25, మార్చి 2026, బుధవారం
కాలాతీతవ్యక్తులు ఎందుకు చదవాలంటే...~
~ కాలాతీతవ్యక్తులు ఎందుకు చదవాలంటే...~
శ్రీదేవి కాలాతీతవ్యక్తులు ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక కొత్త విషయం పాఠకులకు అందుతుంది. రమారమి డెభ్భై ఏళ్ళ నాటి ఈ నవల ఈ విధంగా మూడుతరాల పాఠకులకు ఎందుకు చేరువౌతుంది? ఏమిటి దీని ప్రత్యేకత?
ఇందులోని పాత్రలూ,వారి మనస్తత్వాలూ సజీవమే.డెభ్భైఏళ్ళ క్రిందటా అటువంటి వారు జీవించారు .యాభైఏళ్ళ క్రితం సమాజంలోనూ వున్నారు, పాతికేళ్ళ నాడూ చూసాము.ఈనాడు మన మధ్యనే మనతోనే వున్నారు.బహుశా అందుకే ఈ నవల ఏదో ఒకనాటి సమాజానికి చెందినది మాత్రమే అని చెప్పటానికి వీల్లేదు.
శ్రీదేవి రచించిన నవల 'కాలాతీత వ్యక్తులు' మొత్తం చదివిన తర్వాత పాఠకులకు అనేక ఆలోచనలూ, సందేహాలూ వస్తాయి. ముఖ్యంగా ఈ నవలలోని ప్రతీ పాత్రకీ మరో పాత్రతో గల సంబంధం ప్రత్యేకంగా ఆర్థికాంశాలమీదే ఆధారపడి ఉంటుంది. అది ప్రధానమైన విషయం.
ఇందిరకు ప్రకాశంతో, కృష్ణమూర్తితో ఉన్న స్నేహమైనా,కళ్యాణికి ప్రకాశంతో, కృష్ణమూర్తి తో,డా.చక్రవర్తితో స్నేహమైనా ,ఇందిర తండ్రికి తన మందూ వగైరాల కోసం ప్రకాశం, కృష్ణమూర్తి తోనే కాక ప్రకాశం మేనమామ శేషావతారాన్నీ మాటలతో బురిడీ కొట్టటం మొదలైనవన్నీ ఆర్థిక ప్రాతిపదికగా జరిగినవే.
భూస్వామ్య వ్యవస్థ నుండి ప్రారంభమై పెట్టుబడిదారీ వ్యవస్థ వరకూ ఆయా చారిత్రక, భౌగోళిక దశలలోని మార్పులను, వాటి ఫలితంగా సామాజిక సంబంధాలూ, మానవ సంబంధాల మధ్య జరిగే సంఘర్షణలనూ సంక్షోభాలనూ అంతర్లీనంగా ప్రదర్శించే నేర్పు ఆసాంతం ఈ నవలకు ప్రధానంగా వాతావరణ భూమిక అయింది.
స్వాతంత్రం వచ్చిన తొలి రోజులు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం దేశంలో ఏర్పడిన ఆర్థిక ఛిద్రంవలన తొంభై శాతంకి పైగానే కుటుంబాలు మధ్యతరగతికి దిగువనే ఉండే పరిస్థితి ఏర్పడింది. కష్టపడితేగాని నోట్లోకి ఒకముద్ద వెళ్ళని స్థితి. ఆనాటి రాజకీయ, సామాజిక నేపధ్యంలో అప్పుడప్పుడే విద్యావంతులూ,చిరుద్యోగినులుగా ఎదుగుతోన్న ఆడపిల్లలలో ద్వైదీ భావమనస్తత్వాలు ఏవిధంగా సందిగ్ధతలోకి నెట్టివేస్తున్నాయి.ఇలా ఎన్నో పరిస్థితులు రూపాంతరం చెంది ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతుంటే వాటికి ఎదురు నిలవటానికి యువతులు తమ ఆత్మవిశ్వాసాన్ని ఎలా కూడగట్టుకోవాలో అర్థం అవుతుంది.
ఈ నవల అంతా చెప్పను.
ఇందులోని మూడు ప్రధాన స్త్రీ పాత్రలు, వారిని ప్రభావితం చేస్తున్న మూడు పురుష పాత్రలు గురించి మాత్రమే పరిచయం చేస్తాను.నవలలో సమయానుకూలంగా ,ఆయా సందర్భాలలో వచ్చే మరికొన్ని పాత్రలు కూడా వున్నాయి.
ఇందులో ఇందిరని తల్చుకుంటే భయం కలుగుతుంది, మరోసారి ధైర్యమూ కలుగుతుంది. ఆ పాత్రని అర్థం చేసుకోవాలంటే గుండె దిటవు కావాలి. అరవై ఏళ్ళ క్రిందట సృష్టింపబడిన ఇందిర పాత్రని ఆ విధంగా తీర్చిదిద్దటానికి శ్రీదేవి చాలా ధైర్యాన్ని కూడగట్టుకునే ఉండాలి. ఎందుకంటే ఇందిర ఒక వ్యక్తికాదు, ఒక పాత్రకాదు, ఒక వ్యవస్థ. కొన్ని కఠిన పరిస్థితులలో జీవితాన్ని కొనసాగించాలంటే ఇందిరలా ప్రవర్తించక తప్పదు అనే వాస్తవాన్ని, జీవనసత్యాన్ని నిర్భయంగా చాటిన రచయిత్రి, తన అభిప్రాయాల్ని బలంగా బలపరుస్తూనే ఆ పాత్ర చిత్రణలో ఎంతో శ్రద్ధ తీసుకుంది రచయిత్రి.
"రెక్కలున్నాయనుకొని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అవి తడిసిపోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది. మనిద్దరి పరుగులాటలూ ఒకటే. " కృష్ణమూర్తితో ఇందిర అంటుంది
మరో సందర్భంలో ఇందిర మనసులో మాటగా - "త్యాగానికైనా ఒక హద్దుంటుంది. ఎవరికీ పనికిరాని త్యాగాలు చేయటం బుద్ధిహీనం. నాన్నను ఒదిలెయ్య బోవటంలేదు. నాఉద్యోగం, నా స్వతంత్రం అన్నీ అలాగే ఉంటాయి. భావదాస్యం, ఆర్థికదాస్యం రెండూ మనిషిని కుంగదీస్తాయి.” అని స్పష్టంగా చెప్పిస్తుంది రచయిత్రి.
స్వతంత్ర వ్యక్తిత్వం గల స్త్రీ కుటుంబ జీవితంలో ఏమి కోరుకుంటుందో నిర్భయంగా ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా చెప్పటంలో ఇందిర చైతన్య స్ఫూర్తి తేటతెల్లమౌతుంది.
"ప్రతి మనిషికీ సమస్యలుంటాయి. సమస్యలు లేనిది చచ్చిపోయినవాళ్ళకి మాత్రమే. నీ జీవిత కాలంలో నిండుగా బతుకు. నిర్భయంగా బతుకు. రోజుకి పదిసార్లు చావకు. ఇంకొకళ్ళని చంపకు. నీకు తారసిల్లిన మనుషుల్లో అణగిమణిగి ఎక్కడైనా లోలోపల కొంచెం మానవత్వం ఉంటే దాన్ని బయటకి తీయటానికి ప్రయత్నించి దాన్ని బైటకి రానియ్యి. మానవత్వం ఉండడం సిగ్గుపడవలసిన నేరం ఏమీ కాదు." అంటూ వివిధ సందర్భాలలో ఇందిరచేతనే చెప్పించారు రచయిత్రి.
కూర్చుని తినే వ్యసనపరుడైన తండ్రికీ, ఇందిరకీ ఆమె తెచ్చే జీతం డబ్బులు సరిపోవు.యవ్వనంలోని తన ఆశల్ని,కలల్నీ పండించుకొనే అవకాశాలు లేని ఇందిర తన అరకొర జీవితానికి కారణమైన లేమిమీద పగ, కసి వ్యక్తపరచలేక ఒక సాధారణ స్త్రీలా కాకుండా చిత్రాతిచిత్రమైన వ్యక్తిలా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తనలో ప్రేమ, కోపం, ఆవేశం, పగ, దుఃఖం, నిరాశ, నిర్లిప్తత, స్వార్థం అన్నీ ఉంటాయి. అన్నీ ఎక్కడనుండో వచ్చిపడినవి కాదు.బాల్యంనుండీ ఎదుర్కొన్న అనేకానేక అనుభవాల కారణంగా జీవితం ప్రసాదించినవే.
నవలలో ఇందిరని ఒకచోట సర్కస్ ట్రెపీజ్ మీద ఫీట్లు చేసే అమ్మాయిగా చూపిస్తూ ఆమెలోని బలహీనతలు, లోపాలు తుడిచి పెట్టేసి చివరికివచ్చేసరికి క్రమక్రమంగా పెంపొందిన ఇందిర వ్యక్తిత్వం, మానసిక పరిణత అబ్బురపరిచేలా నవలంతటా ఆమె పాత్రని చిత్రించిన తీరు శ్రీదేవిలోని రచనా పరిణతకి, భావసాంద్రతకీ అద్దం పడుతుంది. కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో ఎత్తుపల్లాలు, ఎదురు దెబ్బలు, అవమానాలే కాక, వాటిని అధిగమించటానికి జీవితంపై పగ, కసితో వ్యక్తిత్వాన్ని చెక్కుకొంటున్నప్పుడు క్రమంగా సానపడుతూ వెన్నెముకగల స్త్రీగా ఎదిగిన క్రమాన్ని
ఇందిర పాత్ర చిత్రణలో స్పష్టంగా చూపుతుంది.ఇందిర కొన్నిసార్లు జీవితం అంటే లక్ష్యం లేనట్లు మాట్లాడుతుంది.మరికొన్నిసార్లు తాత్విక చింతనతో మాట్లాడుతుంది.ఏదిమాట్లాడినా అర్థవంతంగానే మాట్లాడుతుంది.ఆ మాటలన్నీ రచయిత్రి శ్రీదేవివే.నవల రాసే నాటికి ముప్పై ఏళ్ళ లోపునే వయసు వున్న శ్రీదేవి ఇంత పరిణతతో జీవితసారాన్ని అవుపోసన పట్టినట్లుగా రాయటం అబ్బురమే.
కళ్యాణి అనేకానేక నవలల్లో లాగానే ఒక మంచి కథానాయికగానే కనిపిస్తుంది.
ఇందిర పాత్రకు సమాంతరంగా కళ్యాణి పాత్రను నవల అంతటా శ్రీదేవి ఒకేరకంగా నడిపించింది. ఇందిరలా చొరవలేదు, మాటలతో ఆకట్టుకొనే మనస్తత్వం కాదు. పురుషులతో మాట్లాడేటప్పుడు ఆనాటి పరిస్థితుల కనుగుణంగా బిడియపడుతూనే మాట్లాడుతుంది. స్నేహితుల వద్దకూడాతన అవసరాలు బయటపడకుండా గోప్యంగా నడుచుకుంటుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులతో రాజీ పడుతుంది. ఎటువంటి సందర్భంలోనూ తనలోని రాగద్వేషాలు కాని, తన అభిప్రాయాల్ని కానీ వెల్లడించకుండా తనలో తానే మధనపడుతుంది.కళ్యాణిని ఆర్థిక అవసరాలు తెలీనీకుండా పెంచిన తండ్రి మరణించాక ప్రకాశం పట్ల ఆకర్షితురాలైనా, వసుంధర ఆశ్రయం, తనకి గార్డియన్గా ఉన్న మునసబు మరణించడం, ఆ సందర్భంలో ఆదుకొన్న డా॥ చక్రవర్తి స్నేహం పొందడం అన్నీ నాటకీయంగా జరుగుతాయి. అనుకోని పరిస్థితులలో మానసికంగా దగ్గరైన డాక్టరు చక్రవర్తి దగ్గర తన మనసును బయట పెట్టడంతో అది వారిరువురి వివాహానికి దారితీసింది. ఈ నవలలో కథానాయిక ఇందిరా,కళ్యాణా అనే వాదవివాదాలు అనవసరం.ఆనాడేకాదు ఈనాటికీ వస్తోన్న అనేకానేక రచనల్లోని కథానాయికలు కళ్యాణికి సాదృశ్యంగానే ఉంటారు.మనసమాజంలో రాజీపడుతూ బతికేసే సగటు మహిళలు ఎప్పుడూ వుంటారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ కాళ్ళుచాపుకొని ఏడుస్తూ కూర్చుని ఒకరిమీద ఒరిగి పోకుండా నిలదొక్కుకొని ఇందిరలా నిలిచేవారు ఈనాడు స్త్రీవాద వుద్యమం వూపందుకొన్నాక ఎక్కువమందే వుండి వుంటారు.
మరో స్త్రీ పాత్ర వసుంధర కళ్యాణికి సహాధ్యాయి మానవత్వం మూర్తీభవించిన మంచి మనిషి.కళ్యాణి కష్టాలకు కరిగిపోయి ఆశ్రయం యిచ్చి తానుకూడా ఈ వలయంలో చిక్కుకు పోతుంది.ఆమె కుటుంబ సభ్యులు అంతా ఆమెని పువ్వుల్లో పెట్టి
పెంచారు.ఆమెకు ఏకష్టాలు తెలియవు.అందువలనే వసుంధరను ఆమె కుటుంబ సభ్యులు మందలించటం రచయిత్రి సహజంగా రాసింది.
కళ్యాణి వలన కృష్ణమూర్తి,చక్రవర్తుల పట్ల స్నేహం,ఆకర్షణ ఏర్పడినా సహృదయంతో అర్థం చేసుకొని తాను తప్పుకొని వారి వివాహాలకు తిరుపతి వెళ్తుంది వసుంధర.అవసరమైన సంఘటనలను కల్పించి శ్రీదేవి మలుపులతో నవలకు ముగింపు పలకటంలో చాకచక్యం చూపింది.
ఎంబిబిఎస్ చదువుతున్న ప్రకాశం ఎవరో ఒకరి అధికారం క్రింద బతకటానికి అలవాటు పడిన సామాన్యుడుగా చిత్రించింది రచయిత్రి.స్వంత అభిప్రాయాలూ, స్వంత ఆలోచనలు లేని చంచలస్వభావుడు.ఆర్థిక అవసరాలు ఎంతటి పిరికితనాన్నీ,లొంగిపోయే మనస్తత్వాన్ని ప్రకాశంలో ఏ విధంగా కలిగించాయో ప్రతీ సందర్భంలోనూ రచయిత్రి నేర్పుగా చిత్రించింది.చదివిస్తున్న మామయ్య ఇనుప పిడికిలిని తప్పించుకునే నేర్పు లేక ప్రకాశం లొంగిపోయి మామయ్య ఇష్టప్రకారం వివాహం చేసుకుంటాడు.
ప్రకాశం లాంటి యువకులు బ్రతుకు బాధలను ఎదుర్కోలేక అడుగడుగునా రాజీపడి అణిగిమణిగి ఎలా బతుకుతారో ఈ నవలలో అత్యద్భుతంగా చిత్రించారు శ్రీదేవి.
కృష్ణమూర్తి పాత్రని ఆర్థిక ఇబ్బందులులేని విలాసపురుషుడిగా,నైతికవిలువలు లేని వాడిగా ఏవగింపు కలిగించేలా నవలలో ప్రవేశపెడుతుంది.కానీ రానురాను ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా ఇందిర కోరుకున్న పెద్ద ఛాతిగల వ్యక్తిగా తీర్చిదిద్దింది రచయిత్రి.
కృష్ణమూర్తి ఆదర్శాలు వల్లించడు.పగా కార్పణ్యం లేనివాడు.స్నేహాన్ని ప్రేమించి అవసరాలకు అండగా నిలుస్తాడు.జీవితాన్ని అర్థం చేసుకుని ఎదుగుతాడు అనేలా క్రమక్రమంగా అవసరమైన మేరకు సన్నివేశ కల్పన చేస్తుంది రచయిత్రి.
'ప్రపంచంలోని అందరి ఉగాదులూ మనవే' అనుకునే సార్వజనీన దృక్పథం కలవాడిగా చివరకు కృష్ణమూర్తి పాఠకులకు గోచరిస్తాడు.
"దేశంలో ఉన్న దరిద్రం సగం మనుషుల మనసులలో ఉంది. ఇవ్వడానికి చేతిలో దమ్మిడీ లేకపోవచ్చు. కాని మనస్సు ఇవ్వటానికేం ఖర్మ? కాని ఇవ్వరు. నాలుక పీక్కున్నా ఇవ్వరు. ఇవ్వడంలో హాయి ఉందిరా అంటే అర్ధం చేసుకోరు"అంటాడు కృష్ణమూర్తి.కృష్ణమూర్తి అమృత హృదయుడు. మంచిగా తప్ప మరొకలా ఉండలేడు అనేలా రచయిత్రి ఈ పాత్రను నిర్థారించారు.
కుటుంబ సమస్యలు, భార్య మరణం వంటి జీవిత సమస్యలతో బాధపడుతున్న డా|| చక్రవర్తీ, ఆర్థిక కారణాలే కాక, మానసికంగా, భౌతికంగా కూడా ఒంటరి అయి ఆలంబనకోసం పరితపిస్తున్న కళ్యాణీ ఒక్కటి కావటంలో పెద్ద ప్రత్యేకత ఏమీలేదు. అటువంటి అనేక సన్నివేశాలు చాలా నవలల్లో చదివే వున్నాం.
అవసరమైనప్పుడు లోకాన్ని ధిక్కరించైనా, తనకేం కావాలో దాన్ని సాధించుకున్న ఆధునిక యువతి ఇందిర, కాలానికి అతీతంగా ఆమె నడుచుకున్నట్లనిపించినా నవతరం స్త్రీలో ఆ విధమైన మానసిక స్థైర్యం ఉండాలనేదే శ్రీదేవి ఉద్దేశం. అన్యాయం జరిగినప్పుడు కుంగిపోయి, ఆత్మహత్యకు తలపడటం ఏనాడూ స్త్రీ చేయవలసిన పని కానేకాదని ఇందిర పాత్ర ద్వారా రచయిత్రి శ్రీదేవి ఈ నవలలో ప్రధానంగా చెప్పారు
ఇందులోని ప్రతీ పాత్ర ప్రవర్తనకూ ఆ పాత్ర కుటుంబ నేపధ్యం,పెరిగిన విధానమే మూలకారణంగా రచయిత్రి నిరూపిస్తూనే యీ రచన చేసింది.ఆ నిరూపణల్లో రచయిత్రి ఎక్కడా తడబడలేదు.అది గమనించవలసిన విషయం.బహుశా శ్రీదేవి వృత్తిపరంగా వైద్యురాలు కావటం వలన రోగానికి మూలం కనుగొన్న విధంగానే
తాను సృజించిన పాత్రల మూలాలను పాఠకులకు కూడా అవగాహన కల్పిస్తూనే కథనం చేసిందని స్పష్టమోతుంది.
అందుకే ఒక ఇంటర్వ్యూలో " 'కాలాతీత వ్యక్తులు' అప్పటికే కాదు. ఇప్పటికి ఎప్పటికీ నిలిచిపోయే నవల, ఎంత కఠిన మైన విషయాన్నయినా, మరెంతో జుగుప్సాకరమైన సంఘటమైనా అతి నైపుణ్యంతో రాయగలిగే నేర్పు శ్రీదేవిలో వుంది. ఒక ఇందిర, కళ్యాణి, వసుంధర, ఒక చక్రవర్తి, కృష్ణమూర్తి, ప్రకాశం... ఎప్పుడూ మన మధ్యే వుంటారు."అన్నారు .శ్రీదేవికి ఆత్మీయురాలైన పి.సరళాదేవి.
శ్రీదేవి స్వభావరీత్యా మృదుభాషిణి, స్నేహశీలి. వ్యక్తిగాను, రచయిత్రిగానూ స్వతంత్ర ప్రవృత్తి గలది. అందుకే ఈమె సృజించిన పాత్రలుకూడా స్వతంత్ర ప్రవృత్తి కలిగివుండి ఎటువంటి క్లిష్టసందర్భాలలోనైనా సంయమనం కోల్పోక తమ వ్యక్తిత్వం నిలుపుకుంటాయి. తనకి గల స్నేహస్వభావంవలనే ఆమె రచనలలోకూడా స్నేహానికి పెద్దపీట వేసింది.
'కాలాతీతవ్యక్తులు' నవలలో తెలుగునాట రాజకీయ, ఆర్థిక, సామాజిక,కౌటుంబిక పరిస్థితులన్నింటినీ నవలా నేపధ్యంలో స్పష్టీకరించటం వలన పాఠకులకు కాల పరిణామక్రమం చక్కగా అవగాహన అవుతుంది.
సాధారణంగా నవలల్లో ఇతర పుస్తకాల ప్రస్థావన ఉండటం అరుదు.కానీ ఈ నవలలో అనేక పుస్తకాలు గురించి అక్కడక్కడా ప్రస్థావించటం వలన రచయిత్రి మంచి చదువరి అనే విషయం తెలుస్తుంది.
రచయిత్రి అనేక సందర్భాలలో స్త్రీవాద దృక్పథాన్నే కాక సంపూర్ణ మానవులుగా బతకాల్సిన విధానాన్ని కూడా పాత్రల సంభాషణల ద్వారా నవలలో ప్రకటించింది.సరిగ్గా అందుకోసమనైనా కాలాతీతవ్యక్తులు నవల చదవాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
One of the worst Telugu novels I ever read. I lost my precious time reading this overrated novel. Could not complete it. I stopped reading fiction books after reading this.
రిప్లయితొలగించండి