25, ఏప్రిల్ 2023, మంగళవారం
నడక దారిలో --25
నడక దారిలో --25
మార్చి 17న విజయనగరానికి తిరిగి పరీక్ష రాయటానికి వెళ్ళాను.
చిన్నన్నయ్య ఇంటికే వెళ్లాను.అయితే ఎవరో కుర్రాడితో నాకు వదిన తమ ఇంటికి భోజనానికి రమ్మని కబురు పెట్టింది.పెద్దన్నయ్య ఇంటికి ఆరోజు పల్లవిని తీసుకుని వెళ్ళాను." ఇది కూడా నీకు పుట్టిల్లే "అంది వదిన." ఏ ఇల్లైతేనేమిటి వదినా నాకా పట్టింపులేమీ లేవు " అంటుంటే నాకు మాయాబజార్ సినిమా డైలాగ్ గుర్తువచ్చి మనసులోనే నవ్వుకున్నాను.
భోజనాలు అయ్యాక పెద్దవదిన చీర జాకెట్టుపై పళ్ళు పెట్టి నా చేతికి ఇచ్చి " రుణం తీరిపోయింది"అంది.అన్నయ్య ఏమీ మాట్లాడలేదు.నాకు షాక్ తగిలినట్లు అయ్యింది.రక్తసంబంధంలో ఆమాత్రానికే రుణం తీరిపోయేదేనా.మా అక్కాచెల్లెళ్ళు ఎవరమూ పుట్టింటి నుండి ఏమీ ఆశించేవాళ్ళం కాదు.వదిన చేతి వంట తినటం అదే మొదటిసారి. అమ్మ పోయినప్పుడు రెండోసారి.అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి.అతి ప్రయత్నం మీద బయటకు రాకుండా ఆపుకున్నాను.
మర్నాడు జ్యోతి మేడం వాళ్ళింటికి వెళ్ళాను.నన్ను హాల్ లో కూర్చోబెట్టి ఆమె లోపలికి వెళ్ళారు.అంతలోనే వాళ్ళ నాన్నగారు "పాఠం చెప్పించుకోటానికి సుభద్ర వస్తుందన్నావు రాలేదా" అంటూ ముందు గదిలోకి వచ్చారు.నేను గభాలున లేచి నిలబడి నమస్కారం పెట్టాను."ఓ నువ్వేనా సుభద్ర అంటే" అంటూనే తలవూపి లోనికి వెళ్ళిపోయారు.
జ్యోతి గారు వచ్చి" నీగురించి చెప్పానులే ఆయనకి నిన్ను తెలుసు" అంటూ పరీక్షల్లో రావటానికి అవకాశం ఉన్న పాఠాలు వివరించారు.
నాగురించి తెలుసు అంటే ప్రముఖ రచయిత భార్యననా, అప్పుడప్పుడే రచనలు చేస్తున్నాననా,సభా వివాహం చేసుకుని ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టాననా ఎలా తెలుసు అని మనసులో ప్రశ్నలు మొదలయ్యాయి కాని నేనేమీ మాట్లాడలేదు.
ఆమె ద్వారానే పరీక్షలు పోస్ట్ పోన్ అయినట్లు కూడా తెలిసింది.ఎప్పటికి పూర్తవుతాయి తిరిగి ఎప్పటికి వెళ్తానని ఒక వైపు బెంగ, మరోవైపు కాస్త చదివే సమయందొరికిందని ఆశ రెండింటితో మనసులో సందిగ్ధం నెలకొంది.
అక్కడ హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలలో చిత్రలేఖనం ప్రదర్శన కోసం పెయింటింగ్స్ వేయటానికి వీర్రాజు గారి ఆత్మీయ మిత్రుడు మాదేటి రాజాజీ తో బాటు మరో ఇద్దరు ఆర్టిస్టులు మా ఇంట్లోనే దిగారుట.ఇల్లంతా ఆర్ట్ స్కూల్ లా ఉందట.పెద్దపెద్ద నిలువెత్తు పెయింటింగ్స్ అందరూ వేస్తున్నారని వీర్రాజు గారు ఉత్తరంలో రాసారు.వీర్రాజుగారు పండితారాధ్యుల పెయింటింగ్ ప్రదర్శన కోసం,సావనీర్ కోసం పోతనకు సరస్వతి దేవి ప్రత్యక్షమైన సందర్భాన్ని చిత్రంగా వేస్తున్నానని ఉత్తరంలో రాసారు.
ప్రపంచసభల సావనీర్ రూపకల్పన బాధ్యత కూడా ఉండటంతో చాలా బిజీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించింది. ఏప్రిల్ 12వ తేదీ ఉగాది రోజున ప్రారంభమై 18వ తేదీ వరకు వారం రోజులపాటు హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో ఈ మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ ప్రాంగణానికి 'కాకతీయ నగరం' అని పేరు పెట్టారు. ప్రారంభసభకు మా తెలుగు తల్లికి మల్లె పూదండ ప్రార్థనగీతాన్ని పాడేందుకు లండన్ నుండి టంగుటూరి సూర్యకుమారిని ప్రత్యేకంగా పిలిపించారుట.ప్రముఖ సాహితీవేత్తలు, ప్రసిద్ధ కళాకారులు, రాజకీయ ప్రముఖులు, స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు, పండితులు, సినీరంగ ప్రముఖులు, సమాజంలోని అన్ని రంగాలలోని వారు ఈ సభల్లో పాల్గొన్నారుట.
శాతవాహన నగరం'లో 'తరతరాల తెలుగు జాతి' ప్రదర్శన ఏర్పాటయిందిట. రెండున్నర వేల సంవత్సరాల తెలుగుజాతి చరిత్ర దీనిలో ప్రదర్శితమైందనీ 53 తైలవర్ణ చిత్రాలు, 240 తెలుగు వెలుగుల ఛాయా చిత్రాలు, 29 చార్టులు, 40 నాగార్జున కొండ చిత్రాలు, 10 దేశ పటాలు, 6 కుడ్య చిత్రాలు, 8 ప్రాచీన రాజ ముద్రికలు అమరావతి స్తూప ప్రతికృతి మొదలైనవి ఎన్నో ఈ ప్రదర్శనలో అమర్చబడ్డాయనీ వీర్రాజు ఉత్తరంలో చదువుతుంటే కళ్ళముందు అవన్నీ కదులాడాయి.
రోజూ ప్రముఖుల సంగీత,నృత్యకార్యక్రమాలు జరిగాయట.పాస్ ఉన్నా ఆయనకి వెళ్ళటానికి కుదరక తమ్ముళ్ళకు ఇచ్చేసేరుట. వాళ్ళు వెళ్ళారు అని ఉత్తరంలో రాస్తే అయ్యో మంచి కార్యక్రమం చూసే అవకాశం పోయింది.మంచి సమయంలో విజయనగరంలో ఉండిపోయానని బాధకలిగినా పరీక్షలకి పట్టుదలగా చదివాను.
మా కాలేజీలో కాకుండా ఎమ్మార్ కాలేజీలో నాకు సెంటర్ పడింది.నిర్విఘ్నంగా పరీక్షలు రాసాను.
సావనీర్ రూపొందించినందుకూ, పెయింటింగ్ కి రెమ్యునరేషన్ అయిదువేల వరకూ వచ్చిందని బంగారు గాజులు చేయించుకోమని సంబరంగా వీర్రాజు 1200/- పంపించారు.విజయనగరంలోనే చేయించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాను.
చిత్రకళా ప్రదర్శన నలభై అయిదు రోజుల పాటు ఇంకా కొనసాగుతూ ఉండటం వలన చూడటానికి వెళ్ళాను.వివిధ చిత్రకారుల విభిన్న చిత్రాలు ఒక్కొక్కరివీ ఒక్కో రీతి కావటంతో భలే ఆసక్తిగా అనిపించింది.
అప్పట్లోనే మూర్తి అనే ఆయన పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో దర్శకనిర్మాణంలో ట్రైనింగ్ అయినవాడు.నశీరుద్దీన్ షా మొదలైన అప్పటి అవార్డు చిత్రాల్లో వేసే చాలామంది అతని సహవిద్యార్ధులట.అతను వచ్చి వీర్రాజు గారిని తన సినిమాలకు కథ,ఆర్ట్ విభాగాల్లో తీసుకుంటానని ఆహ్వానించాడు.కాంటాక్టు పేపర్లో అందుకు పారితోషికంగా అయిదు వేలు ఇస్తున్నట్లు రాసారు.ముందురెండువేలు ఇస్తానన్నాడు.చేతిలో అయిదు రూపాయలు పెట్టి కాంటాక్ట్ పేపర్ మీద సంతకం చేయించుకున్నాడు.నేను వేళాకోళం గా నవ్వేసరికి డబ్బులు వచ్చాక ఇస్తాడులే అని ఆయన నమ్మకంగా అన్నారు.కానీ నమ్మకం వమ్మయిపోయింది.
ప్రత్యూష అనే సినిమా హిందీలో మూర్తి తీసాడు.కానీ డిస్ట్రిబ్యూటర్ దొరక్క విడుదల కాలేదు.అది జరుగుతూ ఉండగానే కొన్ని సన్నివేశాలు, సందర్భాలూ,దృశ్యాలూ,సంఘటనలూ చెప్పి నవల,స్క్రీన్ ప్లే రాయమనీ,అది తెలుగులో సినిమాగా తీస్తానని దగ్గర ఉండి రాయించుకున్నాడు.కానీ తర్వాత అతను ఏమైనాడో తెలియదు.ఆయన రాయమన్న నవల ఎక్సర్సైజ్ నోట్బుక్ లో మిగిలిపోయింది.
తారకా ఆర్గనైజర్స్ అనే సంస్థ - పోరంకి దక్షిణామూర్తి,మంజుశ్రీ, వాసిరెడ్డి సీతాదేవి,దాశరధి రంగాచార్య,అరిపిరాల విశ్వం,ఆనందారామం, శీలా వీర్రాజు, వెంచాశా,పరిమళా సోమేశ్వర్ లు తొమ్మిది మందితో గొలుసు నవల రాయించి ప్రచురించాలనుకుని వాళ్ళు తొమ్మిది మందినీ పిలిచి హొటల్ లో గెట్ టుగెదర్ పెట్టారు.తీరా తర్వాత వాళ్ళేమయ్యారో,నవలసంగతేమో మూలపడింది.
నేను బిఎస్సీ పరీక్ష పాసైనట్లు తెలిసి అక్కయ్య "ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించు.ఆర్థికంగా కుటుంబానికి చేయూత ఉంటుంది."అని ఉత్తరం రాసింది.కానీ పాప ఇంకా చిన్నది.బడికి వెళ్ళే వయస్సు వస్తే ఏమైనా ప్రయత్నం చేయొచ్చు.ఇంట్లో ఉంటేనే తీరిక లేని పనితో తల్లడిల్లుతున్నాను.ఇంకా ఉద్యోగం ఇల్లూ చూసుకోగలనా? మనసు ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడింది.
ఇలా ఏమీ చేయకుండా సమయాన్ని గడిపేయడం నాకు మనసుని కలచివేస్తుంది.నేను ఇలా ఉండిపోకూడదని అనిపిస్తోంది.
ఒకరోజు మిట్టమధ్యాహ్నం పాప ఫ్రాక్ కు డిజైన్ కుడుతూ వాకిట్లో కూర్చున్నాను. ఒక అతను ఏడెనిమిది ఏళ్ళ పాపని తీసుకువచ్చి హార్మొనీ పెట్టిమీద వాయిస్తూ సినీమా పాట అందుకున్నాడు వెంటనే ఆ పాప నాపరాళ్ళు పరిచిన మండే నేలమీద ఒళ్ళు విరుస్తూ,కన్ను కొడ్తూ నృత్యం చేయటం మొదలెట్టింది.నాకు మనసు విలవిల లాడింది.పాట ఆపించి డబ్బులు ఇచ్చి పంపించేసాను.కానీ ఆ దృశ్యం నన్ను వెంటాడసాగింది.నా బాధ అక్షరరూపం దాల్చి ఆకలినృత్యం కవితగా రూపుదాల్చింది.సాయంత్రం వీర్రాజు ఆఫీసునుండి రాగానే నేను రాసిన కవిత చూపాను.ఆయన చాలాబాగా రాసానని మెచ్చుకొని ఆ కవితని ఎక్స్ రే పత్రికకు పంపించారు.ఆ విధంగా నా మొదటి కవిత ప్రచురితం అయ్యింది.చాలా కాలానికి నా పేరుతో ప్రచురితమైన కవితా చూసుకోగానే నాకు ఉత్సాహం వచ్చింది.కవిత్వం బాగా రాయగలుగు తున్నావు.అవేరాయు అని వీర్రాజు గారు అన్నా సరే తరచుగా రాయలేకపోయాను.
అప్పట్లోనే దేవీప్రియ సంపాదకత్వంలో ప్రజాతంత్ర వారపత్రిక వస్తుండేది.అందులో వీర్రాజు గారు 'దేవుడికి ఉత్తరం'శీర్షికన ఒక కార్టూన్ లా వేసే వారు.అది చూసి నేను ఒక్కొక్కసారి సలహా ఇస్తూ ఉండేదాన్ని.
' నువ్వే వెయ్యటానికి ప్రయత్నించు' అని వీర్రాజు గారు ప్రోత్సహించారు.అప్పటినుండి నేను 'దేవుడికి ఉత్తరం ' చిన్ను అనే పాప కేరక్టర్ తో వేయటం మొదలెట్టాను.
ప్రజాతంత్ర లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళలకు స్వాతంత్ర్యం ఉందా అనే శీర్షికతో వ్యాసాల పోటీ పెట్టారు.అందులో నాకు రెండవ బహుమతి వచ్చింది.ఆతర్వాత మహిళల పేజీకి రెగ్యులర్ గా రాయమని దేవీప్రియ అడిగారు.సరే అని ఒకనాలుగైదు వారాలు రాసాను.
అప్పుడే నా చిన్నప్పుడు హైస్కూల్ స్నేహితురాలు మేరీ రాజ్యలక్ష్మే దేవీప్రియ భార్య అని తెలిసింది.అప్పట్లో పోలీస్ బారెక్స్ క్వార్టర్స్ లో ఉన్న మేరీ రాజ్యలక్ష్మి మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి స్కూల్ కి వెళ్ళేవాళ్ళం.చాలా స్నేహంగానే ఉండేవాళ్ళం.మరెందువల్లో మా స్నేహం ఇక్కడ బలపడలేదు.నన్ను రమ్మనేది కానీ ఆమె మా ఇంటికి వచ్చేది కాదు.నేను సంసారం బాధ్యతల్లో ఎక్కువగా వెళ్ళలేక పోయేదాన్ని.అదొక కారణం కావచ్చు.
నాలో ఏమీ తోచనితనం నేను ఎలా నా ఆశలన్నీ, అభిరుచుల్నీ ప్రోది చేసుకోవాలో తెలియని తనం నన్ను నిలకడగా ఉండనీయటం లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి