18, నవంబర్ 2020, బుధవారం

కోటబొమ్మాళి జీవితం

 1961 లో మా నాన్నగారు పోయిన ఏడాది కి  మా అన్నయ్య కు శ్రీకాకుళం జిల్లా లోని కోటబొమ్మాళి అనే ఊరు లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది.మా రెండో అన్నయ్య  వైజాగ్ లో హాస్టల్ లో ఉండి చదువుకునే వాడు.

అమ్మా,మా రెండో అక్కా నేను విజయనగరం నుండీ రైల్లో బయలుదేరి రామచంద్రా పురమో, హరిశ్చంద్రాపురమో గుర్తు లేదు,అక్కడ దిగి ఎడ్లబండి లో కోటబొమ్మాళి కి వెళ్ళాం.అప్పటికి కోటబొమ్మాళి కి బస్సు కూడా లేదు.దారంతా గతుకుల రోడ్డు మీద ప్రయాణించి వెళ్ళాం.

ఆ ఊరులో అప్పట్లో రెండే సమాంతరంగా ఉండే వీధులు.ఒకటి బ్రాహ్మణ వీథి.రెండోది కోమట్లవీథి.ఇతర కులాల వారు మరి ఎక్కడ నివసించేవారో నాకు తెలియదు.బ్రాహ్మణ వీథిలో మాకు. అద్దెకి  ఇవ్వరు కనుక కోమట్లవీధీ లోనే మరి మాకు ఎలా ఇచ్చారో గానీ ఒకేగది ఇంట్లో అద్దెకు తీసుకుని అందులో ఉండే వాళ్ళం.గది వెనుక ఒక వసారా ఉండేది అక్కడే వంట చేసుకునే వాళ్ళం.తర్వాత పెద్ద తోట అందులో పంపర పనాస,జామ వంటి పళ్ళ చెట్లు ఉండేవి కానీ వాటి మీద చెయ్యి వెయ్యటానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు ఇంటి వాళ్ళు.

నాన్నగారు పోయిన తర్వాత నన్ను ఆరో తరగతి తో చదువు మానిపించారు కదా ఇక్కడ ఏడో తరగతి లో జాయిన్ చేశారు.

ఆ ఊరులో ఎవరింట్లోనూ  మరుగుదొడ్లు లేవు.దూరంగా ప్రహారీ కట్టిన బహిరంగ ప్రదేశం ఉండేది.చిన్నబకెట్ తో నీళ్ళు పట్టుకుని వెళ్ళాల్సిందే.స్నానం మాత్రం పెరట్లో చేసేవాళ్ళం.

ఊరికి చుట్టూ కొండలు ఉండటంవల్ల ఎలుగు బంట్లు రాత్రిపూట ఊర్లోకి వచ్చేసేవి. అందుకని రాత్రంతా డప్పులు వాయిస్తూ కాగడాలతో కాపలా ఉండేవారు.పాములు సరేసరి రాత్రీ పగలూ తిరుగు తూనే ఉండేవి.

ఊరులోని ఆడవాళ్ళు రోజంతా రకరకాల అప్పడాలు సకినాలు వంటివి తయారుచేయటం, (శ్రీకాకుళం జిల్లాలో రకరకాల అప్పడాలు ముఖ్యంగా పేలాలు అప్పడాలకు ప్రసిద్ధి) ఇంటిపనులు చేస్తూ ఉండే వారు.పెద్దగా బయటకు కనిపించే వారు కూడా కాదు.బడిలో ఏ క్లాసులోనూ అయిదారు మందికన్నా ఆడపిల్లలు ఉండేవారు కాదు.వారు కూడా అగ్ర వర్ణాల పిల్లలే.

కొన్నాళ్ళ క్రితం  HJ దొర అనే ఐ.పీ.ఎస్ ఉండే వారు కదా.అతను నాకు జూనియర్  క్లాసులో నూ అతని సోదరి నాకు సీనియర్ క్లాసులో ఉండేవారు.బడికి రోజూ టాంగా మీద వచ్చే వారు.దొరగారి అమ్మాయి అంటూ ఆమెని స్కూల్ లో అందరూ అపురూపంగా చూసేవారు.

ఒకసారి బళ్ళో పాటలు పోటీ  పెట్టారు. పాటల పోటీలో నాకు ఫస్ట్,ఆమెకు సెకెండ్ అని అనౌన్స్ చేసి , తర్వాత స్కూలు డే రోజున ప్రైజులు తారుమారు చేసారు.

శ్రీకాకుళం ప్రాంతాలలో మాత్రమే "నేస్తం కట్టడం" అనేది పధ్ధతో,సాంప్రదాయమో మరి చూసాను.మా తరగతిలోని నా స్నేహితురాలు ఒకరోజు మనం నేస్తం కడదామా అని అడిగింది.అంటే స్నేహం గా ఉందామని అడిగింది అనుకుని సరే అన్నాను.నన్ను ఆ పక్కనే ఉన్న చిన్న గుడి కి తీసుకెళ్ళి నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ  ప్రమాణం వంటిది చేయించింది.నేస్తం కట్టిన వాళ్ళు ఒకరినొకరు జీవితాంతం స్నేహబంధం కి కట్టుబడి ఉండాలి.ఒకరినొకరు మీరు అని మన్నించు కోవాలి.ఒకరిపేరు ఒకరు ఉఛ్ఛరించకూడదు.ఇలా ఏవో చాలా నిబంధనలు ఉన్నాయి.ఐతే నేను ఆ ఊరు వదిలి వచ్చిన తర్వాత  కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లతో ఆ విషయమే మర్చిపోయాను.

ఇటీవల వ్యాసం రాయటానికి నిడదవోలు మాలతి గారి కథలూ చదువుతుంటే ఒక కథలో ఈ ప్రస్తావన ఉంది.దాంతో అవన్నీ గుర్తు వచ్చాయి .ఇంతకీ నా నేస్తం ఎలా ఉందో!!? మళ్ళీ ఒకసారి కోటబొమ్మాళి వెళ్ళి రావాలని ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి