27, మార్చి 2026, శుక్రవారం
జానపదం నుండి ప్రగతి పథంలోకి నాయని కృష్ణకుమారి కవితాప్రస్థానం
~ జానపదం నుండి ప్రగతి పథంలోకి నాయని కృష్ణకుమారి కవితాప్రస్థానం ~
ఒక రచయిత ఎన్ని ప్రక్రియలలో రచనలు చేసినా, పరిశోధనలు చేసినా అతని సాహిత్యంలోని ఒక ప్రక్రియతోనే ఆ రచయిత గుర్తింపు సాధిస్తారు.
అదేవిధంగా నాయని కృష్ణకుమారి వ్యాసం, యాత్రాచరిత్ర, కథలు, జానపద గేయ కథలు వంటి అనేక సాహిత్యప్రక్రియలతో అక్షరయాత్ర కొనసాగించినా ఆమెని ప్రధానంగా జానపదసాహిత్య పరిశోధకురాలని విద్యారంగంలోనివారు గుర్తిస్తారు. కానీ సాహిత్యరంగంలోమాత్రం కవయిత్రిగానూ, కాశ్మీరదీపకళిక వంటి యాత్రా చరిత్ర రాసిన తొలి రచయిత్రిగానూ గుర్తిస్తారు.
బాల్యంనుండీ తండ్రి నాయని సుబ్బారావుగారి వలన ప్రముఖ సాహితీవేత్తలతో జరిపే చర్చలు వింటూ సాహిత్యాభిలాషే గాక నిర్భయంగా నలుగురిలోనూ మాట్లాడటం నేర్చుకున్నారు నాయని కృష్ణకుమారి. తొలిరోజులనుండీకూడా పరిశోధనాత్మక సాహిత్యరచనపట్ల మక్కువ పెంచుకోవటంవలన 18ఏళ్ళ వయసులోనే ఆంధ్రుల చరిత్రని పరిశీలించి 'ఆంధ్రుల కథ' అనే పుస్తకం వెలువరించారు. తదనంతరం 'తిక్కన కవితావైభవం'పై పరిశోధన మొదలుపెట్టి మధ్యలో ఆపేసి 'జానపద సాహిత్యం'పై పరిశోధించి డాక్టరేటు పట్టా తీసుకున్నారు. అయితే సమాంతరంగా కవిత్వ రచనపట్ల ఆసక్తి ఉన్నా వృత్తిరీత్యా సమయాభావం వల్ల కావచ్చు- అగ్నిపుత్రి (1978), ఏంచెప్పను నేస్తం (1988), సౌభద్ర భద్రరూపం (2006) అనే మూడు కవితాసంపుటాలు మాత్రమే వెలువరించారు.
1960 నుండీ కవిత్వం రాస్తున్న కృష్ణకుమారి ఆనాటి కవయిత్రులకు భిన్నంగా సమాజ పోకడలను గమనిస్తూ, సామాన్య మధ్య తరగతి జీవుల పక్షాన నిలబడుతూ, కవితలు రాయటం గమనించవలసిన విషయం. జానపద పరిశోధన ప్రభావం వలన కావచ్చు అచ్చమైన తెలుగు పారిభాషిక పదాలతోనే వీరి కవితలు సామాజిక స్వభావాన్ని పొదువుకొని వుంటాయి.
స్వాతంత్ర్యానంతరం కవిత్వంలో రాజకీయ, సామాజిక పరిస్థితుల ప్రభావం ఎక్కువగా కవులలో ప్రతిబింబించినా, సాహిత్యోద్యమాలలోని భావకవిత్వోద్యమం ఛాయలు ఎక్కువగా కవయిత్రులలో కనిపిస్తున్న సమయంలోనే కృష్ణకుమారి ఆధునిక శైలిలో రాశారు.
అంతేకాక అదే సమయంలో సృజనాత్మకత కల మహిళామణులందరూ ధనమూ, కీర్తీ తెచ్చిపెట్టే నవలారచన వైపు మొగ్గుచూపి నవలామణులుగా ప్రఖ్యాతి పొందేరు.
అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావం అనంతరం కవుల కవిత్వ ధోరణిలో మార్పు వచ్చింది. అదేకాలంలో కవిత్వరచన మొదలుపెట్టారు నాయని కృష్ణకుమారి. అంతవరకూ సామాజిక, కౌటుంబిక పరిస్థితులకు కట్టుపడిన కవయిత్రులలో వైవిధ్యమైన, స్పష్టమైన గొంతుకను ప్రదర్శించిన తొలి కవయిత్రిగా కృష్ణకుమారిని పేర్కొనవచ్చు.
1960-78 వరకూ రాసిన కవితలను 'అగ్నిపుత్రి'గా సంపుటీకరించారు.
“వర్తమానాన్ని తిట్టుకుంటూ
నిస్పృహలో మునిగి తేలే
నీరవ మూర్తి కాదు నా కవిత
ప్రతి నీటి కణంలో తోచే
ప్రభాకర ప్రతిఘటనంలా
నా కవిత్వమంతటా
నమ్మకం అక్షరమై మెరుస్తుంది" అని ఆత్మ విశ్వాసంతో తన కవిత్వం గురించి చాటిచెపుతారు కవయిత్రి.
పాఠకుడి మనసుకి కవితాసౌందర్యం అందాలంటే కవికి సంబంధించిన అనుభూతిపరమైన వివరణను అందుకునేందుకు దోహదపడే ఆర్ద్రతా, మనోభావాలు, కవిత్వంలో ప్రతిఫలించాలి.
నాయని కృష్ణకుమారి స్వభావరీత్యా సాధుస్వభావి. అందుకే కాలక్రమేణా వచ్చే సామాజిక మార్పుల్ని ఆహ్వానిస్తారు, దుఃఖిస్తారు. కానీ మార్పుకోసం విప్లవ భావాల్ని కోరుకోరు.
చాలా కవితల్లో దేవుడంటూ ఉన్నాడో, లేడో అనే డోలాయమాన స్థితిలో అంతస్చేతనలో రాసిన చాలా కవితలు కనిపిస్తాయి. కానీ మూఢభక్తిని ప్రోత్సహించరు. ఆమె తన ముందుమాటలో కూడా 'దేవుడి విషయంలో ఇదమిద్ధమనే భావన నాకింకా ఏర్పడలేదంటారు. అందుకే ఆమె వెతుకులాట కొన్ని కవితల్లో వ్యక్తమౌతుంది.
చాపకింద నీరులా ప్రవహించే కాలప్రవాహంలోని మార్పుల్ని నిబ్బరంగా ఎదుర్కోవాలని అభిలషించే కవిత్వం వీరిది. అందుకే
"కాలం చెంగుల్ని పట్టుకొని
అతివేగంగా నడుస్తూనే
అగమ్యోహాల చిక్కుముళ్ళని
అతినేర్పుగా విప్పుకుంటాను”- అంటారు.
కవిత్వమంటే జీవితమనీ, అనుభవాల తామరతంపరలనీ కవయిత్రి విశ్వాసం. పాఠకుల మనసులకు అందని సర్కసు ఫీట్ల కవిత్వాన్ని రాసి మెప్పుపొందే కవుల ఆధిపత్యాన్ని నిరసిస్తారు. చెప్పదలచుకున్న విషయాన్ని డొంకతిరుగుడుగా కాక సూటిగా చెప్పటం వీరి కవిత్వ లక్షణం.
“నా కవిత్వాన్నిరూపు కట్టించదలచుకున్న భావంగా నేను కూడా రూపాంతరం చెందుతాను. అంతేకానీ భావాలకు ఆశ్రయభూతాలైన శబ్దాల్లోకి పరకాయ ప్రవేశం చేయను. కవిత్వంలో కవి మనస్సే కాక అతని చిత్తవృత్తి, అహంకారమూ, ఆర్ద్రతా, కాఠిన్యమూ వంటి లక్షణాల స్థాయి తెలిసినప్పుడు ఆ కవి కవిత్వము అర్థమయ్యే పద్దతి వేరుగా ఉంటుంది' అంటారు నాయనికృష్ణకుమారి.
'దూరం కొలత' అనే కవితలో కోరికల్ని గుర్రాల్లా పరిగెత్తనీయకు అని పాఠకుడికి బోధించేందుకు అన్నట్లు పలు ఉదాహరణలు ఇచ్చారు.
“నీకూ నీ కోరికకూ మధ్య
దూరం ఎంత ఎక్కువైతే
అంతగా పెరుగుతుంది.
అంతరంగంలో రాగం..."అని చెప్తూనే-
“కావలసినదానికంటే ఎక్కువగా
కామిత ఫలాన్ని ఒడిగట్టచూడకు" అని సలహా యిస్తూ-కొసమెరుపుగా-
"ఇది నీకే కాదు
నీ పిల్లలకు కూడా పనికొచ్చే నిజం” అని ముక్తాయింపుని ఇస్తూ పిల్లల పట్ల అమితమైన ఆశలు పెట్టుకోవద్దని, అవి నెరవేరకపోతే కుంగిపోవలసి వస్తుందనే అర్థాన్ని ధ్వనింపజేస్తారు.
'రాళ్ళు-పిచ్చివాళ్ళు' అనే కవితలో నేటి సమాజాన్ని వ్యంగ్యంగా చిత్రిస్తూ--
“ఎక్కడ చూసినా ఈ రోజుల్లో
పిచ్చివాళ్ళ చేతుల్లో
పిడుగుల్లాంటి రాళ్ళు” అంటారు.
దైవం గురించి చాలా కవితల్లో ఉన్నాడో లేడో అనే వెతుకులాటతో సంశయాత్మకంగా రాసారు కవయిత్రి. అందులో ఒకటి 'గాలి పిడికిలి'.
"గాలి పిడికిళ్ళ వేలంవెర్రికి
కొంటె నవ్వులు రువ్వుతూ
గుండెగుడిలో దీపంలా నువ్వు" అంటూ ప్రతీ మనిషిలోనూ గుండెల్లోనూ వెలిగే దీపమే దైవమని తీర్మానిస్తారు.
కొన్ని కవితల్ని మాత్రాఛందస్సు పద్ధతిలో పంక్తి చివర ప్రాసని పెట్టి ఒక లయతో నడిపారు. అవి ఆనాటి కవులైన శ్రీశ్రీ వంటివాళ్ళు తొలినాళ్ళలో రాసినవిధానాన్ని తలపిస్తాయి.
"బ్రతుకు పాట ప్రిదిలి
కదులు బాట నొగిలి
శృతి చలించి
మతి భ్రమించి" అంటూ లయను పొదువుకొని సాగుతాయి.
భరతమాతని హిమావృత శైలపంక్తి కిరీటంతో, వింధ్యాచల వడ్డాణంతో, గంగాయమున కంఠహారాలతో అలంకరించి అప్సరసలా ఉన్న దేశం ఈనాడు మామూలు స్త్రీలా పిల్లల చేతికి ఒకముద్ద అందించలేని పేదతల్లిగా మార్చేస్తున్న అదృశ్యహస్తాల్నీ వాటిని పడగొట్టాలని తపన పడ్తూ, మాత ముఖంలో వెలుగు కోసం హారతి కర్పూరమై కరిగిపోవాలనే ఆరాటంతో ఆరు పేజీల సుదీర్ఘ కవిత అర్థవంతంగా మంచి పదచిత్రాలతో అక్షరీకరించారు కవయిత్రి.
సముద్రం, అగ్ని, జ్వాలా, శిఖలను కవిత్వ పంక్తులలో పొదుగుకొంటూ కాలాన్ని తన నెచ్చెలిగా భావించి తనలో లయింపచేసుకొంటూ, సర్వ విషయాలూ కాలనెచ్చెలికి అర్థమయ్యేలా ఆమె చేయి పట్టుకుని ముందుకు తన గమనాన్నీ గమ్యాన్నీ నిర్దేశించుకుంటూ పోతుంది అనే విషయాన్ని అనేక కవితల్లో ప్రస్తావిస్తారు.
మరొక మంచి కవిత 'మట్టి మనిషి'. బాల్యంనుండి మనిషికి మట్టితోగల అనుబంధాన్నీ, అమ్మకీ మట్టికీ గల సాదృశ్యాన్నీ, అభేధాన్నీ వర్ణిస్తూ
"తొలకరింపు తడుపుకు
చిలకరించిన మట్టివాసనల చిక్కదనంలో అమ్మవాత్సల్యపు కమ్మదనాన్ని”- చెబుతారు.
"నన్ను కన్నతల్లి ఆంతర్యంలో
నా నేలతల్లి ఆధిక్యాన్ని కొలిచే
నేనింకెవరిని మట్టిమనిషిని” అని సామాజిక జీవనంలోకి మమేకమౌతారు.
సాధారణ పదాలతోనే కవితల్ని అల్లే నేర్పు బహుశా జానపద సాహిత్యపరిశోధనలవల్ల అలవోకగా అలవడింది. అలా రాస్తూ రాస్తూనే ఒక్కొక్కప్పుడు అకస్మాత్తుగా భారీ సమాసాల్ని కవితలో చొప్పించేస్తారు. అంతకుముందు చదివిన కావ్యప్రభావం వల్ల అలాంటి పదగుంభనలోకి వెళ్ళిపోతారు. అటువంటి వాటిలో కొన్ని ఉదాహరణలు-
1. శాద్వలాంచల వాః కణాలకు మల్లె
2. దురంత భీషణ క్రుధోద్విగ్న ప్రకృతి
3. తీరస్థ పృధు శిలాగ్ర స్పర్శనం
4. దుష్టచ్ఛేద నోన్ముఖ నిస్త్రింశిక వంటి పంక్తులు వారి కవితల్లో దొర్లడం కనిపిస్తుంది.
అయితే అటువంటివి బహు తక్కువే.
వవవవఏడున్నర పేజీల ‘ఊడలమర్రి' కవిత కొమ్మల నీడన గూటిలోని పక్షుల గాథను కథాత్మకంగా వర్ణించారు. అటువంటిదే నాలుగున్నర పేజీల 'చౌరస్తా’. మరొకటి ఏడు పేజీల 'అన్నదమ్ములు' కవిత సంభాషణాత్మకంగా నడుస్తుంది. పగలంతా గిల్లికజ్జాలుతో అమ్మని సతాయించిన అన్నదమ్ములు రాత్రి కావలించుకొని పడుకున్నప్పుడు 'స్వప్న వియద్గంగలో సేదతీరుతున్న శ్వేతయుగళంలా' వున్నారంటూ అందమైన పదచిత్రాలతో కథన కవితగా రాసారు కవయిత్రి.
మరొక మంచి కవిత 'హుసేన్ సాగర్'లో-
“చక్కని హైదరాబాద్ చూపించమని
సముద్ర పాప గగ్గోలు" పెడితే
"అలల పిడికిళ్ళతో
నీటిని విసిరితే తీరిన కడలిముక్కే
నగర శరీరాన్ని హత్తుకున్న
సొగసైన హుసేన్ సాగర్ పాప” అంటూ హుసేన్ సాగరాన్ని కడలిముక్కగా పోల్చిన తీరు చదువరికి చక్కని దృశ్యాన్ని చూపుతుంది. ఈకవితనిండా మబ్బుపిల్లలు తారట్లాడుతారు. నేలతల్లి తన ఒడిలో అమర్చుకున్న నిర్మలమైన అద్దం బిళ్ళగా హుసేన్ సాగరాన్ని పోల్చేరు. అంతటి నిర్మల కాసారాన్ని ధ్వంసం చేస్తోన్న గుర్రపు డెక్కల మొక్కల్ని గురించీ వాపోయారు కవయిత్రి.
సాధారణంగా భావకవిత్వచ్ఛాయలున్న కవులు వెన్నెలతోనో, పూలతోనో, మలయపవనంతోనో మమేకమౌతారు. విప్లవ కవులు సూర్యుని తోనో, జ్వాలలతోనో పోల్చుకుంటారు. కానీ కృష్ణకుమారి గారు మాత్రం-
‘మనిషికీ మనిషికీ
మధ్య కనీ కనపడని
ఎర్రడాలు మనసు మంటల్నీ
దయ్యంలా అసూయని పెంచే
మానవత్వం మసిచేసే మంటల్నీ
కన్నెర్రని మంటల్నీ ఆర్పే
బొగ్గుపులుసు గాలిని” అన్నారు కవయిత్రి.
ఎప్పుడూ మనిషి అంతరంగ దర్శనం చేస్తూనే అతని బాహ్య జీవన విధానాన్ని సరిపోల్చుతూ కవిత్వీకరించడం ఈ కవయిత్రి సాహిత్యలక్షణం. అందుకే ఆమె ‘చింతలూ, చికాకులూ, నిరాశలూ, దురాశలూ, కష్టాలూ, కన్నీళ్ళూ, సుఖాలూ, సంతోషాలూ, సంతృప్తి, త్యాగరక్తీ వంటి సమస్త పార్శ్వాలూ రంగరించుకొని రూపెత్తిన సగటు మనిషే నా కవిత్వమంతటా విశ్వరూపావిష్కరణంగా ఉండాలనుకుంటాను” అన్నారు.
నాయని కృష్ణకుమారి తమ తల్లిని ఆరోగ్యవంతురాల్ని చేసే క్రమంలో వైద్యురాలిగా పరిచయమై హృదయానికి దగ్గరైన ఆత్మీయ మిత్రురాలైన డా|| పి. శ్రీదేవి మరణవార్త (1962)విని ఆర్ద్రంగానే కాక ఆత్మీయ స్పర్శను నింపుకున్న స్మృతిగీతం “ఏం చెప్పను నేస్తం" కవిత-
“నీవు మామధ్యను లేనందున
మాకు వెలితి!
నీ కలం కథలుగా మారనందున
తెలుగు కథలకే వెలితి!”
అంటూ ఆద్యంతాలకి అందకుండా ఆవేశకావేశాలు పట్టని ప్రతికూల పరిస్థితుల్ని సైతం అనుకూలంగా మలచుకోగల అంతర్గతంగా శక్తిశాలిని అయిన డా|| పి. శ్రీదేవికి ఆత్మీయంగా 'ఏం చెప్పను నేస్తం' కవితాసంపుటిని అంకితం ఇచ్చారు కృష్ణకుమారి.
ఈ సంపుటిలోని కవితలన్నింటా సమాజంలో పెచ్చరిల్లుతున్న హింస, ఆర్థిక అసమానత, విద్యారాహిత్యం, కులమత ప్రాంత విద్వేషాలు- ఇలా సమాజాన్ని కుదిపేసిన పలు సమస్యల్ని గుదిగుచ్చి రాసిన ఆరేడు పేజీల పెద్ద కవితలే ఉన్నాయి. అంతవరకూ ఉగాది సమ్మేళనాల్లో మామిడిపూతలూ, కోయిల పాటలూ, చెరుకు, మామిడుల రుచులూ వీటితో కోమల కవిత్వాన్ని వినిపించే కవి సందర్భాలలో కృష్ణకుమారి సామాజిక సమస్యలవైపు దృష్టి సారించి అరవయ్యో దశాబ్దంలోనే కవిత్వీకరించటంలో రచయిత్రి సామాజిక దృష్టి కోణం తెలుస్తోంది.
ఇంద్రధనస్సులోని రంగుల్లా విభిన్న అంతరాలు వున్న జనాల్ని ఈ ఉగాదైనా ఒక్కటిగా చేస్తుందా అనే ఆశావహ దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ జనంలో పొడచూపుతున్న అనేకానేక వైరుధ్యాల గురించీ, పెచ్చుపెరుగుతోన్న హింసా ప్రవృత్తుల గురించీ, అంతకంతకూ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్న పేదల గురించీ అక్షరాల్లో పొదిగి వాపోయారు కవయిత్రి.
దేవుని అస్తిత్వాన్ని నిర్ధారణ చేసుకోలేని సంశయంలో 'మృత్తికాతృష్ణ' కవితలో మట్టికీ మనిషికీ గల అవినాభావ సంబంధాన్ని వివరించే క్రమంలో నగర రోడ్లు విశాలం చేయాలనుకుంటే రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే మతాలయాల గురించి నిరసించారు.
"సామాన్యుని బతుకుని బాగుచేయమని
అడ్డమైన దేవతల్నీ
అడుక్కుంటున్న తరుణంలో
కనురెప్పలమీది నీలితెరల్ని లాగి
వెలుగుసూదుల్ని గుచ్చుతుంది.
ఉగాది ఒయ్యారి" అని మూఢభక్తిని నిలదీశారు.
1969లో వచ్చిన ఉద్యమ నేపథ్యం వలన కాబోలు తెలుగు భాష గురించిన కవితల్లో మాతృభాషాభిమానాన్ని వెల్లడించడమే కాక అందరం ఒక భాషామతల్లి బిడ్డలమేనని తెలుగు కవిత్వం సార్వజనీనత్వాన్ని అభిలషిస్తూ కొన్ని కవితలనూ రాసారు.
మొదటి కవితాసంపుటి తన తండ్రి నాయని సుబ్బారావుగారికి అంకితమిచ్చిన కృష్ణకుమారి సుమారు పాతికేళ్ళ తర్వాత రాసిన 'సౌభద్ర భద్రరూపం'గా శోభనిచ్చే చిరునవ్వుతో ఆర్తులైన వారినందరినీ, ఆత్మీయంగా అభిమానించే తల్లి భద్ర రూపాన్ని తలచుకుంటూ తల్లికే అంకితమిచ్చారు.
ఇందులోని చాలా కవితల్లో తన బాల్యాన్ని తలపోస్తూ, ఆ సమయంలో ప్రేమగా హత్తుకునే తల్లిని గుర్తుచేసుకొన్నారు కవయిత్రి.
“పెను ప్రపంచంలోకి నన్ను
నిర్దాక్షిణ్యంగా విసిరేసి
మూసుకుపోయిన నీ గర్భ ద్వారం" అంటూ తన పుట్టుకని గుర్తు చేసుకుంటూ, చల్లటి స్పర్శలా చాచిన చేతుల మధ్య ఒదిగిపోయి ఆమె గుండెమీద గువ్వపిట్టైనప్పటి దృశ్యాల్నీ; దూదుంపుల్లా, తొక్కుడు బిళ్ళాట నాటి ఉత్సాహాన్నీ అక్షరబద్ధం చేసారు. ఈ క్రమంలో ప్రకృతినంతటినీ తల్లీబిడ్డలుగా వర్ణించటం గమనార్హం. బద్ధకంగా పడుకున్న కొండలు చెట్లచేతులు చాపాయన్నారు. ఆకాశం భూమిపిల్లను సందిట పొదువుకుందన్నారు. రెక్కలు మొలిపించుకున్న పులుగుకూన /శ్రమించి కట్టిన గూడును దాటి ఎగిరిపోయి రాబందుల పాలౌతుందేమోనని దిగులుపడ్డారు.
"నేలతల్లి నిర్భర వక్షాన
తల్లిని కరచుకున్న పిల్ల పోలిక
పల్లవించిన అడవి!”ని దర్శించారు ఈ విధంగా అంతటా మాతృ దర్శనాన్ని వీక్షిస్తున్న కృష్ణకుమారిగారు, తన జీవన సంధ్యలో ముందుకు వేస్తున్నప్రతీ అడుగూ మృత్యువు వైపుకు కాదంటారు. తనవెనక ఘనీభవించిన కాంతి సముద్రం వైపు, దాంట్లో వటపత్రశాయి లాంటి బాల్యంవైపూ, తన పుట్టుకకు కారణమైన గర్భద్వారంవైపు ప్రయాణించి తిరిగి తల్లి గర్భగూడులో గువ్వపిట్టలా ఒదిగిపోవాలని కలగన్నారు కవయిత్రి.
తొలి సంపుటిలో దైవం గురించి డోలాయమానంగా ఉన్న కవయిత్రి ఈ సంపుటి చివరి మూడు కవితల్లో దైవాన్ని నిర్ధారించుకున్నారు.
తిరునామం కింద కళ్ళకలువల్నీ, విశ్వరూప చమత్కారానికి, ఉక్కిరిబిక్కిరై, ఊపిరందని చేపపిల్లలా ఎగసిపడుతూ తలంచుతున్నానని అన్నారు.
ప్రతి కవితనీ ఒక సామాజిక బాధ్యతతో, సమసమాజ భావనతో, మానవీయ దృక్పథంతో రాసారు కవయిత్రి. అనేకచోట్ల మట్టినీ, నేలనీ, దేశాన్నీ, మాతృభాషనీ, తల్లితో పోలుస్తూ మాతృభావనని అనేక కవితల్లో కవిత్వాన్ని అమ్మగా రూపుదిద్దారు నాయని కృష్ణకుమారి.
మూడు నాలుగు దశాబ్దాల పాటు అనేక సాహిత్య ప్రక్రియలతో పాటూ కవిత్వానికి నిర్భయాన్ని అద్ది, ఉద్యోగ సంబంధమైన ఒత్తిడులలో సైతం తనదైన శైలిలో కవిత్వాన్ని రాస్తూ విదుషీమణిగా కవిత్వ పతాకాన్ని ఆవిష్కరించిన కవయిత్రి నాయని కృష్ణకుమారి.
(సారంగ)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి