26, సెప్టెంబర్ 2023, మంగళవారం

నడక దారిలో --33

నడక దారిలో -- 33 బియ్యిడీ కాలేజీలు ఏవేవి ఉన్నాయో ఇంటికి వచ్చిన కవిమిత్రులను అడిగి తెలుసుకున్నాం.మా ఇంటికి దగ్గరగా ఉన్నది,ఫీజులు తక్కువగా ఉన్నది ఆంధ్రమహిళాసభ బియ్యీడీ కాలేజి అని తెలిసి దానికే అప్లై చేసాను. నా సబ్జెక్టు గణితం కావటం వలన మొదటి లిస్ట్ లోనే సీటు వచ్చింది.కావలసిన డాక్యుమెంట్స్ పట్టుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాను.డిగ్రీ చదివి పదేళ్ళు అయ్యిందని ఫిజికల్ సైన్స్ చదవగలనో లేదోననే భయంతో తెలుగు ఎమ్మే చేసాను కదా గణితం, తెలుగు మెథడ్స్ గా సీటు ఇమ్మని అడిగాను.కానీ బీయస్సీ లో ఆప్షన్స్ బట్టి గణితం, భౌతిక రసాయన శాస్త్రాలు మెథడ్స్ గా చేయాల్సిందే అన్నారు.మరిక ఏమీ అనలేక ఒప్పుకున్నాను. ఫీజుకట్టి , డాక్యుమెంట్స్ కాలేజీలో సబ్మిట్ చేసినప్పుడు తప్పనిసరిగా వివాహం అయిన వాళ్ళు అందరూ "నో ప్రెగ్నెన్సీ "అని డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ,లేకపోతే మధ్యలో నిండునెలలవల్లా,డెలివరీ వలన చదువు ఒత్తిడి తట్టుకోలేక తరగతులకు హాజరుకాకపోతే కష్టమౌతుంది అన్నారు.కాలేజీ ప్రిన్సిపాల్ చాలా సౌమ్యంగా చిన్నపిల్లలకు చెప్పినట్లుగా చెప్పారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తేవాలి అర్థం కాలేదు.నిజానికి బాబు పుట్టాక కాపర్ టీ వేయించుకున్నాను.దానికి సంబంధించిన పేపర్లు ఏవి కనిపించలేదు.నల్లకుంట మెయిన్ రోడ్ మీదే డా.కేవీ.కృష్ణకుమారి బోర్డు కనబడి అక్కడికి వెళ్ళాను.ఆమె రచయిత్రి అని తెలుసు.నేను పేషెంట్ గా నాపేరు ఎస్.సుభద్రాదేవి అని రాయించాను.నన్ను పరీక్ష చేస్తున్నంత సేపూ,అక్కడ ఉన్నంతసేపూ తన అందాన్ని, రచనల్ని ప్రశంసిస్తూ ఎన్ని ఉత్తరాలు వస్తుంటాయో, ఎలాంటి ఉత్తరాలు వస్తాయో చెప్తూనే ఉందామె.నేను మౌనంగా వింటూ కూర్చున్నాను.చివరికి " నో ప్రెగ్నెన్సీ" అని సర్టిఫికెట్ ఇచ్చింది.బతికించేవు తల్లీ అనుకుంటూ బయటపడ్డాను. కావలసిన డాక్యుమెంట్స్ కలిపి,ఫీజు కట్టి కాలేజీలో సబ్మిట్ చేసి గుండెలనిండా ఊపిరి పీల్చు కున్నాను. వీర్రాజు గారు తాను పెట్టిన అయిదేళ్ళ సెలవు పూర్తి కావటంతో వికాస్ అడ్వర్టైజ్మెంట్ ఆఫీస్ బాధ్యత పూర్తిగా స్నేహితునికి అప్పగించి తిరిగి ఆఫీస్ లో చేరిపోయారు.వికాస్ ఆఫీస్ లో ఇంటీరియర్ కోసం నిర్మల్ కళాకారుడి చేత లైఫ్ సైజ్ లో ఒక నెమలిని వీర్రాజు గారు ముచ్చట పడి చేయించారు.అటువంటి నెమలి బొమ్మ ఉండటం చేత ఆఫీస్ నష్టాల్లో నడిచిందనీ దాన్ని అమ్మేయాలనే స్నేహితుడి ఆలోచన తెలిసి వీర్రాజు గారు ఆ నెమలి బొమ్మని నేను తీసుకుంటానని చెప్పి ఇంటికి రిక్షాలో వేయించి తీసుకు వచ్చేసారు.చొచ్చుకుపోయేతనం, వ్యాపార నైపుణ్యం లేనివారికి స్వంతంగా ఆఫీస్ పెట్టి నెగ్గుకురావడం అంత సులభం కాదనే పాఠం నేర్చుకున్నాము మేమిద్దరం.అయితే ఆ అనుభవం వల్ల సంపాదించినది ఏమీ లేకపోయినా ఆ నెమలి బొమ్మ మాత్రం దక్కింది. ఉదయమే వంటా ,టిఫిన్ తయారుచేసి ముగ్గురికీ బాక్సులు కట్టేసేదాన్ని.పల్లవి ఎనిమిదికే రిక్షాలో వెళ్ళిపోయేది . వీర్రాజు గారు ముఖచిత్రాలు వేయాల్సినవి ఉంటే ఆ పని చేసుకొని తాపీగా వెళ్ళేవారు.నేను తొమ్మిది కల్లా బయల్దేరి ఫీవర్ హాస్పిటల్ దగ్గర బస్సు ఎక్కి కాలేజీకి వెళ్ళే దాన్ని. క్లాసులో కొత్తగా డిగ్రీ పూర్తిచేసిన ఇంకా యవ్వనం వీడని అమ్మాయిలంతా ఒక గ్రూపుగా ఉండేవారు.నాలాంటి పెళ్ళిళ్ళై ,పిల్లలున్న వాళ్ళం ఒక గ్రూపుగా తిరిగే వాళ్ళం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రోగ్రాం కోసం కొందరు అమ్మాయిలు పాటలు ప్రాక్టీస్ చేస్తుంటే ఆసక్తి కొద్దీ నేనూ వెళ్ళి కూర్చున్నాను.కొంతమంది మళయాళీ అమ్మాయిలు కేరళ జానపద పాట ప్రాక్టీస్ చేస్తున్నారు.అందులోని బీట్ బాగా నచ్చి అప్రయత్నంగానే గొంతు కలిపాను.నా పక్కనే కూచున్న ఒక మేడం ఆశ్చర్యపోయి " ఎంత తొందరగా రాగాన్ని పట్టుకున్నావు! సంగీతం నేర్చుకున్నావా?" అని అడిగి నన్ను ఒక పాట పాడమన్నారు. సుమారు పదేళ్ళ తర్వాత గొంతెత్తి లలిత గీతం పాడాను.అక్కడ ఉన్న వాళ్ళంతా అభినందించారు.ఆ తర్వాత ఒక్కొక్కప్పుడు అందరం కూర్చుని పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు నేనూ పాడుతూ ఉండేదాన్ని.అలా కొంచెం కొంచెంగా మానసికంగా కుదుటపడటం మొదలైంది. మా కాలేజీలో స్పోర్ట్స్ డే సందర్భంగా జరుగుతున్న ఆటల్ని చూస్తూ రన్నింగ్ కామెంటరీని "నువ్వు కవయిత్రివి కనుక కవిత్వంలో చెప్పమ"ని మా మేడం మైక్ అందించారు. అప్పటికే వచ్చిన నా ఆకలినృత్యం సంపుటి కాలేజీలో ఇచ్చాను .దాని ఫలితం.దేవుడా!! అని కనిపించని వాణ్ణి తలచుకొని కాగితం మీద అప్పటికప్పుడు అప్పటికి వెలుగులో ఉన్న క్రీడాకారిణులను గుర్తు తెచ్చుకుని వారితో పోలుస్తూ నాలుగక్షరాల్ని రాసి కాసేపు చదివాను.దాంతో కాలేజీలో కవయిత్రిగా నమోదు ఐపోయాను. నేను చదువుతున్న రోజుల్లోనే దుర్గాబాయి గారి సహచరులు చింతామణిదేశముఖ్ మరణించడంతో ఆంధ్రమహిళాసభ డిగ్రీ కళాశాల,మా బీయ్యీడికళాశాల కలిసి అదే ఆవరణలో ఉన్న గాంధీ హాల్ లో సంతాపసభ ఏర్పాటు చేసారు.ఆ సందర్భంగా ఆయన మీద కవిత రాసి చదవమన్నారు మా కాలేజీవాళ్ళు.సరేనని దుర్గాబాయి గురించి కొంత రాసి ఆయన గురించి వాళ్ళు నడుపుతోన్న సంస్థల గురించి కలిపి రాసాను.నిజానికి కవిత బాగానే వచ్చింది.కాని నేను దీనిని నా సంపుటాలలో చేర్చలేదు.డిగ్రీకాలేజీలో తెలుగుశాఖ కి పెద్ద అయిన నిడమర్తి నిర్మలాదేవి గారితో అప్పుడే పరిచయం అయ్యింది.ఆమె కూడా కవిత చదివారు. నిర్మలాదేవి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మీద పరిశోధన చేసినట్లు తెలిసింది.ఆమె కూడా నా గురించి వివరాలు తెలుసుకున్నారు. పూర్తిగా పాఠాల్లో మనసును లగ్నం చేసి ఏకాగ్రతతో చదువులో మునిగిపోయాను.మిగతా సబ్జెక్టులు పర్వాలేదు కానీ ఫిలాసఫీ,సైకాలజీ కొంచెం కష్టంగా అనిపించింది.అందులోనూ ఇంగ్లీష్ మీద పూర్తిగా పట్టుపోవటంతో మొదట్లో అర్థం చేసుకోవటం కష్టమే అయ్యింది. ఒకరోజు సైకాలజీ క్లాసులో మెదడు విషయాల్ని ఎలా గ్రహిస్తుంది.ఎక్కడ భద్రపరుచుకొంటుంది.మెదడు గ్రహించలేని పరిస్థితులు,దానివలన వచ్చే బుధ్ధిమాంద్యత మొదలైనవన్నీ సోదాహరణంగా వివరిస్తున్నారు. అప్పటికి బాబుని కోల్పోయి ఆరునెలలు కూడా కాలేదేమో మనసులోని పచ్చిదనం రేగినట్లు అయ్యింది. ఒక్కసారిగా దుఃఖం పగిలినట్లు కుమి లి కుమిలి ఏడ్చేసాను.ఆ రోజు ముందు సీట్లు నిండిపోవడంతో చివరి బెంచీలో కూర్చున్నాము లెక్చరర్ గమనించలేదు.కానీ నా పక్కనే కూర్చున్న సహాధ్యాయి కంగారు పడింది.ఓ పది నిమిషాలకు సర్దుకొని తిరిగి పాఠంలో పడ్డాను. బాబు పోయిన బాధ కొద్దికొద్దిగా మరపులోకి పూర్తిగా వెళ్ళక ముందే వీర్రాజు గారి సహోద్యోగే కాక ఆయన్ని కవిత్వంలోకి నడిపించిన,ఒక సోదరుడిగా ప్రేమించిన కుందుర్తి ఆంజనేయులు గారి షష్టిపూర్తి కోసం వీర్రాజు గారూ,మిత్రులు,సన్నిహితులు అందరూ కలిసి ఒక పుస్తకం కూడా వెలువరించటానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో దసరాలలో అకస్మాత్తుగా చనిపోయారు.అది వీర్రాజు గారిని బాగా కుంగదీసింది. వీర్రాజు గారు తిరిగి ఉద్యోగంలో చేరటం, నేను కాలేజీకి వెళ్ళి రావటం,మిగతా సమయం పల్లవితో గడపటంతో జీవితం ఒక గాడిని పడింది అనుకున్నాను . అంతలో మళ్ళా ఒక ఉత్పాతం.రెగ్యలర్ గా వచ్చే నెలసరి పదిరోజులుగా రాలేదని గమనించాను.నేను గర్భనిరోధక సాధనంగా కాపర్ టీ వేయించుకున్నాను. అదొక బెంగ అయ్యింది.కాలేజీలో చేరేటప్పుడు నో ప్రెగ్నెన్సీ సర్టిఫికెట్ ఇచ్చాను.ఇప్పుడిలా జరిగిందేమిటి అని అనుకున్నాను. వీర్రాజు గారితో చెప్తే "మళ్ళా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు "అన్నారు.సరే అని వెళ్తే పరీక్ష చేసి "ఒక్కోసారి కాపర్ టీ ఉన్నా గర్భం వస్తుంది" అంది ఆమె .టేబ్లెట్లు రాసి "రెండు రోజులపాటు వేసుకో మరో రెండు రోజులకు పీరియడ్స్ వచ్చేస్తాయ"ని చెప్తే అవి కొనుక్కుని రెండురోజులు వాడాను .కానీ పీరియడ్స్ రాలేదు.శని ఆదివారాలు సెలవు దొరికేసరికి శుక్రవారం సాయంత్రం పల్లవిని తీసుకుని అక్కయ్య దగ్గరకు మలకపేట వెళ్ళాను.అక్కయ్యతో విషయం అంతా చెప్తే సైదాబాద్ రోడ్ మీద సాయంపూట ఒక లేడీడాక్టర్ క్లినిక్ తెరుస్తారని ,ఆమెకు మంచి పేరుంది అని చెప్పి తీసుకు వెళ్ళింది. డాక్టర్ నన్ను పరీక్ష చేసాక, నేను వాడిన మందులు ప్రిస్క్రిప్షన్ ఆమెకు చూపించాను.ఆమె అది చూసి " ఈ మందులు ప్రిస్క్రైబ్ చేసిన ఆవిడ చదువుకున్న డాక్టరేనా?" అని ప్రశ్నించారు. నేను ఆశ్చర్యపోయి డాక్టరే అని చెప్పి ప్రశ్నార్థకంగా చూసాను. "ఈ టేబ్లెట్లు బేన్ చేసి రెండు మూడు సంవత్సరాలైంది.ఇవి రాసినందుకు ఆమెపై కంప్లైంట్ ఇవ్వొచ్చు." అన్నారు డాక్టర్. మళ్ళా నావైపు చూసి అంతకుముందు నెలసరి ఎప్పుడు వచ్చిందో కనుక్కుని "గర్భం ఆరు వారాలు దాటింది.అయితే ఆ టేబ్లెట్లు వాడినందువలన పుట్టే బిడ్డకు శారీరకఅవకరం గానీ,మానసిక మాంద్యం గానీ వచ్చే అవకాశం ఉంది.ఉంచుకుంటావో,అబార్షన్ చేసుకుంటావో ఆలోచించుకో" అన్నారు. నాకు గుండె పగిలినట్లయ్యింది.మూడున్నర సంవత్సరాలు పడిన అవస్థ కళ్ళముందు గిర్రున తిరిగింది." వద్దొద్దు.అబార్షన్ చేసుకుంటాన"ని అన్నాను. "సరే నని "విషయం అంతా రాసి అబార్షన్ అవసరం అనేది" రాసిచ్చి ఉస్మానియా హాస్పిటల్ లో తనకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి ఉదయం ఏడున్నర కల్లా వెళ్ళమని చెప్పారు డాక్టర్. శనివారం ఉదయమే అక్కయ్య,నేను ఉస్మానియా హాస్పిటల్ కి వెళ్ళి రిఫర్ చేసిన డాక్టర్ని కలిసాము.వెంటనే అబార్షన్ చేసారు.తిరిగి అక్కయ్య ఇంటికే వెళ్ళి శని, ఆదివారాలు అక్కడే విశ్రాంతి తీసుకుని ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. మర్నాటి నుంచి మళ్ళా యథావిధిగా కాలేజీకి వెళ్ళిపోయాను. వీర్రాజు గారు కూడా ఆఫీస్ కే కనుక టైం ప్రకారం వెళ్ళిరావటంతో నాకు కొంత వెసులుబాటు కలిగింది. అయితే సమాచారం పౌరసంబంధాల శాఖలో పనిచేస్తున్నందున, ఆంధ్రప్రదేశ్ పత్రిక చూసే బాధ్యత వలన వీర్రాజు గారికి పని ఒత్తిడి కలిగించే కొత్త మార్పులు జరిగాయి. అవేమిటంటే 1982లో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటన జరిగింది. నలభై ఏళ్ళు గా సినిమాల్లో తన నటన ద్వారా ప్రజల ప్రశంసలు పొందిన నందమూరి తారక రామారావు మార్చి 29 న తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. 1980-82 లమధ్య కాంగ్రెస్ పార్టీ అంజయ్య,భవనం వెంకట్రామరెడ్డి,కోట్ల విజయభాస్కరరెడ్డి ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది.కాంగ్రెసు అసంతృప్త నాయకుడు నాదెండ్ల భాస్కరరావు వంటివారు ఎన్టీఆర్ తో కలిసారు. పదే పదే ముఖ్యమంత్రుల్ని మార్చి కాంగ్రెసు పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపిస్తూ, ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు ప్రజల్లోకి వచ్చారు.ఆంధ్రప్రదేశ్ అంతటా అది సంచలనం కలిగించింది. కాలేజీలో డిగ్రీ అయిన వెంటనే బియ్యీడీలో చేరిన అమ్మాయి రాగలత ఎందుచేతనో కానీ నాకు చాలా దగ్గర అయ్యింది.ఒక చెల్లెలులా మా కుటుంబంతో కూడా కలిసిపోయింది.టీచింగ్ ప్రాక్టీస్ కూడా ఇద్దరికీ ఒకటే స్కూల్ లో పడటంతో కలిసి వెళ్ళొచ్చేవాళ్ళం.ఒకసారి నన్నూ,పల్లవిని వాళ్ళ వూరు భువనగిరికి తీసుకు వెళ్ళింది.రాగలత చెల్లెళ్ళు కూడా మాతో బాగా కలిసారు.అందరం కలిసి భువనగిరి గుట్టపై వరకూ అందరం ఎక్కాము.ఇప్పటికీ ట్రైన్ లో అటు వెళ్తున్నప్పుడు కనిపించే భువనగిరి గుట్టని చూసినప్పుడు ఆరోజులు గుర్తువస్తూ ఉంటాయి. 1983 జనవరి లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆశ్చర్యకరంగా స్థాపించిన తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం 198 స్థానాలు గెలుచుకొని అధికారానికి వచ్చింది, 60 స్థానాలతో కాంగ్రెసు ప్రతిపక్షంగా నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్‌లో మొట్ట మొదటి సారిగా కాంగ్రెసు ప్రతిపక్షం స్థానానికి చేరింది. వీర్రాజు గారికి మాత్రం ఈ మార్పు ఉద్యోగరీత్యా సమాజజీవితానికి దూరం చేసింది. విద్యాసంవత్సరం చివర్లో డిగ్రీ కాలేజీకి,మాకాలేజీకి కలిపి ఏర్పాటు చేసిన పెయింటింగ్, ఫేబ్రిక్ పెయింటింగ్ లలో కూడా బహుమతులు గెలుచుకుని మా కాలేజీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను.హర్డిల్ రేస్ లా సాగే నా చదువు మొత్తం మీద పూర్తి చేసాను. నా పరీక్షలు పూర్తిఅయ్యి ఊపిరి పీల్చుకునే సరికి పెద్దాడబడుచు అయిదేళ్ళ తర్వాత కుటుంబం తో వచ్చింది.ఈ సారి మేము వేర్వేరు కుటుంబాలు అయ్యాం కనుక అన్నదమ్ముల అందరిళ్ళకి అయిదేసిరోజులు వెళ్ళొచ్చారు. కానీ మాట వరసకైనా బాబు ప్రసక్తి తీసుకు రాకపోవటం ఆశ్చర్యం కలిగించింది. ఒక్కొక్కరి మనస్తత్వాలు ఇన్నేళ్లలో బాగా తెలిసాయి కనుక నేను కూడా బాగా రాటుతేలాను.పూర్వంలా అన్నింటికీ మౌనం వహించకుండా నొప్పింపక తానొవ్వక మెలిగాను.అన్నీ సగౌరవంగా చేసి వాళ్ళను సాగనంపాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి