26, ఆగస్టు 2026, బుధవారం
నవతరాల మేథోవికాసానికై శ్రీనాథ్ కథలు
~ నవతరాల మేథోవికాసానికై శ్రీనాథ్ కథలు ~
భారతదేశమే కాదు ఏదేశమైనా పిల్లలకు బుద్ధులు నేర్పించటం అమ్మ ఒడి నుండే ప్రారంభం అవుతుంది.పిల్లలకు తల్లిదండ్రులు కాకుండా పరిచయం అయ్యేది జంతువులూ,పక్షిజాతులే.
అక్షరం దిద్దకముందే అమ్మా, అమ్మమ్మా ,నాన్నమ్మలు పిల్లల్ని రాత్రి నిద్రపుచ్చుతూ అనగనగా అంటూ చెప్పే తొలికథల అల్లికలు జంతువుల చుట్టూనే.
అందుకేనేమో విష్ణుశర్మ కూడా జంతువుల ద్వారానే పంచతంత్రకథలు బోధించారు.
ఈ నాడు ప్రపంచీకరణ ప్రభావం వలన ప్రతి వ్యక్తీ జీవితంలో పరుగులు పెడుతున్నాడు.ఒత్తిడి నిండిన చిన్నికుటుంబాలలో తల్లిదండ్రులకు కెరియర్ పరుగుల్లో చిన్నపిల్లలకు కథలు చెప్పేంత తీరిక లేదు.అమ్మమ్మలూ,నాన్నమ్మలకూ దూరమయ్యారు.మరి ఇక పిల్లలకు విద్య కన్నా ముందుగా విలువలు నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది?
అదిగో అందుకేనేమో శ్రీనాథ్ వాడపల్లి బాలల కోసం ఆలోచించాడు . భారతదేశంలో టీచర్,కవీ ,రచయిత అయిన తండ్రి ఒడిలో అతని బాల్యం గడిచింది .చిన్నప్పటి నుండీ ఇంట్లో ఉన్న పుస్తకాలమధ్య సృజనాత్మక వాతావరణంలో పెరగటం అతనిలో మేధో ఉత్సుకతను పెంపొందించాయి.
భారతదేశంలోనే పెయింటింగ్, గ్రాఫిక్స్‌లో శిక్షణ పొందిన శ్రీనాథ్ తదనంతరం ఫ్రాన్స్, లండన్ కళాకేంద్రాల్లో చదువుకున్నాడు. డాక్టరేట్ ,ఫెలోషిప్‌లు, గ్రాంట్లు అందుకున్నాడు.
భారతదేశంలోనే కాక ఫ్రాన్స్, UK, ఆఫ్రికా, USA లాంటి విదేశాలలోని యూనివర్సిటీల్లో సైతం విద్యార్థులకు పెయింటింగ్, గ్రాఫిక్స్ నేర్పిస్తున్నాడు..
అంతటితో అతని అంతరంగం శాంతించలేదు.
అయిదు నుండి పది ఏళ్ళ వయసు పిల్లలకు కుటుంబసభ్యుల మధ్య బంధాలూ, స్నేహాలూ, సామాజిక అలవాట్లూ ఎలా నేర్పాలి? తోటి పిల్లలు పట్ల ప్రేమా, దయా చూపటం, అవసరసమయంలో సహాయం చేయటం, అన్ని జీవుల పట్ల గౌరవం ప్రదర్శించటం ఏవిధంగా తెలియజేయాలి అనేది శ్రీనాథ్ మనసులో కలిగించిన మధనం ఈ కథలు రాసేలా చేసాయి.ఈ కథలన్నీ చిన్న చిన్నజంతువులూ, పక్షుల సాహసాలూ, ప్రవర్తన ద్వారా మానవీయ విలువలు పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పే కథలే.
ఈ కథలు ప్రపంచబాలలందరికీ వుపయుక్తంగా వుండే అంశాలను కలిగివుండటం ప్రధాన లక్ష్యం గానే వున్నా భారతీయాత్మ అంతరప్రవాహంగా వుందని అనిపించింది.ప్రతీకథా చదివే వయసుగల పిల్లలకి స్పష్టంగా అవగాహన కలిగించేలా వుండటం ఈ కథలకు గల మరో లక్షణం.
చదవలేని పిల్లలకు బెడ్ టైమ్ కథలుగా పెద్దలు వినిపించేందుకు అనువుగా వున్నాయి.
మొత్తంగా ఈ కథల్ని చదివినప్పుడు పిల్లలకు మానవీయవిలువలు నేర్పటమే కాకుండా పెద్దలమాటల్ని వినడం, మంచి చెడులను గూర్చి ఆలోచించడం,సహనం వంటి గుణాలు వారు తప్పక
ప్రోది చేసుకుంటారనే ఆశావహ దృక్పథం కలిగింది.
రేపటి రోజున వికసించబోయే పూలకోసం వనాలలో గొప్పులుతవ్వి,నీరుపెట్టి,సంరక్షించే పనిమంతుడైన తోటమాలిలా ఈనాడు శ్రీనాథ్ నా కంటికి కనిపించాడు.
ఏదో తనపని తాను చేసుకు పోకుండా శ్రీనాథ్ వాడపల్లి రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని బాల సాహిత్యంలో కృషిచేస్తూ పిల్లలకు ఉత్సుకతా,ఊహాశక్తీ , సృజనాత్మకత పెంపొందించి సాహిత్యాభిరుచి రేకెత్తించే విధంగా రచనలు చేయటం,టెక్నాలజీని వుపయోగించి వాటికి తగిన
ఆకర్షణీయమైన చిత్రాలతో పుస్తకాలు తీసుకు రావటం హర్షణీయం.
ఒకనాటి మా మాష్టారు వాడపల్లి లక్ష్మీ నారాయణాచార్యులుగారి పుత్రుడైన శ్రీనాథ్ యీనాడు ప్రపంచదేశాల్లో ఇంత ఎత్తులకు ఎదిగి కీర్తిమంతుడైనందుకు సంతోషంగా వుంది.
అంతేకాదు శ్రీనాథ్ ఆంగ్లంలో రాసిన ఈ బాలల పుస్తకాల్ని భారతీయభాషలన్నింటిలోకీ అనువాదం చేయించి భారతదేశంలోని బాలలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనుకోవటం ముదావహం.మక్కీకి మక్కీ కాకుండా భారతీయ పరిస్థితులూ,వాతావరణానికి తగినట్లుగా అనువాదకులకు తగుమార్పులు అనుసృజనగా చేసే అవకాశం కల్పించటంతో కథలకు అంతరప్రవాహంగా కాక భారతీయ సహజపరిమళం కల్గింది.
శీలా పల్లవి తెలుగులోకి అనువాదం చేసిన శ్రీనాథ్ రాసిన ఈ కథలు తెలుగు తావిని వెదజల్లుతున్నాయి.
ఇంకా మరెన్నో మంచి పుస్తకాలతో బాలసాహిత్యంలో తనకంటూ ప్రత్యేక ముద్ర సాధించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీనాథ్ వాడపల్లికి, తెలుగులోకి అనువదించిన శీలా పల్లవికి ఆత్మీయ అభినందనలు.
- శీలా సుభద్రాదేవి
హైదరాబాద్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)