11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
ప్రసాద మూర్తి - సగంపిట్ట కథలు
~ సౌజన్య(ప్రసాద)మూర్తి పలవరింతే " సగంపిట్ట"కథలు~
"జీవిత తత్వాన్నీ దాని కీలకాల్నీ అర్థంచేసుకున్న ఆలోచనాపరుడి కథలివి. ఈ దుర్మార్గ సమాజంలో కుల, మత, లింగ, వర్గ భేదాలతో ముక్కలై గ్లోబలీకరించబడిన ఈనాటి జీవితంలో ఒక్కొక్క బతుకు ముక్క ఒక్కొక్క రూపంలో కనిపించే వాస్తవాన్ని బలంగా పట్టుకున్న కథలివి. జీవితాన్ని ముందుకు నడిపించే చైతన్యాన్ని నిరాడంబరంగా వ్యక్తీకరించిన కథలివి."
అంటారు ప్రసాద మూర్తి కథలసంపుటి ' సగంపిట్ట'ముందుమాట లో-జి. లక్ష్మీనరసయ్యగారు.
కవిత్వంలో వస్తువేదైనా దానికి అనుగుణమైన భావాన్ని అద్భుతంగా పొదగగల నైపుణ్యం, చదువరులకు హత్తుకునేలా సమకాలీన సమస్యలనూ కవితామయం చెయ్యగల కవిగానే ఇన్నాళ్ళూ ప్రసాదమూర్తి కనిపించారు.
తన చిన్నప్పటి ఊరు గురించి రాసినా,కురిసిన వాన గురించి రాసినా పసివాడిలా పలవరిస్తాడు.తర్వాత రోజుల్లో నివసించిన నగరజీవితం అతడిలోని సున్నితత్వాన్ని,భావుకత్వాన్నీ, సౌకుమార్యాన్ని కబళించలేదు అనేది అతడి ప్రతి కవితలోనూ సుస్పష్టమౌతూనే వుంటుంది.
ప్రసాద మూర్తికి సమాజం వేరు కవిత్వం వేరు కాదు. కవితా దృష్టి, సామాజిక చైతన్యం రెండూ ఒకదానిలో ఒకటి అంతర్లీనంగా సాగేదే అతని కవిత్వం.
ఇలా ఇంతకాలం ఒక కలనేత కవిగానే చూసి,పూలండోయ్ పూలు అంటూ అందించిన అతని బుట్టెడు కవిత్వ పరిమళాల్నీ హత్తుకున్నాను,దాంతో బాటూ కంటిచూపుకి తగిలి చురుక్కుమనిపించిన ఘాటైన పొగలకీ వుక్కిరి బిక్కిరి అయ్యాను.
సగంపిట్ట మా లైబ్రరీలోకి వచ్చి ఎప్పుడు దూరిందో కానీ ఇటీవలే నా చేతిలో వాలింది.ఇదేమిటండీ బాబూ సగం పిట్ట కాదు మనల్ని పూర్తి పిట్టల్ని చేసి ప్రకృతి ఆవరణాల్లోకో, సమాజం మూలాల్లోకో ,లేకుంటే మనలోకి మనల్నో నెట్టేసి ఆలోచనల్ని,మనజీవితాల్నీ తడుముకునేలా చేసేస్తాడు ఈ రచయిత. అందుకే "పూర్తి పిట్ట రాసిన కథలివి.
మరందుకే " ప్రకృతిపట్ల అపారప్రేమతో, ఘనీభవించిన మానవుడిపట్ల తీవ్రనిరసనతో, కవి హృదయంలో మొలకెత్తిన ఈ కథలు చదువరుల గుండెల్లో పుష్పిస్తాయి. భుజాన చెయ్యెయ్యడంతో ప్రారంభమై ధడేల్ ధడేల్మని మన తలుపుల్ని తెరిచి కానీ వదలవు. సరళంగా సూటిగా స్నేహభాషణలా సాగే కథనం- మరచిపోయిన మనలోపలి ప్రాంతంలో మనల్ని సుకుమారంగా వొదిలేసి వీడ్కోలు తీసుకుంటుంది" రమణజీవి అన్నారనుకుంటాను.
మొదటి కథ అనామక మరణం చదివేటప్పటికే గుండె పట్టేస్తుంది.నిజమే ప్రతీ మనిషిలోనూ ఒక అనామకుడు దాగే వుంటాడు.ప్రతీరోజూ పసిపిల్లలను రక్తసిక్తల్ని చేస్తున్నవార్తలో,యుద్ధాలలో అమాయకపసిప్రాణాల్ని
, గర్భస్థ శిశువుల్ని బలిగొన్న వార్తల్నో, గోధ్రా సంఘటనల్ని కడుపులో పేగుల్ని నులిమేసే వార్తల్నో వింటూనే వుంటాం.అల్జిమీర్స్ వచ్చిన వాళ్ళలా మర్చిపోవటానికి ప్రయత్నాలు చేస్తాం.మర్చిపోలేం మనలోని మనిషి మరణిస్తే తప్ప .అదెప్పుడు జరుగుతుంది ఈద్వైదీ భావాన్నే ప్రసాద మూర్తి తనకథలో రచయిత రాయాలనుకున్న కథలో అద్భుతంగా చిత్రించిన కథ అది. ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్నీ, తనకు సంబంధించిన దానిగా తనలో ఆవాహన చేసుకుని మానవీయ సంబంధాల్లోంచే చూసే సౌజన్యమూర్తి ప్రసాదమూర్తి.మనిషి సంఘజీవి అని నమ్మిన కథకుడు సమాజంలో జరుగుతోన్న దుర్ఘటనలకు కదిలిపోతాడు.నిజానికి ఈ కథ దీర్ఘ కవిత్వంలా సాగుతుంది
పల్లెలో పనుల్లేక నగరబాట పట్టిన "బంగారమ్మ" చాలాకాలానికి సంక్రాంతి పండుగకి పల్లెటూరికి వస్తుంది.తమ అరెకరం పొలాన్ని కళ్ళారా చూసుకోవాలని బయలుదేరిన బంగారమ్మతో పాఠకులు కూడా నడుస్తారు.దారిపొడవునా కలలో నడుస్తున్నట్లు నడుస్తూ గతాన్ని పునశ్చరణ చేసుకుంటున్న బంగారమ్మతో బాటూ పాఠకులూ ఆ దృశ్యాల్ని కలగంటారు.తన అరెకరం పొలంకోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ చేపలు చెరువులోనే అదృశ్యమై మర్నాడు పైకి తేలిన బంగారమ్మ కథగా చెప్పినా పైకి తేలని బతుకులెన్నో ఆ పంక్తులలో పాఠకులకు దర్శనమిస్తాయి.ప్రకృతినిప్రేమించే భావుకుడైన ప్రసాద మూర్తి ప్రతీ వాక్యాన్ని హృదయభాషలో రాసాడనిపిస్తుంది.
చేపలూ,రొయ్యల్తో పసరెక్కిపోయి చెరువులైపోయిన పొలాల్నీ ,చేపల కోసం వస్తున్న పిట్టల్ని తరమటానికి పేల్చే తుపాకి శబ్దాల్ని పాఠకులూ వింటారు.
పల్లెల్లో సైతం గడ్డిలేక ఎండిపోతోన్న పశువులకు గడ్డి ,చెరువులు లేక మంచినీళ్ళనూ బయటనుండి కొనుక్కొని రావాల్సిన దుస్థితి , విధ్వంసం అయిపోతున్న పల్లెల ముఖచిత్రాన్ని ఈ కథలోని పంక్తులు దృశ్యీకరణచేస్తాయి.
పరుగులు తీస్తున్న కాలంతో పాటూ పరుగులు తీస్తున్న మనిషికి పక్కనే వున్నవారిని పట్టించుకునే తీరికాలేదు.మనసూ లేదు.తన చుట్టూ తానే పరిథులు గీసుకుని బతుకుతున్న మనుషుల మధ్య గోడలు పెరిగిపోతున్నాయి.ఆ దృశ్యమే ఈ " పక్కన కూర్చున్న వ్యక్తి" కథ
రైల్వే స్టేషన్ లో ఓ మూల రెండు ముసలిబొమ్మలు ఎడమచేతుల్ని చాచి వుండటం కథకుడు ప్రతీరోజూ గమనిస్తాడు.ఆ చాచిన చేతులు అందుకొని పిల్లలు తమని తీసుకు వెళ్తారనేమో అనుకుంటాడు.వాళ్ళకు కొంత డబ్బు సేకరించి ఇచ్చి భరోసా కల్పించాలనుకుంటాడు.
కథకుడు నివసించే కమ్యూనిటీలో రామారావు దంపతులు పిల్లల ఫోన్ కాల్స్ కోసం అడుక్కుంటూ ఉన్న ముసలి బొమ్మలు,సుందరం దంపతులు పిల్లల నుంచి కాసింత సమయాన్ని అడుక్కుంటూ ఉన్న ముసలి బొమ్మలు.ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వున్నా ఏటిఎమ్ కు పోయి డబ్బు తెచ్చుకోలేని ఎన్నో ముసలి బొమ్మలు.ఇవన్నీ చదువుతుంటే దేశమే ఒక వృద్ధాశ్రమంగా మారిన దుస్థితి గుర్తుకువస్తుంది.అఃదర్నీ సంప్రదించి డబ్బు సేకరించి స్టేషన్లో ముసలిబొమ్మలకీ ఇవ్వాలనే తమ వుద్దేశ్యం చెప్పకుండా వాళ్ళు చూసేందుకు చాలా ముసలి బొమ్మలు రాబోతున్నాయని చెప్పేసరికి స్టేషన్ లోని ముసలి బొమ్మలు తమకు స్థాన భ్రంశం చేస్తారేమోనని ముందే వెళ్ళిపోతారు.అనేకవిధాలుగా ఒంటరివృద్ధాప్యాన్ని రచయిత కవితాత్మకంగా చెప్పాడు.
ఆంధ్రా తెలంగాణ విభజన నేపధ్యంలోని కథ జన్మభూమి.ఏ ప్రాంతమైనా దోచుకునేవారు ఎవరైనా దోపిడికి గురైన వారు మాత్రం ఎప్పుడూ ప్రజలే.అందుకే ఒకప్పుడు వలస పక్షుల రాకతో ప్రత్యేకత కలిగిన కొల్లేరు సరస్సు ఈ నాడు నామరూపాలు లేకుండా విధ్వంసానికి గురైంది.వివక్షలూ అలాగే వూరి చివరనే యథాతథంగా వుండిపోతూనే వున్నాయి.
వందరెక్కలు వున్నా సరే స్త్రీ తనకు తానుగా ఎగిరిపోవాలనే ఆలోచనే రాకుండా పిల్లలూ,కుటుంబం,బాధ్యతలూ ఆ రెక్కల కిందనే
భద్రంగా దాచుకుంటూనే వుంటుంది.మనసు గాయపడినప్పుడో ,ఒంటరిగా మిగిలిపోయినప్పుడో ఒక్కొక్క రెక్కే విరుచుకోవాలనుకుంటుంది.
కాలాతీతవ్యక్తులు నవలలో ఇందిర "రెక్కలున్నాయనుకొని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అవి తడిసిపోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది."అంటుంది.
ఈ కథలో కూడా ఎగిరిపోతుందేమోనని అనుమానంతో అమ్మకు ఒకతోడుకోసం సహకరించాలనుకున్న పిల్లలకు "ఒకసారి పెళ్ళిచేసుకుని అనుభవించిన దానిని,మళ్ళా ఆ రొంపిలో వెళ్ళాలనుకోవటంలేదు."
అంటుంది.స్త్రీ దృష్టి కోణంలో స్త్రీ మనసులోని ఆలోచనలను ఒడిసిపట్టి రాసిన కథ" వందరెక్కల స్త్రీ"
బసమ్మ చెవిపోగులే కాదు చెమటతో తడిచిన తాళిబొట్లని సైతం కుదువ పెట్టుకొని బడుగు వర్గాల స్త్రీ పురుషుల జీవితాల్ని మత్తులో ముంచేసే కల్లు కాంపౌండ్ లకు అదుపు ఎక్కడ.
గుజరాత్ లో మతకల్లోలపు మారణహోమం సాగిన రోజులవి. గోద్రా రైలు దుర్ఘటన తర్వాత గుజరాత్ లో జరిగిన హింసాత్మక అల్లర్లు కుటుంబంతో "రైలు ప్రయాణం " చేస్తున్న కథకుడికి ఒక్కటొక్కటే గుర్తుకు రావడం ప్రారంభమైంది.
చెప్పులూ, సామానేకాదు పిల్లల్ని ఎత్తుకుపోవడంలో ఎత్తుకు పైఎత్తులు వేసేవాళ్ళకి రైలుబళ్ళు నిలయాలు. కంటిమీద కునుకు పట్టని కథకుడికి ఆ పెట్టిలోకి ఎక్కిన ముస్లిం యువజంటని చూసేసరికి ఉగ్రవాదులేమోనని గుండె దడదడ లాడుతుంది.చివరికి ఏమీ జరగకుండా ప్రయాణం పూర్తి అవుతుంది. కుల,మత,జెండర్, ప్రాంతీయ వివక్షలతో పక్కనే వున్న వ్యక్తిని అనుమానిస్తూ భయపడేలా చేసినది ఈ వ్యవస్థే అనే ఎరుక కలిగించేకథ ఇది.
ఇలా ప్రసాద మూర్తి రాసిన కథలన్నింటిలో కొన్నిచోట్ల పేరాలకు పేరాలు కవితాత్మకంగా పాఠకుల్ని ఆకట్టుకుంటాయి.కవి సున్నిత హృదయం ప్రతీ కథలోనూ కనిపిస్తుంది.
మానవ తప్పిదాలు వలన విధ్వంసం అయిపోతున్న ప్రకృతి దృశ్యాలు,,అనేక విధాలుగా మానవ స్వార్థంతోనే కాలుష్యభరితమైపోతోన్న పర్యావరణం,దాంతో బాటుగా మారిపోతున్న జీవనవిధానాలూ,తప్పని పరిస్థితుల్లో యాంత్రికంగా మారుతోన్న మనిషిని చూసి ఆవేదన చెందుతాడు.ఏమీ చేయలేని అసహాయత తో ఆక్రోశం చెందుతాడు.సమాజంలో పసిపిల్లల మీదా,స్త్రీలమీదా జరుగుతోన్న లైంగిక దాడులకు తల్లడిల్లుతాడు,జాతిమత వివక్షలకు బలి అయిపోతోన్న అసహాయులను చూసి కుంగిపోతాడు.
ఇదిగో ఇవన్నింటినీ దృశ్యాలు దృశ్యాలుగా చిత్రించి ఈ కథలన్నింటా పేర్చాడు.ఇవన్నీ చూస్తూ కూడా మనం పరిధులు చుట్టుకుని అల్జిమీర్స్ వచ్చిన వారిలా ఏంకానట్టుగా మర్చిపోయి ఎలా బతకగల్గుతున్నామని వాపోతాడు రచయిత.
మరి అందుకే పాఠకులు కూడా ఒక్కొక్క కథా చదువుతూ ఇంకా మనం మనుషులుగానే వున్నామా అని అనుమానపడతారు.
పూలండోయ్ పూలు లో మనుషులంతా పూలైపోవాలని కలవరించిన రచయిత కనుకే సువర్ణ గన్నేరు పూలు లాంటి కథ రాయగల్గాడు.ప్రకృతి ఏదీ తిరిగి ఆశించదనే సత్యాన్ని అన్వేషించినవాడై చెట్టే చేతులు పట్టుకొని తీసుకెళ్ళినట్లుగా అనాథాశ్రమంలో ప్రవేశిస్తాడు.ఫాల్గుణమాసంమొదలైందంటే ఆ దంపతులు గుండెల్లోను పూలువిచ్చుకున్న చప్పుళ్ళు వినబడతాయి.
కథలన్నింటా కథకుడు ఎలా కలవరించాడో చదివిన తర్వాత వెంటాడుతోన్న ఈ కథలన్నీ ఛానెల్స్ లోను,వార్తా పత్రికలలోనూ తిరిగి తిరిగి కనబడుతోంటే పాఠకులు కూడా కొండలు గుట్టలు అడవులు ధ్వంసం చేసి కట్టిన హై రేంజ్ అంతస్థులలోని కృత్రిమ వనాల్లో పూర్తి పిట్టలై ఎగరలేక సగంపిట్టలై పలవరిస్తారు,తమ అసహాయతకు సిగ్గు పడతారు.మానవ సంబంధాల్నీ, మనిషి బ్రతుకునీ ఉన్నతీకరించడంపై కథకుడికి గల అమితమైన శ్రద్ధ వలనే పూలతోనో,చేలతోనో, చెట్లతోనో,పిట్టలతోనో మనిషికి పాఠం చెప్పిస్తాడు.
చాలా వరకూ ఉత్తమ పురుషలోనే రాసిన " సగం పిట్ట "కథలు ప్రసాదమూర్తి సాత్వికుడైన కవి కావటం వలన కావచ్చు సున్నితంగా,సరళమైన శైలిలోనే రాసినా నిజానికి ఆ పాఠాలు పాఠకుల హృదయాలను కూడా పట్టి కుదుపుతాయి.
- శీలా సుభద్రాదేవి సృజనక క్రాంతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి