నాకు అప్పుడు ఇప్పుడూ కూడా అభిమాన రచయిత్రి రంగనాయకమ్మ.
నేను ఏడో తరగతి చదువుతున్న రోజుల్లో ప్రభ లో సీరియల్ గా వస్తున్న " కూలిన గోడలు" అమ్మకి చదివి వినిపించే దాన్ని.ఎందుకు చదివి వినిపించాలనిపించేదో తెలియదు.మధ్య మధ్య అమ్మ అందులోని సంఘటన లతో పోలిక ఉండే విషయాలూ, అనుభవాలు చెప్పేది.
బహుషా ఆ ప్రభావమే నన్ను రచయిత్రి ని చేసాయేమో.
రంగనాయకమ్మ గారు 1955 లో తొలికథతో సాహిత్యరంగం లోకి వచ్చి15 కి పైగా నవలలు, ఎనిమిది కథా సంపుటాలు,రామాయణ విషవృక్షం,కేపిటల్ అనువాదం, 20 వ్యాససంపుటాలు,ఇంకా మరెన్నొ రచనలు అవిశ్రాంతంగా రాస్తూనే ఉన్నారు.
మార్క్స్ మాయలో పడి రచనలో మరింత సూటిదనం,స్పష్టతా వచ్చినా ఒక వైపే చూసే దృష్టికోణం తో నాస్తికవాది,సనాతన వ్యతిరేకిగా వివాదాలను ఎదుర్కొంటున్నారు.
నేను రంగనాయకమ్మ గారి రచనల్లో ఏది ఎంచుకోవాలో అనే ఆలోచనలో పడి మార్క్స్ ప్రభావానంతరం రాసిన జానకి విముక్తి నవలని పరిచయం చేయాలనుకుంటున్నాను.
జానకి విముక్తి నవల మూడు భాగాలుగా రాసారు.1100 పేజీలకు పైనే ఉన్న దీని కథంతా చెప్పకుండా చాలా మంది చదివే ఉంటారుకనుక కేవలం నవలలో రంగనాయకమ్మ దృక్పథాన్ని మాత్రమే చెప్తాను.
స్త్రీ కోసం తపన,ఆవేశం,ఆలోచన కలగలిపి, పురుషులతో పాటే స్త్రీ కి కూడా ఆర్థిక, సామాజిక, సాంసారిక,గా తనదైన స్వేచ్చ గురించి పెద్ద కాన్వాస్ తీసుకు ని చర్చించి అద్భుతంగా చిత్రించిన నవలగా జానకి విముక్తి నుంచి చెప్పుకోవచ్చు.
చదువుకీ, సంస్కారానికి, శాస్త్రీయ దృక్పథానికి సంబంధంలేని అవగుణాలున్న వెంకట్రావు భార్య జానకి.కాపురంలో అనేక అవమానాలు ఎదుర్కొంటుంటే చూసిన జానకీ అన్ని సత్యం ఆమెను విముక్తి చేయాలని ప్రయత్నించటం స్థూలంగా కథ.
స్నేహితుడు మూర్తి వలన మార్క్సిస్టు దృక్పథంపెరిగిన సత్యం ఏవిదంగా జానకిని సంస్కారించి విముక్తి చేసాడన్నది విపులంగా ఇంత పెద్ద నవలగా రాసారు
ఈ నవలలో
1.వైవాహిక చిహ్నాలను నిర్వహిస్తారు.
2.బహిష్టుసమయంలోని అంటరానితనాన్ని బహిష్కరించారు
3.స్త్రీ సమస్యల్ని స్వంతాస్తి విధానంలోనే నుండి కమ్యూనిస్టు సమాజం మాత్రమే పరిష్కరిస్తుందనే నమ్మికని ప్రకటిస్తారు.
4.మంచిపుస్తకపఠనం వలన మానసిక వికాసం కలుగుతుందనే భావాన్ని స్పష్టం చేశారు.
5.నిజమైన మార్క్సిస్టు ఎలా ప్రవర్తిస్తాడో రుజువు చేయడానికి ప్రయత్నించారు.
6.అణగారిన బానిస స్థితి నుండి గౌరవ ప్రదమైన స్థితి కి ఎదగాలంటే స్త్రీ కి కావలసినది స్వయంగా శక్తి, ఆలోచన అనేది జానకి పాత్ర ద్వారా తెలియజేసారు.
ఇందులో సుదీర్ఘమైన సిద్ధాంతచర్చలు,కుహనా కమ్యునిస్టు లనుదుయ్యబట్టటం అనేకమంది భుజాలు తడుముకునేలా జరిగిన వాదోపవాదాలు చాలా మంది కి అభ్యంతరకరంగా ఉండొచ్చు.
మరీ సుదీర్ఘంగా ఉన్నా ఈ నవల చదవటంవల్ల పాఠకులకు ఆలోచనా పరిధి విస్తరిస్తుంది అనటానికి సందేహం అక్కర్లేదు.
రంగనాయకమ్మ కు నరనరాన జీర్ణించుకుపోయిన మార్క్సిస్టు ఐడియాలజీ ఇందులో స్పష్టమౌతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి