తెలుగు కథా ప్రస్థానం వయసుఎంతో కొంచెం తక్కువగా కారా మాస్టారు జీవితం అంతే.కథ గుర్తు వస్తే కారా మాస్టారు గుర్తు వస్తారు,ఆయన గుర్తు వస్తే కథానిలయం నిలువెత్తున కళ్ళ ముందుకు వస్తుంది.తెలుగు కథాసాహిత్యం లో విడదీయలేని బంధం అది.
కారా మాస్టారి నవతి సందర్భంగా సావనీర్ కోసం వ్యాసం రాయమని అట్టాడ గారు అడిగినప్పుడు ఎంతోమంది వారి సాహిత్యం గురించి రాసారు ఇంకా నేనేమి రాస్తాను అని వారి కథలు పుస్తకం తీసి చదవటం మొదలెట్టేసరికి పేజీ పేజీకీ నాలో ఉద్వేగం కలిగింది.ఎన్ని జాతీయాలో,ఎన్ని నానుడు లో, ఇంకెన్ని సామెతలో ఉత్తరాంధ్ర మాండలీకం నింపుకుని పరిమళాలు నా మనసు చుట్టేసాయి.ఇక అంతే అవి నోట్ చేసుకుంటూ "సామెతలు,నానుడుల పరిమళం" అనే వ్యాసం రాసాను.
అంతకు ముందు తెలుగు కథలు సరళ గ్రాంథికంలోనే ఎక్కువమంది రాసేవారు.కారా గారూ, రావిశాస్త్రి,బీనాదేవీ ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలజీవనశైలినీ, సంస్కృతి నీ,కడగండ్లనూ,వారి మనోభావాలను కళ్ళకు కట్టేలా మాండలికసొబగుతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసారు.
ఇక వారు స్థాపించిన కథానిలయం కథా పరిశోధకులకు కల్పవృక్షం, సాహిత్య గని.నేను శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసినప్పుడు గానీ,తదనంతరం రచయిత్రుల కథలు గురించి వ్యాసాలు రాసినప్పుడు గానీ కథానిలయం ద్వారా ఎందరో కథకులు కథలను చదవ గలిగాను.కథానిలయం వలనే సమగ్రమైన వ్యాసాలు రాయగలిగాను.అందువలన కథా సాహిత్యానికి కారా మాస్టారి కృషి విలువ కట్టలేనిది.
హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మాఇంటికి వచ్చేవారు.తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ మహాసభలలో ప్రత్యేక పురస్కారానికి వచ్చినప్పుడు సభా ప్రాంగణం లో కలిసినప్పుడు అప్పటికే వారికి కొంత మరుపు మొదలైనా నన్ను గుర్తు పట్టి మా అక్కయ్య నీ,అన్నయ్య నీ, వీర్రాజు గారి గురించి అడిగారు.నా వ్యాసాలు పుస్తకం పంపినప్పుడు వారు ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని ఆశీర్వదించారు.
మరొక రెండేళ్ళలో శతవసంతాలు పూర్తి చేసుకోవాల్సిన తరుణం లో వారు వెళ్ళిపోవటం శోచనీయం.ఐతే ఈ కరోనా కష్టకాలంలో ఏమీ బాధ పడకుండా ఈవిధంగా కుమార్తె చేతిలో అనాయాసమరణం ప్రాప్తించినందుకు కొంత ఊరట.
ఏది ఏమైనా ఒక తెలుగుకథా మహా వృక్షం నేలకి ఒరిగింది.ఇది సాహిత్య రంగానికి తీరని లోటు.ఈ రెండు మాటలు చెప్పే అవకాశం నాకు కలిగించిన మనలో మనం అడ్మిన్ లకు ధన్యవాదాలు.
కారా మాష్టారు కి నా బాష్పాంజలులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి