18, జూన్ 2020, గురువారం

నేనే వర్షరాణిని

వర్షరాణీ

నేనే వర్షరాణిని

నీలాకాశం చీరపై చెమ్కీమెరుపులు
నీరెండలో తళుక్కుమనగా
సమయమైందని బద్ధకంగా లేచి
పక్షులమేతకై గింజల్ని విసిరినట్లుగా
గ్రీష్మతాపంతో సొమ్మసిల్లిననేలముఖంపై
మబ్బుపిడికిల్ని విసిరాను
రాలినచినుకులు క్షణంలో ఆవిరై
రెట్తింపుసెగని విరజిమ్మాయి

ఇరుగుపొరుగుపిల్లల్ని ఆటకి పిల్చినట్లు
అన్నిదిశల్నుండి మేఘమిత్రుల్ని కలుపుకుంటూ
నల్లగొడుగునింగి దారిలోకదిలాను
ఒక్కోమువ్వనీకూర్చుకుంటూ అల్లిన
ముత్యాలకొంగును ఉండుండి విసురుగావిదిల్చానేమో
జలజలా వడగళ్లు విరజిమ్మాయి
వర్షగాలిలో తూనీగలై తిరుగుతోన్న
పసిపాపలదోసిళ్లన్నీ ముత్యపుచిప్పలయ్యాయి
వారితో కాసేపు ఆడుకుని
విసుగ్గా ఓసారి ఉరిమిభయపెట్టి
ఇళ్ల్లోకు తరిమాను.

తిరిగిబయల్దేరి
నల్లమబ్బుల దుప్పటిని వాడవాడల్నీ
ఊరూరా కప్పేస్తూ
విద్యుల్లతలకాగడాలతో
మెరుపుకర్రల కోలాటాలతో
ఉండుండి గుండెలదరగొట్టే తీన్మార్ 
పిడుగులదరువులతో
నలుదిక్కులా గర్వరేఖలు ప్రసరిస్తూ
నేనేకదా వర్షరాణినని   
మబ్బుకారుపై ఊరేగేదాన్నే
కానీ
ఏ అర్ధరాత్రో సడిసేయకుండా
నట్టింట్లో అనకొండై బిరబిరా పాకుతూ
బీదగుడిసెల్ని మింగాలనో
అసహాయుల్నూ అనాథల్నీ కాలనాగై కాటేయలనో
ఉత్సాహపడుతూ కాపుకాసిన
క్యుములోనింబస్ మేఘాల్ని ఒఫిసిపట్టి
కొంగున భద్రంగా కట్టేసుకొని
నెర్రెలువారిన పొలాలమీదుగా
ఎండిననదులదారుల్లో
కాల్వలతీగల్ని సుతారంగా మీటుకుంటూ
మేఘమల్హరినై ఒద్దికగా నడిచాను.

12, జూన్ 2020, శుక్రవారం

తెలుగు భాష ఆడవాళ్ళకు ప్రత్యేకం గా ఇచ్చిన వరాలు ఏవి

స్త్రీల నోముల పాటలు, పెండ్లిపాటలూ, బతుకమ్మపాటలూ, జోలపాటలూ, పండుగపాటలూ, వేడుకపాటలూ మొదలగునవి తెలుగుభాష ఆడవాళ్ళకు ఇచ్చిన ప్రత్యేక వరం..ఇది మామనవరాలు 7 వ తరగతి ప్రధమ భాష తెలుగు పరీక్షకోసం చదువుతుంటేవిని తెల్లబోయాను. 7 వ తరగతి పుస్తకం లోని 12 వ పాఠం ‘తెలుగు వెలుగు” లో తెలుగు భాషగొప్పదనాన్ని తెలియజేసేందుకు ఉద్దేశించి పెట్టినది కావచ్చు.ఇది మాత్రమే తెలుగు భాష వల్ల స్త్రీలకు లభించినది అని మన తెలుగు చదివే మన పిల్లలు నేర్చుకొంటున్నారు….
తెలుగుభాషకి చెందిన సాహిత్యం చదివే కదా? మన ఆలోచనలు వికసించాయి.అవి చదివేకదా మనం మన అస్తిత్వం కోసం కల గంటున్నది.అవి చదివేకదా మనం కూడా ఇంత సాహిత్యాన్ని పండిస్తున్నది.మరి పసితనం లోనే ఆలోచనలు కత్తిరించేలా ఆ పాఠాన్ని చేర్చినవాళ్ళు ఆలోచించలేదేమిటీ చెప్మా?
ఇంకా ఘోరం ఏమిటంటే పాప 5వ తరగతి లో వున్నప్పుడు పిసినారి అని ఒక పాఠం వుండేది.అందులో పిసినారి పాయసం తినాలనిపించి చేయించుకొని తీరా బంధువు ఒకడు వస్తే వానికి భోజనం పెట్టాల్సి వస్తుందని చనిపోయినట్లు నటిస్తాడు. అప్పుడు అతని భార్య తన పసుపు కుంకుమలు పోయాయని ఏడుస్తుంది.
ఆ పాఠం లో ప్రశ్న పిసినారి భార్య ఏమని ఏడుస్తుంది? తన పసుపుకుంకుమలు పోయాయని ఏడుస్తుంది అనేది సమాధానం. ఏడ‌వ‌త‌ర‌గ‌తి చదువుతున్న పిల్లలకి పసుపు కుంకుమలు పోవటమంటే అని సందేహం వస్తే ఏమని చెప్పాలి! కుంకుమా పసుపు ధ‌రించ‌డం అందరికి పుట్టుకతో వచ్చే హక్కు. ఇది ఆ వయసు పిల్లలకేకాక ప్రతీ పిల్లల గురించీ ఆలోచించాల్సిన పరిస్థితి వుంది. పిల్లలకి చిన్ననాటీనుండీ మూఢ విశ్వాసాల్ని నింపుతోన్న సిలబస్ని మార్చాల్సిన అవసరం ఎంతో వుంది. అందుకోసం అభ్యుదయ భావాలున్న సాహితీవేత్తలు వుద్యమించాల్సివుందని అనుకుంటున్నాను.

6, జూన్ 2020, శనివారం

ఇస్కూలు కతలు గురించి జొన్నవిత్తుల శ్రీ రామచంద్రమూర్తి గారి సమీక్ష

శీలా శుభద్రాదేవిగారి "ఇస్కూలు కతలు"

ప్రభుత్వోపాధ్యాయులకెదురయ్యే మొట్టమొదటి సమస్య-అదనపు బాధ్యతలు.
పేద పిల్లల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ మొదలు జనగణన దాకా అన్నింటిలోనూ అయ్యవార్ల పాత్ర ఉండాల్సిందే. ఒక్క మనిషి అన్ని పాత్రలు ఏకకాలంలో ఎలా పోషించగలడనే విషయం ఈ ప్రభుత్వాలకు తెలియదా? మేమేం మనుషులం కాదా? అంటూ ప్రశ్నించడం మొదలుపెడితే అది హక్కుల సాధన వైపుగా నడిపిస్తుంది. ప్రభుత్వాలని బోనులో నిలబెడుతుంది. ఒకవేళ ఆ అయ్యవార్లకే సామాజిక అభివృద్ధిలో తమవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నామనే ఎరుక కలిగితే? అది బాధ్యతలని మరింత ప్రభావయుతంగా నడిపేవైపుగా ముందడుగు వేయిస్తుంది. అప్పుడు విద్యార్థి అంటే కేవలం విద్యార్థి మాత్రమే కాదనీ అతని కుటుంబ నేపథ్యం కూడా అతనిలోంచీ విడదీయరాని ప్రధానాంశమనే అవగాహన కలుగుతుంది. అది కలిగాలేగానీ అయ్యవార్లకీ పిల్లకాయలకీ మధ్య ఒకానొక బాంధవ్యం పెనవేసుకుపోతుంది. అప్పుడు వారి పట్ల జాలి కలగదు. వారినా పరిస్థితుల్లోంచీ బయట పడెయ్యడం ఎలా? అనే ఆలోచన కలుగుతుంది. అలాంటి ఆలోచనలు రేకెత్తించే కథల పుస్తకమే,"ఇస్కూలు కతలు"
పిల్లలకీ తల్లిదండ్రులకీ ఎలాంటి అనుబంధం ఉంటుందో అలాంటి సంబంధమే ఉపాధ్యాయులకీ విద్యార్థులకీ మధ్య కూడా ఉండాలి. అది ఉన్నప్పుడు విద్యార్థుల ప్రశ్నలకి సమాధానాలు మాత్రమే కాదు, వారి సమస్యలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. అలాంటి పరిష్కారాలు కనుగొన్నప్పుడు కలిగే ఆనందాన్ని జీతాలుగానీ, పదోన్నతులుగానీ, హంసతూలికా తల్పాలవంటి సవాలక్ష సుఖాలుగానీ ఇవ్వలేవు. సుఖాల సరిహద్దుల్ని చెరపడానికీ ఆనందపుటంచులు తాకడానికీ తేడా తెలుసుకోవలసిన మొట్టమొదటి బుద్ధిజీవి అయ్యవారే. ఆ తేడా తెలియజేసేవి ఉపాధ్యాయులకు పనిభారాన్ని పెంచే అదనపు బాధ్యతలే. ఆ అదనపు బాధ్యతలు వారికి సమాజంతో నేరుగా"ముఖా-ముఖీ"ని ఏర్పాటు చేస్తాయి. అందుకే ప్రజల సమస్యలు అందరికంటే ఎక్కువగానూ ముందుగానూ అయ్యవార్లకే తెలుస్తాయి. అందుకే ముందు తరాల్ని ఉన్నతీకరించే సాహిత్య సృజనకారుల్లో అధికశాతం ఉపాధ్యాయులే అయివుంటారు. అది అయ్యవార్లకీ అమ్మయ్యలకీ గర్వకారణం. ఒకవేళ సృజనకారులు ఉపాధ్యాయ వృత్తిలో లేకపోయినా వారిలో బోధనా సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఎందుకంటే విద్యాబోధనని మించిన సృజనాత్మక కళ మరొకటి లేదు. ఉపాధ్యాయులకు బోధన-విద్యార్థులకు సాధన. ఈ రెండూ అర్థ పూర్ణాలు. వాటిని పరిపూర్ణంగా చెయ్యడం మార్కులు, ర్యాంకులవల్ల కాని పని. ఈ విషయం దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా నిరూపితం అవుతూనే ఉంది. దాన్ని అందరికీ తెలియజేసే బాధ్యతని తలకెత్తుకున్న అరుదైన ఉపాధ్యాయిని అరుంధతి. ఆవిడకి సంబంధించిన ముప్ఫై కథలున్నాయిందులో.
ఇందులోని కథలన్నీ చిన్నవి. నాలుగు పుటలకి మించవు. కాబట్టీ ఏ కథా చదువరినించీ ఎక్కువ సమయాన్ని తీసుకోదు. వస్తుపరిధిని దాటి ఒక్కవిషయం కూడా ఉండదు. కథకి అవసరంలేని మాట ఒక్కటికూడా కనపడదు. దేనికదే క్లుప్తంగా సూటిగా స్పష్టంగా చెప్పాల్సింది మాత్రమే చెబుతుంది. కనుక చదవడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. చాలా సరళమైన భాష. సుభద్రాదేవిగారు స్వతహాగా కవయిత్రి కాబట్టీ కథలన్నీ కవితామయంగానూ తరచి చూస్తే తప్ప కనపడని భావాలతోనూ నిండి ఉంటాయేమోనని సందేహించాల్సిన అవసరం లేదు.  కథ చెప్పేటప్పుడు కవయిత్రిలా వర్తించకుండా నిగ్రహం పాటించడం వల్లనే ఇది సాధ్యపడింది. అందుకే అరటిపండు వలిచిపెట్టినంత చులాగ్గా సాగుతుంది పఠనం. ఇందులో కథలన్నీ అయ్యవార్లందరికీ అనుభవంలోకి వచ్చేవే. కనుక ఆయా సందర్భాలెదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎలాటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకోవడానికైనా ఉపాధ్యాయులందరూ ఈ కథలు చదవాలి. అందుకే ఈ కథలన్నింటినీ "తెలుగు విద్యార్థి" ధారావాహికంగా ప్రచురించింది. మహారాష్ట్రలోని ఏడవ తరగతి తెలుగు విద్యార్థులకి "ఒకే తాను ముక్కలం"పాఠ్యాంశం.
ఇంక కథల గురించి:
ఇవి "బాధ్యతల్ని గుర్తు చేసే కతలు"అంటూ కథల తూకం వేశారు గంటేడ గౌరునాయుడు. తరవాత "నామాట"మీదుగా వచ్చి ఉపాధ్యాయులకి "అందరం ఒకేతాను ముక్కలం" అని తెలియజెప్పడం ద్వారా అందరి మనసూ గెలుచుకుంటుంది అరుంధతి. ఆ తరువాతే ఆత్మీయంగా ఆరంభమౌతుంది ఆమె పయనం. ఎవరికైనా నడక ఆరంభించగానే ఎదురయ్యే మొదటి ప్రశ్న..,"ఈ దారి ఎక్కడికి?"
దానికి సమాధానమిచ్చే క్రమంలో కొందరు "పరాన్న భుక్కులు"ఎలా ఉంటారో పరిచయం చేసి, విద్యార్థులతో"నువ్వు నేర్పిన విద్యయే"అనిపిస్తారు. ఒకవేళ ఏదైనా "మూఢనమ్మకం"మీద "ఆరాధన" పెంచుకుంటే ఏం జరుగుతుంది? అది "బాధ్యత"లనుండి తప్పించి "పరిస్థితులకు బానిసలు"గా మార్చి "పనిదొంగలు"గా తీర్చి చివరికి "అవును, ఇది సర్కారు బడి మరి!"అనే నైరాశ్యానికి దారితీస్తుంది. "లేత మనసులపై మలిన ముద్రలు" వేస్తుంది. అలాంటప్పుడు పూలబాలలు పెంచిన మంచిని చూపిస్తూ,"ఆమాత్రం చాలు, మనసు పులకించడానికి"అని బుజ్జగిస్తుంది. అంతలోనే కొందరి "మరుగుజ్జు బుద్ధులు"తమ చుట్టూ ఉన్న "పరిసరాలు-పక్కదారులు" తొక్కించే "పందికొక్కులు"ఎలా ఉంటాయో చూపిస్తుంది. వాటినించీ తప్పించుకోవాలనుకునే"లేతమనసులకు, ధైర్యమే లేపనం"అని చెబుతాయి. ఇంతకీ అసలు "తప్పెవరిది?"అని "చేజారిపోతున్న బాల్యం" దీనంగా చూస్తూ"పేదరికపు అంచున"నిరాశా నిస్పృహలతో కర్తవ్య విమూఢంగా నిలబడిపోతుంది. అలాంటప్పుడు ఎవరైనా"లోగుట్టు"కనిపెట్టే ప్రయత్నం చేస్తే"కదిలిన అధికార పీఠం" స్వామికార్యం-స్వకార్యాలని" ఏకకాలంలో చక్కబెట్టగల "భోక్తలు"ఎక్కడ దొరుకుతారా అని గాలించడం మొదలుపెడుతుంది.
"సినిక్ సెన్స్" ఎక్కువైతే "కక్కూర్తి కూడా జాడ్యమే"అవుతుందని చెబుతుంది అరుంధతి. అంతేకాదు "ఆఫీసు జలగలు" పట్టుకుంటే "బకాసురుడు" తినడానికి ఎముకలు తప్ప ఏమీ మిగలదని వివరిస్తుంది. అయితే"చాణక్య రాజకీయం"విసిరే "మోహవలయాలు" ఎంత ఆకర్షిస్తున్నా లొంగకుండా ఏమాత్రం లౌల్యానికి లోనుకాకుండా తన జీవితంలో "తృప్తి"ని కలిగివుండి సమాజాన్ని సేవించుకోవడమే ఉపాధ్యాయ వృత్తికి పరమార్థమని నిరూపిస్తూ శీలా సుభద్రాదేవి పరిచయంతో ముగిస్తుంది. శ్రద్ధగా చదివిన ఉపాధ్యాయునికి మాత్రం భవిష్యత్కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికా రచనకు తగిన స్ఫూర్తినిస్తుంది. ఏ పుస్తకానికైనా ఇంతకంటే కాగల కార్యం ఏముంటుంది-గంధర్వులు తీర్చడానికి?