22, నవంబర్ 2020, ఆదివారం

ఫో

             ఫో!



గుండెవాకిల్ని కాస్తంత ఓరగా తెరచి

ఎదురు చూపుల్ని గుమ్మానికి పూలతోరణాలుగా కట్టి

జీవితపు రాత్రంతా వెలుగు పెంచుకునేలా

కళ్ళదీపాల్ని వెలిగించి

చిగురాశతో ఎగసిన దోస్తూ ఉంటాను

అప్పుడెప్పుడో తోటలోనో తోపులోనో

నన్ను తమచుట్టూ తిప్పుకున్న పూలపాపలు

పరిమళ భరిత స్నేహచందనాల్ని

పాదముద్రలు గా పరుచుకుంటూ వచ్చి

ముంగిట్లో ముత్యాల రంగవల్లుల్ని దిద్దుతాయనో


ఏనాడో గుండెను మీటిన సన్నాయి నాదం

తేనెసోనలా రాగాలు తీసుకుంటూ

సంగతుల్నీ స్వగతాల్ని కలుపుకుంటూ

గమకాల జ్ణాపకాల్ని తట్టిలేపుతూ

మనసుని నాట్యమయూర్ని చేస్తాయోననో


చిన్నప్పుడెప్పుడో కిటికీ తలుపు సందులో

గూడల్లిన గొంగళి పురుగు

కళ్ళెదుటే పంచరంగుల్ని పులుముకుని

పెరటి తోటలో పూలమీదుగా

ఎగురుతూ వచ్చిన సీతాకోకచిలుకై

ఏరాత్రి పూటో నా కలలో

హృదయం మీద అద్దకం పని చేస్తుందనో


ఎదురింటి మామిడి చిగుళ్ళు మేసిన కోయిలమ్మ

మండు వేసవి లోఅలసి సొమ్మసిల్లిన సమయంలో

చెవిలో అమృతబిందువులు కుమ్మరిస్తుందనో


పగలూ రాత్రీ సూర్యచంద్రుల తోడుగా భూఆవరణం నిండా దివిటీలు వెలిగించి

నిశ్చలన చిత్రమై నిలిచాను


ఇంతకాలం నిన్ను మోసుకొని నడుస్తూ నడుస్తూ

భుజాలమీద కదుములు కట్టి అలసి పోయాను

దుఃఖమా!

 ఇకనైనా నన్నూ ఈ జనాన్నీ ఈ భూమినీ విడిచి

 నీదారిని నువ్వు

 ఏ అనంతవిశ్వం లోకో

 ఏ సముద్రగర్భంలోకో ఫో!

 ఇకనైనా మమ్మల్ని

 మాకోసం నవ్వుతూ బతకనీ


_శీలా సుభద్రా దేవి.







   

18, నవంబర్ 2020, బుధవారం

కోటబొమ్మాళి జీవితం

 1961 లో మా నాన్నగారు పోయిన ఏడాది కి  మా అన్నయ్య కు శ్రీకాకుళం జిల్లా లోని కోటబొమ్మాళి అనే ఊరు లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది.మా రెండో అన్నయ్య  వైజాగ్ లో హాస్టల్ లో ఉండి చదువుకునే వాడు.

అమ్మా,మా రెండో అక్కా నేను విజయనగరం నుండీ రైల్లో బయలుదేరి రామచంద్రా పురమో, హరిశ్చంద్రాపురమో గుర్తు లేదు,అక్కడ దిగి ఎడ్లబండి లో కోటబొమ్మాళి కి వెళ్ళాం.అప్పటికి కోటబొమ్మాళి కి బస్సు కూడా లేదు.దారంతా గతుకుల రోడ్డు మీద ప్రయాణించి వెళ్ళాం.

ఆ ఊరులో అప్పట్లో రెండే సమాంతరంగా ఉండే వీధులు.ఒకటి బ్రాహ్మణ వీథి.రెండోది కోమట్లవీథి.ఇతర కులాల వారు మరి ఎక్కడ నివసించేవారో నాకు తెలియదు.బ్రాహ్మణ వీథిలో మాకు. అద్దెకి  ఇవ్వరు కనుక కోమట్లవీధీ లోనే మరి మాకు ఎలా ఇచ్చారో గానీ ఒకేగది ఇంట్లో అద్దెకు తీసుకుని అందులో ఉండే వాళ్ళం.గది వెనుక ఒక వసారా ఉండేది అక్కడే వంట చేసుకునే వాళ్ళం.తర్వాత పెద్ద తోట అందులో పంపర పనాస,జామ వంటి పళ్ళ చెట్లు ఉండేవి కానీ వాటి మీద చెయ్యి వెయ్యటానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు ఇంటి వాళ్ళు.

నాన్నగారు పోయిన తర్వాత నన్ను ఆరో తరగతి తో చదువు మానిపించారు కదా ఇక్కడ ఏడో తరగతి లో జాయిన్ చేశారు.

ఆ ఊరులో ఎవరింట్లోనూ  మరుగుదొడ్లు లేవు.దూరంగా ప్రహారీ కట్టిన బహిరంగ ప్రదేశం ఉండేది.చిన్నబకెట్ తో నీళ్ళు పట్టుకుని వెళ్ళాల్సిందే.స్నానం మాత్రం పెరట్లో చేసేవాళ్ళం.

ఊరికి చుట్టూ కొండలు ఉండటంవల్ల ఎలుగు బంట్లు రాత్రిపూట ఊర్లోకి వచ్చేసేవి. అందుకని రాత్రంతా డప్పులు వాయిస్తూ కాగడాలతో కాపలా ఉండేవారు.పాములు సరేసరి రాత్రీ పగలూ తిరుగు తూనే ఉండేవి.

ఊరులోని ఆడవాళ్ళు రోజంతా రకరకాల అప్పడాలు సకినాలు వంటివి తయారుచేయటం, (శ్రీకాకుళం జిల్లాలో రకరకాల అప్పడాలు ముఖ్యంగా పేలాలు అప్పడాలకు ప్రసిద్ధి) ఇంటిపనులు చేస్తూ ఉండే వారు.పెద్దగా బయటకు కనిపించే వారు కూడా కాదు.బడిలో ఏ క్లాసులోనూ అయిదారు మందికన్నా ఆడపిల్లలు ఉండేవారు కాదు.వారు కూడా అగ్ర వర్ణాల పిల్లలే.

కొన్నాళ్ళ క్రితం  HJ దొర అనే ఐ.పీ.ఎస్ ఉండే వారు కదా.అతను నాకు జూనియర్  క్లాసులో నూ అతని సోదరి నాకు సీనియర్ క్లాసులో ఉండేవారు.బడికి రోజూ టాంగా మీద వచ్చే వారు.దొరగారి అమ్మాయి అంటూ ఆమెని స్కూల్ లో అందరూ అపురూపంగా చూసేవారు.

ఒకసారి బళ్ళో పాటలు పోటీ  పెట్టారు. పాటల పోటీలో నాకు ఫస్ట్,ఆమెకు సెకెండ్ అని అనౌన్స్ చేసి , తర్వాత స్కూలు డే రోజున ప్రైజులు తారుమారు చేసారు.

శ్రీకాకుళం ప్రాంతాలలో మాత్రమే "నేస్తం కట్టడం" అనేది పధ్ధతో,సాంప్రదాయమో మరి చూసాను.మా తరగతిలోని నా స్నేహితురాలు ఒకరోజు మనం నేస్తం కడదామా అని అడిగింది.అంటే స్నేహం గా ఉందామని అడిగింది అనుకుని సరే అన్నాను.నన్ను ఆ పక్కనే ఉన్న చిన్న గుడి కి తీసుకెళ్ళి నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ  ప్రమాణం వంటిది చేయించింది.నేస్తం కట్టిన వాళ్ళు ఒకరినొకరు జీవితాంతం స్నేహబంధం కి కట్టుబడి ఉండాలి.ఒకరినొకరు మీరు అని మన్నించు కోవాలి.ఒకరిపేరు ఒకరు ఉఛ్ఛరించకూడదు.ఇలా ఏవో చాలా నిబంధనలు ఉన్నాయి.ఐతే నేను ఆ ఊరు వదిలి వచ్చిన తర్వాత  కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లతో ఆ విషయమే మర్చిపోయాను.

ఇటీవల వ్యాసం రాయటానికి నిడదవోలు మాలతి గారి కథలూ చదువుతుంటే ఒక కథలో ఈ ప్రస్తావన ఉంది.దాంతో అవన్నీ గుర్తు వచ్చాయి .ఇంతకీ నా నేస్తం ఎలా ఉందో!!? మళ్ళీ ఒకసారి కోటబొమ్మాళి వెళ్ళి రావాలని ఉంది.

15, నవంబర్ 2020, ఆదివారం

నాకు స్పూర్తి నిచ్చిన వ్యక్తి పి.సరళాదేవి

 నాకు స్పూర్తి నిచ్చిన వ్యక్తి మా పెద్దక్కయ్య పి.సరళాదేవి .ఆమె 

డా. పి.శ్రీదేవి స్నేహప్రభావంతో 1955 నుండీ తెలుగు స్వతంత్ర లో విస్తృతంగా కథలు రాసేది.వాళ్ళు పుంగనూరు లో ఉన్నప్పటి నుండి  ఎమ్.రాజేంద్ర( జర్నలిస్టు),మధురాంతకం రాజేంద్ర గార్లు  కుటుంబ స్నేహితులు.అక్కయ్యవి మూడు కథలు సంపుటాలు,రెండు నవలికలు, తెలుగు వారి సామెతలు పై విశ్లేషణాత్మక గ్రంథం ' సామెత' ప్రచురింపబడ్డాయి.1975 తర్వాత రచనలు చేయటం మానేసింది.

  నాకు ఊహ తెలియక ముందే అక్కకి పెళ్ళి ఐపోయింది.ఆమె ఎప్పుడు విజయనగరం వచ్చినా నాకోసం బొమ్మలో మిఠాయి లో కాకుండా చిన్న చిన్న బొమ్మల పుస్తకాలు తెచ్చేది.అందువలన కూడబలుక్కుని చదివే దాన్ని . సోవియట్ లేండ్ వాళ్ళ పిల్లల పుస్తకాలు తెలుగు అనువాదాలు ఇచ్చేది.ఆ విధంగా చాలా చిన్నతనం నుండి కథలపుస్తకాలు చదవటం అలవాటైంది.

అక్క భర్త మా మామయ్యే. వాళ్ళు ఉద్యోగరీత్యా ఏ వూరు వెళ్ళినా అక్కడ పిల్లలందరినీ చేర్చి బాలానందం నడిపేది.వాళ్ళకి పాటలు, డేన్స్ లే కాకుండా కథలు చదివించే ది.సెలవుల్లో వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ జత చేరేదాన్ని.

  ఎనిమిదో తరగతి అయ్యాక కుటుంబకారణాల వలన ఒక ఏడాది చదువు మానిపించుతే ఏలూరు దగ్గర గోపన్న పాలెం లో అక్క ఇంట్లో ఒక ఏడాది ఉండాల్సి వచ్చింది. 

  వాళ్ళింట్లో లైబ్రరీ లోనే కాక దగ్గర లోని లైబ్రరీ కి వెళ్ళి కొంతసేపు చదువుకొని మరి రెండు పుస్తకాలు తెచ్చుకునేదాన్ని.అలా ఒక్క ఏడాది లో ఎంతోమంది ప్రముఖుల రచనలే కాక శరత్  అనువాదగ్రంథాలు కూడా చదివాను.నాకు మితృలు పుస్తకాలే.

  ఒకసారి ఏలూరులో ఆవంత్స సోమసుందర్ గారికి పెద్ద ఎత్తున ఘనసన్మానం జరుగుతుంటే  నన్ను తీసుకెళ్ళింది.సభానంతరం ఒక సాహిత్య మితృని డాబా మీద వెన్నెల్లో కవితా గోష్ఠి జరిగింది.ఎంతమందో కవులు కావ్యగానం చేస్తుంటే అద్భుతంగా అనిపించింది.అంతవరకూ కథలూ నవల్లే  చదివే దాన్ని అక్కని కవిత్వం పుస్తకాలు అడుగుతే వైతాళికులు, మహాప్రస్థానం, కృష్ణపక్షం, ముత్యాల సరాలు ఇచ్చింది.అందులోని నాకు నచ్చిన వన్నీ ఒక పాతడైరీలో రాసుకున్నాను.అది ఇప్పటికీ నా దగ్గరే  ఉంది.అప్పటి నుండి కృష్ణశాస్త్రి కవితలోని లాలిత్యం ఎంత ఇష్టమో, శ్రీ శ్రీ కవిత్వం లోని లయ, పదును అంతే ఇష్టం.

  పుస్తకం పఠనమే  కాకుండా అక్క ఎంబ్రైయిడరీ, బొమ్మలు తయారు చేయటం, లలిత సంగీతం నేర్పించేది.నేను బొమ్మలు బాగా వేస్తున్నానని నా చేత  మంచి చిత్రం వేయించీ శంకర్స్ వీక్లీ వారు కండక్ట్ చేసే బాలల చిత్రలేఖనం పోటీ కి పంపింది.బహుమతి రాలేదు కానీ సర్టిఫికెట్ వచ్చింది.నేను ఈనాడు రచయిత్రిగా, కవయిత్రి గా ఎదగటానికి గల కారణం అక్క దగ్గర ఉన్న ఏడాది కాలమే.

  ఆ ఏడాది గడిచాక తిరిగి విజయనగరం లో తొమ్మిదో తరగతిలో చేరాను.

  పుస్తక పఠనం వల్ల నేను చదువులో బాగా రాణించాను.అంతేకాక మా స్కూల్లో లిఖిత పత్రికలో కవితలే కాక

  ఛందస్సు లో కూడా పద్యాలు రాసాను.చిన్నన్నయ్య అప్పటికే కథలు రాసేవాడు.నేనూ రాసినా ఎవరైనా చూస్తే చదవకుండా కథలు రాస్తున్నారని తిడతారని చూపేదాన్నికాదు.

  తర్వాత కాలేజీ లో చేరాక కాలేజీ మేగజైన్ కి రాసే దాన్ని.డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కొడవంటి సుభద్రా దేవి పేరుతో మూడు కథలు పొలికేక  పత్రికలో ప్రచురింపబడ్డాయి.రెండవ ఏడాది మేనత్త కొడుకు శీలా వీర్రాజు గారి తో వివాహం జరిగినా థర్డ్ ఇయర్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాను.

  మా ఇంటి కి కవులు ఎక్కువగా రావటం ,కవితా సంపుటాలు ఎక్కువ చదవటం తో కవిత్వం వైపు మళ్ళిపోయినా కథలూ రాసే దాన్ని .నేను రాసిన రచనలకి అక్క స్పందించి ఉత్తరం రాసేది.

  ఎలక్షన్స్ బేనర్ల పై రాసిన ' వానా వానా కన్నీరు' కథ చదివి అక్క పెద్ద ఉత్తరం రాసింది."కుటుంబ పరిథి లోనే రాయకుండా సమాజం లోని  ఇతర సమస్యలతో రాయటం బాగుంది.ఆలోచన విస్తృతమౌతోంది.ఇలానే రాస్తుండు"అన్న తర్వాత నా రచనా పరిథి పెంచుకున్నాను.

  1996 లో కేవలం స్త్రీ చైతన్యంతో రాసిన కవితా సంపుటి" ఆవిష్కారం" అక్కకి అంకితం ఇచ్చాను.

  కేంద్ర సాహిత్య అకాడమీ వారు డా.శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ రాయమన్నప్పుడు పాత తెలుగు స్వతంత్రలు వెతుకు తుంటే  అక్కరాసిన సంపుటీకరింప బడని  కథలు  కొన్ని దొరుకుతే వాటిని నేను అక్కకి ప్రేమ పూర్వక నివాళి గా పుస్తకరూపంలో తెచ్చాను.

  అందుకే  నేను అక్కకి సాహితీ వారసురాలినని ఎప్పుడూ చెప్తుంటాను. మొదటినుంచీ నన్ను సాహిత్యం వైపు మళ్ళించిన మా పెద్దక్కయ్య పి.సరళాదేవి నాకు స్పూర్తి నుంచి ఇచ్చిన వ్యక్తి.

8, నవంబర్ 2020, ఆదివారం

 ఇప్పుడు కథలు చూద్దాం.1955 లో దద్దనాల రంగనాయకమ్మ గా  కథాసాహిత్యం తో మొదలుపెట్టినప్పటి కథల్లో ఆమె దృక్పథం .

1957 లో రాసిన " పెళ్ళెందుకు" ఇద్దరు స్నేహితురాళ్ళు   ఉత్తరాల్లో నే కథ అంతా నడుస్తుంది.పద్మ తన పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తూ కుసుమకు రాసిన ఉత్తరం తో కథ మొదలౌతుంది.ధనవంతురాలైన కుసుమ తెలియని వ్యక్తి ని పెళ్ళాడి, స్వేచ్చ ను కోల్పోయి పెళ్ళనే ఊబిలో దిగననీ హాయిగా అమ్మానాన్నలతో,అన్నతో కాలం గడుపుతానంటుంది.కానీ పద్మ మనకంటూ ఒక మనిషి ఉండాలంటే పెళ్ళిచేసుకోమంటుంది. 

 కొన్నాళ్ళకి అకస్మాత్తుగా కుసుమ తండ్రి చనిపోవడంతో అన్నావదినలు కుసుమను విసుక్కోవడం తో బాధపడిన కుసుమ పెళ్ళికి అంగీకారం తెలిపిన లేఖతో కథ ముగుస్తుంది.కథ మొత్తం లేఖలతో నడవటం ఒక విశేషం.ఇందులో వివాహ వ్యవస్థ గురించిన చర్చలో కుసుమ వాదనలో రచయిత్రి భావాలూ, స్ర్తీ చైతన్యం స్పష్టంగా ఉంటుంది.

 1961 లో ప్రభ  లో రెండు వారాలు గా వచ్చిన "విజయ" .15 ఏళ్ళ విజయకి అక్కతో పాటే పెళ్ళి చేయాలనుకుంటే చదువుకుంటానని చాలా మొండి పట్టుదల పడితే అక్క  పెళ్ళి చేసేస్తారు.స్కూల్ ఫైనల్ అయ్యాక తండ్రి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటుంది.ప్రైవేటుగా హిందీ పరీక్షలు పాసై,తన విద్యకాంక్ష తీర్చుకోవడానికి లైబ్రరీలో పుస్తకాలు చదవటం, పాటలు సాధన చేసి రెడియోలోపాడటం, రేడియో నాటికలలో నటించటం ఇలా ప్రతీ నిముషాన్నీ ప్రయోజనకరంగా చేసుకుంటుంది విజయ.తన భావాల్ని కథలుగా రాస్తుంది.

 ఆమెను ఇష్టపడిన వ్యక్తి అభిరుచులు ఆశయాలు మాట్లాడుకుందాం అని అడుగుతే, స్పష్టంగా చెప్పి వివాహానికి ఒప్పుకుంటుంది.అప్పుడు మళ్ళీ విజయ పెళ్ళితో పాటే 14 ఏళ్ళ చెల్లెలి కి కూడా చేస్తానంటే విజయ అభ్యంతరం చెప్పి చెల్లెల్ని తాను చదివిస్తానని చెప్పటంతో కథముగిస్తుంది.

 వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య ఉండవలసిన నమ్మకం,పరస్పర ఏకీభావం వంటి చర్చలలో రచయిత్రి తదనంతరం రచనల్లో విస్తృత రూపం దాల్చటానికి వెలుగు చూపిన మొలకల్లా భావించవచ్చు.

 1967 లో యువ  లో ప్రచురితమైన"శోభనపు రాత్రి"ఒక ప్రత్యేక మైన కథ.దాంపత్య సంబంధాలలో లైంగిక జీవితం పట్ల జడత్వం ఉన్న సుజాత కారణాన శోభనం ఏవో సాకులతో వాయిదా పడుతుంది.ఆరోజు కోసం కలలుకన్న వాసుదేవరావు ఉత్తరాలు రాస్తుంటాడు.చదువు వంకతో ఏడాది పాటు మళ్ళా వాయిదా పడ్తుంది.తర్వాత తప్పని సరిగా కాపురానికి వచ్చినా రాజీపడదు.దీనినే దృశ్యాలు గా కథనం చేస్తుంది. రచయిత్రి.సుజాత అక్క వితంతువు పట్ల ఆకర్షితుడౌతాడు వాసుదేవరావు.ఆమెని ఇంట్లో వాళ్ళుమందలిస్తారు.చివరికి సుజాత కి స్వేచ్చ కల్పిస్తు వెళ్ళిపోతాడు.

 ఈమూడు కథలూ దాంపత్య సంబంధాలను చెందినవే ఐనా విభిన్న కథాంశంతో, విభిన్న దృక్కోణంలో రాసినవి.సంభాషణలో రచయిత్రి భావసాంద్రతా,స్పష్టతా, ఖచ్చితత్వం,వెల్లడౌతాయి.స్త్రీపాత్రలు మొదటినుంచీ  దృఢత్వం కలిగి ఉంటాయి.రంగనాయకమ్మకి అత్యంత ఇష్టమైన సాహిత్య పఠనానికి సంబంధించిన సంభాషణలు మూడింటిలోనూ ఉంటాయి.ఆమె తొలినాటి కథలే ఐనా ఒక ఖచ్చితమైన, నిర్ణయాత్మక మైన,సంకల్పంతో నే రచనా రంగంలో కి వచ్చినట్లుగా తెలుస్తుంది.ఏదో గాలివాటుగా,నేలవిడిచి సాము చేసే రచనలు కావు.అందుకే మొదటినుండీ రంగనాయకమ్మ గారిపై అత్యంత ఇష్టమైన రచయిత్రి.

 నాకు అప్పుడు ఇప్పుడూ కూడా అభిమాన రచయిత్రి రంగనాయకమ్మ.

 నేను ఏడో తరగతి చదువుతున్న రోజుల్లో ప్రభ  లో సీరియల్ గా వస్తున్న " కూలిన గోడలు" అమ్మకి చదివి వినిపించే దాన్ని.ఎందుకు చదివి వినిపించాలనిపించేదో తెలియదు.మధ్య మధ్య అమ్మ అందులోని సంఘటన లతో పోలిక ఉండే విషయాలూ, అనుభవాలు చెప్పేది.

 బహుషా ఆ ప్రభావమే  ‌నన్ను రచయిత్రి ని  చేసాయేమో.

 రంగనాయకమ్మ గారు 1955 లో తొలికథతో సాహిత్యరంగం లోకి వచ్చి15 కి పైగా నవలలు, ఎనిమిది కథా సంపుటాలు,రామాయణ విషవృక్షం,కేపిటల్ అనువాదం, 20 వ్యాససంపుటాలు,ఇంకా మరెన్నొ రచనలు అవిశ్రాంతంగా రాస్తూనే ఉన్నారు.

 మార్క్స్ మాయలో పడి రచనలో మరింత సూటిదనం,స్పష్టతా వచ్చినా ఒక వైపే చూసే దృష్టికోణం తో నాస్తికవాది,సనాతన వ్యతిరేకిగా వివాదాలను ఎదుర్కొంటున్నారు.

నేను  రంగనాయకమ్మ గారి రచనల్లో ఏది ఎంచుకోవాలో అనే ఆలోచనలో పడి మార్క్స్ ప్రభావానంతరం రాసిన జానకి విముక్తి నవలని పరిచయం చేయాలనుకుంటున్నాను.

 జానకి విముక్తి నవల మూడు భాగాలుగా రాసారు.1100 పేజీలకు పైనే ఉన్న దీని కథంతా చెప్పకుండా చాలా మంది చదివే ఉంటారుకనుక  కేవలం నవలలో రంగనాయకమ్మ దృక్పథాన్ని మాత్రమే  చెప్తాను.

  స్త్రీ కోసం తపన,ఆవేశం,ఆలోచన కలగలిపి, పురుషులతో పాటే స్త్రీ కి కూడా ఆర్థిక, సామాజిక, సాంసారిక,గా తనదైన స్వేచ్చ గురించి పెద్ద కాన్వాస్ తీసుకు ని చర్చించి అద్భుతంగా చిత్రించిన నవలగా జానకి విముక్తి నుంచి చెప్పుకోవచ్చు.

  చదువుకీ, సంస్కారానికి, శాస్త్రీయ దృక్పథానికి సంబంధంలేని  అవగుణాలున్న వెంకట్రావు భార్య జానకి.కాపురంలో అనేక అవమానాలు ఎదుర్కొంటుంటే చూసిన జానకీ అన్ని సత్యం ఆమెను విముక్తి చేయాలని ప్రయత్నించటం స్థూలంగా కథ.

    స్నేహితుడు మూర్తి వలన మార్క్సిస్టు దృక్పథంపెరిగిన సత్యం ఏవిదంగా జానకిని  సంస్కారించి విముక్తి చేసాడన్నది విపులంగా ఇంత పెద్ద నవలగా రాసారు

    ఈ నవలలో

    1.వైవాహిక చిహ్నాలను నిర్వహిస్తారు.

    2.బహిష్టుసమయంలోని అంటరానితనాన్ని బహిష్కరించారు

    3.స్త్రీ సమస్యల్ని స్వంతాస్తి విధానంలోనే నుండి కమ్యూనిస్టు సమాజం మాత్రమే పరిష్కరిస్తుందనే నమ్మికని ప్రకటిస్తారు.

    4.మంచిపుస్తకపఠనం వలన మానసిక వికాసం కలుగుతుందనే భావాన్ని స్పష్టం చేశారు.

    5.నిజమైన మార్క్సిస్టు ఎలా ప్రవర్తిస్తాడో రుజువు చేయడానికి ప్రయత్నించారు.

    6.అణగారిన బానిస స్థితి నుండి గౌరవ ప్రదమైన స్థితి కి ఎదగాలంటే స్త్రీ కి కావలసినది స్వయంగా శక్తి, ఆలోచన అనేది జానకి పాత్ర ద్వారా తెలియజేసారు.

    ఇందులో సుదీర్ఘమైన సిద్ధాంతచర్చలు,కుహనా కమ్యునిస్టు లనుదుయ్యబట్టటం అనేకమంది భుజాలు తడుముకునేలా జరిగిన వాదోపవాదాలు చాలా మంది కి అభ్యంతరకరంగా ఉండొచ్చు.

    మరీ సుదీర్ఘంగా ఉన్నా ఈ నవల చదవటంవల్ల పాఠకులకు ఆలోచనా పరిధి విస్తరిస్తుంది అనటానికి సందేహం అక్కర్లేదు.

    రంగనాయకమ్మ కు నరనరాన జీర్ణించుకుపోయిన మార్క్సిస్టు ఐడియాలజీ ఇందులో స్పష్టమౌతుంది.

1, నవంబర్ 2020, ఆదివారం

సాంప్రదాయానికి ఆధునికతకూ మధ్య ఐ.వి.ఎస్.అచ్యుతవల్లి కథలు

 

సాంప్రదాయానికీ ఆధునికతకు వారధి – ఐ.వీ.ఎస్. అచ్యుతవల్లి కథలు-శీలా సుభద్రాదేవి

  సాంప్రదాయానికి ఆధునికతకూ మధ్య ఐవిఎస్.అచ్యుతవల్లి కథలు

ఒక రచయిత్రి యొక్క రచనావిధానాన్ని మూల్యాంకనం చేయటం అనేది అంత సులభ సాధ్యం కాదు. వారు వారి రచనాజీవితంలో అనేక ప్రక్రియలు చేపట్టి ఉంటారు. ఆ రచనల మీద విభిన్న సంఘటనల ప్రభావం, మానసిక సంఘర్షణ, కుటుంబంలోని వత్తిడులు, సమాజంలో రాజకీయ, సాంఘిక పరిణామక్రమాలు ఇవన్నీ సాధారణంగా ఒక రచయిత్రి రచనలపై ప్రభావం కలిగించుతాయి. అందుచేత వాళ్ళ సమగ్ర రచనలన్నీ చదివినప్పుడో, లేదా ఒక ప్రక్రియలో చేసిన కృషిని పరిశీలించినప్పుడో కొంతయినా నిర్ధారణకు రాగలము. కనీసం లభ్యమైన కథలన్నీ చదవగలుగుతే కథారచనలో రచయిత్రి రచనా విధానం, కథాంశాల ఎన్నిక, శైలీ శిల్పాల్ని పట్టుకోవచ్చును.

 ఐ.వి.ఎస్. అచ్యుతవల్లిగారి కథలు లభ్యమైన అరవై వరకూ చదివి అందులో, విభిన్న కథల గురించి విశ్లేషించుకున్నప్పుడు రచయిత్రి కథన కౌశల్యాన్ని పాఠకులకు అవగాహన చేసుకోవచ్చును.

1958లో ‘జగతి’ పత్రికలో ప్రచురితమైన ‘వంచిత’ కథతో కథాప్రస్థానం మొదలుపెట్టిన అచ్యుతవల్లి 1989వరకూ ఎనిమిది కథాసంపుటాలు ప్రచురించారు. నాగావళి నవ్వింది (1973) మూగపోయిన ప్రకృతి (1964), మనస్తత్వాలు (1966), బాత్ ఏక్ రాత్ కి, అవ్యక్తాలు, అచ్యుతవల్లి కథలు ప్రత్యేకంగా చెప్పుకోదగిన కథాసంపుటాలు. ఇవే కాక 1961లో పుట్టిల్లు అనే నవలతో మొదలుపెట్టి పద్దెనిమిది నవలలు రాసినట్లుగా తెలుస్తోంది. వివాహానికి ముందు కె.వి.ఎస్. అచ్యుతవల్లి పేరుతోనూ వివాహానంతరం కొన్ని కథలు ‘రాఘవేంద్ర’ పేరుతోను రాశారు.  ‘జయశ్రీ’ మాసపత్రికలో ‘ఆజ్ అవుర్ కల్’ శీర్షికతోనూ, ఆ పత్రికలోనే ‘బాతోఁమే ఖూనీ’ శీర్షికతోనూ కాలమ్ నిర్వహిచారు. వీరు రాసిన నవల ‘ఇదెక్కడి న్యాయం’ నాలుగు భాషలలో వెండితెరకెక్కింది.

హిందీ, సంస్కృత భాషలలోనే కాక సంగీతంలోనూ ప్రవేశం ఉంది అచ్యుతవల్లికి. కేవలం గ్రామీణ జీవితమేకాక, నగర నేపథ్యంలోనూ, నాగరిక జన జీవన విధానమే కాక పేదవారి జీవితాల్ని కూడా ఒడిసిపట్టుకొని, వారి వారి జీవన సంఘర్షణలనూ సమస్యల్నీ వాటికి కారణమైన రాజకీయ, ఆర్థిక సామాజిక పరిస్థితుల్నీ అవగాహన చేసుకుని రచనలు చేశారు. సంస్కృతాంధ్రాలలో మంచి పట్టు వున్న కథలలో స్వచ్ఛమైన, లలితమైన శైలిని ఎంచుకుని పాఠకులు అందరినీ ఆకర్షించేలా రచనలు చేశారు.

‘ఇజ్జత్’ అనే పేరుతో 79-80ల మధ్య మూడు కథలు రచయిత్రి రాయటం విశేషం. 79లో రాసిన కథలో అగ్రకులానికి చెందిన ఈశ్వరయ్య కావడితో మడినీళ్ళు అందరికీ పోసి, అవసరమైనప్పుడు కార్యాలకు వంటలు చేసి పెడతాడు. అతనికి సాయంగా వచ్చిన కేశవ యువకుడు. అన్నం పెట్టని శ్రోత్రీయం సంకెళ్ళు తెంపుకొని, అవకాశాల్ని అందిపుచ్చుకునే చైతన్యం ఆశిస్తాడు. మనిషిని ముందుకు నడిపించలేని సాంప్రదాయం యెందుకని ప్రశ్నిస్తాడు. చైతన్యదీపం కాంతి భరించలేని గుడ్డివాళ్ళే గొంగళి కప్పుకు కూచుంటారు అని నమ్మిన కేశవ పట్టణంలో మిఠాయికొట్టు ప్రారంభించి అతనికి పార్టనర్స్ గా జాకబ్ అతని చెల్లెలు మార్తాని ఏర్పాటు చేసుకుని కుటుంబ పెద్దగా ఈశ్వరయ్యని తీసుకెళ్తాడు. సమాజంలో మనుగడ సాగించి గౌరవం పొందాలంటే బతకనేర్చినతనం ఈ కథలో ప్రతీ పాత్ర ద్వారా నిరూపించింది రచయిత్రి.

80లో మళ్ళీ జ్యోతి పత్రికలోనే రాసిన రెండో ‘ఇజ్జత్’ కథలో బియ్యే చదువుతున్న వాసవిని అందమైన నాగేష్ ఆడంబరంగా పెళ్ళి చేసుకొంటాడు. నాగేష్ తాను ఆర్థికంగా, హోదా మెట్లు ఎక్కటానికి భార్యని పైవాళ్ళకి కుదువపెడతాడు. అది నచ్చని వాసవి పుట్టింటికి ఎన్నిసార్లు వచ్చేసినా వాళ్ళు కూడా ఆమెని అర్థం చేసుకోరు. దాంతో భర్త తీరుకు అలవాటుపడిపోయిన వాసవి, భర్తతో విదేశాలకు వెళ్ళి ఆర్థికంగా అంతస్తులు, ఆస్థులు పెంచుకొని ఆడంబరపు బతుకుతో ఒకసారి పుట్టింటికి వస్తుంది. ధనవంతురాలైన వాసవిని పుట్టింటివాళ్ళు చూపిన ఆదరాభిమానాలు చూసి ‘నేను ఏమి పోగొట్టుకొని ఇవన్నీ పొందానో తెలుసా’ అనుకుంటూ తనని తాను పాలిచ్చే గేదెలాంటి దాన్నని, నాగేష్ దానిని పెంచేవాడు అని తనతో కుమిలిపోతుంది. ఈకథలో స్త్రీ అస్తిత్వ ఆరాటాన్ని వాసవి పాత్ర ద్వారా ప్రతిభావంతంగా చూపుతుంది రచయిత్రి. సమాజం నిర్దేశించిన సాంప్రదాయ ఆంక్షలకు లోబడి తలవంచిన వాసవి, మనసులో మరుగుతోన్న సంక్షోభాన్ని చక్కగా కథనం చేయటం అచ్యుతవల్లి కథన చాతుర్యానికి మచ్చుతునకగా ఉంది.

మూడో ఇజ్జత్ కథలో భార్య వసుమతి ఊరెళ్ళటంతో నడివయస్సులో ఉన్న రామం ఇంటిలో పనిచేసే అమ్ములు రకరకాలుగా రామాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుంది. ఎదురింటి కుర్రాళ్ళు తనని అల్లరి పెడుతున్నారంటుంది. ఏం చెప్పినా రామం తన పొందు ఆశించకపోవడంతో రామం తన చెయ్యి పట్టుకు లాగాడని యాగీ చేస్తుంది. ఈ విషయాలు తెలుసుకున్న వసుమతికి తన భర్త స్వభావం తెలుసు కనుక అమ్ములు తమని రోడ్డెక్కించాలనుకుని తానే అగౌరవం పొందిందిలే అనుకుంటుంది.

ఈ మూడు కథల్లో మూడు విభిన్న అంశాలను మూడు దృక్కోణాలతో గౌరవ, అగౌరవాల మధ్య సున్నితరేఖని చర్చించింది.

1966లో ప్రచురితమైన ‘క్షంతవ్యం’ కథ ఆనాటి సమాజంలో ఆడపిల్లల వివాహం ఎంత దుర్భరంగా ఉండేదో, దాని కోసం స్వంత అన్నదమ్ములు, బంధువులే ఇంట్లో అద్దెకున్న అబ్బాయితోపెళ్ళి చేయటానికి నాటకమాడిన కథ. పూర్తిగా నాటకీయతతో నిండినదే అయినా రచయిత్రి కథని మొదటి నుండి చాలా సహజ సంభాషణలతో నడిపించి చివరలో కొసమెరుపులా కథానాయిక అన్న ఆడిన నాటకంగా స్పష్టం చేస్తారు. చివరి వరకూ జరిగిన కథంతా నాటకం అని తెలియనీయకుండా రాయటంలో రచయిత్రి సమర్థతను తెలియజేస్తుంది. అచ్యుతవల్లికి నాటక రచనల పట్ల గల ఆసక్తీ, నైపుణ్యం ఉండడం వల్లనే కాబోలు ఆమె మరికొన్ని నాటకాలు కూడా రాసారు. ఆనాటి తెలుగు సాహిత్యంలో నాటక రచన చేసిన రచయిత్రులు తక్కువగానే ఉన్నారు.

1976లో జ్యోతి పత్రికలో ప్రచురితమైన ‘నేను దేవిని కాను అనే పేరుతో రాసిన కథనే మరింత వివరణలతో విస్తృతపరచి అదే పేరులో 1982 జ్యోతి దీపావళి సంచికలో పెద్ద కథగా రచయిత్రి ఐ.వీ.ఎస్. అచ్యుతవల్లి రాసింది. పేద అర్చక కుటుంబంలోని పదేళ్ళ సావిత్రి అదే వూరు రంగాపురంలోని నారాయణ ఇంట్లో అతని తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుంది. నారాయణ తన తల్లి వైద్యం కొరకు ఊళ్ళు తిరుగుతూ, పెళ్ళి అయ్యాక ఒకచోట స్థిరపడతాడు. కొన్నాళ్ళ తరువాత రంగాపురంలో శ్రీదేవి జన్మదిన సంబరాల గురించి పేపర్లో చదివి ఇరవై ఏళ్ళ తరువాత  దేవత సంబరాలకు వెళతారు. ఆ శ్రీదేవి ఎవరో కాదు. సావిత్రే అని తెలుసుకుంటారు. టూకీగా కథ ఇదే అయినా కథలో చాలా విషయాల గురించి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పేద బ్రాహ్మణుల స్థితి అటు అర్చక వృత్తీ ఇటు శ్రామిక వృత్తీ చేయలేక ఆకలితో విలవిల్లాడటం చిత్రించింది అచ్యుతవల్లి. కులాల వారీగా ఆసరా కల్పించే ప్రభుత్వం ఇటువంటి వారికి తోడ్పడడెందుకనే ప్రశ్నని కూడా యీ కథలో సంధించింది. ప్రాణంతో తమ మధ్య తిరిగే మనిషిని దేవతగా, నమ్మే ప్రజల మూర్ఖత్వాన్ని, మూఢనమ్మకాల్ని విశదపరచిన కథ యిది. డెబ్భైల నాటి గ్రామీణ జీవనం, ఆరోగ్యవసతులు లేకపోవడం, జీవనాధారం లేక పొరుగూర్లకు పోవటం మొదలైన విషయాల్ని పెద్ద కథలో కూలంకుషంగా, సునిశితంగా సంఘటనల్ని జోడిస్తూ రాసింది రచయిత్రి.

సమాజం అట్టడుగున చీకటి నీడలలోని మనోవేదనల్ని మానవీయ దృక్కోణంలోంచి పరిశీలిస్తూ వైష్ణవ సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అచ్యుతవల్లి, చాలా కథలలో పరంపరగా వచ్చిన ఆచార వ్యవహారాలను సున్నితంగా విమర్శిస్తూనో, సమర్థిస్తూనో ఒకవైపు చెబుతూ మరోవైపు స్త్రీ పాత్రలను వ్యక్తిత్వంగా ఎదిగేలా రూపొందిస్తూ అభ్యుద మార్గంలోకి నడిచేలా తీర్చిదిద్దింది.

‘ఎన్ని తరాలు గడచినా భర్త నవ్వించితే నవ్వటం, ఏడిపించితే ఏడ్వటం తప్ప ఆడవాళ్ళకు స్వయం వ్యక్తిత్వం రావటం లేదు. కొడుకైనా, సోదరుడైనా, తండ్రైనా, భర్తైనా స్త్రీని బాధించి తృప్తి చెందుతారు తప్ప ఆమె ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వరు అని 1972లో రాసిన ‘చర్విత చర్వణం’ కథలోని పాత్రతతో చెప్పించటం రచయిత్రికి గల స్త్రీ చైతన్యం, ఆత్మాభిమానం స్పష్టమౌతుంది.

‘చదువులనో, సంగీతాలనో, కట్నం ఇచ్చుకోలేకో  ఈ రోజుల్లో  ముప్ఫయ్యేళ్ళు దాటాక పెళ్ళి కాని యువతులు బోలెడు మంది ఉన్నారు అని మరొక కథలోని పాత్ర అంటుంది. ఆనాటి సమాజంలో అప్పుడప్పుడే స్త్రీ విద్య ప్రాధాన్యత పెరిగిన రోజులు. చదువుకుంటున్న ఆడపిల్లలు ఒకవైపు స్త్రీ చైతన్య స్ఫూర్తి వల్ల కావచ్చు, అభ్యుదయ భావాల వల్ల కావచ్చు, కట్నాలు ఇవ్వకుండా పెళ్ళిళ్ళు చేసుకోవాలనే ఆశయం వల్ల కావచ్చు, తనకన్నా ఎక్కువ చదువుకున్న వరుని కోసం ఎదురుచూపు కావచ్చు, తల్లిదండ్రులు కట్నాలు ఇవ్వలేక కావచ్చు, తనకన్నా చిన్నవాళ్ళను సాకవలసిన బాధ్యత వారిపై పడడం వల్ల కావచ్చు, కొంతమంది మహిళలు జీవితాంతం కన్యలుగా మిగిలిపోవటం, ముప్పయ్యేళ్ళు దాటే వరకూ పెళ్ళి కాకుండా వుండిపోయినవారు ఎక్కువగానే ఉండేవారు.

పెళ్ళి అనేది స్త్రీ జీవితానికి తప్పనిసరి కాదనీ, పెళ్ళికాకపోయినా ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటే బతుకులో అపశృతులు ఉండవనీ, ‘వ్యక్తిజీవితంలో సెక్సు అనేది చాలా స్వల్పకాల పరిమితికే లోబడి వుండే దాని కోసం పెళ్ళి చేసుకుని జీవితం అంతా అనేక సమస్యలతో మానసిక అశాంతితో కృంగి కృశించాలా’ అనే భావంతో నలుగురు అన్నదమ్ములకు, ముగ్గురు అక్కలకూ భారంకాకుండా బతికిన విమల కథ ‘నిర్ణయం’.

‘ఒకరోజు’ కథలో చిరుద్యోగి జయా వెంకట్రావుల జీవితం, వాళ్ళింట్ల పనిచేసే తవిటమ్మ, నాయుడు జీవితాల్ని సాదృశ్యంగా కథని నడిపించింది రచయిత్రి రెండు కుటుంబాలూ  ఆర్థిక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నవాళ్ళే. ఎంత చెట్టుకంతగాలి అన్నట్లు ఉన్నదంట్లోనే తృప్తి పడుతూ తమకు ఉన్నంత కూడా లేక చెట్లు కిందా, అరుగుల మీదా వర్షంలోనూ అవస్థలు పడుతున్న వారి కంటే తామెంతో  అదృష్టవంతులుగా తృప్తిపడడంగా రచయిత్రి ముగిస్తుంది. సంతృప్తి కలిగిన మనిషి కన్నా అదృష్టవంతులు లేరనే సందేశంతో కథని నడిపించింది.

1971లో రాసిన ‘బెటర్ హాఫ్’ కథలో ఆరేళ్ళు నిరుద్యోగిగా ఉండి, బహు సంతానంతో ఎట్టకేలకు ఉద్యోగంలో  చేరిన పురుషోత్తం, తొలి జీతం అందుకొని అన్నాళ్ళుగా అణచుకొన్న కోరికను తీర్చుకోవటానికి జీతం అంతా ఖర్చు పెట్టి భార్యాపిల్లలకు మంచి బట్టలు, బొమ్మలు, స్వీట్లు, వగైరాలన్నీ కొనుక్కొని వెళతాడు. జీతం డబ్బులు ఖర్చయితే మర్నాటి నుండి ఇంట్లో ఖర్చులు, అద్దె మొదలైనవన్నీ ఎలా గడుస్తాయనే బాధ ఉన్నా పురుషోత్తం భార్య మెత్తని మాటలతోనే భర్తకు సర్ది చెప్పి ‘ఆఫీసర్లతో పోలిక పెట్టుకోకుండా మీకన్నా కింద వాళ్ళతో పోల్చుకుంటే ఈ అవస్థలు ఉండవంటూ మర్నాడు ఆ బట్టలు షాపులో నచ్చలేదని తిరిగి ఇచ్చేయమంటుంది. ఈ విధంగా అచ్యుతవల్లి కథలలో ఒకే అంశంతో రెండు విభిన్న కుటుంబాలలో పోలికలు, వైరుధ్యాలు చూపెడుతూ ఆనందకర జీవితానికి కావలసినది సంతృప్తి అంటూ మూల్యాంకనం చేయటం రచయిత్రికి నచ్చిన కథన విధానం.

హీరో తండ్రి తన భార్య మహాయిల్లాలు అని అన్నప్పుడు ఆ రోజుల్లో అందరాడోళ్ళూ మహా యిల్లాళ్ళుగానే ఉండేవారు లెండి’ అన్న డైలాగు అచ్యుతవల్లి రాసిన పరిణీత నాటకంలో ఉంటుంది. నాటకం, నేపథ్యం అంతా ఒక మేడలోనే. అందులో తల్లీ, కూతురు నివసిస్తుంటారు. ఆ ఇంట్లోనే అద్దెకి ఒక తండ్రీ, కొడుకు ఉంటారు.  కూతురికి సంగీతం చెప్పే మాస్టారు, దగ్గర బంధువు, అద్దెకున్న మరో కుర్రాడు, అతని మిత్రుడు, పాత్రధారులు, ఒంటరి ఆడవాళ్ళుగా ఉండడంతో అందరూ  ఆమె పొందుకోసం, తాపత్రయ పడడం, చివరికి ఆ అమ్మాయి తనకు పెళ్ళయిందని భర్త విదేశాల నుండి తీసుకెళ్ళటానికి వస్తాడని చెపుతుంది. దాంతో వాళ్ళంతా ఒకటై ఆ అమ్మాయి మగవాళ్ళని చెప్పుకింద తేలుగా నొక్కి పెట్టే జిత్తులమారి అని తిట్టుకుంటుంటే నొక్కి పెట్టకపోతే కుట్టటానికి తేళ్ళు రడీగా ఉంటాయి కదా అని సమాధానం చెపుతుంది. డబ్బున్న ఒంటరి ఆడవాళ్ళని ఏ విధంగా మోసం చేయాలని చూస్తారో అటువంటి మానవ నైజం, మగవారి తీరుని బట్టబయలు చేస్తుంది రచయిత్రి.

అనారోగ్యంగా ఉన్న శ్రీమంతురాలు సునంద, మొక్కజొన్న పొత్తులు అమ్మే ఎల్లమ్మ, టీ కొట్టు అప్పిగాడు ఇలా విభిన్న వ్యక్తుల మనసులోని ఆలోచనలు, ప్రతీ ఒక్కరూ మిగతా ఇద్దరి అదృష్టానికి అసూయపడటం చెబుతూనే, వారి వారి మనోగతాలు వర్షం వచ్చిన రోజున ఏ విధమైన కల్లోలానికి గురి అవుతారో అద్భుత కథనంతో దృశ్యాల్ని కళ్ళముందు నిలబెట్టేలా రాసింది రచయిత్రి.

‘జీవితానికోతోడు’ను వెతుక్కొని వివాహబంధం ఏర్పరచుకోవడానికి వయసేమీ అడ్డంకి కాబోదని సందేశాన్ని ఇస్తుంది కథలో అచ్యుతవల్లి.

అచ్యుతవల్లి గారి స్త్రీ పాత్రలు వైవిధ్యం కలిగి ఉండడమే కాకుండా స్వంత వ్యక్తిత్వంతో సామాజిక జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ తమదైన ప్రాతినిధ్యం కలిగినవిగా ఉంటాయి. అందుకే ‘అబల’ కథలో అచల, ‘నాతిచరామి’ కథలో జయవ్రద, ‘ఆజ్ అవుర్ కల్’ కథలో మధుర, ‘సులక్షణ’ కథలో సులక్షణ పరిణీతలో రాజ్యలక్ష్మి, ‘బెటర్ హాఫ్’లో అనసూయ, ‘మూగబోయిన ప్రకృతి’ కథలో శంకరి మొదలైన పాత్రలన్నీ కూడా సమాజంలోను కుటుంబంలోను ఆత్మవిశ్వాసంగల మహిళలకు మచ్చుతునకలుగా ఉంటాయి.

రచయిత్రి కథనురాసేటప్పుడు ఇదే రాయాలని కథకు పరిమితులు విధించుకోకుండానే, సునిశిత పరిశీలనంలో ముఖ్యంగా మధ్య తరగతి మనుషుల జీవన పార్శ్వాలను సాధారణ సరళ గంభీరభాషలోనే రాసే విధానం పాఠకులను ఆకర్షిస్తుంది. అచ్యుతవల్లి కథలలో ఎక్కువగా ప్రేమ, స్నేహం, ఆర్ద్రత, సామాజిక బాధ్యత గల మానవ మనస్తత్వాన్ని ఒడిసిపట్టుకొని రాసేటప్పుడుగానీ, ఆచార వ్యవహారాలు లోకరీతి, సాంప్రదాయాలు స్త్రీకి గల సాధారణ కోరికల్ని కూడా ఏ విధంగా కత్తెర పడతాయో చాలా సౌలభ్యంగా ఒక్కొక్కప్పుడు హాస్యభరితంగా అలవోకగా రాస్తుంది. అయితే ఏదో ఆషామాషీగా చదివేయకుండా అంతర్లీనంగా ఆయా పాత్రల పట్ల పాఠకులకు సానుభూతి కలిగేలా కధలు ఉంటాయి.

గ్రామీణ జీవితాన్ని, పల్లె అందాల్ని, పట్టి చూపే ప్రకృతి హోయల్ని కథకు నేపథ్యంగా రాస్తున్నప్పుడు కొంత భావుకతతో వాక్యాలు వాక్యాలుగా కథలో ఇమిడిపోతాయి.

అచ్యుతవల్లి కథలలో తప్పక పేర్కొనదగిన కథ ‘ముత్యాల చెరువు’ ఇందులో అరమరికలు, ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష పట్టించుకోని అపురూప స్నేహం ఉంటుంది. గ్రామంలోని కుల వివక్ష, లైంగిక దోపిడికి బలైన స్త్రీగా దళిత స్త్రీ ముత్యాలు కథగా నడుస్తుంది. గ్రామంలోని శ్రామిక జీవులు తమకు నచ్చినచోట కూలి చేసే అవకాశం లేని పరిస్థితులు మోతుబరి కామందు ఆధిపత్య ధోరణిని వివరిస్తుంది. మతాంతర వివాహం చేసుకోదలచినందుకు వర్ణ వివక్షకు గురైన ముత్యాలు ఆవేదనను ఎంతో ఆర్ద్రతతో రాసిందీమె. బూజు పట్టిన చాదస్తపు సాంప్రదాయాలపై నిరసన వ్యక్తపరిచే స్నేహశీలి చిట్టి పాత్రని సృజించిన తీరు కథకి ఉన్నతస్థాయికి కల్పించి చిట్టితో స్నేహాన్ని అభిలషించిన ముత్యాలు చిట్టికి నచ్చిన చెరువులో పూయాల్సిన తామర ఎండిపోయిందని, ఆమె మళ్ళీ వచ్చేనాటికి చెరువు నిండా పూలు నిండేలా చేస్తానని చెప్పిన ముత్యాలు ఈతవచ్చిన ముత్యాలు చెరువులోపడి చావటమేమిటని చిట్టికే కాదు పాఠకులకూ సందేహం కలగకమానదు. ఎవరూ లేనివారు తామర దుంపల్ని చెరువులో వేస్తే చనిపోతారని ఒక పుకారును ప్రచారం చేస్తారు. బూజుపట్టిన భావాల్నీ, తిరోగమన పోకడల్ని నిరసించిన చిట్టి పాత్ర ద్వారా కథంతటినీ దృశ్యాలు, దృశ్యాలుగా చలనచిత్రంలా నడిపించింది రచయిత్రి. ముత్యాలు ప్రేమించిన క్రిస్టియన్‌ను ముత్యాలు వివాహం చేసుకోనివ్వని గ్రామకట్టుబాటు నేపథ్యంగా కథలో కనిపించని ఊహాచిత్రాన్ని పాఠకులకు దృగ్గోచరం చేస్తారు అచ్యుతవల్లి.

కుటుంబ జీవితంలోని భార్యాభర్తల దాంపత్య సంబంధాలు చర్చించిన కథ ‘అభిశంస’. వీరి కథలలో ఉన్నత, మధ్య తరగతులవేకాక అట్టడుగు వర్గాలలోని కుటుంబాలలో ఆర్థికపరమైనవేకాక సంతృప్తి జీవితానికి కావలసిన అనుబంధాలను గూర్చి చెప్పినవి కూడా చాలానే ఉన్నాయి. ఆ కోవలోనిదే పేదరికం కల్పించే ఆశలూ, ఆలోచనలూ, వాస్తవానికి, ఊహాలకి మధ్య సంఘర్షణను తెలిపే కథ ‘సన్నాట’ (1969)

‘ఎందుకోసం’ కథలో ఉద్యోగిని అయిన వేదవతి వంటి స్త్రీలు భర్త చీదరించుకుంటూ ఉన్నా భర్తని వదిలి జీవితాన్ని ధైర్యంగా కొనసాగించలేని పిరికితనాన్నీ, మిధ్యాగౌరవాల మీద అమితలోభత్వాన్నీ నిరసిస్తూ నాటికీ నేటికీ మధ్యతరగతి మహిళ మనస్తత్వంలో మార్పు రాదంటుంది రచయిత్రి.

సమాజంలోని విభిన్న వర్గాల వ్యక్తులనూ, వారి మౌలిక సమస్యలనూ, మానవ మనో విశ్లేషణలనూ అధ్యయనం చేసేలా అచ్యుతవల్లి కథలు ఉంటాయి.

పెద్దవాళ్ళు తమ జీవితానుభవాలు, అవస్థలూ తమ  సంతానం పడకూడదని వారి జీవితానుభవసారాన్ని అందజేయాలనుకుంటే పిల్లలకవి ముసలి కబుర్లలో కనిపిస్తాయంటారు అచ్యుతవల్లి.

చరమ దశలలోని వారు ఎంతటి మహానుభావులైనా నడివయస్సులో ఎంత ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారైనా వాళ్ళని చూసుకుంటూ సేవ చేయాల్సిన వారికి చిన్న చూపే అనేది కొన్ని కథలలో అచ్యుతవల్లి అక్షరబద్ధం చేసింది.

కథలకు తగిన నేపథ్యం గ్రామీణమైనా, నగరమైనా చక్కని భావుకతతో, పరిశీలనాత్మకమైన దృష్టితో వర్ణించడం సమకాలీన జీవితాల్లోని అనేక పార్శ్వాలను నిజాయితీతో తాను నమ్మిన సిద్ధాంతాల మేరకే చక్కని పఠనశీలతతో రచనలు చేయడమే ఐ.వి.ఎస్. అచ్యుతవల్లి కథలలో చూస్తాం.

30, సెప్టెంబర్ 2020, బుధవారం

జీవితసత్యం

 జీవన సత్యం

ఊహ విచ్చుకోక ముందు
అమ్మతో నాగులచవితి కి
పుట్టలో పాలు పొయ్యటానికి వెళ్ళినప్పుడు
భూమండలం బరువంతా మోసేది
ఆదిశేషుడు తన పడగ మీదే అంటే
నిజమే అనుకుని
సుతిమెత్తగా నేలపై అడుగులేసిన జ్ణాపకం_

గరిమనాభి గురించి
బళ్ళో మాష్టారు పాఠం చెప్తుంటే
పాఠ్యపుస్తకం లో
హెర్క్యూలస్ కర్రమొనపై
భూగోళాన్ని నిలిపిన చిత్రాన్ని
కళ్ళు విప్పార్చుకుని విస్తుపోతూనే
వస్తుభారమంతా
ఒక బిందువు వద్దే
కేంద్రీకృతం అవుతుందని నేర్చుకున్న గుర్తు--

తర్వాత్తర్వాత
మితృలు హితులు సన్నిహితులు
వివిధ మతవిశ్వాసులు
విభిన్న గురు అనుయాయులు
ఓకే ఒక్క మహత్తర అద్భుతశక్తి అంటూనే
వారి వారి గ్రంథాల్ని
భక్తి గా కళ్ళకద్దుకుంటుంటే
ఏ పేరైతేనేం సత్యమొక్కటేనని
మూల్యాంకనం చేసుకున్న అవగాహన--

కానీ
ఇదేమిటి!
కంటికి కనపడని
పరమాణువు కన్నా సూక్ష్మ జీవి
ఇలా తన టెంటికల్స్ పై
భూప్రపంచాన్ని గిరగిరా తిప్పుతూ
అహంభావుల్నీ  మదాంధుల్నీ సైతం
భయకంపితుల్ని చేస్తూ
ఆడుకుంటున్నట్లుగానే
విస్ఫోటనం చేస్తున్న వైనం!
ఒకరినొకరు హత్తుకొని
ఓదార్చుకోనివ్వని చిత్రం!!
అంతకంతకూ విశ్వరూపం దాలుస్తూ
అదృశ్యశతృవై
ప్రాణాలపై స్వారీ చేస్తున్న దృశ్యం!!!

ఇప్పుడు ఖచ్చితంగా
మనిషి జీవన విధానాన్నీ
మానవ మేధస్సునీ శాసిస్తున్నదీ అదే
భౌతిక దూరాల్నే కాదు
మానసిక దూరాల్నీ సృష్టి స్తున్నదీ
ఈ అదృశ్యజీవే సుమా

ఇక పైనైనా
మనిషిని నిలబెట్టేది
కులమో మతమో కాదనీ
ఆస్తులో అంతస్తులో కాదనీ
విలువైనది ప్రాణమేనన్న సత్యాన్నీ
ఎప్పటికైనా నిలిచేదిక
మానవత్వమేనన్న ధర్మాన్నీ
ఇప్పటికైనా
మనిషి గుర్తించకా తప్పదు
మనిషిగా మారకా తప్పదు.

__ శీలా సుభద్రా దేవి





13, ఆగస్టు 2020, గురువారం

నేపథ్యం

 

నేపథ్యం (కవిత )

గాయం ఎక్కడా ?
చిగురుల పేలికలా ఛిద్రమైన మనసులోనా ?
అతుకులు అతుకులుగా ఉన్న జీవితంలోనా ?

అడుగడుగునా నిలువెల్లా రక్త సిక్త వౌతూ
గాయాల పుట్టవైపోతూ
దేన్నీ గురించి ఈ అన్వేషణ !?

గ్రహాల మధ్య నుండి నడుస్తూ
చుక్కల్ని అనుకూలంగా ముగ్గులోకి కలిపితే
చెదిరిన జీవితం గాడిలో పడుతుందా ?

కనిపించని దైవాన్నో
కలిసిరాని గ్రహాల్నో కారణం చేసి
కుములుతూ కూర్చోటమేనా చేయాల్సింది ?

కాదుగదా
ఈ వస్తవిత నేపథ్యంలో ఆలోచన కళ్ళు తెరిస్తేనే
దుఃఖపు తెర ముక్కలు ముక్కలుగా చీలి
బొట్లు బొట్లుగా రాల్తున్న రక్తం పచ్చి వాసన
కాల్తున్న హృదయం మీద నుండి లేచిన వెచ్చని ఆవిరితో
సుడులు సుడులుగా తిరుగుతూ
శరీరం అంతటా నవ చైతన్యంతో పరుగులు తీస్తుంది 

2, ఆగస్టు 2020, ఆదివారం

ఆ శుభదినం కోసం...

      ఆ శుభదినం కోసం......

పొద్దున్నే
కళ్ళు సూర్యచంద్రులై
కేలండర్ చుట్టూ పరిభ్రమిస్తాయ్
ఈ రోజు ఏ శుభ దినమా అని
మతపరమైన లో
జాతీయమైనవే కాక
మన మేథావుల్ని
కదవ బెట్టిన దేశాల్నుండీ
ఎరువు తెచ్చుకున్న దినాల్నన్నింటినీ
కేలండర్ల నిండా ప్రేమతో అతికించారు కున్నాం
ఇక ఇప్పుడు
ఎన్నెన్ని ప్రత్యేక దినాలలో

నట్టింట్లో ఆత్మీయంగా
ఒక ముద్ద పెట్టని వాళ్ళు సైతం
పోయాక మాత్రం అట్టహాసంగా
నలుగురికీ చాటేందుకు పిండాలు పెట్టినట్లు
ఏడాదికోమాటు
సామాజిక ప్రసారమాధ్యమాలన్నీ
అక్షరప్రేమల్ని వర్షిస్తాయ్
ప్రేమంటే తెలియని పసిమొగ్గలు సైతం
హృదయాల్ని అమ్మానాన్నల పిడికిట్లో దాచేసి
ఎర్రగులాబీల్నీ,ఆఠీను గుర్తుల్నీ
పెంచుకుంటూ మురిసి పోతాయ్

ఒకటి కాదు
రోజుకో రకం ప్రత్యేక దినాలు!
తెల్లారుతూనే
వార్తా మాధ్యమాన్ని వాటినీ
కళ్ళను ఇంతింతచేసి వెతుకుతుంటాను
ఏ రోజైనా ఏ మూలైనా
నో క్రైమ్ డే,నో రేప్ డే,నో సువిసైడ్ డే
అన్న  మాటలేమైనా ఉంటాయేమోనని
నాకు తెలియక అడుగుతున్నాను
ఏ రోజైనా మనిషి దినమో, మానవత్వదినమో
ఉందేమో కాస్తా చూసి చెప్తారా
ఆ రోజైనా మనుషులుగా మారి
ఒకరినొకరం
ఆర్తిగా ఆత్మీయంగా అభినందించుకుందాం.



11, జులై 2020, శనివారం

రంగుల వల - శీలా సుభద్రాదేవి

    ఆయన ఆఫీసు పనిమీద వూరికి వెళ్లారు. పిల్లలు స్కూలుకు వెళ్లారు. సెలవులు చాలా ఉండిపోయాయని, సంవత్సరం ఆఖరుకి వచ్చేస్తోందనీ నాలుగు రోజులు వరుసగా సెలవు పెట్టేశాను. రెండ్రోజులు ఇల్లు సర్దుకోవడంతోనే అయిపోయింది. ఒకరోజు పూర్తిగా రెస్టు తీసుకున్నాను. ఇక ఈరోజు పని ఏమీ కనిపించలేదు. మధ్యాహ్నం ఏమీ తోచలేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటమే తప్ప వనజని చూసి చాలా కాలమైంది అని గుర్తు వచ్చింది.

    'అకస్మాత్తుగా వెళ్లి సర్ప్రయిజ్ చేస్తేనో! ఫోన్లో మాట్లాడినా ఎక్కువసేపు కుదరదు కదా. చక్కగా ఎదురెదురుగా కూర్చొని కబుర్లు కలబోసుకోవటంలో ఉండే తృప్తి ఫోన్లో ఏముంటుంది' అనుకున్నాను. 

    వనజ యింటికి వెళ్లి తలుపు తట్టాను.

    విసుక్కుంటూ తలుపు తీసిన వనజ నన్నుచూసి ఆశ్చర్యపోయింది. 

    "ఇదేమిటి ఇలా దారితప్పి వచ్చేవు?" అంది.

    "దారి వెతుక్కుంటూనే వచ్చాను. సరే, ఏమిటీ ఈ అవతారం" అన్నాను ఆమెని పరిశీలిస్తూ.

    ఇల్లు బూజులు దులుపుతోంది కాబోలు మాసిన చీర కొంగు బిగించి, ఉచ్చెళ్లు పైకి లాక్కొని ఉంది. ముఖం అంతా చెమట్లు దిగజారి చెదిరిన వెంట్రుకలు నుదురంతా అతుక్కున్నాయి.

    "నువ్వైతే ఉద్యోగస్తురాలివి. గంజి పెట్టిన ఇస్త్రీ చీర కట్టి బొమ్మలా ఉంటావు. నాకెట్లా కుదురుతుంది" అంది నన్ను పైనుండి కిందవరకూ ఎగాదిగా చూస్తూ. 

    "మరే, నాకు ఇంట్లో వంటాగింటా ఉండవు. అడ్వర్టయిజుమెంట్లో అమ్మాయిలా ఫలానా గంజిపొడి పెట్టిన చీర కట్టుకుని తిరగటమే పని. ఆ కబుర్లకేం గానీ ఇంకా స్నానం, భోజనం కాలేదా" అన్నాను సోఫాలో చతికిలబడుతూ.

    "పండుగలు వస్తున్నాయికదా అని ఇల్లు శుభ్రంచేసే పని పెట్టుకున్నాను. అయిపోయిందిలే. క్షణంలో స్నానం చేసి వస్తాను. కలిసి భోంచేద్దాం" అంది వనజ.

    "నేను భోంచేసే వచ్చాలే. నువ్వు తొందరగా స్నానం చేసి రా. నేను పుస్తకం తిరగేస్తూ కూర్చుంటాను."

    వనజ అప్పటికే గదులు ఊడ్చడం పూర్తిచేసి, రెండు పత్రికలు నా ముందు పడేసి టీవి ఆన్‌చేసి స్నానానికి వెళ్లింది. 

    ఆ పత్రికలు అంతకుముందు చదివేసినవే. టీవీ కాసేపు చూసి విసుగుపుట్టి గదంతా పరిశీలిస్తూ కూర్చున్నాను.

    అంతలోనే వనజ స్నానం పూర్తిచేసి తయారైవచ్చింది. నా ముందు కూర్చోబోతే, "ముందు నువ్వు భోంచేయి. ఇప్పటికే లేటయింది" అన్నాను.

    నాకు ప్లేటులో కారప్పూసా, స్వీటు, ఆపిల్ ముక్కలు పెట్టి తాను భోజనానికి కూర్చుంది వనజ.

    ఓ కన్ను టీవీ మీద పెట్టి భోంచేస్తూ ఉంది. 

    నాకు మాట్లాడటమో, టీవీ చూడటమో అర్థంకాక ఒక్కొక్కటే కారప్పూస నోట్లో వేసుకుంటూ వనజని చూస్తూ కూర్చున్నాను.

    టీవీలో ఏదో డిటర్జెంటు పౌడరు ప్రకటన వస్తోంది. బట్టలు మురికి చేసుకుని వచ్చిన భర్తనీ కొడుకునీ చూసి విసుక్కోకుండా "ఇవి ఉతకటం ఆరేయటం రోజూ చేసే పనే" అని తేలికగా అంటోంది నవ్వుతూ బొమ్మలా మడత నలగని చీరతో ఉన్న ఆ మోడల్ అమ్మాయి. 

    "నేనూ ఆ పౌడరే వాడతాను. ఏమో ఎంత ఉతికినా తెల్లగా రావు" అంది వనజ అటే చూస్తూ.

    ఏమీ మాట్లాడకుండానే ఆమెనే చూస్తూ... నేను నవ్వి వూరుకున్నాను. 

    "స్వీటు టి.వి.లో ప్రకటన చూసి దుర్గా బ్రాండు నెయ్యితోనే చేసాను. ఎలా ఉందో చెప్పవోయ్" అంది నేను స్వీటు తినకపోవటం చూసి.

    సరే అని చిన్న ముక్క తుంచి నోట్లో వేసుకున్నాను. ఏదో అనాలి కదా అన్నట్లు 'చాలా బాగుంది' అన్నాను. వనజ ముఖంలో సంతోషం కనిపించింది.

    వనజ భోజనం పూర్తిచేసి గిన్నెలు సర్దుతూ "బ్రూ కాఫీ కలపనా? ఆ బ్రాండు కాఫీ చాలా బాగుంటుంది. తాగితే వదలవు" ఊరిస్తున్నట్లుగా అంది.

    "ఇప్పుడే ఎందుకులే. కాసేపు అయ్యాక నువ్వు కూడా తాగే టైము అయితే అప్పుడు కలిసి తాగుదాం" అన్నాను నేను కూడా డైనింగ్ టేబుల్ ముందునుండి లేస్తూ.

    "సరే అయితే. ఆ అన్నట్లు ఈ ఫ్రిజ్ కొత్తగా కొన్నాను చూసావా? దీంట్లో ఐస్‌క్యూబ్స్ క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. దీంతోబాటు ఇస్త్రీపెట్టే అదే కంపెనీది ఫ్రీ తెలుసా" కళ్లు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది, ఫ్రిజ్ తెరిచి మరీ చూపుతూ. 

    "ఆ మధ్య ఎప్పుడో కొనబోతున్నట్లు ఫోనులో చెప్పినట్లున్నావు కదా" అన్నాను నేను.

    తాను కొన్న వస్తువుల గురించి చెబుతూనే డైనింగ్ టేబుల్ శుభ్రం చేసి ఎలా అయితేనేం మొత్తం మీద వచ్చి డ్రాయింగ్‌రూమ్‌లో నా పక్కన కూర్చుంది వనజ.

    "చాలా కాలమైంది కదూ. మనం ఇలా దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకుని ఎంతకాలమైందో. కాలేజీలో చదువుకునే రోజుల్లో తరచూ కలుసుకుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు ఒకే ఊళ్ళో ఉన్నా కాస్సేపు ఫోన్లోనే మాట్లాడుకోవటం అవుతోంది" ఆర్తిగా అన్నాను పక్కనే కూర్చున్న వనజ చేతులు నా చేతుల్లోకి తీసుకుంటూ.

    "నీకు ఉద్యోగం, నాకు ఇంట్లో పనితోనే సరిపోతుంది. ఆదివారాలు, సెలవు రోజుల్లో ఇంట్లో పిల్లలూ, మగవాళ్ళూ ఉండటం, ఎవరో ఒకరు రావటంతో కలుసుకోవటమే అరుదైపోయింది" అంటూ వనజకూడా తన చేతిలో ఉన నా చేతిమీద మెత్తగా రాస్తూ అకస్మాత్తుగా నా చేయి పరిశీలించి "ఏమిటీ నీ చేయి ఇంత గరుకుగా ఉంది. ఏదీ నీ పాదాలు చూడనీ" అని నా చీర కుచ్చిళ్లు పాదాలమీంచి పైకిలాగి పాదల్ని కూడా పరిశీలించింది.

    గభాలున లేచి అల్మారాలోంచి ఒక క్రీము తీసుకొచ్చి "ఇదిగో ఈ క్రీము నువ్వు కూడా కొనుక్కుని రాస్తూండు. మృదువుగా అయిపోతాయి. ముఖాన్నే కాదు పాదాల్నీ, చేతుల్నీ కూడా రక్షించుకోవాలి" అంది అడ్వర్టయిజ్‌మెంట్‌లా.

    నేను ఫకాలున నవ్వాను.

    "నా మాటమీద నమ్మకం లేదుకదూ. ఇదుగో ఇప్పుడు ఈ నాటకం మధ్యలో వచ్చే ప్రకటన చూడు. నువ్వే నమ్ముతావు" బుంగమూతి పెట్టుకుని నా చెయ్యి విసిరికొట్టి సోఫాలో దూరంగా జరిగి కూర్చుంది.

    వనజ అన్నట్లుగానే అంతలోనే ఆ ప్రకటన టీవీలో వస్తోంది. కాస్సేపటికే వనజ మామూలుగానే తన్మయంగా టీవీ చూస్తోంది.

    "అన్నట్లు నీకు తాగటానికి ఏమీ ఇవ్వలేదుకదూ. ఏం చెయ్యమంటావు. రంగూ, రుచి, వాసనా మూడు గుణాలున్న టీ ఇవ్వనా! ఉదయాన్నే శుభ ప్రారంభాన్ని యిచ్చే కాఫీ కలపనా. నీదే ఛాయిస్" అంది లేచి నిలబడి.

    "నాకేమీ వద్దు. చల్లని నీళ్లు చాలుకానీ, ఇలా వచ్చి కూర్చొని కబుర్లు చెప్పు" అన్నాను విసుగ్గా ముఖం చిట్లించి.

    "ముఖం ఏమిటి అలా ఉంది. తలనొప్పిగా ఉందా? చిటికలో తగ్గించే టాబ్లెట్ ఇవ్వనా. మళ్లీ నాటకం మొదలు కాకముందే కాఫీ చేసి రెండు నిమిషాల్లో తెస్తాను" అంది హడావుడిగా.

    నేనేమీ మాట్లాడలేదు. మౌనం అర్థాంగీకారం అనుకుందేమో, వంటింట్లోకి వెళ్లి అన్నట్లుగానే రెండు నిమిషాల్లో నూడుల్స్ బౌలు, రెండు టీలు తీసుకుని వచ్చింది. 

    అంతలో టీవీలో మొదలైన నాటకానికి కళ్ళు అతికించి కూర్చుంది. నేను మాట్లాడకుండానే అవి పూర్తిచేసి "ఇంక పిల్లలు స్కూలునుండి వచ్చే వేళయింది. వెళ్తాను" అంటూ లేచాను. 

    ఇబ్బందిగానే నా వెనకే గుమ్మం వరకూ సాగనంపింది. నేను గుమ్మం దాటి నాలుగడుగులు వేయగానే తలుపులు మూసుకున్నాయి. 

    నాకు తెలుసు ఈపాటికి వనజ రంగుల పెట్టెలోకి ప్రవేశించే ఉంటుంది! 

1, జులై 2020, బుధవారం

కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో స్త్రీ - పి. సరళాదేవి కథలు
  శీలా సుభద్రాదేవి

యాభయ్యవ దశకం తర్వాత సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన రచయిత్రులు కొందరు అనేక కారణాల వలన కొద్దికాలం మాత్రమే రచనలు చేసి అస్త్ర సన్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు. మరికొందరు తదనంతర నవలాప్రభంజనంలో కొట్టుకుపోతూ కీర్తీ, సంపదా లభించే ఆకర్షణలతో కథారచనను దూరంపెట్టినవాళ్ళూ ఉన్నారు. అతి తక్కువమంది ఒకటీ అరా నవలలు రాసినా కథారచనకే కట్టుబడినవారూ ఉన్నారు. అటువంటి వారిలో పి. సరళాదేవి ఒకరు. ఇతర ప్రక్రియలైన  కవితలు కొన్ని రాసినా, రెండు నవలికలు రాసినా మూడు కథల పుస్తకాలతో కథారచయిత్రిగానే గుర్తింపబడ్డారు.

1955లో ప్రజాతంత్ర పత్రికలో ‘బావ చూపిన బ్రతుకుబాట’ కథతో కథానగరంలోకి అడుగుపెట్టి, మాలతీచందూర్ ప్రోత్సాహంతో  ప్రమదావనంలో రచనలు చేసారు. డా. పి. శ్రీదేవి స్నేహప్రభావంతో తెలుగు స్వతంత్రలో 1955 నుండి 60 వరకూ విరివిగా కథలు రాసారు. ప్రముఖ పాత్రికేయుడు గోరాశాస్త్రి ముందుమాటతో తాను ఎంపిక చేసుకున్న కథల్ని 1962లో ‘కుంకుమరేఖలు’ పేరున సంపుటీకరించారు. మరికొన్ని కథల్ని ‘సరళాదేవి కథలు’ పేరుతో 1977లో మరొక సంపుటిని స్నేహితురాలు డా. పి. శ్రీదేవికి అంకితంగా తీసుకువచ్చారు. సరళాదేవి మరణానంతరం  ఆమె సోదరి ఆమెకు నివాళిగా, ఇంకా సంపుటీకరింపబడని కథల్ని ‘మాకుగాదులు లేవు’ పేరుతో ప్రచురించారు. కుంకుమరేఖలు సంపుటిలోని కథలు విజయవాడ ఆకాశవాణి ద్వారా ధారావాహికంగా ప్రసారం అయ్యి విశేషాదరణ పొందాయి.

1977లో ‘యువ’ మాసపత్రికలో ‘కొమ్మా-రెమ్మా’ పేరున నవలిక ప్రచురితం కాగా దానితోపాటు ‘చిగురు’ అనే నవలికనీ కలిపి గ్రంథస్థమై వచ్చాయి. ‘తెలుగు సామెతలు-సాంఘిక చిత్రణ’ అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని కూడా సరళాదేవి ప్రచురించుకున్నారు.

1956 నుండి 1960 వరకూ స్వాతంత్ర్యానంతరకాలం రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం నుండి కో��

18, జూన్ 2020, గురువారం

నేనే వర్షరాణిని

వర్షరాణీ

నేనే వర్షరాణిని

నీలాకాశం చీరపై చెమ్కీమెరుపులు
నీరెండలో తళుక్కుమనగా
సమయమైందని బద్ధకంగా లేచి
పక్షులమేతకై గింజల్ని విసిరినట్లుగా
గ్రీష్మతాపంతో సొమ్మసిల్లిననేలముఖంపై
మబ్బుపిడికిల్ని విసిరాను
రాలినచినుకులు క్షణంలో ఆవిరై
రెట్తింపుసెగని విరజిమ్మాయి

ఇరుగుపొరుగుపిల్లల్ని ఆటకి పిల్చినట్లు
అన్నిదిశల్నుండి మేఘమిత్రుల్ని కలుపుకుంటూ
నల్లగొడుగునింగి దారిలోకదిలాను
ఒక్కోమువ్వనీకూర్చుకుంటూ అల్లిన
ముత్యాలకొంగును ఉండుండి విసురుగావిదిల్చానేమో
జలజలా వడగళ్లు విరజిమ్మాయి
వర్షగాలిలో తూనీగలై తిరుగుతోన్న
పసిపాపలదోసిళ్లన్నీ ముత్యపుచిప్పలయ్యాయి
వారితో కాసేపు ఆడుకుని
విసుగ్గా ఓసారి ఉరిమిభయపెట్టి
ఇళ్ల్లోకు తరిమాను.

తిరిగిబయల్దేరి
నల్లమబ్బుల దుప్పటిని వాడవాడల్నీ
ఊరూరా కప్పేస్తూ
విద్యుల్లతలకాగడాలతో
మెరుపుకర్రల కోలాటాలతో
ఉండుండి గుండెలదరగొట్టే తీన్మార్ 
పిడుగులదరువులతో
నలుదిక్కులా గర్వరేఖలు ప్రసరిస్తూ
నేనేకదా వర్షరాణినని   
మబ్బుకారుపై ఊరేగేదాన్నే
కానీ
ఏ అర్ధరాత్రో సడిసేయకుండా
నట్టింట్లో అనకొండై బిరబిరా పాకుతూ
బీదగుడిసెల్ని మింగాలనో
అసహాయుల్నూ అనాథల్నీ కాలనాగై కాటేయలనో
ఉత్సాహపడుతూ కాపుకాసిన
క్యుములోనింబస్ మేఘాల్ని ఒఫిసిపట్టి
కొంగున భద్రంగా కట్టేసుకొని
నెర్రెలువారిన పొలాలమీదుగా
ఎండిననదులదారుల్లో
కాల్వలతీగల్ని సుతారంగా మీటుకుంటూ
మేఘమల్హరినై ఒద్దికగా నడిచాను.

12, జూన్ 2020, శుక్రవారం

తెలుగు భాష ఆడవాళ్ళకు ప్రత్యేకం గా ఇచ్చిన వరాలు ఏవి

స్త్రీల నోముల పాటలు, పెండ్లిపాటలూ, బతుకమ్మపాటలూ, జోలపాటలూ, పండుగపాటలూ, వేడుకపాటలూ మొదలగునవి తెలుగుభాష ఆడవాళ్ళకు ఇచ్చిన ప్రత్యేక వరం..ఇది మామనవరాలు 7 వ తరగతి ప్రధమ భాష తెలుగు పరీక్షకోసం చదువుతుంటేవిని తెల్లబోయాను. 7 వ తరగతి పుస్తకం లోని 12 వ పాఠం ‘తెలుగు వెలుగు” లో తెలుగు భాషగొప్పదనాన్ని తెలియజేసేందుకు ఉద్దేశించి పెట్టినది కావచ్చు.ఇది మాత్రమే తెలుగు భాష వల్ల స్త్రీలకు లభించినది అని మన తెలుగు చదివే మన పిల్లలు నేర్చుకొంటున్నారు….
తెలుగుభాషకి చెందిన సాహిత్యం చదివే కదా? మన ఆలోచనలు వికసించాయి.అవి చదివేకదా మనం మన అస్తిత్వం కోసం కల గంటున్నది.అవి చదివేకదా మనం కూడా ఇంత సాహిత్యాన్ని పండిస్తున్నది.మరి పసితనం లోనే ఆలోచనలు కత్తిరించేలా ఆ పాఠాన్ని చేర్చినవాళ్ళు ఆలోచించలేదేమిటీ చెప్మా?
ఇంకా ఘోరం ఏమిటంటే పాప 5వ తరగతి లో వున్నప్పుడు పిసినారి అని ఒక పాఠం వుండేది.అందులో పిసినారి పాయసం తినాలనిపించి చేయించుకొని తీరా బంధువు ఒకడు వస్తే వానికి భోజనం పెట్టాల్సి వస్తుందని చనిపోయినట్లు నటిస్తాడు. అప్పుడు అతని భార్య తన పసుపు కుంకుమలు పోయాయని ఏడుస్తుంది.
ఆ పాఠం లో ప్రశ్న పిసినారి భార్య ఏమని ఏడుస్తుంది? తన పసుపుకుంకుమలు పోయాయని ఏడుస్తుంది అనేది సమాధానం. ఏడ‌వ‌త‌ర‌గ‌తి చదువుతున్న పిల్లలకి పసుపు కుంకుమలు పోవటమంటే అని సందేహం వస్తే ఏమని చెప్పాలి! కుంకుమా పసుపు ధ‌రించ‌డం అందరికి పుట్టుకతో వచ్చే హక్కు. ఇది ఆ వయసు పిల్లలకేకాక ప్రతీ పిల్లల గురించీ ఆలోచించాల్సిన పరిస్థితి వుంది. పిల్లలకి చిన్ననాటీనుండీ మూఢ విశ్వాసాల్ని నింపుతోన్న సిలబస్ని మార్చాల్సిన అవసరం ఎంతో వుంది. అందుకోసం అభ్యుదయ భావాలున్న సాహితీవేత్తలు వుద్యమించాల్సివుందని అనుకుంటున్నాను.

6, జూన్ 2020, శనివారం

ఇస్కూలు కతలు గురించి జొన్నవిత్తుల శ్రీ రామచంద్రమూర్తి గారి సమీక్ష

శీలా శుభద్రాదేవిగారి "ఇస్కూలు కతలు"

ప్రభుత్వోపాధ్యాయులకెదురయ్యే మొట్టమొదటి సమస్య-అదనపు బాధ్యతలు.
పేద పిల్లల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ మొదలు జనగణన దాకా అన్నింటిలోనూ అయ్యవార్ల పాత్ర ఉండాల్సిందే. ఒక్క మనిషి అన్ని పాత్రలు ఏకకాలంలో ఎలా పోషించగలడనే విషయం ఈ ప్రభుత్వాలకు తెలియదా? మేమేం మనుషులం కాదా? అంటూ ప్రశ్నించడం మొదలుపెడితే అది హక్కుల సాధన వైపుగా నడిపిస్తుంది. ప్రభుత్వాలని బోనులో నిలబెడుతుంది. ఒకవేళ ఆ అయ్యవార్లకే సామాజిక అభివృద్ధిలో తమవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నామనే ఎరుక కలిగితే? అది బాధ్యతలని మరింత ప్రభావయుతంగా నడిపేవైపుగా ముందడుగు వేయిస్తుంది. అప్పుడు విద్యార్థి అంటే కేవలం విద్యార్థి మాత్రమే కాదనీ అతని కుటుంబ నేపథ్యం కూడా అతనిలోంచీ విడదీయరాని ప్రధానాంశమనే అవగాహన కలుగుతుంది. అది కలిగాలేగానీ అయ్యవార్లకీ పిల్లకాయలకీ మధ్య ఒకానొక బాంధవ్యం పెనవేసుకుపోతుంది. అప్పుడు వారి పట్ల జాలి కలగదు. వారినా పరిస్థితుల్లోంచీ బయట పడెయ్యడం ఎలా? అనే ఆలోచన కలుగుతుంది. అలాంటి ఆలోచనలు రేకెత్తించే కథల పుస్తకమే,"ఇస్కూలు కతలు"
పిల్లలకీ తల్లిదండ్రులకీ ఎలాంటి అనుబంధం ఉంటుందో అలాంటి సంబంధమే ఉపాధ్యాయులకీ విద్యార్థులకీ మధ్య కూడా ఉండాలి. అది ఉన్నప్పుడు విద్యార్థుల ప్రశ్నలకి సమాధానాలు మాత్రమే కాదు, వారి సమస్యలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. అలాంటి పరిష్కారాలు కనుగొన్నప్పుడు కలిగే ఆనందాన్ని జీతాలుగానీ, పదోన్నతులుగానీ, హంసతూలికా తల్పాలవంటి సవాలక్ష సుఖాలుగానీ ఇవ్వలేవు. సుఖాల సరిహద్దుల్ని చెరపడానికీ ఆనందపుటంచులు తాకడానికీ తేడా తెలుసుకోవలసిన మొట్టమొదటి బుద్ధిజీవి అయ్యవారే. ఆ తేడా తెలియజేసేవి ఉపాధ్యాయులకు పనిభారాన్ని పెంచే అదనపు బాధ్యతలే. ఆ అదనపు బాధ్యతలు వారికి సమాజంతో నేరుగా"ముఖా-ముఖీ"ని ఏర్పాటు చేస్తాయి. అందుకే ప్రజల సమస్యలు అందరికంటే ఎక్కువగానూ ముందుగానూ అయ్యవార్లకే తెలుస్తాయి. అందుకే ముందు తరాల్ని ఉన్నతీకరించే సాహిత్య సృజనకారుల్లో అధికశాతం ఉపాధ్యాయులే అయివుంటారు. అది అయ్యవార్లకీ అమ్మయ్యలకీ గర్వకారణం. ఒకవేళ సృజనకారులు ఉపాధ్యాయ వృత్తిలో లేకపోయినా వారిలో బోధనా సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఎందుకంటే విద్యాబోధనని మించిన సృజనాత్మక కళ మరొకటి లేదు. ఉపాధ్యాయులకు బోధన-విద్యార్థులకు సాధన. ఈ రెండూ అర్థ పూర్ణాలు. వాటిని పరిపూర్ణంగా చెయ్యడం మార్కులు, ర్యాంకులవల్ల కాని పని. ఈ విషయం దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా నిరూపితం అవుతూనే ఉంది. దాన్ని అందరికీ తెలియజేసే బాధ్యతని తలకెత్తుకున్న అరుదైన ఉపాధ్యాయిని అరుంధతి. ఆవిడకి సంబంధించిన ముప్ఫై కథలున్నాయిందులో.
ఇందులోని కథలన్నీ చిన్నవి. నాలుగు పుటలకి మించవు. కాబట్టీ ఏ కథా చదువరినించీ ఎక్కువ సమయాన్ని తీసుకోదు. వస్తుపరిధిని దాటి ఒక్కవిషయం కూడా ఉండదు. కథకి అవసరంలేని మాట ఒక్కటికూడా కనపడదు. దేనికదే క్లుప్తంగా సూటిగా స్పష్టంగా చెప్పాల్సింది మాత్రమే చెబుతుంది. కనుక చదవడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. చాలా సరళమైన భాష. సుభద్రాదేవిగారు స్వతహాగా కవయిత్రి కాబట్టీ కథలన్నీ కవితామయంగానూ తరచి చూస్తే తప్ప కనపడని భావాలతోనూ నిండి ఉంటాయేమోనని సందేహించాల్సిన అవసరం లేదు.  కథ చెప్పేటప్పుడు కవయిత్రిలా వర్తించకుండా నిగ్రహం పాటించడం వల్లనే ఇది సాధ్యపడింది. అందుకే అరటిపండు వలిచిపెట్టినంత చులాగ్గా సాగుతుంది పఠనం. ఇందులో కథలన్నీ అయ్యవార్లందరికీ అనుభవంలోకి వచ్చేవే. కనుక ఆయా సందర్భాలెదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎలాటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకోవడానికైనా ఉపాధ్యాయులందరూ ఈ కథలు చదవాలి. అందుకే ఈ కథలన్నింటినీ "తెలుగు విద్యార్థి" ధారావాహికంగా ప్రచురించింది. మహారాష్ట్రలోని ఏడవ తరగతి తెలుగు విద్యార్థులకి "ఒకే తాను ముక్కలం"పాఠ్యాంశం.
ఇంక కథల గురించి:
ఇవి "బాధ్యతల్ని గుర్తు చేసే కతలు"అంటూ కథల తూకం వేశారు గంటేడ గౌరునాయుడు. తరవాత "నామాట"మీదుగా వచ్చి ఉపాధ్యాయులకి "అందరం ఒకేతాను ముక్కలం" అని తెలియజెప్పడం ద్వారా అందరి మనసూ గెలుచుకుంటుంది అరుంధతి. ఆ తరువాతే ఆత్మీయంగా ఆరంభమౌతుంది ఆమె పయనం. ఎవరికైనా నడక ఆరంభించగానే ఎదురయ్యే మొదటి ప్రశ్న..,"ఈ దారి ఎక్కడికి?"
దానికి సమాధానమిచ్చే క్రమంలో కొందరు "పరాన్న భుక్కులు"ఎలా ఉంటారో పరిచయం చేసి, విద్యార్థులతో"నువ్వు నేర్పిన విద్యయే"అనిపిస్తారు. ఒకవేళ ఏదైనా "మూఢనమ్మకం"మీద "ఆరాధన" పెంచుకుంటే ఏం జరుగుతుంది? అది "బాధ్యత"లనుండి తప్పించి "పరిస్థితులకు బానిసలు"గా మార్చి "పనిదొంగలు"గా తీర్చి చివరికి "అవును, ఇది సర్కారు బడి మరి!"అనే నైరాశ్యానికి దారితీస్తుంది. "లేత మనసులపై మలిన ముద్రలు" వేస్తుంది. అలాంటప్పుడు పూలబాలలు పెంచిన మంచిని చూపిస్తూ,"ఆమాత్రం చాలు, మనసు పులకించడానికి"అని బుజ్జగిస్తుంది. అంతలోనే కొందరి "మరుగుజ్జు బుద్ధులు"తమ చుట్టూ ఉన్న "పరిసరాలు-పక్కదారులు" తొక్కించే "పందికొక్కులు"ఎలా ఉంటాయో చూపిస్తుంది. వాటినించీ తప్పించుకోవాలనుకునే"లేతమనసులకు, ధైర్యమే లేపనం"అని చెబుతాయి. ఇంతకీ అసలు "తప్పెవరిది?"అని "చేజారిపోతున్న బాల్యం" దీనంగా చూస్తూ"పేదరికపు అంచున"నిరాశా నిస్పృహలతో కర్తవ్య విమూఢంగా నిలబడిపోతుంది. అలాంటప్పుడు ఎవరైనా"లోగుట్టు"కనిపెట్టే ప్రయత్నం చేస్తే"కదిలిన అధికార పీఠం" స్వామికార్యం-స్వకార్యాలని" ఏకకాలంలో చక్కబెట్టగల "భోక్తలు"ఎక్కడ దొరుకుతారా అని గాలించడం మొదలుపెడుతుంది.
"సినిక్ సెన్స్" ఎక్కువైతే "కక్కూర్తి కూడా జాడ్యమే"అవుతుందని చెబుతుంది అరుంధతి. అంతేకాదు "ఆఫీసు జలగలు" పట్టుకుంటే "బకాసురుడు" తినడానికి ఎముకలు తప్ప ఏమీ మిగలదని వివరిస్తుంది. అయితే"చాణక్య రాజకీయం"విసిరే "మోహవలయాలు" ఎంత ఆకర్షిస్తున్నా లొంగకుండా ఏమాత్రం లౌల్యానికి లోనుకాకుండా తన జీవితంలో "తృప్తి"ని కలిగివుండి సమాజాన్ని సేవించుకోవడమే ఉపాధ్యాయ వృత్తికి పరమార్థమని నిరూపిస్తూ శీలా సుభద్రాదేవి పరిచయంతో ముగిస్తుంది. శ్రద్ధగా చదివిన ఉపాధ్యాయునికి మాత్రం భవిష్యత్కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికా రచనకు తగిన స్ఫూర్తినిస్తుంది. ఏ పుస్తకానికైనా ఇంతకంటే కాగల కార్యం ఏముంటుంది-గంధర్వులు తీర్చడానికి?

30, మే 2020, శనివారం

దూదుంపుల్ల

దూదుం పుల్ల

ఇసుకలో పుల్లదూర్చి
ఆడుకునే దూదుం పుల్లాట
ఎప్పుడు ఆడానో గుర్తులేదు
కానీ
రాత్రీపగలూ 
పోగొట్టుకున్న నా దూదుం పుల్లని
కలలో,ఇసుకలో నడచి నడచి
దొరుకుతుందేమోనని వెతుక్కుంటూనే ఉన్నాను

ఒకవేళ ఏ అలైనా బిరబిరా
లాక్కేళ్ళిపోయిందో ఏంటో

ఏతుపాను వర్షమో దూకుడుగావచ్చే 
ఆవలితీరాలకు దొర్లించుకు పోయిందో
నా వెతుకులాటైతే ఆగనేలేదు

ఉదయపునడకో
సాయంత్రపు నడకో
అడుగులోఅడుగులు లెక్కపెడ్తూ
నడుస్తూ నడుస్తూ
ఏ పావురమో గూడు కట్టేందుకు
ముక్కున కరుచుకు ఎత్తుకు పోయిందేమోనని దిగులు పడ్తాను.
కిటికీ అంచుమీదో
ఏసీ బాక్స్ మీదో
నిలవని గూడులోని పుల్లలు
జారి కింద రాలుతుంటే
చూపులచేతుల్తో నాకు కావాల్సిన
నేను పోగొట్టుకున్న  దూదుంపుల్ల కోసం
ఆత్రం గా తడుం కుంటాను

బడిముందునుండో
గుడిమెట్లమీద నుండో పోతూపోతూ
చెత్తకుప్పల పైనో
గుడిమెట్ల పక్కనో
గాలివాటుకు వచ్చి వాలిందేమోనని
మనసు విప్పార్చుకు వెతుకుతూనే ఉన్నాను

నా అమాయకత్వం గానీ
ఎక్కడో ఏనాడో జార్చుకున్న నా బాల్యం
నానుండి తెలియకుండానే
కుబుసం లా జారిపోయిన బాల్యం
ఎంత వెతికితే మాత్రం
ఎప్పుడెక్కడ దొరుకుతుంది
వడలిన శరీరం ఫై ఎలా వాలుతుంది?!

_ శీలా సుభద్రాదేవి

8, మే 2020, శుక్రవారం

1, మే 2020, శుక్రవారం

కథావరణం లో గుండెల్లో గాయం కథ

ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

- పలమనేరు బాలాజీ | 01.05.2020 01:38:05am


మారుతున్నకాలంతోబాటూ మారుతున్న మానవసంబంధాలకు , మారుతున్న స్త్రీ ఆలోచనలకూ ఒకచక్కటి ఉదాహరణగా శీలా సుభద్రాదేవి గారి ʹ గుండెల్లో గాయం ʹ కథను చెప్పవచ్చు. ఏ పరిస్థితిలో ఉన్నా స్త్రీ, పురుషులకు ఒకరి తోడు ఒకరికి అవసరం. యుక్తవయస్సులో భర్తను కోల్పోయిన భార్య , తన కోసమో. పిల్లల కోసమో ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఎన్ని అడ్డoకులు ఎదురవతాయో, ఎంతమంది ఎంతగా ఇబ్బంది పెడతారో-సమాజం ఎన్ని ఆటంకాలను కలిగిస్తుందో, ఎంతగా చిన్నచూపు చూస్తుందో అదంతా ఒక కథ.! అదే సమయంలో ఏ వయస్సులోని మగవాడికైనా , రెండోసారి, లేదా మూడోసారైనా పెళ్ళి చేసుకోవడానికైతే అందరూ ఎట్లా సహకరిస్తారో, ఇది ఎంత సులభ సాధ్యమో, స్త్రీలకు చాల కష్టమైన రెండోపెళ్లి వ్యవహారం పురుషుడికి ఎంత సులభమో ʹ గుండెల్లో గాయం ʹ కథలో శీలాసుభద్రాదేవి గారు తెలియచేసారు. ఈ కథ సాహితీ గోదావరి (జూలై-డిసెంబర్ 2016) కథల ప్రత్యేక సంచికలోప్రచురించబడింది. కవయిత్రిగా, కథకురాలిగా, నవలా రచయిత్రిగా, ఆమె సాహిత్యలోకానికి సుపరిచితులే.!
1970 లో శీలాసుభద్రాదేవి రాసిన తొలి కథ ʹ పరాజిత ʹ పొలికేక వారపత్రికలో అచ్చయ్యింది. శీలాసుభద్రాదేవి కవయిత్రిగా, రచయిత్రిగా అందరికీ సుపరిచితులే ! 1988లో ʹ దేవుడు బండ ʹ , 2006లో ʹ రెక్కల చూపు ʹ రెండుకథా సంపుటాలను ఆమె వెలువరించారు. తెలుగు విద్యార్ధి మాసపత్రికలో రెండున్నర సంవత్సరాల పాటూ ఆమె రాసిన ʹ ఇస్కూలు కథలు ʹ ఈ మధ్యే కథాసంపుటంగా వచ్చింది.ఆమె రాసిన ʹనీడల చెట్టు ʹ చతురలో (2017 ఫిబ్రవరి ) వచ్చింది. సమగ్ర – కవితా సంపుటి (ఎనిమిది కవితా సంపుటాలు ) ʹశీలాసుభద్రాదేవి కవిత్వం ʹ 2009 లో వెలువడింది.
ʹ మామగారు రాసిన ఉత్తరం చేత్తోపట్టుకొని ఆ తర్వాత మరి చదవలేక దిగ్రమతో అట్లాగే ఆమె కూర్చుండి పోతుంది పార్వతి. ఎందుకో ఎన్నాళ్ళుగానో గడ్డకట్టిన దుఃఖం కరిగిపోయి ఉబికి,ఉబికి వస్తుంది.ʹ అంటూ కథ ప్రారంభం అవుతుంది.

ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం మంచుపర్వతంలా గుండెలనిండా పేరుకుపోయిన కన్నీళ్ళు ఇంత కాలంగా చవిచూసిన అవమానాల గాయాలూ, అణుచుకొన్న కోర్కెలు, ఇంటాబయటా ఎదుర్కోన్న ఆకలిచూపుల కోతలు గుండెల్లోనే భూస్థాపితం చేసినవి. ఇప్పుడు రగుల్చుతోన్న జ్వాలలకు కరిగి సలసలా మరిగినట్లు వేడిగా చెంపల మీదుగా జారిపోతున్నాయి. అనాదిగా సంఘం చూపించే సామాజికన్యాయానికి మనుషుల మనస్తత్వానికో, తరతరాలుగా మగవాళ్ళ హక్కుల తార్కాణమో పార్వతికి అర్థం కాలేదు-అంటుంది రచయిత్రి. స్త్రీ తాలూకు వేదన, ఘర్షణ కథనంలో రచయిత్రి చెపుతుంది. ప్రతి సందర్భంలో ఈ కథలోని ప్రశ్నలు కలవరపెడతాయి. మగవాడ్ని, సమాజాన్ని , లోకరీతిని స్త్రీలందరి తరపునా పార్వతి పాత్ర ద్వారా రచయిత్రి ప్రశ్నిస్తుంది.
ఫోను వస్తుంది. అటువైపు హాస్టల్ నుండి ఒకరితర్వాత ఒకరుగా సంబరంగా కబుర్లు చెప్తోన్న ఆమె పిల్లలు అశ్విని, హాసినీ పలకరింపులతో అన్నీ మరచి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంది.భర్త గుండె జబ్బుతో తమని ఒంటరివాళ్ళని చేసిపోయిననాటికి అభం శుభం తెలియని మూడేళ్ళ పసిపాపలు చూస్తుండగానే పెరిగిపోయారు. ఇప్పుడు వాళ్ళ చదువు, తర్వాత్తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ కుటుంబాలు అప్పుడిక తాను ఒంటరిగా ఈ యింట్లోతన గూట్లో తానుఒక్కతే అనుకుంటుంది పార్వతి!.
ʹ లేచి వాష్ జేసిన్ దగ్గర చల్లని నీళ్ళని దోసిట్లోకి తీసుకొని దుఃఖాన్ని కడుక్కోవటానికి ముఖంపై చల్లుకుంది. మెత్తని టవల్తో ముఖం మీద మిగిలిన దుఃఖపు తడిని అద్దుకుని పెదాలపై చిరునవ్వుని అతికించుకుని వెళ్ళింది.
కథలో పాత్ర తాలూకు మూడ్ పాఠకులకు అందించడానికి రచయితలు కథలో చేసే వాతావరణ చిత్రణ, సన్నివేశాల కల్పన, కథా కథనం, పాత్రల ప్రవర్తన, రచయిత కంఠస్వరం పాఠకులకు కథ పట్ల నమ్మకాన్ని తెప్పించడం తో బాటు కథకు సంభందించిన వాతావరణంలోకి నేరుగా తీసుకు వెడతాయి. కథలో రచయిత సూచనాప్రాయంగా చెప్పిన విషయాలను జాగ్రత్తగా చదువుతున్న పాఠకులే కథలోని వేగాన్ని , అంతరార్థాన్ని అందుకోగలుగుతారు .
అక్కడికి వృద్ధురాలు,యువకుడు వచ్చి వుంటారు. తను ఉద్యోగరీత్యా ఏడాదిపాటూ యు,ఎస్ వెళ్ళాల్సి వుందని, ఏడాదిపాటు వాళ్ళ అమ్మమ్మని ఇక్కడ ఉంచాలనుకుంటున్నాడని, తన స్నేహితుని ద్వారా హోం గురించి విన్నానని , ఆశ్రమంలో ఒకటి,రెండు సంవత్సరాలు ఉంచే ఏర్పాటు ఉందని తెల్సిందని, తను తిరిగి రాగానే అమ్మమ్మని తీసుకెళ్తానని చెపుతాడు.
"మా అమ్మమ్మకు మా అమ్మ ఒక్కతే సంతానం. అమ్మ పురిట్లోనే ధనుర్వాతంతో చనిపోయింది. నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. నేను అమ్మమ్మ దగ్గరే పెరిగాను తాతగారు కూడా పోయి అయిదేళ్ళయింది. చూసేవాళ్ళు లేరు. అమ్మమ్మఆరోగ్యం అంతంత మాత్రమే.ఒక్కరైనా ఒంటరిగా వదలలేక ఇక్కడ వుంచితే బాగుంటుందని అనుకొంటున్నాను" అంటాడు ఆ కుర్రవాడు. ఆ ఆమ్మమ్మది ఒక విషాదగాధ.
పార్వతి దగ్గర హోంలో పని చేస్తున్న ఎస్తేరుది మరొక విషాద గాధ . ఎస్తేరు పెళ్లయిన రెండేళ్ళకే భర్తతో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంటుoది, ఏడాది పిల్లలకు తల్లిదండ్రులు ఒక సంబంధం చూసి తిరిగి ఎస్తేరుకి వివాహం చేసారు. అయితే ఎస్తేరు కొడుకుని రెండవ భర్త స్వీకరించలేదు. దాంతో పిల్లాడిని తల్లికే అప్పజెప్పింది. స్వంత కొడుకును వదిలి భర్త పిల్లల్నే తన పిల్లలు ప్రేమిస్తున్నా ఆమె భర్త సంతృప్తిపడక ఏదోరకంగా మొదటి భర్తను గుర్తుచేసి, ఆమె బాధపడుతోంటే, ఆమెచిన్న బుచ్చుకుంటే మానసికంగా సంతోషపడేవాడు. రోజు రోజుకీ శాడిస్టుగా మారి మానసిక హింసకి గురిచేసేవాడు. ఎస్తేరు మళ్ళీ పెళ్ళి చేసుకుందని తెలిసి మొదటి భర్త వచ్చి గొడవ పెట్టుకొని తన కొడుకును తీసుకుని వెళ్ళిపోయాడు. క్రమంగా పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయింది ఎస్తేరు జీవితం.
పరిస్థితి అంతకంతకూ శృతిమించటంతో భరించలేక, భర్తలను వదిలిపెట్టి తల్లిదండ్రులకీ,అన్నదమ్ములకీ భారం కావటం ఇష్టంలేక ఊరు వదిలి వెళ్ళిపోయింది ఎస్తేరు. జీవచ్చవంలా బ్రతకలేక ప్రాణాల మీద ఆశవదులుకున్న దశలో అనుకోని పరిస్థితిలో పార్వతీ హెూoకు చేరి ఆశ్రయం పొందింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని పార్వతీ తనదగ్గరే హెమ్ నిర్వహణలో రిసెప్షనిస్ట్ గానే కాక క్లర్కుగా బాధ్యత అప్పగించింది. అప్పటినుంచీ తనకో జీవితాన్నిచ్చిన ఆ హోం కి అంకితమైపోయింది ఎస్తేరు.
పార్వతి భర్త చంద్రశేఖర్ మరణానంతరం కవల పిల్లలిద్దర్నీ తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రులకు పార్వతి ఒక్కతే సంతానం కావటంతో, నిండు నూరేళ్ళు పచ్చగా సాగుతుందనుకున్న కూతురు జీవితం ఈ విధంగా మోడుకావటం ఆ దంపతులకు పిడుగుపాటుగా తోచినా, కూతురుతో బాటూ అన్నెంపున్నెం ఎరుగని పసిపాపల్ని చూస్తూ మనసు గట్టిపరచుకొని కాలంగడిపారు. బిజినెస్ మేనేజిమెంటు చేసిన పార్వతి తన దుఃఖాన్ని గుండెలోనే దాచుకొని ఉద్యోగంపట్ల దృష్టి కేంద్రీకరించింది.
తల్లిదండ్రులు మళ్ళీ పార్వతీకి వివాహప్రయత్నం చేయబోయినా ఆ ప్రయత్నం కొనసాగలేదు. కన్యలకే అన్ని విధాలా అనుకూలురైన భర్త లభించే పరిస్థితులు కరువైన ఈ రోజుల్లో, స్వార్థమే జీవిత పరమావధిగా భావించుతోన్న ఈ రోజుల్లో, ఇద్దరు పిల్లల తల్లిని చేసుకోవటానికి ముందుకొచ్చేవారు ఎటువంటి వారౌతారోనన్న భయం వెంటాడింది. పార్వతికి ఏవైనా అవాంఛనీయ పరిస్థితుల్ని చేతులారా ఆహ్వానించటానికి ఆమెకి ధైర్యం చాలలేదు.
లోలోపలి జ్ఞాపకాల్ని రేపుతోన్న ఆలోచనల్ని వదిలించుకోవడానికి పార్వతి లేచి హోమ్ వైపు, దారితీసింది. సాయంత్రం జరిగే ధ్యానం, తదనంతర సంగీత, సాహిత్యాది కార్యక్రమాలు పూర్తిచేసి అల్పాహారం తీసుకుంటున్నారు ఆశ్రమవాసులు, కొందరు తోటలో చెట్ల కిందరాలిన ఆకుల్ని వాడినపూలనీ ఏరుతూ తోటపని చేస్తున్నారు. కొంత మంది పుస్తకాలు తిరగేస్తూ మధ్య మధ్యలో ముచ్చట్లలో పాలు పంచుకుంటున్నారు.
ఎవరికి చాతనైన పనుల్లో వారు నిమగ్నమై వున్నవాళ్ళoదరి గురించి, వారి ఆరోగ్య విశేషాల గురించి పరామర్శించాక , కొత్తగా వచ్చిన వృద్ధురాలి పక్కనే కూర్చొని ధైర్యం చెపుతుంది పార్వతి. పార్వతిని చూస్తే చనిపోయిన తన కూతురు గుర్తువచ్చి చెమ్మగిల్లిన కళ్ళని కొంగుతో వత్తుకుంటుoది ఆ వృద్ధురాలు. ఆమె మనవడు అమ్మమ్మని ఆమెకి అప్పగించి, తరుచూ ఫోనుచేస్తాననీ చెప్పి యు.ఎస్. వెళ్ళిపోతాడు.
ఆ హోంలో ఉండేవారిలో ఆడవాళ్లు ఎక్కువ. అందుకు అనేక కారణాలు. జీవితాంతం ఒంట్లో ఓపిక ఉన్నంతవరకూ ఇంటిచాకిరీకి ఆడవాళ్ళు ఉపయోగపడతారు. ఇంక వాళ్ళ అవసరం లేదనుకున్న ఒట్టిపోయిన గొడ్డుని కబేళాకు పంపినట్లు వాళ్ళని ఆశ్రమాలపాలు చేస్తున్నారు. ఈరోజుల్లో పిల్లలు దూరప్రాంతాలలో ఉండటంతో చరమాంకంలో సైతం ఒంటరిగా జీవితం గడుపుతున్నారు. ఆ వయసులో భర్తని కోల్పోతే తల్లిని తమతో తీసుకెళ్ళలేక ఆశ్రమాలు వెతుకునే వాళ్ళు ఇంకొందరు.చిన్నతనంలోనే వైధవ్యం సంభవించి ఏదో ఉద్యోగం చేసుకుంటూ గడిపినంతకాలం గడిపి తర్వాత ఆశ్రమబాటపట్టేవారు కొందరైతే అవివాహితలుగానే జీవితాంతం బతికి వయసు మళ్ళాక చూసేవారులేక ఆశ్రయం పొందేవారు మరికొందరు. అక్కడకు ఓ ఫర్లాంగు దూరoలోనే పార్వతి ఇల్లు.
తల్లిదండ్రులు ఎంత ప్రోత్సహించినా, ఎంత ఒత్తిడి చేసినా పునర్వివాహానికి అంగీకరించని పార్వతి తన ఒంటరిజీవితానికి ఆలంబనగా ఈ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించి, తొలి రోజుల్లో తాను ఉద్యోగం చేస్తూనే తల్లి దండ్రుల సహాయసహకారాలతో నడిపించి, వారి మరణానంతరం ఉద్యోగం వదిలి పెట్టి పూర్తిస్థాయిలో దీనికే అంకితమైపోతుంది.

ʹ అసహాయులైన వీరితో గడుపుతోంటే ఆమె మనసుకు ఊరట కలిగింది. ʹ అంటుంది రచయిత్రి.
ఆమె చిన్ననాటి స్నేహితురాలు కమల ఫోను చేసి ʹ నీకు తెలిసిందా పార్వతీ ! మీ మామ గారు చేసిన పనిʹ అని అడుతుంది. ʹ ఊʹ అంటుంది నిర్లిప్తంగా పార్వతి
ʹ ఈ వయసులో అదీగాక భార్యపోయి ఆర్నెల్లు కాలేదు,ఎవరో దూరపు బంధువు, ఆమెని గుళ్ళో పెళ్ళి చేసుకున్నారు. నువ్వు మీ అత్త పోయిన తర్వాత నీ ఆశ్రమానికి ఆహ్వానించినా రానని చెప్పిన పెద్దమనిషి ఇప్పుడు ఈ వయసులో ఒంటరిగా ఉండటం చాలా కష్టమనీ, తోడు కోసం చేసుకుంటున్నానని అందరితో చెప్తున్నాడట.
రోజూ కొత్త పెళ్ళంతో షికార్లంట బుద్ధిలేక పోతే సరి, విషయం తెలియగానే భలేకోపం వచ్చిందనుకో. అతను చేసుకున్నందుకు కాదు, పాతికేళ్ళకే మోడైపోయిన కోడలి జీవితానికి ఒకతోడుని సమకూర్చటానికి సంఘం, సంప్రదాయాలు, చట్టుబండలంటూ అడ్డుగా చూపిన ఆ ముసలాడికి ఈ లేటు వయసులో తోడు కావాల్సివచ్చిందంట. ఏమిటే మాట్లాడవు?ʹ – అని అడుగుతుంది స్నేహితురాలు కమల సందేహంగా.
ʹ .. నాకు కూడా ఉత్తరం రాశారు ". బదులిస్తుంది పార్వతి
ʹ నీకేం బాధ అనిపించలేదా? " ఆశ్చర్యంగా అడుగుతుంది కమల.
ʹ ఏమంటాను? మగాడి వయసులో తోడును వెతుక్కోవటం కాక, అతని అధికారాన్ని పెత్తనాన్ని కుటుంబంలో నిలుపుకోగల హక్కుని సమాజం అతనికి ఇచ్చింది. స్త్రీ మొదటిసారి కూడా తన ఆలోచనల్నీ తన మాటనీ, తనిష్టాల్ని కొనసాగించగల హక్కు ఎప్పటికీ లభించటం లేదు.తరతరాలుగా వైవాహిక వ్యవస్థలో స్త్రీ పట్ల వివక్ష చూపిస్తున్న ఈ సమాజం లో అందుకే మళ్ళీ మరో కుటుంబం కోసం తలవంచే సాహసం చాలా మంది స్త్రీలు చేయలేకపోతున్నారు. ʹ అంటుంది పార్వతి.
సరైన నిర్ణయం తీసుకోవడానికి, తీసుకోకపోవడానికి మధ్య నలిగిపోతున్న స్త్రీల వ్యధలు ఒకవైపు చెపుతూనే, అసలు అనవసరమైన రిస్క్ వద్దు అనే ఆలోచనతో – ముసలి తల్లిదండ్రులకు తానే కొడుకై పూర్తిస్థాయిలో అసరాగా ఇమిడిపోయి, తల్లితండ్రుల సహకారంతో ఇద్దరు పిల్లలతో ధైర్యంగా తన కాళ్ళపై తను ఒంటరిగా నిలబడటమే కాకుండా , ఇంకెదరికో ఆశ్రయం కల్పించి, ఎస్తేరు లాంటి వాళ్లకు ఉపాధి ఇవ్వడం ద్వారా, పార్వతి తన వ్యకిత్వాన్ని మెరుగుపరచుకున్న తీరు గమనార్హం. జీవితం పట్ల తనకొక స్పష్టత వుందని, జీవితాన్ని తాను అర్థం చేసుకుంటూ వున్నదని చెప్పటానికి , తనలోని పరిణితికి చిహ్నమే ఆమె జీవిత విధానం.
కథలోని కథాంశం బలంగా సూటిగా స్పష్టంగా పాఠకులకు అందినప్పుడే కథా లక్ష్యం నెరవేరుతుంది. పార్వతి మాటల్లో రచయిత్రి చెప్పదలచుకున్న కథాంశం నిక్షిప్తమైవుంది .ఈ కథ లోని బలమైన పాయింట్ కూడా అదే.!వైధవ్యం కారణంగా ఒంటరితనం లోంచి బయటపడి భద్రత కోరుకునే క్రమంలో పునర్ వివాహం స్త్రీకి నిజంగా భద్రత కలిగిస్తున్నదా అన్నదొక ప్రశ్న?. జీవితంలోని కష్టాలను తట్టుకుని, నిలబడాలని ప్రయత్నిస్తున్న స్త్రీలకు ఎంతమంది తల్లితండ్రులు, అత్తామామలు, కుటుంభ సభ్యులు తోడుగా నిలుస్తున్నారు ? అన్నది మరొక ప్రశ్న.
ఈ కథలో రచయిత్రి ఉద్దేశ్యాలను కథాంశాన్ని అర్థం చేసుకోవడానికి- కథలోని మూడు అంశాలను అర్థం చేసుకోవడం పాఠకులకు అవసరం.
అనేక పరిస్థితుల కారణంగా ద్వితీయ వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్త్రీలు ఎందుకు సాహసించలేక పోతున్నారో పార్వతి మాటల్లోమరోసారి విందాం. – ʹ తరతరాలుగా వైవాహిక వ్యవస్థలో స్త్రీ పట్ల వివక్ష చూపిస్తున్న ఈ సమాజంలో అందుకే మళ్ళీ మరో కుటుంబం కోసం తలవంచే సాహసం చాలా మంది స్త్రీలు చేయలేకపోతున్నారు.ʹ ఇది మొదటి అంశం. అందుకు అనుగుణంగా ఎస్తేరు జీవితాన్ని రచయిత్రి కథలో అంతర్భాగంగా అమర్చడంవల్ల ఈ కథకు నిండుదనం తీసుకురావడం రెండో అంశం.
కూతురు కొడుకుగా మారడాన్ని కూడా రచయిత్రి కథ మధ్యలో క్లుప్తంగా ఒక్క మాటలో చెపుతుంది. ʹ కోటిఆశలతో వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టిన తర్వాత భర్త అనారోగ్యం, మరణానంతరం అత్తింట ఎదురైన సంఘటనలు మనసుని అనుక్షణం సలుపుతూ ఉండటంతో మనిషి, మనసులను శిలగా మార్చుకొని ముసలి తల్లిదండ్రులకు తానే కొడుకై పూర్తిస్థాయిలో ఆసరాగా ఇమిడిపోయిందిʹ – అన్నది మూడో అంశం.
ఈ మూడు అంశాలను అన్వయం చేసుకుoటూ కథ చదివినప్పుడు ,ఈ కథ పాఠకులకు మరింత బాగా చేరుతుంది.
భర్తను పోగొట్టుకున్న కోడలు కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఆమెకు కనీసం ధైర్యం చెప్పలేని ఆమెకి ఆసరాగా నిలబడలేని మామ , తన భార్య చనిపోగానే ఆ వయస్సులో కొత్త తోడు వెదుక్కోవడం, అటువైపు ఆమె అవివాహితురాలే కావడం, తనకన్నా వయస్సులో ఎంతో పెద్ద అయినప్పటికీ అతడ్ని వివాహం చేసుకున్న ఆమె కథ ఈ కథలో చెప్పని మరొక కథ. కథలో కొన్ని లోపలి, లోతైన అంశాలు కొన్నిసార్లు పాఠకుల వివేచనకు పరీక్షలు పెడతాయి.
రచయిత్రి చెప్పదలచుకున్న సంగతులన్నీ కథ చివరిలో స్నేహితురాలితో జరిపే సంభాషణలో గమనించవచ్చు. ఎక్కడా తలవంచకుండా, తనకోసం తన జీవితం,తన పిల్లల కోసం ఒంటరిగా ధైర్యంగా నిలబడ్డంలోని ఆమె వ్యక్తిత్వం, పెద్ద వయస్సులో మామ గారు రెండవ పెళ్లి చేసుకున్నప్పటికీ , అతడిని తప్పు పట్టని ఆమె స్వభావం, అతడ్ని ఆమె అర్థం చేసుకున్న తీరు, సమాజం పోకడల్ని , మనుషుల మనస్తత్వాన్ని విశ్లేషించుకుని , అన్నిరకాల సమస్యలను ఆమె పరిష్కరించుకుంటూ , ఎక్కడా సంయమనం కోల్పోని ఆమె తత్త్వం, అబ్బురం అనిపిస్తాయి. వర్తమాన పరిస్థితులలో స్త్రీకి విద్య, ఉపాధి - వివేకంతో నిర్ణయాలు తీసుకోవడంలో, మరొకరికి ఆసరా కల్పించి ఆదుకోవడంలో ఎంతటి ధైర్యాన్నిస్తాయో ఈ కథ చెపుతుంది.
కవిత్వంలోలాగే మంచి కథలో కూడా ఒక అంతర్లయ ఉంటుంది. ప్రవాహ వేగంతో సాగే ఈ కథలోని అనేక స్త్రీల వేదనలను , అంతులేని దుఃఖాలను, గొప్ప జీవశక్తితో నిరంతరం పరిస్థితులతో పోరాడే శక్తివంతమైన మహిళలను ,వాళ్ళ ఉద్వేగాలను, చైతన్యాలను అర్థం చేసుకున్నప్పుడే ఈ కథలోని అంతర్లయ పాఠకులకు అందుతుంది .