నాకు స్పూర్తి నిచ్చిన వ్యక్తి మా పెద్దక్కయ్య పి.సరళాదేవి .ఆమె
డా. పి.శ్రీదేవి స్నేహప్రభావంతో 1955 నుండీ తెలుగు స్వతంత్ర లో విస్తృతంగా కథలు రాసేది.వాళ్ళు పుంగనూరు లో ఉన్నప్పటి నుండి ఎమ్.రాజేంద్ర( జర్నలిస్టు),మధురాంతకం రాజేంద్ర గార్లు కుటుంబ స్నేహితులు.అక్కయ్యవి మూడు కథలు సంపుటాలు,రెండు నవలికలు, తెలుగు వారి సామెతలు పై విశ్లేషణాత్మక గ్రంథం ' సామెత' ప్రచురింపబడ్డాయి.1975 తర్వాత రచనలు చేయటం మానేసింది.
నాకు ఊహ తెలియక ముందే అక్కకి పెళ్ళి ఐపోయింది.ఆమె ఎప్పుడు విజయనగరం వచ్చినా నాకోసం బొమ్మలో మిఠాయి లో కాకుండా చిన్న చిన్న బొమ్మల పుస్తకాలు తెచ్చేది.అందువలన కూడబలుక్కుని చదివే దాన్ని . సోవియట్ లేండ్ వాళ్ళ పిల్లల పుస్తకాలు తెలుగు అనువాదాలు ఇచ్చేది.ఆ విధంగా చాలా చిన్నతనం నుండి కథలపుస్తకాలు చదవటం అలవాటైంది.
అక్క భర్త మా మామయ్యే. వాళ్ళు ఉద్యోగరీత్యా ఏ వూరు వెళ్ళినా అక్కడ పిల్లలందరినీ చేర్చి బాలానందం నడిపేది.వాళ్ళకి పాటలు, డేన్స్ లే కాకుండా కథలు చదివించే ది.సెలవుల్లో వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ జత చేరేదాన్ని.
ఎనిమిదో తరగతి అయ్యాక కుటుంబకారణాల వలన ఒక ఏడాది చదువు మానిపించుతే ఏలూరు దగ్గర గోపన్న పాలెం లో అక్క ఇంట్లో ఒక ఏడాది ఉండాల్సి వచ్చింది.
వాళ్ళింట్లో లైబ్రరీ లోనే కాక దగ్గర లోని లైబ్రరీ కి వెళ్ళి కొంతసేపు చదువుకొని మరి రెండు పుస్తకాలు తెచ్చుకునేదాన్ని.అలా ఒక్క ఏడాది లో ఎంతోమంది ప్రముఖుల రచనలే కాక శరత్ అనువాదగ్రంథాలు కూడా చదివాను.నాకు మితృలు పుస్తకాలే.
ఒకసారి ఏలూరులో ఆవంత్స సోమసుందర్ గారికి పెద్ద ఎత్తున ఘనసన్మానం జరుగుతుంటే నన్ను తీసుకెళ్ళింది.సభానంతరం ఒక సాహిత్య మితృని డాబా మీద వెన్నెల్లో కవితా గోష్ఠి జరిగింది.ఎంతమందో కవులు కావ్యగానం చేస్తుంటే అద్భుతంగా అనిపించింది.అంతవరకూ కథలూ నవల్లే చదివే దాన్ని అక్కని కవిత్వం పుస్తకాలు అడుగుతే వైతాళికులు, మహాప్రస్థానం, కృష్ణపక్షం, ముత్యాల సరాలు ఇచ్చింది.అందులోని నాకు నచ్చిన వన్నీ ఒక పాతడైరీలో రాసుకున్నాను.అది ఇప్పటికీ నా దగ్గరే ఉంది.అప్పటి నుండి కృష్ణశాస్త్రి కవితలోని లాలిత్యం ఎంత ఇష్టమో, శ్రీ శ్రీ కవిత్వం లోని లయ, పదును అంతే ఇష్టం.
పుస్తకం పఠనమే కాకుండా అక్క ఎంబ్రైయిడరీ, బొమ్మలు తయారు చేయటం, లలిత సంగీతం నేర్పించేది.నేను బొమ్మలు బాగా వేస్తున్నానని నా చేత మంచి చిత్రం వేయించీ శంకర్స్ వీక్లీ వారు కండక్ట్ చేసే బాలల చిత్రలేఖనం పోటీ కి పంపింది.బహుమతి రాలేదు కానీ సర్టిఫికెట్ వచ్చింది.నేను ఈనాడు రచయిత్రిగా, కవయిత్రి గా ఎదగటానికి గల కారణం అక్క దగ్గర ఉన్న ఏడాది కాలమే.
ఆ ఏడాది గడిచాక తిరిగి విజయనగరం లో తొమ్మిదో తరగతిలో చేరాను.
పుస్తక పఠనం వల్ల నేను చదువులో బాగా రాణించాను.అంతేకాక మా స్కూల్లో లిఖిత పత్రికలో కవితలే కాక
ఛందస్సు లో కూడా పద్యాలు రాసాను.చిన్నన్నయ్య అప్పటికే కథలు రాసేవాడు.నేనూ రాసినా ఎవరైనా చూస్తే చదవకుండా కథలు రాస్తున్నారని తిడతారని చూపేదాన్నికాదు.
తర్వాత కాలేజీ లో చేరాక కాలేజీ మేగజైన్ కి రాసే దాన్ని.డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కొడవంటి సుభద్రా దేవి పేరుతో మూడు కథలు పొలికేక పత్రికలో ప్రచురింపబడ్డాయి.రెండవ ఏడాది మేనత్త కొడుకు శీలా వీర్రాజు గారి తో వివాహం జరిగినా థర్డ్ ఇయర్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాను.
మా ఇంటి కి కవులు ఎక్కువగా రావటం ,కవితా సంపుటాలు ఎక్కువ చదవటం తో కవిత్వం వైపు మళ్ళిపోయినా కథలూ రాసే దాన్ని .నేను రాసిన రచనలకి అక్క స్పందించి ఉత్తరం రాసేది.
ఎలక్షన్స్ బేనర్ల పై రాసిన ' వానా వానా కన్నీరు' కథ చదివి అక్క పెద్ద ఉత్తరం రాసింది."కుటుంబ పరిథి లోనే రాయకుండా సమాజం లోని ఇతర సమస్యలతో రాయటం బాగుంది.ఆలోచన విస్తృతమౌతోంది.ఇలానే రాస్తుండు"అన్న తర్వాత నా రచనా పరిథి పెంచుకున్నాను.
1996 లో కేవలం స్త్రీ చైతన్యంతో రాసిన కవితా సంపుటి" ఆవిష్కారం" అక్కకి అంకితం ఇచ్చాను.
కేంద్ర సాహిత్య అకాడమీ వారు డా.శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ రాయమన్నప్పుడు పాత తెలుగు స్వతంత్రలు వెతుకు తుంటే అక్కరాసిన సంపుటీకరింప బడని కథలు కొన్ని దొరుకుతే వాటిని నేను అక్కకి ప్రేమ పూర్వక నివాళి గా పుస్తకరూపంలో తెచ్చాను.
అందుకే నేను అక్కకి సాహితీ వారసురాలినని ఎప్పుడూ చెప్తుంటాను. మొదటినుంచీ నన్ను సాహిత్యం వైపు మళ్ళించిన మా పెద్దక్కయ్య పి.సరళాదేవి నాకు స్పూర్తి నుంచి ఇచ్చిన వ్యక్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి