26, సెప్టెంబర్ 2023, మంగళవారం

నడక దారిలో--32

నడక దారిలో --32 కొత్త ఇల్లు మాకు విశాలంగానే ఉంది.ముందుగదిని వీర్రాజుగారు ఆఫీసు రూంలా అమర్చుకున్నారు. మూడు గదులు దాటాక పెరటిలో దేశీ గులాబిచెట్టునిండా పూలతో బాగుంది.అయితే పెరటిగోడని ఆనుకొని క్షత్రియ హాస్టల్ ఉండేది.ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గోడ పక్కనే అబ్బాయిల ఆటలు,కేకలు,కబుర్లతో గోలగోల గా ఉండేది. వీథి గుమ్మం పక్కన కూడా మొక్కలు పెంచుకొనే వీలుంది. అదే కాంపౌండ్ లో లలితా వాళ్ళ చెల్లెలు భాగ్యలక్ష్మి కుటుంబం ,ఆమెతల్లిదండ్రులతో సహా ఉండటం నాకు కొంత ధైర్యం కలిగించింది.భాగ్యలక్ష్మి భర్త "నిజం" పేరుతో కవిత్వంరాసే జర్నలిస్టు శ్రీరామ్మూర్తి గారు.భాగ్యలక్ష్మి, శ్రీరామ్మూర్తి గార్ల పెళ్ళిమాటలు మేము రాంకోఠీలో ఉన్నప్పుడు మా ఇంట్లోనే జరిగాయి. మా కాంపౌండ్ పక్కనే ఉన్న ఇంటిలో యువభారతి సభ్యులు బసలింగప్పగారు ఉండేవారు.ఆయనకు పల్లవి వయసు అమ్మాయిలు ఉండటంతో పల్లవి సంతోషంగా ఆడుకునేది. ఈ ఇంటికి వచ్చాక పల్లవిని తిలక్ నగర్ లోని శ్రీవిద్యా సెకండరీ స్కూల్ లో జాయిన్ చేసాము.అదే స్కూల్లో యువభారతి సభ్యులు మాడభూషి రంగాచార్యులు గారి శ్రీమతి లలితాదేవి ఉపాధ్యాయురాలు.అప్పటినుండీ వారితో మాకు స్నేహం మరింత పెరిగింది.మా ఇంటి ఎదురుగా ఉండే అమ్మాయితో కలిసి పల్లవి స్కూల్ కి వెళ్ళేది.అక్కడకి దగ్గరలో ఎవరో సంగీతం నేర్పిస్తారని తెలిసి పల్లవిని చేర్చాను. ఎమ్మే రెండో సంవత్సరం పరీక్షలకు కూడా ఫీజుకట్టి కొన్ని పుస్తకాలు తీసుకు వచ్చారు వీర్రాజుగారు.కానీ బాబు ఆరోగ్యం మరీ క్షీణించింది.తరుచూ ఏదో ఒక హడావుడి చేస్తుండటంతో హాస్పిటల్స్ చుట్టూ తిరగటం అవుతోంది. మెలకువగా ఉన్నప్పుడు చాపమీద బోర్లా పడుకుని బొమ్మలతో ఆడిస్తే బాగానే ఉండేవాడు.ఈ వయసుకి గంతులు వేస్తూ ఆటలు ఆడుతూ, కబుర్లు చెప్పాల్సిన మూడున్నర ఏళ్ళ వాడు బోర్లా మాత్రమే పడి అర్థంలేని కేకలే తప్ప అమ్మా అనే పిలవటం కూడా రాని రబ్బరు బొమ్మ లాంటి వాడిని చూస్తుంటే కడుపు తరుక్కుపోయినట్లు దుఃఖం నన్ను ముంచెత్తేది.వాడిని నిద్రపోయినప్పుడు కాళ్ళమీద పడుకోబెట్టుకున్నంత సేపూ నిద్రపోయేవాడు.మెల్లగా పక్కమీద చేర్చే సరికి ఉలికి పడి ఫిట్స్ వచ్చేసేది.దాంతో రాత్రంతా నేను కొంతసేపు, వీర్రాజు గారు కొంతసేపు కాళ్ళమీద బాబుతో కూర్చునే ఉండాల్సి వచ్చింది. పల్లవి బడికి,ఆయన ఆఫీస్ కి వెళ్ళాక పగలు కూడా కాళ్ళమీద బాబుని పడుకోబెట్టుకుని పుస్తకాలు చదువుకునేదాన్ని.ఈసారి పరీక్షలు రాయగలనా అనుకున్నాను. పరీక్షలకు ముందు విశ్వవిద్యాలయం నిర్వహించే కాంట్రాక్ట్ తరగతులకు ఈసారి కూడా హాజరు కాలేకపోయాను.సంస్క్రతం పేపర్లో కాళిదాసురఘువంశం,హితోపదేశం లో విగ్రహము,సంధి భాగాలు పాఠ్యాంశంగా ఉన్నాయి.విశ్వవిద్యాలయం వాళ్ళు రఘువంశం నోట్స్ ఇచ్చారు కానీ సంధి ఇవ్వలేదు.బయటషాపులలో కూడా దొరకలేదు.చిన్ననాటి స్నేహితురాలు లలితకు ఉత్తరం రాసాను.ఆమెకు కూడా దొరకలేదుట.లలిత పనిచేస్తున్న స్కూల్లో సెలవు దొరక నందున ఆమె కూడా విశ్వవిద్యాలయం క్లాసులకు హాజరు కాలేదట.'హాజరైయ్యుంటే నోట్స్ దొరికేది ' అంది.ఇక నాదగ్గర ఉన్నపుస్తకాలే చదువుకున్నాను. ఎప్పటిలాగే అమ్మని పరీక్షలసమయంలో రమ్మన్నాను.పల్లవికి స్కూలు సెలవులే కనుక బాబుని ఆడించటానికి సహాయంగా ఉంది. ఈసారి కూడా రెడ్డి కాలేజీలోనే ఎగ్జామ్స్ సెంటరు.లలిత ఎప్పటిలాగే అక్కడ కలిస్తే మాట్లాడుకున్నాం.సంస్క్రత పరీక్ష ముందురోజు హితోపదేశంలో సంధి,విగ్రహముల భాగాలు ఎవరో కొన్ని పేజీలు పంచారు.అవికూడా చదువుకుని పరీక్షలు నిర్విఘ్నంగా రాసాను.పరీక్ష రాసి వచ్చాక అమ్మ మలకపేట పెద్దక్క ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండి వస్తానంటే వీర్రాజు గారు తీసుకు వెళ్ళి అక్కడ ఇంట్లో దింపి వచ్చారు.. "ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎలా అయితేనేం పట్టుదలతో ఎమ్మే పూర్తి చేసేసావు" అని ఆ రాత్రి ఆయన నన్ను ప్రశంసించారు."ఇకపై తిరిగి సాహిత్యం వైపు దృష్టి పెట్టు" అని హెచ్చరించారు. ఫలితాలు గురించి ఏమూలో భయం ఉన్నా, ఎమ్మెస్సీ చేయలేకపోయినా ఏదో ఒక పీజీ చేసినందుకు నాకు తృప్తి గా అనిపించింది. ఇంకా పడుకుందామనుకుంటూనే సరికి బాబు అకస్మాత్తుగా లేచి ఏడవటం మొదలుపెట్టాడు. ముదురుమట్టిరంగులో వాంతులు చేసుకోవటంతో మందులవలన అలా వాంతి చేసుకుంటున్నాడు అనుకున్నాం రాత్రంతా కాసేపు నిద్రపోవటం సడెన్ గా లేచి ఏడవటం ఫిట్స్ రావడం, వాంతి చేసుకోవడంతో ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ జాగరణ చేసాం. ఉదయమే పల్లవిని పక్కనే ఉన్న శ్రీరామ్మూర్తి గారింట్లో అప్పగించి మేము బాబు చికిత్స కోసం సాధారణంగా ఎప్పుడూ తీసుకుని వెళ్ళే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాము.ఆయన చూసి నిలోఫర్ కి తీసుకు వెళ్ళమన్నారు.నిలోఫర్ హాస్పిటల్ కి తీసుకెళ్తే వెంటనే చేర్చుకుని సెలైన్ అమర్చి దానిగుండా మందులు వెళ్ళేలా చేసారు. ఈ వార్త తెలిసి మా పెద్దమరిది రామకృష్ణా, మల్లేష్ మొదలైనవారు నిలోఫర్ హాస్పిటల్ కి వచ్చారు.ఇంట్లో పల్లవిని చూసుకోవటానికి మా అమ్మను అక్కయ్య ఇంటినుంచి పిలిపించాము.అక్కయ్య హాస్పిటల్ కి మా ఇద్దరికీ భోజనం పంపించేది. రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడి మూడోరోజు మమ్మల్ని తన వైకల్యం చూసి ఇంక కుమిలి పోవద్దనేనేమో ఈ లోకం నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు మా చైతన్యబాబు. ముద్దులు మూటగట్టేలా ఉన్న బాబు ని చూసి నిత్యచైతన్యవంతుడిలా ఉండాలని చైతన్య అని పేరుపెట్టుకున్నాము.ఏ స్పందనా లేని గాజుబొమ్మలా ఉండి మూడున్నర ఏళ్ళ పాటు ఎప్పటికప్పుడు మా మనసుల్లో ఆశని రాజేసుకుంటూ గడిపిన మమ్మల్ని ఇంక సెలవంటూ మా ఒడి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. రాత్రీ పగలు నిద్రకాచుకుంటూ గడిపిన నాకు ఒక్కసారిగా ఖాళీ అయిన ఒడిని చూసుకునే సరికి నిర్వేదం ఆవరించింది. నా పరీక్షలకు ఆటంకపరచకూడదనుకునేనేమో ప్రాణం నిలబెట్టుకుని మరీ వెళ్ళిపోయిన బాబుని గుర్తు తెచ్చుకుంటే దుఃఖం ముంచుకొచ్చింది. మూడున్నర ఏళ్ళుగా మా యింట అడుగు పెట్టని తోటి కోడళ్ళు మిఠాయిలు పట్టుకొని పరామర్శకి వచ్చేసరికి గుండెల్లో అగ్గి రాజుకుంది దుఃఖం ఆవిరైపోయింది. విషయం తెలిసి నాబాల్యస్నేహితురాలు కుమారి,వాళ్ళ ఆడబడుచు లక్ష్మి వచ్చారు.నన్ను ఓదారుస్తూ "సుభద్రా నువ్వు బియ్యెడ్ ఎంట్రన్స్ రాయకూడదా? నీ టేలెంట్స్ కి, మనస్తత్వానికి టీచర్ ఉద్యోగం బాగుంటుంది.పిల్లలమధ్య వుంటే నువ్వు మామూలు మనిషి వౌతావు.ఆలోచించు.పల్లవికూడా కొంచెం పెద్దదయ్యింది కనుక ఇబ్బంది ఏమీ ఉండదు"అంది. కానీ ఇప్పుడు ఎంట్రన్స్ రాయగలనా అని సందేహం వెల్లడిస్తే "ఏమీ పర్వాలేదు సుభద్రా 8,9,10 తరగతుల పుస్తకాలు ఓసారి తిరగెయ్యు సరిపోతుంది." అంది. నాకు కూడా ఏమైనా చేయాలనిపించింది.ఇలా నాలుగు గోడల మధ్య వుంటే ఏమైపోతానో అనిపించింది. వీర్రాజు గారు రాగానే ఈ విషయం చెప్పాను.వీర్రాజుగారితో పాటూ వచ్చిన సిధారెడ్డి "నేను రేపు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఎంట్రెన్స్ ఫాం తీసుకు వస్తాన"న్నాడు. అదే విధంగా సిధారెడ్డి మర్నాడు ఉదయమే ఫాం తీసుకురావడమే కాదు అదేరోజు సబ్మిషన్ కు ఆఖరురోజని చెప్పి ఫాం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి యూనివర్సిటీ లో సబ్మిట్ చేసారు. ఇంటికి చుట్టుపక్కల పిల్లల్ని పుస్తకాలు అడిగి చదవటం మొదలెట్టాను.బియస్సీ చేసి పదేళ్ళయ్యింది.కానీ నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు కనుక గణితం , సూత్రాలు వెంటవెంటనే గుర్తు వచ్చాయి.చదువులో పడేసరికి మనసు కొంత కుదుట పడింది.మొత్తంమీద ఎంట్రెన్స్ బాగానే సంతృప్తికరంగానే రాసాను. ఈలోపు ఎమ్మే రిజల్ట్ వచ్చింది.సెకెండ్ క్లాస్ లో పాసయ్యాను.ఆ పరిస్థితుల్లో పరీక్షకు చదివినా మంచి మార్కులు రావటం సంతోషం కలిగింది.నా పరీక్ష పూర్తయ్యేవరకూ ప్రాణాలుగ్గబెట్టుకున్న బాబు గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి ఎంఫిల్ అడ్మిషన్ ప్రకటన చూసి మనసు అటువైపు ఊగింది.వీర్రాజుగారు కూడా "ఒక ప్రయత్నం చేయు.ఇదివస్తే ఎంఫిల్ చెయ్యు.బియ్యీడి సీటు వస్తే అదిచెయ్యు" అన్నారు.వచనకవిత్వంలో కావ్యాలు పేరుతో రెండు పేజీలు నోట్స్ తయారు చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాను.అప్పట్లో ఎంఫిల్, పీహెచ్డీ లకు ఇంటర్వ్యూ తప్ప ఎంట్రన్స్ లేదనుకుంటాను. మొదటిసారి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కుతుంటే ఉద్వేగం ఆవరించింది.అటువైపు బస్సులోని ఆటోలోనో వెళ్ళినప్పుడల్లా ఎప్పుడన్నా ఆ మెట్లు ఎక్కి రూముల్లో చదువుకొనే అవకాశం వస్తుందా అనుకునేదాన్ని.ఎమ్మే కాంటాక్ట్ క్లాసులకి వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది. డా.కులశేఖరరావుగారూ,డా.నాయని కోటేశ్వరి, బిరుదురాజు రామరాజు గార్లు ఇంటర్వ్యూ చేసారు. అప్పటికే పుస్తకరూపంలోకి వచ్చిన ఆకలినృత్యం కవితాసంపుటి,కథలు, వ్యాసాలు చూసారు.కానీ నాకు సీటు రాలేదు.ఆ ఏడాది రెగ్యులర్ గా ఎమ్మే చదివిన వారికే ఇచ్చారని తెలిసింది. ఈ లోగా బియ్యిడీ ఎంట్రెన్స్ లో నాకు 56 రేంకు వచ్చినట్లు కార్డు వచ్చింది.మంచిరేంకు వచ్చింది తప్పని సరిగా కాలేజీలో సీటు వస్తుందని మిత్రులు చెప్పారు. ఒక్కసారి సంతృప్తిగా ఊపిరి తీసుకున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి