ఇప్పుడు కథలు చూద్దాం.1955 లో దద్దనాల రంగనాయకమ్మ గా కథాసాహిత్యం తో మొదలుపెట్టినప్పటి కథల్లో ఆమె దృక్పథం .
1957 లో రాసిన " పెళ్ళెందుకు" ఇద్దరు స్నేహితురాళ్ళు ఉత్తరాల్లో నే కథ అంతా నడుస్తుంది.పద్మ తన పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తూ కుసుమకు రాసిన ఉత్తరం తో కథ మొదలౌతుంది.ధనవంతురాలైన కుసుమ తెలియని వ్యక్తి ని పెళ్ళాడి, స్వేచ్చ ను కోల్పోయి పెళ్ళనే ఊబిలో దిగననీ హాయిగా అమ్మానాన్నలతో,అన్నతో కాలం గడుపుతానంటుంది.కానీ పద్మ మనకంటూ ఒక మనిషి ఉండాలంటే పెళ్ళిచేసుకోమంటుంది.
కొన్నాళ్ళకి అకస్మాత్తుగా కుసుమ తండ్రి చనిపోవడంతో అన్నావదినలు కుసుమను విసుక్కోవడం తో బాధపడిన కుసుమ పెళ్ళికి అంగీకారం తెలిపిన లేఖతో కథ ముగుస్తుంది.కథ మొత్తం లేఖలతో నడవటం ఒక విశేషం.ఇందులో వివాహ వ్యవస్థ గురించిన చర్చలో కుసుమ వాదనలో రచయిత్రి భావాలూ, స్ర్తీ చైతన్యం స్పష్టంగా ఉంటుంది.
1961 లో ప్రభ లో రెండు వారాలు గా వచ్చిన "విజయ" .15 ఏళ్ళ విజయకి అక్కతో పాటే పెళ్ళి చేయాలనుకుంటే చదువుకుంటానని చాలా మొండి పట్టుదల పడితే అక్క పెళ్ళి చేసేస్తారు.స్కూల్ ఫైనల్ అయ్యాక తండ్రి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటుంది.ప్రైవేటుగా హిందీ పరీక్షలు పాసై,తన విద్యకాంక్ష తీర్చుకోవడానికి లైబ్రరీలో పుస్తకాలు చదవటం, పాటలు సాధన చేసి రెడియోలోపాడటం, రేడియో నాటికలలో నటించటం ఇలా ప్రతీ నిముషాన్నీ ప్రయోజనకరంగా చేసుకుంటుంది విజయ.తన భావాల్ని కథలుగా రాస్తుంది.
ఆమెను ఇష్టపడిన వ్యక్తి అభిరుచులు ఆశయాలు మాట్లాడుకుందాం అని అడుగుతే, స్పష్టంగా చెప్పి వివాహానికి ఒప్పుకుంటుంది.అప్పుడు మళ్ళీ విజయ పెళ్ళితో పాటే 14 ఏళ్ళ చెల్లెలి కి కూడా చేస్తానంటే విజయ అభ్యంతరం చెప్పి చెల్లెల్ని తాను చదివిస్తానని చెప్పటంతో కథముగిస్తుంది.
వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య ఉండవలసిన నమ్మకం,పరస్పర ఏకీభావం వంటి చర్చలలో రచయిత్రి తదనంతరం రచనల్లో విస్తృత రూపం దాల్చటానికి వెలుగు చూపిన మొలకల్లా భావించవచ్చు.
1967 లో యువ లో ప్రచురితమైన"శోభనపు రాత్రి"ఒక ప్రత్యేక మైన కథ.దాంపత్య సంబంధాలలో లైంగిక జీవితం పట్ల జడత్వం ఉన్న సుజాత కారణాన శోభనం ఏవో సాకులతో వాయిదా పడుతుంది.ఆరోజు కోసం కలలుకన్న వాసుదేవరావు ఉత్తరాలు రాస్తుంటాడు.చదువు వంకతో ఏడాది పాటు మళ్ళా వాయిదా పడ్తుంది.తర్వాత తప్పని సరిగా కాపురానికి వచ్చినా రాజీపడదు.దీనినే దృశ్యాలు గా కథనం చేస్తుంది. రచయిత్రి.సుజాత అక్క వితంతువు పట్ల ఆకర్షితుడౌతాడు వాసుదేవరావు.ఆమెని ఇంట్లో వాళ్ళుమందలిస్తారు.చివరికి సుజాత కి స్వేచ్చ కల్పిస్తు వెళ్ళిపోతాడు.
ఈమూడు కథలూ దాంపత్య సంబంధాలను చెందినవే ఐనా విభిన్న కథాంశంతో, విభిన్న దృక్కోణంలో రాసినవి.సంభాషణలో రచయిత్రి భావసాంద్రతా,స్పష్టతా, ఖచ్చితత్వం,వెల్లడౌతాయి.స్త్రీపాత్రలు మొదటినుంచీ దృఢత్వం కలిగి ఉంటాయి.రంగనాయకమ్మకి అత్యంత ఇష్టమైన సాహిత్య పఠనానికి సంబంధించిన సంభాషణలు మూడింటిలోనూ ఉంటాయి.ఆమె తొలినాటి కథలే ఐనా ఒక ఖచ్చితమైన, నిర్ణయాత్మక మైన,సంకల్పంతో నే రచనా రంగంలో కి వచ్చినట్లుగా తెలుస్తుంది.ఏదో గాలివాటుగా,నేలవిడిచి సాము చేసే రచనలు కావు.అందుకే మొదటినుండీ రంగనాయకమ్మ గారిపై అత్యంత ఇష్టమైన రచయిత్రి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి