20, సెప్టెంబర్ 2023, బుధవారం

సాకారమైన కల

సాకారమైన కల కలలకు రెక్కలొచ్చినట్లే మనసుకు కూడా రెక్కలొస్తే బాగుండు నన్ను బాధిస్తున్న ఎండుబెరళ్ళ మనుషుల్ని నిలువెల్లా ముళ్ళుతొడుక్కున్న సమూహాల్ని ఇన్నాళ్లుగా వెంటాడుతోన్నట్లు వెనకవెనకే అల్లుకుంటూన్న చిక్కుసమస్యల దట్టమైన అరణ్యాల్ని దాటి విశాలాకాసం లో నా కోసమే పొడిచిన పొద్దులో మనసురెక్కల్ని ఆరబెట్టుకునేదాన్ని కలలకు రెక్కలొఛ్చినట్లే చూపుకి కూడా రెక్కలొస్తే బాగుండు రాత్రేగినంతకీ ఎగరేసి ఎగరేసి సొమ్మసిల్లిన కళ్ళనీ పుస్తకాల్లోని అక్షరాల్ని ఏరుకున్న పిట్టయి బరువెక్కిన రెప్పల్ని నిద్రవాలని రాత్రంతా విసుగుకొంటూ విసురుకొంటూ అలసిన కంటిపాపని కప్పేందుకు దుప్పటిలా వాలిపోయే చూపులరెక్కల్ని మెత్తగా హత్తుకునేదాన్ని కలలకు రెక్కలొఛ్చి ఊహకి రెక్కలొస్తే బాగుండు సీతాకోకచిలుకని చేసి స్నేహవసంతవనం లో పూచిన పూబాలల్ని గిలిగింతలతో పలకరిస్తూ పిల్లగాలిలో రాగాలుతీస్తూ సెలయేటి పాటకు గొంతుకలుపుతూ ఉహలరెక్కల్ని రంగురంగుల పూరేకులతో అందంగా అలంకరించే దాన్ని అవునవును కలలకు రెక్కలొఛ్చినట్లే మాటకి రెక్కలొచ్చినట్లే ఉంది ఎవ్వరేమనుకుంటారో అని మనసునొచ్చినా కన్నీళ్ళుచిందినా గుండెగదిలో దాక్కున్న పిట్టలా పెదాలతలుపుల్ని బిడాయించుకొని బైటకి వచ్చేందుకు తడబడుతూ లోలోపలే కునారిల్లుతూ కూచోకుండా మాట రెక్కల్ని విదిల్చి మాటకీమాట గా పదానికి పదమై నిలువెల్లా పరిపూర్ణ వాక్యమై కవిత్వమై ప్రవహిస్తూనే ఉంది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి