18, ఫిబ్రవరి 2021, గురువారం

జీవన విలువలు

         జీవన విలువలు


నీలి నింగి కీ

ఆకుపచ్చ నేలకీ మధ్య--


మబ్బుతెరల్ని తొలగించుకుని 

తారలమధ్య నుండి తొంగిచూసే చందమామకీ

 చెరువుని వీడి బతకలేని కలువకీ మధ్య --


ప్రచండ కిరణాలు సాచే రవిరాజుకీ

అగాధాలుగుండెల్లో పొదువుకున్న సాగరకన్య కీ మధ్య--

ఎప్పుడూ సమాంతరదూరమే

అయితేనేం

ఏనాటినుండో 

కవి సమయాలలో

ఎన్నెన్ని ప్రేమవూసులో!

ఎన్నెన్ని ఊహలవూడల్ని అక్షరాలతో పెనవేసి

కవితా సుందర్ని ఉయ్యాలలూపుతూ

ఉవ్వెత్తున ఎగసే గాలి అలల ఉధృతి లో సైతం

లాహిరి పాటలతో ఊగిసలాడిస్తూ

ఎన్నెన్నో కవితలు!!

రసిక హృదయాల్ని రంజింప చేస్తూ

ఎన్నెన్ని కంఠాలు

గేయాల్ని శృతి చేసుకున్నాయో కదా


ఈనాడు

నేలమీద నిటారుగా నిల్చున్న కవికి

నీలాకాశాన్నీ, పచ్చని నేలనీ చూస్తే

ఆ రెండింటి మధ్యా

అంతస్తుల అహంకారాల కింద నలిగే

పసిహృదయాలు కన్పిస్తాయ్

నిలువునా రూపెత్తే కులం గోడల సందుల్లోంచి

పరువు కత్తులు మెరుపై దూకటమే దర్శనమిస్తాయ్

చల్లందనాలూ,పరిమళసమీరాలూ

 వెదజల్లాల్సిన కన్నపేగుల్లో అసహనపు ప్రళయాగ్నులు

 పసిప్రేమికుల కలల్ని చితి మంటల్లో కాల్చటం చూస్తాయి


ఆడపిల్లల పాలిటి అసిధారావ్రతమౌతూ

శారీరక ప్రేమగా రూపాంతరం చెందినప్రేమ

జీవన విలువలు చిధ్రమౌతోన్న పరిస్థితుల్లో

ఈనాడు ప్రేమ  అంగడి వస్తువైపోయింది

మన పిల్లలకి 

ఈ చితిమంటల ప్రేమని కాదు

జీవితాన్ని ప్రేమించటం ఎలాగో నేర్పాల్సింది

ఇక మీదట అక్షరాన్ని ప్రేమించే కవులే కదా.


untitled-ఇరోంషర్మిలా

   
              మూలం :_ ఇరోం షర్మిలా  
ప్రియమిత్రులారా
నా చేతుల్ని మీకిచ్చేస్తాను
నన్ను ప్రేమతో ఆలింగనం చేసుకోండీ
అంతరంగాన్ని మీముందు తెరవాలని వుంది
ఐతే పరిమళభరితం కాని
ప్లాష్టిక్ చిరునవ్వుల్ని పులుముకొన్న కంఠానికి
భావాల్ని పలికించే పదాలు కరువయ్యాయి
ఈ రాజకీయదుర్ఘంధాన్ని కాల్చేసేందుకు
ఒక విస్ఫోటనాన్ని రగిలించాలని వుంది
కానీ ఒంటరి అడుగుల్ని మునుముందుకు
వేయలేక అలసిపోతున్నాను
బలమైన ఆలోచనల్ని నినదిస్తూ
ధ్రుఢసంకల్పంతో ముందుకే అడుగేస్తూ
శతాధిక పాదముద్రల్ని కలుపుకోంటూ
అద్భుతధీరత్వాన్ని ప్రోది చేసుకొంటూ
తలుపుల్ని తెరుచుకొంటూ సామూహుకంగా
మీరంతా బైటకి వస్తారని,రావాలని నా ఆశ

     --అనుస్రుజన:-శీలా సుభద్రాదేవి
 

నడక దారిలో-2

 నడక దారిలో--2 


"నాన్న మీద కవితలు మీరు రాసిన వేమైనా ఉన్నాయా" అని "నాన్న పదం" సంకలనం కోసం ఘంటశాల నిర్మల గారు అడుగుతే 'లేవు 'అన్నప్పుడు 'ఏదైనా రాయండి' అన్నారు

      ఒక్క జ్ణాపకాన్ని నాకు ఇవ్వని నాన్నగురించి ఏమి రాస్తాను.

నాకు ఊహ తెలిసే సరికే జబ్బు తో ఉన్నారు.అమ్మ వంటి మీద నగలతో సహా అంతా కరిగి పోయింది.మరీమరీ మెదడు మడతలని విప్పగా ఆదివారాలు త్రినాధ స్వామి వ్రతం చేసేవారు అన్నది గుర్తువచ్చింది.వీధివరండాలో వెడల్పు బల్ల మీద కూర్చుని " లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే" అంటూ గజేంద్ర మోక్షం పద్యాలు చదివిన గుర్తు ఛాయా మాత్రం గా కదిలింది.

    గాలి మార్పు ఉంటే ఆరోగ్యం కుదుట పడుతుందేమో నాన్నగారిని అక్కయ్య ఇంటికి అనకాపల్లి కి తీసుకు వెళ్ళినా లాభం లేక జబ్బు తిరగబెడితే రాత్రికి రాత్రే విజయనగరం వచ్చేసి పెద్ద మామయ్య  ఇంటికి తెచ్చారు.

  చీకటి పడుతున్నవేళ నేను లోపల గదిలో చందమామ కథల్లో రెక్కలు గుర్రం మీద స్వారీ చేస్తూ సప్తసముద్రాలు దాటి కథల కడలిలో మునుగీతలు కొడుతుంటే "'చిన్నది ఏదీ "అంటూ పుస్తకంతో పాటే చెయ్యిపట్టి ఎవరో  నన్ను లాక్కొచ్చి అమ్మ పక్కన కూలేసారు.అంతవరకూ గట్టిగా గురక పెట్టి ఆగిన నాన్నగారి నిశ్చల దేహాన్ని చూస్తున్న నన్ను  అమ్మ ' వెళ్ళు చిన్నా చదువుకో' అని లోపలికి పంపించేసింది.ఇంతే నా జ్ణాపకం.

  ఏడుగురు అన్నదమ్ముల మధ్య పుట్టినదీ అందరిచేతా రాజూ,రాజమ్మా అని పిలిపించుకున్న అమ్మ తీవ్ర ఆర్థిక సంక్షోభం లో జీవితం అస్తవ్యస్తంగా తయారైంది. నలుగురు పిల్లలతో నిస్సహాయంగా నిలిచింది. అమ్మ ఆ తదనంతరం జీవితం లో ఎదుర్కొన్న వివక్షలూ,అవమానాలూ, ఇబ్బందులూ వీటన్నటి మధ్యలో కూడా నిబ్బరం గా ఉండేది.ప్రభుత్వ ఉద్యోగం లో ఉండగా నాన్న  చనిపోయినా ఫేమిలీ పెన్షన్ అమ్మకి వచ్చే ఏర్పాటుఎవరూచేయలేదు.బహుశా ఆమెకు ఆర్ధిక తోడ్పాటు కలుగుతే తాము ఆమెపై పెత్తనం చెలాయించి అణగదొక్కటానికి కుదరదనే పెన్షన్ రాకుండా చేసారేమో.  

     నాన్నగారి వాటా పొలం మీద కౌలు చేస్తున్న వాళ్ళు ఏడాదికో ఎప్పడో దయాదాక్షిణ్యం గా పంపే  ధాన్యం బస్తాలు ఒక ఎనిమిదో పదో వచ్చేవి, నాలుగైదు కుంచాల పెసరపప్పు  వచ్చేది.ధాన్యం పట్టటానికి మిల్లరు డబ్బు బదులు,చిట్టూ,తౌడూ తీసుకునేవాడు.అమ్మ బియ్యం జల్లించగా వచ్చిన నూకలు ఇచ్చి కూరలవి కొనేది.  ఉంటే తినటం,లేకుంటే పిల్లలకు పెట్టి  పస్తులు ఉండటమే తప్పా  ఎప్పుడూ ఎవరినీ నయాపైసా అడగకుండా,లేదు అనే మాట నోట రాకుండా జీవితం గడిపింది.మమ్మల్నీ అలాగే పెంచింది.పుట్టినరోజున ఇంట్లో ఉన్న బియ్యం తోనే పరమాన్నం వండి పెట్టేది.

     మా పెద్దన్నయ్యకి శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి లో ఉపాధ్యాయ ఉద్యోగం రాగానే అందరం అక్కడికి వెళ్ళిపోయాము.అక్కడా అదే గుట్టుగా సాగే జీవితమే.

      ఏడోతరగతిలోనే నేను రజస్వలనౌతే బట్టలకూ, వేడుకలకు డబ్బు అడిగి  కొడుకు చేత కూడా ఖర్చు పెట్టించటం ఇష్టంలేక  ఎవరికీ తెలియనీయలేదు.ఆ విధంగా సుమారు రెండేళ్ళపాటు దాచింది.అదృష్టమో,దురదృష్టమో నేను బలహీనంగా చిన్నగా ఉండేదాన్ని.నా మైలబట్టలను తానే బహిష్టు అయినట్టు గా ఉతికింది.నావే కాదు తర్వాత తర్వాత కోడళ్ళ పురుళ్ళకి కూడా  వాళ్ళ ముట్టు గుడ్డలు కూడా ఉతికినా కూడా అవాకులు చవాకులు అందుకుని మౌనం వహించిన  ప్రేమమూర్తి.

     పురుడు పోయటానికి కూతురు ఇంటికి వచ్చినందుకు ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు " మా అమ్మ అయితే ఇలా కూతురు ఇంటికి వచ్చి పురుళ్ళు పోయదు" అని వెటకారంగా మాట్లాడినా కూతురు జీవితాన్ని దృష్టి లో పెట్టుకొని  నోరెత్తని సహనమూర్తి.

      రెండో మనవరాలు పుట్టాక నామకానికి పదకొండో రోజు చీర ఉయ్యాల కట్టి పాపాయిని అందులో పడుకో బెట్టి  అక్షింతలు వేయమంటే వేస్తూ" మేము లైన్లం( lions) మాకు ఆడపిల్లలు పుట్టర"ని మీసాలు మెలేసి  అంటున్న ఇంట్లో వాళ్ళని నిరసన చూస్తూ మౌనం వహించి, నెలలోపునే పిల్లలతో సహా నన్ను తీసుకుని విజయనగరం  వచ్చేసింది.దురదృష్ట వశత్తూ అర్భకంగా పుట్టిన పిల్ల డయేరియా తో మూసిన కన్ను మరి తెరవకపోతే ఆడపిల్లని నిరసనగా చూసే ప్రపంచంలో ఉండలేక పోయిందని,ఆ దుర్ఘటన తన ఇంట్లో ఉండగా జరిగినందుకు కన్నుతెరవని పాపాయికి మట్టి దుప్పటి కప్పి నన్ను అక్కున చేర్చుకుని కుంగిపోయింది.

      నా డెలివరీ లో కోసం హాస్పిటల్ లో ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తున్న ఆయాలను చూస్తూ ఇంట్లో ఐనా చేసేది ఇదే పని కదా ఈ పని దొరికినా బాగుణ్ణు.ఎవరిమీదా ఆధారపడకుండా బతకొచ్చు'అనేది.మొదటి నుండి అమ్మకి ఆర్థిక స్వావలంబన లేక పోవటం వలనే ఇన్ని అవస్థలు పడింది అనేది నాకు మనసులో నాటుకు పోయింది.స్త్రీ ఎంతో కొంత సంపాదించి గలిగే విద్యార్హతలు పొంది ఉండాలి.ఆర్థిక స్వావలంబన వలన స్త్రీ కి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది అని నా నమ్మకం.అందుకే ఉద్యోగం చేయాలని నేను ఆరాటపడ్డాను.కాని ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, పిల్లలూ, రోగాలూ రొష్టులూ మరో పదేళ్ళు కు గానీ ఉద్యోగం చేసే వెసులుబాటు కలగలేదు.టీచర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు చదువు అశ్రద్ధ చేసే ఆడపిల్లలకు "ఎప్పుడేం అవసరం వచ్చినా చిన్న ఉద్యోగం కావాలన్నా పదోతరగతి పాసవ్వటం ముఖ్యం"అని చెప్తూ ఉండేదాన్ని.

     అమ్మ 75 ఏళ్ళు ఏరోజూ విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తూ చేస్తూనే కుప్ప కూలిపోయింది.మూడురోజులు గొట్టంద్వారా ద్రవపదార్థాలు అందుకుని నా ముందే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన అమ్మ నా జ్ణాపకాలలో నిరంతరం  చిరస్థాయిగానే ఉంటుంది .కన్న పిల్లల కోసం కొవ్వొత్తులలా కరిగే ఇటువంటి అమ్మలు ఎంతోమందికి ఉండే ఉండొచ్చు కదా. కానీ కొవ్వొత్తి కరిగిపోయినా అది నింపిన వెలుగు పిల్లలగుండెల్లో నిత్యం కాంతులీనుతూనే ఉండాలి.

 

అనగనగా ఒక చిత్రకారుడు

 " అనగనగా ఒక చిత్రకారుడు" అని కథ మొదలు పెట్టిన అన్వర్ కవిత్వం లాంటి వచనాల పంక్తుల దారెంటే ప్రయాణిస్తూ పాఠకులనీ చెయ్యి పట్టుకుని ఎందరు చిత్రకారులనో ఎన్నికథలనో, ఇంకెన్ని చిత్రాల్నో, మరెన్ని సినిమాల్నో,ఇంకెన్నెన్ని చరిత్రల్నో పరిచయం చేస్తూ లోతుల్లోకి  లాక్కెళ్ళి పోయాడు.

            ఇంతకీ ఇతను చిత్రకారుడా,కథకుడా అనే సందేహం నన్ను వేధించింది.కొంచెం దిగులు కూడా వేసింది.శీలావీని రచయితలు చిత్రకారుడనీ, చిత్రకారులు రచయిత అనీ అంటూ తమకు అడ్డు లేకుండా ఏ కేటగిరీ లోను చేర్చకపోతే శిష్య ప్రశిష్యులు లేని ఆ అమాయకుడు ఏదో తనకోసం తానే,,తనలోకంలోతానే తపోముద్రలో మునిగిన మౌనిలా అయ్యారు.

          పాపం ఈ అన్వర్ కూడా ఈ కేటగిరీ లోకి వచ్చేస్తాడా ఏమిటి,? ఆయనకి అస్మదీయులు ఉన్నారా లేదా అని దిగులు.

             ఇవన్నీ ఈసారి అన్వర్ కలిసి నప్పుడు చెప్పొచ్చులే అనుకున్నాను.కానీ అక్షరం నా నోట్లో నాలిక కిందే దాక్కుని ఉండిపోతుంది.వేళ్ళలోంచే కలం గుండా  ఉబికి వస్తుంది.అందుకే రాయటమే మొదలు పెట్టాను.

               వేటూరి విక్రమ్ మోహన్,బాపూ,చంద్ర,కాళ్ళు,కరుణాకర్,శేఖర్ వంటి తెలుగు చిత్రకారులనేకాక పులక్ బిశ్వాస్,బట్లాగియా విక్టర్,ఆంబ్రూస్,ప్రింటర్,జాన్ క్యూనో లతో చేతులు కలిపించి బొమ్మల మంత్రజాలం లో మననీ తనతోబాటూ మునుగీతలు వేయిస్తాడు.

            ఎమ్ ఎస్ నాయుడు,అజయ్ ప్రసాద్, శ్రీ రమణలతో తన పరిచయం చెప్పి ఊరుకోకుండా ,అమృతాప్రీతం, గుల్జార్,కైఫీ మోహంలో పడేస్తాడు.

         సరే   ఆర్కే, పతంజలి,వేలూరి శివరామ శాస్త్రి నీ నేనూ చదువుకున్నా కదా. కవిత్వం వేరూ జాతి వేరు అంటూ జాషువా నీ, నల్ల కళాకారుడు డాన్ షిర్లేని సాదృశ్యం చేసి చూపాడు. 

గ్రీన్ బుక్ సినిమా కథలోని డాన్ షిర్లేకి తప్పని పరిస్థితుల్లో డ్రైవర్ గా పనిచేసిన టోనీ లిప్ వాలెన్గా గురించి చెబుతూ ఈ సినిమా మన మనసుల్లో లేని కన్నాలని తవ్వి చూపుతుందంటాడు.చరిత్ర చిన్నదీ, మనసు పెద్దదీ,ప్రేమ గొప్పది అని చెప్పి తన కంక్లూజన్ తో మనల్ని గుండె తడుముకునేలా చేస్తాడు.

            అన్వర్ నే కాక మనల్ని ఏడిపించిన ప్రభూతి జోషీ ఇంటర్వ్యూ,కన్నడ రచయిత వసుధేంధ్ర రాసిన ఎర్రచిలుకల్నీ,గౌరీ కృపానందన్ అనువదించిన పెరుమాళ్ మురుగన్ నవల నల్లమేక పునాచ్చీని తీసుకొచ్చి మన కళ్ళల్లో కట్టేస్తాడు.

        " ఆర్టిస్ట్ గా ప్రపంచాన్ని నమ్మించడం సులువు ఆర్టిస్ట్ గా సిసలు క్రాఫ్ట్స్ మేన్ గా నిన్ను నువ్వు ఒప్పించాలను కోవటం కుదరని కార్యం". ఎంతో నిజాయితీ ఉంటే గానీ ఇలా అనలేరు.                     బొమ్మ ఎలాగు వేయాలో డీటైల్డ్ గా చెపుతాడు.

            బతికిఉన్నప్పుడు నవ్వినా నవ్వక పోయినా ప్రపంచానికి వదిలే చివరి స్మైలీ అని పుర్రెని చూస్తే అనిపిస్తుంది అన్నాడంటే ఎంత తాత్విక దృష్టి అనుకుందామా ?

          అన్వరఫీ అక్షరాల పయనం లో ఎన్నెన్ని పాటలు వినిపించాడో !

          చేతిలో డబ్బులు కటాకటిగా ఉన్నా మాజిక్ టచ్ తో తాగుడుకో మరోదానికో అప్పిచ్చువాడూ ఇతడే తిరిగి ఇవ్వని వారికి దండం పెడతాడు.

            బొమ్మల దారిలో అన్వర్ ప్రయాణానికి ముందు అదే దారిలో అలాగే నడిచిన  మా జ్ఞాపకాల్ని ఒకసారి వెతుక్కున్నాను.

            కిటికీ బయట నుండి అద్దానికి అతుక్కు పోయి అన్వర్ బొమ్మల్ని తొంగి చూసే వానచినుకుల్లా అతని అక్షరాల్నో,బొమ్మల్నో చూడాలనుకుంటే  "అనగనగా ఒక చిత్రకారుడు" లోకి మీరూ తొంగి చూడాల్సిందే.

సవాలక్ష సందేహాలు- పుస్తకం పరిచయం

 ఈ రోజు నేను పరిచయం చేయాలనుకున్న పుస్తకం" సవాలక్ష సందేహాలు ( స్త్రీలు- ఆరోగ్యం సమస్యలు)" 

           సుమారు తొమ్మిది సంవత్సరాల కాలం స్త్రీ లే ఆరోగ్యం సమస్యలు గురించి అందరికీ అర్థం అయ్యే విధంగా ఒక పుస్తకం తీసుకు రావాల్సిన అవసరం గురించి అనేక విధాలుగా చర్చలూ, ప్రయత్నాలు, పరిశోధన ఫలితంగా ఈ పుస్తకాన్ని 1991 లో స్త్రీ సంఘటన  ప్రచురించింది .

              వీణా శతృఘ్న,కె.లలిత,ఉమా నారంగ్,ఉమా మహేశ్వరి,గీతా రామస్వామి, రామరాజ్యం,సుమతీ నాయర్ ఒక గ్రూప్ గా ఏర్పడి కూర్చిన పుస్తకం.

            అందులోనూ నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, ఆర్ధిక అసమానత, అనేకానేక వివక్షల కారణంగా  స్త్రీ లను రోజువారీ బాధించే ఆరోగ్య సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేక డాక్టర్లను తమ సందేహాలను గూర్చి ప్రశ్నించలేక, కొన్ని సందర్భాలలో డాక్టర్లు మాట్లాడే థోరణులనూ, అవమానాలు దిగమింగే వ్యవస్థ ని గమనించి కూర్చిన పుస్తకం.

          1971 లో " మన శరీరాలు- మనం (Our bodies- Our selves)" పుస్తకాన్ని ఫెమినిస్ట్ ఉద్యమం లో భాగం గా  బోస్టన్ ఉమెన్స్ హెల్త్ కలెక్టివ్ వారు ప్రచురించారు.

           1982లో ఆ పుస్తకం తో ప్రభావితమై చర్చలు జరిపి తొలుత అదే అనువదించాలనుకున్నారు.సౌకర్యాలులేని, అధికశాతం మంది, దారిద్ర్యం, నిరక్షరాస్యత తో బాధపడే మన ప్రజలకూ,మన స్త్రీలకూ పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి కి పోలిక లేదని భావించారు.

             గ్రూప్ సభ్యులంతా గ్రామాలు,పట్టణాల లో గుడిసెల ప్రాంతాల కీ,నర్సింగ్ హోం లోకీ,ఆసుపత్రులకీ,స్నేహితుల ఇళ్ళకీ ఇలా ప్రతీ చోటుకీ వెళ్ళి తెలుసుకున్న ఫలితాలకు విస్తు పోయారు.

        అంతులేని స్త్రీల సమస్యలూ,సమస్యలలోతులూ,సంఘంతో, కుటుంబం తో వైద్య వ్యవస్ధ తో స్త్రీలు పడే బాధలు అవమానాలు గమనించారు.

          ఈ పుస్తకం ఎవరికోసం అనేదాన్ని గురించి చర్చించిన విషయాల్ని" పుస్తకం గురించి"అని ముందు గా వెళ్లారు." మధ్యతరగతి స్త్రీ లా,ఇళ్ళల్లో స్త్రీ లా, విద్యార్ధినుల, రైతాంగం స్త్రీ లా,కార్మికస్త్రీలా? అన్నివర్గాల సమస్యలన్నీ,పట్నవాసులు, పల్లెవాసుల,పేర్లూ,ధనికులూ అందరు స్త్రీలూ సాధారణంగా ఎదుర్కొధేనే అన్ని విషయాల్నీ చేర్చికూర్చాభన్నారు

          అందరికి అర్థం అయ్యె లా సరళం గా, ఆసక్తికరంగా రాయటానికి ప్రయత్నం చేశారు.83 నాటికి ఒక కొలిక్కి తెచ్చి 84 చివరికి రాసిన అధ్యాయాలు సూఫీ,వసంత,రాణీ మొదలైన వారికి ఇచ్చి మళ్ళీమళ్ళీ తిరగరాసి 89 నాటికి ఒక రూపుకు వచ్చింది.అశ్లీలపదాలో,డాక్టర్ల సాంకేతిక భాషలో కాకుండా వాడుక భాషలో రాసే ప్రయత్నం జరిగింది.

          ముఖచిత్రరూపకల్పన లక్ష్మాగౌడ్,లోపల పేజీలలో అవసరమైన ఫొటోలు బాల్ రెడ్డి,శ్రీవత్సన్,బొమ్మలు లక్ష్మీ వేయగ1991 కి పుస్తకం రూపం దాల్చింది.

          ముందు మాటలో బ్రిటిష్ కాలం నుంచ మారుతోన్ ని వైద్యవిధానము, స్త్రీ లను మూర్ఖులు గా పిల్లలను కనేయంత్రం గా బాధ్యతారహితమైన తల్లులు గా మార్చే వ్యవస్థ గురించి సవినయంగా తెలిపారు.

          అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సాయంతో కొత్తగా రైతాంగం నిరోధసాధనాల ప్రయోగంలో స్త్రీ లును గినీపిగ్ లుగా చేయటాన్ని ఎదిరించారు.

          చివరగా " అందుకే వైద్యం వ్యవస్థ ను విమర్శనాత్మకంగా పరిశీలించేందుకు, సాధ్యమైనంతవరకు ఈ గందరగోళం లో మళ్ళీ, మన శారీరక, మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి మాకున్న సమాచారాన్ని, సందేహాలను అందరితో పంచుకోవాలనే చిన్న ప్రయత్నం ఈ పుస్తకం" అని సంపాదకవర్గం తెలియజేసారు.

          ఇందులోని ముఖ్యాంశాలు తెలుసుకోవటానికి ఈ పుస్తకం లోని విషయసూచిక ఫొటోను మీ ముందు ఉంచుతున్నాను.

          ఈ పుస్తకం లో పొందు పరచిన  ప్రతీ విషయం మహిళలంతా తెలుసు కోవాల్సినవే.  

          కుటుంబం లో స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే,ఆరోగ్యవిషయాల పట్ల అవగాహన ఉన్నప్పుడే ఇంట్లో పిల్లలంతా ముఖ్యం గా ఆడపిల్లలు శారీరక మానసిక ఆరోగ్యం కలిగిఉంటారు.

            ఈ పుస్తకం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా  ఆరోగ్యసంస్ధలూ, ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉంది.

           ముఖ్యంగా బస్తీల్లో, మారుమూల పల్లెల్లో పనిచేసే కార్యకర్తల కు ప్రత్యేక వర్క్ షాప్ లు ఏర్పాటుచేసి,ఈ పుస్తకం చదివించి అవగాహన కల్పించి మహిళలను జాగృత పరిచేలా చేస్తే బాగుంటుంది.

11, ఫిబ్రవరి 2021, గురువారం

దేవుడి బండ కథ- నా విశ్లేషణ

 దేవుడిబండ కథ 1987 లో విపుల మాస పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందింది.

మేము1985లో హైదరాబాద్ లో మలక్ పేట లోని ఇంటికి మారిన తర్వాత నేను రోజూ స్కూల్ కి వెళ్ళేటప్పుడు సూపర్ బజార్ బస్ స్టాప్  లో బస్ కోసం  ఎదురు చూసే దాన్ని. బస్ స్టాప్ వెనుక రోళ్ళుకొట్టి అమ్మే వలసజీవులు తాత్కాలికంగా ఇళ్ళు కట్టుకొని ఉండేవారు.ఆ వెనుక అంతా ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ ఉంటాయి.

బస్ వచ్చేవరకూ వారి జీవనవిధానం గమనించటం నా నిత్యకృత్యం.సాయంత్రం వచ్చేక వాళ్ళ ఇళ్ళ మధ్యనుండే మా ఇంటికి తిరిగి   వెళ్తూ గమనించే దాన్ని.

      ఈ కథలో బాలయ్య అనే బాలుడు పొత్రాలకు గంట్లు కొడుతూ బాస్ స్టాండ్ ముందునుండి యూనిఫాం వేసుకుని వెళ్తున్న స్కూల్ పిల్లల్ని చూసి తాను కూడా అలా వెళ్ళాలని కలలు కనటం కథలో ప్రస్తావించటం లో చదువుకోవాలనే కోరిక ఉన్నా  చదువుకు దూరమౌతోన్న వలసజీవులు,పేదల చితికిన కలల్ని చెప్పాను.

      వివిధ యంత్రాలు వంటింట్లో కి రావటం వలన రోళ్ళు అమ్ముడు కాకపోవటంతో బతుకు బండలైన జీవితాల్ని చూపించడానికి ప్రయత్నించాను.

      పాడైపోయిన పొత్రం యాదృచ్ఛికంగా గ్రామ దేవత గా మారిందని వ్యంగ్యంగా చెప్పటంలో ప్రజల్లో గూడుకట్టుకున్న మూఢనమ్మకాలు బట్టబయలు చేయటానికి ప్రయత్నించాను.

        అమీర్ ఖాన్ ' పీకే' చిత్రంలో చూపిన  ఇటువంటి దృశ్యం నా కథలోని సంఘటనతో సాదృశ్యం గా ఉండటం సినిమా చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించింది.

        ఈ కథ తెలంగాణా మాండలికంలో రాసిన నా తొలి కథ.ఆ తర్వాత చాలా కథలు ఈ మాండలికం లోనే రాసాను.

        1989 లో అనుకుంటా డి.రామలింగం గారు కేంద్ర సాహిత్య అకాడమీ కోసం యువతరం రచయితలు రాసిన కథల సంపుటి గా "ఒకతరం తెలుగు కథ" పేరున సంకలనం చేసి ప్రచురించిన సంపుటి లో దేవుడు బండ కథ కూడా చేర్చ బడింది.అప్పట్లో ఆ కథ చాలా మంది ప్రశంసలు అందుకుంది.

        1990 లో నేను ప్రచురించుకున్న మొట్టమొదటి కథలసంపుటీ లో ఈ కథ చేర్చడమే కాక సంపుటిని దేవుడిబండ  పేరుతోనే వెలుగు లోకి తెచ్చాను.ఇదీ నేను ఈ కథ గురించి చెప్పదలచుకున్నది.