13, జులై 2026, సోమవారం
నడక దారిలో -67
నడక దారిలో -67
కరోనా విజృంభణ ఎదుర్కొని అప్పుడప్పుడే వూపిరి తీసుకుంటున్న ప్రజలకి కొత్త సంవత్సరం కొత్త ఆశల్ని మేల్కొల్పుతూ కొత్తవూపిరులూదింది.
జనవరిలోబొమ్మలకొలువు హడావుడి వుంటుంది కనుక రచనలు తగ్గిపోతాయి.అయినా కరోనా కాలంలో చాలానే కవితలైతే చేసాను. చదవటం కొనసాగుతూనే వుంటుంది.ఎటొచ్చి ఇప్పుడు నారాయణరెడ్డి ట్రస్ట్ పుస్తకాలు ఎంపిక పని వలన ఇతర పుస్తకాలు చదవటానికి కుదరటం లేదు.ఇంచుమించుగా వాటిని చదవటం పూర్తి అయ్యింది.
" ఇన్ని పుస్తకాలు ఉంటాయనుకుంటే ఒప్పుకోకుండా వుండాల్సింది.నీ సమయం అంతా దీనికే అయిపోతుంది కదా! పోనీ రెమ్యునరేషన్ అయినా ఇస్తారో లేదో తెలియదు "అనేవారు వీర్రాజు గారు.
ఎప్పటిలాగే బొమ్మలకొలువు పెట్టటం, బిల్డింగ్ లో వాళ్ళూ, బంధుమిత్రులు రావటంతో ఆ వారం అంతా సందడిగా అయిపోయింది.
తర్వాత రోజు ఉదయమే చిన్న మరిది తోడల్లుడు చనిపోయాడని ఫోన్ వచ్చింది.చాలాకాలంగా అనారోగ్యంగా వున్నా బాగానే వున్నాడని రెండురోజులముందే బొమ్మలకొలువు చూడటానికి వచ్చిన అతని భార్య సంధ్య చెప్పింది.ఆంతలో ఇలా జరగటం నిజానికి ఒక షాకే.వాళ్ళ చిన్నమ్మాయి యూ ఎస్ లో వుంటుంది.వచ్చే పరిస్థితి లేదు.దగ్గర్లో వుండే మా మరిదీ ,తోటికోడలూకూడా యూ ఎస్ లోనే వున్నారు.హుటాహుటీన పల్లవీ, నేనూ వాళ్ళింటికి వెళ్ళాము. మా మరిదికోసం,వాళ్ళ చిన్నమ్మాయి కోసం మనవరాలు ఫోన్లో వీడియో కాల్ పెట్టి పరిస్థితి అంతటినీ చూపిస్తుంది.అది చూసి నాకు దిగులైంది.
చదువుకూ,వుద్యోగాలకూ పిల్లల్ని విదేశాలు పంపించేసి ఇక్కడ తల్లిదండ్రులు దిక్కులేని వారిలా అత్యవసర సమయంలో ఒంటరి వాళ్ళైపోతున్నారు .
అందులోనూ ఇంకా కోవిడ్ భయం వెంటాడుతూనే వుంది.వేరియంట్స్ గా మారుతూనే వుంది.మూడోరోజు దినాలు కూడా వెళ్ళి వచ్చాం.అయిదురోజులు అయ్యేటప్పటికి నాకు తలనొప్పి వళ్ళునొప్పి మొదలైంది.డా.సూర్యప్రకాష్ గారు ఇప్పుడు వొమిక్రాన్ వేరియంట్ వూర్లో వుంది.
ఐసొలేట్ అయిపోతే మంచిదని చెప్పి వాడాల్సిన మందులు చెప్తే వాడటం మొదలు పెట్టాను.మూడురోజులకే నాకు నార్మల్ కి వచ్చింది.కానీ మరో రెండు రోజులు కి పల్లవికి జ్వరం మొదలైంది.ఇమ్యూనిటి పల్లవికి తగ్గిందనుకుంటాను.అందుకే ఏడాదికే మళ్ళా వచ్చేసింది.ఇక ఈ జ్వరాలతో దినాలకు రాలేమని సంధ్య కూతురు రేఖకి ఫోన్ చేసాము.
జ్వరాలవీ తగ్గినా నీరసం చాలా కాలమే వుంటుంది.కోవిడ్ అంతే మరి. మాకు వచ్చిన జ్వరాల అనుభవాలతో మళ్ళా మళ్ళా కొత్త రూపాలతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూనే వుందనిపించింది.
అందుకే ఈ సారి కూడా మాడభూషి పురస్కారాలు వాయిదా వేసి వచ్చే ఏడాది అన్నీ కలిపి నిర్వహించుకుందామని వీర్రాజు గారు లలితా దేవిని వప్పించారు.
రాజమండ్రి దామెర్ల చిత్రకళా పరిషత్ లో వీర్రాజు గారి పెయింటింగ్స్ ఫిక్స్ చేయాలంటే ఇనుప రాడ్స్ తో రెండు స్థంబాల మధ్యా స్క్రీన్ పెట్టాలని ,ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయాలని అంటే విడతల వారీగా ఒక ఎనభై వేల వరకూ పంపించాల్సి వచ్చింది.అయితే అక్కడ జరుగుతోన్న పనిని ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు రవి పపుతుండటంతో డబ్బు ఏమీ వృధా కావటం లేదులే అనుకున్నాము.గ్యాలరీ ప్రారంభం గురించి సంప్రదిస్తే వీర్రాజుగారు "నేనిప్పుడు రాలేను.వాడ్రేవు చినవీరభద్రుడుగారితో ప్రారంభోత్సవం చేయించు" అని రవిప్రకాష్ కి ఫోన్ చేసారు.అయితే వీరభద్రుడు గారు మాత్రం "వీర్రాజుగారు ఎప్పుడు వస్తే అప్పుడే ప్రారంభోత్సవం చేద్దాం" అన్నారు.
ప్రపంచీకరణ ప్రభావంతో ఏ దేశానికి ఆ దేశపు పండుగలతో పాటూ ప్రపంచమంతా చేసుకునే కొత్త పండుగలు వచ్చాయి.అటువంటి వాటిలో ఫిబ్రవరి పధ్నాలుగున యువతరమంతా జరుపుకునే ప్రేమికుల రోజు ఒకటి.
ఆ రోజు ప్రేమికుల రోజుని తెలియని కాలంలో ఇద్దరం ఇష్టపడి ఒకటైన రోజు.జీవితంలో ఎన్నో అనుకూలతలు,ప్రతికూలతలు మధ్య ఎన్నో పూలూ,ముళ్ళను దాటుకుంటూ ఈ నాటికి యాభై దాటి మరొక్క ఏడాది కూడా గడిచింది.మేము ఇద్దరం ఒకసారి గుర్తు చేసుకోవటమే తప్ప పెళ్ళిరోజు
జరుపుకోవటం మానేసి చాలా ఏళ్ళే అయింది.
తెలంగాణా సారస్వత పరిషత్తు నుండి చెన్నయ్యగారు వీర్రాజుగారికి ఫోన్ చేసి తన జీవితం సాహిత్యం గురించి పరిణతి వాణి ప్రసంగం చేయాల్సిందిగా ఆహ్వానించారు.గంటసమయంలో అన్ని విషయాలూ చెప్పలేకపోయినా ప్రసంగం వ్యాసాన్ని సమగ్రంగా రాసి పంపమని తెలియజేసారు.
ఇటీవల రాయటం కొంత అలవాటు తప్పిపోవటం వల్లా,వయసు చేత కొంత జ్ణాపకశక్తి తగ్గుతూ వుండటం వల్లా ఒక్కొక్కటే బాల్యం నుండి గుర్తు చేసుకుని రాయటానికి వీర్రాజుగారు కొంచెం కష్టపడటం చూసి మనసులో నాకు బెంగగా అనిపించింది.చెక్కినట్లుగా వుండే అందమైన దస్తూరికూడా చెదిరినట్లైంది.మామూలుగానే రచన ఏదైనా ఒక విడతలో వీర్రాజుగారు రాయరు.పర్ఫెక్టుగా వచ్చేవరకూ రచన పదే పదే రాయటం,రాసినది కొట్టేసి మళ్ళా రాయటం ఆయనకు అలవాటే.అయినా ఇప్పుడు మాత్రం రాతలో తడబాటు అర్థం అవుతూనే వుంది.మొత్తం మీద తన జీవితం, సాహిత్యం పరిణతవాణికోసం రాయటం పూర్తి చేసారు.దానిని స్కాన్ చేసి చెన్నయ్య గారికి పంపించేసాను.ఇక ప్రసంగం చేయాల్సి ఉంది.
ఒక ఆదివారం ఉదయం పదిగంటలకు సారస్వత పరిషత్తుకి మేమిద్దరం వెళ్ళాము.కందుకూరి శ్రీరాములు,శంకరం, సిధారెడ్డి మొదలైన ఆత్మీయ మిత్రులు వచ్చారు.ప్రచారం ఎక్కువగా చేయకపోవటం వలనో,ఎందుచేతనో సభలో ఎక్కువ మంది వుండరు.
చేతిలో పాయింట్స్ కాగితంమీద రాసుకుని వెళ్ళినా అవి చూడకుండానే వీర్రాజుగారు ప్రసంగించారు. కానీ చాలా వరకూ తడబడుతూనే మాట్లాడారు.వయసువలన ఆయన మర్చిపోతున్నారనేది అర్థమైంది.
కె. గీత తన నెచ్చెలి పత్రిక కోసం ఒక రోజు ఫోన్ చేసినన్ను ఇంటర్వ్యూ చేస్తానంది.అదే విధంగా
ఒక గంటసేపు సమగ్రమైన ఇంటర్వ్యూ జూమ్ ద్వారా చేసింది.ఇంటర్వ్యూ తర్వాత కాసేపు పర్సనల్ గా మాట్లాడుకున్నాము.నేను మానసికంగా డిసేబుల్డ్ అయిన బాబును పెంచటంలో మూడున్నర సంవత్సరాలు అనుభవించిన బాధ మరువలేనిది. గీతకూడా ఆ పరిస్థితి గురించి చెప్తుంటే మనసంతా బరువెక్కి దుఃఖం కంఠంలో వుండకట్టినట్లయ్యింది.ఒకవైపు వుద్యోగం బాధ్యత నిర్వహిస్తూనే మరోవైపు పత్రికానిర్వహణ, సాహిత్య సృజన ,టోరీ రేడియో, సాహిత్య వీక్షణం ఇలా ఇన్ని బాధ్యతలు ఈ అమ్మాయి ఎలా నిర్వహిస్తూ ఉంది.ఈ గీత మనిషా,రోబోటా అనేది నాకు వూహకి అందలేదు.మనసారా ఆమెకి అభినందనలు తెలియజేసాను.
అప్పట్లోనే చెన్నై విశ్వవిద్యాలయంనుండి మాడభూషి సంపత్ కుమార్ గారు కూడా నన్ను ఆన్లైన్ లోనే సమగ్రమైన ఇంటర్వ్యూ చేయడమే కాక నా జీవితం సాహిత్యం మొత్తం వ్యాసంగా రాసి పంపమని కోరటం మరో విశేషమే.
ఒకరోజు పి.సత్యవతిగారు నాకు ఫోన్ చేసి "అన్వర్ అని ఒక అబ్బాయి మీకు ఫోన్ చేసి మీ ఇంటికి ఒక పుస్తకం కోసం వస్తాడు.అన్వర్ మంచిఅబ్బాయే. " అన్నారు.సరేనన్నాను.అంతలో అన్వర్ ఫోన్ చేసి "పోలాప్రగడ సత్యనారాయణ మూర్తిగారి "ఆ రోజుల్లో " పుస్తకం కావాలి.సత్యవతిగారు మీ దగ్గర పుస్తకం దొరుకుతుంది అన్నారు.మీ దగ్గర వుందా.ఉంటే వచ్చి తీసుకుని.చదివి మళ్ళా భద్రంగా ఇచ్చేస్తాను " అన్నాడు.ఉందని చెప్పి మా ఇంటి లోకేషన్ షేర్ చేసాను.
వీర్రాజుగారు 'అన్వర్ ఎవరు ?' అన్నారు.'కవి అనుకుంటాను .కవితలు పత్రికలలో చూసాను ' అన్నాను.
మరొక అతనితో కలిసి అన్వర్ వచ్చాడు.అతను అడిగిన పోలాప్రగడ రాసిన ఆరోజుల్లో పుస్తకం ఇచ్చాము.అతను మొహమాటంగా అతని " ఒక చిత్రకారుని రేఖాయాత్ర" పుస్తకం వీర్రాజుగారికి ఇచ్చాడు.పుస్తకం గెటప్ అది అద్భుతంగా ఉండటంతో ప్రింటింగ్ గురించి సమాచారం అడుగుతే ఇప్పుడు డిజిటల్ ప్రింటింగ్ పద్ధతి వచ్చిందని ఎన్ని కాపీలు అవసరమైతే అన్నే ప్రింట్ చేసుకోవచ్చని చెప్పాడు.అయితే అప్పటికీ అన్వర్ కవేనా,రచయితా,చిత్రకారుడా అనేది మాకింకా అర్థం కాలేదు.సాక్షిలో వుద్యోగం అన్నాడు.అంతే తెలిసింది.అంతకన్నా వివరాలు అడగటానికి మాకూ మొహమాటం.
ఓ రెండు రోజుల్లో అన్వర్ ఇచ్చిన పుస్తకం వీర్రాజుగారు చదివి "సుభద్రా ఈ అన్వర్ చిత్రకారుడే కాక మంచి రచయిత కూడా.ఈ పుస్తకం అద్భుతంగా రాసాడు.నువ్వూ చదువు.ఇందులో చిత్రాలు చాలా బాగున్నాయి.చక్కటి లైన్ .బాపూ ఆరాధ్యుడు అనుకుంటా .కానీ బాపూని అనుకరించడం లేదు " అన్నారు.ఆయన అంతగా పొగిడారంటే నాకు వెంటనే చదవాలనిపించింది.అన్వర్ పుస్తకం తీసి మొదలు పెట్టాక ఇంకా వదలలేదు.వాక్యాలతో చిత్రాలు వేసినట్లు మ్యాజిక్ చేస్తూ అద్భుతమైన వాక్య విన్యాసంతో అనేకమంది చిత్రకారుల, సాహితీవేత్తలు గురించీ,సినీమాలగురించీ భలేగా రాసాడు.చదవటం పూర్తిచేసిన వెంటనే నా అభిప్రాయం అన్వర్ కి వాట్సాప్ లో తెలియజేసాను.
తర్వాత మళ్ళా అన్వర్ తన కొడుకు మోహన్ ని తీసుకుని వచ్చాడు.అప్పుడు వీర్రాజుగారు తన పెయింటింగ్స్, ముఖచిత్రాలు,చిత్రాలు వేసే రకరకాల కొక్విన్లు అతనికి చూపించారు. మా స్వంతపుస్తకాలకు చీర ముక్కలతో వీర్రాజుగారు స్వంతంగా చేసిన బైండింగ్స్ చూసి అన్వర్ అబ్బురపడ్డాడు.
తర్వాత కొన్నిరోజులకే నాకు(2021),పొత్తూరి విజయలక్ష్మి (2022)కు సుశీలానారాయణరెడ్డి పురస్కారం సమావేశం ఎమ్.కే.రాముగారి కిన్నెర సంస్థనిర్వహణలో జరిగింది. నా సాహిత్యం గురించి మూడు వ్యాసాలు రాసిన సి.హెచ్.సుశీలగారు నా సాహిత్యం గురించి కన్నా ఆత్మీయ పరిచయంగా మాట్లాడారు.పొత్తూరు విజయలక్ష్మి గురించి ప్రసంగించిన నెల్లుట్ల రమాదేవి పేపర్ మీద రాసుకొని సాహిత్యం గురించే మాట్లాడింది.తర్వాత స్పందన తెలియజేసినప్పుడు కూడా విజయలక్ష్మి తన సాహిత్యం గురించి చాలా చెప్పుకుంది.
నన్ను పురస్కారానికి ఎంపిక చేసేరంటే నా సాహిత్య సృజన చూసేకదా .ఇంకా నేనుకూడా నా గురించి చెప్పుకోవటంలో అర్థం లేదు అనిపించింది.
అందుకే నా ప్రసంగంలో కేవలం రచయిత్రులకే పురస్కారాలు ఇవ్వాలనే సంకల్పానికి ధన్యవాదాలు తెలియజేసాను.అంతేకాకుండా "నలభై సంవత్సరాలకు పైగా రచయిత్రులకు పురస్కారాల్తో గౌరవించటం చాలాసంతోషం. ఈ సందర్భంగా మరొక విన్నపం చేస్తున్నాను.రచయితలకూ,కవులకూ శతజయంతులు ప్రభుత్వ,ప్రభుత్వేతర సంస్థలూ అకాడమీలు నిర్వహించటం చూస్తున్నాము.కానీ మహిళాసాహితీవేత్తలకు ఎవరూ చేస్తున్నట్లుగా లేదు.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తొలి రచయిత్రి ఇల్లిందల సరస్వతి దేవిగారికి శతజయంతి సభ జరగలేదు.అలా ఎంతమందో.నలభై ఏళ్ళుగా పురస్కారం ఇస్తున్న శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రస్టు వారైనా పూనుకొని పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించనవసరంలేదు కానీ ఆ రచయిత్రి సాహిత్యం గురించి ఒక ప్రసంగం ఏర్పాటు చేసి కొన్ని ప్రసంగాలు అయిన తర్వాత ఒక పుస్తకంగా ప్రచురిస్తే ఇప్పటి తరం వారికి ఆనాటి రచయిత్రులు ఎన్నో అవరోధాలను అధిగమించి రచయిత్రులుగా నిలదొక్కుకున్నారు అనేది తెలుస్తుంది." అని విన్నపం చేసాను.నా ప్రసంగానికి గంగగారు చాలా ప్రభావితులై కార్యక్రమం పూర్తై కిందికి వచ్చాక నన్ను ఆలింగనం చేసుకుని మీరు చెప్పినట్లే మేము నిర్వహించటానికి సిద్ధం గానే ఉంటాము.మీ సహకారం అందించండి అన్నారు.నాకు చాలా సంతోషం కలిగింది.
ఆ తర్వాత కలిసిన వారంతా నేను చేసిన ప్రతిపాదన చాలా సమంజసంగా వుందని అభినందనలు తెలియజేసారు.
పురస్కారం సందర్భంగా సారస్వత పరిషత్తు కార్యదర్శి డా.చెన్నయ్యగారు అందించిన సన్మాన పత్రం, ఫొటో ఫ్రేమ్ వీర్రాజు గారికి చాలా నచ్చాయి.నేను లోపల ఎక్కడైనా పెట్టాలనుకుంటే వీర్రాజుగారు హాల్ లోనే కొన్నాళ్ళవుంచు అన్నారు.ఇంటికి వచ్చిన మిత్రులు అందరికీ ఆయనే చూపించి పురస్కారం గురించి గొప్పగా చెప్తుండటం
నాకే ఆశ్చర్యం వేసింది.
నిజానికి ఇంతవరకూ నాకు నగదు రూపంలో కూడా పది పదిహేను వేలకు మించి రాలేదు.నాకు వచ్చిన పురస్కారాలలో ఇదే అత్యధికంగా వచ్చిన నగదు పురస్కారం.నగదుకన్నా గత నలభై ఏళ్ళుగా ఊటుకూరి లక్ష్మీ కాంతం యద్దనపూడి,రామలక్ష్మీ,లేత,సీతాదేవి వంటి వుద్దండులైన రచయిత్రులు అందుకున్న ప్రతిష్టాత్మకమైన పురస్కారం అనేది మాత్రం అక్షరాలా నిజం.
ఒకరోజు గంగగారు ఫోన్ చేసి
రచయిత్రుల శతజయంతులు దాటిన వారిని లిస్ట్ చేయమని అడిగారు.నేను ముఖ్యంగా సుశీలానారాయణరెడ్డి పురస్కారం అందుకున్న వారితో ప్రారంభించటమే బాగుంటుందనే అభిప్రాయంతో అక్కడినుంచి మొదలుపెట్టి రచయిత్రుల పుట్టిన సంవత్సరాల లిస్ట్ తయారుచేసి పంపించాను.
శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రష్ట్ ఆర్థిక సహాయానికి పుస్తకాల ఎంపిక పూర్తి చేసాను.కథలు,కవితలు కలిపి సుమారు పదిపన్నెండు పుస్తకాలు ఎంపిక చేసి ఎందుకు బాగున్నాయో నా అభిప్రాయం కూడా రాసి వాళ్ళకు పంపించేసాను.అంత సమగ్రంగా నా అభిప్రాయాలతో ఎంపిక చేసినందుకు గంగగారు చాలా సంతోషం వ్యక్తం చేసారు.అంతేకాదు రెమ్యునరేషన్ గా అయిదువేలు పంపించటం మరింత ఆనందం.
నేను ఎంపికచేసిన వాళ్ళు తర్వాత్తర్వాత మంచి కవయిత్రులుగా,రచయిత్రులుగా బహుమతులూ గుర్తింపూ పొందటం కూడా నాకు సంతోషం కలిగించింది.
నేను ఒక లలితగీతాల వాట్సాప్ సమూహంలో వుండటం వలన సినారె గేయాలు ఆ సమూహంలో వచ్చినప్పుడు గంగకు షేర్ చేస్తూ వుంటాను.అందువలన ఆమె ఏ పాట కావాల్సినా, ఎవరైనా రచయితలకు చెందిన వివరాలు కావాల్సి వచ్చినా నన్ను సంప్రదించటం వలన తరుచూ మాట్లాడుకొంటూ వుంటాము.
ఆ విధంగా ఆమెతో కొంత స్నేహం పెరిగింది.
నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ డీటీపీ కూడా పూర్తి చేసాను.అనల్ప బలరాంగారికి పి.శ్రీదేవి కథల్ని " వాళ్ళు పాడిన భూపాలరాగం "పేరుతోనూ,ఆమె కవితల్ని "మథుకలశమ్" పేరుతోనూ సంపాదక బాధ్యతల్ని వహించిన పరిచయంతో నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్
ని వాళ్ళ బేనర్ పై ప్రచురిస్తారా అని అడుగుతే తప్పక ప్రచురిస్తానని అన్నారు.అయితే మరికొన్ని ప్రచురణలలో బిజీగా వున్నానని అవి అయిపోయాక చేస్తానన్నారు.ఆ పుస్తకానికి పల్లవి చేతే ముఖచిత్రం వేయించుతానని కూడా చెప్పాను.
బలరాం సరేనన్నారు.మాలతి రచనలో విశాఖమాండలిక సొబగులే కాక విశాఖసంపంగి పరిమళాలు మనసుని తాకుతూనే వుంటాయని ముఖచిత్రంగా సంపెంగలతోనే డిజైన్ చెయ్యమని పల్లవితో చెప్పాను.
- శీలా సుభద్రాదేవి
నడక దారిలో -66
నడక దారిలో -66
ఈ ఏడాది డిసెంబర్ నెల చాలా విశేషాలతో బిజీగా నడిచింది.
ఈ మధ్య కుందుర్తి కవిత తాను రాసిన కవితలు నాకు పంపించింది.బాగారాస్తున్నావని ప్రోత్సహించడమే కాకుండా నెచ్చెలి,కవి సంధ్య ఈ మెయిల్ ఐడీ లు ఇచ్చి పంపించమని చెప్పాను.నేనేమైనా సవరణలు చేస్తే సరిదిద్దుకుంటుంది.వాటిని వీర్రాజుగారికి కూడా వినిపించేదాన్ని.
ఇంకో విశేషం ఏమిటంటే నేనూ, పల్లవి కూడా వున్న మనలో మనం వాట్సాప్ సమూహంలో పల్లవి చిన్నచిన్న రచనలూ,కవితలూ రాయటం సంతోషం కలిగించింది.కరోనా సమయంలో సుధామ ప్రారంభించిన" ఒకసారి చూడండి అంతే" అనే వాట్సాప్ పత్రికలో కథలకు చిత్రాలు వేయటమే కాకుండా దాని తరపున సుధామ నిర్వహించిన కవితలపోటీలో పల్లవి కవిత ప్రచురణకు ఎంపిక అయ్యింది.అదేవిధంగా విశాలాక్షి నిర్వహించిన కవితలపోటీలో కన్సొలేషన్ బహుమతి వచ్చింది.
వాటిని కూడా ఫోనులో చదవటం వీర్రాజుగారికి తెలియదు కనుక వినిపించాను.అవి విని ఆనందంతో వచ్చే ఏడాదికి పల్లవి రాసిన కవితా సంపుటి ప్రచురించాలి అనేవారు.
ఖమ్మంలో డా.సీతారాంగారు తాను పనిచేసే కళాశాలలో కుందుర్తి సాహిత్య సదస్సు నిర్వహించాలనుకుంటున్నానని కుందుర్తి కృతులు పుస్తకం ,ఇతర పుస్తకాలు కావాలని ఫోన్ చేసారు.ఒకరోజు పుస్తకాలు కోసం మా ఇంటికి వచ్చారు.కుందుర్తికృతులు అపురూపమైనది కావటాన మళ్ళా జాగ్రత్తగా అందజేస్తామన్నారు.ఆ పుస్తకాలతో పాటు మాయిద్దరిపుస్తకాలుకూడా ఇచ్చాము.అవే కాకుండా విద్యార్థులకు బహుమతులుగా ఇవ్వమని మావి విడి కవితా సంపుటాలు కూడా అందజేసాము.
సీతారాంగారు తన పాఠాలు మాత్రమే చెప్పి పనైపోయింది అనుకోకుండా విద్యార్థులకు సాహిత్యం పట్ల అభిరుచి,ఆసక్తి పెంచేలా పుస్తకాలు చదివించి ప్రోత్సహిస్తారు.ఆ విధంగా ప్రతీ కాలేజీలోనూ జరుగుతూ వుంటే తెలుగుభాష అంతరించి పోతుందనే దిగులు తగ్గుతుందేమో.
డిసెంబర్ లో కుందుర్తిగారి శతజయంతి ప్రారంభం ఆవిధంగా ఖమ్మం కాలేజీలో ప్రారంభించటం వీర్రాజుగారికి సంతోషం కలిగించింది.సదస్సు ప్రారంభసభకు మా ఇద్దరినీ ఆహ్వానించారు." రావాలని ఉంది కానీ మూడుగంటలసేపు కారులో ప్రయాణం చేయలేన"ని
వీర్రాజుగారు సీతారాంతో చెప్పారు."కుందుర్తిగారితో, ఫ్రీవర్స్ ఫ్రంట్ తో మీ అనుబంధాన్ని వీడియో చేసి పంపించండి.అది ప్రారంభసభలో వేస్తాం " అన్నారు.
ఆ విధంగా ఒక వీడియో చేసి పంపించాను.కుందుర్తి కవిత ఆ సదస్సులకోసం సింగపూర్ నుండి వచ్చింది.కుందుర్తి కుటుంబసభ్యులు ఖమ్మంలో జరిగిన కుందుర్తి సాహిత్య సదస్సులకు హాజరయ్యారు.
కుందుర్తి కవిత ఇండియా ఎప్పుడు వచ్చినా అక్క సమతతో కలిసి మా యింటికి తప్పక వచ్చి కలుస్తుంది.వచ్చిన 'ప్రతీసారీ సింగపూర్ ఎప్పుడు వస్తారు.తప్పకరండి ' అని పిలుస్తుంది కవిత.
" కవితలు బాగా రాస్తున్నావు. వచ్చే ఏడాది చివరికి నీ కవితాసంపుటి వచ్చేలా రాస్తూ వుండు " అన్నారు కవితతో వీర్రాజుగారు.కవిత నవ్వేసి ప్రయత్నిస్తానంది.నవ్వటం కాదు.'పట్టుదలగా రాయాలి ' అని ఖచ్చితంగా చెప్పారు ఆయన.
ఒకరోజు చెన్నయ్యగారు ఫోన్ చేసి ప్రతీ ఏడాదీ రచయిత్రుల మొదటి పుస్తకాలకి సుశీలానారాయణ రెడ్డి ట్రస్ట్ ఆర్థిక సహకారం అందిస్తుంది కదా ఆ పుస్తకాలను ఎంపిక చేయగలరా అని కోరారు.నేను అంగీకారం తెలియజేసిన తర్వాత నలభై రెండు కవితాసంపుటాల జిరాక్స్ ఫైళ్ళూ,ఇరవై వరకూ కథలసంపుటాల జిరాక్స్ ఫైళ్ళూ పంపించారు.వాటిలో ఆంధ్రా నుండి వచ్చినవి కూడా వుండటంతో గంగగారికి ఫోన్ చేసి తెలంగాణావారివే ఎంపిక చేయాలా,ఆంధ్రావాళ్ళవి బాగుంటే చేయొచ్చా' అని అడిగాను.ఆమె " బాగుంటే రెండు రాష్ట్రాల నుండి ఏవైనా చేయండి.మాకు తెలంగాణా ఆంధ్రా అనే తేడా లేదు.అంతేకాకుండా ఎన్ని సెలెక్ట్ చేసినా పర్వాలేదు" అని నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.అరవైకి పైగా పుస్తకాలు చదవటంతో తీరిక లేకుండా అయింది.
మంచి ఉద్యోగంచేసి పదవీవిరమణ అయ్యాక కాలక్షేపంగా కొత్తగా ఇప్పుడు సాహిత్య సృజన మొదలుపెట్టి ఆర్థికంగా మంచి స్థితిలో వున్నవారు సైతం ఆర్థిక సహాయం కోసం పంపటం నాకు ఆశ్చర్యం కలిగించింది.కొందరు ముందు మాటలు కూడా రాయించి ప్రచురణకు సిద్దంగా వున్న ప్రతులే పంపించారు.అటువంటి వాటిని చాలా వరకూ తీసేసాను.యువతరంవారికి ప్రోత్సాహంగా యిస్తే బాగుంటుంది అనిపించింది.అదే విషయాన్ని గంగగారికి తెలియజేసాను.
కవిత్వంలోనూ,కథల్లోనూ బాగున్నాయి అనిపించినవి పక్కన పెట్టి రెండోసారి చదవాలనుకున్నాను.మొత్తం పంపిన వాటికి అన్నింటికీ నచ్చనివాటికి కూడా నా అభిప్రాయం రాసి పెట్టుకున్నాను.ఫైనల్ సెలక్షన్ మాత్రం వుంది.
సైదాబాద్ కోపరేటివ్ బ్యాంకుకు ఒకరోజు వీర్రాజుగారిని తీసుకుని పల్లవీ, నేనూ వెళ్ళాం.మలక్ పేట ఇంట్లోకి వచ్చిన వెంటనే మొదట దగ్గర కదా అని ఆ బ్యాంకులోనే మేము సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెరిచాము.సరూర్ నగర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అవసరమైనప్పుడు సైదాబాద్ బ్యాంక్ కు రావటం కష్టంగా వుందని వీర్రాజుగారి అక్కౌంట్ క్లోజ్ చేసేసాను.దానితో పాటూ
కుందుర్తి సత్యమూర్తితో కలిసి ఫ్రీవర్స్ ఫ్రంట్ కోసం చేసిన జాయింట్ అకౌంట్ కూడా క్లోజ్ చేసేసాము.ఫ్రీవర్స్ ఫ్రంట్ అక్కౌంట్ లో నలభై అయిదు వేలు ఉందని కుందుర్తి శాంతకు తెలియజేస్తే ' మీరే ఫ్రీవర్స్ ఫ్రంట్ కోసం వాడండి.నాకు పంపొద్దని' అంది.
ఆ డబ్బుని ఏం చెయ్యాలా అని ఇద్దరం ఆలోచించాము."ఈ ఏడాది ఎట్లాగూ కుందుర్తి శతజయంతి సంవత్సరం కనుక ఈ నలభై అయిదు వేలకు మనం మరోపదిహేను వేలు కలిపి ఆరుగురికి కుందుర్తి శతజయంతి ప్రతిభా పురస్కారం పేరున పదివేల చొప్పున ఇచ్చేద్దాము.రెండు తెలుగురాష్ట్రాల నుండి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు రాదగిన సీనియర్ కవుల్ని ఎంపిక చేద్దాం" అన్నారు వీర్రాజు గారు.ఎవర్ని తీసుకోవాలని ఒక జాబితా వేసుకుని నిర్విరామంగా సాహిత్య కృషి చేస్తూ సాహిత్యం రాస్తూ వున్నవారినిగా చూసుకుని డా.రాధేయ,దాట్ల దేవదానం రాజు,అడిగోపుల వెంకటరత్నం,దేవరాజు మహారాజు,డా.సీతారాం, అనిశెట్టి రజితలను ఎంపిక చేసి కుందుర్తి కుటుంబసభ్యులకు తెలియజేసాము.వాళ్ళుకూడా చాలా సంతోషించారు.ఎంపిక చేసిన కవులకు వీర్రాజు గారు ఫోన్ చేసి చెప్పగా ఆరుగురూ చాలా ఆనందించారు.
ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహంలో కుందుర్తి ఆంజనేయులు శతజయంతి సందర్భంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారాలు ప్రకటించిన వారిగురించి పరిచయం చేసాను.పురస్కారగ్రహీతలకు ఎప్పుడు హైదరాబాద్ రావటానికి కుదురుతుందో సంప్రదించటంతో కొంత కాలయాపన జరిగింది.
దాంతో సభ నిర్వహించి ప్రదానం చేయాలా,లేదా జూమ్ సమావేశం ద్వారానే చేయాలా అనేది కూడా ఆలోచించాము.
ఇటీవలే ఖమ్మంలో కుందుర్తి సదస్సులకీ కుందుర్తి కవిత వచ్చి వెళ్ళింది.మళ్ళా దగ్గరలో రావటం కష్టం. అందుకని జూమ్ లోనే అందరి వెసులుబాటూ చూసుకుని నిర్వహించాలని నిర్ణయించాము.
చూస్తుండగానే నెచ్చెలి అంతర్జాలపత్రికలో నా నడక దారిలో బాల్యం వివరాలతోనే ఏడాది గడిచిపోయింది.
ఎన్నికల సమయంలో జరుగుతోన్న సందర్భాలూ, ప్రజల్ని వెర్రివెధవాయిలుగా చేస్తున్న రాజకీయ నాటకాలూ కొంత అసహ్యం కలిగించి నేను దీర్ఘకవితగా రాసాను.అది వీర్రాజుగారికి చదవమని ఇచ్చాను.బాగా రాసాను అన్నారు.కానీ ఏ పత్రికకైనా పంపించటానికి వెనకడుగు వేసాను.
కోరుకొండ అక్క మనవరాలు అంటే కళ్యాణ్ పెద్దకూతురు వసుధకు పెళ్ళి సంబంధం కుదిరింది అని తెలిసింది.వసుధ కోరుకొండ సైనిక పాఠశాలలోనే చదువుకుని చెన్నైలో ఇంజనీరింగ్ చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.విశేషం ఏమిటంటే సైనిక స్కూల్ లో చదివినప్పటి నుండి సహ విద్యార్ధులు అయిన అభిలాష్,వసుధ ప్రేమించుకుంటున్నారుట.చదువుపూర్తిచేసి ఉద్యోగంలో స్థిరపడే వరకూ ఈ విషయం తల్లిదండ్రులుకు తెలియనీయవద్దనుకున్నట్లున్నారు.
ఇప్పుడు తల్లిదండ్రులు సంబంధాలు చూడటం మొదలు పెట్టేసరికి బయట పెట్టింది వసుధ.అభిలాష్ వాళ్ళ కుటుంబం సంగారెడ్డిలో వుంటారు.ఒకసారి అందరూ కలిసి మాట్లాడుకొని నిశ్చయించుకుందామని ఇరు కుటుంబాల వారు నిర్ణయించుకున్నారు.
ఆపని మీదే కళ్యాణ్ కుటుంబమే కాక జయ అక్కాచెల్లెళ్ళు కూడా కుటుంబ సహితంగా వచ్చారు.
"మాకు వున్న పెద్దదిక్కు మీరే కనుక తప్పక సంగారెడ్డి రావాలని " కళ్యాణ్ అనేసరికి మేమూ బయలు దేరక తప్పలేదు.వీర్రాజుగారు ముందు అన్ని గంటలు కార్లో ప్రయాణం చేయలేనేమో అని వెనకడుగు వేసినా కళ్యాణ్,జయ కోరిక మేరకు బయలుదేరారు.
టిఫిన్లు చేసి ఎనిమిది గంటలకు నలుగురం కార్లో సంగారెడ్డి బయలుదేరాము.సుమారు నాలుగు గంటల ప్రయాణం చేసి సంగారెడ్డిలో వసుధ కాబోయే అత్తగారి ఇల్లు చేరాము. అత్తగారి అక్కాచెల్లెళ్ళు,మామగారి అన్నదమ్ములు మొదలైన వారితో వాళ్ళది చాలా పెద్ద కుటుంబం.వాళ్ళందరూ వచ్చారు.
పెళ్ళి ఎప్పుడు చేయాలనేది చర్చ జరిగింది.ఇల్లూ,ఇంట్లో వస్తువులూ అన్నీ అమర్చుకున్నాకే చేసుకుంటాం అని పిల్లలు ఇద్దరూ అంటారు.ఇప్పటికే చాలా కాలం వేచి వున్నారు,ఇంకా ఆలస్యం చేయవద్దని అందరం అన్నాము.పెళ్ళి అయ్యాక ఇంట్లోకి మీ సంపాదనతో ఒక్కొక్క వస్తువే అమర్చుకోవటంలో చాలా తృప్తి వుంటుందని మేము అనుభవంతో చెప్పాము.ఆఖరికి అంగీకరించారు.ఎప్పుడు మంచి ముహూర్తం వుంటే అప్పుడు వివాహం చేయాలని అందరూ నిర్ణయించారు.
వీర్రాజుగారు ప్రత్యేకంగా వసుధా, అభిలాష్ లతో " పెళ్ళి అంటే ఒకరిపై ఒకరికి గల నమ్మకం.దానిని జీవితాంతం నిలుపుకోండి" అంటూ చాలా సేపు మాట్లాడారు.ఆయన మాటలకు వాళ్ళిద్దరే కాక వాళ్ళు అమ్మా నాన్నలు కూడా ఫిదా అయిపోయారు.
అభిలాష్ వాళ్ళూ ఇక్కడే స్థిరపడిన కన్నడిగులు.వాళ్ళ సంప్రదాయం ప్రకారం మగవాళ్ళందరికీ గాంధీటోపీలు పెట్టి అందరికీ బట్టలు పెట్టారు.అదే విధంగా కళ్యాణ్ వాళ్ళు కూడా వాళ్ళకు బట్టలుపెట్టి గౌరవించారు.అవన్నీ పూర్తి చేసుకుని మేము తిరిగి బయలుదేరి ఇంటికి చేరేసరికి పదిగంటలకు దాటింది.
మర్నాడు జయా అక్కాచెల్లెళ్ళు ముగ్గురినీ మా ఇంటికి రమ్మన్నాను.' భోంచేసి ఇక్కడనుండే స్టేషనుకు వెళ్ళొచ్చు' అని చెప్పాను.
ఉదయమే లేచి రెండు కూరలూ, సాంబారు,ఫ్రైడ్ రైస్ , స్వీట్ చేసి మంచూరియా హొటలునుండి తెప్పించాము.పెద్దక్క సర్వలక్ష్మి కుటుంబం అటునుంచి అటే కార్లో వెళ్ళిపోయారు.మిగతా ఇద్దరూ రంజనా,జయా వాళ్ళంతా వచ్చారు.అందరితో సరదాగా ఇల్లంతా పెళ్ళి సందడిలా గడిచింది.వసుధ రాత్రికి డిన్నర్ పేక్ చేసుకుని హాస్టల్ కి వెళ్ళిపోయింది.మిగతావాళ్ళు ఇటు నుండి స్టేషన్ కు వెళ్ళిపోయారు.
"ఇంతదూరం కార్లో బాగానే ప్రయాణం చేయగలిగాను.భయపడ్డాను గానీ ఖమ్మంలో జరిగిన కుందుర్తి సదస్సుకు కూడా వెళ్ళాల్సింది" అని మర్నాడు వీర్రాజుగారు అన్నారు.మీరు ఊరికూరికే ప్రయాణం చెయ్యలేనేమో అని ముందే భయపడతారు అని ఆయనతో అంటూ నేనూ పల్లవీ నవ్వుకున్నాం.
ఈ ప్రయాణం ఇచ్చిన ధైర్యంతో ఈ సారి " విజయనగరం వెళ్తే పగలు రైలు ప్రయాణం చేద్దాం కిటికిలోనుండి అంతా చూస్తూ వెళ్ళొచ్చు"అన్నారు.
ఆలోచిద్దాంలెండని అన్నాను.
నిడదవోలు మాలతి సాహిత్యం మీద రాస్తున్న వ్యాసాలు ఒక పరిశోధన గ్రంథం మాదిరిగానే జీవితం,కథలు,ఎన్నెమ్మ కథలు,నవలలు, వ్యాసాలు,అనువాదాలుగా చాప్టర్ లు విడదీసాను.ఒక్కొక్క చాప్టర్నీ పీడీఎఫ్ రూపం లో మాలతి గారికి మెయిల్ ద్వారా పంపించే దాన్ని.ఆమె ఏమైనా సవరణలు చేయమంటే మార్చేను.కొన్ని కథలకి నేపథ్యం గురించి అడిగితే సమాధానాలు చెప్పేవారు.దాంతో ఆమెతో చాలా సాన్నిహిత్యం పెరిగింది."నన్ను మీరు,గారూ అని మన్నించి రాస్తుంటే ఇబ్బందిగా వుంది.మా అక్కయ్య సమకాలీనులు.నన్ను మన్నించనవసరం లేదు. ఏకవచనంలో సుభద్రా అనండి చాలు"అని నేను రాసిన తర్వాత మరింతగా సాన్నిహిత్యం పెరిగింది.
ఒక సందర్భంలో "నా జీవితంలో జరిగినవేవీ నువ్వు అడగలేదు.చెప్పమంటావా" అని రాసారు.
పి.శ్రీదేవి జీవితం నాకు అంతగా తెలియక పోవటం వలన ఆమె మోనోగ్రాఫ్ రాసేటప్పుడు ఆమె రచనల ఆధారంగానే ఆమె జీవితాన్ని రాసాను.మీకు కూడా అలానే రాస్తాను.అని నేను చెప్తే మాలతిగారు చాలా సంతోషించారు.
నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ మొత్తం పూర్తి అయ్యింది.పేజీలు స్కాన్ చేసి డిటీపీ నరసింహారావుకి ఇచ్చాను.కానీ నేను ఫ్రచురించుకుంటే ప్రచారం చేసుకోగలనా అనిపించింది.ఏదో సందర్భంలో మాట్లాడినప్పుడు అనల్ప బలరాంతో అంటే తానే ప్రచురించుతానని అన్నాడు.
అప్పటికే పి.శ్రీదేవి సాహిత్యం అంతా తన
పబ్లికేషన్ ద్వారా ప్రచురించాలనుకుంటున్నాననీ నన్ను రచనలన్నీ సేకరించి నన్నే సంపాదకత్వం వహించమని బలరాం అడిగాడు.ఆ పని కూడా మొదలు పెట్టాను.నేను కథానిలయం నుండీ,నా దగ్గర వున్నవీ డిటీపీకి ఇచ్చాను.మిగతా కథలు కృష్ణదేవరాయ గ్రంథాలయం నుండి తెలుగు స్వతంత్రలు తెచ్చుకుని అందులో చదువుతూ రాసినవి.
అంతకుముందే ఒక అమ్మాయి పి.శ్రీదేవి మీద పరిశోధన చేస్తున్నానని రచనల కోసం అడిగింది.నేను కృష్ణదేవరాయ గ్రంథాలయం నుండి తెచ్చుకున్నానని చెప్తే వెళ్ళింది.తీరా అక్కడకి వెళ్తే చెదలు పట్టాయని అవన్నీ పాడైపోతే పారేసామని చెప్పారని నాతో చెప్పింది.దాంతో మళ్ళా నాకు శ్రీదేవి కథలసేకరణ ఇక్కట్లు మొదలయ్యాయి.అయితే గౌతమీ గ్రంధాలయం, వేటపాలెం లైబ్రరీలో కొన్ని దొరికాయి.మూడోనాలుగో కథలు తప్ప అన్నీ దొరికాయి.వాటిని డిటీపీ చేయించాను.ఆ పుస్తకానికి సమగ్రమైన ముందుమాట రాయమని పబ్లిషర్ చెప్పటంతో మళ్ళా కథలన్నీ చదివి రాయటం మొదలు పెట్టవలసి వచ్చింది.
- శీలా సుభద్రాదేవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)