహించటం నేర్చుకున్నాను.బొమ్మలువేయటం నేర్చుకున్నాను
  1970 లో స్వాతి ప్రారంభసంచికలో గౌరవసంపాదకునిగా శీలా వీర్రాజు పేరు చూసి "దేవి"పేరుతో ఆయన రచనలపై నా అభిప్రాయం వెల్లడిస్తూ ఉత్తరాలు రాయటంతో మొదలైన మా కలంస్నేహం అతి తొందరలోనే మా వివాహానికి దారితీసింది.ఆవిధంగా సాహిత్యమే మమ్మల్ని కలిపింది.
          నేను రాసిన అముద్రిత కథలు చదివి మూడు కథల్ని ఎంపిక చేసి పత్రికలకి పంపించమని చెప్పటంతో వివాహానికి ముందే 1970 లో తొలి కథ ప్రచురితమైంది.మా వివాహానికి ముందే  కాబోయే      భార్య రచయిత్రి అని మిత్రులకు చెప్పుకుని మురిసి పోయేవారు.
       1971 లో వీర్రాజు గారి చేయిపట్టినా చదువు పూర్తి చేసుకుని 1972 లో భాగ్యనగరంలో అడుగుపెట్టాను.అప్పుడప్పుడు కథలే రాస్తున్న దాన్ని ఇంట్లో కవితా సంపుటాలు,కవులరాక పోకలూ నన్ను కవిత్వం వైపు ఆకర్షించాయి.
         వివాహం లోగా ఒక దీర్ఘ కావ్యం రాస్తానని నాకు మాట యిచ్చినా అనేకపనులమధ్యదానిని ఆలస్యంగా పూర్తిచేసి మా అమ్మాయి జన్మించినప్పుడు "మళ్ళీ వెలుగు "కావ్యాన్ని గ్రంథరూపంలో తీసుకు వచ్చి నాకు అంకితం చేశారు. అప్పటికి అతి తక్కువ మంది మాత్రమే దీర్ఘ కవితలు రాసారు.కానీ దీర్ఘకావ్యాలమీద పత్రికల్లో వ్యాసాలు వచ్చినప్పుడు అందులో మళ్ళీ వెలుగును ప్రస్తావించనప్పుడు కాస్త చిన్నబుచ్చుకునే వారు.
        ఒకరోజు సినిమా పాటకి నృత్యం చేస్తూ అడుక్కోటానికి వచ్చిన ఎనిమిదేళ్ళ పాపని చూసి మనసు కలతపడి నేను రాసిన ఆకలినృత్యం కవిత చదివి వీర్రాజు గారు చాలా మెచ్చుకుని నా చూపును,ఆలోచనలనూ కవిత్వం వైపు మళ్ళించారు.
        1980 లో కథలపుస్తకం ప్రచురించాలని అనుకున్న నాఆలోచనని వెనక్కి నెట్టి వీర్రాజు గారు ఆకలినృత్యం పేరిట నా తొలి కవితా సంపుటిని ప్రచురించి నాకు అందించారు.
     రచన చేయటం పత్రికలకు పంపటం వరకూ నావంతు కానీ ఆతర్వాత  వాటిని ఒకదగ్గరకు చేర్చి ప్రతి రెండు మూడేళ్ళకూ ఒకటి చొప్పున తొమ్మిది కవితా సంపుటాలూ,మూడుకథల సంపుటాలూ వెలుగులోకి రావటం వెనుక ముఖపత్ర అలంకరణ దగ్గరనుండి పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దడం వరకూ వీర్రాజు గారి కృషి వెలకట్టలేనిది.
     మా అమ్మాయి యూఎస్ లో ఉన్నప్పుడు జరిగిన జంటటవర్లు ఉగ్రవాద దాడిలో కూలిన సంఘటన నన్ను కలవరపరచటంతో నేను రాసిన కవిత చదివి వీర్రాజు గారు అద్భుతంగా వచ్చిందనీ,దీనిని దీర్ఘకవితగా పెంచి రాయగలవేమో ప్రయత్నించమని ప్రోత్సహించారు.యుధ్ధనేపధ్యంలో రాసిన" యుధ్ధం ఒక గుండె కోత "ఆ విధంగా వెలుగులోకి వచ్చింది.ఇది మరో మూడు భాషల్లోకి అనువాదం కావటాన్ని చూసి వీర్రాజు గారు చాలా ముచ్చట పడి స్నేహితులకు చెప్పుకునే వారు. "మనరచనలను ప్రమోట్ చేసుకోవడం మనకి చేతకాదు సుభద్రా పుస్తకరూపంలో ఉంటే ఎప్పటికైనా ఎవరో ఒకరు గుర్తించకపోరు" అంటూ ఉండేవారు.
      ఎప్పటికప్పుడు మా జీవితంలో ఎదురైన ఆటుపోట్లతో కుంగి పోతున్నప్పుడు తనదో,నాదో  పుస్తకం ఒకటి ప్రచురించి ఆ పని లో తాను గాయాన్ని మాన్పుకోవటమే కాక డిప్రషన్ లోకి పోకుండా నన్ను రచనలవైపు మరలించేలా చేసినదీ ఆయనే.
      పుస్తకం ప్రచురించటం వీర్రాజు గారికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యం.డీటీపీ చేయించిన దగ్గరనుండి,ప్రూఫులు దిద్దటంతో బాటు, ముఖచిత్రాన్ని వేయటం, ప్రచురణ పనిపూర్తి అయ్యి పుస్తకం చేతిలోకి వచ్చేవరకూ విశ్రమించకుండా ఒక తపస్సులా తాను నిమగ్నమైపోతూవుంటారు.ఆ పుస్తకం మాదైనా ,మిత్రులదైనా,కేవలం పరిచయస్తులదైనా అదే అంకితభావం తో చేసేవారు..ఈ విషయం అనేకమంది సాహితీ మిత్రులకు తెలిసినదే.
   కొందరు పుస్తకం పని ఉన్నంతకాలం ఆయన చుట్టూ తిరిగి పని పూర్తయ్యాక ముఖం చాటు చేసేవారు. ఒక్కొక్కప్పుడు ఆయన తన వయసూ, ఆరోగ్యం పట్టించుకోకుండా శ్రమపడుతుంటే నేను విసుక్కోవటం కూడా జరిగేది‌.కానీ కొత్త పుస్తకాన్ని  కొత్తగా జన్మించిన పసిపాపని చేతుల్లోకి తీసుకొన్నంతగా తన్మయులైపోతారు.
      అందుకేనేమో తన కథల్నీ,కవితలన్నీ,నవలల్నీ మళ్ళీ మళ్ళీ ప్రచురించుకున్నారు.అయితే ఒకేసారి పుస్తకప్రచురణకి పెట్టుబడి పెట్టటం ఆర్థికంగా భారం ఔతుందని ముఖచిత్రాలు వేయించుకుని ఎవరైనా ఇచ్చిన డబ్బు, మాపుస్తకం ఎవరైనా కొనుక్కోగా వచ్చిన డబ్బు, మాకు వచ్చిన పురస్కారాల డబ్బే కాకుండా పెన్షన్ అందుకోగానే ప్రతీ నెలా ఆయనది ఒక రెండువేలూ,నాది ఒకరెండువేలూ ఒకకవర్లో పెట్టి వాటినే అంచెలంచెలుగా పుస్తక ప్రచురణలకు ఉపయోగిస్తూ ఉండేవారు.అంతేతప్ప ఎక్కడనుండీ,ఎవరినుండీ ఆర్థిక సహాయం పొందకుండానే మా ఇద్దరి పుస్తకాలు ప్రచురించటానికి ఉపయోగించేవాళ్ళం.
        తన పుస్తకాలు కట్టలని రోజుకు ఒక్కసారైనా తన చేతులతో తడుముకుంటూనో , సర్దుతూనో ఉండేవారు.
         అదేవిధంగా ముఖచిత్రం వేయించుకుని ఊహించని విధంగా పెద్దమొత్తం ఎవరైనా ఇస్తే  వెళ్ళి ఒక బొమ్మ కొనుక్కొని వచ్చేవారు.ఆ విధంగా మా ఇంటిని బొమ్మలకొలువుగా, మ్యూజియం గా చేసారు.ఇదిఅయిదారేళ్ళక్రితం వరకూ కొనసాగింది. ఇంక కళాఖండాలు పేర్చుకోడానికి స్థలం లేక కొనటం మానేసారు.అంతేకాక మా పుస్తకాలు అమ్మకం చేసుకోలేక ఇంటినిండా పేరుకుపోయి ఉండటంతో కొత్తగా రాసిన రచనలు ప్రచురించుకోవటానికి మాయిద్దరిలో  భయం మొదలైంది.అవికాకుండా వీర్రాజు గారు వేసిన వర్ణచిత్రాలు కూడా చాలా ఉన్నాయి.
      మా తదనంతరం మా అమ్మాయికి  భారం కాకూడదనే ఆలోచనతో  పెయింటింగ్స్ ని ఎక్కడైనా భద్రపరచాలనే నిర్ణయానికి వచ్చి వీర్రాజు గారు తాను జన్మించిన రాజమహేంద్రవరం లో  చిత్రకళను అభ్యసించిన దామెర్ల చిత్రకళా పరిషత్తు కు వారు తన జీవిత కాలంలో వేసిన 78 తైలవర్ణ చిత్రాల్ని చిత్రకళాభిమానులకు మార్చినెలలో అంకితోత్సవం చేసాము.వీర్రాజుగారు ఎన్నో ఏళ్ళుగా సేకరించిన వివిధ దేశాలకు చెందిన చిత్రకళకు సంబంధించిన అమూల్యమైన గ్రంధాలు కూడా అక్కడే అందజేసాము.
      కీర్తిప్రతిష్టలకోసమో , పురస్కారాల కోసమో తాపత్రయం పడకుండా తాను ఎలా జీవించాలనుకున్నారో అలానే నిబద్ధత తో, నిజాయితీగా జీవించి తాను చేయాలనుకున్న
కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుని నిష్క్రమించారు.
      అదే దారిలోనే గత యాభై ఏళ్ళకు పైగా వీర్రాజు గారితో పాటు సాహిత్యాన్నే శ్వాసిస్తూ నడిచాను.ఇంతకాలం భౌతికంగా ఇద్దరంగా ఉన్నాము.నేను కలాన్ని ముడిచేయనంతకాలం నా సాహిత్య ప్రయాణంలో వీర్రాజు గారు నిరంతరం నాతోనే ఉంటూనే ఉంటారు.

( ఆగష్టు కవిసంధ్య పత్రికలో ప్రచురితం)