13, జులై 2026, సోమవారం

నడక దారిలో -67

నడక దారిలో -67 కరోనా విజృంభణ ఎదుర్కొని అప్పుడప్పుడే వూపిరి తీసుకుంటున్న ప్రజలకి కొత్త సంవత్సరం కొత్త ఆశల్ని మేల్కొల్పుతూ కొత్తవూపిరులూదింది. జనవరిలోబొమ్మలకొలువు హడావుడి వుంటుంది కనుక రచనలు తగ్గిపోతాయి.అయినా కరోనా కాలంలో చాలానే కవితలైతే చేసాను. చదవటం కొనసాగుతూనే వుంటుంది.ఎటొచ్చి ఇప్పుడు నారాయణరెడ్డి ట్రస్ట్ పుస్తకాలు ఎంపిక పని వలన ఇతర పుస్తకాలు చదవటానికి కుదరటం లేదు.ఇంచుమించుగా వాటిని చదవటం పూర్తి అయ్యింది. " ఇన్ని పుస్తకాలు ఉంటాయనుకుంటే ఒప్పుకోకుండా వుండాల్సింది.నీ సమయం అంతా దీనికే అయిపోతుంది కదా! పోనీ రెమ్యునరేషన్ అయినా ఇస్తారో లేదో తెలియదు "అనేవారు వీర్రాజు గారు. ఎప్పటిలాగే బొమ్మలకొలువు పెట్టటం, బిల్డింగ్ లో వాళ్ళూ, బంధుమిత్రులు రావటంతో ఆ వారం అంతా సందడిగా అయిపోయింది. తర్వాత రోజు ఉదయమే చిన్న మరిది తోడల్లుడు చనిపోయాడని ఫోన్ వచ్చింది.చాలాకాలంగా అనారోగ్యంగా వున్నా బాగానే వున్నాడని రెండురోజులముందే బొమ్మలకొలువు చూడటానికి వచ్చిన అతని భార్య సంధ్య చెప్పింది.ఆంతలో ఇలా జరగటం నిజానికి ఒక షాకే.వాళ్ళ చిన్నమ్మాయి యూ ఎస్ లో వుంటుంది.వచ్చే పరిస్థితి లేదు.దగ్గర్లో వుండే మా మరిదీ ,తోటికోడలూకూడా యూ ఎస్ లోనే వున్నారు.హుటాహుటీన పల్లవీ, నేనూ వాళ్ళింటికి వెళ్ళాము. మా మరిదికోసం,వాళ్ళ చిన్నమ్మాయి కోసం మనవరాలు ఫోన్లో వీడియో కాల్ పెట్టి పరిస్థితి అంతటినీ చూపిస్తుంది.అది చూసి నాకు దిగులైంది. చదువుకూ,వుద్యోగాలకూ పిల్లల్ని విదేశాలు పంపించేసి ఇక్కడ తల్లిదండ్రులు దిక్కులేని వారిలా అత్యవసర సమయంలో ఒంటరి వాళ్ళైపోతున్నారు . అందులోనూ ఇంకా కోవిడ్ భయం వెంటాడుతూనే వుంది.వేరియంట్స్ గా మారుతూనే వుంది.మూడోరోజు దినాలు కూడా వెళ్ళి వచ్చాం.అయిదురోజులు అయ్యేటప్పటికి నాకు తలనొప్పి వళ్ళునొప్పి మొదలైంది.డా.సూర్యప్రకాష్ గారు ఇప్పుడు వొమిక్రాన్ వేరియంట్ వూర్లో వుంది. ఐసొలేట్ అయిపోతే మంచిదని చెప్పి వాడాల్సిన మందులు చెప్తే వాడటం మొదలు పెట్టాను.మూడురోజులకే నాకు నార్మల్ కి వచ్చింది.కానీ మరో రెండు రోజులు కి పల్లవికి జ్వరం మొదలైంది.ఇమ్యూనిటి పల్లవికి తగ్గిందనుకుంటాను.అందుకే ఏడాదికే మళ్ళా వచ్చేసింది.ఇక ఈ జ్వరాలతో దినాలకు రాలేమని సంధ్య కూతురు రేఖకి ఫోన్ చేసాము. జ్వరాలవీ తగ్గినా నీరసం చాలా కాలమే వుంటుంది.కోవిడ్ అంతే మరి. మాకు వచ్చిన జ్వరాల అనుభవాలతో మళ్ళా మళ్ళా కొత్త రూపాలతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూనే వుందనిపించింది. అందుకే ఈ సారి కూడా మాడభూషి పురస్కారాలు వాయిదా వేసి వచ్చే ఏడాది అన్నీ కలిపి నిర్వహించుకుందామని వీర్రాజు గారు లలితా దేవిని వప్పించారు. రాజమండ్రి దామెర్ల చిత్రకళా పరిషత్ లో వీర్రాజు గారి పెయింటింగ్స్ ఫిక్స్ చేయాలంటే ఇనుప రాడ్స్ తో రెండు స్థంబాల మధ్యా స్క్రీన్ పెట్టాలని ,ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయాలని అంటే విడతల వారీగా ఒక ఎనభై వేల వరకూ పంపించాల్సి వచ్చింది.అయితే అక్కడ జరుగుతోన్న పనిని ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు రవి పపుతుండటంతో డబ్బు ఏమీ వృధా కావటం లేదులే అనుకున్నాము.గ్యాలరీ ప్రారంభం గురించి సంప్రదిస్తే వీర్రాజుగారు "నేనిప్పుడు రాలేను.వాడ్రేవు చినవీరభద్రుడుగారితో ప్రారంభోత్సవం చేయించు" అని రవిప్రకాష్ కి ఫోన్ చేసారు.అయితే వీరభద్రుడు గారు మాత్రం "వీర్రాజుగారు ఎప్పుడు వస్తే అప్పుడే ప్రారంభోత్సవం చేద్దాం" అన్నారు. ప్రపంచీకరణ ప్రభావంతో ఏ దేశానికి ఆ దేశపు పండుగలతో పాటూ ప్రపంచమంతా చేసుకునే కొత్త పండుగలు వచ్చాయి.అటువంటి వాటిలో ఫిబ్రవరి పధ్నాలుగున యువతరమంతా జరుపుకునే ప్రేమికుల రోజు ఒకటి. ఆ రోజు ప్రేమికుల రోజుని తెలియని కాలంలో ఇద్దరం ఇష్టపడి ఒకటైన రోజు.జీవితంలో ఎన్నో అనుకూలతలు,ప్రతికూలతలు మధ్య ఎన్నో పూలూ,ముళ్ళను దాటుకుంటూ ఈ నాటికి యాభై దాటి మరొక్క ఏడాది కూడా గడిచింది.మేము ఇద్దరం ఒకసారి గుర్తు చేసుకోవటమే తప్ప పెళ్ళిరోజు జరుపుకోవటం మానేసి చాలా ఏళ్ళే అయింది. తెలంగాణా సారస్వత పరిషత్తు నుండి చెన్నయ్యగారు వీర్రాజుగారికి ఫోన్ చేసి తన జీవితం సాహిత్యం గురించి పరిణతి వాణి ప్రసంగం చేయాల్సిందిగా ఆహ్వానించారు.గంటసమయంలో అన్ని విషయాలూ చెప్పలేకపోయినా ప్రసంగం వ్యాసాన్ని సమగ్రంగా రాసి పంపమని తెలియజేసారు. ఇటీవల రాయటం కొంత అలవాటు తప్పిపోవటం వల్లా,వయసు చేత కొంత జ్ణాపకశక్తి తగ్గుతూ వుండటం వల్లా ఒక్కొక్కటే బాల్యం నుండి గుర్తు చేసుకుని రాయటానికి వీర్రాజుగారు కొంచెం కష్టపడటం చూసి మనసులో నాకు బెంగగా అనిపించింది.చెక్కినట్లుగా వుండే అందమైన దస్తూరికూడా చెదిరినట్లైంది.మామూలుగానే రచన ఏదైనా ఒక విడతలో వీర్రాజుగారు రాయరు.పర్ఫెక్టుగా వచ్చేవరకూ రచన పదే పదే రాయటం,రాసినది కొట్టేసి మళ్ళా రాయటం ఆయనకు అలవాటే.అయినా ఇప్పుడు మాత్రం రాతలో తడబాటు అర్థం అవుతూనే వుంది.మొత్తం మీద తన జీవితం, సాహిత్యం పరిణతవాణికోసం రాయటం పూర్తి చేసారు.దానిని స్కాన్ చేసి చెన్నయ్య గారికి పంపించేసాను.ఇక ప్రసంగం చేయాల్సి ఉంది. ఒక ఆదివారం ఉదయం పదిగంటలకు సారస్వత పరిషత్తుకి మేమిద్దరం వెళ్ళాము.కందుకూరి శ్రీరాములు,శంకరం, సిధారెడ్డి మొదలైన ఆత్మీయ మిత్రులు వచ్చారు.ప్రచారం ఎక్కువగా చేయకపోవటం వలనో,ఎందుచేతనో సభలో ఎక్కువ మంది వుండరు. చేతిలో పాయింట్స్ కాగితంమీద రాసుకుని వెళ్ళినా అవి చూడకుండానే వీర్రాజుగారు ప్రసంగించారు. కానీ చాలా వరకూ తడబడుతూనే మాట్లాడారు.వయసువలన ఆయన మర్చిపోతున్నారనేది అర్థమైంది. కె. గీత తన నెచ్చెలి పత్రిక కోసం ఒక రోజు ఫోన్ చేసినన్ను ఇంటర్వ్యూ చేస్తానంది.అదే విధంగా ఒక గంటసేపు సమగ్రమైన ఇంటర్వ్యూ జూమ్ ద్వారా చేసింది.ఇంటర్వ్యూ తర్వాత కాసేపు పర్సనల్ గా మాట్లాడుకున్నాము.నేను మానసికంగా డిసేబుల్డ్ అయిన బాబును పెంచటంలో మూడున్నర సంవత్సరాలు అనుభవించిన బాధ మరువలేనిది. గీతకూడా ఆ పరిస్థితి గురించి చెప్తుంటే మనసంతా బరువెక్కి దుఃఖం కంఠంలో వుండకట్టినట్లయ్యింది.ఒకవైపు వుద్యోగం బాధ్యత నిర్వహిస్తూనే మరోవైపు పత్రికానిర్వహణ, సాహిత్య సృజన ,టోరీ రేడియో, సాహిత్య వీక్షణం ఇలా ఇన్ని బాధ్యతలు ఈ అమ్మాయి ఎలా నిర్వహిస్తూ ఉంది.ఈ గీత మనిషా,రోబోటా అనేది నాకు వూహకి అందలేదు.మనసారా ఆమెకి అభినందనలు తెలియజేసాను. అప్పట్లోనే చెన్నై విశ్వవిద్యాలయంనుండి మాడభూషి సంపత్ కుమార్ గారు కూడా నన్ను ఆన్లైన్ లోనే సమగ్రమైన ఇంటర్వ్యూ చేయడమే కాక నా జీవితం సాహిత్యం మొత్తం వ్యాసంగా రాసి పంపమని కోరటం మరో విశేషమే. ఒకరోజు పి.సత్యవతిగారు నాకు ఫోన్ చేసి "అన్వర్ అని ఒక అబ్బాయి మీకు ఫోన్ చేసి మీ ఇంటికి ఒక పుస్తకం కోసం వస్తాడు.అన్వర్ మంచిఅబ్బాయే. " అన్నారు.సరేనన్నాను.అంతలో అన్వర్ ఫోన్ చేసి "పోలాప్రగడ సత్యనారాయణ మూర్తిగారి "ఆ రోజుల్లో " పుస్తకం కావాలి.సత్యవతిగారు మీ దగ్గర పుస్తకం దొరుకుతుంది అన్నారు.మీ దగ్గర వుందా.ఉంటే వచ్చి తీసుకుని.చదివి మళ్ళా భద్రంగా ఇచ్చేస్తాను " అన్నాడు.ఉందని చెప్పి మా ఇంటి లోకేషన్ షేర్ చేసాను. వీర్రాజుగారు 'అన్వర్ ఎవరు ?' అన్నారు.'కవి అనుకుంటాను .కవితలు పత్రికలలో చూసాను ' అన్నాను. మరొక అతనితో కలిసి అన్వర్ వచ్చాడు.అతను అడిగిన పోలాప్రగడ రాసిన ఆరోజుల్లో పుస్తకం ఇచ్చాము.అతను మొహమాటంగా అతని " ఒక చిత్రకారుని రేఖాయాత్ర" పుస్తకం వీర్రాజుగారికి ఇచ్చాడు.పుస్తకం గెటప్ అది అద్భుతంగా ఉండటంతో ప్రింటింగ్ గురించి సమాచారం అడుగుతే ఇప్పుడు డిజిటల్ ప్రింటింగ్ పద్ధతి వచ్చిందని ఎన్ని కాపీలు అవసరమైతే అన్నే ప్రింట్ చేసుకోవచ్చని చెప్పాడు.అయితే అప్పటికీ అన్వర్ కవేనా,రచయితా,చిత్రకారుడా అనేది మాకింకా అర్థం కాలేదు.సాక్షిలో వుద్యోగం అన్నాడు.అంతే తెలిసింది.అంతకన్నా వివరాలు అడగటానికి మాకూ మొహమాటం. ఓ రెండు రోజుల్లో అన్వర్ ఇచ్చిన పుస్తకం వీర్రాజుగారు చదివి "సుభద్రా ఈ అన్వర్ చిత్రకారుడే కాక మంచి రచయిత కూడా.ఈ పుస్తకం అద్భుతంగా రాసాడు.నువ్వూ చదువు.ఇందులో చిత్రాలు చాలా బాగున్నాయి.చక్కటి లైన్ .బాపూ ఆరాధ్యుడు అనుకుంటా .కానీ బాపూని అనుకరించడం లేదు " అన్నారు.ఆయన అంతగా పొగిడారంటే నాకు వెంటనే చదవాలనిపించింది.అన్వర్ పుస్తకం తీసి మొదలు పెట్టాక ఇంకా వదలలేదు.వాక్యాలతో చిత్రాలు వేసినట్లు మ్యాజిక్ చేస్తూ అద్భుతమైన వాక్య విన్యాసంతో అనేకమంది చిత్రకారుల, సాహితీవేత్తలు గురించీ,సినీమాలగురించీ భలేగా రాసాడు.చదవటం పూర్తిచేసిన వెంటనే నా అభిప్రాయం అన్వర్ కి వాట్సాప్ లో తెలియజేసాను. తర్వాత మళ్ళా అన్వర్ తన కొడుకు మోహన్ ని తీసుకుని వచ్చాడు.అప్పుడు వీర్రాజుగారు తన పెయింటింగ్స్, ముఖచిత్రాలు,చిత్రాలు వేసే రకరకాల కొక్విన్లు అతనికి చూపించారు. మా స్వంతపుస్తకాలకు చీర ముక్కలతో వీర్రాజుగారు స్వంతంగా చేసిన బైండింగ్స్ చూసి అన్వర్ అబ్బురపడ్డాడు. తర్వాత కొన్నిరోజులకే నాకు(2021),పొత్తూరి విజయలక్ష్మి (2022)కు సుశీలానారాయణరెడ్డి పురస్కారం సమావేశం ఎమ్.కే.రాముగారి కిన్నెర సంస్థనిర్వహణలో జరిగింది. నా సాహిత్యం గురించి మూడు వ్యాసాలు రాసిన సి.హెచ్.సుశీలగారు నా సాహిత్యం గురించి కన్నా ఆత్మీయ పరిచయంగా మాట్లాడారు.పొత్తూరు విజయలక్ష్మి గురించి ప్రసంగించిన నెల్లుట్ల రమాదేవి పేపర్ మీద రాసుకొని సాహిత్యం గురించే మాట్లాడింది.తర్వాత స్పందన తెలియజేసినప్పుడు కూడా విజయలక్ష్మి తన సాహిత్యం గురించి చాలా చెప్పుకుంది. నన్ను పురస్కారానికి ఎంపిక చేసేరంటే నా సాహిత్య సృజన చూసేకదా .ఇంకా నేనుకూడా నా గురించి చెప్పుకోవటంలో అర్థం లేదు అనిపించింది. అందుకే నా ప్రసంగంలో కేవలం రచయిత్రులకే పురస్కారాలు ఇవ్వాలనే సంకల్పానికి ధన్యవాదాలు తెలియజేసాను.అంతేకాకుండా "నలభై సంవత్సరాలకు పైగా రచయిత్రులకు పురస్కారాల్తో గౌరవించటం చాలాసంతోషం. ఈ సందర్భంగా మరొక విన్నపం చేస్తున్నాను.రచయితలకూ,కవులకూ శతజయంతులు ప్రభుత్వ,ప్రభుత్వేతర సంస్థలూ అకాడమీలు నిర్వహించటం చూస్తున్నాము.కానీ మహిళాసాహితీవేత్తలకు ఎవరూ చేస్తున్నట్లుగా లేదు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తొలి రచయిత్రి ఇల్లిందల సరస్వతి దేవిగారికి శతజయంతి సభ జరగలేదు.అలా ఎంతమందో.నలభై ఏళ్ళుగా పురస్కారం ఇస్తున్న శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రస్టు వారైనా పూనుకొని పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించనవసరంలేదు కానీ ఆ రచయిత్రి సాహిత్యం గురించి ఒక ప్రసంగం ఏర్పాటు చేసి కొన్ని ప్రసంగాలు అయిన తర్వాత ఒక పుస్తకంగా ప్రచురిస్తే ఇప్పటి తరం వారికి ఆనాటి రచయిత్రులు ఎన్నో అవరోధాలను అధిగమించి రచయిత్రులుగా నిలదొక్కుకున్నారు అనేది తెలుస్తుంది." అని విన్నపం చేసాను.నా ప్రసంగానికి గంగగారు చాలా ప్రభావితులై కార్యక్రమం పూర్తై కిందికి వచ్చాక నన్ను ఆలింగనం చేసుకుని మీరు చెప్పినట్లే మేము నిర్వహించటానికి సిద్ధం గానే ఉంటాము.మీ సహకారం అందించండి అన్నారు.నాకు చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత కలిసిన వారంతా నేను చేసిన ప్రతిపాదన చాలా సమంజసంగా వుందని అభినందనలు తెలియజేసారు. పురస్కారం సందర్భంగా సారస్వత పరిషత్తు కార్యదర్శి డా.చెన్నయ్యగారు అందించిన సన్మాన పత్రం, ఫొటో ఫ్రేమ్ వీర్రాజు గారికి చాలా నచ్చాయి.నేను లోపల ఎక్కడైనా పెట్టాలనుకుంటే వీర్రాజుగారు హాల్ లోనే కొన్నాళ్ళవుంచు అన్నారు.ఇంటికి వచ్చిన మిత్రులు అందరికీ ఆయనే చూపించి పురస్కారం గురించి గొప్పగా చెప్తుండటం నాకే ఆశ్చర్యం వేసింది. నిజానికి ఇంతవరకూ నాకు నగదు రూపంలో కూడా పది పదిహేను వేలకు మించి రాలేదు.నాకు వచ్చిన పురస్కారాలలో ఇదే అత్యధికంగా వచ్చిన నగదు పురస్కారం.నగదుకన్నా గత నలభై ఏళ్ళుగా ఊటుకూరి లక్ష్మీ కాంతం యద్దనపూడి,రామలక్ష్మీ,లేత,సీతాదేవి వంటి వుద్దండులైన రచయిత్రులు అందుకున్న ప్రతిష్టాత్మకమైన పురస్కారం అనేది మాత్రం అక్షరాలా నిజం. ఒకరోజు గంగగారు ఫోన్ చేసి రచయిత్రుల శతజయంతులు దాటిన వారిని లిస్ట్ చేయమని అడిగారు.నేను ముఖ్యంగా సుశీలానారాయణరెడ్డి పురస్కారం అందుకున్న వారితో ప్రారంభించటమే బాగుంటుందనే అభిప్రాయంతో అక్కడినుంచి మొదలుపెట్టి రచయిత్రుల పుట్టిన సంవత్సరాల లిస్ట్ తయారుచేసి పంపించాను. శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రష్ట్ ఆర్థిక సహాయానికి పుస్తకాల ఎంపిక పూర్తి చేసాను.కథలు,కవితలు కలిపి సుమారు పదిపన్నెండు పుస్తకాలు ఎంపిక చేసి ఎందుకు బాగున్నాయో నా అభిప్రాయం కూడా రాసి వాళ్ళకు పంపించేసాను.అంత సమగ్రంగా నా అభిప్రాయాలతో ఎంపిక చేసినందుకు గంగగారు చాలా సంతోషం వ్యక్తం చేసారు.అంతేకాదు రెమ్యునరేషన్ గా అయిదువేలు పంపించటం మరింత ఆనందం. నేను ఎంపికచేసిన వాళ్ళు తర్వాత్తర్వాత మంచి కవయిత్రులుగా,రచయిత్రులుగా బహుమతులూ గుర్తింపూ పొందటం కూడా నాకు సంతోషం కలిగించింది. నేను ఒక లలితగీతాల వాట్సాప్ సమూహంలో వుండటం వలన సినారె గేయాలు ఆ సమూహంలో వచ్చినప్పుడు గంగకు షేర్ చేస్తూ వుంటాను.అందువలన ఆమె ఏ పాట కావాల్సినా, ఎవరైనా రచయితలకు చెందిన వివరాలు కావాల్సి వచ్చినా నన్ను సంప్రదించటం వలన తరుచూ మాట్లాడుకొంటూ వుంటాము. ఆ విధంగా ఆమెతో కొంత స్నేహం పెరిగింది. నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ డీటీపీ కూడా పూర్తి చేసాను.అనల్ప బలరాంగారికి పి.శ్రీదేవి కథల్ని " వాళ్ళు పాడిన భూపాలరాగం "పేరుతోనూ,ఆమె కవితల్ని "మథుకలశమ్" పేరుతోనూ సంపాదక బాధ్యతల్ని వహించిన పరిచయంతో నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ ని వాళ్ళ బేనర్ పై ప్రచురిస్తారా అని అడుగుతే తప్పక ప్రచురిస్తానని అన్నారు.అయితే మరికొన్ని ప్రచురణలలో బిజీగా వున్నానని అవి అయిపోయాక చేస్తానన్నారు.ఆ పుస్తకానికి పల్లవి చేతే ముఖచిత్రం వేయించుతానని కూడా చెప్పాను. బలరాం సరేనన్నారు.మాలతి రచనలో విశాఖమాండలిక సొబగులే కాక విశాఖసంపంగి పరిమళాలు మనసుని తాకుతూనే వుంటాయని ముఖచిత్రంగా సంపెంగలతోనే డిజైన్ చెయ్యమని పల్లవితో చెప్పాను. - శీలా సుభద్రాదేవి

నడక దారిలో -66

నడక దారిలో -66 ఈ ఏడాది డిసెంబర్ నెల చాలా విశేషాలతో బిజీగా నడిచింది. ఈ మధ్య కుందుర్తి కవిత తాను రాసిన కవితలు నాకు పంపించింది.బాగారాస్తున్నావని ప్రోత్సహించడమే కాకుండా నెచ్చెలి,కవి సంధ్య ఈ మెయిల్ ఐడీ లు ఇచ్చి పంపించమని చెప్పాను.నేనేమైనా సవరణలు చేస్తే సరిదిద్దుకుంటుంది.వాటిని వీర్రాజుగారికి కూడా వినిపించేదాన్ని. ఇంకో విశేషం ఏమిటంటే నేనూ, పల్లవి కూడా వున్న మనలో మనం వాట్సాప్ సమూహంలో పల్లవి చిన్నచిన్న రచనలూ,కవితలూ రాయటం సంతోషం కలిగించింది.కరోనా సమయంలో సుధామ ప్రారంభించిన" ఒకసారి చూడండి అంతే" అనే వాట్సాప్ పత్రికలో కథలకు చిత్రాలు వేయటమే కాకుండా దాని తరపున సుధామ నిర్వహించిన కవితలపోటీలో పల్లవి కవిత ప్రచురణకు ఎంపిక అయ్యింది.అదేవిధంగా విశాలాక్షి నిర్వహించిన కవితలపోటీలో కన్సొలేషన్ బహుమతి వచ్చింది. వాటిని కూడా ఫోనులో చదవటం వీర్రాజుగారికి తెలియదు కనుక వినిపించాను.అవి విని ఆనందంతో వచ్చే ఏడాదికి పల్లవి రాసిన కవితా సంపుటి ప్రచురించాలి అనేవారు. ఖమ్మంలో డా.సీతారాంగారు తాను పనిచేసే కళాశాలలో కుందుర్తి సాహిత్య సదస్సు నిర్వహించాలనుకుంటున్నానని కుందుర్తి కృతులు పుస్తకం ,ఇతర పుస్తకాలు కావాలని ఫోన్ చేసారు.ఒకరోజు పుస్తకాలు కోసం మా ఇంటికి వచ్చారు.కుందుర్తికృతులు అపురూపమైనది కావటాన మళ్ళా జాగ్రత్తగా అందజేస్తామన్నారు.ఆ పుస్తకాలతో పాటు మాయిద్దరిపుస్తకాలుకూడా ఇచ్చాము.అవే కాకుండా విద్యార్థులకు బహుమతులుగా ఇవ్వమని మావి విడి కవితా సంపుటాలు కూడా అందజేసాము. సీతారాంగారు తన పాఠాలు మాత్రమే చెప్పి పనైపోయింది అనుకోకుండా విద్యార్థులకు సాహిత్యం పట్ల అభిరుచి,ఆసక్తి పెంచేలా పుస్తకాలు చదివించి ప్రోత్సహిస్తారు.ఆ విధంగా ప్రతీ కాలేజీలోనూ జరుగుతూ వుంటే తెలుగుభాష అంతరించి పోతుందనే దిగులు తగ్గుతుందేమో. డిసెంబర్ లో కుందుర్తిగారి శతజయంతి ప్రారంభం ఆవిధంగా ఖమ్మం కాలేజీలో ప్రారంభించటం వీర్రాజుగారికి సంతోషం కలిగించింది.సదస్సు ప్రారంభసభకు మా ఇద్దరినీ ఆహ్వానించారు." రావాలని ఉంది కానీ మూడుగంటలసేపు కారులో ప్రయాణం చేయలేన"ని వీర్రాజుగారు సీతారాంతో చెప్పారు."కుందుర్తిగారితో, ఫ్రీవర్స్ ఫ్రంట్ తో మీ అనుబంధాన్ని వీడియో చేసి పంపించండి.అది ప్రారంభసభలో వేస్తాం " అన్నారు. ఆ విధంగా ఒక వీడియో చేసి పంపించాను.కుందుర్తి కవిత ఆ సదస్సులకోసం సింగపూర్ నుండి వచ్చింది.కుందుర్తి కుటుంబసభ్యులు ఖమ్మంలో జరిగిన కుందుర్తి సాహిత్య సదస్సులకు హాజరయ్యారు. కుందుర్తి కవిత ఇండియా ఎప్పుడు వచ్చినా అక్క సమతతో కలిసి మా యింటికి తప్పక వచ్చి కలుస్తుంది.వచ్చిన 'ప్రతీసారీ సింగపూర్ ఎప్పుడు వస్తారు.తప్పకరండి ' అని పిలుస్తుంది కవిత. " కవితలు బాగా రాస్తున్నావు. వచ్చే ఏడాది చివరికి నీ కవితాసంపుటి వచ్చేలా రాస్తూ వుండు " అన్నారు కవితతో వీర్రాజుగారు.కవిత నవ్వేసి ప్రయత్నిస్తానంది.నవ్వటం కాదు.'పట్టుదలగా రాయాలి ' అని ఖచ్చితంగా చెప్పారు ఆయన. ఒకరోజు చెన్నయ్యగారు ఫోన్ చేసి ప్రతీ ఏడాదీ రచయిత్రుల మొదటి పుస్తకాలకి సుశీలానారాయణ రెడ్డి ట్రస్ట్ ఆర్థిక సహకారం అందిస్తుంది కదా ఆ పుస్తకాలను ఎంపిక చేయగలరా అని కోరారు.నేను అంగీకారం తెలియజేసిన తర్వాత నలభై రెండు కవితాసంపుటాల జిరాక్స్ ఫైళ్ళూ,ఇరవై వరకూ కథలసంపుటాల జిరాక్స్ ఫైళ్ళూ పంపించారు.వాటిలో ఆంధ్రా నుండి వచ్చినవి కూడా వుండటంతో గంగగారికి ఫోన్ చేసి తెలంగాణావారివే ఎంపిక చేయాలా,ఆంధ్రావాళ్ళవి బాగుంటే చేయొచ్చా' అని అడిగాను.ఆమె " బాగుంటే రెండు రాష్ట్రాల నుండి ఏవైనా చేయండి.మాకు తెలంగాణా ఆంధ్రా అనే తేడా లేదు.అంతేకాకుండా ఎన్ని సెలెక్ట్ చేసినా పర్వాలేదు" అని నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.అరవైకి పైగా పుస్తకాలు చదవటంతో తీరిక లేకుండా అయింది. మంచి ఉద్యోగంచేసి పదవీవిరమణ అయ్యాక కాలక్షేపంగా కొత్తగా ఇప్పుడు సాహిత్య సృజన మొదలుపెట్టి ఆర్థికంగా మంచి స్థితిలో వున్నవారు సైతం ఆర్థిక సహాయం కోసం పంపటం నాకు ఆశ్చర్యం కలిగించింది.కొందరు ముందు మాటలు కూడా రాయించి ప్రచురణకు సిద్దంగా వున్న ప్రతులే పంపించారు.అటువంటి వాటిని చాలా వరకూ తీసేసాను.యువతరంవారికి ప్రోత్సాహంగా యిస్తే బాగుంటుంది అనిపించింది.అదే విషయాన్ని గంగగారికి తెలియజేసాను. కవిత్వంలోనూ,కథల్లోనూ బాగున్నాయి అనిపించినవి పక్కన పెట్టి రెండోసారి చదవాలనుకున్నాను.మొత్తం పంపిన వాటికి అన్నింటికీ నచ్చనివాటికి కూడా నా అభిప్రాయం రాసి పెట్టుకున్నాను.ఫైనల్ సెలక్షన్ మాత్రం వుంది. సైదాబాద్ కోపరేటివ్ బ్యాంకుకు ఒకరోజు వీర్రాజుగారిని తీసుకుని పల్లవీ, నేనూ వెళ్ళాం.మలక్ పేట ఇంట్లోకి వచ్చిన వెంటనే మొదట దగ్గర కదా అని ఆ బ్యాంకులోనే మేము సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెరిచాము.సరూర్ నగర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అవసరమైనప్పుడు సైదాబాద్ బ్యాంక్ కు రావటం కష్టంగా వుందని వీర్రాజుగారి అక్కౌంట్ క్లోజ్ చేసేసాను.దానితో పాటూ కుందుర్తి సత్యమూర్తితో కలిసి ఫ్రీవర్స్ ఫ్రంట్ కోసం చేసిన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేసేసాము.ఫ్రీవర్స్ ఫ్రంట్ అక్కౌంట్ లో నలభై అయిదు వేలు ఉందని కుందుర్తి శాంతకు తెలియజేస్తే ' మీరే ఫ్రీవర్స్ ఫ్రంట్ కోసం వాడండి.నాకు పంపొద్దని' అంది. ఆ డబ్బుని ఏం చెయ్యాలా అని ఇద్దరం ఆలోచించాము."ఈ ఏడాది ఎట్లాగూ కుందుర్తి శతజయంతి సంవత్సరం కనుక ఈ నలభై అయిదు వేలకు మనం మరోపదిహేను వేలు కలిపి ఆరుగురికి కుందుర్తి శతజయంతి ప్రతిభా పురస్కారం పేరున పదివేల చొప్పున ఇచ్చేద్దాము.రెండు తెలుగురాష్ట్రాల నుండి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు రాదగిన సీనియర్ కవుల్ని ఎంపిక చేద్దాం" అన్నారు వీర్రాజు గారు.ఎవర్ని తీసుకోవాలని ఒక జాబితా వేసుకుని నిర్విరామంగా సాహిత్య కృషి చేస్తూ సాహిత్యం రాస్తూ వున్నవారినిగా చూసుకుని డా.రాధేయ,దాట్ల దేవదానం రాజు,అడిగోపుల వెంకటరత్నం,దేవరాజు మహారాజు,డా.సీతారాం, అనిశెట్టి రజితలను ఎంపిక చేసి కుందుర్తి కుటుంబసభ్యులకు తెలియజేసాము.వాళ్ళుకూడా చాలా సంతోషించారు.ఎంపిక చేసిన కవులకు వీర్రాజు గారు ఫోన్ చేసి చెప్పగా ఆరుగురూ చాలా ఆనందించారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహంలో కుందుర్తి ఆంజనేయులు శతజయంతి సందర్భంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారాలు ప్రకటించిన వారిగురించి పరిచయం చేసాను.పురస్కారగ్రహీతలకు ఎప్పుడు హైదరాబాద్ రావటానికి కుదురుతుందో సంప్రదించటంతో కొంత కాలయాపన జరిగింది. దాంతో సభ నిర్వహించి ప్రదానం చేయాలా,లేదా జూమ్ సమావేశం ద్వారానే చేయాలా అనేది కూడా ఆలోచించాము. ఇటీవలే ఖమ్మంలో కుందుర్తి సదస్సులకీ కుందుర్తి కవిత వచ్చి వెళ్ళింది.మళ్ళా దగ్గరలో రావటం కష్టం. అందుకని జూమ్ లోనే అందరి వెసులుబాటూ చూసుకుని నిర్వహించాలని నిర్ణయించాము. చూస్తుండగానే నెచ్చెలి అంతర్జాలపత్రికలో నా నడక దారిలో బాల్యం వివరాలతోనే ఏడాది గడిచిపోయింది. ఎన్నికల సమయంలో జరుగుతోన్న సందర్భాలూ, ప్రజల్ని వెర్రివెధవాయిలుగా చేస్తున్న రాజకీయ నాటకాలూ కొంత అసహ్యం కలిగించి నేను దీర్ఘకవితగా రాసాను.అది వీర్రాజుగారికి చదవమని ఇచ్చాను.బాగా రాసాను అన్నారు‌.కానీ ఏ పత్రికకైనా పంపించటానికి వెనకడుగు వేసాను. కోరుకొండ అక్క మనవరాలు అంటే కళ్యాణ్ పెద్దకూతురు వసుధకు పెళ్ళి సంబంధం కుదిరింది అని తెలిసింది.వసుధ కోరుకొండ సైనిక పాఠశాలలోనే చదువుకుని చెన్నైలో ఇంజనీరింగ్ చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.విశేషం ఏమిటంటే సైనిక స్కూల్ లో చదివినప్పటి నుండి సహ విద్యార్ధులు అయిన అభిలాష్,వసుధ ప్రేమించుకుంటున్నారుట.చదువుపూర్తిచేసి ఉద్యోగంలో స్థిరపడే వరకూ ఈ విషయం తల్లిదండ్రులుకు తెలియనీయవద్దనుకున్నట్లున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు సంబంధాలు చూడటం మొదలు పెట్టేసరికి బయట పెట్టింది వసుధ.అభిలాష్ వాళ్ళ కుటుంబం సంగారెడ్డిలో వుంటారు.ఒకసారి అందరూ కలిసి మాట్లాడుకొని నిశ్చయించుకుందామని ఇరు కుటుంబాల వారు నిర్ణయించుకున్నారు. ఆపని మీదే కళ్యాణ్ కుటుంబమే కాక జయ అక్కాచెల్లెళ్ళు కూడా కుటుంబ సహితంగా వచ్చారు. "మాకు వున్న పెద్దదిక్కు మీరే కనుక తప్పక సంగారెడ్డి రావాలని " కళ్యాణ్ అనేసరికి మేమూ బయలు దేరక తప్పలేదు.వీర్రాజుగారు ముందు అన్ని గంటలు కార్లో ప్రయాణం చేయలేనేమో అని వెనకడుగు వేసినా కళ్యాణ్,జయ కోరిక మేరకు బయలుదేరారు. టిఫిన్లు చేసి ఎనిమిది గంటలకు నలుగురం కార్లో సంగారెడ్డి బయలుదేరాము.సుమారు నాలుగు గంటల ప్రయాణం చేసి సంగారెడ్డిలో వసుధ కాబోయే అత్తగారి ఇల్లు చేరాము. అత్తగారి అక్కాచెల్లెళ్ళు,మామగారి అన్నదమ్ములు మొదలైన వారితో వాళ్ళది చాలా పెద్ద కుటుంబం.వాళ్ళందరూ వచ్చారు. పెళ్ళి ఎప్పుడు చేయాలనేది చర్చ జరిగింది.ఇల్లూ,ఇంట్లో వస్తువులూ అన్నీ అమర్చుకున్నాకే చేసుకుంటాం అని పిల్లలు ఇద్దరూ అంటారు.ఇప్పటికే చాలా కాలం వేచి వున్నారు,ఇంకా ఆలస్యం చేయవద్దని అందరం అన్నాము.పెళ్ళి అయ్యాక ఇంట్లోకి మీ సంపాదనతో ఒక్కొక్క వస్తువే అమర్చుకోవటంలో చాలా తృప్తి వుంటుందని మేము అనుభవంతో చెప్పాము.ఆఖరికి అంగీకరించారు.ఎప్పుడు మంచి ముహూర్తం వుంటే అప్పుడు వివాహం చేయాలని అందరూ నిర్ణయించారు. వీర్రాజుగారు ప్రత్యేకంగా వసుధా, అభిలాష్ లతో " పెళ్ళి అంటే ఒకరిపై ఒకరికి గల నమ్మకం.దానిని జీవితాంతం నిలుపుకోండి" అంటూ చాలా సేపు మాట్లాడారు.ఆయన మాటలకు వాళ్ళిద్దరే కాక వాళ్ళు అమ్మా నాన్నలు కూడా ఫిదా అయిపోయారు. అభిలాష్ వాళ్ళూ ఇక్కడే స్థిరపడిన కన్నడిగులు.వాళ్ళ సంప్రదాయం ప్రకారం మగవాళ్ళందరికీ గాంధీటోపీలు పెట్టి అందరికీ బట్టలు పెట్టారు.అదే విధంగా కళ్యాణ్ వాళ్ళు కూడా వాళ్ళకు బట్టలుపెట్టి గౌరవించారు.అవన్నీ పూర్తి చేసుకుని మేము తిరిగి బయలుదేరి ఇంటికి చేరేసరికి పదిగంటలకు దాటింది. మర్నాడు జయా అక్కాచెల్లెళ్ళు ముగ్గురినీ మా ఇంటికి రమ్మన్నాను.' భోంచేసి ఇక్కడనుండే స్టేషనుకు వెళ్ళొచ్చు' అని చెప్పాను. ఉదయమే లేచి రెండు కూరలూ, సాంబారు,ఫ్రైడ్ రైస్ , స్వీట్ చేసి మంచూరియా హొటలునుండి తెప్పించాము.పెద్దక్క సర్వలక్ష్మి కుటుంబం అటునుంచి అటే కార్లో వెళ్ళిపోయారు.మిగతా ఇద్దరూ రంజనా,జయా వాళ్ళంతా వచ్చారు.అందరితో సరదాగా ఇల్లంతా పెళ్ళి సందడిలా గడిచింది.వసుధ రాత్రికి డిన్నర్ పేక్ చేసుకుని హాస్టల్ కి వెళ్ళిపోయింది.మిగతావాళ్ళు ఇటు నుండి స్టేషన్ కు వెళ్ళిపోయారు. "ఇంతదూరం కార్లో బాగానే ప్రయాణం చేయగలిగాను.భయపడ్డాను గానీ ఖమ్మంలో జరిగిన కుందుర్తి సదస్సుకు కూడా వెళ్ళాల్సింది" అని మర్నాడు వీర్రాజుగారు అన్నారు.మీరు ఊరికూరికే ప్రయాణం చెయ్యలేనేమో అని ముందే భయపడతారు అని ఆయనతో అంటూ నేనూ పల్లవీ నవ్వుకున్నాం. ఈ ప్రయాణం ఇచ్చిన ధైర్యంతో ఈ సారి " విజయనగరం వెళ్తే పగలు రైలు ప్రయాణం చేద్దాం కిటికిలోనుండి అంతా చూస్తూ వెళ్ళొచ్చు‌"అన్నారు. ఆలోచిద్దాంలెండని అన్నాను. నిడదవోలు మాలతి సాహిత్యం మీద రాస్తున్న వ్యాసాలు ఒక పరిశోధన గ్రంథం మాదిరిగానే జీవితం,కథలు,ఎన్నెమ్మ కథలు,నవలలు, వ్యాసాలు,అనువాదాలుగా చాప్టర్ లు విడదీసాను.ఒక్కొక్క చాప్టర్నీ పీడీఎఫ్ రూపం లో మాలతి గారికి మెయిల్ ద్వారా పంపించే దాన్ని.ఆమె ఏమైనా సవరణలు చేయమంటే మార్చేను.కొన్ని కథలకి నేపథ్యం గురించి అడిగితే సమాధానాలు చెప్పేవారు.దాంతో ఆమెతో చాలా సాన్నిహిత్యం పెరిగింది."నన్ను మీరు,గారూ అని మన్నించి రాస్తుంటే ఇబ్బందిగా వుంది.మా అక్కయ్య సమకాలీనులు.నన్ను మన్నించనవసరం లేదు. ఏకవచనంలో సుభద్రా అనండి చాలు"అని నేను రాసిన తర్వాత మరింతగా సాన్నిహిత్యం పెరిగింది. ఒక సందర్భంలో "నా జీవితంలో జరిగినవేవీ నువ్వు అడగలేదు.చెప్పమంటావా" అని రాసారు. పి.శ్రీదేవి జీవితం నాకు అంతగా తెలియక పోవటం వలన ఆమె మోనోగ్రాఫ్ రాసేటప్పుడు ఆమె రచనల ఆధారంగానే ఆమె జీవితాన్ని రాసాను.మీకు కూడా అలానే రాస్తాను.అని నేను చెప్తే మాలతిగారు చాలా సంతోషించారు. నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ మొత్తం పూర్తి అయ్యింది.పేజీలు స్కాన్ చేసి డిటీపీ నరసింహారావుకి ఇచ్చాను.కానీ నేను ఫ్రచురించుకుంటే ప్రచారం చేసుకోగలనా అనిపించింది.ఏదో సందర్భంలో మాట్లాడినప్పుడు అనల్ప బలరాంతో అంటే తానే ప్రచురించుతానని అన్నాడు. అప్పటికే పి.శ్రీదేవి సాహిత్యం అంతా తన పబ్లికేషన్ ద్వారా ప్రచురించాలనుకుంటున్నాననీ నన్ను రచనలన్నీ సేకరించి నన్నే సంపాదకత్వం వహించమని బలరాం అడిగాడు.ఆ పని కూడా మొదలు పెట్టాను.నేను కథానిలయం నుండీ,నా దగ్గర వున్నవీ డిటీపీకి ఇచ్చాను.మిగతా కథలు కృష్ణదేవరాయ గ్రంథాలయం నుండి తెలుగు స్వతంత్రలు తెచ్చుకుని అందులో చదువుతూ రాసినవి. అంతకుముందే ఒక అమ్మాయి పి.శ్రీదేవి మీద పరిశోధన చేస్తున్నానని రచనల కోసం అడిగింది.నేను కృష్ణదేవరాయ గ్రంథాలయం నుండి తెచ్చుకున్నానని చెప్తే వెళ్ళింది.తీరా అక్కడకి వెళ్తే చెదలు పట్టాయని అవన్నీ పాడైపోతే పారేసామని చెప్పారని నాతో చెప్పింది.దాంతో మళ్ళా నాకు శ్రీదేవి కథలసేకరణ ఇక్కట్లు మొదలయ్యాయి.అయితే గౌతమీ గ్రంధాలయం, వేటపాలెం లైబ్రరీలో కొన్ని దొరికాయి.మూడోనాలుగో కథలు తప్ప అన్నీ దొరికాయి.వాటిని డిటీపీ చేయించాను.ఆ పుస్తకానికి సమగ్రమైన ముందుమాట రాయమని పబ్లిషర్ చెప్పటంతో మళ్ళా కథలన్నీ చదివి రాయటం మొదలు పెట్టవలసి వచ్చింది. - శీలా సుభద్రాదేవి

28, మే 2026, గురువారం

నడక దారిలో -65

నడక దారిలో -65 కేంద్ర సాహిత్య అకాడమీ వారు కవులకు కవిసంధి,రచయితలకు కథాసంధి అనే పరిచయం కార్యక్రమాల నిర్వహణ ఎప్పటినుండో కొనసాగుతూ వుంటుంది .ఎనభైరెండేళ్ళ వయసులో వీర్రాజుగార్ని రచయితగా గుర్తించారు కాబోలు కరోనాకాలంలో జూమ్ సమావేశంలో కథాసంధి కార్యక్రమం జరిగింది. "పోనీలే ఇప్పుడైనా గుర్తొచ్చాను" అని అల్ప సంతోషి అయిన వీర్రాజుగారు సంబరపడ్డారు. కరోనా పరిస్థితులు చూస్తుండేసరికి వీర్రాజుగారికీ ఇంటినిండా నిండిపోయిన పుస్తకాలూ, వీర్రాజుగారి పెయింటింగ్స్,నాలుగైదు దశాబ్దాలకు పైగా సేకరించిన కళాకృతులు పిల్లలకు భారమోతుందేమో అనే భయం, బెంగా మా మనసుల్లో నిండిపోయింది. గ్యాలరీ ఏర్పాటు చేయాలంటే ఇండిపెండెంట్ ఇల్లు కాదు. మాది అపార్ట్మెంట్. వీర్రాజుగారు రాజమండ్రి లోని మాదేటి రాజాజీ అన్న కొడుకు రవిప్రకాష్ ని సంప్రదించారు." మా చిన్నాన్న పెయింటింగ్స్ కూడా పెట్టే వుద్దేశ్యం వుంది.మీ పెయింటింగ్స్ కూడా కుదురితే అలా చేద్దాం " అన్నాడు.మా పుస్తకాలని విశ్వవిద్యాలయాల లైబ్రరీలకు పంపాలని వాటి చిరునామాలు గూగుల్ లో వెతికి తెలుగు శాఖా అధ్యక్షులు ఫోన్ నెంబర్లు వుంటే వాళ్ళకి మెసేజ్ పెట్టాను.వాళ్ళ అంగీకారం తెలిపిన తర్వాత కేవలం మా రచనలను పార్సిల్ చేసి పంపించాము.అందుకున్నట్లు తిరిగి మెసేజ్ లు పెట్టారుకానీ ఏ విశ్వవిద్యాలయం శాఖా కూడా అక్నాలెడ్జ్ వుత్తరం మాత్రం ఇవ్వలేదు.రచయితలను గౌరవించే సంస్కృతి లేదనిపించింది.అయితే విశ్వవిద్యాలయం లైబ్రరీలో కొన్నైనా పుస్తకాలు వెళ్ళాయన్న ఒక తృప్తి అంతే. ఇప్పుడిప్పుడే ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార సభ పెట్టే అవకాశం లేదనిపించి వీర్రాజుగారు జూమ్ సమావేశం ఏర్పాటు చేసి ,వాళ్ళ అక్కౌంటుకు పురస్కార నగదు పంపించేద్దాం, హైదరాబాద్ వచ్చినప్పుడు జ్ణాపిక అందజేద్దాం అని నిర్ణయించి కుందుర్తి కుటుంబంతో సంప్రదించారు.వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చేస్తే ఇంకా బాధ్యత తీరిపోతుంది అని అన్నారు. సింగపూర్ లో వున్న కుందుర్తి కవిత ఆగష్టు 11 వతేదీన ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం ఏర్పాటు చేసింది.అంతకు ముందు ఈ పురస్కారం అందుకున్న వారినే కాకుండా సమకాలీన కవులను సమూహంలో చేర్చాము.అయితే నలుగురైదుగురు అంతకు ముందు పురస్కారం అందుకున్న వారే ఇష్టం లేక కావచ్చు సమూహం నుండి బయటకు వెళ్ళిపోయారు. సమూహం స్తబ్దుగా లేకుండా ,కొత్త వాళ్ళకు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు గురించి పరిచయం చేసినట్లు ఉండాలని కుందుర్తిగారి గురించి , ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపన,అవార్డు మొదలుపెట్టటం మొదలైనవన్నీ ఒక క్రమ పద్ధతిలో రోజూ అందులో పోష్టు చేసేదాన్ని.తర్వాత రోజుకు ఒకరిద్దరు పురస్కారగ్రహీతల పరిచయం చేసాను.దానికి వారు కూడా ప్రతిస్పందించి ఆనాటి ముచ్చట్లు,సభల ఫొటోలు షేర్ చేయటంతో సమూహం ఉత్సాహవంతంగా,ఆసక్తికరంగా కొనసాగింది.ఆ గ్రూపులో దీనికి సంబంధించిన సమాచారం తప్ప మరేదీ పోష్టు చెయ్యకుండా చూసుకున్నాను. ఆగష్టు 22 వతేదీన గుంటూరు లక్ష్మీనరసయ్యగారి అధ్యక్షతన 49,50 వ ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాల జూమ్ సమావేశం జరిగింది .సిరికి స్వామినాయుడి"మట్టిరంగు బొమ్మలు" మీద మేడిపల్లి రవికుమార్, ఇబ్రహిమ్ నిర్గుణ్ "ఇది " మీద డా.సీతారాం మాట్లాడారు.తర్వాత కూడా శివారెడ్డి గారూ తదితరులు ఫ్రీవర్స్ ఫ్రంట్ కొనసాగించుతేనే బాగుంటుంది అనే మాట్లాడారు.అప్పుడు కూడా వీర్రాజుగారు స్పష్టంగా ఖండిస్తూ మాట్లాడారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ సంస్థ గురించి అనిల్ డ్యాని చేసిన ముఖాముఖి సారంగలో ప్రచురితమైంది. ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహంలో డిసెంబర్ 22 వతేదీ కుందుర్తి ఆంజనేయులు గారి శతజయంతి కనుక అప్పటి వరకూ ఈ సమూహం కేవలం వచన కవిత్వం కోసమే కొనసాగుతుంది.సమూహ కవులు తమ కవితల్ని ఇందులో పోష్టు చేసుకోవచ్చునని సమూహం అడ్మిన్ గా నేను ప్రకటించాను.దానికి సభ్యులందరూ హర్షం వ్యక్తంచేశారు. నేను రచయిత్రుల కథల గురించి రాసిన వ్యాసాల పుస్తకానికి " కథారామంలో పూలతావులు " అనే శీర్షిక అనుకున్నాము.వ్యాసాల తర్వాత గోదావరి పత్రికలో కాత్యాయనీ విద్మహే చేసిన ముఖాముఖిని కూడా చేర్చాను.పల్లవి చక్కటి ముఖచిత్రం వేసింది.పుస్తకం చాలా బాగా వచ్చింది.చాలామంది సాహితీ వేత్తలకు పోష్టు చేసాను.మంచిస్పందన వచ్చింది.ఈ పుస్తకం మీద చక్కని సమీక్షలు కూడా వచ్చాయి.పుస్తకం పీడీఎఫ్ నిడదవోలు మాలతిగారికి ఈమెయిల్ ద్వారా పంపాను.ఆమె మొత్తం చదివి ఒక విశ్వవిద్యాలయం విద్యార్థి చేసిన పరిశోధన గ్రంథంలా వుందని ప్రశంసించటమే కాకుండా పుస్తకానికి నేను రాసిన ముందుమాట అర్థవంతంగా వుందని అన్నారు.ఆ పుస్తకానికి ఆమె కూడా సమీక్ష రాసి తన వెబ్సైట్ లో ప్రచురించారు. మాకు తెలియని మా బంధువు ఒకాయన మా ఫోన్ నెంబర్, ఇల్లూ వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు.బంధుత్వం కలుపుకుని వీర్రాజు గారు ఆయనకు మామయ్య అవుతారనీ,ఆయన నన్ను అక్క అని వరస కలిపాడు.వీర్రాజుగారివీ, నావీ పుస్తకాలు తీసుకున్నారు.ఆయన హిందీలో పీహెచ్డీ చేసారు కానీ బేంక్ లో ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.వీర్రాజుగారు రచించిన మైనానవలని హిందీలోకి అనువాదం చేస్తానని అంగీకారం కోరారు.ఆయన డా.కాలేపు గణేశ్ రామ్ గారు.రాజమండ్రి వాస్తవ్యులు.వీర్రాజుగారు చాలా సంతోషంగా అంగీకారం తెలియజేసారు. తర్వాత మైనా హిందీ అనువాదమే కాక తదనంతరం నా ఇస్కూలు కథల్ని అనువాదం చేసి పుస్తకం రూపంలో తీసుకువచ్చారు.నా కవితల్ని కూడా అనువాదం చేసారు.నేను నిర్వహిస్తున్న ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహం లోనికి ఆయనను చేర్చాను.దాంతో చాలామంది కవులు పరిచయం కావటంతో గణేష్ రామ్ గారు అనువాద కార్యక్రమాలు ఉధృతం చేసారు తప్పక చదవాల్సిన వంద నవలలలో వున్న మైనా నవల్ని,1969 లోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నవలని ప్రచారం చేసుకునే శ్రద్ధగానీ, చొరవగానీ వీర్రాజుగారికి లేకపోవటం వలన అనువాదాలు చేయించుకోలేకపోయారు. కె.బి.గోపాలంగారు ఆంగ్లానువాదం చేసినా దాన్ని ప్రచురించే ప్రయత్నం కూడా చేయలేదు.కానీ రాజేశ్వరీ కోథండం తమిళానువాదం చేయడమే కాక పుస్తకరూపంలోకి కూడా ఆమె ప్రచురణ బాధ్యత తీసుకుని వేయించారు. అదే సమయంలో వరంగల్ నుంచి అనుకుంటాను దామోదరాచారి అనే ఆయన తాను చాలా మంది రచనల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసానని అవి అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందాయని నా కవిత్వాన్నీ అనువాదం చేస్తానని ఫోన్ చేసారు.ఇంట గెలవకుండా అంతర్జాతీయ స్థాయి నాకు అక్కరలేదులే అని నాకు అంతగా ఇష్టంలేక మొహమాటం కొద్దీ చెప్పలేక వీర్రాజు గారు ఖచ్చితంగా చెప్తారేమోనని ఆయనకు ఫోన్ అందించాను.వీర్రాజుగారికి నాకన్నా మొగమాటం కనుక అంగీకారం తెలియజేసారు. ఇంక ఆయన నా పుస్తకాల పీడీఎఫ్ పంపమని రోజూ ఫోన్ చేసేవారు.ఇక తప్పక శీలా సుభద్రా దేవి కవిత్వం పీడీఎఫ్ పంపించాను. దామోదరాచారిగారు ఆగమేఘాల మీద అనువాదం చేయడమే కాకుండా పుస్తకం ప్రచురించడానికి పబ్లిషర్ని కూడా మాట్లాడేసి డబ్బు పంపమని ఒత్తిడి చేసాడు.అయిదువందలు వేసుకోమని అన్నా సరే నేను అంగీకరించ లేదు.వంద కాపీలు చాలని అనువాదం చేసిన ఆయన్ని పాతిక కాపీలు తీసుకుని నాకు డెబ్భైఅయిదు పంపమన్నాను. వీర్రాజుగారి మొహమాటం వలన ఆ పుస్తకం ప్రచురణ కోసం ఇరవైమూడు వేలు పంపాల్సివచ్చింది.ఆ తర్వాత ఇంకా ఏవో అనువాదం చేస్తానని ఫోన్లు చేసినా వద్దని చెప్పి నేను స్పందించలేదు. వీర్రాజు గారి పెయింటింగ్సునీ, మాదేటి రాజాజీ పెయింటింగ్సునీ రాజమండ్రిలోని దామెర్ల రామారావు చిత్రకళా పరిషత్ లో మొదటి అంతస్తులో ఏర్పాటు చేయటానికి రవిప్రకాష్ గ్యాలరీ ఇన్చార్జి గారితో మాట్లాడానని చెప్పాడు.మొదటి అంతస్తులో పెయింటింగ్స్ పెట్టటానికి వీలుగా ఫ్రేములూ,బీములు తయారు చేయించటానికీ ,ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయటానికి అతనికి కొంత సొమ్ము పంపించాము. చిన్నమరిది,తోటి కోడలు ప్రతి ఏడాది ఒక ఆరునెలలు యూఎస్ లో వున్న పిల్లల దగ్గరకు వెళ్తుంటారు.పెయింటింగ్స్ రాజమండ్రి గ్యాలరీకి ఇచ్చేయాలనుకుంటున్నామని తెలిసి పిల్లలు ఇద్దరికీ రెండు పెయింటింగ్స్ ఇమ్మని అడిగాడు.వాళ్ళు ఎంపిక చేసుకున్న పెయింటింగ్స్ రెండు ఇచ్చేసాము. మా కోసం ఇంట్లో పెట్టుకోవటానికి పల్లవి,ఆషీ నాలుగు పెయింటింగ్స్ ఎంపిక చేసారు.ఒకటి రెండు పెయింటింగ్స్ పాడైనవి వుంచేసాము.వీర్రాజుగారు తనకి అంతగా నచ్చనివి చిన్నవి పంపవద్దనుకున్నారు.మరో రెండు చిన్న సైజు ఆయిల్ చిత్రాలు కూడా మా కోసమనే దాచుకున్నాను. గ్యాలరీలో పెయింటింగ్స్ అమర్చటానికి ఏర్పాటు అంతా ముగిసాక మాదేటి రవిప్రకాష్, రవికాంత్ కలిసి వచ్చి డెభ్భై ఎనిమిది పెయింటింగ్సునీ చక్కగా పేక్ చేసి తీసుకు వెళ్ళారు. అయితే అన్నింటినీ అటకమీద నుండి దించేసరికి ఖాళీ అయిన అరల్ని చూసి దిగులు వేసింది.వీర్రాజుగారు నెలలూ సంవత్సరాల తరబడి గంటలు గంటలు కూర్చుని ఒక తపస్సుగా వేసిన చిత్రాలు అవి.అమ్మితే డబ్బు చేసుకోవచ్చును.కానీ అమ్మితే అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి.చిత్రకారుడి ప్రతిభ మరుగున పడి పోతుంది.ఒక దగ్గరే వుంటే అది నిలిచి పోతాయనీ భావించాము.అదీకాక వీర్రాజుగారికి రాజమండ్రి అంటే అమితమైన ప్రేమ.అక్కడే ఆ దామెర్ల రామారావు చిత్రకళా పరిషత్ లోనే తన కళకు మెరుగులు దిద్దుకున్నారు.అందువలన అక్కడ చేర్చడమే సమంజసం అనిపించింది. నిజానికి వాటిని మేము కలకాలం భద్రపరచడం కష్టమే.పల్లవీ,ఆశ్లేషాలకు కూడా భారమౌతాయేమో,గ్యాలరీలో అయితే అనేక మంది చూస్తారు.అంతేకాక కలకాలం భద్రంగా వుంటాయని భావించాము. వాళ్ళు ఆ పెయింటింగ్స్ తీసుకు వెళ్తుంటే కన్నబిడ్డని పంపినంతగా బాధతో కళ్ళు చెమ్మగిల్లాయి. అదేవిధంగా వీర్రాజుగారు దశాబ్దాల కాలంగా ప్రతి ఆదివారం సెకెండ్ హ్యాండ్ పుస్తకాల షాపులు తిరిగి చిత్రకళకు చెందిన వివిధ దేశాల పుస్తకాలు సేకరించి పెట్టుకున్నారు.అవికూడా ఆర్ట్ గ్యాలరీకి పంపించేస్తే అక్కడ చిత్రకారులకు పనికి వస్తాయని భావించి తర్వాత వాటిని కూడా పంపించేయటానికే నిశ్చయించారు.వాటిలో పల్లవి తనకు నచ్చిన కొన్ని పుస్తకాలను తనకోసం ఉంచుకుంది. ఒకరోజు తెలంగాణా సారస్వత పరిషత్తు నుండి చెన్నయ్య గారు నాకు ఫోన్ చేసి " మిమ్మల్ని ఈ ఏడాది శ్రీమతి సుశీలానారాయణరెడ్డి పురస్కారానికి ఎంపిక చేసాము.యాభైవేల నగదు ,సన్మాన పత్రం, జ్ణాపిక ప్రదానం వుంటుంది" అన్నారు. నేను వింటున్నది నిజమేనా అని అనుమానంతో మరోసారి ప్రశ్నించి అడిగాను.ఆయన మరోసారి అదే చెప్పారు." నేను నిజమేనా" అని ప్రశ్నించాను. " మీరు అవార్డులు వెంట పరిగెత్తరు.మీ దగ్గరకే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి.అందుకే ఎంపిక జరిగింది." అన్నారు చెన్నయ్యగారు.ఆ మాటకంటే పెద్ద అవార్డు ఏముంది. తర్వాత సి.నారాయణరెడ్డిగారి పెద్ద అమ్మాయి గంగ ఫోన్ చేసి ఫిబ్రవరిలో అవార్డు సభ వుంటుందని తెలియజేసి చాలా సేపు మాట్లాడారు. బయోడేటా పంపించమని చెప్పారు. సారస్వత పరిషత్తు నుండి ఒక అతన్ని పంపిస్తాననీ నా పుస్తకాలన్నిటినీ పంపమని చెన్నయ్యగారు ఫోన్ చేసి చెప్పారు.అన్నట్లుగానే పరిషత్తు నుండి వచ్చిన ఆయనకి నా పుస్తకాలు ఇచ్చి పంపించాను. సుశీలా నారాయణరెడ్డి అవార్డు కోసం ప్రయత్నాలు,పైరవీలు చేసే వారి గురించి నాకు తెలుసు.నేను ఇంతకుముందు రామలక్ష్మికి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సభకి వెళ్ళాను.తర్వాత వెళ్తే అవార్డు కోసం ప్రయత్నాలు చేసుకోటానికి వెళ్ళినట్లు ఉంటుందని ఇంతకాలంగా ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడో కుందుర్తి సత్యమూర్తి, వీర్రాజు గారితో కలిపి సైదాబాద్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఫ్రీవర్స్ ఫ్రంట్ పేరిట కొంత కొంత చొప్పున డబ్బు వేస్తుంటే అవార్డు లకు,సభకూ ఉపయోగం పడుతుందన్న ఆలోచనతో జాయెంట్అక్కౌంటు ఓపెన్ చేసారు.ఆ విషయం ఇద్దరూ మర్చిపోయినట్లున్నారు.సమత వాళ్ళ నాన్న ఫైల్స్ ఏవో వెతుకుతున్నప్పుడు పాస్ బుక్ కనిపించిందట.కరోనా కాలంలోనే సమత బేంక్ కి వెళ్ళి కనుక్కుంటే జాయింట్ అక్కౌంట్ లో ఎవరైనా జీవించినవారు సంతకం పెడితే సరిపోతుంది అని చెప్పారుట.వీలున్నప్పుడు వెళ్ళి క్లోజ్ చేయమని అవసరమైన ఫామ్స్ నింపి తీసుకు వచ్చి ఇచ్చింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది.జనజీవితం పూర్తిగా యథావిధిగా మారింది. ప్రపంచం అంతా వూపిరి పీల్చుకుంది. -- శీలా సుభద్రాదేవి

నడక దారిలో -64

నడక దారిలో -64 నెచ్చెలి అంతర్జాల పత్రికని నడుపుతోన్న కె.గీత "నాకు మీ జ్ణాపకాలు రెగ్యులర్ గా రాస్తారా సుభద్రగారూ"అంటూ మెసేజ్ పెట్టింది.రెగ్యులర్ రాస్తానో లేదో అనుకొంటూనే మొదట రోణంకి అప్పలస్వామి గారి కుటుంబంతో నాకు గుల సాన్నిహిత్యం తో మొదలుపెట్టి, తర్వాత, అమ్మ గురించి,తదనంతరం అక్కయ్య గురించి రాసాను.ఇంక ఆ తర్వాత జీవితంతో ముడిపడిన సంఘటనలతో జీవితకథగానే కొనసాగటం జరిగింది. కోవిడ్ పరిస్థితులు కారణంగా ఇంటికి వచ్చేవారూ,మేము వెళ్ళేది లేదు. ఎనిమిదో తరగతి తర్వాత అక్కయ్య ఇంట్లో ఉంటున్నప్పటినుండీ చిన్న పుస్తకం కుట్టుకొని మనసు నొచ్చినప్పుడూ,ఆనందం కలిగినప్పుడు అందులో నా ఆలోచనలు రాసుకునే అలవాటు మొదలై తర్వాత డైరీ బుక్ కొనుక్కుని ఉమ్మడి కుటుంబంలో సంఘటనలు వరకూ డైరీ రాయటం అలవాటైంది.అవన్నీ వివాహానంతరం తెచ్చుకున్నాను. నెచ్చెలిలో జ్ణాపకాలు రాసే నేపధ్యంలో నా పాత డైరీలన్నీ తీసి చదవటం మొదలుపెట్టాను.నా రచనకి వీర్రాజుగారే నడక దారిలో అనే శీర్షిక నిర్ణయించారు.నాకూ ఆ పేరు నచ్చింది.నడకదారిలో నా పాదాలను గుచ్చినముళ్ళూ రాళ్ళే కాకుండా తాకిన పూలూ,పరిమళాలూ కూడా రాయాలని నిర్ణయించుకున్నాను. నా డైరీలో కొన్ని సంఘటనలు చదువుతున్నప్పుడు ఎన్ని దుర్ఘటనలు ఎదుర్కొన్నాను, ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్నంత దుఃఖాన్ని తట్టుకుని ఈ నాడు ఇలా ఎదిగాను అని నాకే ఆశ్చర్యం కలిగించింది.కొన్ని పేజీలు అప్పుడప్పుడు వీర్రాజు గారికి కూడా చదవమని చూపించాను.తన తోబుట్టువుల ప్రవర్తనలో ,వారి మాటల్లో తప్పువుందని తెలిసినా వారిని ఏమీ అనలేక "నువ్వు చదువుకున్న దానినీ,రచయిత్రివి కనుక సహనం వహించాలని,ఎప్పుడో వాళ్ళకే తమ తప్పు తెలుస్తుందని " వీర్రాజు గారు సర్ది చెప్పినప్పుడు నేనెలా బాధ పడ్డానో డైరీలో చూపాను. నా జ్ణాపకాల్ని ఎదలోతుల్లోంచి తవ్వి తవ్వి ,తడిమి చూసుకుంటున్నప్పుడు దెబ్బలు తగిలి తగిలి నా హృదయం ఇప్పుడు ఎంత రాటుతేలిందో నాకు కూడా అర్థమైంది. అదే సమయంలో ఇంటికి స్నేహితులు ఎవరూ రాకపోవటం, ప్రపంచమంతా కోవిడ్ ప్రభావంతో మరణమృదంగం వినిపించటంతో వీర్రాజు గారు తర్వాత్తర్వాత పుస్తకాలు చదవటం కూడా మానేసి తరుచూ ఆలోచనల్లో మునిగిపోయి గదిలో కుర్చీలో చీకటిలో వుండి పోవటంతో ఆయన్ని తిరిగి ఏక్టివ్ గా చేయటానికి తొలిరోజుల్లో మేము రాసుకున్న ప్రేమ లేఖలు ఇచ్చాను.నేనూ చదివి ఆయనకీ ఇచ్చేదాన్ని.వాటవలన కూడా ఎన్నో సంఘటనలు నాకు గుర్తు వచ్చేవి. కోవిడ్ ప్రభావం కొంత తగ్గిందేమో అనిపించింది.కానీ మరో వెరియంట్ గా మారుతోంది.బయటకు వెళ్ళటానికి జనం భయపడుతూనే వున్నారు. మాడభూషి స్మారక కథలు అవార్డులు రెండు ప్రకటించినా వీర్రాజుగారు ఈ ఏడాది కూడా మీటింగ్ పెట్ట వద్దని అన్నారు.ఈ ఏడాది కూడా అవార్డు ప్రకటించి,వచ్చే ఏడాది మూడూ కలిపి ఇద్దాం అనిచెప్పి ఆ ఏడాదికి అయోధ్యా రెడ్డిగారి " అక్కన్న పేట రైల్వే స్టేషన్" కథలసంపుటిని ఎంపిక చేసారు. అదేవిధంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు 2018 కి సిరికి స్వామినాయుడి 'మట్టి రంగు బొమ్మలు ' కవితా సంపుటికీ, ఇబ్రహిమ్ నిర్గుణ్ ' ఇప్పడేదీ రహస్యం కాదు' కవితా సంపుటికీ ప్రకటించడమే కాకుండా వీటితో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు నిలుపుచేయాలనే విషయం కూడా వీర్రాజు గారు ప్రకటించారు. అయితే వాసిరెడ్డి నవీన్, శివారెడ్డి గారూ ఇంటికి వచ్చి ఫ్రీవర్స్ ఫ్రంట్ ను ఆపుచేయొద్దనీ వీర్రాజు గారి సలహా మేరకే తాము కొనసాగిస్తామనీ అని ఆయన్ని ఒప్పించాలని ప్రయత్నించారు.శంకరంగారు కూడా అదే అన్నారు.కానీ ససేమిరా వీర్రాజు గారు వొప్పుకోలేదు.కుందుర్తి, సత్యమూర్తి గార్ల అభీష్టం ప్రకారం నిబద్ధతతో పారదర్శకంగా కొనసాగించాము.దాన్ని ఇంకొకరి చేతికి అందించటానికి అంగీకరించలేదు. కోవిడ్ ప్రభావం కొంత తగ్గిందేమో అనిపించింది.కానీ మరో వెరియంట్ డెల్టాగా రెట్టింపు తీవ్రతతో విజృంభించింది.బయటకు వెళ్ళటానికి జనం భయపడుతూనే వున్నారు. ఒకవైపు కోవిడ్ అతలాకుతలం చేస్తుంటే అటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చీదర పుట్టిస్తున్నాయి.రాజకీయ దాడులు ఒకవైపు,కేసులు మరోవైపూ.నాయకుల తిట్లతో రాజకీయాలను బురద బురద చేశాయి. తెలంగాణా లో కోవిడ్ తీవ్రత యథాస్థితిలోవున్నా రామాప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు లభించటం ఉపసమనం కలిగించింది. పెద్దాడబడుచుకు ఒంట్లో బాగుండటం లేదనీ,తరుచూ హాస్పటలైజ్ అవుతున్నట్లు తెలిసింది.వాళ్ళ ఇల్లు మా ఇంటికి అయిదు నిమిషాల నడక దూరం.కానీ కోవిడ్ సమయంలో హాస్పిటల్ నుండి వచ్చిన వాళ్ళని వెళ్ళి చూడాలంటే కొంచెం మా వయసులదృష్ట్యా జంకాము. అందులోనూ ఏప్రిల్-మే నెలల్లో డెల్టా వేరియంట్‌తో కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.స్నేహితుల బంధువులూ,తెలిసిన వారూ చాలా మంది కోవిడ్ డెల్టా వెరియంట్ తో కన్నుమూసారు.ఆర్టిష్ట్ చంద్ర కూడా అలాగే వెళ్ళిపోయారు.రాజకీయనాయకుడు, విశ్లేషకుడు సబ్బం హరిని డెల్టా వేరియంట్ కబళించింది.అన్నింటికన్నా మమ్మల్ని షాక్ గురి చేసింది ప్రస్తుతం మా స్కూల్ హెచ్చెమ్ గా వున్న నివేదిత నెలరోజులుగా కోవిడ్ తో హాస్పిటల్ లో వుండి చనిపోవటం చాలా బాధ కలిగించింది. వీర్రాజుగారు అటువంటి పరిస్థితుల్లో ఆడపడుచును చూడటానికి వెళ్దామన్నారు.తప్పక ఆయనను తీసుకొని వాళ్ళింటికి వెళ్ళాము.ఆడబడుచు చాలా బలహీనంగానే వుంది.కొంతసేపు కూర్చుని వచ్చేసాము. డెల్టా వేరియంట్ వలన ప్రపంచమంతా భీతావహంగావుంది.హాస్పటల్సే కాకుండా రోగుల్ని క్వారంటైన్ లో వుంచి చికిత్స చేసేందుకు ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తూనే వుంది.భౌతిక దేహాన్ని బంధువులకు అప్పగించకుండా నిబంధనల ప్రకారం డాక్టర్లే అంత్యక్రియలు ముగించే పరిస్థితులతో ప్రపంచమంతా భయం గుప్పిట్లో వుండిపోయింది. కరోనా రెండో దశ సమయంలో కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో పడకలు, ప్రాణవాయువు కొరత ఏర్పడింది. కొన్ని ఆసుపత్రుల్లో ఒక బెడ్ మీద ఇద్దరు, ముగ్గురు రోగులను ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వార్తలు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగుల బంధువులు పడిన అవస్థలు అంతా ఇంతా కాదు. ఏడాది పాటు రైతులు సాగు చట్టాలపై సాగించిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేసింది. అక్కయ్యకూతురు రంజన కూడా కోవిడ్ బారిన పడింది.శ్వాసతీసుకోవటమే కష్టమైన పరిస్థితిలో అర్థరాత్రి పూట ఏ హాస్పిటల్ లోనూ చేర్చటానికి ఖాళీలు లేక తిరిగి తిరిగి ఒక దాంట్లో చేర్చారని ఫోను వచ్చింది.దాంతో మాకు కూడా బెంగగా అయిపోయింది. మరికొన్ని రోజులకే ఉదయమే మా ఆడపడుచు చనిపోయిందని ఫోన్ వచ్చింది.వాళ్ళఇంటికి తీసుకు వస్తున్నామని చెప్పారు.ఇటువంటి పరిస్థితుల్లో పదిహేను రోజులకు పైగా హాస్పిటల్లో వుండి వచ్చినపుడు అంత్యక్రియలకు వెళ్ళాలంటే భయపడ్డాము.అందులోనూ ఎనభై ఏళ్ళు దాటిన వీర్రాజుగారిని ఎలా తీసుకు వెళ్ళాలని ఆలోచించాము.నేనూ, పల్లవీ వెళ్దామనుకున్నాము. ఎలాగో వీర్రాజుగారిని వప్పించి ఆయన్ని ఆషీకి అప్పగించి వెళ్ళాము.కానీ వీర్రాజుగారు తానూ వస్తానని పేచీ పెట్టటంతో ఎంతైనా రక్తసంబంధం కదా ఎవరినో ఆయన్ని తీసుకు రావటానికి పంపించాము. కార్యక్రమం ముగిసేవరకూ వుండి ఇంటికి వచ్చేసాము. మూడోరోజు దినాలు వెళ్ళటానికి ఆడపడుచు ఫొటో దగ్గర పెట్టటానికి పల్లవి మెయిన్ రోడ్డు వరకూ స్వీట్ గానీ పళ్ళుగానీ దొరుకుతాయేమోనని వెళ్ళింది. తీరా వాళ్ళింటికి వెళ్ళాలనుకునేసరికి వాళ్ళు బిల్డింగ్ కి కరెంటు లేదు.కాగలకార్యం గంధర్వులు తీర్చారన్నట్లు రెండింతస్తులు మెట్లు ఎక్కడం కష్టమని వీర్రాజుగారిని రావద్దని,కరెంటు వస్తే తీసుకు రావటానికి ఎవరినైనా పంపిస్తామని చెప్పి పల్లవీ,నేనూ వెళ్ళాం.చిన్నమరిదీ,తోటికోడలూ వచ్చారు.కుకట్పల్లిలో వున్న అన్నయ్య కొడుకులూ జ్వరాలని రాలేదు .,పెద్దమరిది ముగ్గురు పిల్లల్లో పెద్దమ్మాయి వచ్చింది. కార్యక్రమం పూర్తిచేసుకుని ఇంటికి వచ్చాము. పల్లవికి వాళ్ళు ఇంట్లో మొదలైన తలనొప్పి అంతకంతకూ ఎక్కువై సాయంత్రానికి జ్వరం వచ్చేసింది.పారాసెటమల్ టేబ్లెట్ వేసుకుని ఎందుకైనా మంచిదని చివరి రూములో పడుకుంది.అందరియిల్లు డా.వింజమూరి సూర్యప్రకాష్ గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే క్వారంటైన్ అయిపోమని మర్నాడు బ్లడ్ టెస్ట్ చేయటానికి లేస్ అసిస్టెంట్ ను పంపుతానని అన్నారు. డా.సూర్యప్రకాష్ దంపతులు కోవిడ్ కాలానికి ప్రభుత్వం తరపున ఆన్లైన్ లో ఆరోగ్యం సలహాదారులుగా నే పనిచేస్తున్నారు. పల్లవికి టెష్టులు చేయిస్తే కోవిడ్ డెల్టా వేరియంట్ అని నిర్థారణ అయ్యింది.సూర్యప్రకాష్ గారు మేము పెద్దవాళ్ళు,ఆషీ చిన్నది కనుక హాస్పిటల్ లో చేయవద్దని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.దానికి సంబంధించిన మందులు పంపించి ఆహారనియమాలన్నీ తెలియజేసారు.రోజూ తప్పని సరిగా పప్పు ,నిమ్మరసం తీసుకోమన్నారు. పల్లవి తలుపులు వేసుకొని రూములోనే వుండిపోయింది.భోజనం, టిఫిన్ ద్వారం దగ్గర పెడితే తీసుకునేది.లక్ష్మిని తిరిగి పిలిచేవరకూ పనికి రావద్దని చెప్పాను.ఆషీ సాయంతో ఇంటి పనీ,వంటపనీ చేసుకునేదాన్ని.వారం వారం కోలివుడ్ టెష్టులు డాక్టర్ గారు చేయించారు. పల్లవికి కోవిడ్ వచ్చేసరికి వీర్రాజు గారు మరింత భయపడ్డారు.వైజాగ్ లో రంజనాకు కూడా తగ్గిపోవటం మాకు బెంగగా అయిపోయింది. బిల్డింగ్ లో వున్న స్వాతిగారు ,సరిత కూడా కూరలవీ ఒకటి రెండు సార్లు పంపించారు. ఆడపడుచు దశదినకర్మకి వాళ్ళు అమ్మాయి సంగీత పిలిచింది.కానీ పల్లవికి జ్వరతీవ్రత వుంది.అందులోనూ ఇంట్లో కోవిడ్ బాధితురాలు వుంటే ఎలా వెళ్తాము.అందుకని రాలేదని చెప్పాము.కుకటపల్లిలోనూ మారింది పిల్లలూ అందరికీ జ్వరాలు.దాంతో వాళ్ళూ ఎవరూ రాలేక పోయారు.చిన్నమరిదీ,అంతులేని భార్యా,దీప,వాళ్ళాయన మాత్రమే హాజరయ్యారు. పరిస్థితి అర్థం చేసుకోకుండా సంగీత కావాలనే అందరూ, ముఖ్యంగా మేము ఈ వంక పెట్టి రాలేదని మనసులో కక్ష పెట్టుకుంది.ఆడబడుచు ముత్తైదువులు ఆ పోవటం వలన చేట వాయినాలు అయిదుగురికి ఏర్పాటు చేసిందిట.దగ్గరే కనుక పెద్దత్తకి ఇంటికి వెళ్ళి ఇవ్వు అని మా తోటి కోడలు చెప్పటంతో మా ఇంటికి వచ్చి కవరులో ఆ చేటవాయినాన్ని తీసుకు వచ్చి మాడుముఖంతో టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది.ఆమె ఇచ్చిన విధానం,ఆ ముఖం చూసాక నాకు అది ముట్టుకో బుద్ది కాలేదు.కానీ వీర్రాజుగారు బాధ పెడతారని తీసుకుని లోపల పెట్టాను. డెల్టా వేరియంట్ తీవ్రతతో జనం పిట్టల్లా రాలిపోయారు.సీతారామశాస్త్రి, రోశయ్య వంటి ప్రముఖులని తెలుగు ప్రజలు కోల్పోయారు.తెలిసిన వారూ మిత్రులూ, పరిచయస్తుల మరణాలు ఉక్కిరిబిక్కిరి చేసాయి. మూడో వారానికి పల్లవికి ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టింది.కానీ డాక్టర్ గారు మేము పెద్దవాళ్ళు కనుక మరో రెండు వారాలు క్వారంటైన్ లోనే వుండమన్నారు. ఇంచుమించు రెండునెలలు అందరం చాలా టెన్షన్ లోనే వున్నాము.మళ్ళా పల్లవి మామూలుగా అయ్యేక వూపిరి పీల్చుకున్నాం.వైజాగ్ లో రంజనాకి కూడా గండం తప్పి ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చింది. నడక దారిలో తప్ప రెండు నెలలుగా రాయటం చదవటం కొంచెం తగ్గింది.డైరీలు,ఉత్తరాలు వలన రాయటం ఏమంత కష్టంగా లేదు.రాయటం మొదలు పెడితే ఒకదాని తర్వాత సంఘటనలు గుర్తు వచ్చి ఎక్కడా తడబడి కూడా రాయగలుగుతున్నాను.వీర్రాజుగారు కూడా బాగా రాస్తున్నానని ప్రశంసించారు. రచయిత్రుల కథల గురించి నేను రాస్తున్న వ్యాసాలు ప్రచురితమైనవి ఇరవై మూడు అయ్యాయి.జంట రచయిత్రులు మందిరపు పద్మ,లలితల కథల గురించి రాసిన వ్యాసం చదివి రచన సాయి గారు ఫోన్ చేసారు.పద్మ,లలితలను గురించి అప్పటి వారికి తప్ప ఎవరికీ తెలియదు అటువంటి రచయిత్రులు గురించి రాయటం సంతోషంగా వుంది అని ప్రశంసించారు.అయితే 'వాళ్ళు వైజాగ్ కి చెందిన వారు. మా ఇంటికి దగ్గరలోనే ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు ' అన్నారు వ్యాసం పత్రికలో ప్రచురితమైనపుడు కథానిలయం లో చూసిన దానిని బట్టి తెలంగాణాలోని ఒక గ్రామానికి చెందిన వారని రాసాను.పుస్తకంగా చేయాలనుకున్నప్పుడు ఆ వాక్యం తీసేసాను. నేను రాసిన ఇరవై మూడు వ్యాసాలకు రచయిత్రులు చెందినవే సదస్సులలో ప్రసంగవ్యాసాలు రెండింటిని కలిపి " కథారామంలో పూలతావులు" గా నా వ్యాససంపుటిని ప్రచురణకు ఇచ్చాను. నేను వ్యాసాలు రాసే సందర్భంలో నిడదవోలు మాలతి కథలు గురించి రాసినప్పుడు ఆమె బ్లాగులో ఆరు కథలపుస్తకాలు ,ఎన్నెమ్మకతలు పేరిట మరో అయిదు పుస్తకాలు,రెండు నవలలు, ఆరేడు వ్యాస సంపుటాలు కాకుండా వందకు పైగా గురజాడ నుండి ఆమెతరం వరకూ కథకుల కథల్ని ఆంగ్లానువాదం చేసినట్లుగా తెలిసింది.1973లోనే యూఎస్ వెళ్ళిపోవటం తో ఆమె రచనలు చేసినా తాను బ్లాగులోనే పొందుపరిచుకోవటంతో ఇక్కడ తెలుగు వారికి ఆమె ఇంత సాహిత్య సృజన చేసినట్లు తెలియకుండా అయిందని బాధకలిగించింది. ఫేస్బుక్ లో మాలతి గారికి మెసేజ్ పెట్టి నేను ఆమె రచనలమీద సమగ్రంగా పుస్తకం రాయాలనుకున్నట్లు తెలియజేసి భఅవసరమైనప్పుడు సంప్రదించడానికి ఈ మెయిల్ ఐడి కోరాను.మాలతిగారు చాలా సంతోషంగా స్పందించారు. - శీలా సుభద్రాదేవి

1, మే 2026, శుక్రవారం

గుత్తికొండ సుబ్బారావుగారి గురించి వ్యాసం

~ సాహితీవేత్తలకు అండ- సుబ్బారావు గుత్తికొండ ~ 1970 లో వీర్రాజు గారితో కలం స్నేహానికి మూలకారణమైన స్వాతి మాసపత్రికకి వ్యవస్థాపకులైన వేమూరి బలరామ్, వేమూరి సత్యనారాయణ,వేమూరి గోపాలకృష్ణగార్లతో వీర్రాజుగారు గౌరవసంపాదకుడుగా ప్రారంభమైంది. ఆ తర్వాత 1971లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడే శీలా వీర్రాజు గారితో వివాహానంతరం వేసవి సెలవుల్లో భాగ్యనగరంలో అడుగుపెట్టాను. అప్పట్లో యువభారతి సంస్థ అధ్వర్యంలో ప్రతి ఆదివారం సారస్వత పరిషత్తులో దివాకర్ల వెంకటావధానిగారి వంటి ప్రముఖ పండితులచే ప్రసంగం కార్యక్రమాలు జరుగుతూ వుండేవి.వీర్రాజుగారితో ఆ సంస్థకు గల అనుబంధం వల్ల ఆయనతో పాటూ నేను వెళ్ళేదాన్ని.అక్కడే మొట్టమొదటిసారి గుత్తికొండ సుబ్బారావుగారితో తొలి పరిచయం జరిగిన జ్ణాపకం. జనవరి 1971లో వేకువ సాహిత్య త్రైమాస పత్రిక వీర్రాజుగారి అక్షరాల ముఖచిత్రంతో, కె. శివారెడ్డి సంపాదకత్వంలో,గుత్తికొండ సుబ్బారావు నిర్వహణలో,శీలా వీర్రాజు,వి. సీతారామరెడ్డి,ఏ. సుబ్బారావుగార్ల సలహామండలితో వెలువడి అనేకమంది ప్రముఖుల కవులూ,రచయితలతో గ్రంథాలయాల్లో దాచుకోదగిన పత్రికగా ప్రారంభమై కొంతకాలం కొనసాగింది. సుబ్బారావుగారి అమ్మాయి స్పందన,మా అమ్మాయి పల్లవి ఒకే వయసువారు కావటం పిల్లలగురించి మా సంభాషణలో తరుచూ వస్తుండేది.స్పందన పేరుతో స్పందన వాణి మాసపత్రిక కొన్నాళ్ళు తీసుకు వచ్చారు.స్పందనవాణిలో నా కథలూ,కవితలూ వస్తుండేవి. వీర్రాజుగారి ప్రోత్సాహంతో వారు వేసిన ముఖచిత్రంతో కుందుర్తి పీఠికతో "మనిషికోసం" అనే కవితా సంపుటిని 1974లో వెలువరించి సుబ్బారావుగారు కవిత్వరంగంలో కవిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.కాని సభలూ,సదస్సుల నిర్వహణ బాధ్యతలతో సుబ్బారావుగారు సాహిత్య సృజన పూర్తిగా మానేయటం నచ్చక "మంచి కవిత్వం రాయగలిగీ కూడా కార్యకర్తగా సుబ్బారావు అయిపోయాడ"ని పలుమార్లు వీర్రాజుగారు నా దగ్గర వాపోయే వారు. అప్పుడప్పుడే సాహిత్యంలో బుడిబుడి అడుగులు వేస్తూ కథా సంపుటి వేయాలనే ప్రయత్నంలో వుండగా నా పేరు ఎవరు ప్రస్తావించారో గానీ మచిలీపట్నంలో జరిగే రచయిత్రుల మహాసభల్లో కవిసమ్మేళనం లో పాల్గొనమని ఉత్తరం వచ్చింది. ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. కానీ మానసిక అనారోగ్యంతో వున్న బాబును తీసుకుని ఎలా వెళ్ళాలి అనేదే పెద్దప్రశ్న. మచిలీపట్నం వాస్తవ్యులు వీర్రాజుగారికి మంచిమిత్రుడైన గుత్తికొండ సుబ్బారావుగారు తమ స్పందన సాహితీ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీతో కలిసి రచయిత్రుల మహాసభలు నిర్వహిస్తుందని తెలియజేసి, కుటుంబ సమేతంగా రమ్మనీ, మిగతా విషయాలు నేను చూసుకుంటానని అన్నారు. ఉత్సాహంగా అందరం బయలుదేరాము. సుబ్బారావుగారు మమ్మల్ని రిసీవ్ చేసుకొని హొటల్ రూమ్ లో దించారు. బాబును,పల్లవిని తయారు చేసి వీర్రాజుగారికి బాబు బాధ్యత అప్పజెప్పి నేను తయారయ్యాను. అంతలో సుబ్బారావు గారు వచ్చి సభలు జరిగే వేదికకు తీసుకువెళ్ళారు. అప్పుడే ప్రారంభ సభ మొదలైంది. జస్టిస్ అమరేశ్వరి ప్రారంభించారు. దేవులపల్లి రామానుజరావు గారు పుస్తకప్రదర్శన ప్రారంభించారు. నేను చిన్నప్పటి నుండి చదివిన రచయిత్రులు వసుంధరా దేవి, కె.రామలక్ష్మీ, లత, ద్వివేదుల విశాలాక్షి, ఆనందారామం, ఐవీఎస్ అచ్యుత వల్లీ ఇలా ఎందరో ఉన్న ఆ సభామందిరంలో నేను కూడా ప్రత్యేక ఆహ్వానితురాలిగా కూర్చున్నాను. ఒక ఉద్వేగం నన్ను ఆవరించింది. అప్పుడు సాహిత్య అకాడమీ చైర్మన్ బెజవాడ గోపాలరెడ్డిగారు. సాయంత్రం సెషన్ కవిసమ్మేళనంలో వేదిక మీద ఆనాటి ప్రముఖ కవయిత్రులు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, నాయని కృష్ణకుమారి, యశోదా రెడ్డి, సి.వేదవతితో పాటు నేను వేదిక పంచుకొని కవిత్వం చదవటం నాకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. నా కవిత ఆ వేదిక పై కొత్తదనాన్ని ఇచ్చిందని అధ్యక్షురాలు ప్రశంసించారు. మనసంతా హర్షాతిరేకాలుతో నిండి ఉప్పొంగిపోతున్న నన్ను గుత్తికొండసుబ్బారావు గారు తిరిగి హోటలు రూముకి దింపారు. ఆ రాత్రి బాబుకు అనారోగ్యం తీవ్రం అయింది.సుబ్బారావుగారు డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళటానికి సాయం చేసారు. డాక్టరు మందు పడ్డాక పిల్లాడు మర్నాడు ఉదయానికి తేరుకున్నా డు. మేము కూడా కుదుట పడ్డాము. ఆనాడు సుబ్బారావుగారి సహాయం మరువలేనిది . వీర్రాజుగారికి ఉయ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్ గారు బాపురమణల పురస్కారం అందజేసినపుడు సుబ్బారావుగారి ఇంట్లోనే వారి శ్రీమతి ప్రేమ పూర్వక ఆతిధ్యంతో పుట్టింటికి వచ్చిన అనుభూతి కలిగించారు .మా ఇద్దరినీ చుట్టుపట్ల విహారస్థలాలు దగ్గరుండి చూపించారు. నేను పదవీ విరమణ పొందిన తర్వాత ప్రతీ ఏడాదీ ఒకరికి బహుమతిగా పుస్తకం వేయాలి అనుకుని మొదటగా డి.సుజాతాదేవి రాసిన " ఆటలో అరటిపండు" పిల్లల పుస్తకం వేసాము.ఆ పుస్తకం ఆవిష్కరణ బందరులో సుబ్బారావుగారు ఏర్పాటు చేసారు.పుస్తకావిష్కరణకు నన్ను,వక్తగా ఇంద్రగంటి జానకీ బాలని ఆహ్వానించారు.మొదటినుండి ఆత్మీయ మిత్రులమైన మేము ముగ్గురం సుబ్బారావుగారి ఇంట్లోనే సోదర వాత్సల్యం పొందాము.అప్పటికే కొంత అనారోగ్యం ఉన్నా కూడా వారి శ్రీమతి రామరత్నం మాతో కలిసి కబుర్లు చెప్పారు. తర్వాత్తర్వాత కొన్ని కుటుంబ బాధ్యతలు సమస్యలతో సుబ్బారావుగారికి దూరం అయ్యాము.చివరికి వారి శ్రీమతి కాలం చేసినపుడు కూడా కలుసుకోలేకపోయాము.అదేవిధంగా మా కుటుంబ దుర్ఘటనలకూ వారూ రాలేక పోయారు . సుబ్బారావుగారు చిరకాల సహచరి దూరమైనా ఆమె జ్ణాపకాలు పదిల పరచుకొని ఆమెకు నివాళిగా అపురూప చిత్రాలతో చక్కని పుస్తకాన్ని వెలువరించటమే కాకుండా ఆమె పేరిట ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అంతకుముందు శ్రీమతి చేసిన సేవాకార్యక్రమాలు కొనసాగించారు.ఆ విధంగా రామరత్నంగారిని చిరంజీవులుగా చేయటం అపురూపమైన విషయం. ఆ కోవలోనే గుత్తికొండ రామరత్నం ట్రస్ట్ తరపున పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు.మూడేళ్ళ క్రితం నేనుకూడా జీవన సాఫల్య పురస్కారం సుబ్బారావుగారి చేతులమీదుగా అందుకునే అవకాశం కలిగించారు.సుబ్బారావుగారి కుటుంబం ద్వారా ఇలా అనేక సార్లు వాత్సల్యపూర్వక గౌరవాలు అందుకున్నాను. ఈ విధంగా సుబ్బారావుగారు ఆయురారోగ్యాలతో సంతానంతో కలిసి సుఖసంతోషాలు పంచుకుంటూ రామరత్నంగారికి నచ్చిన కార్యక్రమాలు నిర్వహిస్తూనే వుండాలని ఆకాంక్షిస్తూ సోదరులు గుత్తికొండ సుబ్బారావుగారికి హృదయపూర్వక అశీతి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. - శీలా సుభద్రాదేవి

28, ఏప్రిల్ 2026, మంగళవారం

ఆదూరి-సాహిత్యపు దారి

ఆదూరి.. సాహిత్యపు దారి గత నాలుగు దశాబ్దాల సాహిత్య చరిత్ర పరి శీలిస్తే కథాంశంలోను, కథనంలోను, భాషలోను, శైలి, వైచిత్రిలోను అనేక రకాల పరిణామాలు చెందింది. అంతేకాక ఈ క్రమంలో సాహిత్యంలో అనేక వాదాలు చోటుచేసుకోవటం ఒక విశేషం. పరిణామ క్రమంలో కొందరు సాహిత్యరంగంలో ఒక ముద్రని ఏర్పరుచుకుని పదేపదే వ్యాసాలలో ఉటంకించ బడుతున్నారు. మరికొందరు వాదాల జోలికి పోకుం డా తమదృష్టికి వచ్చిన కథాంశాలతో రాసుకునే వారు, విమర్శకుల దృష్టికి దూరంగా ఉండిపోతు న్నారు. ఆ కోవకు చెందిన రచయిత ఆదూరి వెంకట సీతారామ్మూర్తిగారు. 1969లో రచనా వ్యాసాంగాల్లో అడుగు పెట్టిన ఆదూరి సీతారామ్మూర్తి దాదాపు అయిదు దశాబ్దాలుగా నవలలూ, కథలూ రాస్తూ అదుగోపులి, వెన్నెల్లో పావురాళ్లు, వర్ణచిత్రం. ఆత్మధృతి, ఉత్సవ కానుక, అందని జాబిల్లి పేర్లతో ఆరు కథా సంపుటాలే కాక నవలలూ వెలువరించారు. స్థూలంగా పరిశీలిం చితే శైలినిబట్టి, కథాంశాన్ని బట్టి కథనాన్ని నడిపే విధానాన్ని బట్టి మూడు విధాలుగా వీరి కథలు విభజించవచ్చు. ఆ తేడా కూడా రచయిత రచనారంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ సాహిత్య ధోరణిలో వచ్చిన మార్పుకు వయస్సు రీత్యా తన ఆలోచనా రీతిలోనూ, జీవన విధానం లోనూ వచ్చిన మార్పులకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ ఉండడం ఆ కథలలో గమనించవచ్చు. రచన మొదలు పెట్టిన నాటి నుంచి ఎనభయ్యవ దశకం వరకూ రాసిన కథలు ఆనాటి సాహిత్యంలో వెల్లువెత్తిన విప్లవ ధోరణులూ, శ్రీశ్రీ, కారా, రావిశాస్త్రి వంటి సాహితీవేత్తల్ని చదువుకున్న యువ ఆవేశం రచయిత కథలలో కనిపిస్తుంది. తన చేతులతో పునాది రాయి అందించిన అసిరయ్య భవన నిర్మాణ పనుల్లో ప్రమాదవశత్తూ అవిటివాడైతే, మరోవైపు భవన కంట్రాక్టరు అంత కంతకూ ఎదిగి మంత్రి అయి భవన ప్రారంభోత్సవానికి రావటం చూసిన అసిరయ్య తానెందుకు అంతకంతకూ నేలబారయ్యానని అబ్బుర పడతాడు. "రాళ్ళెత్తిన కూలి" (1984)కథాంశానికి తగినట్లు కథాకథనం రచయిత ఆసక్తికరంగా నడుపుతారు. ఇటువంటిదే మరో కథ "శిల్పి". కొడుకు గణపతిని చదువు మాన్పించి తనతో వడ్రంగి పనికి తీసుకుపోతాడు తండ్రి. పనికి రావని పడేసిన చెక్క ముక్కల్ని సాధనతో బొమ్మలుగా మార్చుతాడు గణపతి. తనకు బొమ్మలు వేయటంనేర్పిన డ్రాయింగు మాష్టారికి బొమ్మ చెక్కి ఇవ్వాలనుకుంటాడు. కానీ టింబర్ డిపో యజమాని గణపతి పనితనాన్ని గుర్తించి, చెక్కముక్కల్ని ఇచ్చి బొమ్మలు చేయించి లాభపడతాడు . ఒకసారి గణపతి చెక్కిన ప్లానెల్ శిల్పాన్ని విదేశీయుడు కొని పోటీకి పంపుతాడు. అది బహుమతికి ఎంపికౌతుంది. దాన్ని తయారు చేసింది తానేనని టింబర్ యజమాని ప్రచారం చేసుకొని సన్మానం పొందుతున్న సందర్భంలో దూరంగా నిల్చున్న గణపతిని చూసి తన నేరానికి సిగ్గుపడి గణపతిని చేరదీస్తాడు. ఈ శిల్పికథ గూర్చి ఒక సందర్భంలో వాకాటి పాండురంగారావు గారు " అసాధారణమైన విషయాన్ని అలతిపదాలతో అల్లిన శక్తివంతమైన రచన"అన్నారు. డాక్ యార్డులోని పేదరాలి పెన్షను కోసం పడే యాతనైనా, కార్పరేటు వైద్యనీతిని ఎత్తి చూపడమైనా, నిస్వార్థ సంస్కారం గల అన్నమ్మ కథ అయినా, బాలమోటారుమెకానిక్క్ వెంకటేషు జీవన పోరాటమైనా, పల్లె పాట స్వార్థపరుల చేత చిక్కి వ్యాపార వస్తువుగా మారిన వైనమైనా ఆదూరి సీతారామ్మూర్తి చేతిలో చెక్కబడిన కథనంలో పరిమాణంలో చిన్నగా వున్నా గాఢత సంతరించుకొని స్పష్టమైన పరిపూర్ణతని సాధించటంలో విజయ వంతమయ్యాయి. సాహిత్యం వలన సమాజం మారినా మారక పోయినా అప్పట్లో వచ్చిన సాహిత్య పరంపరకు శిల్పంలోగాని, కథనంలో గాని ఏమాత్రం తీసిపోకుండా రచయితకు తనదైన గుర్తింపును ఇచ్చేటి కథలు యివి . ఎనభై దశకం నుండి తొంభైయ్యవ దశకం వరకూ రాసిన కథలు ఎక్కువగా దిగువ మధ్యతరగతికి చెందిన చిరుద్యోగుల జీవితాలలోని సంక్లిష్టతని, ఆర్థిక, సామాజిక రాజకీయపరంగా, కుటుంబపరంగా భిన్న దృక్కోణాలలో బహుముఖాలుగా రచయిత అనేక కథలలో వ్యక్తీకరించారు .మరికొన్ని కథలలో ముఖ్య కారణాన్ని కథాత్మకం చేసి, జీవితాన్ని తనదైన పద్ధతిలో వ్యాఖ్యానించటం మరొక విశేషం. చదువు కొని ఉద్యోగం చేయాలని కన్న కల సుగుణకు ఇటు పుట్టింటా, అటు మెట్టినింటా వ్యతి రేకించిన నేపథ్యంలో వెలిసి పోతుంది. ఆ దశలో భర్త అనుకోకుండా మరణించటంతో కారుణ్య నియామకం వల్ల ఉద్యోగం వస్తుంది. ఆనాడు వ్యతిరేకించిన వారే నేడు సమర్ధించటంలోని పరమార్థం కేవలం ఆర్థికమే అన్న ఆలోచనలో పడుతుంది సుగుణ. ఈ కథలో మొదటినుండి చివరివరకూ సుగుణ మానసిక సంఘర్షణ, ఆలోచనల వైవిధ్యం అంతటినీ సుగుణ ఆలోచనా కథనం గా చెప్పటం కథకు మరింత బలాన్ని యిచ్చింది . 1989 లో రాసిన ' ఆవిష్కరణ' కథలో ప్రతీ కథకుడూ మమేకం ఔతాడు. రచనల్ని పుస్తక రూపంలోకి తేవటంలోని కష్ట, నష్టాలు, ఆర్థిక పరిస్థితులూ, అన్నింటినీ అధిగమించి పిల్లలసహకారంతో పుస్తకం వెలుగు చూసినా ఆవిష్కరణ, అట్టహాసాలు సామాన్య రచయితకి ఎంత భారమో తెలుపుతుంది. అంతే కాక అధికారుల, రాజకీయ ప్రాపకాలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రతిభావంతులుగా పరిగణించబడి సన్మానాలు అందుకునే కుహనా రచయితలూ, కవుల్ని ఎత్తి చూపు వ్యంగ్యరచన యిది. నోరు లేని జీవాలు, స్వేచ్ఛ కోసం తెగువనీ, ధైర్యాన్ని ప్రదర్శిస్తే తమపై ఆధారపడి బతికే మనుషులంతా ఏమై పోతారో అని అనుకునే ఎద్దు స్వగతంలో సాగే కథ 'ఓ మహితాత్మకథ ' (1988) ఇటీవల ఇదే పద్ధతిలా దున్నపోతుల స్వగతంగా మరొకరి కథ ఒకపత్రికలో ప్రచురితమయ్యింది .. 90 లనుండి 2000 సం. వరకూ వచ్చిన నిరికథలలో చాలా వరకూ చిరుద్యోగులు, మధ్యతరగతి వారి జీవితాలలోని ఆర్థిక ఒడుదుడుకులతో కథలు నడుస్తాయి. అటు బడుగువర్గాలవారిలా ఇంటాల్లిపాదీ ఏపనైనా చేయటానికి వెళ్ళలేక పోవటం, ఇటు ఉన్నత వర్గాల వారిలా ఆర్థికతోడ్పాటులేక కేవలం ఇంటి పెద్ద సంపాదనే ఆధారమై సతమతమయ్యే సంక్షుభిత జీవితాల్ని అక్షరీకరించారు . మధ్యతరగతి జీవితాల్ని ఆర్థికావసరాలు ఎలా చిన్నా భిన్నం చేస్తాయో, వీటిని అధిగమించి మాన వత్వ పరిమళాల్ని ఎలా అందుకున్నారో చెబుతాయి. పల్లెల్లోను, పట్టణాల్లోనూ కడుపు చేతపట్టుకొని బతికే చిరుద్యోగుల వెతల్నే కాక, ఛిద్రమై పోతున్న మానవ సంబంధాలనూ భిన్న దృక్కోణంతో వ్యక్తీకరించటం వీరి కథల్లోని మౌలికాంశం. ఇరవయ్యవ శతాబ్దం తర్వాత రాసిన కథల్లో రచయిత జీవితానుభవం, ఆలోచనల్లో పరిణత, జీవన విధానం ఇలా అన్నింటిలోనూ పరిణామక్రమంలో మార్పు రావటం సహజం. మొదట్లోని ఆవేశం తగ్గి నిలకడగా ఆలోచించడం అలవడుతుంది. వయస్సుతో వచ్చే వేదాంత ధోరణి కొంత వుంటుంది. మొదట్లో చిన్న కథలుగా గాఢత, స్పష్టతతో కూడి ఒకింత ఆవేశం, ఆవేదన, ఆర్తితో నడిచిన కథన నిర్మాణం ఆతర్వాత కొంత వివరణాత్మకంగా, ఆచితూచి కథని నడపడమే కాక కథా పరిమాణం కూడా విస్తృతం చేసి రాయటం కనిపిస్తుంది. దేవుడంటూ వుంటే ఈ తేడాలు, ఈ దరిద్రాలూ, అన్యాయాలూ ఆక్రమాలు ఉండేవా అనుకునే పరిస్థితికి రావడానికైనా, ఎవరో దయతో ఇచ్చే ప్రసాదాలు దేవుడే ఇచ్చాడని నమ్మిన పిల్లవాడు సింహాచలంకి ఒక కథలోనూ, అందరికీ ఉన్న డబ్బు తనకెందుకు లేదనే సందేహంతో సతమతమయ్యే బుజ్జికి మరోకథలోను తెలియనిది సమాజాన్ని పట్టి పీడించే వ్యవస్థే అనేది ఈ రెండు కథల్లోను రెండు వర్గాల, రెండు వర్గాల ప్రతినిధులతో సమర్ధవంతంగా నిరూపించారు రచయిత. ముళ్లపూడినీ, మునిమాణిక్యాన్ని అభిమానించే ఆదూరి సీరియస్ కథలతో సమాంతరంగా హాస్య కథల్ని ఇష్టపడతారు. "ఎదుటి మనిషిని సంతోషపెట్టగలగటం అదీ రచనలద్వారా ఒక వరమనే భావిస్తాను అంటారు. అందుకేనేమో మొదట్లో అన్ని సీరియస్ కథలు రాసిన అదూరి 2000తర్వాత ఎక్కువగా హాస్యరచనలు చేయడం గమనార్హం. ఆకోవలో రాసిన కథలు హాస్య, వ్యంగ్య ధోరణిగా అనిపించినా కొన్నింటిలో అంతర్లీనంగా ఆవేదన సూచింపబడుతుంది. 1971 నాటికి టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి చర్చింపబడుతున్న రోజుల్లోనే అదే అంశంపై ఆర్థికావసరాలకై అందుకు ఒప్పుకున్న పెళ్లికాని యువతి చివరలో బాబుని వదలలేక తానే తీసుకెళ్లిపోతుంది. సమకాలీన అంశంపై తక్షణ స్పందన. ఈ వాస్తవ సంఘటనల్నీ వేదాంతాన్ని సమపాళ్లలో మేళవించి, హృదయాన్ని కదిలించే కథ(1990) 'ఆత్మధృతి' వైదిక కర్మలు వేస్తూ దానాలు తీసుకుని జీవనం సాగించే పేదబ్రాహ్మణుడు, వాటిలోనూ చొచ్చుకువచ్చిన వ్యాపారధోరణితో విస్తుపోయి, ఆపరకర్మలపై విశ్వాసం సడలి చరమదశలో తనను తానే దానం చేసుకుని తన జీవితాన్ని పరిపూర్ణ జ్ఞానిగా ముగించడంతో రచయిత కథని ఏవిధమైన భావోద్వేగాలకూ లోను కాకుండా సంయమనంతో కథని నడిపించడం విశేషం. విభిన్న కథాంశాలలతో సాధారణమైన వాక్యనిర్మాణంతో కథని నడిపించే తీరు ఒక ఎత్తైతే కథ ముగించడం ఒక ప్రత్యేకతని సంతరిం చుకోవడం చాలా కథల్లో ఉంటుంది. కొంతమంది రచయితల్లా గంభీర సమాసాల సంభాషణల్తో సమా జాన్ని ఉద్దరిస్తున్న రీతితో పేరాలకు పేరాలు ఉండవు. మరికొంతమందిలా పాఠకులు తెలివి తక్కువవారిగా పరిగణిస్తూ మొదటినుండి పండువలిచినట్టు చెప్పరు. ఇంకొంతమందిలా కథలోకి రచయిత ప్రవేశించి తన అభిప్రాయాల్ని, పాండిత్యాన్ని గుప్పించరు. ఒక స్నేహితుడిలా ముందు ఒక వాతావరణాన్ని కల్పించి పాఠకుడిని కథలో ప్రవేశపెట్టే ఒక అనుభవాన్ని కథా రూపకంగా చెప్పినట్లుగా ఉంటాయి. ఆ తర్వాత పాఠకుడు తేలికైన సంభాషణలోనికి మమేకమౌ తాడు. ఇక ముగింపు కూడా అతి తెలివిగా పాఠకుడికే వదిలేస్తాడు రచయిత. నిజానికి రామ్మూర్తిగారి కథల్లో సింహభాగం కూటికీ, గుడ్డకీ, గూడుకీ ప్రతిదినం వెతుక్కునే చిరుద్యోగుల జీవన ప్రయాణమే దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల కథలూ తన అవగాహన, పరిశీలనతో రచయిత, తనని తాను ఆ పాత్రల్లోకి ఆవాహన చేసుకొని కరుణారసాత్మకంగా చెప్పటమే కాకుండా, పాఠకుడికి కూడా అనుభవాన్ని దృశ్యమానం చేస్తారు. కొన్ని కథల్లో ఒక సామాజిక వర్గం వారి ఆర్థిక పరిస్థితుల పట్ల కాస్తంత పక్షపాత వైఖరీ, సానుభూతి కనబరిచినా పాఠకుడు అందులోని మానవీయ దృక్కోణాన్ని దర్శించగలుగుతాడు. మనసుకి అర్ద్రత కలిగించడమే కాకుండా పాఠకుణ్ణి నేలమీదనే నడిపించి మానవత్వానికి అద్దంపడతాయి. మానవీయవిలువల పట్ల రచయితకు గల గాఢ అనురక్తి చాలా కథల్లో ప్రస్ఫుటమౌతుంది. ఉద్యమ ధోరణికి లోను కాకుండా సమాజంలో జరిగే అన్యాయాలపట్ల సానుభూతితో సామరస్య పూర్వకంగా పరిష్కారం దిశగా ఆశావాదిలా ప్రతిస్పందిస్తాడు రచయిత. భార్య భర్తలిద్దరూ సాహిత్యరంగంలో వున్నప్పుడు ఒకరిపేరు ఎక్కువగా ప్రస్పుటమై రెండవవారు ఛాయామాత్రంగా గుర్తింపు పొందుతారు. ఈ ఛాయగా మిగలటం ఎక్కువగా భార్యల వంతు ఔతుంది కానీ ఆదూరి దంపతుల్లో సత్యవతీదేవిగారి కవయిత్రిగా వినబడినంతగా సీతారామ్మూర్తి గారి పేరు వినబడలేదేమో. సత్యవతిదేవి భౌతికంగా దూరమయ్యాక ఆమె రచనల్నీ, ఆమె సాహిత్యంపై ప్రముఖుల ప్రశంస పూర్వక వ్యాసాల్ని ఏరి కూర్చుతూ ప్రచురించి ఆదూరి సత్యవతీదేవి పేరుని సాహిత్య రంగంలో శాశ్వతత్వం కలిగించే ప్రయత్నం నిరంతరం చేస్తున్న గొప్ప ప్రేమికుడిగా రామ్మూర్తిగారు కనిపించుతారు. కానీ తన రచనల్నీ, తన ప్రతిభని చాటుకునే ప్రయత్నం చేయలేదు. బహుశ అందువల్లే అనేక కథాసంపుటాలు, నవలలూ ఇంత కాలంగా రాసి ప్రచురిస్తున్న ఆదూరి సీతారామ్మూర్తి గారి పేరుని సాహిత్యలోకం అంతగా పట్టించుకోలేదేమో. (లీడర్ ,ఆదివారం 7-4-2019) శీలా సుభద్రాదేవి,

నడక దారిలో -63

నడక దారిలో -63 ఈమధ్య.సుమారు పదేళ్ళుగా వీర్రాజుగరు ముఖచిత్రాలు వేయటం మానేసారు.మా పుస్తకాలకు పిల్లలే డిజైన్ చేస్తుంది.కానీ సుశీలమ్మ గారి కిన్నెరసాని ఎమ్ ఫిల్, పరిశోధన గ్రంధానికి,'కవిత్వ పరామర్శ' విమర్శ గ్రంథానికి ఇబ్బంది పడుతూనే ముఖచిత్రం వీర్రాజు గారు వేసారు.అవే ఆయన వేసిన చివరి ముఖచిత్రాలు. డిసెంబర్ 31, 2019 ప్రపంచమంతా ‘‘న్యూ ఇయర్’’ వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రజలంతా కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నారు. వూహాన్ నగరం కరోనాకు కేంద్రంగా చైనాలోని ఆరోగ్య నిపుణులు కొత్తగా నమోదైన కేసును మొదటగా ‘‘న్యూమోనియా’’గా భావించి కరోనాగా నిర్ణయించారు. అయితే అప్పుడప్పుడే ఒక వైరస్ గురించి టీవీలో కథనాలూ,చర్చలూ మొదలయ్యాయి. ప్రపంచ ప్రజల నరాల్లోకి భయం మెల్లిమెల్లిగా ఒక పురుగులా ప్రవేశించింది. 2020 జనవరి 30 న వుహాన్ నుండి తిరిగి వచ్చిన కేరళ విద్యార్థికి మొదటి పాజిటివ్ కేసు నమోదయింది అని టీవీ గగ్గోలు పెట్టింది. అప్పుడప్పుడు రిటైర్డ్ టీచర్లు అందరికీ మా పాత హెడ్ మిస్ట్రెస్ శిరోమణీ థామస్ గారు వారింట్లో విందులో సహా సమావేశం ఏర్పాటు చేసారు.అక్కడ అందరం కలిసి సందడి చేసాము.ఆ సందర్భంలో వైరస్ గురించి కూడా మాట్లాడుకున్నాము.అంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జాగ్రత్తలు చెప్పుకొని సాయంత్రానికి ఇంటికి చేరాము. మార్చిలో లేఖిని వార్షికోత్సవ మాతృ దినోత్సవ పురస్కారాల సమావేశానికి వెళ్ళాను. కర్పూరం రుమాలు లో చుట్టి వాసన చూస్తుంటే వైరస్ తాకదు అని కూడా ఒకరికొకరు చెప్పుకున్నారు. వైరస్ మన వరకూ రాదులే అనే ధీమాతో మార్చిలో కూడా అత్తలూరి విజయలక్ష్మి రాసి ప్రదర్శింపజేసిన నాటకానికి వెళ్ళి వచ్చాను. ఇంతలోనే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక నిర్ణయాలు తీసుకుంది.మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని బయటకు రావద్దని ప్రకటించారు.ఆ ఒక్కరోజు ఇంట్లో వున్నంత మాత్రాన నన్నెవరూ కట్టడి చేయలేరులే అంటూ వైరస్ విజృంభించటం మొదలెట్టింది. ఆ తర్వాత ప్రధాన మంత్రి మార్చి 24 నుంచి దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు.సామాన్య ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అన్ని థియేటర్లు, విద్యాలయాలు,మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, మూసేయాలనీ విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం కావాలని, సామాజికంగా ఒకరికొకరు దూరంగా ఉండడమే కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నివారణకు మంచి మార్గమని నిబంధనలను ఫోన్లలో , ఛానెల్స్ లో వినిపించటం మొదలైంది. కరోనావైరస్ వ్యాధి (COVID-19) కొత్త వైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి . దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఫ్లూ వంటిదే కానీ తీవ్రమైన సందర్భాల్లో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. దీని నివారణకు చేతులను తరచూ కడుక్కోవడం,ముఖాన్ని తాకకుండా ఉండడం ,అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం ద్వారా మాత్రమే మనల్ని రక్షించుకోవచ్చునని అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలతో ఊదరగొట్టటం ప్రారంభించారు . నేను కాటరాక్ట్ చేసుకోవాలనుకున్నది వాయిదా పడింది.పనమ్మాయి లక్ష్మిని లాక్ డౌన్ వున్నంతకాలం రావద్దని చెప్పి ఫస్ట్ రోజున గేటు దగ్గరకి వస్తే జీతం ఇస్తానని చెప్పాను.ఇంట్లో పనులన్నీ మేమే చేసుకోవటంతో బిజీ అయ్యాము. ‌. ఆషీకి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. మళ్ళీ ఏప్రిల్ 14 న దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 3 వరకు పొడిగించారు కానీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు చేసింది. మధ్యలో ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆపేసి దీపాలు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ చీకటి కాలంలో 130 మంది కోట్ల భారతీయుల మహా సంకల్పాన్ని చాటాలని, ఆ చీకటి వైరస్‌కు వెలుగు శక్తిని పరిచయం చేయాలని ఆయన పేర్కొన్నారు. మరోరోజు గంటలు,కంచాలు వాయించితే కరోనాని తరిమి కొట్టొచ్చని అంటే ఆ పని కూడా వందకోట్లకీ పైగా జనం ఆచరించి తమ దేశభక్తి చాటుకున్నారు.అయితే మంత్రాలకు చింతకాయలు రాలవు కదా కనిపించని ఆ శత్రువు ప్రజలమీద దాడి చేస్తూనే వున్నాడు. అయితే ఆ సమయంలో జాతీయ దూరదర్శన్ 1990లలో' సంచలనం కలిగించిన మహాభారతం ,చాణక్య ధారావాహికాలు తిరిగి ప్రసారం చేసింది.అవి అప్పట్లో యథాలాపంగా చూసామేమో కానీ ఇప్పుడు చూస్తుంటే ఎన్నో విషయాలు ఆసక్తిగా అనిపించింది.మాకు ఇష్టమైన చారిత్రక పరిశోధనగా చాణక్యను గమనించాము.అందులో పాత్రల ఆహార్యం అబ్బుర పరిచింది.అవి అజంతా శిల్పాలు,బౌద్ధ కథలలో పాత్రల వస్త్ర,శిరోజాల అలంకరణలకు దగ్గరగా వుంది.చాణక్య పాత్రధారి చంద్రద్వివేది మౌర్య సామ్రాజ్య స్థాపనకు చెందిన అనేక పుస్తకాలు చదివి పరిశోధన చేసి వాటి ఆధారంగా తానే దర్శకత్వం వహించాడు.అందరు పాత్రధారులూ అద్భుతంగా నటించారు.ఆ నాటి రాజ్యం,నగరం,ఇళ్ళూ ఎలా వుండేదో ,ఆనాటి పంటలు, వుపయోగించిన పాత్రలు మొదలైనవన్నీ చాలా సహజంగా తీర్చి తీయటం తప్పక చూడవలసిన ధారావాహికగా అనిపించింది.విద్యార్థులూ,వాళ్ళ రూపం ఆరెస్సెస్ పక్షాన వున్న సీరియల్ అనిపిస్తే అనిపించవచ్చు కానీ ఎక్కడా మతప్రసక్తి ఉండదు.రాజనీతికి చెందిన సీరియల్.అప్పుడప్పడే బౌద్దమతం మన దేశంలోకి వస్తున్న విధం ఇందులో తెలుస్తుంది. ఇంకా మహా భారత్ కూడా పౌరాణిక గ్రంథంగా కాకుండా ఒక రాజనీతిశాస్త్ర గ్రంథమే అనేలా ఆలోచింపజేసే బలమైన సంభాషణలతో ఆసక్తి దాయకంగా ఉండటంతో ఇంట్లో అందరం కూర్చుని రోజూ చూసాము. కరోనా భయంతో బిల్డింగ్ అంతా ఎవరికి వారు ఇళ్లలోనే బందీలయ్యారు.అందులోను కొన్ని ఇళ్ళల్లో కరోనా బాధితులు కూడా ఉండటం కూడా ఒక కారణం. బిల్డింగ్ లోనే సూపర్ బజార్ వుండటంతో వెచ్చాలకు కూడా ఇబ్బంది పడలేదు.సూపర్ బజార్ వాళ్ళే కూరలూ,పళ్ళూ తీసుకు రావటంతో వాటిని కడిగి ఆరబెట్టి తుడిచి ఫ్రిజ్ లో సర్దడం వీటితో రోజంతా పని లాగే వుండేది. "అందరి ఇల్లు " డా.వింజమూరి సూర్యప్రకాష్ గారు డెబ్భై రోజుల పాటూ ప్రతీరోజూ సాయంత్రం గంటసేపు ప్రేమా, నిజాయితీ పేరుతో జూమ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. రచయితలతో ,ఆర్థికవేత్తలతో, హోమియో,ఆయుర్వేద,అల్లోపతి డాక్టర్లతో,సంగీతజ్ణులతో ఒక్కొక్క రోజు ప్రసంగాలు చే గుండెయించారు.అవి చాలా ఆసక్తికరంగా సాగాయి.ఒకరోజు వీర్రాజుగారు కూడా మాట్లాడారు. తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాలు సరిహద్దులను మూసివేసి రవాణాను నిలిపివేసాయి.. ‘‘కోవిడ్-19’’. మానవ చరిత్రలో ఆధునిక కాలంలో మనిషి ఎప్పుడూ చూడని భయోత్పాతాన్ని సృష్టించింది. ప్రజలందర్ని కేవలం ఇళ్లకే పరిమితం చేసింది. ‘‘లాక్‌డౌన్’’తో జనజీవితం అస్తవ్యస్తమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.కడుపు చేత పట్టుకొని ఉపాధికోసం దేశంలో వివిధ ప్రాంతాలకు వలస పోయిన శ్రామికులు తమకు పనులు ఆగిపోవడంతో తట్టాబుట్టా కట్టుకొని కుటుంబాలతో సహా చనిపోతే తమ వూర్లోనే అందరి మధ్యా పోదామనే ఆలోచనతో నడక దారిలో రోడ్లమీదకు బయలుదేరారు.ఒక తీరని విషాదం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. వీర్రాజుగారు సబ్ కాన్షస్ లో కరోనా గురించి భయం,బెంగపెట్టుకున్నారనుకుంటాను.బహుశా అందువల్లనే అనుకుంటాను యూరిన్ మాటిమాటికీ రావటంతో ఇబ్బంది పడ్డారు.మేము రెగ్యులర్ లా వెళ్ళే హోమియో డాక్టర్ని ఫోన్ లో సంప్రదించగా ఆయన కారులో మా ఇంటివైపు వచ్చి గేటు దగ్గర మందులు అందజేసారు.ఒక రెండు మూడు డోసులు పడగానే వీర్రాజుగారికి యూరిన్ కంట్రోల్ లోకి వచ్చింది.దాంతో వూపిరి పీల్చుకున్నాము మొదటే బాగా తక్కువ మాట్లాడతారేమో మరింత మౌనమునిలా అయిపోయారు.టీవీలో చాణక్య,మహాభారత్ చూస్తున్నపుడు తప్ప మిగతా సమయంలో తన రూములో ఆలోచనా నిమగ్నులై వుండిపోయేవారు.మామూలుగా వుంచటానికి చాలా ప్రయత్నం చేయాల్సివచ్చేది.బొమ్మలన్నా వేయండి,పుస్తకాలన్నా చదవండి అని అనటంతో శ్రీపాద,మల్లాది,కొకు మొదలైన వారి పుస్తకాలు చదవటం మొదలు పెట్టారు. అప్పుడప్పుడు ఫోన్లలోనే మిత్రులతో సంభాషణలు.అవికూడా తిరిగి తిరిగి కరోనా కబుర్లతోనే ముగిసేవి.ప్రజాసాహితి మిత్రులు రామకృష్ణగానీ,లక్ష్మి గానీ పదిరోజులకు ఒకసారైనా మా క్షేమసమాచారాలు కనుక్కునే వారు. పత్రికలన్నీ ఆగిపోయాయి.వార్తాపత్రిక మాత్రం వచ్చేది.టీవీ ప్రసారం చేస్తోన్న దృశ్యాలు చూడాలంటే కనిపించని శత్రువు ప్రపంచంపై చేస్తున్న దాడి,కుప్పకూలుతున్న జనాలు మరింత భయకంపితుల్ని చేస్తున్నాయి. ఇక పుస్తకాలు చదవటం మాత్రమే భయంకర ఆలోచనల్ని మళ్ళించేదిగా మారింది. కరోనా బారిన పడి ప్రాణాలు విడచిన వాళ్ళు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నృత్య దర్శకుడు శివశంకర్ వంటి సినీప్రముఖులు, శోభానాయుడు లాంటి ప్రముఖ నర్తకీ,ప్రణబ్ ముఖర్జీ, కన్యాకుమారి ప్రాంత ఎంపీ, హరిబాబు,నాయకులూ ఇలా..ఇలా..ఎందరో ఎన్నో రంగాల వాళ్ళు మాయమైపోయారు.డబ్బూ,పదవులూ,అధికారాలలూ అన్నీ వున్నా సెలబ్రిటీలే కరోనా కాటు నుండి తప్పించుకోలేక పోతున్నారంటే ఇక సామాన్య ప్రజలు పిట్టల్లా రాలిపోతూనే వున్నారు. బాలా సుబ్రహ్మణ్యానికి అధికార లాంఛనాలతో సగౌరవంగా తమిళనాడు అంత్యక్రియలు ప్రభుత్వం నిర్వహించారు. జీవితమంతా నాట్యానికి అంకితం చేసిన శోభానాయుడుకి ఎవరూ పట్టించుకోలేదు.ప్రభుత్వం కాదు కదా కనీసం సామాజిక మాధ్యమాల్లో కూడా ఏమంతగా ఆమెకీ నివాళులు ఎవరూ చెప్పక పోవటం చాలా బాధకలిగించింది.స్వార్థ రాజకీయాలే తప్ప కళాభిరుచి లేదు.బహుశా ఇతరేతర వివక్షలూ కారణం కావచ్చు.ఏమైతేనేం తెలుగువారు నాట్యంలో ఎన్నో ప్రయోగాలు చేసిన గొప్ప నాట్య కళాకారిణిని కోల్పోయారు. కరోనా నుండి ఆలోచనలు మళ్ళించడానికి కవితల పోటీ నిర్వహిస్తున్నాననీ ఫోన్ చేసీ ఆ కవితల పోటీకి న్యాయనిర్ణేతగా వుండమని కోరారు.కవితలకు కవయిత్రి పేరు తొలగించి నాకు పంపించారు.బాగానే చాలా మంది కవితల పోటీలో పాల్గొన్నారు. నాకు అది సరదాగా అనిపించింది . ఆ కవితల్ని చదివి ఫలితాలు పంపించాను. వరంగల్ నుండి అనిశెట్టి రజిత ఫోన్ చేసి కరోనా సందర్భంలో కథలసంకలనం చేస్తున్నానని , నన్ను ఒక కథరాసి పంపమని అడిగింది.సరేనని ఆలోచించి రాస్తానన్నాను. రాయాలని అనుకోగానే కవిత గానీ,కథగానీ రాయలేను.ఫేస్బుక్ లోనూ వాట్సాప్సమూహాలలోనూ పుంఖానుపుంఖాలుగా కవితలు వెల్లువెత్తుతున్నాయి.అయినా నా ఒక్క అక్షరం మెదలలేదు.దానికి తోడూ వ్యాసాలు కోసం రచయిత్రుల కథలు చదువుతున్నానేమో అసలే కథలూ,కవితలూ రాసే మూడ్ కలగలేదు. కరోనా కాలంలో భార్యా,భర్తా,భర్త తమ్ముడూ,ఒక పని అమ్మాయి కరోనా రేపిన ఆలోచనల్ని" నాలుగు గోడల మధ్య నలుగురు "అనే కథ రాసి పంపించాను.అదేకాకుండా నాలుగైదు కవితలీ కూడా రాసాను. మా బిల్డింగ్ లో ఒక ఆమె కూతురు డెలివరీ కోసం వచ్చి తిరిగి వాళ్ళూరు వెళ్ళటానికి ప్రయాణానికి కరోనా నాకాబంది వలన ఇక్కడే వుండిపోయింది.తీరా ఆమెకు వైరస్ వలన సీరియస్ అయ్యి హాస్పిటల్ పాలై చనిపోయింది.ఆమె కొడుకులు విదేశాల్లో వుంటారని.ఎలాగో ఒక కొడుకు వచ్చి కర్మకాండలు చేయగలిగాడు.ఈ సంఘటన కొంత మనసును కలవరపెట్టింది. ఇదొక్కటే కాదు. వ్యాధితో పోయిన వారి భౌతికకాయాల్ని హాస్పిటల్ వారే అంత్యక్రియలు జరిపారు. ఈ విధంగా అనేక కుటుంబాలు పిల్లలు పోతే తల్లిదండ్రులూ, తల్లిదండ్రులు పోతే పిల్లలూ రాలేకపోవటం,ఆఖరుకు భార్యాభర్తలు కూడా చూసుకోలేక పోవటం.కలలో కూడా వూహించని మహమ్మారి చుట్టుముట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది . మెల్లిమెల్లిగా ఆ వుధృతం తగ్గింది.కానీ పూర్తిగా సామాన్య స్థితిలోకి రాలేదు. ఆ సమయంలో శిఖామణిగారు ఈ ఏడాది శిఖామణి పురస్కారం వీర్రాజు గారికి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు . అయితే కోవిడ్ నిబంధనల వలన మా ఇంటికే శిఖామణి గారు. వచ్చి జూమ్ సమావేశం ద్వారా బహుమతి ఇస్తానన్నారు.కె.శివారెడ్డి గారిని మా ఇంటికి తీసుకు వచ్చి వీర్రాజుగారికి ఘనంగా శిఖామణి అవార్డు ప్రదానం చేసారు.ఇంతవరకూ శిఖామణి గారి పురస్కారం వరుసగా సీనియర్లుకే ఇస్తూ వస్తున్నారు.అనేక మంది జూమ్ సమావేశంలో వీర్రాజు గారి సాహిత్యం,చిత్రలేఖనం గూర్చి మాట్లాడారు.వీర్రాజుగారు కూడా సంతోషించారు. కోవాక్జిన్,కోవీషీల్డ్ అనే టీకా మందు దీనికి పరిష్కారంగా ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇది నాలుగు వారాలకు ఒకటిచొప్పున మూడు డోసులు వేసుకోవాలట.మార్చిలో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది.మా బిల్డింగ్ లోనే హెల్త్ వర్కర్ ఉండటంతో ఇంటికే వచ్చి నలుగురికీ వేసారు. క్రమక్రమంగా జనం వీధుల్లోకీ,విధుల్లోకీ వెళ్ళటానికి నిబంధనల మేరకు అలవాటు పడుతున్నారు. పబ్లిక్ పరీక్షలు కూడా కోవిడ్ నిబంధనల తోనే జరపటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంక్రాంతికి బొమ్మలకొలువు కాస్త సింపుల్ గానేపెట్టి తక్కువ మందికి మాత్రమే చెప్పాలని అనుకుని అదేవిధంగా చేసాము. - శీలా సుభద్రాదేవి

నడక దారిలో -62

నడక దారిలో -62 "మనం రాసిన ఏ రచనైనా పుస్తకం రూపంలో వుండాలి.లేకపోతే అవి కాలగర్భంలో కలిసిపోతాయి." అనేది వీర్రాజుగారి నినాదం.అందుకే తనను కలిసిన వారిని పుస్తకాలు వేసుకోమని ప్రోత్సహిస్తూ వుంటారు. అందుకేనేమో వీర్రాజుగారు వరుసగా తన పుస్తకాలు ప్రచురించుకోవాలనే ఆలోచన మొదలు పెట్టారు.తాను రాసిన నాలుగు నవలలూ కలిపి నవలా కదంబం పేరుతో మూడువందల కాపీలు వేయించారు.అప్పట్లోనే ఎమెస్కో వాళ్ళు మైనా వేస్తామని పెర్మిషన్ అడిగారు. చిన్నన్నయ్య రాసిన వాటిలో 250 పేజీలకు వచ్చేలా కథల్ని ఎంపిక చేసి పంపమని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు మమ్మల్ని కోరారు. "కొడవంటి కాశీపతిరావు కథలు" పేరును వేస్తామన్నారు.ముందుమాట ఎవరి చేత రాయించాలని అడుగుతే అన్నయ్య శిష్యుడే అయిన జగన్నాథశర్మ చేత రాయించమని చెప్పాము.ఆ విధంగా అన్నయ్య కథలు రావటం మాకు చాలా సంతోషం కలిగింది. అంతకుముందు శీలా వీర్రాజు కవిత్వం పేరిట సమగ్ర సంపుటి వేసుకున్నారు.అయినా మళ్ళా "శీలావీ ప్రయోగకవితలు" పేరున వచన కథాసంపుటాలు హృదయం దొరికింది,కొడిగట్టిన సూర్యుడు, మళ్ళీ వెలుగు కావ్యం,పడుగుపేకలమధ్య జీవితం,వచన కవిత్వం లో నవల బతుకు బాట ఇవన్నీ కలిపి బృహత్ సంపుటిగా వేసారు ఒక వంద వేయండి అంటే వినకుండా మూడు వందలు వేసారు.నా మాదిరిగా వచనకవిత్వంలో కథా,నవల, కావ్యం ,ఆత్మకథ ఇన్ని ప్రయోగాలు చేసినవారు లేరు.అందువలన ప్రయోగ కవితలన్నీ సంపుటిగా వేయటం వలన అందరికీ తెలుస్తుంది అంటూ వాదించారు. వీర్రాజుగారికథల ఆంగ్లానువాదం ప్రచురిస్తే నేనే మార్కెటింగ్ చేస్తాను అని ఒకాయన వచ్చాడు.ఆయన మాటలు నమ్మి "Trio" పేరిట ఐదొందల కాపీలు ప్రచురించారు."మన దగ్గర వంద వుంచుకుందాం.అనువాదకునికి వంద ఇద్దాం.మూడువందలు మార్కెట్ చేస్తానన్న అతనికి ఇచ్చేద్దాం"అని అన్నారు వీర్రాజు గారు.మరి ఇంకా ఏం మాట్లాడలేదు కానీ భయపడుతూనే వున్నాను. అనువాదం చేసిన ఆయన వచ్చి ఒక పుస్తకం మాత్రమే తీసుకొని వెళ్ళారు.మార్కటింగ్ చేస్తానన్న వ్యక్తి ఫోన్ చేసినా దొరకలేదు.తర్వాత ఫోనుకు దొరికినా ఏవో కథలు చెప్పి అయిపు లేకుండా కనిపించలేదు.దాంతో ఇంటినిండా పుస్తకాలే అయ్యాయి. అయిదారు అల్మారాలే కాక వార్డ్రోబ్ లలో సైతం పుస్తకాలే చేర్చారు.మా బెడ్ రూంలో స్టూలు మీద పుస్తకాల కట్టలు పేర్చి ఒక పెద్ద టేబుల్ లా అమర్చి దానిమీద ఒక టేబుల్ క్లాత్ కప్పారు. పుస్తకాలంటే విపరీతమైన ప్రేమ కలిగినదాన్నే అయిన నేనే చాలా విసిగి పోయి ఆయన మీద కోపగించాను."ఇలా అందర్నీ నమ్మేస్తే ఎలా?ఈ పుస్తకాలన్నీ ఏంచేస్తాం? తెలుగు అయినా అయితే ఎవరన్నా తీసుకుంటారు"అని చికాకు పడ్డాను. నావి కూడా అప్పటికే ప్రచురించాల్సిన రచయిత్రుల కథలపై రాసిన వ్యాససంపుటి వుంది,ఒక నవల వుంది.కథలూ,కవితలూ వున్నాయి.వీర్రాజు గారేమో పుస్తకాలు వేసినవే మళ్ళీమళ్ళీ ప్రచురించుకుంటున్నారు.ఇంక నావన్నీ పెండింగ్ లో పెట్టేసుకున్నాను.ఇప్పుడు వేసిన పుస్తకాలు కొన్నైనా బయటకు వెళ్ళే వరకూ నేను నా పుస్తకాలు వేయననీ వేసినా వందో నూట ఏభయ్యో మాత్రమే వేయాలని పుస్తకాలు ప్రచురించారు కోన్ని గట్టి నిర్ణయం చేసుకున్నాను. నవోదయా వంటి పుస్తకాల షాపుల వాళ్ళు పది కన్నా ఎక్కువ పుస్తకాలు తీసుకోవటం లేదు.ఈ పుస్తకాలన్నీ ఎలా బయటకు వెళ్తాయో అర్థం కాలేదు.విజయవాడలో ఎమెస్కో లక్ష్మి గారికి ఫోన్ చేస్తే నవలా కదంబం యాభై పుస్తకాలు పంపమన్నారు.వాటితో పాటూ నా ఇస్కూలు కతలు కూడా ఒక ముప్పై పంపమంటే పంపించాము.అవి మాత్రమే అమ్మకం అయినట్లు.అనుకోకుండా ఆదూరి సీతారామ్మూర్తి గారు అన్ని విశ్వవిద్యాలయాలకు తన పుస్తకాలు పంపించాను అని చెప్పారు.ఆయన దగ్గర అడ్రస్సులు తీసుకున్నాను.అంతేకాక మరి కొన్ని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖాద్యక్షుల ఫోన్ నెంబర్లను తెలుసుకుని వాళ్ళకు గ్రంధాలయాలకు మా పుస్తకాలు వితరణ చేయాలనే అభిప్రాయం చెప్పాను.వాళ్ళంతా సానుకూలంగా స్పందించారు. అన్నింటికీ మా ఖర్చుతో మా పుస్తకాలు పార్సిల్ చేసి పంపించాను.అయితే అందుకున్న ఒక్కరూ కూడా అక్నాలడ్జ్ మెంట్ అయినా ఇవ్వలేదు.అదీ మన విశ్వవిద్యాలయాలకు తెలుగు భాషమీద గల శ్రద్ధ. వీర్రాజుగారికి కేటరాక్ట్ అయిన తర్వాత నేత్రాలయలోనే నేను కూడా చేయించుకుందామనుకున్నాను. కానీ కొన్ని అర్జెంటుగా రాయాల్సిన వ్యాసాలు పూర్తిచేయాలని ఆగాను. "ఈ లోపున 2018,2019సంవత్సరాలకు 49,50 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు ఇచ్చేస్తే యాభై అయిపోతాయి. ఈ ఏడాది చేసేద్దాము"అని కుందుర్తి శాంత ఫోన్ చేసింది. ఇన్నాళ్ళూ కేటరాక్ట్ వల్ల వీర్రాజు గారు వాయిదా వేసారు."ఈ రెండు సంవత్సరాలకూ న్యాయనిర్ణేతలకుపంపి ఫలితాలు వచ్చేవరకూ అంటే ఆలస్యం అవుతుంది .అందుకని మనమే నిర్ణయించేద్దాం. కవిత్వం పుస్తకాలన్నీ సేకరించి చదవటం మొదలుపెట్టాము.కొన్ని పుస్తకాలు నవోదయలో కొని తీసుకు వచ్చాము.18 సంవత్సరానికి సిరికి స్వామినాయుడికీ,19సంవత్సరానికి ఇబ్రహిమ్ నిర్గుణ్ కీ నిర్ణయించి ఫోన్ చేసి చెప్పారు.వాళ్ళను అంగీకారం తెలియజేస్తూ ఉత్తరాలు పంపమని చెప్పారు. ఈ ఏడాది మాకు బాగా సన్నిహితులైన వారిని కోల్పోవటం ముఖ్యంగా వీర్రాజు గారిని కృంగదీసింది అనే చెప్పాలి.ఎందుకంటే ఆయన కూడా ఎనభైలలోకి వచ్చేసారు. మే 25 న అబ్బూరి ఛాయాదేవిగారు మరణించారని తెలిసింది.అయితే ఆమె కొండాపూర్ లో సి.ఆర్.ఫౌండేషన్ కి చెందిన వృద్ధాశ్రమంలో వుంటారు.అంతకు ముందు అయిదారు సార్లు ఆమెని కలవటానికి వెళ్ళాము.అయితే ఇప్పుడు హాస్పిటల్ లో వున్నారా ,వృద్ధాశ్రమంలో వున్నారో సరిఅయిన సమాచారం తెలియలేదు.అంతదూరం వెళ్ళటానికి వీర్రాజుగారు తయారుగా లేరు.దాంతో ఆగి పోయాము.ఆ తర్వాత తెలిసింది.ఆమె ముందు రోజు కొత్తపేటలోని డా.సూర్యప్రకాష్ గారు నిర్వహిస్తున్న అందరి ఇల్లు లోనే వున్నారనీ,అక్కడే ఆ తెల్లవారు జామున కన్నుమూశారనీ, తర్వాత ఆశ్రమానికి తీసుకువెళ్ళి తదనంతరం ఛాయాదేవిగారి కోరిక ప్రకారం మెడికల్ కాలేజీ కే ఆమె దేహాన్ని ఇచ్చారని తెలిసింది.అందరియిల్లు మా ఇంటికి దగ్గరలోనే వుంది.అంతేకాక డా.సూర్యప్రకాష్ గారు దంపతులు మా కుటుంబానికి దగ్గర వారు.వారు నిర్వహించే కార్యక్రమాల్లో మేమూ పాల్గొంటూ వుంటాము.ఇంత దగ్గరలో వున్నారంటే ఆమెని కలిసి మాట్లాడేవారముకదా అని విచారించాము. ఆ తర్వాత భూమిక సత్యవతి ఏర్పాటు చేసిన సంతాపసభకి వెళ్ళడమే కాకుండా అబ్బూరి ఛాయాదేవి ప్రత్యేక భూమిక సంచికలో ఛాయాదేవిగారితో నా సాన్నిహిత్యం రాసాను. సరిగ్గా మరో రెండు నెలలకే నా ఆత్మీయ స్నేహితురాలు జానకీబాల సహచరుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు మరణించారని తెలియగానే వీర్రాజుగారితో కలిసి వెళ్ళాను.జీవనసాహచర్యమే కాకుండా సాహిత్యసాహచర్యం వున్నప్పుడు ఒక్కసారిగా వంటరితనం చుట్టుముట్టటం సహజమే.కానీ జానకీ బాల మరింతగా కృంగిపోయి మామూలు కాలేక పోయింది.దానికి తోడూ ఆరోగ్యరీత్యా కూడా తేరుకోలేకపోయింది.తరుచూ స్నేహితులతో సాహిత్యంలో గడుపుతే బాగుంటుంది అనే ఆలోచనతో మరో నెలరోజులకు డి.సుజాతాదేవితో కలిసి మళ్ళా జానకీ బాలను కలిసాను. నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర్నుంచి కేబీలక్ష్మి యువభారతి వలన పరిచయమే కాకుండా కుటుంబ మిత్రురాలు.కొందరు రచయిత్రుల తో కలిసి అనంతపద్మనాభస్వామి ఆలయానికి ఏదో ప్రత్యేక దర్శనాలకని వెళ్ళి తిరుగు ప్రయాణంలో మాసివ్ హార్ట్ ఎటాక్ తో మరణించటం మిత్రబృందాలకు తట్టుకోలేని షాక్.చక్కగా గంజి పెట్టిన చీరని చెక్కుచెదరకుండా బొమ్మలా కట్టుకొని,దానికి సరిపడా మేచింగ్ గాజులు గొలుసులను ధరించి,పొడువాటి జడలో అంతే పొడవైన పూలమాల పెట్టుకొని ముఖం నిండా నవ్వుతో అందరితో కలిసిపోయి జోవియల్ గా మాట్లాడుతూ అందర్నీ కలుపుకుంటూ పోయే తత్వం కేబీ లక్ష్మి ది.అందుకనే స్నేహితులు ఎక్కువే.ఇప్పుడు ఆమె అలాంటి పరిస్థితిలో చనిపోవటం చాలామందికి షాక్ గా అయింది.అలా షాక్ కు గురైన వారిలో లక్ష్మికి యువభారతిలో వున్నప్పటి నుండీ అంటే సుమారు యాభై ఏళ్ళ నాటి సన్నిహితులూ,లక్ష్మి స్నేహ బృందంలోని వారందరూ చాలా వరకూ అరవై డెబ్భైలవాళ్ళే కావటం మరణ భయం వెంటాడింది. వారిలో సుధామగారు బాగా డిస్టర్బ్ అయ్యారు.వాళ్ళ అబ్బాయి కోకాపేటలో వుంటాడు.ఏ రాత్రో అనారోగ్యం కలిగితే అక్కడినుంచి రావడానికే రెండు గంటలు పడుతుంది.అనే తలంపుతోనే సుధామగారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది.దాంతో అబ్బాయి ఇంటి దగ్గరే కోకాపేటలో ఇల్లు కొనుక్కుని మలకపేటనుండి మారిపోవాలనుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి HCU లో మళ్ళా అప్లై చేయాలనుకుంది ఆషీ.అంతకు ముందు ఒక ఇంజినీర్ కాలేజీ సీట్ రిజర్వ్ కోసం ముందుగానే కొంత డబ్బు కట్టమని అన్నారు.కట్టటానికి వెనకా ముందై ఆగిపోయాము.ఆషీ ఇంజనీరింగ్ కాలేజీ పట్ల ఆసక్తి కనబరచలేదు. అంతలో సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కళాశాల వారి ప్రవేశాల గురించి తెలిసింది.శైలజామిత్ర కూతురు అక్కడే చదివించాలని చెప్పిన గుర్తు.ఆమెకి ఫోన్ చేస్తే చాలా మంచి కాలేజీ అనీ,అవసరమైన ఆన్లైన్ కొర్సులు కూడా చదువుతో బాటూ సమాంతరంగా చేయిస్తారనీ చెప్పింది. ఆ కాలేజీకి మంచి పేరుందని తెలిసి కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ గురించి వివరాలు తెలుసుకోవటానికి పల్లవీ,ఆషీ వెళ్ళారు.విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ ఓయూ కేంపస్,తార్నాక లో వున్న ఫారెన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRO) ద్వారానే చేర్చుకుంటామని,అక్కడ రిజిష్టర్ చేసుకొని,అక్కడే ఫీజ్ కట్టి రసీదు తీసుకు వచ్చి సబ్మిట్ చేయమని చెప్పారు.మాకు చాలా ఆశ్చర్యం కలిగింది.రేంకు వచ్చిన వారికి తక్కువఖర్చులోనే అవుతుండవచ్చు.కానీ తామరతంపరగా పెరిగి పోతోన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో డబ్బున్న వారు సరే మాకు తెలిసిన ఉన్నత మధ్యతరగతికి చెందిన వారు కూడా ఇంత ఖర్చు పెట్టి చదువుతున్నారా అని అనుకున్నాము. పల్లవీ,ఆషీ వెళ్ళి FRO కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని వచ్చారు.పాస్పోర్టు,OCI కార్డు అన్నీ సబ్మిట్ చేస్తే అమెరికన్ ఎంబసీకి పంపితే యూఎస్ లోని బర్త్ ప్లేస్ కి వాటిని ఫార్వర్డ్ చేసి నిజంగా అక్కడే పుట్టిందా లేదా అని ఎంక్వైరీ చేస్తారుట.జతపరచిన సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా వున్నాయని యూ.ఎస్ నుండి నిర్థారణ వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడి FRO అడ్మిషన్ కి అంగీకారం తెలియజేస్తారట.ఈ ప్రక్రియకు అంతటికీ ఒక నెల పట్టింది. అప్పటికే కాలేజిలో సిలబస్ మొదలైపోయింది.అయితే ఏం? ఒక సక్రమపద్ధతిలో కాలేజీలో చేరింది కదా.మేము మిగతా పిల్లలకట్టే ఫీజులకు రెట్టింపు విదేశీ విద్యార్థులు కట్టాలని తెలిసింది.విదేశీ విద్యార్థులు ప్రవేశపరీక్షలు రాయనక్కరలేదట.కేవలం FRO లో రిజిస్టర్ చేసుకొని OU పరిధిలోని ఏ డిగ్రీ/ ఇంజనీరింగ్ కాలేజీలోనైనా చేరవచ్చట.మాకు ఇవేవీ ఇంతకాలం తెలియలేదు.అనవసరంగా కష్టపడి అన్ని ప్రవేశపరీక్షలు రాసింది. ఇలా అని తెలిసి ఉంటే హాయిగా ఇంజనీరింగ్ లోనే చేరేది కదా అనుకున్నాము.అయినా సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఆడపిల్లల కాలేజీ కనుక గొడవలు కూడా వుండవు.అనుకున్నాము. ఇప్పుడు అవసరం కనుక ఆషీకోసం ఒక లాప్టాప్ కూడా కొనవలసి వచ్చింది . దాంతో కమిటీ అంతా కలవటం కుదరక మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారం ఎంపిక కాస్త ఆలస్యం అయ్యింది.ఈసారి మానేసి వచ్చే ఏడాది ఇద్దరికి ఒకేసారి వచ్చేద్దాం కమిటి నిర్ణయం తీసుకుంది. మరో వైపు మాడభూషి కథా పురస్కారం కొరకు కథలు పుస్తకాలు వీర్రాజు గారూ ,నేను చదవటం మొదలు పెట్టాము.ఈ పర్యాయం రెండు సంవత్సరాలు కలిపి నిర్వహించాలని కమిటీ ఆలోచన చేసింది. కొత్తగా వచ్చిన పుస్తకాల గురించి కొందరు మిత్రులను సంప్రదించాము.మంచి పుస్తకమేనని తెలిసిన వాటిని రచయితలను సంప్రదించి పుస్తకాల్ని కొన్ని తెప్పించాము. వెంట వచ్చునది,స్పర్శవేది కథలు పుస్తకాలు గురించి ఎవరో చెప్పారు.అతని ఫోన్ నెంబర్ తెలియదని కొందరు చెప్పారు.అతను పనిచేసే రాంకీ ఫౌండేషన్ వెబ్సైట్ కు వెళ్తే ఫోన్ నెంబర్ దొరికితే SMS ద్వారా పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని అడిగాను.ఆయన వెంటనే మీ చిరునామా ఇస్తే పంపుతానని మెసేజ్ పెట్టారు. నేను చిరునామా ఇచ్చేసరికి "ఆ దగ్గర లోనే మా ఫ్రెండ్ వుంది.ఆమెద్వారా పంపుతాన"ని మెసేజ్ పెట్టారు. మరో రెండు రోజుల్లోనే చక్కనినవ్వు ముఖంతో ఒక అమ్మాయి తలుపు కొట్టింది.నేను కోరిన రెండు పుస్తకాలు తీసుకువచ్చింది.ఆ అమ్మాయి కూడా పల్లవి చదివిన పద్మావతి కాలేజీలోనే చదివిందని తెలిసి పల్లవిని పిలిచాను.నేను రాసిన పుస్తకాలు అడిగితే ఇస్కూలుకతలు,బతుకు పాటలో అస్తిత్వరాగం దీర్ఘ కవిత ఇచ్చాను.వీర్రాజుగారు నాకూ పల్లవికి తెలిసిన వాళ్ళేమో అనుకొని లోపలే వున్నారు.ఆ వాణిశ్రీ అనే అమ్మాయి ఎమ్మే తెలుగు చేసాననీ, పుస్తకాలు చదవటం ఇష్టమనీ ఆ విధంగానే ఎమ్వీ రామిరెడ్డి గారితో చిరకాలస్నేహాన్నీ వివరించింది.అదే తొలి పరిచయమైనా ఎంతోకాలంగా తెలిసినట్లు గా నాతో ,పల్లవితో మాట్లాడింది.అలా పరిచయమై ఇంట్లోకి వచ్చిన వాణిశ్రీ తర్వాత్తర్వాత మా కుటుంబంలో మనిషిలా మా మనసులోకీ వచ్చేసింది. వాణిశ్రీ తీసుకువచ్చిన రెండు కథలపుస్తకాలూ చదివాక 20 20కి ఎండ్లూరి మానస రాసిన మిళింద సంపుటినీ, 2021కి ఎమ్వీ రామిరెడ్డి రాసిన స్పర్శవేది సంపుటినీ ఎంపిక చేసాము. - శీలా సుభద్రాదేవి

27, మార్చి 2026, శుక్రవారం

జానపదం నుండి ప్రగతి పథంలోకి నాయని కృష్ణకుమారి కవితాప్రస్థానం

~ జానపదం నుండి ప్రగతి పథంలోకి నాయని కృష్ణకుమారి కవితాప్రస్థానం ~ ఒక రచయిత ఎన్ని ప్రక్రియలలో రచనలు చేసినా, పరిశోధనలు చేసినా అతని సాహిత్యంలోని ఒక ప్రక్రియతోనే ఆ రచయిత గుర్తింపు సాధిస్తారు. అదేవిధంగా నాయని కృష్ణకుమారి వ్యాసం, యాత్రాచరిత్ర, కథలు, జానపద గేయ కథలు వంటి అనేక సాహిత్యప్రక్రియలతో అక్షరయాత్ర కొనసాగించినా ఆమెని ప్రధానంగా జానపదసాహిత్య పరిశోధకురాలని విద్యారంగంలోనివారు గుర్తిస్తారు. కానీ సాహిత్యరంగంలోమాత్రం కవయిత్రిగానూ, కాశ్మీరదీపకళిక వంటి యాత్రా చరిత్ర రాసిన తొలి రచయిత్రిగానూ గుర్తిస్తారు. బాల్యంనుండీ తండ్రి నాయని సుబ్బారావుగారి వలన ప్రముఖ సాహితీవేత్తలతో జరిపే చర్చలు వింటూ సాహిత్యాభిలాషే గాక నిర్భయంగా నలుగురిలోనూ మాట్లాడటం నేర్చుకున్నారు నాయని కృష్ణకుమారి. తొలిరోజులనుండీకూడా పరిశోధనాత్మక సాహిత్యరచనపట్ల మక్కువ పెంచుకోవటంవలన 18ఏళ్ళ వయసులోనే ఆంధ్రుల చరిత్రని పరిశీలించి 'ఆంధ్రుల కథ' అనే పుస్తకం వెలువరించారు. తదనంతరం 'తిక్కన కవితావైభవం'పై పరిశోధన మొదలుపెట్టి మధ్యలో ఆపేసి 'జానపద సాహిత్యం'పై పరిశోధించి డాక్టరేటు పట్టా తీసుకున్నారు. అయితే సమాంతరంగా కవిత్వ రచనపట్ల ఆసక్తి ఉన్నా వృత్తిరీత్యా సమయాభావం వల్ల కావచ్చు- అగ్నిపుత్రి (1978), ఏంచెప్పను నేస్తం (1988), సౌభద్ర భద్రరూపం (2006) అనే మూడు కవితాసంపుటాలు మాత్రమే వెలువరించారు. 1960 నుండీ కవిత్వం రాస్తున్న కృష్ణకుమారి ఆనాటి కవయిత్రులకు భిన్నంగా సమాజ పోకడలను గమనిస్తూ, సామాన్య మధ్య తరగతి జీవుల పక్షాన నిలబడుతూ, కవితలు రాయటం గమనించవలసిన విషయం. జానపద పరిశోధన ప్రభావం వలన కావచ్చు అచ్చమైన తెలుగు పారిభాషిక పదాలతోనే వీరి కవితలు సామాజిక స్వభావాన్ని పొదువుకొని వుంటాయి. స్వాతంత్ర్యానంతరం కవిత్వంలో రాజకీయ, సామాజిక పరిస్థితుల ప్రభావం ఎక్కువగా కవులలో ప్రతిబింబించినా, సాహిత్యోద్యమాలలోని భావకవిత్వోద్యమం ఛాయలు ఎక్కువగా కవయిత్రులలో కనిపిస్తున్న సమయంలోనే కృష్ణకుమారి ఆధునిక శైలిలో రాశారు. అంతేకాక అదే సమయంలో సృజనాత్మకత కల మహిళామణులందరూ ధనమూ, కీర్తీ తెచ్చిపెట్టే నవలారచన వైపు మొగ్గుచూపి నవలామణులుగా ప్రఖ్యాతి పొందేరు. అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావం అనంతరం కవుల కవిత్వ ధోరణిలో మార్పు వచ్చింది. అదేకాలంలో కవిత్వరచన మొదలుపెట్టారు నాయని కృష్ణకుమారి. అంతవరకూ సామాజిక, కౌటుంబిక పరిస్థితులకు కట్టుపడిన కవయిత్రులలో వైవిధ్యమైన, స్పష్టమైన గొంతుకను ప్రదర్శించిన తొలి కవయిత్రిగా కృష్ణకుమారిని పేర్కొనవచ్చు. 1960-78 వరకూ రాసిన కవితలను 'అగ్నిపుత్రి'గా సంపుటీకరించారు. “వర్తమానాన్ని తిట్టుకుంటూ నిస్పృహలో మునిగి తేలే నీరవ మూర్తి కాదు నా కవిత ప్రతి నీటి కణంలో తోచే ప్రభాకర ప్రతిఘటనంలా నా కవిత్వమంతటా నమ్మకం అక్షరమై మెరుస్తుంది" అని ఆత్మ విశ్వాసంతో తన కవిత్వం గురించి చాటిచెపుతారు కవయిత్రి. పాఠకుడి మనసుకి కవితాసౌందర్యం అందాలంటే కవికి సంబంధించిన అనుభూతిపరమైన వివరణను అందుకునేందుకు దోహదపడే ఆర్ద్రతా, మనోభావాలు, కవిత్వంలో ప్రతిఫలించాలి. నాయని కృష్ణకుమారి స్వభావరీత్యా సాధుస్వభావి. అందుకే కాలక్రమేణా వచ్చే సామాజిక మార్పుల్ని ఆహ్వానిస్తారు, దుఃఖిస్తారు. కానీ మార్పుకోసం విప్లవ భావాల్ని కోరుకోరు. చాలా కవితల్లో దేవుడంటూ ఉన్నాడో, లేడో అనే డోలాయమాన స్థితిలో అంతస్చేతనలో రాసిన చాలా కవితలు కనిపిస్తాయి. కానీ మూఢభక్తిని ప్రోత్సహించరు. ఆమె తన ముందుమాటలో కూడా 'దేవుడి విషయంలో ఇదమిద్ధమనే భావన నాకింకా ఏర్పడలేదంటారు. అందుకే ఆమె వెతుకులాట కొన్ని కవితల్లో వ్యక్తమౌతుంది. చాపకింద నీరులా ప్రవహించే కాలప్రవాహంలోని మార్పుల్ని నిబ్బరంగా ఎదుర్కోవాలని అభిలషించే కవిత్వం వీరిది. అందుకే "కాలం చెంగుల్ని పట్టుకొని అతివేగంగా నడుస్తూనే అగమ్యోహాల చిక్కుముళ్ళని అతినేర్పుగా విప్పుకుంటాను”- అంటారు. కవిత్వమంటే జీవితమనీ, అనుభవాల తామరతంపరలనీ కవయిత్రి విశ్వాసం. పాఠకుల మనసులకు అందని సర్కసు ఫీట్ల కవిత్వాన్ని రాసి మెప్పుపొందే కవుల ఆధిపత్యాన్ని నిరసిస్తారు. చెప్పదలచుకున్న విషయాన్ని డొంకతిరుగుడుగా కాక సూటిగా చెప్పటం వీరి కవిత్వ లక్షణం. “నా కవిత్వాన్నిరూపు కట్టించదలచుకున్న భావంగా నేను కూడా రూపాంతరం చెందుతాను. అంతేకానీ భావాలకు ఆశ్రయభూతాలైన శబ్దాల్లోకి పరకాయ ప్రవేశం చేయను. కవిత్వంలో కవి మనస్సే కాక అతని చిత్తవృత్తి, అహంకారమూ, ఆర్ద్రతా, కాఠిన్యమూ వంటి లక్షణాల స్థాయి తెలిసినప్పుడు ఆ కవి కవిత్వము అర్థమయ్యే పద్దతి వేరుగా ఉంటుంది' అంటారు నాయనికృష్ణకుమారి. 'దూరం కొలత' అనే కవితలో కోరికల్ని గుర్రాల్లా పరిగెత్తనీయకు అని పాఠకుడికి బోధించేందుకు అన్నట్లు పలు ఉదాహరణలు ఇచ్చారు. “నీకూ నీ కోరికకూ మధ్య దూరం ఎంత ఎక్కువైతే అంతగా పెరుగుతుంది. అంతరంగంలో రాగం..."అని చెప్తూనే- “కావలసినదానికంటే ఎక్కువగా కామిత ఫలాన్ని ఒడిగట్టచూడకు" అని సలహా యిస్తూ-కొసమెరుపుగా- "ఇది నీకే కాదు నీ పిల్లలకు కూడా పనికొచ్చే నిజం” అని ముక్తాయింపుని ఇస్తూ పిల్లల పట్ల అమితమైన ఆశలు పెట్టుకోవద్దని, అవి నెరవేరకపోతే కుంగిపోవలసి వస్తుందనే అర్థాన్ని ధ్వనింపజేస్తారు. 'రాళ్ళు-పిచ్చివాళ్ళు' అనే కవితలో నేటి సమాజాన్ని వ్యంగ్యంగా చిత్రిస్తూ-- “ఎక్కడ చూసినా ఈ రోజుల్లో పిచ్చివాళ్ళ చేతుల్లో పిడుగుల్లాంటి రాళ్ళు” అంటారు. దైవం గురించి చాలా కవితల్లో ఉన్నాడో లేడో అనే వెతుకులాటతో సంశయాత్మకంగా రాసారు కవయిత్రి. అందులో ఒకటి 'గాలి పిడికిలి'. "గాలి పిడికిళ్ళ వేలంవెర్రికి కొంటె నవ్వులు రువ్వుతూ గుండెగుడిలో దీపంలా నువ్వు" అంటూ ప్రతీ మనిషిలోనూ గుండెల్లోనూ వెలిగే దీపమే దైవమని తీర్మానిస్తారు. కొన్ని కవితల్ని మాత్రాఛందస్సు పద్ధతిలో పంక్తి చివర ప్రాసని పెట్టి ఒక లయతో నడిపారు. అవి ఆనాటి కవులైన శ్రీశ్రీ వంటివాళ్ళు తొలినాళ్ళలో రాసినవిధానాన్ని తలపిస్తాయి. "బ్రతుకు పాట ప్రిదిలి కదులు బాట నొగిలి శృతి చలించి మతి భ్రమించి" అంటూ లయను పొదువుకొని సాగుతాయి. భరతమాతని హిమావృత శైలపంక్తి కిరీటంతో, వింధ్యాచల వడ్డాణంతో, గంగాయమున కంఠహారాలతో అలంకరించి అప్సరసలా ఉన్న దేశం ఈనాడు మామూలు స్త్రీలా పిల్లల చేతికి ఒకముద్ద అందించలేని పేదతల్లిగా మార్చేస్తున్న అదృశ్యహస్తాల్నీ వాటిని పడగొట్టాలని తపన పడ్తూ, మాత ముఖంలో వెలుగు కోసం హారతి కర్పూరమై కరిగిపోవాలనే ఆరాటంతో ఆరు పేజీల సుదీర్ఘ కవిత అర్థవంతంగా మంచి పదచిత్రాలతో అక్షరీకరించారు కవయిత్రి. సముద్రం, అగ్ని, జ్వాలా, శిఖలను కవిత్వ పంక్తులలో పొదుగుకొంటూ కాలాన్ని తన నెచ్చెలిగా భావించి తనలో లయింపచేసుకొంటూ, సర్వ విషయాలూ కాలనెచ్చెలికి అర్థమయ్యేలా ఆమె చేయి పట్టుకుని ముందుకు తన గమనాన్నీ గమ్యాన్నీ నిర్దేశించుకుంటూ పోతుంది అనే విషయాన్ని అనేక కవితల్లో ప్రస్తావిస్తారు. మరొక మంచి కవిత 'మట్టి మనిషి'. బాల్యంనుండి మనిషికి మట్టితోగల అనుబంధాన్నీ, అమ్మకీ మట్టికీ గల సాదృశ్యాన్నీ, అభేధాన్నీ వర్ణిస్తూ "తొలకరింపు తడుపుకు చిలకరించిన మట్టివాసనల చిక్కదనంలో అమ్మవాత్సల్యపు కమ్మదనాన్ని”- చెబుతారు. "నన్ను కన్నతల్లి ఆంతర్యంలో నా నేలతల్లి ఆధిక్యాన్ని కొలిచే నేనింకెవరిని మట్టిమనిషిని” అని సామాజిక జీవనంలోకి మమేకమౌతారు. సాధారణ పదాలతోనే కవితల్ని అల్లే నేర్పు బహుశా జానపద సాహిత్యపరిశోధనలవల్ల అలవోకగా అలవడింది. అలా రాస్తూ రాస్తూనే ఒక్కొక్కప్పుడు అకస్మాత్తుగా భారీ సమాసాల్ని కవితలో చొప్పించేస్తారు. అంతకుముందు చదివిన కావ్యప్రభావం వల్ల అలాంటి పదగుంభనలోకి వెళ్ళిపోతారు. అటువంటి వాటిలో కొన్ని ఉదాహరణలు- 1. శాద్వలాంచల వాః కణాలకు మల్లె 2. దురంత భీషణ క్రుధోద్విగ్న ప్రకృతి 3. తీరస్థ పృధు శిలాగ్ర స్పర్శనం 4. దుష్టచ్ఛేద నోన్ముఖ నిస్త్రింశిక వంటి పంక్తులు వారి కవితల్లో దొర్లడం కనిపిస్తుంది. అయితే అటువంటివి బహు తక్కువే. వవవవఏడున్నర పేజీల ‘ఊడలమర్రి' కవిత కొమ్మల నీడన గూటిలోని పక్షుల గాథను కథాత్మకంగా వర్ణించారు. అటువంటిదే నాలుగున్నర పేజీల 'చౌరస్తా’. మరొకటి ఏడు పేజీల 'అన్నదమ్ములు' కవిత సంభాషణాత్మకంగా నడుస్తుంది. పగలంతా గిల్లికజ్జాలుతో అమ్మని సతాయించిన అన్నదమ్ములు రాత్రి కావలించుకొని పడుకున్నప్పుడు 'స్వప్న వియద్గంగలో సేదతీరుతున్న శ్వేతయుగళంలా' వున్నారంటూ అందమైన పదచిత్రాలతో కథన కవితగా రాసారు కవయిత్రి. మరొక మంచి కవిత 'హుసేన్ సాగర్'లో- “చక్కని హైదరాబాద్ చూపించమని సముద్ర పాప గగ్గోలు" పెడితే "అలల పిడికిళ్ళతో నీటిని విసిరితే తీరిన కడలిముక్కే నగర శరీరాన్ని హత్తుకున్న సొగసైన హుసేన్ సాగర్ పాప” అంటూ హుసేన్ సాగరాన్ని కడలిముక్కగా పోల్చిన తీరు చదువరికి చక్కని దృశ్యాన్ని చూపుతుంది. ఈకవితనిండా మబ్బుపిల్లలు తారట్లాడుతారు. నేలతల్లి తన ఒడిలో అమర్చుకున్న నిర్మలమైన అద్దం బిళ్ళగా హుసేన్ సాగరాన్ని పోల్చేరు. అంతటి నిర్మల కాసారాన్ని ధ్వంసం చేస్తోన్న గుర్రపు డెక్కల మొక్కల్ని గురించీ వాపోయారు కవయిత్రి. సాధారణంగా భావకవిత్వచ్ఛాయలున్న కవులు వెన్నెలతోనో, పూలతోనో, మలయపవనంతోనో మమేకమౌతారు. విప్లవ కవులు సూర్యుని తోనో, జ్వాలలతోనో పోల్చుకుంటారు. కానీ కృష్ణకుమారి గారు మాత్రం- ‘మనిషికీ మనిషికీ మధ్య కనీ కనపడని ఎర్రడాలు మనసు మంటల్నీ దయ్యంలా అసూయని పెంచే మానవత్వం మసిచేసే మంటల్నీ కన్నెర్రని మంటల్నీ ఆర్పే బొగ్గుపులుసు గాలిని” అన్నారు కవయిత్రి. ఎప్పుడూ మనిషి అంతరంగ దర్శనం చేస్తూనే అతని బాహ్య జీవన విధానాన్ని సరిపోల్చుతూ కవిత్వీకరించడం ఈ కవయిత్రి సాహిత్యలక్షణం. అందుకే ఆమె ‘చింతలూ, చికాకులూ, నిరాశలూ, దురాశలూ, కష్టాలూ, కన్నీళ్ళూ, సుఖాలూ, సంతోషాలూ, సంతృప్తి, త్యాగరక్తీ వంటి సమస్త పార్శ్వాలూ రంగరించుకొని రూపెత్తిన సగటు మనిషే నా కవిత్వమంతటా విశ్వరూపావిష్కరణంగా ఉండాలనుకుంటాను” అన్నారు. నాయని కృష్ణకుమారి తమ తల్లిని ఆరోగ్యవంతురాల్ని చేసే క్రమంలో వైద్యురాలిగా పరిచయమై హృదయానికి దగ్గరైన ఆత్మీయ మిత్రురాలైన డా|| పి. శ్రీదేవి మరణవార్త (1962)విని ఆర్ద్రంగానే కాక ఆత్మీయ స్పర్శను నింపుకున్న స్మృతిగీతం “ఏం చెప్పను నేస్తం" కవిత- “నీవు మామధ్యను లేనందున మాకు వెలితి! నీ కలం కథలుగా మారనందున తెలుగు కథలకే వెలితి!” అంటూ ఆద్యంతాలకి అందకుండా ఆవేశకావేశాలు పట్టని ప్రతికూల పరిస్థితుల్ని సైతం అనుకూలంగా మలచుకోగల అంతర్గతంగా శక్తిశాలిని అయిన డా|| పి. శ్రీదేవికి ఆత్మీయంగా 'ఏం చెప్పను నేస్తం' కవితాసంపుటిని అంకితం ఇచ్చారు కృష్ణకుమారి. ఈ సంపుటిలోని కవితలన్నింటా సమాజంలో పెచ్చరిల్లుతున్న హింస, ఆర్థిక అసమానత, విద్యారాహిత్యం, కులమత ప్రాంత విద్వేషాలు- ఇలా సమాజాన్ని కుదిపేసిన పలు సమస్యల్ని గుదిగుచ్చి రాసిన ఆరేడు పేజీల పెద్ద కవితలే ఉన్నాయి. అంతవరకూ ఉగాది సమ్మేళనాల్లో మామిడిపూతలూ, కోయిల పాటలూ, చెరుకు, మామిడుల రుచులూ వీటితో కోమల కవిత్వాన్ని వినిపించే కవి సందర్భాలలో కృష్ణకుమారి సామాజిక సమస్యలవైపు దృష్టి సారించి అరవయ్యో దశాబ్దంలోనే కవిత్వీకరించటంలో రచయిత్రి సామాజిక దృష్టి కోణం తెలుస్తోంది. ఇంద్రధనస్సులోని రంగుల్లా విభిన్న అంతరాలు వున్న జనాల్ని ఈ ఉగాదైనా ఒక్కటిగా చేస్తుందా అనే ఆశావహ దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ జనంలో పొడచూపుతున్న అనేకానేక వైరుధ్యాల గురించీ, పెచ్చుపెరుగుతోన్న హింసా ప్రవృత్తుల గురించీ, అంతకంతకూ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్న పేదల గురించీ అక్షరాల్లో పొదిగి వాపోయారు కవయిత్రి. దేవుని అస్తిత్వాన్ని నిర్ధారణ చేసుకోలేని సంశయంలో 'మృత్తికాతృష్ణ' కవితలో మట్టికీ మనిషికీ గల అవినాభావ సంబంధాన్ని వివరించే క్రమంలో నగర రోడ్లు విశాలం చేయాలనుకుంటే రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే మతాలయాల గురించి నిరసించారు. "సామాన్యుని బతుకుని బాగుచేయమని అడ్డమైన దేవతల్నీ అడుక్కుంటున్న తరుణంలో కనురెప్పలమీది నీలితెరల్ని లాగి వెలుగుసూదుల్ని గుచ్చుతుంది. ఉగాది ఒయ్యారి" అని మూఢభక్తిని నిలదీశారు. 1969లో వచ్చిన ఉద్యమ నేపథ్యం వలన కాబోలు తెలుగు భాష గురించిన కవితల్లో మాతృభాషాభిమానాన్ని వెల్లడించడమే కాక అందరం ఒక భాషామతల్లి బిడ్డలమేనని తెలుగు కవిత్వం సార్వజనీనత్వాన్ని అభిలషిస్తూ కొన్ని కవితలనూ రాసారు. మొదటి కవితాసంపుటి తన తండ్రి నాయని సుబ్బారావుగారికి అంకితమిచ్చిన కృష్ణకుమారి సుమారు పాతికేళ్ళ తర్వాత రాసిన 'సౌభద్ర భద్రరూపం'గా శోభనిచ్చే చిరునవ్వుతో ఆర్తులైన వారినందరినీ, ఆత్మీయంగా అభిమానించే తల్లి భద్ర రూపాన్ని తలచుకుంటూ తల్లికే అంకితమిచ్చారు. ఇందులోని చాలా కవితల్లో తన బాల్యాన్ని తలపోస్తూ, ఆ సమయంలో ప్రేమగా హత్తుకునే తల్లిని గుర్తుచేసుకొన్నారు కవయిత్రి. “పెను ప్రపంచంలోకి నన్ను నిర్దాక్షిణ్యంగా విసిరేసి మూసుకుపోయిన నీ గర్భ ద్వారం" అంటూ తన పుట్టుకని గుర్తు చేసుకుంటూ, చల్లటి స్పర్శలా చాచిన చేతుల మధ్య ఒదిగిపోయి ఆమె గుండెమీద గువ్వపిట్టైనప్పటి దృశ్యాల్నీ; దూదుంపుల్లా, తొక్కుడు బిళ్ళాట నాటి ఉత్సాహాన్నీ అక్షరబద్ధం చేసారు. ఈ క్రమంలో ప్రకృతినంతటినీ తల్లీబిడ్డలుగా వర్ణించటం గమనార్హం. బద్ధకంగా పడుకున్న కొండలు చెట్లచేతులు చాపాయన్నారు. ఆకాశం భూమిపిల్లను సందిట పొదువుకుందన్నారు. రెక్కలు మొలిపించుకున్న పులుగుకూన /శ్రమించి కట్టిన గూడును దాటి ఎగిరిపోయి రాబందుల పాలౌతుందేమోనని దిగులుపడ్డారు. "నేలతల్లి నిర్భర వక్షాన తల్లిని కరచుకున్న పిల్ల పోలిక పల్లవించిన అడవి!”ని దర్శించారు ఈ విధంగా అంతటా మాతృ దర్శనాన్ని వీక్షిస్తున్న కృష్ణకుమారిగారు, తన జీవన సంధ్యలో ముందుకు వేస్తున్నప్రతీ అడుగూ మృత్యువు వైపుకు కాదంటారు. తనవెనక ఘనీభవించిన కాంతి సముద్రం వైపు, దాంట్లో వటపత్రశాయి లాంటి బాల్యంవైపూ, తన పుట్టుకకు కారణమైన గర్భద్వారంవైపు ప్రయాణించి తిరిగి తల్లి గర్భగూడులో గువ్వపిట్టలా ఒదిగిపోవాలని కలగన్నారు కవయిత్రి. తొలి సంపుటిలో దైవం గురించి డోలాయమానంగా ఉన్న కవయిత్రి ఈ సంపుటి చివరి మూడు కవితల్లో దైవాన్ని నిర్ధారించుకున్నారు. తిరునామం కింద కళ్ళకలువల్నీ, విశ్వరూప చమత్కారానికి, ఉక్కిరిబిక్కిరై, ఊపిరందని చేపపిల్లలా ఎగసిపడుతూ తలంచుతున్నానని అన్నారు. ప్రతి కవితనీ ఒక సామాజిక బాధ్యతతో, సమసమాజ భావనతో, మానవీయ దృక్పథంతో రాసారు కవయిత్రి. అనేకచోట్ల మట్టినీ, నేలనీ, దేశాన్నీ, మాతృభాషనీ, తల్లితో పోలుస్తూ మాతృభావనని అనేక కవితల్లో కవిత్వాన్ని అమ్మగా రూపుదిద్దారు నాయని కృష్ణకుమారి. మూడు నాలుగు దశాబ్దాల పాటు అనేక సాహిత్య ప్రక్రియలతో పాటూ కవిత్వానికి నిర్భయాన్ని అద్ది, ఉద్యోగ సంబంధమైన ఒత్తిడులలో సైతం తనదైన శైలిలో కవిత్వాన్ని రాస్తూ విదుషీమణిగా కవిత్వ పతాకాన్ని ఆవిష్కరించిన కవయిత్రి నాయని కృష్ణకుమారి. (సారంగ)

25, మార్చి 2026, బుధవారం

కాలాతీతవ్యక్తులు ఎందుకు చదవాలంటే...~

~ కాలాతీతవ్యక్తులు ఎందుకు చదవాలంటే...~ శ్రీదేవి కాలాతీతవ్యక్తులు ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక కొత్త విషయం పాఠకులకు అందుతుంది. రమారమి డెభ్భై ఏళ్ళ నాటి ఈ నవల ఈ విధంగా మూడుతరాల పాఠకులకు ఎందుకు చేరువౌతుంది? ఏమిటి దీని ప్రత్యేకత? ఇందులోని పాత్రలూ,వారి మనస్తత్వాలూ సజీవమే.డెభ్భైఏళ్ళ క్రిందటా అటువంటి వారు జీవించారు .యాభైఏళ్ళ క్రితం సమాజంలోనూ వున్నారు, పాతికేళ్ళ నాడూ చూసాము.ఈనాడు మన మధ్యనే మనతోనే వున్నారు.బహుశా అందుకే ఈ నవల ఏదో ఒకనాటి సమాజానికి చెందినది మాత్రమే అని చెప్పటానికి వీల్లేదు. శ్రీదేవి రచించిన నవల 'కాలాతీత వ్యక్తులు' మొత్తం చదివిన తర్వాత పాఠకులకు అనేక ఆలోచనలూ, సందేహాలూ వస్తాయి. ముఖ్యంగా ఈ నవలలోని ప్రతీ పాత్రకీ మరో పాత్రతో గల సంబంధం ప్రత్యేకంగా ఆర్థికాంశాలమీదే ఆధారపడి ఉంటుంది. అది ప్రధానమైన విషయం. ఇందిరకు ప్రకాశంతో, కృష్ణమూర్తితో ఉన్న స్నేహమైనా,కళ్యాణికి ప్రకాశంతో, కృష్ణమూర్తి తో,డా.చక్రవర్తితో స్నేహమైనా ,ఇందిర తండ్రికి తన మందూ వగైరాల కోసం ప్రకాశం, కృష్ణమూర్తి తోనే కాక ప్రకాశం మేనమామ శేషావతారాన్నీ మాటలతో బురిడీ కొట్టటం మొదలైనవన్నీ ఆర్థిక ప్రాతిపదికగా జరిగినవే. భూస్వామ్య వ్యవస్థ నుండి ప్రారంభమై పెట్టుబడిదారీ వ్యవస్థ వరకూ ఆయా చారిత్రక, భౌగోళిక దశలలోని మార్పులను, వాటి ఫలితంగా సామాజిక సంబంధాలూ, మానవ సంబంధాల మధ్య జరిగే సంఘర్షణలనూ సంక్షోభాలనూ అంతర్లీనంగా ప్రదర్శించే నేర్పు ఆసాంతం ఈ నవలకు ప్రధానంగా వాతావరణ భూమిక అయింది. స్వాతంత్రం వచ్చిన తొలి రోజులు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం దేశంలో ఏర్పడిన ఆర్థిక ఛిద్రంవలన తొంభై శాతంకి పైగానే కుటుంబాలు మధ్యతరగతికి దిగువనే ఉండే పరిస్థితి ఏర్పడింది. కష్టపడితేగాని నోట్లోకి ఒకముద్ద వెళ్ళని స్థితి. ఆనాటి రాజకీయ, సామాజిక నేపధ్యంలో అప్పుడప్పుడే విద్యావంతులూ,చిరుద్యోగినులుగా ఎదుగుతోన్న ఆడపిల్లలలో ద్వైదీ భావమనస్తత్వాలు ఏవిధంగా సందిగ్ధతలోకి నెట్టివేస్తున్నాయి.ఇలా ఎన్నో పరిస్థితులు రూపాంతరం చెంది ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతుంటే వాటికి ఎదురు నిలవటానికి యువతులు తమ ఆత్మవిశ్వాసాన్ని ఎలా కూడగట్టుకోవాలో అర్థం అవుతుంది. ఈ నవల అంతా చెప్పను. ఇందులోని మూడు ప్రధాన స్త్రీ పాత్రలు, వారిని ప్రభావితం చేస్తున్న మూడు పురుష పాత్రలు గురించి మాత్రమే పరిచయం చేస్తాను.నవలలో సమయానుకూలంగా ,ఆయా సందర్భాలలో వచ్చే మరికొన్ని పాత్రలు కూడా వున్నాయి. ఇందులో ఇందిరని తల్చుకుంటే భయం కలుగుతుంది, మరోసారి ధైర్యమూ కలుగుతుంది. ఆ పాత్రని అర్థం చేసుకోవాలంటే గుండె దిటవు కావాలి. అరవై ఏళ్ళ క్రిందట సృష్టింపబడిన ఇందిర పాత్రని ఆ విధంగా తీర్చిదిద్దటానికి శ్రీదేవి చాలా ధైర్యాన్ని కూడగట్టుకునే ఉండాలి. ఎందుకంటే ఇందిర ఒక వ్యక్తికాదు, ఒక పాత్రకాదు, ఒక వ్యవస్థ. కొన్ని కఠిన పరిస్థితులలో జీవితాన్ని కొనసాగించాలంటే ఇందిరలా ప్రవర్తించక తప్పదు అనే వాస్తవాన్ని, జీవనసత్యాన్ని నిర్భయంగా చాటిన రచయిత్రి, తన అభిప్రాయాల్ని బలంగా బలపరుస్తూనే ఆ పాత్ర చిత్రణలో ఎంతో శ్రద్ధ తీసుకుంది రచయిత్రి. "రెక్కలున్నాయనుకొని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అవి తడిసిపోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది. మనిద్దరి పరుగులాటలూ ఒకటే. " కృష్ణమూర్తితో ఇందిర అంటుంది మరో సందర్భంలో ఇందిర మనసులో మాటగా - "త్యాగానికైనా ఒక హద్దుంటుంది. ఎవరికీ పనికిరాని త్యాగాలు చేయటం బుద్ధిహీనం. నాన్నను ఒదిలెయ్య బోవటంలేదు. నాఉద్యోగం, నా స్వతంత్రం అన్నీ అలాగే ఉంటాయి. భావదాస్యం, ఆర్థికదాస్యం రెండూ మనిషిని కుంగదీస్తాయి.” అని స్పష్టంగా చెప్పిస్తుంది రచయిత్రి. స్వతంత్ర వ్యక్తిత్వం గల స్త్రీ కుటుంబ జీవితంలో ఏమి కోరుకుంటుందో నిర్భయంగా ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా చెప్పటంలో ఇందిర చైతన్య స్ఫూర్తి తేటతెల్లమౌతుంది. "ప్రతి మనిషికీ సమస్యలుంటాయి. సమస్యలు లేనిది చచ్చిపోయినవాళ్ళకి మాత్రమే. నీ జీవిత కాలంలో నిండుగా బతుకు. నిర్భయంగా బతుకు. రోజుకి పదిసార్లు చావకు. ఇంకొకళ్ళని చంపకు. నీకు తారసిల్లిన మనుషుల్లో అణగిమణిగి ఎక్కడైనా లోలోపల కొంచెం మానవత్వం ఉంటే దాన్ని బయటకి తీయటానికి ప్రయత్నించి దాన్ని బైటకి రానియ్యి. మానవత్వం ఉండడం సిగ్గుపడవలసిన నేరం ఏమీ కాదు." అంటూ వివిధ సందర్భాలలో ఇందిరచేతనే చెప్పించారు రచయిత్రి. కూర్చుని తినే వ్యసనపరుడైన తండ్రికీ, ఇందిరకీ ఆమె తెచ్చే జీతం డబ్బులు సరిపోవు.యవ్వనంలోని తన ఆశల్ని,కలల్నీ పండించుకొనే అవకాశాలు లేని ఇందిర తన అరకొర జీవితానికి కారణమైన లేమిమీద పగ, కసి వ్యక్తపరచలేక ఒక సాధారణ స్త్రీలా కాకుండా చిత్రాతిచిత్రమైన వ్యక్తిలా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తనలో ప్రేమ, కోపం, ఆవేశం, పగ, దుఃఖం, నిరాశ, నిర్లిప్తత, స్వార్థం అన్నీ ఉంటాయి. అన్నీ ఎక్కడనుండో వచ్చిపడినవి కాదు.బాల్యంనుండీ ఎదుర్కొన్న అనేకానేక అనుభవాల కారణంగా జీవితం ప్రసాదించినవే. నవలలో ఇందిరని ఒకచోట సర్కస్ ట్రెపీజ్ మీద ఫీట్లు చేసే అమ్మాయిగా చూపిస్తూ ఆమెలోని బలహీనతలు, లోపాలు తుడిచి పెట్టేసి చివరికివచ్చేసరికి క్రమక్రమంగా పెంపొందిన ఇందిర వ్యక్తిత్వం, మానసిక పరిణత అబ్బురపరిచేలా నవలంతటా ఆమె పాత్రని చిత్రించిన తీరు శ్రీదేవిలోని రచనా పరిణతకి, భావసాంద్రతకీ అద్దం పడుతుంది. కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో ఎత్తుపల్లాలు, ఎదురు దెబ్బలు, అవమానాలే కాక, వాటిని అధిగమించటానికి జీవితంపై పగ, కసితో వ్యక్తిత్వాన్ని చెక్కుకొంటున్నప్పుడు క్రమంగా సానపడుతూ వెన్నెముకగల స్త్రీగా ఎదిగిన క్రమాన్ని ఇందిర పాత్ర చిత్రణలో స్పష్టంగా చూపుతుంది.ఇందిర కొన్నిసార్లు జీవితం అంటే లక్ష్యం లేనట్లు మాట్లాడుతుంది.మరికొన్నిసార్లు తాత్విక చింతనతో మాట్లాడుతుంది.ఏదిమాట్లాడినా అర్థవంతంగానే మాట్లాడుతుంది.ఆ మాటలన్నీ రచయిత్రి శ్రీదేవివే.నవల రాసే నాటికి ముప్పై ఏళ్ళ లోపునే వయసు వున్న శ్రీదేవి ఇంత పరిణతతో జీవితసారాన్ని అవుపోసన పట్టినట్లుగా రాయటం అబ్బురమే. కళ్యాణి అనేకానేక నవలల్లో లాగానే ఒక మంచి కథానాయికగానే కనిపిస్తుంది. ఇందిర పాత్రకు సమాంతరంగా కళ్యాణి పాత్రను నవల అంతటా శ్రీదేవి ఒకేరకంగా నడిపించింది. ఇందిరలా చొరవలేదు, మాటలతో ఆకట్టుకొనే మనస్తత్వం కాదు. పురుషులతో మాట్లాడేటప్పుడు ఆనాటి పరిస్థితుల కనుగుణంగా బిడియపడుతూనే మాట్లాడుతుంది. స్నేహితుల వద్దకూడాతన అవసరాలు బయటపడకుండా గోప్యంగా నడుచుకుంటుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులతో రాజీ పడుతుంది. ఎటువంటి సందర్భంలోనూ తనలోని రాగద్వేషాలు కాని, తన అభిప్రాయాల్ని కానీ వెల్లడించకుండా తనలో తానే మధనపడుతుంది.కళ్యాణిని ఆర్థిక అవసరాలు తెలీనీకుండా పెంచిన తండ్రి మరణించాక ప్రకాశం పట్ల ఆకర్షితురాలైనా, వసుంధర ఆశ్రయం, తనకి గార్డియన్గా ఉన్న మునసబు మరణించడం, ఆ సందర్భంలో ఆదుకొన్న డా॥ చక్రవర్తి స్నేహం పొందడం అన్నీ నాటకీయంగా జరుగుతాయి. అనుకోని పరిస్థితులలో మానసికంగా దగ్గరైన డాక్టరు చక్రవర్తి దగ్గర తన మనసును బయట పెట్టడంతో అది వారిరువురి వివాహానికి దారితీసింది. ఈ నవలలో కథానాయిక ఇందిరా,కళ్యాణా అనే వాదవివాదాలు అనవసరం.ఆనాడేకాదు ఈనాటికీ వస్తోన్న అనేకానేక రచనల్లోని కథానాయికలు కళ్యాణికి సాదృశ్యంగానే ఉంటారు.మనసమాజంలో రాజీపడుతూ బతికేసే సగటు మహిళలు ఎప్పుడూ వుంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కాళ్ళుచాపుకొని ఏడుస్తూ కూర్చుని ఒకరిమీద ఒరిగి పోకుండా నిలదొక్కుకొని ఇందిరలా నిలిచేవారు ఈనాడు స్త్రీవాద వుద్యమం వూపందుకొన్నాక ఎక్కువమందే వుండి వుంటారు. మరో స్త్రీ పాత్ర వసుంధర కళ్యాణికి సహాధ్యాయి మానవత్వం మూర్తీభవించిన మంచి మనిషి.కళ్యాణి కష్టాలకు కరిగిపోయి ఆశ్రయం యిచ్చి తానుకూడా ఈ వలయంలో చిక్కుకు పోతుంది.ఆమె కుటుంబ సభ్యులు అంతా ఆమెని పువ్వుల్లో పెట్టి పెంచారు.ఆమెకు ఏకష్టాలు తెలియవు.అందువలనే వసుంధరను ఆమె కుటుంబ సభ్యులు మందలించటం రచయిత్రి సహజంగా రాసింది. కళ్యాణి వలన కృష్ణమూర్తి,చక్రవర్తుల పట్ల స్నేహం,ఆకర్షణ ఏర్పడినా సహృదయంతో అర్థం చేసుకొని తాను తప్పుకొని వారి వివాహాలకు తిరుపతి వెళ్తుంది వసుంధర.అవసరమైన సంఘటనలను కల్పించి శ్రీదేవి మలుపులతో నవలకు ముగింపు పలకటంలో చాకచక్యం చూపింది. ఎంబిబిఎస్ చదువుతున్న ప్రకాశం ఎవరో ఒకరి అధికారం క్రింద బతకటానికి అలవాటు పడిన సామాన్యుడుగా చిత్రించింది రచయిత్రి.స్వంత అభిప్రాయాలూ, స్వంత ఆలోచనలు లేని చంచలస్వభావుడు.ఆర్థిక అవసరాలు ఎంతటి పిరికితనాన్నీ,లొంగిపోయే మనస్తత్వాన్ని ప్రకాశంలో ఏ విధంగా కలిగించాయో ప్రతీ సందర్భంలోనూ రచయిత్రి నేర్పుగా చిత్రించింది.చదివిస్తున్న మామయ్య ఇనుప పిడికిలిని తప్పించుకునే నేర్పు లేక ప్రకాశం లొంగిపోయి మామయ్య ఇష్టప్రకారం వివాహం చేసుకుంటాడు. ప్రకాశం లాంటి యువకులు బ్రతుకు బాధలను ఎదుర్కోలేక అడుగడుగునా రాజీపడి అణిగిమణిగి ఎలా బతుకుతారో ఈ నవలలో అత్యద్భుతంగా చిత్రించారు శ్రీదేవి. కృష్ణమూర్తి పాత్రని ఆర్థిక ఇబ్బందులులేని విలాసపురుషుడిగా,నైతికవిలువలు లేని వాడిగా ఏవగింపు కలిగించేలా నవలలో ప్రవేశపెడుతుంది.కానీ రానురాను ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా ఇందిర కోరుకున్న పెద్ద ఛాతిగల వ్యక్తిగా తీర్చిదిద్దింది రచయిత్రి. కృష్ణమూర్తి ఆదర్శాలు వల్లించడు.పగా కార్పణ్యం లేనివాడు.స్నేహాన్ని ప్రేమించి అవసరాలకు అండగా నిలుస్తాడు.జీవితాన్ని అర్థం చేసుకుని ఎదుగుతాడు అనేలా క్రమక్రమంగా అవసరమైన మేరకు సన్నివేశ కల్పన చేస్తుంది రచయిత్రి. 'ప్రపంచంలోని అందరి ఉగాదులూ మనవే' అనుకునే సార్వజనీన దృక్పథం కలవాడిగా చివరకు కృష్ణమూర్తి పాఠకులకు గోచరిస్తాడు. "దేశంలో ఉన్న దరిద్రం సగం మనుషుల మనసులలో ఉంది. ఇవ్వడానికి చేతిలో దమ్మిడీ లేకపోవచ్చు. కాని మనస్సు ఇవ్వటానికేం ఖర్మ? కాని ఇవ్వరు. నాలుక పీక్కున్నా ఇవ్వరు. ఇవ్వడంలో హాయి ఉందిరా అంటే అర్ధం చేసుకోరు"అంటాడు కృష్ణమూర్తి.కృష్ణమూర్తి అమృత హృదయుడు. మంచిగా తప్ప మరొకలా ఉండలేడు అనేలా రచయిత్రి ఈ పాత్రను నిర్థారించారు. కుటుంబ సమస్యలు, భార్య మరణం వంటి జీవిత సమస్యలతో బాధపడుతున్న డా|| చక్రవర్తీ, ఆర్థిక కారణాలే కాక, మానసికంగా, భౌతికంగా కూడా ఒంటరి అయి ఆలంబనకోసం పరితపిస్తున్న కళ్యాణీ ఒక్కటి కావటంలో పెద్ద ప్రత్యేకత ఏమీలేదు. అటువంటి అనేక సన్నివేశాలు చాలా నవలల్లో చదివే వున్నాం. అవసరమైనప్పుడు లోకాన్ని ధిక్కరించైనా, తనకేం కావాలో దాన్ని సాధించుకున్న ఆధునిక యువతి ఇందిర, కాలానికి అతీతంగా ఆమె నడుచుకున్నట్లనిపించినా నవతరం స్త్రీలో ఆ విధమైన మానసిక స్థైర్యం ఉండాలనేదే శ్రీదేవి ఉద్దేశం. అన్యాయం జరిగినప్పుడు కుంగిపోయి, ఆత్మహత్యకు తలపడటం ఏనాడూ స్త్రీ చేయవలసిన పని కానేకాదని ఇందిర పాత్ర ద్వారా రచయిత్రి శ్రీదేవి ఈ నవలలో ప్రధానంగా చెప్పారు ఇందులోని ప్రతీ పాత్ర ప్రవర్తనకూ ఆ పాత్ర కుటుంబ నేపధ్యం,పెరిగిన విధానమే మూలకారణంగా రచయిత్రి నిరూపిస్తూనే యీ రచన చేసింది.ఆ నిరూపణల్లో రచయిత్రి ఎక్కడా తడబడలేదు.అది గమనించవలసిన విషయం.బహుశా శ్రీదేవి వృత్తిపరంగా వైద్యురాలు కావటం వలన రోగానికి మూలం కనుగొన్న విధంగానే తాను సృజించిన పాత్రల మూలాలను పాఠకులకు కూడా అవగాహన కల్పిస్తూనే కథనం చేసిందని స్పష్టమోతుంది. అందుకే ఒక ఇంటర్వ్యూలో " 'కాలాతీత వ్యక్తులు' అప్పటికే కాదు. ఇప్పటికి ఎప్పటికీ నిలిచిపోయే నవల, ఎంత కఠిన మైన విషయాన్నయినా, మరెంతో జుగుప్సాకరమైన సంఘటమైనా అతి నైపుణ్యంతో రాయగలిగే నేర్పు శ్రీదేవిలో వుంది. ఒక ఇందిర, కళ్యాణి, వసుంధర, ఒక చక్రవర్తి, కృష్ణమూర్తి, ప్రకాశం... ఎప్పుడూ మన మధ్యే వుంటారు."అన్నారు .శ్రీదేవికి ఆత్మీయురాలైన పి.సరళాదేవి. శ్రీదేవి స్వభావరీత్యా మృదుభాషిణి, స్నేహశీలి. వ్యక్తిగాను, రచయిత్రిగానూ స్వతంత్ర ప్రవృత్తి గలది. అందుకే ఈమె సృజించిన పాత్రలుకూడా స్వతంత్ర ప్రవృత్తి కలిగివుండి ఎటువంటి క్లిష్టసందర్భాలలోనైనా సంయమనం కోల్పోక తమ వ్యక్తిత్వం నిలుపుకుంటాయి. తనకి గల స్నేహస్వభావంవలనే ఆమె రచనలలోకూడా స్నేహానికి పెద్దపీట వేసింది. 'కాలాతీతవ్యక్తులు' నవలలో తెలుగునాట రాజకీయ, ఆర్థిక, సామాజిక,కౌటుంబిక పరిస్థితులన్నింటినీ నవలా నేపధ్యంలో స్పష్టీకరించటం వలన పాఠకులకు కాల పరిణామక్రమం చక్కగా అవగాహన అవుతుంది. సాధారణంగా నవలల్లో ఇతర పుస్తకాల ప్రస్థావన ఉండటం అరుదు.కానీ ఈ నవలలో అనేక పుస్తకాలు గురించి అక్కడక్కడా ప్రస్థావించటం వలన రచయిత్రి మంచి చదువరి అనే విషయం తెలుస్తుంది. రచయిత్రి అనేక సందర్భాలలో స్త్రీవాద దృక్పథాన్నే కాక సంపూర్ణ మానవులుగా బతకాల్సిన విధానాన్ని కూడా పాత్రల సంభాషణల ద్వారా నవలలో ప్రకటించింది.సరిగ్గా అందుకోసమనైనా కాలాతీతవ్యక్తులు నవల చదవాలి.