11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

నడక దారిలో -68

నడక దారిలో -68 నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ డీటీపీ కూడా పూర్తి చేసాను.అనల్ప బలరాంగారికి పి.శ్రీదేవి కథల్ని " వాళ్ళు పాడిన భూపాలరాగం "పేరుతో పి.శ్రీదేవి కథల్నీ,"మథుకలశమ్" పేరుతో ఆమె కవితల్నీ సంపాదక బాధ్యత వహించాను.ఆ పరిచయంతో నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ ని వాళ్ళ బేనర్ పై ప్రచురిస్తారా అని అడుగుతే తప్పక ప్రచురిస్తానని అన్నారు.అయితే మరికొన్ని ప్రచురణలలో బిజీగా వున్నానని అవి అయిపోయాక చేస్తానన్నారు.ఆ పుస్తకానికి పల్లవి చేతే ముఖచిత్రం వేయించుతానని కూడా చెప్పాను.బలరాం సరేనన్నారు.మాలతి రచనలో విశాఖమాండలిక సొబగులే కాక విశాఖసంపంగి పరిమళాలు మనసుని తాకుతూనే వుంటాయని ముఖచిత్రంగా సంపెంగలతోనే డిజైన్ చెయ్యమని పల్లవితో చెప్పాను. ఆకాశవాణిలో పనిచేసే అయినంపూడి శ్రీలక్ష్మి తెలుగు విశ్వవిద్యాలయంలో డెప్యుటేషన్ లో డెప్యూటీ డైరెక్టర్ గా వచ్చింది.ఆమె అక్షరయాన్ అనే మహిళా రచయితల సంస్థని నిర్వహిస్తూ గత కొంతకాలంగా ఏవో వివిధ కార్యక్రమాలు చేస్తూనే వుంది.ఈ సారి తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో డెభ్భై ఏళ్ళ వయసు దాటిన రచయిత్రుల వివరాలు సేకరించి అందులో ఒక ముప్పై మందికి మాతృ వందనం పేరిట సత్కారం చేసే కార్యక్రమానికి పూనుకుంది. అందులో శారదా శ్రీనివాసన్, శారదా అశోక వర్ధన్,డి.కామేశ్వరి,హైమవతీ భీమన్న, అనంతలక్ష్మి,పోల్కంపల్లి శాంతా దేవి, ఇంద్రగంటి జానకీ బాల మొదలైన ముప్పై మందిలో నేను కూడా వున్నాను. ఎండలు బాగా వుండటంతో వీర్రాజు గారిని ఆ కార్యక్రమానికి రావొద్దని చెప్పి నేనూ పల్లవీ వెళ్ళాము.శ్రీలక్ష్మి రంగరంగవైభవంగా ఒక పండుగ వాతావరణాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణానికి తీసుకువచ్చింది.చీర,శాలువా,పళ్ళు,దండలతో ఘనంగా మమ్మల్నందరినీ వైస్ ఛాన్సలర్ చేతులమీదుగా సత్కారకార్యక్రమం నిర్వహించింది.తర్వాత విందుభోజనం ఏర్పాటు కూడా వుంది.అన్నీ అయ్యేసరికి మూడు దాటింది.ఆ సందర్భంగా మరో విషయం కూడా శ్రీలక్ష్మి వెల్లడించింది.ఈ మాతృ వందనం స్వీకరించిన వారినందరినీ వారివారి సౌలభ్యాన్ననుసరించి విశ్వవిద్యాలయం మీడియా థియేటర్లో రచయిత్రుల సాహితీ జీవితాన్ని ముఖాముఖిగా రికార్డు చేస్తామని చెప్పింది .అది చాలా మంచి ప్రయత్నం . చాలామంది పాతతరం రచయిత్రులకు ఇటువంటి అవకాశాలు లేకపోవటం వలన వారిగురించి ఏమీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ‌ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలు విని వీర్రాజుగారు కూడా చాలా సంతోషించారు. రాజమండ్రి దామెర్ల రామారావు చిత్రకళా పరిషత్ లో వీర్రాజు గారి పెయింటింగ్స్ అమర్చటం పూర్తి అయ్యిందని ప్రారంభోత్సవానికి తేదీ నిర్ణయించినట్లు రవిప్రకాష్ ఫోన్ చేసాడు. మేము వెళ్ళటం ఎట్లా అని ఆలోచించాను.ట్రైన్,ఫ్లైట్ అన్నింటిలో ఏదైతే వీర్రాజు గారు ప్రయాణం చేయగలరు అని తర్జనభర్జన చేసాము.ఆయనకి ప్రయాణంలో దారిప్రక్కల చుట్టూ చూసుకుంటూ రాజమండ్రి వెళ్ళాలని వుందని ఒకసారి అన్నారు.అంతేకాక ఇంతవరకూ పాపికొండలు చూడలేదు లాంచిలో వెళ్ళాలనే కోరిక ఎప్పుడో చెప్పింది గుర్తువచ్చి కారులో వెళ్ళాలని నిశ్చయించాం.ఒకసారి కారులో సంగారెడ్డి వెళ్ళి వచ్చాక ఆయనకి అంతసేపు కారులో ప్రయాణం చేయగలననే ధైర్యం వచ్చింది. మార్చి 12 న వుదయమే ఆరు గంటలకి నలుగురం కారులో రాజమండ్రికి బయలుదేరాం.డ్రైవర్ అరుణ్ తో మరీ స్పీడ్ గా కాకుండా నడుపమని చెప్పాము.దారిలో సూర్యాపేటలో టిఫిన్లకని ఆగాము.అరుణ్ దారిలో వీర్రాజుగారిని అవసరమైనపుడు వాష్ రూమ్ కి సహాయం చేసాడు. మధ్యాహ్నం భోజనానికి మరోసారి ఆగి ప్రయాణం కొనసాగించాము.దారిలో కనిపించిన వూర్ల గురించి ప్రత్యేకతలు గురించి వీర్రాజుగారు కబుర్లు చెప్పారు.సాయంత్రం నాలుగింటికల్లా రాజమండ్రి చేరాము. గణేష్ రాం గారు BRK హొటల్ లో రెండు రూములు బుక్ చేసారు.సాయంత్రం రవిప్రకాష్, గణేష్ రాం వాళ్ళూ వచ్చారు.ఆ హొటల్ లో డార్మటరీ లేదంటే గణేష్ రాం వాళ్ళ పెంట్ హౌస్ లో డ్రైవర్ వుంటాడు పర్వాలేదని భరోసా ఇచ్చారు.రాత్రికి పెరుగన్నం హొటల్ నుండి తెప్పించుకుని తిని తొందరగా నిద్ర పోయాము. మర్నాడు ఉదయం పల్లవీ ఆషీ తయారై టిఫిన్ కోసం దగ్గరలో హొటల్స్ చూస్తామని వెళ్ళి వాళ్ళు అక్కడే తినేసి మాకోసం పాక్ చేయించి తీసుకు వచ్చారు. పదింటికి గ్యాలరీకి బయలుదేరి వెళ్ళాము. వాడ్రేవు చిన వీరభద్రుడు గారితో పాటు ఆయన సోదరి వీరలక్ష్మి,వసుధారాణీ వచ్చారు.శ్రీరామ్ పుప్పాల,ఇంద్ర,ఎస్.ఆర్.పృథ్వి మొదలగు స్థానిక రచయితలు వచ్చారు.ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖకు చెందిన వాసిరెడ్డి పద్మ వచ్చారు. గ్యాలరీలో వీర్రాజుగారి పెయింటింగ్స్ అమర్చిన విధానం చూసి వీర్రాజుగారే కాదు మేము కూడా సంబరపడ్డాము.వీర్రాజుగారు చిత్రలేఖనం మెళకువలు నేర్చిన చోట,ఆయనకు అత్యంత ప్రియమైన గోదావరీ తీరాన వాటినన్నింటినీ చేర్చటం మంచిపనే చేసామని తృప్తి చెందాము.ఈ ప్రాంత ప్రజలకు,చిత్రకళాభిమానులకు వీర్రాజుగారి పెయింటింగ్స్ అంకితం చేస్తున్నామని మా కుటుంబం సభ్యులం అంతా సంతోషించాము. విజయనగరం నుండి కళ్యాణ్,జయ,వాళ్ళక్క శాంత,బావగారూ కూడా వచ్చారు. గ్యాలరీ ప్రారంభోత్సవం చేసిన వాడ్రేవు చిన వీరభద్రుడుగారు వీర్రాజుగారితో గల పరిచయాన్ని ఆత్మీయంగా తన ప్రసంగంలో చెప్పారు.వీర్రాజుగారు భావోద్వేగం వలన కొంత ,మరపువలన కొంత తడబడుతూ మాట్లాడారు.నా ప్రసంగంలో వీర్రాజుగారు ఒక మౌనమునిలా ధ్యానముద్రలో రోజుకు ఏడెనిమిది గంటలు కూర్చొని చిత్రాలు వేయటాన్ని గుర్తు తెచ్చుకుంటూ, చిత్రాలు పంపించటంతో బోసిపోయిన అల్మారాలు చిన్నబోయాయని చెప్తూ కంటనీరు పెట్టుకున్నాను. మొత్తంమీద గ్యాలరీలో వీర్రాజుగారి పెయింటింగ్స్ అంకితోత్సవం వైభవంగా జరిగింది.వీర్రాజుగారు ఆనందభరితులయ్యారు.భోజనానంతరం రూమ్ కి వెళ్ళి విశ్రాంతి తీసుకుని గోదావరి తీరానికి వెళ్ళి గోదావరి హారతి కార్యక్రమం చూసాము.సంధ్యాసమయంలో తైలవర్ణచిత్రంలా రంగులీనుతోన్న గోదావరి ఉపరితలాన్ని వీర్రాజుగారే కాక మేమంతా కళ్ళ నిండుగా చూసి ఆనందించాము. నేను రాజమండ్రి బయలుదేరటానికి ముందే డి.సుజాతాదేవి కూతురు కమలకి ఫోన్ చేసి మా కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించాను.సుజాతను చూడటానికి వస్తానని చెప్పాను.సాయంత్రం కమలకి ఫోన్ చేసి ఇంటి అడ్రస్ అడుగుతే తామే వస్తామని చెప్పింది .అలాగే కమల వాళ్లమ్మ సుజాతని మేమున్న హోటలుకు తీసుకువచ్చింది.సుజాత బాగా చిక్కిపోయింది.కానీ నన్ను బాగానే గుర్తుపట్టి మాట్లాడింది. కాని మధ్య మధ్యలో మౌనంలోకి జారిపోవటం చూసి నేను దిగులు పడ్డాను. కమల కూతురు గురించి కమలని అడుగుతే కూతురూ, అల్లుడూ ఇక్కడే వున్నారని కమల చెప్తుంటే.సుజాత కల్పించుకుని" మనవరాలికి సంబంధం కుదిరింది.పెళ్ళి చేయాలి " అంది.అంటే ఆ అమ్మాయికి పెళ్ళి జరిగిపోయిందనేది కూడా గుర్తులేక మాట్లాడుతోందని అర్థమై సుజాతను చూస్తుంటే దుఃఖం వచ్చింది.అదే నేను సుజాతను ఆఖరు సారి చూడటం అవుతుందని అప్పుడు వూహించలేదు . మర్నాడు పాపికొండలు ప్రయాణం పెట్టుకున్నాము.మాతో గణేష్ రాం దంపతులను కూడా ఆహ్వానించాము.డ్రైవర్ అరుణ్ మాతో పాటూనే వున్నాడు.చిన్న బల్లకట్టుమీదుగా లాంఛ్ లోకి వీర్రాజుగారిని ఎక్కించడానికి అరుణే సహాయం చేసాడు. లాంచ్ లో ఎంటర్టైన్మెంట్ కోసం ప్రోగ్రాం నిర్వహించారు.కానీ రెండర్థల పాటలు పిచ్చిగెంతులూ చికాకు అనిపించినా వీర్రాజు గారు గోదావరీ వీక్షణంలో మునిగిపోయి నన్నూ,ఆషీనీ తనకి నచ్చిన దృశ్యాల్ని ఫొటోలు తీయమని అడిగి తీయించారు.మొత్తంమీద పాపికొండల ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసాము. మర్నాడు గణేష్ రాం పెద్ద కారు అరేంజ్ చేసాడు దానిలో రాజమండ్రి పరిసరప్రదేశాలు చూడటానికి వెళ్ళాం. మధ్యాహ్నం వరకు చూసిన తర్వాత గణేష్ రాం శాంతి వర్ధన్ వికలాంగుల ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు.మానసిక వికలాంగులైన పిల్లలు వాళ్ళు చేసిన కాగితం గులాబీలు మాకు అందించి నమస్సులు చెప్పారు.ఒక్కసారిగా మనసంతా ఒక కుదుపు వచ్చినట్లుగా దుఃఖంతో పచ్చిముద్దలా అయింది.కళ్ళు చెమ్మగిల్లాయి. అక్కడే భోజనం ఏర్పాటు చేసారు.తిన్న తర్వాత మళ్ళా దగ్గరలో సూర్యదేవాలయం వుందంటే అది చూసి హొటల్ కు బయలుదేరాము.గణేష్ రాం వాళ్ళింటికి భోజనానికి పిలిచాడు .కానీ పిల్లలను పంపించి మేము ఎప్పట్లాగే పెరుగన్నం తెప్పించుకొని తిన్నాము . ఆ రాత్రి పడుకున్నాం కానీ ఇద్దరికీ నిద్ర రాలేదు.అకస్మాత్తుగా వీర్రాజుగారు నా గుండెల్లో తలదూర్చి వెక్కివెక్కి ఏడవటం మొదలెట్టారు.నేను గాభరా పడి ఏమిటని అడిగితే ఆ మానసిక వికలాంగులను చూస్తే మన బాబు గుర్తు వచ్చాడని ఏడుస్తూనే అన్నారు . అంతవరకూ వుగ్గబెట్టుకున్న నేనుకూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. కాసేపు అయ్యాక వీర్రాజుగారు ఆ ఆశ్రమానికి ఉపయోగపడేలా ఒక లక్షన్నర ఇద్దాం అన్నారు.నేనూ అదే అనుకున్నానని అంగీకారం తెలిపాను.ఆ తర్వాత వీర్రాజుగారు పడుకున్నా చాలా సేపు నాకు నిద్ర పట్టలేదు.బాబు బతికుంటే ఈ పాటికి నలభై ఏళ్ళు దాటి వుండేవి.ఆ వయసు మానసిక వికలాంగుడైన పిల్లాడిని సాకగలిగి వుండగలిగేదాన్నా? నిజానికి అలా జరిగి వుంటే నాలోకి నేను ముడుచుకు పోయి ఏమైపోయేదాన్ని.నన్నూ,నా కలల్ని సాకారం చేసుకోమనే బాబు మా జీవితాల నుండి నిష్క్రమించాడా? ఆలోచించి ఆలోచించి అలసిపోయి నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు బ్రేక్ ఫాస్ట్ కి గణేష్ రాం ఇంటికి వెళ్ళాము. దగ్గరలోనే వీర్రాజుగారి బాల్య మిత్రుడు చింతపంటి అప్పారావు యిల్లు.అతను బెడ్ రిడన్ అని తెలిసి వెళ్ళి చూసి వద్దామని అన్నారు.బెడ్రిడన్ అంటే ఏ పరిస్థితుల్లో వున్నాడో? వీర్రాజు గారు తట్టుకోగలరో లేదో అని వెళ్ళటానికి భయపడ్డాను.కానీ వీర్రాజుగారు ఇంతవరకూ వచ్చి చూడటానికి వెళ్ళకపోతే ఎలా అని పట్టుపట్టే సరికి వెళ్ళాము.అప్పారావుగారు బాగానే వున్నారు.నన్నూ, పల్లవినీ గుర్తుపట్టి చక్కగా పలకరించారు.కాసేపు మిత్రులు మాట్లాడుకున్నాక బయల్దేరాము. గణేష్ రాం గారి తోటలో పండిన పళ్ళు,కాయలతో కారు డిక్కీ నిండిపోయింది.దారిలో తినటానికి దబ్బకాయ పులిహోర, జున్ను,పెరుగుగారెలు లలిత ఇచ్చింది.దారిలో తినగా ఇంటికి వెళ్ళాక డిన్నర్ కి కూడా అవే సరిపోయాయి.క్షేమంగా మా ప్రయాణం జరిగింది. నాలుగు రోజులకు కళ్యాణ్ విశాలాంధ్ర పేపర్లో చిన్నాన్న గారి పెయింటింగ్స్ గ్యాలరీలో ప్రారంభం గురించి రాసిన వ్యాసం అని పేపర్ కటింగ్ పంపించాడు." గుండె గ్యాలరీలో శీలావీ చిత్రాలు" అనే ఆర్టికల్ వీర్రాజుగారికి చదివి వినిపించాను.చక్రవాకం కాలమ్ లో ముక్కామల చక్రధర్ అనే ఆయన రాసినది.బాగా రాసాడని వీర్రాజుగారు సంబరపడ్డారు.రామోజీమీద పుస్తకం రాసినది అతనేనేమో అన్నారు.ముక్కామల చక్రధర్ పేరు క్రింద ఫోన్ నెంబర్ వుంటే ఫోన్ చేసాను. రామోజీ మీద రాసిన అతను వేరే అని తెలిసింది.ఇతను విశాలాంధ్రలో ప్రతి శనివారం చక్రవాకం పేరుతో కాలమ్ రాస్తానని చెప్పారు.అప్పటినుండీ ముక్కామల చక్రధర్ ఫోన్లో కాంటాక్ట్ లోనే వుండటం, విశాలాంధ్రలో ప్రతీ శనివారం చక్రవాకం కాలమ్ పంపుతుంటే క్రమం తప్పకుండా చదువుతూనే వున్నాను. రాజమండ్రి నుంచి వచ్చిన దగ్గర నుంచి చిన్ననాటి మిత్రుడు సత్యనారాయణను చూడటానికి వెళ్దామని పదేపదే అనటం మొదలు పెట్టారు.వేసవి ఎండలు ముదురుతున్నాయి.సత్యనారాయణ వుండేది ప్రగతి రిసార్ట్ లో కట్టించిన ఇంట్లో.సత్యనారాయణ గత ఆరేడు నెలలుగా తీవ్రఅనారోగ్యం వలన తరుచూ హాస్పిటల్ కీ,ఇంటికీ మధ్య తిరుగుతూ వున్నాడు.తరుచూ స్నేహితులు ఇద్దరూ వీడియో కాల్ ద్వారా మాట్లాడు వుంటూనే వున్నారు.అందుకని ఎండలు తగ్గిన తర్వాత వెళ్దామని నేను సర్ది చెప్పి బోయాను.కానీ వీర్రాజుగారు మొండిపట్టు పట్టారు. ఒకరోజు ధర్మేంద్రకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న ఇంట్లోవున్నారా,హాస్పిటల్ లో వున్నారో కనుక్కుని మేము వస్తామని ఫోన్ చేసాను.ఇంట్లోనే వున్నారని తెలిసి నేనూ, వీర్రాజుగారూ ప్రగతి గార్డెన్స్ లో వున్న ధర్మేంద్ర ఇంటికి వీర్రాజుగారి బాల్య మిత్రుడు సత్యనారాయణని చూడటానికి వెళ్ళాము.చాలా సన్నగా అయిపోయి వీల్ ఛైర్ లోనే వున్నాడు. సత్యనారాయణ భార్యా హైమా, ధర్మేంద్ర ఆయన అనారోగ్యం గురించి చెప్తుంటే నాకూ, వీర్రాజు గారికీ కూడా మనసంతా బాధతో నిండిపోయింది.కొంతసేపు కబర్లు అవీ అయ్యాక " వీర్రాజూ మెర్సీ కిల్లింగ్ కు ఎలా సంప్రదించాలో కనుక్కుని చెప్తావా "అని సత్యనారాయణ అనేసరికి వీర్రాజుగారూ,నేనూ దిగ్భ్రమతో అలానే వుండిపోయాము.రెండు నిముషాలకీ నేనే తేరుకుని " అదేం మాటలండీ.శరీరం అన్నాక ఏవో అనారోగ్యాలు వస్తూనేవుంటాయి.అలాంటి నిర్ణయాలు మనసులోకి రానీకండీ"అని సీరియస్ గా అన్నాను.వీర్రాజుగారు కూడ నా మాటలను బలపరుస్తూ సత్యనారాయణ ను సముదాయించారు."ఇలాగేనండీ పదేపదే అంటూ ఆయన బాధపడి మమ్మల్ని బాధిస్తున్నారు" అంది హైమ. " లేదు వీర్రాజు ఎక్కడికక్కడ శరీరంమీద వివిధ చికిత్సల కోసం ట్యూబులు పెట్టి ఇంజెక్షన్లతో ఒళ్ళంతా చిల్లులు పొడి చేస్తున్నారు.భరించలేకపోతున్నాను"అంటూ నిస్పృహతో మాట్లాడారు.హైమకూడ ఇలాగే నిస్పృహతో మాటిమాటికీ అంటున్నారని బాధ పడింది. మరో రెండుగంటలు అక్కడే ధైర్యం చెబుతూ గడిపి వీడ్కోలు చెప్పి ఇంటికి తిరిగి వచ్చాము.సత్యనారాయణ కోడలూ,మనవరాళ్ళూ తాతా నాన్నమ్మలతో అంటీముట్టనట్లు వుండటం గమనించాము.ఇంటికి వచ్చాక కూడా సత్యనారాయణ ,హైమాల జీవన పరిస్థితుల గురించి తలుచుకుంటూ బెంగ పడ్డాము. - శీలా సుభద్రాదేవి

ప్రసాద మూర్తి - సగంపిట్ట కథలు

~ సౌజన్య(ప్రసాద)మూర్తి పలవరింతే " సగంపిట్ట"కథలు~ "జీవిత తత్వాన్నీ దాని కీలకాల్నీ అర్థంచేసుకున్న ఆలోచనాపరుడి కథలివి. ఈ దుర్మార్గ సమాజంలో కుల, మత, లింగ, వర్గ భేదాలతో ముక్కలై గ్లోబలీకరించబడిన ఈనాటి జీవితంలో ఒక్కొక్క బతుకు ముక్క ఒక్కొక్క రూపంలో కనిపించే వాస్తవాన్ని బలంగా పట్టుకున్న కథలివి. జీవితాన్ని ముందుకు నడిపించే చైతన్యాన్ని నిరాడంబరంగా వ్యక్తీకరించిన కథలివి." అంటారు ప్రసాద మూర్తి కథలసంపుటి ' సగంపిట్ట'ముందుమాట లో-జి. లక్ష్మీనరసయ్యగారు. కవిత్వంలో వస్తువేదైనా దానికి అనుగుణమైన భావాన్ని అద్భుతంగా పొదగగల నైపుణ్యం, చదువరులకు హత్తుకునేలా సమకాలీన సమస్యలనూ కవితామయం చెయ్యగల కవిగానే ఇన్నాళ్ళూ ప్రసాదమూర్తి కనిపించారు. తన చిన్నప్పటి ఊరు గురించి రాసినా,కురిసిన వాన గురించి రాసినా పసివాడిలా పలవరిస్తాడు.తర్వాత రోజుల్లో నివసించిన నగరజీవితం అతడిలోని సున్నితత్వాన్ని,భావుకత్వాన్నీ, సౌకుమార్యాన్ని కబళించలేదు అనేది అతడి ప్రతి కవితలోనూ సుస్పష్టమౌతూనే వుంటుంది. ప్రసాద మూర్తికి సమాజం వేరు కవిత్వం వేరు కాదు. కవితా దృష్టి, సామాజిక చైతన్యం రెండూ ఒకదానిలో ఒకటి అంతర్లీనంగా సాగేదే అతని కవిత్వం. ఇలా ఇంతకాలం ఒక కలనేత కవిగానే చూసి,పూలండోయ్ పూలు అంటూ అందించిన అతని బుట్టెడు కవిత్వ పరిమళాల్నీ హత్తుకున్నాను,దాంతో బాటూ కంటిచూపుకి తగిలి చురుక్కుమనిపించిన ఘాటైన పొగలకీ వుక్కిరి బిక్కిరి అయ్యాను. సగంపిట్ట మా లైబ్రరీలోకి వచ్చి ఎప్పుడు దూరిందో కానీ ఇటీవలే నా చేతిలో వాలింది‌.ఇదేమిటండీ బాబూ సగం పిట్ట కాదు మనల్ని పూర్తి పిట్టల్ని చేసి ప్రకృతి ఆవరణాల్లోకో, సమాజం మూలాల్లోకో ,లేకుంటే మనలోకి మనల్నో నెట్టేసి ఆలోచనల్ని,మనజీవితాల్నీ తడుముకునేలా చేసేస్తాడు ఈ రచయిత. అందుకే "పూర్తి పిట్ట రాసిన కథలివి. మరందుకే " ప్రకృతిపట్ల అపారప్రేమతో, ఘనీభవించిన మానవుడిపట్ల తీవ్రనిరసనతో, కవి హృదయంలో మొలకెత్తిన ఈ కథలు చదువరుల గుండెల్లో పుష్పిస్తాయి. భుజాన చెయ్యెయ్యడంతో ప్రారంభమై ధడేల్ ధడేల్మని మన తలుపుల్ని తెరిచి కానీ వదలవు. సరళంగా సూటిగా స్నేహభాషణలా సాగే కథనం- మరచిపోయిన మనలోపలి ప్రాంతంలో మనల్ని సుకుమారంగా వొదిలేసి వీడ్కోలు తీసుకుంటుంది" రమణజీవి అన్నారనుకుంటాను. మొదటి కథ అనామక మరణం చదివేటప్పటికే గుండె పట్టేస్తుంది.నిజమే ప్రతీ మనిషిలోనూ ఒక అనామకుడు దాగే వుంటాడు.ప్రతీరోజూ పసిపిల్లలను రక్తసిక్తల్ని చేస్తున్నవార్తలో,యుద్ధాలలో అమాయకపసిప్రాణాల్ని , గర్భస్థ శిశువుల్ని బలిగొన్న వార్తల్నో, గోధ్రా సంఘటనల్ని కడుపులో పేగుల్ని నులిమేసే వార్తల్నో వింటూనే వుంటాం.అల్జిమీర్స్ వచ్చిన వాళ్ళలా మర్చిపోవటానికి ప్రయత్నాలు చేస్తాం.మర్చిపోలేం మనలోని మనిషి మరణిస్తే తప్ప .అదెప్పుడు జరుగుతుంది ఈద్వైదీ భావాన్నే ప్రసాద మూర్తి తనకథలో రచయిత రాయాలనుకున్న కథలో అద్భుతంగా చిత్రించిన కథ అది. ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్నీ, తనకు సంబంధించిన దానిగా తనలో ఆవాహన చేసుకుని మానవీయ సంబంధాల్లోంచే చూసే సౌజన్యమూర్తి ప్రసాదమూర్తి.మనిషి సంఘజీవి అని నమ్మిన కథకుడు సమాజంలో జరుగుతోన్న దుర్ఘటనలకు కదిలిపోతాడు.నిజానికి ఈ కథ దీర్ఘ కవిత్వంలా సాగుతుంది పల్లెలో పనుల్లేక నగరబాట పట్టిన "బంగారమ్మ" చాలాకాలానికి సంక్రాంతి పండుగకి పల్లెటూరికి వస్తుంది.తమ అరెకరం పొలాన్ని కళ్ళారా చూసుకోవాలని బయలుదేరిన బంగారమ్మతో పాఠకులు కూడా నడుస్తారు.దారిపొడవునా కలలో నడుస్తున్నట్లు నడుస్తూ గతాన్ని పునశ్చరణ చేసుకుంటున్న బంగారమ్మతో బాటూ పాఠకులూ ఆ దృశ్యాల్ని కలగంటారు.తన అరెకరం పొలంకోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ చేపలు చెరువులోనే అదృశ్యమై మర్నాడు పైకి తేలిన బంగారమ్మ కథగా చెప్పినా పైకి తేలని బతుకులెన్నో ఆ పంక్తులలో పాఠకులకు దర్శనమిస్తాయి.ప్రకృతినిప్రేమించే భావుకుడైన ప్రసాద మూర్తి ప్రతీ వాక్యాన్ని హృదయభాషలో రాసాడనిపిస్తుంది. చేపలూ,రొయ్యల్తో పసరెక్కిపోయి చెరువులైపోయిన పొలాల్నీ ,చేపల కోసం వస్తున్న పిట్టల్ని తరమటానికి పేల్చే తుపాకి శబ్దాల్ని పాఠకులూ వింటారు. పల్లెల్లో సైతం గడ్డిలేక ఎండిపోతోన్న పశువులకు గడ్డి ,చెరువులు లేక మంచినీళ్ళనూ బయటనుండి కొనుక్కొని రావాల్సిన దుస్థితి , విధ్వంసం అయిపోతున్న పల్లెల ముఖచిత్రాన్ని ఈ కథలోని పంక్తులు దృశ్యీకరణచేస్తాయి. పరుగులు తీస్తున్న కాలంతో పాటూ పరుగులు తీస్తున్న మనిషికి పక్కనే వున్నవారిని పట్టించుకునే తీరికాలేదు.మనసూ లేదు.తన చుట్టూ తానే పరిథులు గీసుకుని బతుకుతున్న మనుషుల మధ్య గోడలు పెరిగిపోతున్నాయి.ఆ దృశ్యమే ఈ " పక్కన కూర్చున్న వ్యక్తి" కథ రైల్వే స్టేషన్ లో ఓ మూల రెండు ముసలిబొమ్మలు ఎడమచేతుల్ని చాచి వుండటం కథకుడు ప్రతీరోజూ గమనిస్తాడు.ఆ చాచిన చేతులు అందుకొని పిల్లలు తమని తీసుకు వెళ్తారనేమో అనుకుంటాడు.వాళ్ళకు కొంత డబ్బు సేకరించి ఇచ్చి భరోసా కల్పించాలనుకుంటాడు. కథకుడు నివసించే కమ్యూనిటీలో రామారావు దంపతులు పిల్లల ఫోన్ కాల్స్ కోసం అడుక్కుంటూ ఉన్న ముసలి బొమ్మలు,సుందరం దంపతులు పిల్లల నుంచి కాసింత సమయాన్ని అడుక్కుంటూ ఉన్న ముసలి బొమ్మలు.ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వున్నా ఏటిఎమ్ కు పోయి డబ్బు తెచ్చుకోలేని ఎన్నో ముసలి బొమ్మలు.ఇవన్నీ చదువుతుంటే దేశమే ఒక వృద్ధాశ్రమంగా మారిన దుస్థితి గుర్తుకువస్తుంది.అఃదర్నీ సంప్రదించి డబ్బు సేకరించి స్టేషన్లో ముసలిబొమ్మలకీ ఇవ్వాలనే తమ వుద్దేశ్యం చెప్పకుండా వాళ్ళు చూసేందుకు చాలా ముసలి బొమ్మలు రాబోతున్నాయని చెప్పేసరికి స్టేషన్ లోని ముసలి బొమ్మలు తమకు స్థాన భ్రంశం చేస్తారేమోనని ముందే వెళ్ళిపోతారు.అనేకవిధాలుగా ఒంటరివృద్ధాప్యాన్ని రచయిత కవితాత్మకంగా చెప్పాడు. ఆంధ్రా తెలంగాణ విభజన నేపధ్యంలోని కథ జన్మభూమి.ఏ ప్రాంతమైనా దోచుకునేవారు ఎవరైనా దోపిడికి గురైన వారు మాత్రం ఎప్పుడూ ప్రజలే.అందుకే ఒకప్పుడు వలస పక్షుల రాకతో ప్రత్యేకత కలిగిన కొల్లేరు సరస్సు ఈ నాడు నామరూపాలు లేకుండా విధ్వంసానికి గురైంది.వివక్షలూ అలాగే వూరి చివరనే యథాతథంగా వుండిపోతూనే వున్నాయి. వందరెక్కలు వున్నా సరే స్త్రీ తనకు తానుగా ఎగిరిపోవాలనే ఆలోచనే రాకుండా పిల్లలూ,కుటుంబం,బాధ్యతలూ ఆ రెక్కల కిందనే భద్రంగా దాచుకుంటూనే వుంటుంది.మనసు గాయపడినప్పుడో ,ఒంటరిగా మిగిలిపోయినప్పుడో ఒక్కొక్క రెక్కే విరుచుకోవాలనుకుంటుంది. కాలాతీతవ్యక్తులు నవలలో ఇందిర "రెక్కలున్నాయనుకొని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అవి తడిసిపోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది."అంటుంది. ఈ కథలో కూడా ఎగిరిపోతుందేమోనని అనుమానంతో అమ్మకు ఒకతోడుకోసం సహకరించాలనుకున్న పిల్లలకు "ఒకసారి పెళ్ళిచేసుకుని అనుభవించిన దానిని,మళ్ళా ఆ రొంపిలో వెళ్ళాలనుకోవటంలేదు." అంటుంది.స్త్రీ దృష్టి కోణంలో స్త్రీ మనసులోని ఆలోచనలను ఒడిసిపట్టి రాసిన కథ" వందరెక్కల స్త్రీ" బసమ్మ చెవిపోగులే కాదు చెమటతో తడిచిన తాళిబొట్లని సైతం కుదువ పెట్టుకొని బడుగు వర్గాల స్త్రీ పురుషుల జీవితాల్ని మత్తులో ముంచేసే కల్లు కాంపౌండ్ లకు అదుపు ఎక్కడ. గుజరాత్ లో మతకల్లోలపు మారణహోమం సాగిన రోజులవి. గోద్రా రైలు దుర్ఘటన తర్వాత గుజరాత్ లో జరిగిన హింసాత్మక అల్లర్లు కుటుంబంతో "రైలు ప్రయాణం " చేస్తున్న కథకుడికి ఒక్కటొక్కటే గుర్తుకు రావడం ప్రారంభమైంది. చెప్పులూ, సామానేకాదు పిల్లల్ని ఎత్తుకుపోవడంలో ఎత్తుకు పైఎత్తులు వేసేవాళ్ళకి రైలుబళ్ళు నిలయాలు. కంటిమీద కునుకు పట్టని కథకుడికి ఆ పెట్టిలోకి ఎక్కిన ముస్లిం యువజంటని చూసేసరికి ఉగ్రవాదులేమోనని గుండె దడదడ లాడుతుంది.చివరికి ఏమీ జరగకుండా ప్రయాణం పూర్తి అవుతుంది. కుల,మత,జెండర్, ప్రాంతీయ వివక్షలతో పక్కనే వున్న వ్యక్తిని అనుమానిస్తూ భయపడేలా చేసినది ఈ వ్యవస్థే అనే ఎరుక కలిగించేకథ ఇది. ఇలా ప్రసాద మూర్తి రాసిన కథలన్నింటిలో కొన్నిచోట్ల పేరాలకు పేరాలు కవితాత్మకంగా పాఠకుల్ని ఆకట్టుకుంటాయి.కవి సున్నిత హృదయం ప్రతీ కథలోనూ కనిపిస్తుంది. మానవ తప్పిదాలు వలన విధ్వంసం అయిపోతున్న ప్రకృతి దృశ్యాలు,,అనేక విధాలుగా మానవ స్వార్థంతోనే కాలుష్యభరితమైపోతోన్న పర్యావరణం,దాంతో బాటుగా మారిపోతున్న జీవనవిధానాలూ,తప్పని పరిస్థితుల్లో యాంత్రికంగా మారుతోన్న మనిషిని చూసి ఆవేదన చెందుతాడు.ఏమీ చేయలేని అసహాయత తో ఆక్రోశం చెందుతాడు.సమాజంలో పసిపిల్లల మీదా,స్త్రీలమీదా జరుగుతోన్న లైంగిక దాడులకు తల్లడిల్లుతాడు,జాతిమత వివక్షలకు బలి అయిపోతోన్న అసహాయులను చూసి కుంగిపోతాడు. ఇదిగో ఇవన్నింటినీ దృశ్యాలు దృశ్యాలుగా చిత్రించి ఈ కథలన్నింటా పేర్చాడు.ఇవన్నీ చూస్తూ కూడా మనం పరిధులు చుట్టుకుని అల్జిమీర్స్ వచ్చిన వారిలా ఏంకానట్టుగా మర్చిపోయి ఎలా బతకగల్గుతున్నామని వాపోతాడు రచయిత. మరి అందుకే పాఠకులు కూడా ఒక్కొక్క కథా చదువుతూ ఇంకా మనం మనుషులుగానే వున్నామా అని అనుమానపడతారు. పూలండోయ్ పూలు లో మనుషులంతా పూలైపోవాలని కలవరించిన రచయిత కనుకే సువర్ణ గన్నేరు పూలు లాంటి కథ రాయగల్గాడు.ప్రకృతి ఏదీ తిరిగి ఆశించదనే సత్యాన్ని అన్వేషించినవాడై చెట్టే చేతులు పట్టుకొని తీసుకెళ్ళినట్లుగా అనాథాశ్రమంలో ప్రవేశిస్తాడు.ఫాల్గుణమాసంమొదలైందంటే ఆ దంపతులు గుండెల్లోను పూలువిచ్చుకున్న చప్పుళ్ళు వినబడతాయి. కథలన్నింటా కథకుడు ఎలా కలవరించాడో చదివిన తర్వాత వెంటాడుతోన్న ఈ కథలన్నీ ఛానెల్స్ లోను,వార్తా పత్రికలలోనూ తిరిగి తిరిగి కనబడుతోంటే పాఠకులు కూడా కొండలు గుట్టలు అడవులు ధ్వంసం చేసి కట్టిన హై రేంజ్ అంతస్థులలోని కృత్రిమ వనాల్లో పూర్తి పిట్టలై ఎగరలేక సగంపిట్టలై పలవరిస్తారు,తమ అసహాయతకు సిగ్గు పడతారు.మానవ సంబంధాల్నీ, మనిషి బ్రతుకునీ ఉన్నతీకరించడంపై కథకుడికి గల అమితమైన శ్రద్ధ వలనే పూలతోనో,చేలతోనో, చెట్లతోనో,పిట్టలతోనో మనిషికి పాఠం చెప్పిస్తాడు. చాలా వరకూ ఉత్తమ పురుషలోనే రాసిన " సగం పిట్ట "కథలు ప్రసాదమూర్తి సాత్వికుడైన కవి కావటం వలన కావచ్చు సున్నితంగా,సరళమైన శైలిలోనే రాసినా నిజానికి ఆ పాఠాలు పాఠకుల హృదయాలను కూడా పట్టి కుదుపుతాయి. - శీలా సుభద్రాదేవి సృజనక క్రాంతి