28, ఏప్రిల్ 2023, శుక్రవారం

నడక దారిలో --28

నడక దారిలో -- 28 వీర్రాజు గారు,తన స్నేహితుడితో కలిసి మొదలుపెట్టిన వికాస్ అడ్వర్టైజింగ్ ఆఫీసు కోసం ఇంటికి దగ్గర్లోనే రూమ్ తీసుకున్నందున మధ్యాహ్నం ఇంటికే భోజనానికి వచ్చేసే వెసులుబాటు కలిగింది.ఆ పనితో బాటు ముఖచిత్రాలపనీ ఉండటం వలన తీరిక మాత్రం కరువయ్యింది.ఆఫీసుకు అయిదేళ్ళు సెలవు పెట్టినందువలన అంతకుముందులాగ నెల మొదటి రోజునే వచ్చే జీతం లేదు.ప్రైవేటుగా చేస్తున్న పని ద్వారా వచ్చిన సొమ్ములో ఆఫీస్ రూము అద్దే మొదలగు వాటిని మినహాయించగా మిగిలినది ఇద్దరు మిత్రులూ చెరిసగం తీసుకునేవారు. వీర్రాజుగారికి చేసిన పనికి డబ్బు అడగటం మొగమాటం కనుక ఆర్ధిక విషయాలు మిత్రుడు చూసుకునేవారు. మాకు పొదుపుగా బతకటం అలవాటు కనుక పెద్దగా మాకేమీ ఇబ్బంది అనిపించలేదు. అప్పట్లోనే తన నిర్మల్ ఆర్ట్ ప్రకటన కోసం వచ్చిన నిర్మల్ ఆర్టిష్టుని వీర్రాజు గారు ఆఫీసురూములో అడ్వర్టైజ్ ఏజెన్సీ గా పెట్టటం వలన ఇంటీరియర్ అందం కోసం సజీవంగా ఉండే నెమలి బొమ్మని తయారు చేయమని దానికి తాను విడిగా డబ్బు ఇస్తానని కోరారు.అదేవిధంగా ఆ నిర్మల్ ఆర్టిష్టు నిజంగా ఏ అడవిలోంచో దారితప్పి వచ్చిందేమో అనిపించేలా అందమైననెమలిని తయారుచేసి ఇచ్చాడు.అది చూసి వీర్రాజు గారు ఎంతగానో మురిసిపోయి నాతో చెప్పారు." మనింట్లో కి కూడా మరోటి చేయించితే బాగుంటుంది.కానీ ఈ చిన్న అద్దె ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటాం" అని నిట్టూర్చారు. ప్రభుత్వం నుండి వస్తున్న ఒత్తిడి వలన అయిదేళ్ళు సెలవు తర్వాత వికాస్ నుండి బయటకు వచ్చేసి ఆఫీసును మిత్రుడికి అప్పగించారు.ఆ సందర్భంలో నెమలిబొమ్మ ఆఫీసులో ఉండటం వలన అభివృద్ధి చెందలేదని అది తిరిగి అమ్మేస్తానని మిత్రుడు అనేసరికి ఆ నెమలిబొమ్మ ఎగిరొచ్చే మా యింటవాలి ఇప్పటికీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆకర్షిస్తూనే ఉంది.సెలవు పెట్టిన స్వంతంగా మొదలుపెట్టిన వికాస్ కంపెనీ వలన మాకేమీ లాభించలేదు.మనసును ఆహ్లాదపరిచే ఆ నెమలి బొమ్మ తప్ప. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆ నిర్మల్ ఆర్టిష్టుకి కళారంగంలో జాతీయ బహుమతి వచ్చిందని తెలిసి వీర్రాజు గారు తనకే వచ్చినంతగా సంతోషపడి పోయారు.ఆ నెమలిని చూసి దాని గురించి అడిగిన వారందరికీ ఆ నెమలిబొమ్మ తయారు చేసిన నిర్మల్ ఆర్టిష్టుకి జాతీయ బహుమతి వచ్చిందని గొప్పగా చెప్పేవారు. అప్పట్లోనే దేశరాజకీయాలలో పెనుసంచలనం ఏర్పడింది.ముఖ్యంగా ఆధునిక భావాలు ఉన్న సాహితీవేత్తలలోనూ,విరసం పట్ల సానుభూతి ఉన్న కవులలోనూ ఎమర్జెన్సీ చాలా భావసంచలనం కలిగించింది.ఆ నేపధ్యంలోనే నగ్నముని గారు రాసిన కొయ్యగుర్రం సాహితీప్రపంచంలో కూడా చాలా సంచలనం కలిగించింది. ఇందిరాగాంధీ చేసిన అతి పెద్ద తప్పిదం అయిన ఎమర్జెన్సీ వలన జనం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. ఆ ఏడాది జరిగిన ఆరవ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పొందటమే కాకుండా1977 ఎలక్షన్లలో జనతా పార్టీగా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది భారత స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వంగా మొరార్జీ దేశాయ్ ప్రధానిగా జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది.ఎమర్జెన్సీ తొలగింపులో సాహిత్యం తిరిగి ఊపిరి పోసుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద విపత్తు సంభవించింది. 1977 లో దివిసీమ ఉప్పెన ఆంధ్ర ప్రదేశ్ లో సముద్రతీరంలో విధ్వంసాన్ని సృష్టించిన అతి భయంకరమైన తుఫాను. 1977, నవంబరు 19న ఈ తుఫాను సముద్రతీరాన్ని తాకటంతో ఏర్పడిన విషయంలో అధికారికంగా పద్నాలుగు వేలకు పైగా అని ప్రభుత్వం ప్రకటించినా అనధికారికంగా సుమారు యాభై వేలకు పైగానే ప్రాణాలు కోల్పోయిఉంటారు. ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయిట. తుపాను తర్వాత వందలాది శవాలు నీళ్ళలో తేలుతూ కనిపించాయని. గుర్తుపట్టలేని అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చిందని పేపర్లన్నీ రాసాయి. రాష్ట్రమంతా ఒక దీన స్థితి లోకి వెళ్ళిపోయింది.అప్పుడు దృశ్యమీడియా లేకపోయినా రేడియోలో పదేపదే వచ్చే వార్తా విశేషాలు, వార్తాపత్రికల్లో వచ్చే ఛాయాచిత్రాలు, వార్తలు జనాల్లో కలవరం పెంచాయి. బాపట్లలో ఒక చర్చిలో తలదాచుకున్న దాదాపు వందమంది ప్రజలు అది కూలడంతో మరణించారని పేపర్లో చదివి అక్కడే ఉన్న పెద్దక్క కుటుంబం గురించి కంగారుపడ్డాము.అప్పట్లో ఫోన్లు లేవు. వాళ్ళనుండి ఉత్తరం వచ్చేవరకూ మనసు మనసులో లేదు. ఇప్పుడు మా కుటుంబమే కనుక పల్లవి స్కూలుకి వెళ్ళాక నాకు కొంచెం తీరిక చిక్కటంతో మళ్ళా మధ్యాహ్నం పూట పుస్తకాలు చదవటం,రచనలు చేయటం మొదలుపెట్టాను. చిన్నప్పటినుండి ఎక్కువగా చిన్నన్నయ్య సేకరించిన రావిశాస్త్రి,బీనాదేవి రచనలే కాక తర్వాత కూడా ఆంధ్రజ్యోతి వారపత్రికలలో వచ్చిన పుణ్యభూమి కళ్ళుతెరు,రత్తాలు రాంబాబు మొదలైనవి చదవటం, నాకు ఇష్టమైన రంగనాయకమ్మ రాసిన ధారావాహికలు నా ఆలోచనలు మళ్ళా పదునుగా తయారవుతున్నాయి. కవిత్వం నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది. అందులోనూ సమాజాన్ని,రాజ్యాన్ని ప్రశ్నించే వామపక్ష భావజాలం ఉన్న కవిత్వం మరింతగా ఇష్టపడేదాన్ని. అప్పట్లోనే ఒకసారి మా యింటికి తురగా జానకీరాణి గారు వచ్చారు.తురగా జానకీరాణి గారు మాకు అత్యంత ఆత్మీయులు.వీర్రాజు గారు ఆకాశవాణి లోని ప్రోగ్రాం అధికారి అన్నమాటకు నొచ్చుకొని ఆకాశవాణి మెట్లు ఎక్కనని నిర్ణయించుకున్నారు.చివరివరకూ అదే మాటమీద నిల్చున్నారు.ఆవిషయం తెలిసిన జానకీరాణి గారు "నేను సుభద్ర కి ప్రోగ్రాం లు ఇస్తాను.ఆమె ఇలాంటి ప్రతిజ్ఞలు చేయలేదు కదా"అని సరదాగా అన్నారు.అంతేకాకుండా అప్పటినుండి ఏడాదికి నాలుగు సార్లు ప్రోగ్రాములు ఇచ్చేవారు.అందువల్లనే ఆ సమయంలో చాలా కథలు రాసాను.కవితలు కూడా ఎక్కువగానే రాసాను.ఆకాశవాణి ప్రోగ్రాములకు డబ్బు కూడా రావటంతో నా మొదటి సంపాదనగా నాకు ఆనందం కలిగించింది. నాకు తెలిసిన ఒక కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నవలరాయాలని తలపెట్టి చాప్టర్లుగా కథని సినాప్సిస్ గా రాసుకొని అప్పుడప్పుడు రాయటం మొదలుపెట్టాను.కానీ వీర్రాజు గారు "కవిత్వం బాగా రాస్తున్నావు దానిమీద దృష్టి పెట్టు కవిత్వసంపుటో,కథలసంపుటో వచ్చాక నవలరాయొచ్చులే" అనేసరికి అది పక్కన పెట్టేసాను. ఇంతలో పెద్ద ఆడబడుచు భర్త అల్సర్ ట్రీట్మేంటు కోసం కుటుంబ సహితంగా వచ్చి నెలరోజుల పైగానే ఉన్నారు.మళ్ళా నాకు ఊపిరి ఆడని పని మొదలైంది.చిన్నాడబడుచుకి నిండునెలలు కావటంతో రెండవకాన్పుకి ఆమె కూడా వచ్చింది. ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్ళి చూపించటం,పెద్దాడబడుచు భర్తకి ఆమెకీ భోజనం తయారుచేయటం మధ్యలో పల్లవి చంటిపిల్లకావటంతో ఆ పిల్లని పట్టించుకోలేకపోయాను. మళ్ళా నేను పనివత్తిడితో నలిగిపోయాను.ఇంకా పథ్యాలేవో సరీగా చేసి పెట్టలేదనో, పంపలేదనో మూతివిరుపులూ మామూలే. ఏమైతేనేం వాళ్ళందరూ తిరిగి శుభంగా వారివారి ఇళ్ళకు వెళ్ళేక ఊపిరి తీసుకున్నాను. మధ్యతరగతి జీవితాల్లో మామూలు ఖర్చులకు భిన్నంగా ఇటువంటి అనివార్య ఖర్చులు మీదపడేసరికి అంతంతమాత్రంగా దాచుకున్నవి కాస్తా ఆవిరైపోతూ ఉంటాయి.వాటిని కూడదీసుకునేసరికి చాలా కాలమే పడుతుంది.ఇవన్నింటితో మానసికంగా,శారీరకంగా నేను కుంగిపోయినట్లయ్యాను. ఇంతలో నాకు మళ్ళా నెలతప్పింది.చిన్నాడబడుచు పురిటి కని వచ్చిన అమ్మ వెళ్ళేటప్పుడు " ఈసారి అయినా ఆరోగ్యం బాగా చూసుకో.ఇప్పుడు మీకుటుంబమే కనుక నీకు నచ్చినవి బలమైన ఆహారం తింటూ ఉండు"అంటూ బోలెడు జాగ్రత్తలు చెప్పింది. ఒకరోజు కుమారీ వాళ్ళు ఆడబడుచు లక్ష్మి ని తీసుకుని వచ్చింది.లక్ష్మి బీయిడీ చదువుతుంది.టీచింగ్ ప్రాక్టీస్ కోసం నాకు చార్టులు వేస్తావా అని అడిగింది.పల్లవి బడికి వెళ్తుండటం వలన పగలు ఖాళీగానే ఉంటున్నానుకదా అని సరే అన్నాను. లక్ష్మి చార్టులు తీసుకు వచ్చి ఇచ్చేది.తెలుగుపాఠాలు, సాంఘిక శాస్త్రం పాఠాలు కనుక బొమ్మలు ఎక్కువ గానే ఉండేవి.ఇంట్లో రంగులు ఉంటాయి కాబట్టి వర్ణచిత్రాలు వేసేదాన్ని.అవి చూసి లక్ష్మి క్లాస్ మేట్ లు కూడా వచ్చి మాకూ వేస్తారా అని అడిగి డబ్బులు కూడా ఇస్తామన్నారు.ఆ విధంగా నాకు చిరు సంపాదన మొదలైంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి