13, అక్టోబర్ 2023, శుక్రవారం

నాకు నచ్చిన కథ- వానావానా కన్నీరు

నాకు నచ్చిన నాకథ -- వానా వానా కన్నీరు. ఈ కథ రాయాలని కొద్దిగా సినాప్సిస్ రాసి పెట్టుకున్నది కాలేజీ రోజుల్లోనే ‌ ‌. 71 లో అనుకుంటాను ఎన్నికలు జరిగాయి. కాలేజీకి వెళ్ళేదారిలో ఊరంతా ఎత్తుగా రోడ్డుకు అటూఇటూ కరెంటు స్తంభాలకు పెద్ద పెద్ద బట్టలమీద నాయకుల పేర్లు ముద్రించిన బేనర్లు కట్టి ఉండటం, అప్పట్లో రోడ్లపక్కనే వినాయకచవితి పందిళ్ళు లా తడకలతో కట్టి దాని చుట్టూరా కూడా బేనర్లు కట్టి అక్కడే కార్యకర్తలు ఉండి మైకుల్లో ఎన్నికలపాటలువేస్తూ పేకాటలాడుకుంటూ కూర్చునేవారు ,అక్కడక్కడే గోచీగుడ్డలు కట్టుకుని ఆడుకుంటున్న పేద పిల్లల్నీ కూడా చూసి దీని నేపధ్యంలో కథ రాయాలని పాయింట్స్ రాసుకున్నాను. కానీ చదువుమధ్య లో వివాహం మళ్ళీ చదువు ఉమ్మడి కుటుంబం పిల్లలూ అనారోగ్యాలూ వీటితో రాయలేక పోయాను. ఇటీవల ముంగారుమొలకలు సందర్భంలో ఆడవాళ్ళు రచనలు ఎక్కువగా చేయకపోవటానికి కారణాలు ఆలోచించినప్పుడు నా స్థితి కూడా మనసులోకి వచ్చింది .చదువుకునే రోజుల్లో 1970 లో రాసినదే మొదటికథ అప్పట్లోనే ఒక నాలుగు కథలు ప్రచురింపబడినా తర్వాత 76వరకూ నేను కథలు రాసేటంత సమయం సమకూర్చుకోలేక కవిత్వంలోకి వచ్చేసాను 84లో తిరిగి ఎన్నికల ప్రచారసంరంభాలు చూసి దీనికి సంబంధించిన కథ ఎన్నికల సమయంలో రాయాలనుకున్నది గుర్తొచ్చి అదే సినాప్సిస్ ని ఉత్తరాంధ్ర మాండలికం లో కథగా రాసాను. ఈ కథలో వంటిమీద సరిగా బట్టలు కూడా లేని బడుగు జీవులు వెతలు,తానులు తానుల బట్టలను ఎన్నికల ప్రచారం బేనర్ల కోసం జండాలకోసం వృధా చేస్తూ ప్రజా జీవితాలని పట్టించుకోని నాయకులూ,వారికోసం జండాలు మోసే కార్యకర్తలు,మొదలైన ఎన్నికల సంరంభాలనీ కథలో వ్యక్తపరచడానికి ప్రయత్నం చేసాను..ఈ కథ 1987లో ప్రచురితం అయ్యింది. ఈ కథ జ్యోతి మాసపత్రికలో చదివి మా అక్క పి.సరళాదేవి పెద్ద ఉత్తరం రాసింది."కుటుంబచట్రం లో ఇరుక్కొని వాటినే కథలుగా రాయకుండా విశాలదృక్పధం తో అట్టడుగు ప్రజల జీవిత సమస్యలను తీసుకుని నువ్వు కథ రాయటం సంతోషంగా ఉంది.ఇకపై కూడా ఈవిధంగా ఇతరసమస్యలపై దృష్టి సారించి రాస్తుండమని" సలహా ఇచ్చింది. స్త్రీవాదానికి కట్టుబడి ఉండి పోకుండా సమాజంలోని అనేక సమస్యలు తీసుకునే నేను రచనలు చేయటానికి ఇదొక కారణం. నేను ఉత్తరాంధ్ర లో పుట్టిపెరిగినా రెండు కథలు మాత్రమే అక్కడి మాండలికం లో రాసాను.బహుశా నాకు ఈ కథ నచ్చాటానికి అదొక కారణమేమో. తర్వాత్తర్వాత ఉద్యోగం నా చుట్టూ విద్యార్ధులతో కలగలిసి పోవటంతో చాలా కథలను తెలంగాణ మాండలికంలో రాసాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి