14, అక్టోబర్ 2026, బుధవారం

నడక దారిలో -70

నడక దారిలో -70 వీర్రాజుగారు కొంచెం తేరుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నా ఆపరేషన్ చేసిన దగ్గర ఇంకా పూర్తిగా పచ్చి తగ్గనందువలన స్నానం చేయటంలేదు.రోజూ రెండుపూటలా ఒళ్ళు తుడుస్తున్నాను. వాకర్ ఉన్నాసరే తనకి తాను నడవటానికి భయపడుతున్నారు.దానికి తోడు హాస్పిటల్ లో చాలా మందులు రాసారు.పూటపూటకీ అరడజను పైగా మందుబిళ్ళలు మింగి నోరంతా చేదైపోయిందని చికాకు, ఇబ్బంది పడుతుంటే పటికబెల్లంముక్కో,ఎండుఖర్జూరమో చప్పరించమంటూ ఇచ్చేదాన్ని.ఏంటీబయోటిక్స్ ఇంకా వాడుతున్నందున పొట్టలో గాభరాగా ఉందంటే బార్లీనీళ్ళు,కొబ్బరినీళ్ళు,రాగిజావ ,మజ్జిగ వంటివి ఇస్తున్నాము. బాగానే వున్నారనుకునే సరికి రెండురోజులుగా మోషన్ కావటం లేదని చికాకు పడటం మొదలుపెట్టారు.మందులు ఎక్కువ వేసుకోవటం వలన మలబద్ధకం ఏర్పడినట్లు వుంది.ఆయనకు ఇష్టమైన రీతిలోనే ఆహారం తయారుచేయటం వలన బాగానే తింటున్నారు.జావలూ, బార్లీ నీళ్ళు తాగుతున్నారు. ఆఖరుకు మూడోరోజు వుదయమే మంచంమీద పడుకొని వుండగా మోషన్అయింది. అపుడు నేను డైపర్ తీసి క్లీన్ చేసి పక్కన కుర్చీలో కూర్చోబెట్టి పక్కబట్టలన్నీ మార్చాను.తర్వాత వాష్ రూమ్ కి వాకర్ తో నడిపించి తీసుకువెళ్ళి వేడినీళ్ళతో శుభ్రంగా స్నానం చేయించినట్లుగానే కడిగి బట్టలు మార్చి రూముకు తీసుకు వచ్చాను.మధ్యాహ్నం మామూలుగానే భోంచేసారు.హాల్లో కాసేపు కూర్చుంటానని అంటే పల్లవీ, నేను తీసుకు వెళ్ళాం. వరుసగా బాల్య మిత్రులు ఇద్దరు ప్రకాశరావుల తో, సత్యనారాయణతో చాలా సేపు మాట్లాడారు. 'సుభద్రా,పల్లవీ చాలా సేవ చేస్తున్నారు 'అని చెప్తుంటే కోప్పడ్డాను."అవన్నీ ఎందుకు చెప్పటం .ఈ రోజు మీరు తేలికగానే వున్నారు.మరోవారం అవుతే మీకు మీరు నడిచి వెళ్ళగలుగుతారు" అన్నాను.భోజనం తర్వాత మళ్ళా బెడ్ రూముకు వచ్చి రెస్ట్ తీసుకున్నారు.ఏదో మాటలు సందర్భంలో " చిట్టి ( చిన్నమరిది) యూ.ఎస్ నుండి ఈరోజే కదా వస్తానన్నాడు.వచ్చే వుంటారా"అని అడిగారు."ఉదయం వచ్చివుంటారు.జెట్ లాగ్ వుంటుంది కదా బహుశా సాయంత్రం వస్తారు " అన్నాను. నాలుగింటికి ఎప్పట్లాగే లేచి రాగిజావ తాగి హాల్లో కూచుంటానంటే పల్లవీ,నేనూ సాయంగా వుంటే వాకర్ తో నడుచుకుంటూ వచ్చారు.కాసేపు టీవీ చూసి శంకరంకి ఫోన్ కనెక్ట్ చేయమని అడిగి 'మాట్లాడతాను' అంటే నా ఫోన్ లో కనెక్ట్ చేసి ఇచ్చాను.చాలా సేపు మాట్లాడారు.అప్పుడు కూడా మా సేవల గురించి చెప్పబోతే ఆపాను.'మరో వారంరోజుల్లో బాగానే నడవగలను ' అని ఆశావాహంగా మాట్లాడారు.కాసేపు అయ్యాక బెడ్రూం కి వెళ్తానంటే తీసుకు వెళ్ళాము .అయిదున్నర దాటాక హాల్లో కూర్చుంటానని అన్నారు. ఆరు అయినా తర్వాత వెళ్దురుగాని మరికాసేపు విశ్రాంతి గా పడుకోమని అన్నాము.కానీ మొండిగా నేనే వెళ్తానని లేవబోయారు.సరేనని లేపిన తర్వాత పట్టుకోవద్దని అంటున్నా పల్లవి ఒకవైపు,నేను ఒకవైపు వున్నాము .హాల్ వైపుకు నాలుగు అడుగులు వేసేసరికి ఆయనకు ఒళ్ళంతా చెమట్లు పడుతుండటం గమనించి ఆపబోయాను.కానీ మొండిగా మరో నాలుగు అడుగులు వేసి హాల్ లోకి వెళ్ళబోయేసరికి మూత్రవిసర్జన అయిపోయి కుప్ప కూలిపోయారు.ఆషీని కూడా పిలిచి ముగ్గురం కలిసి లేపలేక పక్కింటి సతీష్ ని పిలవమన్నాము.అందరూ సాయం పట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ మీద కాసేపు కూర్చోబెట్టి తిరిగి మంచంమీదకు చేర్చారు.అప్పటికే స్పృహ లేనట్లుగా అయ్యారు. డా.సూర్యప్రకాష్ గారికి పల్లవి ఫోన్ చేసింది.ఆయన అంబులెన్స్ కి ఫోన్ చేసారు.బిల్డింగ్లో వారు కొందరు వచ్చారు.పైన ఒక మెడికో వచ్చింది సిపిఆర్ చేసింది.పల్స్ వీక్ అయిపోతుంది అంది.అంతలో అంబులెన్స్, డాక్టర్ వచ్చి చూసి మాసివ్ హార్ట్ ఎటాక్ అని ప్రాణం లేదని చెప్పి వెళ్ళిపోయారు.నాకు మతిపోయినట్లైంది.ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్న వ్యక్తికి ఏమైంది అర్థం కాలేదు. ఆషీ నా ఫోన్ తీసుకుని గ్రూప్స్ లో విషయం పెట్టింది.ఒక్కొక్కరే వస్తున్నారు.సూర్యప్రకాష్ ,కామేశ్వరిగారు వచ్చినప్పుడు మాత్రం దుఃఖం ఆపుకోలేకపోయాను." ఏమీ కష్టపడకుండా వెళ్ళిపోయారు.మీరు బాధపడితే మంచిదికాదంటూ' ఓదార్చారు.అప్పుడే చిట్టి,ఉషా వచ్చారు.'ఉదయమే ఫ్లైట్ దిగాము.మధ్యాహ్నం రావాలనుకునికూడా పడుకుంటారేమో సాయంత్రం వెళ్ళొచ్చు అనుకున్నాము.వచ్చుంటే బాగుండేది ప్రాణం వుండగా మాట్లాడేవారమ'ని బాధ పడ్డారు. అప్పటికే రాత్రి అయిందని ఐస్ బాక్స్ తెప్పించారు.ఇంట్లో పెట్టటానికి అపార్ట్మెంట్ వాళ్ళు అంగీకరించి లేదేమో మరి తెలియదు.కానీ దానిని పైకి తీసుకురావటానికి కుదరలేదని మాపార్కింగ్ లాట్ లో పెట్టి ఇంట్లోనుంచి నానుండి యాభై ఒక్క ఏళ్ళ సాహచర్యం గల వీర్రాజు గారిని తీసుకు వెళ్ళిపోయారు. రాత్రే భారవీ,కవితావచ్చారు. కళ్యాణ్, అనురాగ్ రాత్రికి బయలుదేరి తెల్లారే సరికి వచ్చారు. చిట్టీ, ఉషా ఇక్కడే వుండిపోయారు.పొనుగోటి కృష్ణారెడ్డి వచ్చి అంత్యక్రియలు ఎలా చేయాలనుకుంటున్నారని అడిగాడు. వీర్రాజుగారు మరణించారన్న దగ్గర నుంచి నా మనస్సులో సంఘర్షణ మొదలయ్యింది.అంత్యక్రియలు చేయటానికి కొడుకు లేడు,అల్లుడూ లేడు.మెడికల్ కాలేజీకే ఇవ్వాలనిపించింది.కానీ రాజమండ్రి వదిలి అరవై ఏళ్ళు దాటినా వీర్రాజుగారి మనసెప్పుడూ రాజమండ్రినీ,గోదావరినీ వదిలి రాలేదు. కులాచారం ప్రకారం పాతిపెట్టటమే అయినా దహనం చేసి గోదావరిలో నిమజ్జనం చేయాలనుకున్నాను. అందుకనే సంఘర్షణకు గురి అయ్యాను. ఆఖరుకు మరిదిచిట్టి అంత్యక్రియలు చేయటానికి అంగీకరించాడు . కవులూ,రచయితలూ,ఆర్టిష్టులూ చాలామంది వచ్చారు.జనసాహితి మిత్రులంతా వచ్చారు.శీలావీర్రాజూ అమర్ రహె అంటూ అందరూ నినదిస్తూ తీసుకువెళ్ళారు.దహనంచేసేటప్పుడు కూడా ఆయన కవితలు చదువుతూ నినాదాలు చేసారుట.అనారోగ్యం వలన శారీరకంగా ఎక్కువ రోజులు బాధపడకుండా బంధువులూ,మిత్రులూ సమక్షంలో మహారాజు లాగే వెళ్ళిపోయారు. కుందుర్తి కవిత సింగపూర్ నుండి వచ్చింది. ఫ్రీవర్స్ ఫ్రంట్ కుందుర్తి శతజయంతి పురస్కారాలు వీర్రాజు అంకుల్ ఉన్నప్పుడు చేయకుండా నేనే వాయిదా వేసాను అని చాలా దుఃఖించింది. వీర్రాజుగారిదే కాక నాదీ అదే అభీష్టం కనుక ఆ ప్రకారంగానే పూజలు ఏవీ పెట్టుకోలేదు.ఆ రోజునుండి ప్రతీ ప్రింటెడ్, అంతర్జాల పత్రికలన్నీ వీర్రాజుగారి గురించి అద్భుతమైన ఆత్మీయ నివాళి వ్యాసాలు ప్రచురించటం నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది."మనను ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు.మనంపోతే ఒక చిన్న వార్త మాత్రమే వస్తుందేమో" అని వీర్రాజుగారు అనేవారు.అటువంటిది ఇంత గొప్ప నివాళి అందుకున్నారు. వరవరరావుగారు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడటమే కాకుండా వ్యాసం రాసారు. స్వాతి బలరాంగారు ఫోన్ చేసి స్వాతిని ప్రారంభించటంలో వీర్రాజుగారి ముఖ్యపాత్ర గురించే చాలాసేపు మాట్లాడి ఆయన నా గురువు అని వాపోయారు.అంతేకాకుండా యాభై ఏళ్ళక్రితం నాటి ఆర్థికపరిస్థితులలో కూడా తనకు చేదోడువాదోడుగా వీర్రాజుగారు వుండటాన్ని బలరాం గుర్తుచేసుకుని నాకు లక్షన్నర రూపాయలు పంపుతానని అన్నారు.కానీ నేను రిటైర్డ్ ప్రభుత్వ పెన్షన్ అందుకుంటున్నాననీ, పల్లవి సాఫ్ట్వేర్ వుద్యోగం చేసిందనీ మాకు ఆర్థికంగా ఇప్పుడు లోటు ఏమీలేదని గౌరవంగా చెప్పి డబ్బు పంపవద్దని కోరాను. "సరే మీ అడ్రస్ పంపండి పత్రిక పంపుతాను" అన్నారు. స్వాతిలో ప్రచురిస్తోన్న అసభ్యమైన సినీతారల చిత్రాలూ,సరసమైన కథలూ చూసి పత్రిక పంపవద్దని బలరాంగారికి వీర్రాజుగారు అప్పట్లో వుత్తరం రాసారు.ఆ విధంగా సుమారు గత మూడు దశాబ్దాలకు పైగా కాంప్లిమెంటరీ కాపీ స్వాతి పత్రిక మాకు పంపటం ఆగిపోయింది . ఇప్పుడు మళ్ళా పంపసాగారు. ఇంట్లో తిరుగుతూ,గలగల మాట్లాడకపోయినా ఇల్లంతా చిన్నబోయింది.కళ్యాణ్, అనురాగ్ ,కృష్ణ కుటుంబం,చిట్టీవాళ్ళూ,భారవీవాళ్ళూ, శ్రీదేవి వాళ్ళూ రోజూ వస్తూనే వున్నారు.మూడోరోజు శ్రీదేవి అందరికీ తానే భోజనం వండి తీసుకువచ్చింది.ఆ రోజున అందరూ ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు.అంతవరకూ దుఃఖం బయటపడకుండా వున్నా ఒక్క సారి ఇల్లు ఖాళీ అయిపోయే సరికి ముగ్గురం ఏడుపు ఆపుకోలేక ఒకరినొకరం హత్తుకుని దుఃఖించాం. 12 వతేదీ ఆదివారం కనుక ఆరోజు తాజ్ హోటల్ లో సంతాప సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని పల్లవి చేత బంధువులు అందరికీ ఫోన్ చేయించాను.మా పెద్దన్నయ్యకి చేస్తే మా వదిన ఫోన్ లో "ఇంట్లో పూజ చేయటం లేదా తక్కువలో అయిపోతుందనా హొటల్ లో చేసేస్తున్నారు " అంది.ఇంట్లో కంటే హొటల్ లో చేస్తే యింకా ఎక్కువౌతుంది అని తెలియదా.ఏమయితేనేం వాళ్ళు రాలేదు సరికదా కనీసం ఫోన్ లోనైనా నన్ను అన్నయ్య పలకరించలేదు. అదే విధంగా పెద్దాడబడుచు భర్తా ,పిల్లలూ కూడా అంతే.వీర్రాజుగారి తరపునా,మా నాన్నగారి తరపునా,పల్లవి అత్తగారి తరపునా దగ్గర బంధువులు కూడా ఎవ్వరూ రాలేదు,ఫోన్ లో కూడా పలకరించలేదు.బహుశా సక్రమంగా దైనందిన కర్మకాండ చేయలేదనేమో. రెండో రోజు నాళేశ్వరం శంకరం పల్లవిని స్మశానానికి తీసుకువెళ్ళి అతనే ఒక కుండలో అస్థికలు ఏరి వేసి ఇచ్చాడు.అది చూసి పల్లవి కదిలిపోయింది .ఇంటికి వచ్చాక ' ఏ బంధం వుందని శంకరం అంకుల్ ఇంత చేసారు' అని కన్నీళ్ళు పెట్టుకుంది.శ్మశానంవాళ్ళిచ్చిన పేపర్ మున్సిపల్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తేనే డెత్ సర్టిఫికెట్ వస్తుందని వివరాలు కూడా శంకరమే చెప్పారు. అయిదో రోజు మా మరిది చిట్టి,ఉషా మేము ముగ్గురం,భారవీ కలిసి ఉదయమే రాజమండ్రి బయలుదేరాము.శంకరం తాను కూడా వస్తాననీ రాత్రి డైరెక్టుగా కాలేజీ అయిపోయిన తర్వాత బస్ లో వస్తానన్నాడు.భారవే మినీ వేన్ మాట్లాడాడు.సాయంత్రానికి రాజమండ్రి చేరిపోయాము.హొటల్ లో డ్రైవర్ కి కూడా కలిపి నాలుగు రూములు రవిప్రకాష్ చేత బుక్ చేయించాము.హొటల్ కు రవిప్రకాష్ వచ్చి మాట్లాడాడు.మర్నాడు చేయాల్సిన ఆస్తిక నిమజ్జనం కోసం ఏర్పాటు చేయిస్తానని అన్నాడు. దేవాంగ సంఘం ఆయన ఒకరు వచ్చి మర్నాడు దేవాంగసంఘంలో సంతాప సభ నిర్వహిస్తున్నామని రమ్మని చెప్పాడు. అంతేకాకుండా శీలావారివీథిని శీలా వీర్రాజు వీథి అని మార్చటానికి ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నాము అని అన్నాడు.నేనేమీ మాట్లాడలేదు. ఆ సమయంలో బత్తుల ప్రకాశరావుగారు,గణేష్ రాం గారూ కూడా హైదరాబాద్ లోనే వున్నారు.అందువలన ఇక్కడ ఏపని కోసం వచ్చామో అది పూర్తి చేసుకోవాలనే ఆలోచన లోనే వున్నాను. ఉదయం చీకటితోనే తయారై గోదావరి ఒడ్డుకు బయలుదేరాము.బస్సులో వస్తానన్న శంకరం ఇంకా చేరక పోయేసరికి ఫోన్ చేసాను.రాజమండ్రికి డైరెక్ట్ బస్ తప్పిపోయిందనీ, విజయవాడ వరకూ వచ్చి మరో బస్ పట్టుకున్నాననీ,తాను తిన్నగా గోదావరి వొడ్డుకు వస్తానన్నాడు. మేము గోదావరి వొడ్డున పూజ చేయించాల్సిన పంతులు కోసం చూస్తుండగా శంకరం వచ్చి గోదావరినదిలో మునిగి పూజ దగ్గరకు వచ్చాడు.ఈ లోగా పంతులుగారు వచ్చి మరిదిచిట్టి చేత పూజ చేయించారు. తర్వాత పడవలో పంతులుగారితో బాటు చిట్టీ,భారవీ,శంకరం నది మధ్యకు వెళ్ళి నిమజ్జనం చేసి తిరిగి వొడ్డుకు వచ్చారు.ఒడ్డుకు రాగానే అక్కడ సిమెంట్ బెంచిమీద కూలబడి శంకరం వెక్కివెక్కి ఏడ్చాడు.అది చూసేసరికి ఎప్పటినుంచో అణచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా నాకూ వెళ్ళుకొచ్చేసింది.చిట్టి చేయటంలో ఇంకెవరూ లేరు కనుక అది అతనికి తప్పని బాధ్యత. ఏ వైపు చుట్టం అని ఈ శంకరంకీ వీర్రాజుగారికీ. ఏనాటి రుణానుబంధం.వుదయం సంగారెడ్డి వుద్యోగానికి వెళ్ళి రాత్రి అష్టకష్టాలు పడి బస్సుల్లో వచ్చి సమయానికి హాజరై తన చేతులారా అస్తికనిమజ్జనం చేసాడు.బహుశా మానస పుత్రుడు అయివుంటుంది అనిపించింది. అక్కడ నుండి భోజనం చేసి దామెర్ల రామారావు చిత్ర కళా పరిషత్ కు వెళ్ళి వీర్రాజుగారి గ్యాలరీ చూసాము.ప్రారంభోత్సవం నాటి జ్ణాపకాలు మనసులో మెదిలాయి.తర్వాత చుట్టుపట్ల ప్రాంతాలు కొన్ని చూసి గోదావరి హారతి చూసి హొటల్ కు తిరిగి వచ్చేసాము.మర్నాడు వుదయం జాంపేటకు వెళ్ళాము.మారిపోయిన ఇళ్లనీ ,ప్రాంతాన్నీ చూసి చిట్టీ,ఉషా బాల్య జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయారు.ఆనాటి తమ ఇంటినే చిట్టి గుర్తు పట్ట లేకపోతుంటే అంతకు ముందు వీర్రాజుగారు కూడా అదేవిధంగా ఆనవాలు పట్టకపోవటాన్ని చెప్పాను. తర్వాత దేవాంగసంఘంవారు నిర్వహించిన వీర్రాజుగారి సంతాప సభకు వెళ్ళాము.వాళ్ళంతా వాళ్ళకు తెలియని వీర్రాజుగారి గురించి మాట్లాడారు.దాని తర్వాత తిరుపతిలో దేవాంగ సత్రంలో ఒక గదిని వీర్రాజుగారి పేరిట కట్టించడానికి ఏడున్నర లక్షలు అవుతుందని ఒక కరపత్రం మాకు ఇచ్చి ఇద్దరు ముగ్గురు అందుకు కన్విన్స్ చేయటానికి ఊదరగొట్టేసారు.నాకు చికాకు అనిపించింది.మేము వచ్చిన,వున్న పరిస్థితి ఏమిటి? మా దగ్గర లక్షలు పోగు పోసుకుని వున్నామనుకున్నారా? ఒక వేళ వున్నా ఈ పరిస్థితుల్లో ఆ వత్తిడి ఏమిటి? ఏమీ మాట్లాడకుండా వూరుకున్నాము.హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం కట్టాము.ఈ సారి శంకరంకూడా మాతో బాటూ మినీ వేన్ లో వచ్చాడు. నేను సాహితీకారులకు ఫోన్ చేసి 12 వతేదీన నారాయణగూడ తాజ్ హొటల్ లో శీలావీ శ్రద్ధాంజలి సభ జరుగుతుందని చెప్పాను. ప్రత్యేకంగా శివారెడ్డి , గోపీ,నగ్నముని ,నిఖిలేశ్వర్, శిఖామణి వంటి దగ్గర మిత్రులకు సభలోమాట్లాడమని కోరాను. హైదరాబాద్ వచ్చాక పన్నెండో రోజు కార్యక్రమం గురించి ఏర్పాట్లు మొదలు పెట్టాము.జనసాహితి లక్ష్మీ, శ్రీధర్ తాజ్ హొటల్ లో వాళ్ళకు తెలిసిన ఆయన వున్నాడట, ఆరోజుకి వాళ్ళే బుక్ చేసారు.బానర్ చేయించాము. వీర్రాజుగారి గురించి వచ్చిన వ్యాసాలను సేకరించి దశదినకర్మనాటికి వచ్చేలా ప్రజాసాహితి ప్రత్యేక సంచిక ప్రచురించారు. దగ్గర బంధువులూ,మా కుటుంబానికి ఆత్మీయులు,మిత్రులూ,సన్నిహితులూ సుమారు రెండువందల మందికి పైగా హాజరయ్యారు. శివారెడ్డి,ఎన్ గోపీ,నగ్నమునీ,నిఖిలేశ్వర్,శిఖామణీ,శంకరం, ప్రసాద మూర్తి,ఎన్.వేణుగోపాల్ వంటి ప్రముఖులచే లక్ష్మి ప్రజా సాహితి వీర్రాజుగారి ప్రత్యేక సంచికను ఆవిష్కరింపచేసింది.అందరూ ఆత్మీయంగా మాట్లాడారు.బత్తుల ప్రకాశరావుగారూ మాట్లాడారు. ఆషీచేత ముగింపువాక్యాలు చెప్పించారు. బంధువులకూ, కుటుంబ మిత్రులకూ వీర్రాజు గారి పేరిట చిన్నవెండిగిన్నెలు పంచింది పల్లవి.సాహితీబంధువులకు వీర్రాజుగారి కవిత్వం సెట్, ఇంగ్లీష్ కథలపుస్తకం కవర్లలో పెట్టి అందజేసాము .తదనంతరం భోజనాలు చేసి వీర్రాజుగారికి ఘనంగా సంతాపం సమావేశం శ్రద్ధాంజలితో ముగిసింది.

నడక దారిలో -69

నడక దారిలో -69 వీర్రాజుగారు కరోనా సమయంలో ఇంట్లో వున్న కొడవటిగంటి, గోపీచంద్,మల్లాది, శ్రీపాద మొదలైన పాతతరం వారి పుస్తకాలు విపరీతంగా చదివేవారు.ఈ ఏడాది ఎందుచేతనో పుస్తకాలు చదవటం మానేసారు. మౌనంగా తనలోకంలో తాను ఉండేవారు. పుస్తకాలేవైనా చదవమని, ఏవైనా స్కెచైనా వేయమని అనేదాన్ని. ఒక్కసారిగా పెన్ను, పెన్సిల్ ముట్టకుండా తపోముద్రలో ఉండడం నాకు ఎందుకో చాలా భయం వేసింది. ఈ సారి కూడా వీర్రాజుగారి పుట్టినరోజుకి మంచి బేకరీ నుండి కేకు తెప్పించటమే కాకుండా పల్లవీ,ఆషీ కలసి ఇంట్లో కేకు తయారుచేసారు.ప్రతీ పుట్టినరోజుకీ తప్పకుండా పొనుగోటి కృష్ణారెడ్డి,నాళేశ్వరం శంకరం వస్తారు.ఈ సారీ అలాగే వచ్చారు. ఏదో ఒక సందర్భంలో తరుచూ ఎనభై మూడో ఏట చనిపోతానని ఒక కోయదొర చిన్నప్పుడు చెప్పాడని అంటూ వుండేవారు. లేదా సహస్ర చంద్రోదయం తనకు ఎప్పటికి అవుతుందని లెక్కలేయబోయేవారు. ఆషీని కాలెండర్ తీసుకు రమ్మని చెప్పి ఏడాదికి పౌర్ణమిలు ఎన్ని వున్నాయి లెక్క కట్టేవారు.మీకు జాతకాలు, జోస్యాలు నమ్మకం లేనప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తారు. మనసు పాడుజేసుకోడానికి తప్ప అని చేతిలోని కేలెండర్ లాక్కుని మందలించేదాన్ని. పంతులుగారిని పిలిచి సహస్రచంద్రోదయం చేసుకోటానికి ముహూర్తం పెట్టించమంటారా అని కోప్పడేదాన్ని. మాటిమాటికీ నీకన్నా నేను పదేళ్ళు పెద్దవాడిని అనీ, తానే ముందు వెళ్ళిపోతాననేట్లు మాట్లాడేవారు. మరణం వయసుని బట్టి రాదు అని వాతావరణాన్ని తేలిక పరచటమే కాకుండా రావూరి భరద్వాజ మొదలుకొని చాలామంది భార్యలమీద కావ్యాలు రాసారు, రాస్తున్నారు. నేనే ముందు పోతే మీరూ నా మీద ఓ కావ్యం రాస్తారా అని సరదాగా అడిగేదాన్ని. “నేను అస్సలు రాయను. అయినా రాస్తేనే నీపైన ప్రేమ ఉన్నట్లా” అని ఆయన తిరిగి అనేసరికి నేను చిన్నబుచ్చుకుని 'అలా ఐతే నేనుకూడా మీమీద రాయను' అని కోపంగా అనేదాన్ని. పుస్తకాలు చదవమనీ, ఫేస్బుక్ లో ఆర్టిస్టుల చిత్రాలు చూపించీ ఎన్నిరకాలుగా ఆయన మనసు మరల్చాలని చూసినా కుదిరేదికాదు.ఎప్పుడైనా అన్వర్ వేసిన చిత్రాలు సెల్ ఫోన్ లో ఫేస్బుక్ లోంచి చూపించమని అడిగేవారు.నేను నెచ్చెలిలో రాస్తున్న ఆత్మకథ నడకదారిలో చదవమని ఇచ్చేదాన్ని.బాగా రాస్తున్నాననే వారు. ఈలోగా మా ఆడపడుచు మాలతి సంవత్సరీకాలు వచ్చాయి.ఆమె పోయినపుడు పల్లవీ, నేనూ ఒమిక్రాన్ వైరస్ బారిన పడి వుండటం చేత వెళ్ళలేదు.ఈ సారి వెళ్ళాము.మామరిది వాళ్ళూ యూ.ఎస్ లో వుండటం వలన వాళ్ళు లేరు.కుక్కట్ పల్లి వాళ్ళు కూడా కొందరే వచ్చారు.శిరీష తోడికోడళ్ళు వచ్చారు.అంతే బయట వారిని ఎవరినీ పిలవలేదు. ఉద్యోగం పనిమీద కొన్ని నెలలకోసం హైదరాబాద్ కి బత్తుల ప్రకాశరావుగారి అబ్బాయి రావటంతో తల్లీ తండ్రీ కూడా వచ్చి వున్నారు.ఒకరోజు ప్రకాశరావు దంపతులు మా యింటికి వచ్చారు.ఆ రోజు మాత్రం వీర్రాజుగారు తన బాల్యమిత్రుడితో బాగానే కబుర్లు చెప్పారు.నాకు వచ్చిన సుశీలానారాయణరెడ్డి పురస్కారం గురించి గొప్పగా చెప్పి సన్మాన పత్రం చూపించారు.వాళ్ళు సాయంత్రం వరకూ వుండి వెళ్ళారు. ‌మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారాలు మూడేళ్ళవీ పెండింగ్ లో వున్నాయి.కమిటీ వాళ్ళం కరోనా కాలంలో ఎవరమూ కలుసుకోవటం కుదరలేదు.అంతే కాకుండా సుధామగారు చైతన్యపురిలో ఇల్లు అమ్మేసి కోకాపేటలో కొడుకు ఇంటికి దగ్గరలోనే అదే గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కొనుక్కుని వెళ్ళిపోయారు.అందువలన మాడభూషి కమిటీ అందరం కలిసినట్లు వుంటుందని అందరం బయలు దేరాము.అందరం కలిసి సందడిగానే గడిపాము.సాయంత్రంవరకూ వుండి వెళ్తామని లేచాము.సుధామ దంపతులు కూడా మాకు వీడ్కోలు చెప్పేందుకు సెల్లార్ వరకూ వచ్చారు.ఇక కారు కదలబోతుంటే కారులోంచి వీర్రాజుగారు దిగి సుధామగారిని ప్రేమతో ఆలింగనం చేసుకుని తిరిగి కారు ఎక్కారు. కుందుర్తి శతజయంతి పురస్కార గ్రహీతలు అందర్నీ సంప్రదించి వాళ్ళంతా పురస్కారం కొరకు హైదరాబాద్ రావటం కష్టసాధ్యంగా నిర్ణయించి,ఆ సమయానికి కుందుర్తి కవితకు కూడా ఇండియా రావటం కుదరదని మే 21 వతేదీన కుందుర్తి శతజయంతి ప్రతిభా పురస్కారాలు జూమ్ సమావేశంలో నిర్వహించాలని నిర్ణయించారు వీర్రాజుగారు.రాజమండ్రిలో మాకు ఇచ్చిన ముమెంటోలు బాగున్నాయని శతజయంతి పురస్కారాల మెమెంటోలకు కూడా స్వయంగా డిజైన్ వేసి వాట్సాప్ లో రవిప్రకాష్ కు పంపించి చేయించారు .అవి కూడా వచ్చేసాయి.అన్నీ నిర్ణయించుకున్నాడు కుందుర్తి కవిత తనకు యూ ఎస్ నుండి మరిది కుటుంబం వస్తుందని కార్యక్రమం పోస్ట్ పోన్ చేసి జూన్ లో పెట్టుకుందామని అంది.దాంతో వాయిదా పడింది. వాణిశ్రీ,ఎమ్వీ రామిరెడ్డి దంపతులను తీసుకుని ఒక రోజు అకస్మాత్తుగా వచ్చింది.రామిరెడ్డి కూతురి వివాహా ఆహ్వానపత్రిక ఇవ్వటానికి వచ్చారు.రామిరెడ్డి వియ్యంకుడు ఒంటరి నవల రాసిన సన్నపరెడ్డి వెంకటరెడ్డి అట. తీరా వాళ్ళు వచ్చేసరికి పల్లవీ,ఆషీ,నేనూ గోరింటాకు చేతులకు పెట్టుకుని వున్నాము.వాళ్ళు వద్దన్నా చేతులు కడుక్కుని గబగబా వచ్చాను.ఈ లోగా వీర్రాజుగారు వాళ్ళతో మాట్లాడుతూ వున్నారు.పెళ్ళికి తప్పక రమ్మని మరీమరీ పిలిచారు. పెళ్ళికి పరిమి రాలేమని ఇక్కడ రిసెప్షన్ కి వస్తామని చెప్పాము. ఆరోజు పల్లవీ,ఆషీ పల్లవి స్నేహితురాలి ఇంటికి వెళ్ళారు.సాయంత్రం విజిటర్స్ పార్కింగ్ లో మిల్లెట్సుతో చేసిన స్నాక్స్ ప్రదర్శన వుందనీ,వీలుంటే కొనమని చెప్పారు.సాయంత్రం లిఫ్టులో కాకుండా మెట్లు దిగి వెళ్ళాలని దిగుతుంటే చెప్పుజారి మెట్లమీద కూలబడ్డాను.మళ్ళాలేచి క్రిందికి వెళ్ళి కొనుక్కొని వచ్చాను.ఇంటికి వచ్చి వీర్రాజుగారితో మెట్లమీద జారిపడ్డానని చెప్తే,రెండు నెలలకి ఒకసారైనా పడటం నీకు ఆనవాయితే కదా అని నవ్వారు.నేను స్కూలికి వెళ్తున్న రోజుల్లో తరుచూ వచ్చేటప్పుడు లో షుగర్ అయిపోయి పడిపోయే దాన్ని.రిటైర్ అయ్యాక రెగ్యులర్ వాకింగ్ వలన ఆ సమస్య తగ్గింది.అందుకని ఆయన మాటలకి వుడుక్కున్నాను.అయితే అప్పుడు తెలియలేదు కానీ వెన్నులో చివరికొనకి బాగా దెబ్బతగిలి మర్నాటి నుంచి కూర్చోలేనంతగా నొప్పి ఎక్కువై నొప్పి తగ్గేందుకు మందువేసుకోవల్సి వచ్చింది.. వీర్రాజుగారు ఇటీవల రోజురోజుకూ బరువుతగ్గుతున్నారేమో అనిపించింది.పొట్టకూడా తగ్గింది.ఆయనకు హెర్నియా వుంది.అప్పుడప్పుడు నొప్పి వస్తోంది అంటున్నారు.డాక్టర్ దగ్గరకు వెళ్దాం అంటే ఒప్పుకోవటం లేదు.ఒక రోజు మధ్యాహ్నం నుంచి యూరిన్ కావటం లేదు అన్నారు.ఎండలు కదా మంచినీళ్ళు తక్కువ తాగారేమోనని మంచినీళ్ళు, తర్వాత బార్లీ,మజ్జిగా ఇస్తూనే వున్నాను.కానీ లాభం లేకపోయింది. రాత్రి వరకూ చూసాము.డా.సూర్యప్రకాష్ గారికి ఫోన్ చేసి అడిగాను.ఎండలవలన డీ హైడ్రెషన్ అయివుంటుంది.ద్రవపదార్థాలు ప్రతీ అరగంటకీ ఇవ్వమన్నారు.అప్పటికీ కాకపోతే లాబ్ టెక్నీషియన్ ను పంపుతాను అన్నారు.మాటిమాటికీ వాష్ రూమ్ కి వెళ్ళి ప్రయత్నిస్తూనే వున్నారు. రాత్రికి ఎప్పటిలాగే భోజనం చేసారు.కానీ ఇబ్బంది పడుతూనే వున్నారు.హాస్పటల్ కి వెళ్దామంటే ఒప్పుకోవటం లేదు. రాత్రి పది దాటిన తర్వాత వీర్రాజుగారు పడుతోన్న బాధ చూడలేక డా.సూర్యప్రకాష్ గారికి ఫోన్ చేసాను.ఆయన కేథడ్రాల్ పెట్టటానికి లాబ్ టెక్నీషియన్ ను పంపించారు.కాని సాధ్యం కాలేదని డాక్టర్ గారికి ఫోన్ చేసాడు.డాక్టర్ గారు యశోదాకి తీసుకుని వెళ్ళమని చెప్పటమే కాకుండా యశోదాలోని డాక్టర్ కి కూడా ఫోన్ చేసి మాట్లాడారు.ఓలా కారు బుక్ చేసుకుని పల్లవీ, నేనూ వీర్రాజుగారిని తీసుకుని యశోదా హాస్పిటల్ కు వెళ్ళాము.వెళ్ళేటప్పుడు కారులో ఆయన భయం వేసిందేమో నా చేతిని పట్టుకున్నారు.వీర్రాజుగారికి హాస్పిటల్ అంటే మొదటి నుంచి భయమే. యశోదా హాస్పిటల్ కి వెళ్ళేసరికి పన్నెండు గంటలు దాటింది.అయినా సూర్యప్రకాష్ గారు ఫోన్ చేయటం వలన కావచ్చు వెంటనే హాస్పిటల్ లో చేర్చుకుని డాక్టర్ వచ్చి చూసి ట్రీట్ మెంట్ చేయటం మొదలు పెట్టేడు.నాకు నాలుగు రోజుల క్రితం పడినప్పటి నొప్పి తగ్గలేదు .కూర్చోవటం కష్టంగా వున్నా పెయిన్ కిల్లర్ వేసుకుంటూ తిరుగుతున్నాను. డా. సూర్యప్రకాష్ గారు ఆరోజు వారి తండ్రి గారి తిథి అయినా కూడా హాస్పిటల్ కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఉదయానికి రూమ్ కి పంపించి వివిధ పరీక్షలు చేయాలని అన్నారు.పల్లవి ఇంటికి వంట చేసి నాకు బాక్సు తీసుకు రావటానికి వెళ్ళింది.అప్పుడు ఎకో టెస్ట్,అంజియోగ్రామ్ చేసి రూమ్ కు తీసుకువచ్చారు.యూరిన్ సమస్య తీరటంతో వీర్రాజుగారు అన్ని టెస్టులకు బాగానే సానుకూలంగానే వున్నారు. సాయంత్రం ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో కలిసి నన్ను ,పల్లవినీ పిలిపించి కౌన్సిలింగ్ అని చెప్పి మాట్లాడటం మొదలెట్టారు.హెర్నియాలో బాగా ఇన్ఫెక్షన్ ఉందనీ దానికి ఆపరేషన్ చేయాలన్నారు. దానికన్నా ముందు ఆయనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయనీ అందుకని ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి స్టంట్స్ వేయాలనీ సర్జరీ చేసినప్పుడు బ్లడ్ థిన్నర్ కొన్నాళ్ళు వాడాల్సి వుంటుందనీ,అందుకని అది ఆపిన తర్వాతే హెర్నియా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పటమే కాకుండా మమ్మల్ని హార్ట్ ఆపరేషన్ కి కన్విన్స్ చేయటానికి ప్రయత్నించారు.అది మాకు అర్థం కాలేదు.హెర్నియా ఇన్ఫెక్షన్ వల్లే యూరిన్ సమస్య వచ్చిందంటున్నారు.ముందు అది క్లియర్ చేయకుండా హార్ట్ ఆపరేషన్ చేయాలనీ దానికి మూడులక్షల పైనే అవుతుందనీ ఇప్పుడు వెంటనే ఒకటిన్నర లక్ష కట్టమన్నారు.హెర్నియాకైతే ఒకటిన్నర లక్ష అవుతుంది, బహుశా సాధ్యమైనంత రోజులనుండి డబ్బు పిండటమే కార్పొరేట్ హాస్పిటల్స్ లక్ష్యం.అబ్బూరి ఛాయాదేవి గారి అయిదు నక్షత్రాల కథ గుర్తువచ్చింది. మాకు కంగారుగా అయిపోయింది.ఆలోచించి చెప్తామన్నాము.డా.సూర్యప్రకాష్ గారి సలహా మేరకు మేము అసలు సమస్య హెర్నియా కదా ఆ ఆపరేషన్ ముందు చేసి కొంచెం ఆరోగ్యం కుదుట పడ్డాక హార్ట్ ఆపరేషన్ చేయమని అన్నాము. అంతే కాకుండా అంతకుముందు యశోదాలో పని చేసిన కార్డయాలజిష్టు డా.సూర్యప్రకాష్ గారికి ఫ్రెండ్ ,ఆయన చేత యశోదా డాక్టర్లతో మాట్లాడించారు.దాంతో మర్నాడు హెర్నియా ఆపరేషన్ చేస్తామన్నారు.ముందు డబ్బు కట్టించుకున్నారు. వెంటనే కళ్యాణ్ కీ,భారవీ వాళ్ళకీ ఫోన్ చేసి చెప్పాను.కళ్యాణ్,అనురాగ్ ఆ రాత్రికే బయలుదేరి బస్ పట్టుకుని ఉదయమే హైదరాబాద్ కు వచ్చేసారు.వాళ్ళని చూసాక నాకు ధైర్యం వచ్చింది.ఆపరేషన్ సమయానికి కవితావాళ్ళూ,భారవీ,శ్రీదేవీ వాళ్ళూ అంతా వచ్చారు.ఆపరేషన్ పూర్తై బయటకు తీసుకువచ్చేవరకూ నాకు గుండె దడదడలాడుతూనేవుంది.కానీ బాగానే బయటకు వచ్చేసరికి వూపిరి పీల్చుకున్నాను.తిన్నగా ఐసీయూలోకి తీసుకువెళ్ళారు. ఐసీయూలో వుండటం వలన మమ్మల్ని ఉండనీయలేదు.ఐనా రాత్రి ఏమైనా అవసరం వుంటుందేమోనని కళ్యాణ్,భారవీ ఒక్కోరోజు వున్నారు.ప్రతీరోజూ ఉదయం తొమ్మిదింటికల్లా హాస్పిటల్ నుండి యాభై వేలు కట్టమని ఫోను.అది కట్టడానికి వెళ్తేనే హాస్పిటల్ లోపలకి అనుమతి ఇస్తున్నారు.లేకపోతే రోడ్డు మీదే నిరీక్షణ.డబ్బు కట్టిన తర్వాత కూడా విజిటర్స్ సమయంలో వాళ్ళని బతిమాలుకుంటేనే ఒకరిని ఐసీయు లోనికి అనుమతి ఇస్తున్నారు.కళ్యాణ్, అనురాగ్ వచ్చారని చెప్పేసరికి ఆయనకి ధైర్యం వచ్చింది.వీర్రాజుగారు బాగానే కోలుకుంటున్నారు.అయినా హార్ట్ ఆపరేషన్ చేయటానికంటూ ఐసీయులోనే వుంచారు. ప్రతీరోజూ కౌన్సిలింగ్ అని మమ్మల్ని పిలిచి హార్ట్ ఆపరేషన్ కి కన్విన్స్ చేయటం మాత్రం మానలేదు.మేమూ,కళ్యాణ్ కూడా ఈ హాస్పిటల్ లో ఏమిటిలా జలగల్లా పట్టుకుని వీళ్ళే చంపేసేలా వున్నారని విసుక్కున్నాము.నాలుగురోజులు అయ్యాక కళ్యాణ్ వెళ్ళిపోయాడు. డా.సూర్యప్రకాష్ గారు " ఎట్టి పరిస్థితుల్లోనూ హార్ట్ ఆపరేషన్ కు ఒప్పుకోకండి.డా.ముఖేష్ కూడా ఈ వయసులో వీర్రాజుగారి గుండె మరో ఆపరేషన్ కి తట్టుకోలేదు.మొండిగా చేయాలనుకుంటే ఆపరేషన్ బెడ్ మీదే ఏమైనా జరగొచ్చు అన్నాడు.ముందు డిస్చార్జ్ చేయించుదాం"అన్నారు. వారం రోజులకి ఐసీయు పక్కనే వున్న రూమ్ కి షిఫ్ట్ చేసారు.రూమ్ కి వచ్చాక నేను అక్కడే వున్నాను.రూముకు వచ్చాక నా ఫొటో తీయు ఎలా వున్నానో నాకు తెలుస్తుంది అన్నారు.సరేనని ఫోన్ తో ఫోటోతీసి చూపిస్తే బనియన్ తో,చిరుగడ్డంతో చలంలా వున్నాను కదా అంటూ నవ్వారు.ఇంతవరకూ డబ్బు ఎంత కట్టారు అని పదేపదే అడిగారు. కానీ చెప్పలేదు.నడిపించటం అవీచేసాక డిస్చార్జ్ చేసారు.భారవీ,అనురాగ్ సాయం వుండటం వల్ల ఇంటికి జాగ్రత్తగా తీసుకువచ్చారు.హాస్పటల్ కి ఎంతయింది అని అడిగుతున్నామాట మార్చి చెప్పాను. ఇంటికి వచ్చాక బాల్య మిత్రుడు, ప్రకాశరావు,పొనుగోటి కృష్ణారెడ్డి,నాళేశ్వరం శంకరం మొదలైన వాళ్ళు వచ్చి కలిసారు.సత్యనారాయణ కూడా వస్తానంటే వీర్రాజుగారే ఇంత దూరం రాలేవు,ఫోన్ లో మాట్లాడుతూ వుందాములే అని అన్నారు.పొనుగోటి కృష్ణారెడ్డితో అన్వర్ గురించీ,అతను రాసిన రేఖాయాత్ర పుస్తకం గురించి,అతని బొమ్మల గుర్తించి చాలా ప్రశంసాపూర్వకంగా చాలాసేపు మాట్లాడారు. పదిరోజుల పైగా ఐసీయూలో వుండటం వలన భోజనం సరీగా లేక బాగా నీరసించిపోయారు.వాష్ రూంకి వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడుతూనే వున్నారు. ఆయనకు సహాయకుడుగా ఎవరినైనా పెట్టుకోవాలంటే ముగ్గురం ఆడవాళ్ళమే.అందులోనూ ఆషీ వయసులో వున్న పిల్ల.అనవసరంగా ఎవరో ముక్కూ మొహం తెలియని వాడిని పెట్టుకొని సమస్యల్లో చిక్కుకు పోతామేమో అనిపించింది.పోష్టు ఆపరేషన్ కేర్ కోసం కొన్ని వుంటాయని కొందరు సలహా ఇచ్చారు కానీ అవి కూడా హాస్పిటల్ లాగే వుంటాయి కదా . వీర్రాజుగారు మరింత కుంగిపోతారు.ఒక వారం పది రోజులు జాగ్రత్తగా వుండి మందులూ,భోజనం వంటికి పడితే మళ్ళీ బలం వస్తుంది.ఎటొచ్చీ ఆయన ధైర్యంగా వుండాలి.అనుకున్నాము.

11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

నడక దారిలో -68

నడక దారిలో -68 నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ డీటీపీ కూడా పూర్తి చేసాను.అనల్ప బలరాంగారికి పి.శ్రీదేవి కథల్ని " వాళ్ళు పాడిన భూపాలరాగం "పేరుతో పి.శ్రీదేవి కథల్నీ,"మథుకలశమ్" పేరుతో ఆమె కవితల్నీ సంపాదక బాధ్యత వహించాను.ఆ పరిచయంతో నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ ని వాళ్ళ బేనర్ పై ప్రచురిస్తారా అని అడుగుతే తప్పక ప్రచురిస్తానని అన్నారు.అయితే మరికొన్ని ప్రచురణలలో బిజీగా వున్నానని అవి అయిపోయాక చేస్తానన్నారు.ఆ పుస్తకానికి పల్లవి చేతే ముఖచిత్రం వేయించుతానని కూడా చెప్పాను.బలరాం సరేనన్నారు.మాలతి రచనలో విశాఖమాండలిక సొబగులే కాక విశాఖసంపంగి పరిమళాలు మనసుని తాకుతూనే వుంటాయని ముఖచిత్రంగా సంపెంగలతోనే డిజైన్ చెయ్యమని పల్లవితో చెప్పాను. ఆకాశవాణిలో పనిచేసే అయినంపూడి శ్రీలక్ష్మి తెలుగు విశ్వవిద్యాలయంలో డెప్యుటేషన్ లో డెప్యూటీ డైరెక్టర్ గా వచ్చింది.ఆమె అక్షరయాన్ అనే మహిళా రచయితల సంస్థని నిర్వహిస్తూ గత కొంతకాలంగా ఏవో వివిధ కార్యక్రమాలు చేస్తూనే వుంది.ఈ సారి తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో డెభ్భై ఏళ్ళ వయసు దాటిన రచయిత్రుల వివరాలు సేకరించి అందులో ఒక ముప్పై మందికి మాతృ వందనం పేరిట సత్కారం చేసే కార్యక్రమానికి పూనుకుంది. అందులో శారదా శ్రీనివాసన్, శారదా అశోక వర్ధన్,డి.కామేశ్వరి,హైమవతీ భీమన్న, అనంతలక్ష్మి,పోల్కంపల్లి శాంతా దేవి, ఇంద్రగంటి జానకీ బాల మొదలైన ముప్పై మందిలో నేను కూడా వున్నాను. ఎండలు బాగా వుండటంతో వీర్రాజు గారిని ఆ కార్యక్రమానికి రావొద్దని చెప్పి నేనూ పల్లవీ వెళ్ళాము.శ్రీలక్ష్మి రంగరంగవైభవంగా ఒక పండుగ వాతావరణాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణానికి తీసుకువచ్చింది.చీర,శాలువా,పళ్ళు,దండలతో ఘనంగా మమ్మల్నందరినీ వైస్ ఛాన్సలర్ చేతులమీదుగా సత్కారకార్యక్రమం నిర్వహించింది.తర్వాత విందుభోజనం ఏర్పాటు కూడా వుంది.అన్నీ అయ్యేసరికి మూడు దాటింది.ఆ సందర్భంగా మరో విషయం కూడా శ్రీలక్ష్మి వెల్లడించింది.ఈ మాతృ వందనం స్వీకరించిన వారినందరినీ వారివారి సౌలభ్యాన్ననుసరించి విశ్వవిద్యాలయం మీడియా థియేటర్లో రచయిత్రుల సాహితీ జీవితాన్ని ముఖాముఖిగా రికార్డు చేస్తామని చెప్పింది .అది చాలా మంచి ప్రయత్నం . చాలామంది పాతతరం రచయిత్రులకు ఇటువంటి అవకాశాలు లేకపోవటం వలన వారిగురించి ఏమీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ‌ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలు విని వీర్రాజుగారు కూడా చాలా సంతోషించారు. రాజమండ్రి దామెర్ల రామారావు చిత్రకళా పరిషత్ లో వీర్రాజు గారి పెయింటింగ్స్ అమర్చటం పూర్తి అయ్యిందని ప్రారంభోత్సవానికి తేదీ నిర్ణయించినట్లు రవిప్రకాష్ ఫోన్ చేసాడు. మేము వెళ్ళటం ఎట్లా అని ఆలోచించాను.ట్రైన్,ఫ్లైట్ అన్నింటిలో ఏదైతే వీర్రాజు గారు ప్రయాణం చేయగలరు అని తర్జనభర్జన చేసాము.ఆయనకి ప్రయాణంలో దారిప్రక్కల చుట్టూ చూసుకుంటూ రాజమండ్రి వెళ్ళాలని వుందని ఒకసారి అన్నారు.అంతేకాక ఇంతవరకూ పాపికొండలు చూడలేదు లాంచిలో వెళ్ళాలనే కోరిక ఎప్పుడో చెప్పింది గుర్తువచ్చి కారులో వెళ్ళాలని నిశ్చయించాం.ఒకసారి కారులో సంగారెడ్డి వెళ్ళి వచ్చాక ఆయనకి అంతసేపు కారులో ప్రయాణం చేయగలననే ధైర్యం వచ్చింది. మార్చి 12 న వుదయమే ఆరు గంటలకి నలుగురం కారులో రాజమండ్రికి బయలుదేరాం.డ్రైవర్ అరుణ్ తో మరీ స్పీడ్ గా కాకుండా నడుపమని చెప్పాము.దారిలో సూర్యాపేటలో టిఫిన్లకని ఆగాము.అరుణ్ దారిలో వీర్రాజుగారిని అవసరమైనపుడు వాష్ రూమ్ కి సహాయం చేసాడు. మధ్యాహ్నం భోజనానికి మరోసారి ఆగి ప్రయాణం కొనసాగించాము.దారిలో కనిపించిన వూర్ల గురించి ప్రత్యేకతలు గురించి వీర్రాజుగారు కబుర్లు చెప్పారు.సాయంత్రం నాలుగింటికల్లా రాజమండ్రి చేరాము. గణేష్ రాం గారు BRK హొటల్ లో రెండు రూములు బుక్ చేసారు.సాయంత్రం రవిప్రకాష్, గణేష్ రాం వాళ్ళూ వచ్చారు.ఆ హొటల్ లో డార్మటరీ లేదంటే గణేష్ రాం వాళ్ళ పెంట్ హౌస్ లో డ్రైవర్ వుంటాడు పర్వాలేదని భరోసా ఇచ్చారు.రాత్రికి పెరుగన్నం హొటల్ నుండి తెప్పించుకుని తిని తొందరగా నిద్ర పోయాము. మర్నాడు ఉదయం పల్లవీ ఆషీ తయారై టిఫిన్ కోసం దగ్గరలో హొటల్స్ చూస్తామని వెళ్ళి వాళ్ళు అక్కడే తినేసి మాకోసం పాక్ చేయించి తీసుకు వచ్చారు. పదింటికి గ్యాలరీకి బయలుదేరి వెళ్ళాము. వాడ్రేవు చిన వీరభద్రుడు గారితో పాటు ఆయన సోదరి వీరలక్ష్మి,వసుధారాణీ వచ్చారు.శ్రీరామ్ పుప్పాల,ఇంద్ర,ఎస్.ఆర్.పృథ్వి మొదలగు స్థానిక రచయితలు వచ్చారు.ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖకు చెందిన వాసిరెడ్డి పద్మ వచ్చారు. గ్యాలరీలో వీర్రాజుగారి పెయింటింగ్స్ అమర్చిన విధానం చూసి వీర్రాజుగారే కాదు మేము కూడా సంబరపడ్డాము.వీర్రాజుగారు చిత్రలేఖనం మెళకువలు నేర్చిన చోట,ఆయనకు అత్యంత ప్రియమైన గోదావరీ తీరాన వాటినన్నింటినీ చేర్చటం మంచిపనే చేసామని తృప్తి చెందాము.ఈ ప్రాంత ప్రజలకు,చిత్రకళాభిమానులకు వీర్రాజుగారి పెయింటింగ్స్ అంకితం చేస్తున్నామని మా కుటుంబం సభ్యులం అంతా సంతోషించాము. విజయనగరం నుండి కళ్యాణ్,జయ,వాళ్ళక్క శాంత,బావగారూ కూడా వచ్చారు. గ్యాలరీ ప్రారంభోత్సవం చేసిన వాడ్రేవు చిన వీరభద్రుడుగారు వీర్రాజుగారితో గల పరిచయాన్ని ఆత్మీయంగా తన ప్రసంగంలో చెప్పారు.వీర్రాజుగారు భావోద్వేగం వలన కొంత ,మరపువలన కొంత తడబడుతూ మాట్లాడారు.నా ప్రసంగంలో వీర్రాజుగారు ఒక మౌనమునిలా ధ్యానముద్రలో రోజుకు ఏడెనిమిది గంటలు కూర్చొని చిత్రాలు వేయటాన్ని గుర్తు తెచ్చుకుంటూ, చిత్రాలు పంపించటంతో బోసిపోయిన అల్మారాలు చిన్నబోయాయని చెప్తూ కంటనీరు పెట్టుకున్నాను. మొత్తంమీద గ్యాలరీలో వీర్రాజుగారి పెయింటింగ్స్ అంకితోత్సవం వైభవంగా జరిగింది.వీర్రాజుగారు ఆనందభరితులయ్యారు.భోజనానంతరం రూమ్ కి వెళ్ళి విశ్రాంతి తీసుకుని గోదావరి తీరానికి వెళ్ళి గోదావరి హారతి కార్యక్రమం చూసాము.సంధ్యాసమయంలో తైలవర్ణచిత్రంలా రంగులీనుతోన్న గోదావరి ఉపరితలాన్ని వీర్రాజుగారే కాక మేమంతా కళ్ళ నిండుగా చూసి ఆనందించాము. నేను రాజమండ్రి బయలుదేరటానికి ముందే డి.సుజాతాదేవి కూతురు కమలకి ఫోన్ చేసి మా కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించాను.సుజాతను చూడటానికి వస్తానని చెప్పాను.సాయంత్రం కమలకి ఫోన్ చేసి ఇంటి అడ్రస్ అడుగుతే తామే వస్తామని చెప్పింది .అలాగే కమల వాళ్లమ్మ సుజాతని మేమున్న హోటలుకు తీసుకువచ్చింది.సుజాత బాగా చిక్కిపోయింది.కానీ నన్ను బాగానే గుర్తుపట్టి మాట్లాడింది. కాని మధ్య మధ్యలో మౌనంలోకి జారిపోవటం చూసి నేను దిగులు పడ్డాను. కమల కూతురు గురించి కమలని అడుగుతే కూతురూ, అల్లుడూ ఇక్కడే వున్నారని కమల చెప్తుంటే.సుజాత కల్పించుకుని" మనవరాలికి సంబంధం కుదిరింది.పెళ్ళి చేయాలి " అంది.అంటే ఆ అమ్మాయికి పెళ్ళి జరిగిపోయిందనేది కూడా గుర్తులేక మాట్లాడుతోందని అర్థమై సుజాతను చూస్తుంటే దుఃఖం వచ్చింది.అదే నేను సుజాతను ఆఖరు సారి చూడటం అవుతుందని అప్పుడు వూహించలేదు . మర్నాడు పాపికొండలు ప్రయాణం పెట్టుకున్నాము.మాతో గణేష్ రాం దంపతులను కూడా ఆహ్వానించాము.డ్రైవర్ అరుణ్ మాతో పాటూనే వున్నాడు.చిన్న బల్లకట్టుమీదుగా లాంఛ్ లోకి వీర్రాజుగారిని ఎక్కించడానికి అరుణే సహాయం చేసాడు. లాంచ్ లో ఎంటర్టైన్మెంట్ కోసం ప్రోగ్రాం నిర్వహించారు.కానీ రెండర్థల పాటలు పిచ్చిగెంతులూ చికాకు అనిపించినా వీర్రాజు గారు గోదావరీ వీక్షణంలో మునిగిపోయి నన్నూ,ఆషీనీ తనకి నచ్చిన దృశ్యాల్ని ఫొటోలు తీయమని అడిగి తీయించారు.మొత్తంమీద పాపికొండల ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసాము. మర్నాడు గణేష్ రాం పెద్ద కారు అరేంజ్ చేసాడు దానిలో రాజమండ్రి పరిసరప్రదేశాలు చూడటానికి వెళ్ళాం. మధ్యాహ్నం వరకు చూసిన తర్వాత గణేష్ రాం శాంతి వర్ధన్ వికలాంగుల ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు.మానసిక వికలాంగులైన పిల్లలు వాళ్ళు చేసిన కాగితం గులాబీలు మాకు అందించి నమస్సులు చెప్పారు.ఒక్కసారిగా మనసంతా ఒక కుదుపు వచ్చినట్లుగా దుఃఖంతో పచ్చిముద్దలా అయింది.కళ్ళు చెమ్మగిల్లాయి. అక్కడే భోజనం ఏర్పాటు చేసారు.తిన్న తర్వాత మళ్ళా దగ్గరలో సూర్యదేవాలయం వుందంటే అది చూసి హొటల్ కు బయలుదేరాము.గణేష్ రాం వాళ్ళింటికి భోజనానికి పిలిచాడు .కానీ పిల్లలను పంపించి మేము ఎప్పట్లాగే పెరుగన్నం తెప్పించుకొని తిన్నాము . ఆ రాత్రి పడుకున్నాం కానీ ఇద్దరికీ నిద్ర రాలేదు.అకస్మాత్తుగా వీర్రాజుగారు నా గుండెల్లో తలదూర్చి వెక్కివెక్కి ఏడవటం మొదలెట్టారు.నేను గాభరా పడి ఏమిటని అడిగితే ఆ మానసిక వికలాంగులను చూస్తే మన బాబు గుర్తు వచ్చాడని ఏడుస్తూనే అన్నారు . అంతవరకూ వుగ్గబెట్టుకున్న నేనుకూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. కాసేపు అయ్యాక వీర్రాజుగారు ఆ ఆశ్రమానికి ఉపయోగపడేలా ఒక లక్షన్నర ఇద్దాం అన్నారు.నేనూ అదే అనుకున్నానని అంగీకారం తెలిపాను.ఆ తర్వాత వీర్రాజుగారు పడుకున్నా చాలా సేపు నాకు నిద్ర పట్టలేదు.బాబు బతికుంటే ఈ పాటికి నలభై ఏళ్ళు దాటి వుండేవి.ఆ వయసు మానసిక వికలాంగుడైన పిల్లాడిని సాకగలిగి వుండగలిగేదాన్నా? నిజానికి అలా జరిగి వుంటే నాలోకి నేను ముడుచుకు పోయి ఏమైపోయేదాన్ని.నన్నూ,నా కలల్ని సాకారం చేసుకోమనే బాబు మా జీవితాల నుండి నిష్క్రమించాడా? ఆలోచించి ఆలోచించి అలసిపోయి నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు బ్రేక్ ఫాస్ట్ కి గణేష్ రాం ఇంటికి వెళ్ళాము. దగ్గరలోనే వీర్రాజుగారి బాల్య మిత్రుడు చింతపంటి అప్పారావు యిల్లు.అతను బెడ్ రిడన్ అని తెలిసి వెళ్ళి చూసి వద్దామని అన్నారు.బెడ్రిడన్ అంటే ఏ పరిస్థితుల్లో వున్నాడో? వీర్రాజు గారు తట్టుకోగలరో లేదో అని వెళ్ళటానికి భయపడ్డాను.కానీ వీర్రాజుగారు ఇంతవరకూ వచ్చి చూడటానికి వెళ్ళకపోతే ఎలా అని పట్టుపట్టే సరికి వెళ్ళాము.అప్పారావుగారు బాగానే వున్నారు.నన్నూ, పల్లవినీ గుర్తుపట్టి చక్కగా పలకరించారు.కాసేపు మిత్రులు మాట్లాడుకున్నాక బయల్దేరాము. గణేష్ రాం గారి తోటలో పండిన పళ్ళు,కాయలతో కారు డిక్కీ నిండిపోయింది.దారిలో తినటానికి దబ్బకాయ పులిహోర, జున్ను,పెరుగుగారెలు లలిత ఇచ్చింది.దారిలో తినగా ఇంటికి వెళ్ళాక డిన్నర్ కి కూడా అవే సరిపోయాయి.క్షేమంగా మా ప్రయాణం జరిగింది. నాలుగు రోజులకు కళ్యాణ్ విశాలాంధ్ర పేపర్లో చిన్నాన్న గారి పెయింటింగ్స్ గ్యాలరీలో ప్రారంభం గురించి రాసిన వ్యాసం అని పేపర్ కటింగ్ పంపించాడు." గుండె గ్యాలరీలో శీలావీ చిత్రాలు" అనే ఆర్టికల్ వీర్రాజుగారికి చదివి వినిపించాను.చక్రవాకం కాలమ్ లో ముక్కామల చక్రధర్ అనే ఆయన రాసినది.బాగా రాసాడని వీర్రాజుగారు సంబరపడ్డారు.రామోజీమీద పుస్తకం రాసినది అతనేనేమో అన్నారు.ముక్కామల చక్రధర్ పేరు క్రింద ఫోన్ నెంబర్ వుంటే ఫోన్ చేసాను. రామోజీ మీద రాసిన అతను వేరే అని తెలిసింది.ఇతను విశాలాంధ్రలో ప్రతి శనివారం చక్రవాకం పేరుతో కాలమ్ రాస్తానని చెప్పారు.అప్పటినుండీ ముక్కామల చక్రధర్ ఫోన్లో కాంటాక్ట్ లోనే వుండటం, విశాలాంధ్రలో ప్రతీ శనివారం చక్రవాకం కాలమ్ పంపుతుంటే క్రమం తప్పకుండా చదువుతూనే వున్నాను. రాజమండ్రి నుంచి వచ్చిన దగ్గర నుంచి చిన్ననాటి మిత్రుడు సత్యనారాయణను చూడటానికి వెళ్దామని పదేపదే అనటం మొదలు పెట్టారు.వేసవి ఎండలు ముదురుతున్నాయి.సత్యనారాయణ వుండేది ప్రగతి రిసార్ట్ లో కట్టించిన ఇంట్లో.సత్యనారాయణ గత ఆరేడు నెలలుగా తీవ్రఅనారోగ్యం వలన తరుచూ హాస్పిటల్ కీ,ఇంటికీ మధ్య తిరుగుతూ వున్నాడు.తరుచూ స్నేహితులు ఇద్దరూ వీడియో కాల్ ద్వారా మాట్లాడు వుంటూనే వున్నారు.అందుకని ఎండలు తగ్గిన తర్వాత వెళ్దామని నేను సర్ది చెప్పి బోయాను.కానీ వీర్రాజుగారు మొండిపట్టు పట్టారు. ఒకరోజు ధర్మేంద్రకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న ఇంట్లోవున్నారా,హాస్పిటల్ లో వున్నారో కనుక్కుని మేము వస్తామని ఫోన్ చేసాను.ఇంట్లోనే వున్నారని తెలిసి నేనూ, వీర్రాజుగారూ ప్రగతి గార్డెన్స్ లో వున్న ధర్మేంద్ర ఇంటికి వీర్రాజుగారి బాల్య మిత్రుడు సత్యనారాయణని చూడటానికి వెళ్ళాము.చాలా సన్నగా అయిపోయి వీల్ ఛైర్ లోనే వున్నాడు. సత్యనారాయణ భార్యా హైమా, ధర్మేంద్ర ఆయన అనారోగ్యం గురించి చెప్తుంటే నాకూ, వీర్రాజు గారికీ కూడా మనసంతా బాధతో నిండిపోయింది.కొంతసేపు కబర్లు అవీ అయ్యాక " వీర్రాజూ మెర్సీ కిల్లింగ్ కు ఎలా సంప్రదించాలో కనుక్కుని చెప్తావా "అని సత్యనారాయణ అనేసరికి వీర్రాజుగారూ,నేనూ దిగ్భ్రమతో అలానే వుండిపోయాము.రెండు నిముషాలకీ నేనే తేరుకుని " అదేం మాటలండీ.శరీరం అన్నాక ఏవో అనారోగ్యాలు వస్తూనేవుంటాయి.అలాంటి నిర్ణయాలు మనసులోకి రానీకండీ"అని సీరియస్ గా అన్నాను.వీర్రాజుగారు కూడ నా మాటలను బలపరుస్తూ సత్యనారాయణ ను సముదాయించారు."ఇలాగేనండీ పదేపదే అంటూ ఆయన బాధపడి మమ్మల్ని బాధిస్తున్నారు" అంది హైమ. " లేదు వీర్రాజు ఎక్కడికక్కడ శరీరంమీద వివిధ చికిత్సల కోసం ట్యూబులు పెట్టి ఇంజెక్షన్లతో ఒళ్ళంతా చిల్లులు పొడి చేస్తున్నారు.భరించలేకపోతున్నాను"అంటూ నిస్పృహతో మాట్లాడారు.హైమకూడ ఇలాగే నిస్పృహతో మాటిమాటికీ అంటున్నారని బాధ పడింది. మరో రెండుగంటలు అక్కడే ధైర్యం చెబుతూ గడిపి వీడ్కోలు చెప్పి ఇంటికి తిరిగి వచ్చాము.సత్యనారాయణ కోడలూ,మనవరాళ్ళూ తాతా నాన్నమ్మలతో అంటీముట్టనట్లు వుండటం గమనించాము.ఇంటికి వచ్చాక కూడా సత్యనారాయణ ,హైమాల జీవన పరిస్థితుల గురించి తలుచుకుంటూ బెంగ పడ్డాము. - శీలా సుభద్రాదేవి

ప్రసాద మూర్తి - సగంపిట్ట కథలు

~ సౌజన్య(ప్రసాద)మూర్తి పలవరింతే " సగంపిట్ట"కథలు~ "జీవిత తత్వాన్నీ దాని కీలకాల్నీ అర్థంచేసుకున్న ఆలోచనాపరుడి కథలివి. ఈ దుర్మార్గ సమాజంలో కుల, మత, లింగ, వర్గ భేదాలతో ముక్కలై గ్లోబలీకరించబడిన ఈనాటి జీవితంలో ఒక్కొక్క బతుకు ముక్క ఒక్కొక్క రూపంలో కనిపించే వాస్తవాన్ని బలంగా పట్టుకున్న కథలివి. జీవితాన్ని ముందుకు నడిపించే చైతన్యాన్ని నిరాడంబరంగా వ్యక్తీకరించిన కథలివి." అంటారు ప్రసాద మూర్తి కథలసంపుటి ' సగంపిట్ట'ముందుమాట లో-జి. లక్ష్మీనరసయ్యగారు. కవిత్వంలో వస్తువేదైనా దానికి అనుగుణమైన భావాన్ని అద్భుతంగా పొదగగల నైపుణ్యం, చదువరులకు హత్తుకునేలా సమకాలీన సమస్యలనూ కవితామయం చెయ్యగల కవిగానే ఇన్నాళ్ళూ ప్రసాదమూర్తి కనిపించారు. తన చిన్నప్పటి ఊరు గురించి రాసినా,కురిసిన వాన గురించి రాసినా పసివాడిలా పలవరిస్తాడు.తర్వాత రోజుల్లో నివసించిన నగరజీవితం అతడిలోని సున్నితత్వాన్ని,భావుకత్వాన్నీ, సౌకుమార్యాన్ని కబళించలేదు అనేది అతడి ప్రతి కవితలోనూ సుస్పష్టమౌతూనే వుంటుంది. ప్రసాద మూర్తికి సమాజం వేరు కవిత్వం వేరు కాదు. కవితా దృష్టి, సామాజిక చైతన్యం రెండూ ఒకదానిలో ఒకటి అంతర్లీనంగా సాగేదే అతని కవిత్వం. ఇలా ఇంతకాలం ఒక కలనేత కవిగానే చూసి,పూలండోయ్ పూలు అంటూ అందించిన అతని బుట్టెడు కవిత్వ పరిమళాల్నీ హత్తుకున్నాను,దాంతో బాటూ కంటిచూపుకి తగిలి చురుక్కుమనిపించిన ఘాటైన పొగలకీ వుక్కిరి బిక్కిరి అయ్యాను. సగంపిట్ట మా లైబ్రరీలోకి వచ్చి ఎప్పుడు దూరిందో కానీ ఇటీవలే నా చేతిలో వాలింది‌.ఇదేమిటండీ బాబూ సగం పిట్ట కాదు మనల్ని పూర్తి పిట్టల్ని చేసి ప్రకృతి ఆవరణాల్లోకో, సమాజం మూలాల్లోకో ,లేకుంటే మనలోకి మనల్నో నెట్టేసి ఆలోచనల్ని,మనజీవితాల్నీ తడుముకునేలా చేసేస్తాడు ఈ రచయిత. అందుకే "పూర్తి పిట్ట రాసిన కథలివి. మరందుకే " ప్రకృతిపట్ల అపారప్రేమతో, ఘనీభవించిన మానవుడిపట్ల తీవ్రనిరసనతో, కవి హృదయంలో మొలకెత్తిన ఈ కథలు చదువరుల గుండెల్లో పుష్పిస్తాయి. భుజాన చెయ్యెయ్యడంతో ప్రారంభమై ధడేల్ ధడేల్మని మన తలుపుల్ని తెరిచి కానీ వదలవు. సరళంగా సూటిగా స్నేహభాషణలా సాగే కథనం- మరచిపోయిన మనలోపలి ప్రాంతంలో మనల్ని సుకుమారంగా వొదిలేసి వీడ్కోలు తీసుకుంటుంది" రమణజీవి అన్నారనుకుంటాను. మొదటి కథ అనామక మరణం చదివేటప్పటికే గుండె పట్టేస్తుంది.నిజమే ప్రతీ మనిషిలోనూ ఒక అనామకుడు దాగే వుంటాడు.ప్రతీరోజూ పసిపిల్లలను రక్తసిక్తల్ని చేస్తున్నవార్తలో,యుద్ధాలలో అమాయకపసిప్రాణాల్ని , గర్భస్థ శిశువుల్ని బలిగొన్న వార్తల్నో, గోధ్రా సంఘటనల్ని కడుపులో పేగుల్ని నులిమేసే వార్తల్నో వింటూనే వుంటాం.అల్జిమీర్స్ వచ్చిన వాళ్ళలా మర్చిపోవటానికి ప్రయత్నాలు చేస్తాం.మర్చిపోలేం మనలోని మనిషి మరణిస్తే తప్ప .అదెప్పుడు జరుగుతుంది ఈద్వైదీ భావాన్నే ప్రసాద మూర్తి తనకథలో రచయిత రాయాలనుకున్న కథలో అద్భుతంగా చిత్రించిన కథ అది. ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్నీ, తనకు సంబంధించిన దానిగా తనలో ఆవాహన చేసుకుని మానవీయ సంబంధాల్లోంచే చూసే సౌజన్యమూర్తి ప్రసాదమూర్తి.మనిషి సంఘజీవి అని నమ్మిన కథకుడు సమాజంలో జరుగుతోన్న దుర్ఘటనలకు కదిలిపోతాడు.నిజానికి ఈ కథ దీర్ఘ కవిత్వంలా సాగుతుంది పల్లెలో పనుల్లేక నగరబాట పట్టిన "బంగారమ్మ" చాలాకాలానికి సంక్రాంతి పండుగకి పల్లెటూరికి వస్తుంది.తమ అరెకరం పొలాన్ని కళ్ళారా చూసుకోవాలని బయలుదేరిన బంగారమ్మతో పాఠకులు కూడా నడుస్తారు.దారిపొడవునా కలలో నడుస్తున్నట్లు నడుస్తూ గతాన్ని పునశ్చరణ చేసుకుంటున్న బంగారమ్మతో బాటూ పాఠకులూ ఆ దృశ్యాల్ని కలగంటారు.తన అరెకరం పొలంకోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ చేపలు చెరువులోనే అదృశ్యమై మర్నాడు పైకి తేలిన బంగారమ్మ కథగా చెప్పినా పైకి తేలని బతుకులెన్నో ఆ పంక్తులలో పాఠకులకు దర్శనమిస్తాయి.ప్రకృతినిప్రేమించే భావుకుడైన ప్రసాద మూర్తి ప్రతీ వాక్యాన్ని హృదయభాషలో రాసాడనిపిస్తుంది. చేపలూ,రొయ్యల్తో పసరెక్కిపోయి చెరువులైపోయిన పొలాల్నీ ,చేపల కోసం వస్తున్న పిట్టల్ని తరమటానికి పేల్చే తుపాకి శబ్దాల్ని పాఠకులూ వింటారు. పల్లెల్లో సైతం గడ్డిలేక ఎండిపోతోన్న పశువులకు గడ్డి ,చెరువులు లేక మంచినీళ్ళనూ బయటనుండి కొనుక్కొని రావాల్సిన దుస్థితి , విధ్వంసం అయిపోతున్న పల్లెల ముఖచిత్రాన్ని ఈ కథలోని పంక్తులు దృశ్యీకరణచేస్తాయి. పరుగులు తీస్తున్న కాలంతో పాటూ పరుగులు తీస్తున్న మనిషికి పక్కనే వున్నవారిని పట్టించుకునే తీరికాలేదు.మనసూ లేదు.తన చుట్టూ తానే పరిథులు గీసుకుని బతుకుతున్న మనుషుల మధ్య గోడలు పెరిగిపోతున్నాయి.ఆ దృశ్యమే ఈ " పక్కన కూర్చున్న వ్యక్తి" కథ రైల్వే స్టేషన్ లో ఓ మూల రెండు ముసలిబొమ్మలు ఎడమచేతుల్ని చాచి వుండటం కథకుడు ప్రతీరోజూ గమనిస్తాడు.ఆ చాచిన చేతులు అందుకొని పిల్లలు తమని తీసుకు వెళ్తారనేమో అనుకుంటాడు.వాళ్ళకు కొంత డబ్బు సేకరించి ఇచ్చి భరోసా కల్పించాలనుకుంటాడు. కథకుడు నివసించే కమ్యూనిటీలో రామారావు దంపతులు పిల్లల ఫోన్ కాల్స్ కోసం అడుక్కుంటూ ఉన్న ముసలి బొమ్మలు,సుందరం దంపతులు పిల్లల నుంచి కాసింత సమయాన్ని అడుక్కుంటూ ఉన్న ముసలి బొమ్మలు.ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వున్నా ఏటిఎమ్ కు పోయి డబ్బు తెచ్చుకోలేని ఎన్నో ముసలి బొమ్మలు.ఇవన్నీ చదువుతుంటే దేశమే ఒక వృద్ధాశ్రమంగా మారిన దుస్థితి గుర్తుకువస్తుంది.అఃదర్నీ సంప్రదించి డబ్బు సేకరించి స్టేషన్లో ముసలిబొమ్మలకీ ఇవ్వాలనే తమ వుద్దేశ్యం చెప్పకుండా వాళ్ళు చూసేందుకు చాలా ముసలి బొమ్మలు రాబోతున్నాయని చెప్పేసరికి స్టేషన్ లోని ముసలి బొమ్మలు తమకు స్థాన భ్రంశం చేస్తారేమోనని ముందే వెళ్ళిపోతారు.అనేకవిధాలుగా ఒంటరివృద్ధాప్యాన్ని రచయిత కవితాత్మకంగా చెప్పాడు. ఆంధ్రా తెలంగాణ విభజన నేపధ్యంలోని కథ జన్మభూమి.ఏ ప్రాంతమైనా దోచుకునేవారు ఎవరైనా దోపిడికి గురైన వారు మాత్రం ఎప్పుడూ ప్రజలే.అందుకే ఒకప్పుడు వలస పక్షుల రాకతో ప్రత్యేకత కలిగిన కొల్లేరు సరస్సు ఈ నాడు నామరూపాలు లేకుండా విధ్వంసానికి గురైంది.వివక్షలూ అలాగే వూరి చివరనే యథాతథంగా వుండిపోతూనే వున్నాయి. వందరెక్కలు వున్నా సరే స్త్రీ తనకు తానుగా ఎగిరిపోవాలనే ఆలోచనే రాకుండా పిల్లలూ,కుటుంబం,బాధ్యతలూ ఆ రెక్కల కిందనే భద్రంగా దాచుకుంటూనే వుంటుంది.మనసు గాయపడినప్పుడో ,ఒంటరిగా మిగిలిపోయినప్పుడో ఒక్కొక్క రెక్కే విరుచుకోవాలనుకుంటుంది. కాలాతీతవ్యక్తులు నవలలో ఇందిర "రెక్కలున్నాయనుకొని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అవి తడిసిపోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది."అంటుంది. ఈ కథలో కూడా ఎగిరిపోతుందేమోనని అనుమానంతో అమ్మకు ఒకతోడుకోసం సహకరించాలనుకున్న పిల్లలకు "ఒకసారి పెళ్ళిచేసుకుని అనుభవించిన దానిని,మళ్ళా ఆ రొంపిలో వెళ్ళాలనుకోవటంలేదు." అంటుంది.స్త్రీ దృష్టి కోణంలో స్త్రీ మనసులోని ఆలోచనలను ఒడిసిపట్టి రాసిన కథ" వందరెక్కల స్త్రీ" బసమ్మ చెవిపోగులే కాదు చెమటతో తడిచిన తాళిబొట్లని సైతం కుదువ పెట్టుకొని బడుగు వర్గాల స్త్రీ పురుషుల జీవితాల్ని మత్తులో ముంచేసే కల్లు కాంపౌండ్ లకు అదుపు ఎక్కడ. గుజరాత్ లో మతకల్లోలపు మారణహోమం సాగిన రోజులవి. గోద్రా రైలు దుర్ఘటన తర్వాత గుజరాత్ లో జరిగిన హింసాత్మక అల్లర్లు కుటుంబంతో "రైలు ప్రయాణం " చేస్తున్న కథకుడికి ఒక్కటొక్కటే గుర్తుకు రావడం ప్రారంభమైంది. చెప్పులూ, సామానేకాదు పిల్లల్ని ఎత్తుకుపోవడంలో ఎత్తుకు పైఎత్తులు వేసేవాళ్ళకి రైలుబళ్ళు నిలయాలు. కంటిమీద కునుకు పట్టని కథకుడికి ఆ పెట్టిలోకి ఎక్కిన ముస్లిం యువజంటని చూసేసరికి ఉగ్రవాదులేమోనని గుండె దడదడ లాడుతుంది.చివరికి ఏమీ జరగకుండా ప్రయాణం పూర్తి అవుతుంది. కుల,మత,జెండర్, ప్రాంతీయ వివక్షలతో పక్కనే వున్న వ్యక్తిని అనుమానిస్తూ భయపడేలా చేసినది ఈ వ్యవస్థే అనే ఎరుక కలిగించేకథ ఇది. ఇలా ప్రసాద మూర్తి రాసిన కథలన్నింటిలో కొన్నిచోట్ల పేరాలకు పేరాలు కవితాత్మకంగా పాఠకుల్ని ఆకట్టుకుంటాయి.కవి సున్నిత హృదయం ప్రతీ కథలోనూ కనిపిస్తుంది. మానవ తప్పిదాలు వలన విధ్వంసం అయిపోతున్న ప్రకృతి దృశ్యాలు,,అనేక విధాలుగా మానవ స్వార్థంతోనే కాలుష్యభరితమైపోతోన్న పర్యావరణం,దాంతో బాటుగా మారిపోతున్న జీవనవిధానాలూ,తప్పని పరిస్థితుల్లో యాంత్రికంగా మారుతోన్న మనిషిని చూసి ఆవేదన చెందుతాడు.ఏమీ చేయలేని అసహాయత తో ఆక్రోశం చెందుతాడు.సమాజంలో పసిపిల్లల మీదా,స్త్రీలమీదా జరుగుతోన్న లైంగిక దాడులకు తల్లడిల్లుతాడు,జాతిమత వివక్షలకు బలి అయిపోతోన్న అసహాయులను చూసి కుంగిపోతాడు. ఇదిగో ఇవన్నింటినీ దృశ్యాలు దృశ్యాలుగా చిత్రించి ఈ కథలన్నింటా పేర్చాడు.ఇవన్నీ చూస్తూ కూడా మనం పరిధులు చుట్టుకుని అల్జిమీర్స్ వచ్చిన వారిలా ఏంకానట్టుగా మర్చిపోయి ఎలా బతకగల్గుతున్నామని వాపోతాడు రచయిత. మరి అందుకే పాఠకులు కూడా ఒక్కొక్క కథా చదువుతూ ఇంకా మనం మనుషులుగానే వున్నామా అని అనుమానపడతారు. పూలండోయ్ పూలు లో మనుషులంతా పూలైపోవాలని కలవరించిన రచయిత కనుకే సువర్ణ గన్నేరు పూలు లాంటి కథ రాయగల్గాడు.ప్రకృతి ఏదీ తిరిగి ఆశించదనే సత్యాన్ని అన్వేషించినవాడై చెట్టే చేతులు పట్టుకొని తీసుకెళ్ళినట్లుగా అనాథాశ్రమంలో ప్రవేశిస్తాడు.ఫాల్గుణమాసంమొదలైందంటే ఆ దంపతులు గుండెల్లోను పూలువిచ్చుకున్న చప్పుళ్ళు వినబడతాయి. కథలన్నింటా కథకుడు ఎలా కలవరించాడో చదివిన తర్వాత వెంటాడుతోన్న ఈ కథలన్నీ ఛానెల్స్ లోను,వార్తా పత్రికలలోనూ తిరిగి తిరిగి కనబడుతోంటే పాఠకులు కూడా కొండలు గుట్టలు అడవులు ధ్వంసం చేసి కట్టిన హై రేంజ్ అంతస్థులలోని కృత్రిమ వనాల్లో పూర్తి పిట్టలై ఎగరలేక సగంపిట్టలై పలవరిస్తారు,తమ అసహాయతకు సిగ్గు పడతారు.మానవ సంబంధాల్నీ, మనిషి బ్రతుకునీ ఉన్నతీకరించడంపై కథకుడికి గల అమితమైన శ్రద్ధ వలనే పూలతోనో,చేలతోనో, చెట్లతోనో,పిట్టలతోనో మనిషికి పాఠం చెప్పిస్తాడు. చాలా వరకూ ఉత్తమ పురుషలోనే రాసిన " సగం పిట్ట "కథలు ప్రసాదమూర్తి సాత్వికుడైన కవి కావటం వలన కావచ్చు సున్నితంగా,సరళమైన శైలిలోనే రాసినా నిజానికి ఆ పాఠాలు పాఠకుల హృదయాలను కూడా పట్టి కుదుపుతాయి. - శీలా సుభద్రాదేవి సృజనక క్రాంతి

26, ఆగస్టు 2026, బుధవారం

నవతరాల మేథోవికాసానికై శ్రీనాథ్ కథలు

~ నవతరాల మేథోవికాసానికై శ్రీనాథ్ కథలు ~ భారతదేశమే కాదు ఏదేశమైనా పిల్లలకు బుద్ధులు నేర్పించటం అమ్మ ఒడి నుండే ప్రారంభం అవుతుంది.పిల్లలకు తల్లిదండ్రులు కాకుండా పరిచయం అయ్యేది జంతువులూ,పక్షిజాతులే. అక్షరం దిద్దకముందే అమ్మా, అమ్మమ్మా ,నాన్నమ్మలు పిల్లల్ని రాత్రి నిద్రపుచ్చుతూ అనగనగా అంటూ చెప్పే తొలికథల అల్లికలు జంతువుల చుట్టూనే. అందుకేనేమో విష్ణుశర్మ కూడా జంతువుల ద్వారానే పంచతంత్రకథలు బోధించారు. ఈ నాడు ప్రపంచీకరణ ప్రభావం వలన ప్రతి వ్యక్తీ జీవితంలో పరుగులు పెడుతున్నాడు.ఒత్తిడి నిండిన చిన్నికుటుంబాలలో తల్లిదండ్రులకు కెరియర్ పరుగుల్లో చిన్నపిల్లలకు కథలు చెప్పేంత తీరిక లేదు.అమ్మమ్మలూ,నాన్నమ్మలకూ దూరమయ్యారు.మరి ఇక పిల్లలకు విద్య కన్నా ముందుగా విలువలు నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? అదిగో అందుకేనేమో శ్రీనాథ్ వాడపల్లి బాలల కోసం ఆలోచించాడు . భారతదేశంలో టీచర్,కవీ ,రచయిత అయిన తండ్రి ఒడిలో అతని బాల్యం గడిచింది .చిన్నప్పటి నుండీ ఇంట్లో ఉన్న పుస్తకాలమధ్య సృజనాత్మక వాతావరణంలో పెరగటం అతనిలో మేధో ఉత్సుకతను పెంపొందించాయి. భారతదేశంలోనే పెయింటింగ్, గ్రాఫిక్స్‌లో శిక్షణ పొందిన శ్రీనాథ్ తదనంతరం ఫ్రాన్స్, లండన్ కళాకేంద్రాల్లో చదువుకున్నాడు. డాక్టరేట్ ,ఫెలోషిప్‌లు, గ్రాంట్లు అందుకున్నాడు. భారతదేశంలోనే కాక ఫ్రాన్స్, UK, ఆఫ్రికా, USA లాంటి విదేశాలలోని యూనివర్సిటీల్లో సైతం విద్యార్థులకు పెయింటింగ్, గ్రాఫిక్స్ నేర్పిస్తున్నాడు.. అంతటితో అతని అంతరంగం శాంతించలేదు. అయిదు నుండి పది ఏళ్ళ వయసు పిల్లలకు కుటుంబసభ్యుల మధ్య బంధాలూ, స్నేహాలూ, సామాజిక అలవాట్లూ ఎలా నేర్పాలి? తోటి పిల్లలు పట్ల ప్రేమా, దయా చూపటం, అవసరసమయంలో సహాయం చేయటం, అన్ని జీవుల పట్ల గౌరవం ప్రదర్శించటం ఏవిధంగా తెలియజేయాలి అనేది శ్రీనాథ్ మనసులో కలిగించిన మధనం ఈ కథలు రాసేలా చేసాయి.ఈ కథలన్నీ చిన్న చిన్నజంతువులూ, పక్షుల సాహసాలూ, ప్రవర్తన ద్వారా మానవీయ విలువలు పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పే కథలే. ఈ కథలు ప్రపంచబాలలందరికీ వుపయుక్తంగా వుండే అంశాలను కలిగివుండటం ప్రధాన లక్ష్యం గానే వున్నా భారతీయాత్మ అంతరప్రవాహంగా వుందని అనిపించింది.ప్రతీకథా చదివే వయసుగల పిల్లలకి స్పష్టంగా అవగాహన కలిగించేలా వుండటం ఈ కథలకు గల మరో లక్షణం. చదవలేని పిల్లలకు బెడ్ టైమ్ కథలుగా పెద్దలు వినిపించేందుకు అనువుగా వున్నాయి. మొత్తంగా ఈ కథల్ని చదివినప్పుడు పిల్లలకు మానవీయవిలువలు నేర్పటమే కాకుండా పెద్దలమాటల్ని వినడం, మంచి చెడులను గూర్చి ఆలోచించడం,సహనం వంటి గుణాలు వారు తప్పక ప్రోది చేసుకుంటారనే ఆశావహ దృక్పథం కలిగింది. రేపటి రోజున వికసించబోయే పూలకోసం వనాలలో గొప్పులుతవ్వి,నీరుపెట్టి,సంరక్షించే పనిమంతుడైన తోటమాలిలా ఈనాడు శ్రీనాథ్ నా కంటికి కనిపించాడు. ఏదో తనపని తాను చేసుకు పోకుండా శ్రీనాథ్ వాడపల్లి రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని బాల సాహిత్యంలో కృషిచేస్తూ పిల్లలకు ఉత్సుకతా,ఊహాశక్తీ , సృజనాత్మకత పెంపొందించి సాహిత్యాభిరుచి రేకెత్తించే విధంగా రచనలు చేయటం,టెక్నాలజీని వుపయోగించి వాటికి తగిన ఆకర్షణీయమైన చిత్రాలతో పుస్తకాలు తీసుకు రావటం హర్షణీయం. ఒకనాటి మా మాష్టారు వాడపల్లి లక్ష్మీ నారాయణాచార్యులుగారి పుత్రుడైన శ్రీనాథ్ యీనాడు ప్రపంచదేశాల్లో ఇంత ఎత్తులకు ఎదిగి కీర్తిమంతుడైనందుకు సంతోషంగా వుంది. అంతేకాదు శ్రీనాథ్ ఆంగ్లంలో రాసిన ఈ బాలల పుస్తకాల్ని భారతీయభాషలన్నింటిలోకీ అనువాదం చేయించి భారతదేశంలోని బాలలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనుకోవటం ముదావహం.మక్కీకి మక్కీ కాకుండా భారతీయ పరిస్థితులూ,వాతావరణానికి తగినట్లుగా అనువాదకులకు తగుమార్పులు అనుసృజనగా చేసే అవకాశం కల్పించటంతో కథలకు అంతరప్రవాహంగా కాక భారతీయ సహజపరిమళం కల్గింది. శీలా పల్లవి తెలుగులోకి అనువాదం చేసిన శ్రీనాథ్ రాసిన ఈ కథలు తెలుగు తావిని వెదజల్లుతున్నాయి. ఇంకా మరెన్నో మంచి పుస్తకాలతో బాలసాహిత్యంలో తనకంటూ ప్రత్యేక ముద్ర సాధించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీనాథ్ వాడపల్లికి, తెలుగులోకి అనువదించిన శీలా పల్లవికి ఆత్మీయ అభినందనలు. - శీలా సుభద్రాదేవి హైదరాబాద్

13, జులై 2026, సోమవారం

నడక దారిలో -67

నడక దారిలో -67 కరోనా విజృంభణ ఎదుర్కొని అప్పుడప్పుడే వూపిరి తీసుకుంటున్న ప్రజలకి కొత్త సంవత్సరం కొత్త ఆశల్ని మేల్కొల్పుతూ కొత్తవూపిరులూదింది. జనవరిలోబొమ్మలకొలువు హడావుడి వుంటుంది కనుక రచనలు తగ్గిపోతాయి.అయినా కరోనా కాలంలో చాలానే కవితలైతే చేసాను. చదవటం కొనసాగుతూనే వుంటుంది.ఎటొచ్చి ఇప్పుడు నారాయణరెడ్డి ట్రస్ట్ పుస్తకాలు ఎంపిక పని వలన ఇతర పుస్తకాలు చదవటానికి కుదరటం లేదు.ఇంచుమించుగా వాటిని చదవటం పూర్తి అయ్యింది. " ఇన్ని పుస్తకాలు ఉంటాయనుకుంటే ఒప్పుకోకుండా వుండాల్సింది.నీ సమయం అంతా దీనికే అయిపోతుంది కదా! పోనీ రెమ్యునరేషన్ అయినా ఇస్తారో లేదో తెలియదు "అనేవారు వీర్రాజు గారు. ఎప్పటిలాగే బొమ్మలకొలువు పెట్టటం, బిల్డింగ్ లో వాళ్ళూ, బంధుమిత్రులు రావటంతో ఆ వారం అంతా సందడిగా అయిపోయింది. తర్వాత రోజు ఉదయమే చిన్న మరిది తోడల్లుడు చనిపోయాడని ఫోన్ వచ్చింది.చాలాకాలంగా అనారోగ్యంగా వున్నా బాగానే వున్నాడని రెండురోజులముందే బొమ్మలకొలువు చూడటానికి వచ్చిన అతని భార్య సంధ్య చెప్పింది.ఆంతలో ఇలా జరగటం నిజానికి ఒక షాకే.వాళ్ళ చిన్నమ్మాయి యూ ఎస్ లో వుంటుంది.వచ్చే పరిస్థితి లేదు.దగ్గర్లో వుండే మా మరిదీ ,తోటికోడలూకూడా యూ ఎస్ లోనే వున్నారు.హుటాహుటీన పల్లవీ, నేనూ వాళ్ళింటికి వెళ్ళాము. మా మరిదికోసం,వాళ్ళ చిన్నమ్మాయి కోసం మనవరాలు ఫోన్లో వీడియో కాల్ పెట్టి పరిస్థితి అంతటినీ చూపిస్తుంది.అది చూసి నాకు దిగులైంది. చదువుకూ,వుద్యోగాలకూ పిల్లల్ని విదేశాలు పంపించేసి ఇక్కడ తల్లిదండ్రులు దిక్కులేని వారిలా అత్యవసర సమయంలో ఒంటరి వాళ్ళైపోతున్నారు . అందులోనూ ఇంకా కోవిడ్ భయం వెంటాడుతూనే వుంది.వేరియంట్స్ గా మారుతూనే వుంది.మూడోరోజు దినాలు కూడా వెళ్ళి వచ్చాం.అయిదురోజులు అయ్యేటప్పటికి నాకు తలనొప్పి వళ్ళునొప్పి మొదలైంది.డా.సూర్యప్రకాష్ గారు ఇప్పుడు వొమిక్రాన్ వేరియంట్ వూర్లో వుంది. ఐసొలేట్ అయిపోతే మంచిదని చెప్పి వాడాల్సిన మందులు చెప్తే వాడటం మొదలు పెట్టాను.మూడురోజులకే నాకు నార్మల్ కి వచ్చింది.కానీ మరో రెండు రోజులు కి పల్లవికి జ్వరం మొదలైంది.ఇమ్యూనిటి పల్లవికి తగ్గిందనుకుంటాను.అందుకే ఏడాదికే మళ్ళా వచ్చేసింది.ఇక ఈ జ్వరాలతో దినాలకు రాలేమని సంధ్య కూతురు రేఖకి ఫోన్ చేసాము. జ్వరాలవీ తగ్గినా నీరసం చాలా కాలమే వుంటుంది.కోవిడ్ అంతే మరి. మాకు వచ్చిన జ్వరాల అనుభవాలతో మళ్ళా మళ్ళా కొత్త రూపాలతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూనే వుందనిపించింది. అందుకే ఈ సారి కూడా మాడభూషి పురస్కారాలు వాయిదా వేసి వచ్చే ఏడాది అన్నీ కలిపి నిర్వహించుకుందామని వీర్రాజు గారు లలితా దేవిని వప్పించారు. రాజమండ్రి దామెర్ల చిత్రకళా పరిషత్ లో వీర్రాజు గారి పెయింటింగ్స్ ఫిక్స్ చేయాలంటే ఇనుప రాడ్స్ తో రెండు స్థంబాల మధ్యా స్క్రీన్ పెట్టాలని ,ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయాలని అంటే విడతల వారీగా ఒక ఎనభై వేల వరకూ పంపించాల్సి వచ్చింది.అయితే అక్కడ జరుగుతోన్న పనిని ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు రవి పపుతుండటంతో డబ్బు ఏమీ వృధా కావటం లేదులే అనుకున్నాము.గ్యాలరీ ప్రారంభం గురించి సంప్రదిస్తే వీర్రాజుగారు "నేనిప్పుడు రాలేను.వాడ్రేవు చినవీరభద్రుడుగారితో ప్రారంభోత్సవం చేయించు" అని రవిప్రకాష్ కి ఫోన్ చేసారు.అయితే వీరభద్రుడు గారు మాత్రం "వీర్రాజుగారు ఎప్పుడు వస్తే అప్పుడే ప్రారంభోత్సవం చేద్దాం" అన్నారు. ప్రపంచీకరణ ప్రభావంతో ఏ దేశానికి ఆ దేశపు పండుగలతో పాటూ ప్రపంచమంతా చేసుకునే కొత్త పండుగలు వచ్చాయి.అటువంటి వాటిలో ఫిబ్రవరి పధ్నాలుగున యువతరమంతా జరుపుకునే ప్రేమికుల రోజు ఒకటి. ఆ రోజు ప్రేమికుల రోజుని తెలియని కాలంలో ఇద్దరం ఇష్టపడి ఒకటైన రోజు.జీవితంలో ఎన్నో అనుకూలతలు,ప్రతికూలతలు మధ్య ఎన్నో పూలూ,ముళ్ళను దాటుకుంటూ ఈ నాటికి యాభై దాటి మరొక్క ఏడాది కూడా గడిచింది.మేము ఇద్దరం ఒకసారి గుర్తు చేసుకోవటమే తప్ప పెళ్ళిరోజు జరుపుకోవటం మానేసి చాలా ఏళ్ళే అయింది. తెలంగాణా సారస్వత పరిషత్తు నుండి చెన్నయ్యగారు వీర్రాజుగారికి ఫోన్ చేసి తన జీవితం సాహిత్యం గురించి పరిణతి వాణి ప్రసంగం చేయాల్సిందిగా ఆహ్వానించారు.గంటసమయంలో అన్ని విషయాలూ చెప్పలేకపోయినా ప్రసంగం వ్యాసాన్ని సమగ్రంగా రాసి పంపమని తెలియజేసారు. ఇటీవల రాయటం కొంత అలవాటు తప్పిపోవటం వల్లా,వయసు చేత కొంత జ్ణాపకశక్తి తగ్గుతూ వుండటం వల్లా ఒక్కొక్కటే బాల్యం నుండి గుర్తు చేసుకుని రాయటానికి వీర్రాజుగారు కొంచెం కష్టపడటం చూసి మనసులో నాకు బెంగగా అనిపించింది.చెక్కినట్లుగా వుండే అందమైన దస్తూరికూడా చెదిరినట్లైంది.మామూలుగానే రచన ఏదైనా ఒక విడతలో వీర్రాజుగారు రాయరు.పర్ఫెక్టుగా వచ్చేవరకూ రచన పదే పదే రాయటం,రాసినది కొట్టేసి మళ్ళా రాయటం ఆయనకు అలవాటే.అయినా ఇప్పుడు మాత్రం రాతలో తడబాటు అర్థం అవుతూనే వుంది.మొత్తం మీద తన జీవితం, సాహిత్యం పరిణతవాణికోసం రాయటం పూర్తి చేసారు.దానిని స్కాన్ చేసి చెన్నయ్య గారికి పంపించేసాను.ఇక ప్రసంగం చేయాల్సి ఉంది. ఒక ఆదివారం ఉదయం పదిగంటలకు సారస్వత పరిషత్తుకి మేమిద్దరం వెళ్ళాము.కందుకూరి శ్రీరాములు,శంకరం, సిధారెడ్డి మొదలైన ఆత్మీయ మిత్రులు వచ్చారు.ప్రచారం ఎక్కువగా చేయకపోవటం వలనో,ఎందుచేతనో సభలో ఎక్కువ మంది వుండరు. చేతిలో పాయింట్స్ కాగితంమీద రాసుకుని వెళ్ళినా అవి చూడకుండానే వీర్రాజుగారు ప్రసంగించారు. కానీ చాలా వరకూ తడబడుతూనే మాట్లాడారు.వయసువలన ఆయన మర్చిపోతున్నారనేది అర్థమైంది. కె. గీత తన నెచ్చెలి పత్రిక కోసం ఒక రోజు ఫోన్ చేసినన్ను ఇంటర్వ్యూ చేస్తానంది.అదే విధంగా ఒక గంటసేపు సమగ్రమైన ఇంటర్వ్యూ జూమ్ ద్వారా చేసింది.ఇంటర్వ్యూ తర్వాత కాసేపు పర్సనల్ గా మాట్లాడుకున్నాము.నేను మానసికంగా డిసేబుల్డ్ అయిన బాబును పెంచటంలో మూడున్నర సంవత్సరాలు అనుభవించిన బాధ మరువలేనిది. గీతకూడా ఆ పరిస్థితి గురించి చెప్తుంటే మనసంతా బరువెక్కి దుఃఖం కంఠంలో వుండకట్టినట్లయ్యింది.ఒకవైపు వుద్యోగం బాధ్యత నిర్వహిస్తూనే మరోవైపు పత్రికానిర్వహణ, సాహిత్య సృజన ,టోరీ రేడియో, సాహిత్య వీక్షణం ఇలా ఇన్ని బాధ్యతలు ఈ అమ్మాయి ఎలా నిర్వహిస్తూ ఉంది.ఈ గీత మనిషా,రోబోటా అనేది నాకు వూహకి అందలేదు.మనసారా ఆమెకి అభినందనలు తెలియజేసాను. అప్పట్లోనే చెన్నై విశ్వవిద్యాలయంనుండి మాడభూషి సంపత్ కుమార్ గారు కూడా నన్ను ఆన్లైన్ లోనే సమగ్రమైన ఇంటర్వ్యూ చేయడమే కాక నా జీవితం సాహిత్యం మొత్తం వ్యాసంగా రాసి పంపమని కోరటం మరో విశేషమే. ఒకరోజు పి.సత్యవతిగారు నాకు ఫోన్ చేసి "అన్వర్ అని ఒక అబ్బాయి మీకు ఫోన్ చేసి మీ ఇంటికి ఒక పుస్తకం కోసం వస్తాడు.అన్వర్ మంచిఅబ్బాయే. " అన్నారు.సరేనన్నాను.అంతలో అన్వర్ ఫోన్ చేసి "పోలాప్రగడ సత్యనారాయణ మూర్తిగారి "ఆ రోజుల్లో " పుస్తకం కావాలి.సత్యవతిగారు మీ దగ్గర పుస్తకం దొరుకుతుంది అన్నారు.మీ దగ్గర వుందా.ఉంటే వచ్చి తీసుకుని.చదివి మళ్ళా భద్రంగా ఇచ్చేస్తాను " అన్నాడు.ఉందని చెప్పి మా ఇంటి లోకేషన్ షేర్ చేసాను. వీర్రాజుగారు 'అన్వర్ ఎవరు ?' అన్నారు.'కవి అనుకుంటాను .కవితలు పత్రికలలో చూసాను ' అన్నాను. మరొక అతనితో కలిసి అన్వర్ వచ్చాడు.అతను అడిగిన పోలాప్రగడ రాసిన ఆరోజుల్లో పుస్తకం ఇచ్చాము.అతను మొహమాటంగా అతని " ఒక చిత్రకారుని రేఖాయాత్ర" పుస్తకం వీర్రాజుగారికి ఇచ్చాడు.పుస్తకం గెటప్ అది అద్భుతంగా ఉండటంతో ప్రింటింగ్ గురించి సమాచారం అడుగుతే ఇప్పుడు డిజిటల్ ప్రింటింగ్ పద్ధతి వచ్చిందని ఎన్ని కాపీలు అవసరమైతే అన్నే ప్రింట్ చేసుకోవచ్చని చెప్పాడు.అయితే అప్పటికీ అన్వర్ కవేనా,రచయితా,చిత్రకారుడా అనేది మాకింకా అర్థం కాలేదు.సాక్షిలో వుద్యోగం అన్నాడు.అంతే తెలిసింది.అంతకన్నా వివరాలు అడగటానికి మాకూ మొహమాటం. ఓ రెండు రోజుల్లో అన్వర్ ఇచ్చిన పుస్తకం వీర్రాజుగారు చదివి "సుభద్రా ఈ అన్వర్ చిత్రకారుడే కాక మంచి రచయిత కూడా.ఈ పుస్తకం అద్భుతంగా రాసాడు.నువ్వూ చదువు.ఇందులో చిత్రాలు చాలా బాగున్నాయి.చక్కటి లైన్ .బాపూ ఆరాధ్యుడు అనుకుంటా .కానీ బాపూని అనుకరించడం లేదు " అన్నారు.ఆయన అంతగా పొగిడారంటే నాకు వెంటనే చదవాలనిపించింది.అన్వర్ పుస్తకం తీసి మొదలు పెట్టాక ఇంకా వదలలేదు.వాక్యాలతో చిత్రాలు వేసినట్లు మ్యాజిక్ చేస్తూ అద్భుతమైన వాక్య విన్యాసంతో అనేకమంది చిత్రకారుల, సాహితీవేత్తలు గురించీ,సినీమాలగురించీ భలేగా రాసాడు.చదవటం పూర్తిచేసిన వెంటనే నా అభిప్రాయం అన్వర్ కి వాట్సాప్ లో తెలియజేసాను. తర్వాత మళ్ళా అన్వర్ తన కొడుకు మోహన్ ని తీసుకుని వచ్చాడు.అప్పుడు వీర్రాజుగారు తన పెయింటింగ్స్, ముఖచిత్రాలు,చిత్రాలు వేసే రకరకాల కొక్విన్లు అతనికి చూపించారు. మా స్వంతపుస్తకాలకు చీర ముక్కలతో వీర్రాజుగారు స్వంతంగా చేసిన బైండింగ్స్ చూసి అన్వర్ అబ్బురపడ్డాడు. తర్వాత కొన్నిరోజులకే నాకు(2021),పొత్తూరి విజయలక్ష్మి (2022)కు సుశీలానారాయణరెడ్డి పురస్కారం సమావేశం ఎమ్.కే.రాముగారి కిన్నెర సంస్థనిర్వహణలో జరిగింది. నా సాహిత్యం గురించి మూడు వ్యాసాలు రాసిన సి.హెచ్.సుశీలగారు నా సాహిత్యం గురించి కన్నా ఆత్మీయ పరిచయంగా మాట్లాడారు.పొత్తూరు విజయలక్ష్మి గురించి ప్రసంగించిన నెల్లుట్ల రమాదేవి పేపర్ మీద రాసుకొని సాహిత్యం గురించే మాట్లాడింది.తర్వాత స్పందన తెలియజేసినప్పుడు కూడా విజయలక్ష్మి తన సాహిత్యం గురించి చాలా చెప్పుకుంది. నన్ను పురస్కారానికి ఎంపిక చేసేరంటే నా సాహిత్య సృజన చూసేకదా .ఇంకా నేనుకూడా నా గురించి చెప్పుకోవటంలో అర్థం లేదు అనిపించింది. అందుకే నా ప్రసంగంలో కేవలం రచయిత్రులకే పురస్కారాలు ఇవ్వాలనే సంకల్పానికి ధన్యవాదాలు తెలియజేసాను.అంతేకాకుండా "నలభై సంవత్సరాలకు పైగా రచయిత్రులకు పురస్కారాల్తో గౌరవించటం చాలాసంతోషం. ఈ సందర్భంగా మరొక విన్నపం చేస్తున్నాను.రచయితలకూ,కవులకూ శతజయంతులు ప్రభుత్వ,ప్రభుత్వేతర సంస్థలూ అకాడమీలు నిర్వహించటం చూస్తున్నాము.కానీ మహిళాసాహితీవేత్తలకు ఎవరూ చేస్తున్నట్లుగా లేదు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తొలి రచయిత్రి ఇల్లిందల సరస్వతి దేవిగారికి శతజయంతి సభ జరగలేదు.అలా ఎంతమందో.నలభై ఏళ్ళుగా పురస్కారం ఇస్తున్న శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రస్టు వారైనా పూనుకొని పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించనవసరంలేదు కానీ ఆ రచయిత్రి సాహిత్యం గురించి ఒక ప్రసంగం ఏర్పాటు చేసి కొన్ని ప్రసంగాలు అయిన తర్వాత ఒక పుస్తకంగా ప్రచురిస్తే ఇప్పటి తరం వారికి ఆనాటి రచయిత్రులు ఎన్నో అవరోధాలను అధిగమించి రచయిత్రులుగా నిలదొక్కుకున్నారు అనేది తెలుస్తుంది." అని విన్నపం చేసాను.నా ప్రసంగానికి గంగగారు చాలా ప్రభావితులై కార్యక్రమం పూర్తై కిందికి వచ్చాక నన్ను ఆలింగనం చేసుకుని మీరు చెప్పినట్లే మేము నిర్వహించటానికి సిద్ధం గానే ఉంటాము.మీ సహకారం అందించండి అన్నారు.నాకు చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత కలిసిన వారంతా నేను చేసిన ప్రతిపాదన చాలా సమంజసంగా వుందని అభినందనలు తెలియజేసారు. పురస్కారం సందర్భంగా సారస్వత పరిషత్తు కార్యదర్శి డా.చెన్నయ్యగారు అందించిన సన్మాన పత్రం, ఫొటో ఫ్రేమ్ వీర్రాజు గారికి చాలా నచ్చాయి.నేను లోపల ఎక్కడైనా పెట్టాలనుకుంటే వీర్రాజుగారు హాల్ లోనే కొన్నాళ్ళవుంచు అన్నారు.ఇంటికి వచ్చిన మిత్రులు అందరికీ ఆయనే చూపించి పురస్కారం గురించి గొప్పగా చెప్తుండటం నాకే ఆశ్చర్యం వేసింది. నిజానికి ఇంతవరకూ నాకు నగదు రూపంలో కూడా పది పదిహేను వేలకు మించి రాలేదు.నాకు వచ్చిన పురస్కారాలలో ఇదే అత్యధికంగా వచ్చిన నగదు పురస్కారం.నగదుకన్నా గత నలభై ఏళ్ళుగా ఊటుకూరి లక్ష్మీ కాంతం యద్దనపూడి,రామలక్ష్మీ,లేత,సీతాదేవి వంటి వుద్దండులైన రచయిత్రులు అందుకున్న ప్రతిష్టాత్మకమైన పురస్కారం అనేది మాత్రం అక్షరాలా నిజం. ఒకరోజు గంగగారు ఫోన్ చేసి రచయిత్రుల శతజయంతులు దాటిన వారిని లిస్ట్ చేయమని అడిగారు.నేను ముఖ్యంగా సుశీలానారాయణరెడ్డి పురస్కారం అందుకున్న వారితో ప్రారంభించటమే బాగుంటుందనే అభిప్రాయంతో అక్కడినుంచి మొదలుపెట్టి రచయిత్రుల పుట్టిన సంవత్సరాల లిస్ట్ తయారుచేసి పంపించాను. శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రష్ట్ ఆర్థిక సహాయానికి పుస్తకాల ఎంపిక పూర్తి చేసాను.కథలు,కవితలు కలిపి సుమారు పదిపన్నెండు పుస్తకాలు ఎంపిక చేసి ఎందుకు బాగున్నాయో నా అభిప్రాయం కూడా రాసి వాళ్ళకు పంపించేసాను.అంత సమగ్రంగా నా అభిప్రాయాలతో ఎంపిక చేసినందుకు గంగగారు చాలా సంతోషం వ్యక్తం చేసారు.అంతేకాదు రెమ్యునరేషన్ గా అయిదువేలు పంపించటం మరింత ఆనందం. నేను ఎంపికచేసిన వాళ్ళు తర్వాత్తర్వాత మంచి కవయిత్రులుగా,రచయిత్రులుగా బహుమతులూ గుర్తింపూ పొందటం కూడా నాకు సంతోషం కలిగించింది. నేను ఒక లలితగీతాల వాట్సాప్ సమూహంలో వుండటం వలన సినారె గేయాలు ఆ సమూహంలో వచ్చినప్పుడు గంగకు షేర్ చేస్తూ వుంటాను.అందువలన ఆమె ఏ పాట కావాల్సినా, ఎవరైనా రచయితలకు చెందిన వివరాలు కావాల్సి వచ్చినా నన్ను సంప్రదించటం వలన తరుచూ మాట్లాడుకొంటూ వుంటాము. ఆ విధంగా ఆమెతో కొంత స్నేహం పెరిగింది. నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ డీటీపీ కూడా పూర్తి చేసాను.అనల్ప బలరాంగారికి పి.శ్రీదేవి కథల్ని " వాళ్ళు పాడిన భూపాలరాగం "పేరుతోనూ,ఆమె కవితల్ని "మథుకలశమ్" పేరుతోనూ సంపాదక బాధ్యతల్ని వహించిన పరిచయంతో నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ ని వాళ్ళ బేనర్ పై ప్రచురిస్తారా అని అడుగుతే తప్పక ప్రచురిస్తానని అన్నారు.అయితే మరికొన్ని ప్రచురణలలో బిజీగా వున్నానని అవి అయిపోయాక చేస్తానన్నారు.ఆ పుస్తకానికి పల్లవి చేతే ముఖచిత్రం వేయించుతానని కూడా చెప్పాను. బలరాం సరేనన్నారు.మాలతి రచనలో విశాఖమాండలిక సొబగులే కాక విశాఖసంపంగి పరిమళాలు మనసుని తాకుతూనే వుంటాయని ముఖచిత్రంగా సంపెంగలతోనే డిజైన్ చెయ్యమని పల్లవితో చెప్పాను. - శీలా సుభద్రాదేవి

నడక దారిలో -66

నడక దారిలో -66 ఈ ఏడాది డిసెంబర్ నెల చాలా విశేషాలతో బిజీగా నడిచింది. ఈ మధ్య కుందుర్తి కవిత తాను రాసిన కవితలు నాకు పంపించింది.బాగారాస్తున్నావని ప్రోత్సహించడమే కాకుండా నెచ్చెలి,కవి సంధ్య ఈ మెయిల్ ఐడీ లు ఇచ్చి పంపించమని చెప్పాను.నేనేమైనా సవరణలు చేస్తే సరిదిద్దుకుంటుంది.వాటిని వీర్రాజుగారికి కూడా వినిపించేదాన్ని. ఇంకో విశేషం ఏమిటంటే నేనూ, పల్లవి కూడా వున్న మనలో మనం వాట్సాప్ సమూహంలో పల్లవి చిన్నచిన్న రచనలూ,కవితలూ రాయటం సంతోషం కలిగించింది.కరోనా సమయంలో సుధామ ప్రారంభించిన" ఒకసారి చూడండి అంతే" అనే వాట్సాప్ పత్రికలో కథలకు చిత్రాలు వేయటమే కాకుండా దాని తరపున సుధామ నిర్వహించిన కవితలపోటీలో పల్లవి కవిత ప్రచురణకు ఎంపిక అయ్యింది.అదేవిధంగా విశాలాక్షి నిర్వహించిన కవితలపోటీలో కన్సొలేషన్ బహుమతి వచ్చింది. వాటిని కూడా ఫోనులో చదవటం వీర్రాజుగారికి తెలియదు కనుక వినిపించాను.అవి విని ఆనందంతో వచ్చే ఏడాదికి పల్లవి రాసిన కవితా సంపుటి ప్రచురించాలి అనేవారు. ఖమ్మంలో డా.సీతారాంగారు తాను పనిచేసే కళాశాలలో కుందుర్తి సాహిత్య సదస్సు నిర్వహించాలనుకుంటున్నానని కుందుర్తి కృతులు పుస్తకం ,ఇతర పుస్తకాలు కావాలని ఫోన్ చేసారు.ఒకరోజు పుస్తకాలు కోసం మా ఇంటికి వచ్చారు.కుందుర్తికృతులు అపురూపమైనది కావటాన మళ్ళా జాగ్రత్తగా అందజేస్తామన్నారు.ఆ పుస్తకాలతో పాటు మాయిద్దరిపుస్తకాలుకూడా ఇచ్చాము.అవే కాకుండా విద్యార్థులకు బహుమతులుగా ఇవ్వమని మావి విడి కవితా సంపుటాలు కూడా అందజేసాము. సీతారాంగారు తన పాఠాలు మాత్రమే చెప్పి పనైపోయింది అనుకోకుండా విద్యార్థులకు సాహిత్యం పట్ల అభిరుచి,ఆసక్తి పెంచేలా పుస్తకాలు చదివించి ప్రోత్సహిస్తారు.ఆ విధంగా ప్రతీ కాలేజీలోనూ జరుగుతూ వుంటే తెలుగుభాష అంతరించి పోతుందనే దిగులు తగ్గుతుందేమో. డిసెంబర్ లో కుందుర్తిగారి శతజయంతి ప్రారంభం ఆవిధంగా ఖమ్మం కాలేజీలో ప్రారంభించటం వీర్రాజుగారికి సంతోషం కలిగించింది.సదస్సు ప్రారంభసభకు మా ఇద్దరినీ ఆహ్వానించారు." రావాలని ఉంది కానీ మూడుగంటలసేపు కారులో ప్రయాణం చేయలేన"ని వీర్రాజుగారు సీతారాంతో చెప్పారు."కుందుర్తిగారితో, ఫ్రీవర్స్ ఫ్రంట్ తో మీ అనుబంధాన్ని వీడియో చేసి పంపించండి.అది ప్రారంభసభలో వేస్తాం " అన్నారు. ఆ విధంగా ఒక వీడియో చేసి పంపించాను.కుందుర్తి కవిత ఆ సదస్సులకోసం సింగపూర్ నుండి వచ్చింది.కుందుర్తి కుటుంబసభ్యులు ఖమ్మంలో జరిగిన కుందుర్తి సాహిత్య సదస్సులకు హాజరయ్యారు. కుందుర్తి కవిత ఇండియా ఎప్పుడు వచ్చినా అక్క సమతతో కలిసి మా యింటికి తప్పక వచ్చి కలుస్తుంది.వచ్చిన 'ప్రతీసారీ సింగపూర్ ఎప్పుడు వస్తారు.తప్పకరండి ' అని పిలుస్తుంది కవిత. " కవితలు బాగా రాస్తున్నావు. వచ్చే ఏడాది చివరికి నీ కవితాసంపుటి వచ్చేలా రాస్తూ వుండు " అన్నారు కవితతో వీర్రాజుగారు.కవిత నవ్వేసి ప్రయత్నిస్తానంది.నవ్వటం కాదు.'పట్టుదలగా రాయాలి ' అని ఖచ్చితంగా చెప్పారు ఆయన. ఒకరోజు చెన్నయ్యగారు ఫోన్ చేసి ప్రతీ ఏడాదీ రచయిత్రుల మొదటి పుస్తకాలకి సుశీలానారాయణ రెడ్డి ట్రస్ట్ ఆర్థిక సహకారం అందిస్తుంది కదా ఆ పుస్తకాలను ఎంపిక చేయగలరా అని కోరారు.నేను అంగీకారం తెలియజేసిన తర్వాత నలభై రెండు కవితాసంపుటాల జిరాక్స్ ఫైళ్ళూ,ఇరవై వరకూ కథలసంపుటాల జిరాక్స్ ఫైళ్ళూ పంపించారు.వాటిలో ఆంధ్రా నుండి వచ్చినవి కూడా వుండటంతో గంగగారికి ఫోన్ చేసి తెలంగాణావారివే ఎంపిక చేయాలా,ఆంధ్రావాళ్ళవి బాగుంటే చేయొచ్చా' అని అడిగాను.ఆమె " బాగుంటే రెండు రాష్ట్రాల నుండి ఏవైనా చేయండి.మాకు తెలంగాణా ఆంధ్రా అనే తేడా లేదు.అంతేకాకుండా ఎన్ని సెలెక్ట్ చేసినా పర్వాలేదు" అని నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.అరవైకి పైగా పుస్తకాలు చదవటంతో తీరిక లేకుండా అయింది. మంచి ఉద్యోగంచేసి పదవీవిరమణ అయ్యాక కాలక్షేపంగా కొత్తగా ఇప్పుడు సాహిత్య సృజన మొదలుపెట్టి ఆర్థికంగా మంచి స్థితిలో వున్నవారు సైతం ఆర్థిక సహాయం కోసం పంపటం నాకు ఆశ్చర్యం కలిగించింది.కొందరు ముందు మాటలు కూడా రాయించి ప్రచురణకు సిద్దంగా వున్న ప్రతులే పంపించారు.అటువంటి వాటిని చాలా వరకూ తీసేసాను.యువతరంవారికి ప్రోత్సాహంగా యిస్తే బాగుంటుంది అనిపించింది.అదే విషయాన్ని గంగగారికి తెలియజేసాను. కవిత్వంలోనూ,కథల్లోనూ బాగున్నాయి అనిపించినవి పక్కన పెట్టి రెండోసారి చదవాలనుకున్నాను.మొత్తం పంపిన వాటికి అన్నింటికీ నచ్చనివాటికి కూడా నా అభిప్రాయం రాసి పెట్టుకున్నాను.ఫైనల్ సెలక్షన్ మాత్రం వుంది. సైదాబాద్ కోపరేటివ్ బ్యాంకుకు ఒకరోజు వీర్రాజుగారిని తీసుకుని పల్లవీ, నేనూ వెళ్ళాం.మలక్ పేట ఇంట్లోకి వచ్చిన వెంటనే మొదట దగ్గర కదా అని ఆ బ్యాంకులోనే మేము సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెరిచాము.సరూర్ నగర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అవసరమైనప్పుడు సైదాబాద్ బ్యాంక్ కు రావటం కష్టంగా వుందని వీర్రాజుగారి అక్కౌంట్ క్లోజ్ చేసేసాను.దానితో పాటూ కుందుర్తి సత్యమూర్తితో కలిసి ఫ్రీవర్స్ ఫ్రంట్ కోసం చేసిన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేసేసాము.ఫ్రీవర్స్ ఫ్రంట్ అక్కౌంట్ లో నలభై అయిదు వేలు ఉందని కుందుర్తి శాంతకు తెలియజేస్తే ' మీరే ఫ్రీవర్స్ ఫ్రంట్ కోసం వాడండి.నాకు పంపొద్దని' అంది. ఆ డబ్బుని ఏం చెయ్యాలా అని ఇద్దరం ఆలోచించాము."ఈ ఏడాది ఎట్లాగూ కుందుర్తి శతజయంతి సంవత్సరం కనుక ఈ నలభై అయిదు వేలకు మనం మరోపదిహేను వేలు కలిపి ఆరుగురికి కుందుర్తి శతజయంతి ప్రతిభా పురస్కారం పేరున పదివేల చొప్పున ఇచ్చేద్దాము.రెండు తెలుగురాష్ట్రాల నుండి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు రాదగిన సీనియర్ కవుల్ని ఎంపిక చేద్దాం" అన్నారు వీర్రాజు గారు.ఎవర్ని తీసుకోవాలని ఒక జాబితా వేసుకుని నిర్విరామంగా సాహిత్య కృషి చేస్తూ సాహిత్యం రాస్తూ వున్నవారినిగా చూసుకుని డా.రాధేయ,దాట్ల దేవదానం రాజు,అడిగోపుల వెంకటరత్నం,దేవరాజు మహారాజు,డా.సీతారాం, అనిశెట్టి రజితలను ఎంపిక చేసి కుందుర్తి కుటుంబసభ్యులకు తెలియజేసాము.వాళ్ళుకూడా చాలా సంతోషించారు.ఎంపిక చేసిన కవులకు వీర్రాజు గారు ఫోన్ చేసి చెప్పగా ఆరుగురూ చాలా ఆనందించారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహంలో కుందుర్తి ఆంజనేయులు శతజయంతి సందర్భంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారాలు ప్రకటించిన వారిగురించి పరిచయం చేసాను.పురస్కారగ్రహీతలకు ఎప్పుడు హైదరాబాద్ రావటానికి కుదురుతుందో సంప్రదించటంతో కొంత కాలయాపన జరిగింది. దాంతో సభ నిర్వహించి ప్రదానం చేయాలా,లేదా జూమ్ సమావేశం ద్వారానే చేయాలా అనేది కూడా ఆలోచించాము. ఇటీవలే ఖమ్మంలో కుందుర్తి సదస్సులకీ కుందుర్తి కవిత వచ్చి వెళ్ళింది.మళ్ళా దగ్గరలో రావటం కష్టం. అందుకని జూమ్ లోనే అందరి వెసులుబాటూ చూసుకుని నిర్వహించాలని నిర్ణయించాము. చూస్తుండగానే నెచ్చెలి అంతర్జాలపత్రికలో నా నడక దారిలో బాల్యం వివరాలతోనే ఏడాది గడిచిపోయింది. ఎన్నికల సమయంలో జరుగుతోన్న సందర్భాలూ, ప్రజల్ని వెర్రివెధవాయిలుగా చేస్తున్న రాజకీయ నాటకాలూ కొంత అసహ్యం కలిగించి నేను దీర్ఘకవితగా రాసాను.అది వీర్రాజుగారికి చదవమని ఇచ్చాను.బాగా రాసాను అన్నారు‌.కానీ ఏ పత్రికకైనా పంపించటానికి వెనకడుగు వేసాను. కోరుకొండ అక్క మనవరాలు అంటే కళ్యాణ్ పెద్దకూతురు వసుధకు పెళ్ళి సంబంధం కుదిరింది అని తెలిసింది.వసుధ కోరుకొండ సైనిక పాఠశాలలోనే చదువుకుని చెన్నైలో ఇంజనీరింగ్ చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.విశేషం ఏమిటంటే సైనిక స్కూల్ లో చదివినప్పటి నుండి సహ విద్యార్ధులు అయిన అభిలాష్,వసుధ ప్రేమించుకుంటున్నారుట.చదువుపూర్తిచేసి ఉద్యోగంలో స్థిరపడే వరకూ ఈ విషయం తల్లిదండ్రులుకు తెలియనీయవద్దనుకున్నట్లున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు సంబంధాలు చూడటం మొదలు పెట్టేసరికి బయట పెట్టింది వసుధ.అభిలాష్ వాళ్ళ కుటుంబం సంగారెడ్డిలో వుంటారు.ఒకసారి అందరూ కలిసి మాట్లాడుకొని నిశ్చయించుకుందామని ఇరు కుటుంబాల వారు నిర్ణయించుకున్నారు. ఆపని మీదే కళ్యాణ్ కుటుంబమే కాక జయ అక్కాచెల్లెళ్ళు కూడా కుటుంబ సహితంగా వచ్చారు. "మాకు వున్న పెద్దదిక్కు మీరే కనుక తప్పక సంగారెడ్డి రావాలని " కళ్యాణ్ అనేసరికి మేమూ బయలు దేరక తప్పలేదు.వీర్రాజుగారు ముందు అన్ని గంటలు కార్లో ప్రయాణం చేయలేనేమో అని వెనకడుగు వేసినా కళ్యాణ్,జయ కోరిక మేరకు బయలుదేరారు. టిఫిన్లు చేసి ఎనిమిది గంటలకు నలుగురం కార్లో సంగారెడ్డి బయలుదేరాము.సుమారు నాలుగు గంటల ప్రయాణం చేసి సంగారెడ్డిలో వసుధ కాబోయే అత్తగారి ఇల్లు చేరాము. అత్తగారి అక్కాచెల్లెళ్ళు,మామగారి అన్నదమ్ములు మొదలైన వారితో వాళ్ళది చాలా పెద్ద కుటుంబం.వాళ్ళందరూ వచ్చారు. పెళ్ళి ఎప్పుడు చేయాలనేది చర్చ జరిగింది.ఇల్లూ,ఇంట్లో వస్తువులూ అన్నీ అమర్చుకున్నాకే చేసుకుంటాం అని పిల్లలు ఇద్దరూ అంటారు.ఇప్పటికే చాలా కాలం వేచి వున్నారు,ఇంకా ఆలస్యం చేయవద్దని అందరం అన్నాము.పెళ్ళి అయ్యాక ఇంట్లోకి మీ సంపాదనతో ఒక్కొక్క వస్తువే అమర్చుకోవటంలో చాలా తృప్తి వుంటుందని మేము అనుభవంతో చెప్పాము.ఆఖరికి అంగీకరించారు.ఎప్పుడు మంచి ముహూర్తం వుంటే అప్పుడు వివాహం చేయాలని అందరూ నిర్ణయించారు. వీర్రాజుగారు ప్రత్యేకంగా వసుధా, అభిలాష్ లతో " పెళ్ళి అంటే ఒకరిపై ఒకరికి గల నమ్మకం.దానిని జీవితాంతం నిలుపుకోండి" అంటూ చాలా సేపు మాట్లాడారు.ఆయన మాటలకు వాళ్ళిద్దరే కాక వాళ్ళు అమ్మా నాన్నలు కూడా ఫిదా అయిపోయారు. అభిలాష్ వాళ్ళూ ఇక్కడే స్థిరపడిన కన్నడిగులు.వాళ్ళ సంప్రదాయం ప్రకారం మగవాళ్ళందరికీ గాంధీటోపీలు పెట్టి అందరికీ బట్టలు పెట్టారు.అదే విధంగా కళ్యాణ్ వాళ్ళు కూడా వాళ్ళకు బట్టలుపెట్టి గౌరవించారు.అవన్నీ పూర్తి చేసుకుని మేము తిరిగి బయలుదేరి ఇంటికి చేరేసరికి పదిగంటలకు దాటింది. మర్నాడు జయా అక్కాచెల్లెళ్ళు ముగ్గురినీ మా ఇంటికి రమ్మన్నాను.' భోంచేసి ఇక్కడనుండే స్టేషనుకు వెళ్ళొచ్చు' అని చెప్పాను. ఉదయమే లేచి రెండు కూరలూ, సాంబారు,ఫ్రైడ్ రైస్ , స్వీట్ చేసి మంచూరియా హొటలునుండి తెప్పించాము.పెద్దక్క సర్వలక్ష్మి కుటుంబం అటునుంచి అటే కార్లో వెళ్ళిపోయారు.మిగతా ఇద్దరూ రంజనా,జయా వాళ్ళంతా వచ్చారు.అందరితో సరదాగా ఇల్లంతా పెళ్ళి సందడిలా గడిచింది.వసుధ రాత్రికి డిన్నర్ పేక్ చేసుకుని హాస్టల్ కి వెళ్ళిపోయింది.మిగతావాళ్ళు ఇటు నుండి స్టేషన్ కు వెళ్ళిపోయారు. "ఇంతదూరం కార్లో బాగానే ప్రయాణం చేయగలిగాను.భయపడ్డాను గానీ ఖమ్మంలో జరిగిన కుందుర్తి సదస్సుకు కూడా వెళ్ళాల్సింది" అని మర్నాడు వీర్రాజుగారు అన్నారు.మీరు ఊరికూరికే ప్రయాణం చెయ్యలేనేమో అని ముందే భయపడతారు అని ఆయనతో అంటూ నేనూ పల్లవీ నవ్వుకున్నాం. ఈ ప్రయాణం ఇచ్చిన ధైర్యంతో ఈ సారి " విజయనగరం వెళ్తే పగలు రైలు ప్రయాణం చేద్దాం కిటికిలోనుండి అంతా చూస్తూ వెళ్ళొచ్చు‌"అన్నారు. ఆలోచిద్దాంలెండని అన్నాను. నిడదవోలు మాలతి సాహిత్యం మీద రాస్తున్న వ్యాసాలు ఒక పరిశోధన గ్రంథం మాదిరిగానే జీవితం,కథలు,ఎన్నెమ్మ కథలు,నవలలు, వ్యాసాలు,అనువాదాలుగా చాప్టర్ లు విడదీసాను.ఒక్కొక్క చాప్టర్నీ పీడీఎఫ్ రూపం లో మాలతి గారికి మెయిల్ ద్వారా పంపించే దాన్ని.ఆమె ఏమైనా సవరణలు చేయమంటే మార్చేను.కొన్ని కథలకి నేపథ్యం గురించి అడిగితే సమాధానాలు చెప్పేవారు.దాంతో ఆమెతో చాలా సాన్నిహిత్యం పెరిగింది."నన్ను మీరు,గారూ అని మన్నించి రాస్తుంటే ఇబ్బందిగా వుంది.మా అక్కయ్య సమకాలీనులు.నన్ను మన్నించనవసరం లేదు. ఏకవచనంలో సుభద్రా అనండి చాలు"అని నేను రాసిన తర్వాత మరింతగా సాన్నిహిత్యం పెరిగింది. ఒక సందర్భంలో "నా జీవితంలో జరిగినవేవీ నువ్వు అడగలేదు.చెప్పమంటావా" అని రాసారు. పి.శ్రీదేవి జీవితం నాకు అంతగా తెలియక పోవటం వలన ఆమె మోనోగ్రాఫ్ రాసేటప్పుడు ఆమె రచనల ఆధారంగానే ఆమె జీవితాన్ని రాసాను.మీకు కూడా అలానే రాస్తాను.అని నేను చెప్తే మాలతిగారు చాలా సంతోషించారు. నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ మొత్తం పూర్తి అయ్యింది.పేజీలు స్కాన్ చేసి డిటీపీ నరసింహారావుకి ఇచ్చాను.కానీ నేను ఫ్రచురించుకుంటే ప్రచారం చేసుకోగలనా అనిపించింది.ఏదో సందర్భంలో మాట్లాడినప్పుడు అనల్ప బలరాంతో అంటే తానే ప్రచురించుతానని అన్నాడు. అప్పటికే పి.శ్రీదేవి సాహిత్యం అంతా తన పబ్లికేషన్ ద్వారా ప్రచురించాలనుకుంటున్నాననీ నన్ను రచనలన్నీ సేకరించి నన్నే సంపాదకత్వం వహించమని బలరాం అడిగాడు.ఆ పని కూడా మొదలు పెట్టాను.నేను కథానిలయం నుండీ,నా దగ్గర వున్నవీ డిటీపీకి ఇచ్చాను.మిగతా కథలు కృష్ణదేవరాయ గ్రంథాలయం నుండి తెలుగు స్వతంత్రలు తెచ్చుకుని అందులో చదువుతూ రాసినవి. అంతకుముందే ఒక అమ్మాయి పి.శ్రీదేవి మీద పరిశోధన చేస్తున్నానని రచనల కోసం అడిగింది.నేను కృష్ణదేవరాయ గ్రంథాలయం నుండి తెచ్చుకున్నానని చెప్తే వెళ్ళింది.తీరా అక్కడకి వెళ్తే చెదలు పట్టాయని అవన్నీ పాడైపోతే పారేసామని చెప్పారని నాతో చెప్పింది.దాంతో మళ్ళా నాకు శ్రీదేవి కథలసేకరణ ఇక్కట్లు మొదలయ్యాయి.అయితే గౌతమీ గ్రంధాలయం, వేటపాలెం లైబ్రరీలో కొన్ని దొరికాయి.మూడోనాలుగో కథలు తప్ప అన్నీ దొరికాయి.వాటిని డిటీపీ చేయించాను.ఆ పుస్తకానికి సమగ్రమైన ముందుమాట రాయమని పబ్లిషర్ చెప్పటంతో మళ్ళా కథలన్నీ చదివి రాయటం మొదలు పెట్టవలసి వచ్చింది. - శీలా సుభద్రాదేవి