28, ఏప్రిల్ 2023, శుక్రవారం
నడక దారిలో --29
నడక దారిలో --29
వీర్రాజు గారు ఉద్యోగానికి సెలవు పెట్టి వికాస్ అనే అడ్వర్టైజ్ ఆఫీసు పెట్టినా పెద్దగా సంపాదించినది ఏమీలేదు.ఆర్ట్ వర్క్ అంతా వీర్రాజుగారూ ,బైట తిరిగి వర్క్ సంపాదించడమే కాక ఆర్థిక వ్యవహారాలు స్నేహితుడు రావు చూసుకుంటున్నారు.వర్క్ బాగానే వస్తోంది.వీర్రాజు గారికి డబ్బు అడగటం మొగమాటం కనుక స్నేహితుడు వెళ్ళి కలెక్ట్ చేస్తాడు.'ఢిల్లీనుండి వచ్చేసాం ఇక్కడా ఇబ్బందులు తప్పలేదు' అన్నట్లుగా స్నేహితుని కుటుంబం వాపోతుంటారు. వీర్రాజు గారికి అతన్ని పిలిపించి ఈ ఏజెన్సీ పెట్టటం పొరపాటు చేశానేమోననే అంతర్మధనం మొదలయ్యింది.అంతేగాక డబ్బు గోల్మాల్ అవుతున్నట్లు కొందరు మా ఆత్మీయులైన వారు చెప్పటం, ఆధారాలూ కనిపిస్తుండేసరికి స్నేహితుడిని ఖచ్చితంగా అడగలేక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఒక వైపు ఆఫీసువాళ్ళు సెలవు పెట్టి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం పై మెమోలు పంపసాగారు.అయిదేళ్ళ సెలవు కాలం పూర్తి చేయాలని,లేదా వాలంటరీ పెట్టేయాలనే ఆలోచనలో సతమతం అయ్యారు.
ఎప్పటిలాగే పురిటి సమయానికి అమ్మ వచ్చింది.నాకు నెలలు నిండి మంచి రంగుతో,దట్టమైన ఉంగరాలజుట్టుతో అందాలబాబు జన్మించాడు.పల్లవికూడా ఆడుకోడానికి తమ్ముడు తోడు దొరికాడని మురిసిపోయింది.
ఇంతవరకూ వీరి అన్నదమ్ములు అందరికీ ఆడపిల్లలు కావటంచేత కుటుంబానికి మొదటి మనవడు అని వీర్రాజు గారు ముచ్చట పడ్డారు.చైతన్య అని పేరు పెడదాం అన్నారు.
మా మామయ్యకు డిప్యూటీ డైరెక్టర్ గా బాపట్ల నుండి హైదరాబాద్ కి బదిలీ అయ్యింది.అక్కయ్యకి బాపట్లలో సాహిత్యం, సమావేశాల్లోనే పోలాప్రగడ దంపతులతో స్నేహం ఉండేది. పోలాప్రగడ గారికి మలకపేట బ్రహ్మానందకాలనీలో ఒక అపార్ట్మెంట్ ఉందని అది ప్రస్తుతం ఖాళీగా ఉందనీ,మీరు కావాలంటే అద్దెకు ఉండొచ్చని పోలాప్రగడ దంపతులు చెప్పటంతో సంతోషంగా అందులో అద్దెకి దిగటానికి అక్కయ్య వాళ్ళు నిర్ణయించుకున్నారు.
వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారంటేనే నాకు కొండంత ధైర్యం వచ్చింది..
వేసవి సెలవుల్లో చిన్నక్క పిల్లలిద్దరినీ తీసుకుని హైదరాబాద్ అక్కయ్య ఇంటికి వచ్చేది.వాళ్ళు వస్తే పల్లవికి సంబరం.అప్పుడప్పుడు రిక్షా మాట్లాడుకొని పల్లవిని ,బాబుని తీసుకొని వెళ్ళే దాన్ని.ఇద్దరు అక్కయ్యల పిల్లలతో పల్లవి ఆడుకునేది.
ఒక రోజు పిల్లల్ని తీసుకొని రేడియోలో పిల్లలు కార్యక్రమంలో పాటలు,పద్యాలూ పాడించే వాళ్ళం.
అక్కయ్యా ఇంట్లో నేను ఓ రెండు రోజులు ఉండి పల్లవిని ఓ వారం రోజులు అక్కడే వదిలి వచ్చేసేదాన్ని.
మా యింటికి కూడా చిన్నక్కనీ పిల్లల్ని రమ్మనేదాన్ని.కానీ ఆ పిల్లాడితో చేసుకోలేక పోతున్నావు.ఇక్కడ కలిసాము కదా అని అనేది.
హైదరాబాద్ దూరదర్శన్ సాయంత్రం పూట తెలుగు కార్యక్రమాలు మొదలు పెట్టింది.ఆ క్రమంలో ఆదివారాలు విజయావారి సినీమాలు వేస్తున్నారని తెలిసి పొరుగుఇంట్లో ఉండే లలిత తనతో పల్లవిని అప్పుడప్పుడు పక్క కాంపౌండ్ ఉండే ఎవరింట్లోనో టీవీ ఉంటే తీసుకు వెళ్ళేది.లలితా, ఆంజనేయులు గారు ఇద్దరూ పల్లవిని బాగా చేరదీసేవారు.పల్లవి కూడా లలితత్తా అంటూ ఆమెతో కబుర్లు చెప్పేది.
తర్వాత అక్కయ్యా వాళ్ళుకూడా టీవీ కొన్నారు.దాంతో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు దూరదర్శన్ కార్యక్రమాలు అబ్బురంగా చూసేవాళ్ళం.
అక్కయ్యా వాళ్ళింట్లో కూడా మామూలు గా పూజలు చేయకపోయినా వినాయక చవితికి పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని మామామయ్య పూజ చేయించి కథ చెప్పేవాడు.ఆయన అంటే పిల్లలందరికీ చాలా ప్రేమ.కథలు చెప్పటం,సినిమాలూ , షికార్లు తిప్పటం చేసేవాడు. బాబుకి ఆరునెలలు దాటాయి.బోర్లా పడుతున్నాడు,కొద్దిగా పారాడటానికి ప్రయత్నిస్తున్నాడు.ఒకరోజు సాయంత్రం అకస్మాత్తుగా గుక్క పట్టి ఏడుస్తూ ఏడుస్తూ క్రమక్రమంగా ఒళ్ళంతా నీలి రంగులోకి మారి స్మారకం లేనట్లుగా అయిపోయాడు.నాకు ఏంచేయాలో తోచక ఎత్తుకుని ఏడుస్తూ వాకిట్లోకి వచ్చాను.వాకిట్లో పిల్లలతో ఆడుకుంటున్న పల్లవి కూడా బిక్కమొహం తో దగ్గరకు వచ్చింది.కాంపౌండులోని నాలుగు కుటుంబాలవాళ్ళూ వచ్చి బాబుముఖంమీద నీళ్ళు చల్లి కుదుపుతూ ఉంటే మెల్లమెల్లగా నీలిరంగు నుండి మామూలు అయ్యాడు.పక్కనే ఇంట్లో ఉన్న తోటి కోడలు తన పిల్లల్ని ఇంట్లోకి లాగి తలుపు వేసిందని లలిత తర్వాత చెప్పింది.
ఎవరో దగ్గరలోనే ఉన్న వికాస్ ఆఫీసుకు పరిగెత్తి వీర్రాజుగారిని పిల్చుకు వచ్చారు.అప్పటికి తిరిగి బాబును ఇంట్లోకి తీసుకు వచ్చాను.వీర్రాజు గారు వచ్చి బాబునీ వొళ్ళోకి తీసుకుని కుదుపుతుంటే కళ్ళు తెరిచాడు.అప్పుడు తీరికగా మాతోటికోడలు వచ్చి పలకరించింది.
అప్పటికైతే బాబు నార్మల్ గా అయ్యాడు కానీ అది మొదలు కొని తరుచూ ఏడుపు మొదలెట్టాడంటే గుక్క పెట్టటం,ఒళ్ళు నీలి రంగులోకి మారటం స్పృహ తప్పినట్లుగా కళ్ళు తేలేయటం ఇంచుమించుగా ప్రాణం పోయిందేమో అన్నట్లుగా వేలాడిపోవటం జరుగుతూ ఉండేది.ఇంక మాకు ఇల్లు, హాస్పిటల్,లేదా ఇల్లూ క్లినిక్ లకు తిరగటం ప్రారంభమైంది.నెలలు గడుస్తున్నా బాబు మెడని బలంగా నిలబెట్టలేక పోయేవాడు.కూర్చోలేకపోతున్నాడు.చేతితో ఏదీ పట్టుకోలేక పోతున్నాడు. ఎవరు ఏ డాక్టర్ పేరు చెబితే అక్కడకు తీసుకు వెళ్ళేవాళ్ళం.
చిక్కడపల్లిలో రామయ్య అనే మంచి హోమియోడాక్టర్ ఉన్నాడంటే అక్కడకు వెళ్ళాం.బాలపరమేశ్వరరావు అనే ఆయన పిల్లలడాక్టర్ గా ఫేమస్ అంటే అక్కడకు వెళ్ళాం. ఏ పరీక్షలు చేయమని చెప్తే ఆ పరీక్షలు చేయిస్తున్నాం
మాది మేనరికం కనుక అందువల్ల బాబు అలా ఉన్నాడేమోనని ఎవరో అనటంతో జెనెటిక్ లాబ్ కి వెళ్ళి పరీక్షచేయించాం.ఆ లోపం ఏమీ లేదన్నారు. డాక్టర్ "జెనెటిక్ లోపం ఉంటే పెద్దపాపలో కూడా ఆ ఛాయలు ఉండాలి.కానీ పాప చురుకుగా ఉంది.మీరు గర్భంతో ఉన్నప్పుడు వేసుకున్న మందులు వలన వచ్చిన ఎఫెక్ట్ " అన్నారు.నాకు ఏమీ అర్థం కాలేదు.డాక్టర్ బలానికి రాసిన మందులు తప్ప ఇంకేమీ వేసుకున్న గుర్తు లేదు.
బాబు ఏడవకుండా సమయానికి ఆహారం పెట్టటం,రాత్రి పగలు కనిపెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి.నిద్రపోతున్నప్పుడే తొందరగా పని పూర్తిచేసుకుని బాబును చూసుకోవాల్సి వచ్చేది.
ఉమ్మడి కుటుంబం తో పడిన అవస్థలు తప్పాయి అనుకుంటే మళ్ళీ నేను అఖాతంలో పడిపోతున్నాను అనిపించింది.ఇప్పుడిప్పడే మళ్ళీ నా రచనలు,నా చిత్రాల్లో పడుతున్నాను అనుకుంటే మళ్ళీ మళ్ళీ......
ఈ నిస్సహాయ పరిస్థితులలో నన్ను నేను ఎలా నిలబెట్టుకోవాలి నాకు తెలియని అయోమయంలోచిక్కుకుపోయాను.బస్సులోనో,రైల్లోనో బయటకు వెళ్తే బాబు వైపు ఎదుటివాళ్ళ జాలిచూపుల్ని తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళటం మానుకున్నాను.ఎప్పడైనా రిక్షా ఎక్కి అక్కయ్య దగ్గరకు మాత్రమే వెళ్ళేదాన్ని.
ఇంకా నాకు ఏమాత్రమైనా ఓదార్పునిచ్చేది పుస్తకాలే.ఏదో ఒక పుస్తకం పట్టుకుని బాబు పక్కనే ఉండేదాన్ని.కవిత ఏమైనా రాయాలనిపించితే రాసేదాన్ని.కానీ ఏ పత్రికలకీ పంపేదాన్ని కాదు.
చిరునవ్వు పెదాలకు తగిలించుకుంటే మనసులోని బాధని దించుకోవచ్చు అనేది తెలియనితనం.కళ్ళుఎప్పుడూ నిండుకుండల్లా ఉండేవి.ఏమూలో కాసింత కొనప్రాణం ఉన్న జీవచ్ఛవంలా ఉండేదాన్ని.
చిన్నప్పుడంతా ఆర్థిక అవకతవకలతో నాలుకని దాచుకొని ఒకరి పంచన బతకాల్సిన పరిస్థితులు దాటి ఎలాగో చదువుకుంటున్నదాన్ని చదువుకోక సాహిత్యంపై మోజుతో ప్రేమమోహంలో చిక్కుకుని గంపెడు కలల్ని మూటకట్టుకుని వచ్చాను.
"నువ్వు చదువుకున్నదానివి.రచయిత్రివి.సామాన్య ఆడదానివిలా అసూయా ద్వేషాలు పెంచుకోకూడదు" అంటే కామోసు అనుకుని ఉమ్మడి కుటుంబం లో నాలుకని దాచుకొని, ఒళ్ళు దాచుకోకుండా నా కుటుంబం అనుకుంటూ చాకిరీ చేసాను. వేరించి కాపురమేకదా ఇంక నా ఆశలు,కలలూ పండించు కోవచ్చు అని నిశ్చింతగా ఊపిరి తీసుకుంటే మళ్ళా ఈ ఉత్పాతం.ఈ జీవితం అంతా దుఃఖమేనా?
ఒక్కొక్కప్పుడు తోబుట్టువుల మీద ఆయనకిగల అలవిమాలిన ప్రేమ వలన నాకు కావలసిన సాంత్వన పొందలేక నాలోకి నేను ముడుచుకు పోయేదాన్ని.
ఏ అర్థరాత్రో దగ్గర చేరినప్పుడు " నిజంగా నన్ను ఇష్టపడే చేసుకున్నారా"అని సందేహం వెలిబుచ్చినప్పుడు "ఎందుకు ఆ సందేహం"అంటూ మరోప్రశ్నకి అవకాశం ఇవ్వనప్పుడు మౌనాన్నే ఆశ్రయించే దాన్ని.
తల్లి చనిపోయాక,ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతే ఆడదిక్కులేని సంసారానికి చాకిరీ చేసే ఆడదిక్కు కోసమే వేసిన మోహపు వలలో చిక్కుకున్నానేమో అని ఎప్పుడైనా ఒక సందేహం తేలుకొండిలా మనసులో లేచేది.కానీ తపస్విలా రంగులప్రపంచంలోనో,అక్షరలోకంలోనో తనలోకంలో తాను ఉండి మధ్యలో అనురాగం తో దగ్గరకు వచ్చే ఆయన ముఖంచూసి నా మనసును మందలించేదాన్ని.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి