5, నవంబర్ 2023, ఆదివారం
సిథారెడ్డి కావ్యం -అనిమేష
~~ భయంకర స్వప్న చరిత్ర - అనిమేష~~
" ఖండిక గానీ, దీర్ఘకవిత గాని ఒక ప్రధానవస్తువును దోహదకరమైన భావపరంపరతో,చిన్న చిన్న గొలుసు ముక్కలను ఒక దానిలో ఒకటి అమర్చి పెద్దగొలుసు తయారు చేసినట్లు,ఒకదానినుండి ఒకటి ఆవిష్కరింపజేస్తూ పాఠకులహృదయాలను క్రమేణా ఆకట్టు కొనగలిగినప్పుడే కావ్యం రాణిస్తుంది.ఏ మాత్రం తోవ తప్పినా లయభంగమౌతుంది.రసభంగమౌతుంది." అంటారు కుందుర్తి ఆంజనేయులు.
కరోనాసంక్షోభం పెనుపిడుగులా పడేసరికి అల్లాడిపోయిన జనం,బిత్తర పోయిన జనం, భయకంపితులైన జనం,మౌనంలోకి కూరుకు పోయిన జనం,ఆవేదనతో గుండెలు బాదుకొన్న జనం,కన్నీళ్ళతో చిత్తడైన జనం,నేలకూలిన జనం ఇలా..ఇలా రెండు శిశిరాలు ప్రపంచ వ్యాప్తంగా కలచి వేసిన దృశ్యాల్ని ఎన్నింటినో ఆవేశం,ఆవేదన, ఆక్రందనలతో అనేక మంది సృజనకారులు తమ తమ మనోచింతనను అక్షరీకరించారు.
అయితే అవన్నీ ఒక ఎత్తు.ఆయా చిత్రాలన్నింటినీ ఒడిసిపట్టి నందిని సిధారెడ్డి అక్షరంగా వెలువరించిన "అనిమేష" ఉపద్రవం కావ్యం మరోఎత్తు.
ఆ రాయటం కూడా పైపైన రాయలేదు.ఆ దృశ్యాల్నీ,ఆ దుఃఖాల్నీ, తనలోకి ఆవాహన చేసుకుని కంఠంలో ఉండకట్టి గిరికీలు కొడ్తూ గరళంలా కాల్చేస్తున్న ఆ మృత్యు ఘోషల్ని సంబాళించుకుంటూ కవి అక్షరంగా ప్రవహింప చేసాడు.
సిధారెడ్డి కవిత్వాన్నంతటినీ చదివిన వారు ఆయన నిజాయితీని శంకించలేరు.కవిత్వం రాయటం ఆయనకి సరదా కాదు.అక్షరాల్లో పద చిత్రాలగారడీలలో దాక్కోవడం తెలియదు.అందుకే సిద్ధిపేట దాటి ,తెలంగాణా దాటి,తెలుగు రాష్ట్రాలు దాటి,దేశం ఎల్లలు దాటి కనిపించని శత్రువు చేసిన వీరవిహారానికి గజగజలాడుతోన్న జీవితాల్నీ ప్రపంచదుంఖాన్నీ దాటుకుంటూ చరిత్రమూలల్లో జరిగిన మృత్యుబీభత్సాల్ని తవ్వి తలెత్తుకుని అక్షరమై ప్రవహించిన అనిమేషుడైనాడు.
" నిశ్శబ్దం నివ్వెరపోయింది "తో అనిమేషని మొదలు పెట్టిన నందిని సిధారెడ్డి " గొళ్ళేలు భద్రమే/ మనుషులే ఛిద్రం / అందుకే జీవితం జీవకళ పోయింది" అంటూ ఊహాన్ పురావైభవం నుండి లేచి జనం పైకి ఉరికిన కనిపించని శత్రువు ప్రపంచాన్ని ఏవిధంగా ప్రమాదంలోకి నెట్టివేస్తుందనే వైనాన్నిచెప్తూ చదువరులను పంక్తులు వెంట పరిగెత్తించారు.
" ఆలింగనం లేకుండా
జననం లేదు
జీవనం లేదు
ఆలింగనమొక ఉద్వేగమే"
కవిత మొదలైన దగ్గర నుంచి ఒక లయతో కవాతు చేస్తున్నట్లుగా సాగుతుంది.ఒకసారి గాయాలతో తడిసినట్లుగా ఆర్ద్రంగా దుఃఖాన్ని మోసుకుంటూ మరోసారి ఆవేశంతోనూ పంక్తులు పంక్తులుగా ప్రవహిస్తుంది.
" మనిషి అడుగులన్నీ అలంకారాలన్నీ ప్రకృతే
ప్రకృతి నయగారాలన్నీ మనిషే"
అది తెలియని మనిషి రంగురాళ్ల కోసమో సౌఖ్యాలు కోసమో అడవుల్ని నరికి నేలతల్లి గర్భం లోకి గొట్టాలుదించి గుండెల్ని పెకిలిస్తుంటే--
"మనిషి విజృంభించేది ప్రకృతి మీదే
ప్రకృతి విజృంభించేది మనిషి మీదే" కదా
ధ్వంసపడిన ప్రకృతికి మిగిలింది ఏముంటుంది అందుకే దాని ఫలితాన్ని మనిషి అనుభవించక తప్పదు.
పొట్టకూటికోసం ఉన్నవూరు వదిలి వలసపోయిన కార్మికులు, శ్రామికులు కరోనా సంక్షోభంలో తిరిగి తమతమ గ్రామాల బాట పట్టినప్పటి దృశ్యాలు -
" ఒడవని వలపోత/వలసకూలీ రాత"అంటూ ముసలి తల్లిని ఎత్తుకొని నడుస్తున్న కొడుకు వెంట,తింటూ తింటూనే కూలిపోయిన కొడుకుని చూసి తల్లి దుఃఖం,భార్యాబిడ్డల్ని దారిలో చేజార్చుకోక తప్పని వైనం,పట్టాల వెంబడే నడుస్తూ శవాల వెతుకులాట,గ్రామాల్లో పంటహామీ లేని వ్యవసాయం తండ్లాట ఇలా వలసకార్మికుల పాదాలపగుళ్ళలో, కళ్ళల్లో ఎండిపోయిన కన్నీళ్ళలో కవి మమేకమై పోతాడు.
ఎన్నెన్నో దృశ్యపరంపరలు ఒక ఏనిమేషన్ పిక్చర్ లా ఒక్కొక్క దగ్గర దృశ్యాలుగా కథాకథనాలుగా గొలుసులు గొలుసులుగా కవిత్వీకరించుకుంటూ నడుస్తుంది.
ప్రాణాలకు తెగించిన వైద్యసిబ్బందికి మొక్కారు.
కనిపించని శత్రువు ఎలా, ఎప్పుడు,ఎక్కడ ప్రవేశించగలుగుతుందోనని అచ్చెరువొందారు.
" ప్రపంచం ప్రయోగశాల/ జీవితం చిక్కుల వల"అంటూ
" గుడి అయినా/ చర్చ్ అయినా
మసీదు అయినా/మఠమైనా
ఆరామమైనా
వైరస్ కు వ్యత్యాసం లేనేలేదు
కాపలా కాయమా
కరోనా ప్రవేశం ఖాయం"
మనిషికే ఎక్కడలేని వ్యత్యాసాలు .అందుకే ఇన్ని విపత్కరాలు .కానీ తెలియకుండానే నరాల్లో నాటుకున్న భయం జాతి మెడ మీద వాలే కత్తి అంటాడు.అయినా రాజకీయ వైరస్ అనే దానికన్నా మతం వైరస్ భయంకరమైనదా అనే చింతనలో మునిగి పోతాడు కవి.
వేల సంవత్సరాల నాటి ,రాతి యుగాలనాటి చరిత్ర అందించిన బీభత్సాలను తవ్వుకుంటూ కవి పోతాడు.ఎన్ని రకాల వైరస్సులను జనం ఎదుర్కొన్నారు.ఎన్నింటిని తట్టుకొని బయట పడ్డారు.లెక్కలూ,చిట్టాలూ తిరగేసుకుంటూపోయిన కవి చివరికి ఒక విషయం అవగాహనకి వచ్చాడు.--
"ప్రాణాలు గాల్లో వేలాడుతున్న వేళ
పరస్పర సహకారం విజ్ణత
ప్రపంచ సంరక్షణ
ప్రపంచ దేశాల బాధ్యత"
చివరికి వచ్చేసరికి కవి వేదాంతిగా మారి సత్యాన్వేషకుడయ్యాడు.కాలం మాయాజాలాన్ని దేహం,ఆత్మ,ప్రాణం,జీవితం, మృత్యువు,దుఃఖం వీటన్నింటినీ తెరిచి తరిచి తవ్వి తండ్లాడి మనిషి మనుగడలో దాగిన సత్యాన్ని వెలికి తీయటానికి సర్వవిధాలా ఆలోచనలతో,త్యాగియై,విరాగియై,తాత్వికుడై,దుఃఖితుడై కన్నీళ్ళతో కలంతో అంతరంగాన్ని శోధించి ఒక కనిపించని శత్రువు చేసిన మాయాజాలంలో చిక్కి విలవిలలాడుతోన్న ప్రపంచాన్నీ,మనిషినీ,మనిషిలోని అహంకారాన్ని ఒక భ్రాంతి లోకి వెళ్ళిపోయి దర్శించాడు కవి.
" ప్రకృతి నిరంతర
మనిషి పరంపర
ప్రయోగశాల రెప్ప వేయదు
ప్రకృతి ప్రేమ వీడదు
మనిషి బతుక్కి కాలం పూచీ
సహజీవనానికి
పూచీ పడాల్సింది మనిషి
ఈ తరానికేనా
రాబోయే తరాలకు అదే హామీ " అంటూ ఒక ఆశావహ దృక్పథాన్ని ప్రకటిస్తూ ముక్తాయింపు ఇచ్చి ముగించారు కవి సిధారెడ్డి.
చదువుతున్న పాఠకులు కూడా క్రమంగా ఆ దృశ్యాల్లో మమేకమై ఒక కవిత్వావరణలో చిక్కుకుంటారు.
దీర్ఘ కవిత మొదలు పెట్టిన దగ్గర నుంచి అర్థవంతమైన కవిత్వపంక్తులతో ఒక సామాజిక సంక్షోభసమయాన్ని ఆలోచనాత్మకంగా మార్చి ఒక కంపనను కలిగిస్తాడు.
సిధారెడ్డి ఈ కావ్య ప్రస్థానం లో ప్రస్తావించిన విషయాలు ప్రధానంగా సామాన్యుల జీవితాన్నే ప్రతిబింబించింది.కరోనా క్రమపరిణామాల్లో సంభవించిన పరిస్థితులు అందరికీ తెలిసినవే అయినా వచనాన్ని కవిత్వాన్ని సరియైన పాళ్ళలో రంగరించి దారితప్పనీకుండా ఒక పెద్ద కేన్వాస్ మీద అక్షరచిత్రంగా మార్చారు.
ఒక ప్రధాన వస్తువును తీసుకుని ఒక తాత్విక చింతన తో ఒక సందేశంతో,తగినంత విస్తారంగా అనేక భావచిత్రాలతో కథలేకుండానే కథనం కలిగి వున్న అనిమేష దీర్ఘ కావ్యాన్ని రాసారు.
నాలుగు దశాబ్దాలకు పైగా కవిత్వసృజనలో వచనకవిత్వదక్షులుగా పేర్కొనబడిన కవి కావటాన కవిత్వపు మూలతత్వం అవగాహన కలిగినవారు కావటాన దీర్ఘకావ్యం పరిధిని పెంచుకునేక్రమంలో అక్కడక్కడా సాంప్రదాయకమైన విశ్వాసాలు,భావాలూ,ప్రేమలు, తాత్విక చింతనా మొదలైనవి చోటుచేసుకున్నాయి.
ప్రజాజీవనంలో కరోనా తీసుకువచ్చిన కొత్తజీవనపరిస్థితులు ప్రతిబింబింపచేసినప్పుడు కొంతమేరకు భావతీవ్రతతో రాసారు.
సామాజిక దృష్టి, సమాజం,ప్రజలూ,మారాల్సిన దృక్పథం, ప్రభుత్వ పాలనలో రావాల్సిన, తీసుకోవాల్సిన మార్పులు మొదలైనవి కవితలో ప్రదర్శించటం గమనించదగ్గది.
ఒక్కొక్కసారి తనచుట్టూ నిరాశ, అసంతృప్తి అలుముకున్న దేశంలో చీకటి జీవితాల్లో వచ్చిన అపజయాలు,స్వీయ అనుభవాలు నుండి పుట్టిన మనో వేదనలు అక్షరీకరించే టప్పుడు కూడా తన చుట్టూ పరుచుకున్న,ఇతరుల జీవితాలను పరిశీలించగలిగే నిశితదృష్టి తొలగి పోతుందేమో
జీవితాలలో మారిపోతున్న వైవిధ్యాలను చూడగలిగే శక్తి నశించి పోతుందేమోనని కవి అసహాయతకు లోను కాలేదు.తన అనుభవాల్ని ప్రపంచములో అనుభవాలతో మేళవించి రాయటం వలన శైలికి,కవితా రీతికి మధ్య అభేదం లేకుండా ఈ దీర్ఘకావ్యం రాయటంలో ఘనవిజయం సాధించారు.
అనిమేషులు అని రెప్ప కదపని దేవతల్ని అంటారు.ఇక్కడ అనిమేష జనాన్ని రెప్పవాల్చకుండా దాడి చేసిన కరోనా వైరస్సా? రెప్పవాల్చకుండా గజగజ లాడిన ప్రపంచమా?అని పాఠకులకు సందేహం రాకుండా --
" మృత్యుదేవత
గమనిస్తూనే వుంది
ప్రకృతి రెప్పవాల్చదు
ప్రకృతి అనిమేష
వైరస్ ఒక మిష"అంటూ కవి తన కావ్యానికి అనిమేష పేరును అర్థవంతం చేసారు.
" ఆధునిక సంక్లిష్ట వచనకవితాస్వరూపాన్ని పరిపూర్ణంగానూ,సారవంతంగానూ,తాత్వికంగానూ పట్టుకున్న కవి సిధారెడ్డి" అని శివారెడ్డి గారు భూమిస్వప్నం సంపుటికి ముందుమాటలో రాసారు.ఆ మాట ఈ 'అనిమేష' కు కూడా వర్తిస్తుంది.
సిధారెడ్డి నిజాయితీతో నిక్కచ్చిగా రాసే కవిత్వాన్ని చదివిన పాఠకులు సిధారెడ్డి కవిత్వాన్ని ప్రేమించకుండా ఉండలేరు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి