28, అక్టోబర్ 2024, సోమవారం
జి.ఎస్ లక్ష్మి నవలకు ముందు మాట
~ యువతరానికో కరదీపిక - నాన్నలూ! నేర్చుకోండిలా ~
"జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్పవిజయాలు సాధించగలరు " అంటారు స్వామి వివేకానంద.
పిల్లల కోసం మంచి నీతికథలు చెప్పిన జి.ఎస్.లక్ష్మిగారు, పెద్దలకు కాజాలాంటి మంచి
మాటల సుద్దులు చెప్పిన లక్ష్మిగారు, యువతరానికో బాట చూపిస్తూ రాసిన నవల 'నాన్నలూ నేర్చుకోండిలా'
చిన్నప్పటి నుండీ తల్లిదండ్రులు పిల్లల్ని రేంకుల వెంటా, తదనంతరం రూపాయల వెంటా పరుగులు పెట్టిస్తూ డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో తయారుచేయాలనుకుంటారు. అయితే జీవితవిలువల గురించి, సామాజిక బాధ్యతల గురించి తల్లిదండ్రులే కాదు ఏ విద్యాలయాలూ నేర్పవు.
అందుకే బుద్ధిగా తల్లిదండ్రుల మాట విని చదువు కొని సాఫ్టువేరును పట్టుకొని కొంత దూరం ఎదిగిన తర్వాత తాము అణచి పెట్టుకున్న తమ తమ కలల సాకారం కోసం ఈనాడు బీటెక్కుల పిల్లలు తమరూటు మార్చుకొని గాయకులుగానో, నటులుగానో, దర్శకులుగానో, రచయితలుగానో సినీరంగం వైపు వెళ్తే, మరి కొందరు పొలాలు కొని సేంద్రీయ వ్యవసాయాలవైపు, ఇంకొందరు వండి వారుస్తామని చెఫ్ లు గానూ ఆత్మవిశ్వాసంతో కొత్తదారిలో వెళ్ళిపోతున్నారు.
అటువంటి ఔత్సాహికుడైన సాఫ్టువేరు యువకుడిని బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు చేసుకొని నిర్వహించడానికి దోహదం చేసిన కార్య కారణాలన్నీ జి ఎస్ లక్ష్మిగారి మాటల్లాగే సున్నితంగా, సరళంగానే కాక ఆసక్తికరంగా పాఠకులను పరుగులు పెట్టించి చదివించే పఠనీయత కలిగిన చిన్న నవల " నాన్నలూ!-నేర్చుకోండిలా! "
నేను కథ చెప్పను. రచనలో చూపిన ఆసక్తికర అంశాలు మాత్రమే వివరిస్తాను.
నవలలో ముఖ్యమైన పాత్రలు రెండు సాఫ్ట్ వేరు జంటలు. మధు, శృతి ఒక జంట ఐతే, సుమ, రవీంద్ర మరో జంట. సాఫ్ట్ వేరు జీవులకుండే కష్టనష్టాలన్నీ వీళ్ళకీ ఉంటాయి.అన్నింటికన్నా ప్రధానమైన సమస్య తమ పిల్లల పెంపకం.ఇరువురి తల్లిదండ్రులూ కొంతకాలం వుండి చూస్తారు. ఆ తర్వాత ?...
. తూతు మంత్రంగా కేవలం వ్యాపారాత్మకంగా పనిచేసే కేర్ సెంటర్లలో తమ పిల్లలు అనారోగ్యం పాలు అవుతూంటే తల్లడిల్లుతారు.శృతి ఉద్యోగం కెరియర్ పై ఆసక్తిగల అమ్మాయిగా కనిపిస్తుంది. అందువలన కూతురి బాధ్యత గురించిన ఆ తల్లడింపులోంచి మధుకి పుట్టిన ఆలోచనే తానే ఒక కేర్ సెంటర్ ఎందుకు పెట్టకూడదనేది.
అసలు పాత్రలు కాకుండా ఉన్న మిగిలిన పాత్రలు కూడా వీళ్ళ సహఉద్యోగులే కనుక అవే ఆలోచనలు, అవే ఇబ్బందులు . అందులో ఒంటరి తల్లులు కూడా ఉండటం గమనార్హం. అయితే అందరూ కూడా మంచి ఆలోచనాపరులు, బాధ్యతగల వారే, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కలవారు.
మధు తన కూతురి కోసం కేర్ సెంటరు నడపాలనే ఆలోచన గురించి, దానిని నడపటంలో చేయల్సిన కృషిని మాత్రమే కాకుండా పిల్లల శారీరక, మానసిక వికాసం గురించి కూడా ఆలోచించటం అనేది ప్రధాన అంశం. దానిని సమర్థించే విధంగా రచయిత్రి కథలోని పాత్రల్నే కాకుండా చదువుతున్న పాఠకులను కూడా కన్విన్స్ చేసే విధంగా నవలను ఆసాంతం రాయటంలో ఈ సమాజం పట్ల ఆమెకు గల అంకితభావం వ్యక్త మౌతుంది .
విదేశాలు వెళ్ళి డాలర్లు సంపాదించే నైపుణ్యం గల యువకుడు కనీసం స్వదేశంలో రూపాయల వెనకైనా పరుగెత్తకుండా చంటిపిల్లల ముక్కులూ, మూతులు తుడిచి, డైపర్లు మారుస్తూ ఉండాలనుకోవటం తల్లిదండ్రుల నుండే కాక, బంధువుల, స్నేహితుల నుండీ నిరసన ఎదుర్కోవటం సహజమే కదా.
దానిని ఆత్మవిశ్వాసంతో సమర్థవంతంగా ఎదుర్కొని తన కార్యాచరణను వ్యక్త పరచి విశదంగా వివరించటం కోసం ముఖ్యంగా ఆఫీసు వేదికగా పి.పి.టి ప్రజంటేషన్ చేయటం చాలా వివరంగా రాస్తారు రచయిత్రి. నిజానికి ఈ నవల ఈవిధంగా తమ కెరియర్ని తీర్చి దిద్దుకొని తాము కూడా కార్పోరేటు తరహా కేర్ సెంటర్ ప్రారంభించాలనుకునే వారికి కరదీపికగా ఉపయోగపడ వచ్చుననిపించింది.
ఈ క్రమంలో కొన్నిచోట్ల ఉపన్యాస ధోరణిలో సుదీర్ఘ సంభాషణలు వున్నా అవి ఏమంతగా నవలానుక్రమణలో అడ్డంకిగా అనిపించవు.ఏ సంఘటన ఎంతవరకూ రాయాలో ,ఏ సంభాషణ ఎంతవరకూ చెప్పాలో అంతవరకే చెప్పారు.అనవసర పొడిగింపులేవీ లేవు. అందుకు కారణం జి. ఎస్. లక్ష్మిగారి సున్నితమైన, సాత్వికమైన, సుతిమెత్తని రచనా విశేషం .
బహుశా పిల్లల కథలు రాసే అనుభవం వల్లన కావచ్చు జి. ఎస్. లక్ష్మిగారు ఈ చిన్ని నవల నేటి యువతరానికి అవసరమైన అంశాన్ని తీసుకొని యువతరానికి అవగాహన కలిగించేలా, ఆలోచనాత్మకంగా రచించారు.
జి. ఎస్ .లక్ష్మిగారి నుండి మరిన్ని మంచి రచనలు వస్తాయని అభిలషిస్తూ మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.
21, అక్టోబర్ 2024, సోమవారం
మందార మకరందమైన జీవితం
~ మందార మకరందమైన జీవితం ~
" ప్రేమ, నిజాయితీ,పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏశక్తీ ఓడించలేదు" అంటారు-- స్వామి వివేకానంద.
వివేకానందుడిని చదివారో లేదో కానీ ఎదుగుతున్న దశ నుండి తన జీవితంలో చూసిన మరణాలు కావచ్చు,మనుషులు కావచ్చు సూర్యప్రకాష్ మనసుమీద వేసిన ముద్ర మాత్రం అక్షరాలా ఇదే.
అందుకే పాతికేళ్ళ క్రితమే అరటిపండుతో ప్రేమను పంచాడు.నృత్యరూపకాలతో ఆహారం ప్రాధాన్యతను చాటి జ్ణానాన్ని పెంచాడు. ఆ కోవలోనే "అందరి ఇల్లు" ప్రారంభం అయ్యింది.అందరి ఇల్లు అనే అంశమే అద్భుతమైనది.
ప్రాణాలకు తెగించి నిజాయితీగా సూపర్ సైక్లోన్ లో అయితేనేం, గుజరాత్ రైట్స్ లోనైతేనేం అంకితభావంతో జాతి మతాలకు అతీతంగా వైద్యసేవలు అందించిన వారు ఈ వైద్య దంపతులు. సూర్యప్రకాష్ తో జీవితమే కాదు ఆశయాలతోనూ చేతుల్నీ కలిపి చేదోడు వాదోడుగా డా.కామేశ్వరి జత కలిసి జంటగా చేసిన కార్యక్రమాలలో ఆత్మహత్యలకు వ్యతిరేకంగానే కాక గర్భ సంచిని కాపాడుకుందాం అంటూ వూరూరా తిరిగి చాటిచెప్పారు.అంతేకాదు డా.కామేశ్వరి గర్భసంచిని కాపాడుకుందాం,మథుమాలతి అనే అవసరమైన రెండు పుస్తకాలను సరళమైన భాషలో తన అనుభవాలను క్రోడీకరించి రాయటం చాలా హర్షణీయం.
ఉత్తరాలతో మానవ సంబంధాలను ఎలా బలపరచుకోవచ్చో ' art of letter writing ' ద్వారా తెలియజేసారు.
అంతటితో ఆగిపోలేదు అన్ని విధాలా రోగగ్రస్తమైపోతున్న సమాజాన్ని ప్రేమా నిజాయితీ అనే వైద్యంతో పునరుజ్జీవింప చేయటానికి నడుం బిగించారు. అందరం మనమందరం అంటూ మందార పూవును చిహ్నంగా ఎంచుకొని వారితో సహకరించే వారినందరిని ఒకే కుటుంబం గా కలుపుకుంటూ సమాజంలో 'అందమైన జీవితాల్ని ' కలగనే స్వాప్నికులు డా.కామేశ్వరీ,డా.సూర్యప్రకాష్ దంపతులు.అందుకే అందరికీ పూలనూ,పూలమొక్కల్నీ పంచుతారు.
అందరికీ ఆహారం, ఆరోగ్యం, మానసిక వికాసానికి పుస్తకం అందినపుడు సమాజమే మారుతుందన్న విశ్వాసంతో అడుగులు వేస్తారు ఈ వైద్య దంపతులు.
స్వాతంత్రోద్యమంలో భాగంగా ప్రజల్లో అక్షరాస్యత పెంచి పుస్తకాలతో జాగృతి పరచటానికి జరిగిన గ్రంథాలయోద్యమ స్పూర్తి ఆలోచనల్లోకి వచ్చిందేమో జంటనగరాల్లోనే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వంద చిట్టి గ్రంథాలయాలే కాకుండా ఆనందనిలయంలో సుమారు ఇరవై వేల గ్రంథాలను సేకరించి ఏర్పాటు చేసిన బృహత్ గ్రంథాలయం అపురూపమైనది.దీనిలో భాగంగా వందరోజులు వంద పుస్తకాల పరిచయ సమావేశాలుగానీ, కరోనా కాలంలో డెభ్భైఆరు రోజులు వివిధ రిసోర్స్ పెర్సన్లతో నిర్వహించిన కార్యక్రమాలు గానీ ఏక వ్యక్తి సైన్యంగా( one man army ) జరగటం నభూతో నభవిష్యతి అనే చెప్పాలి.సూర్యప్రకాష్ ధైర్యం డా.కామేశ్వరి అయితే ఆయన సంకల్పానికి విశ్వాసాన్ని ఇచ్చేది మనోబలం .
ఏ కార్యక్రమం అయినా అదే డా.సూర్యప్రకాష్ ని నడిపిస్తుందా? ఈయనే ఆయా కార్యక్రమాల్ని మనసుకి హత్తుకుని ఎత్తుకుని నడిపిస్తాడో తెలియదు కానీ డా.సూర్యప్రకాష్ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమౌతుంది.కారణం నిజాయితీగా అంకితభావంతో మనస్ఫూర్తిగా చేయడమే అనుకుంటాను.
డా.కామేశ్వరి , డా.సూర్యప్రకాష్ అనే వైద్యదంపతులు తలపెట్టే ప్రతి పనిలో ఒకరి నీడ మరొకరిదిగా ,ఇరువురి అడుగుజాడలు ఒకటిగానే ప్రతీ కార్యక్రమం నిర్వహించటం అపురూపమైనదిగా
ఉంటుంది.
ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టినప్పుడు చాలా భావోద్రేకం కలగటం సహజం.వాటిని ప్రేక్షకులుగా మనమంతా కూడా అనుభవించుతాం.
అటువంటి కార్యక్రమమే జతిన్ గారి మాటలకు ఉత్తేజితులైన కళ్ళముందు ఎదిగిన గాయత్రీ, ఆమెలాంటి మరికొందరు యంగ్ డాక్టర్లను చూస్తుంటే వారికే కాదు మనకు కూడా రేపటి భవిష్యత్తు మీద ఎంతో ఆశ కలుగుతుంది.
డా.కామేశ్వరీ,డా.సూర్యప్రకాష్ నమ్మిన ఆశయాలు, అభిరుచులు , అంకితభావం తప్పక వారందరిలో జాగృతి కలిగించే వుంటుంది .అందులో అనుమానం అక్కరలేదు.వారందరిలో ఆ నిజాయితీ,ఆ అంకితభావం,ఆ స్వచ్ఛత కలకాలం వుండాలని ఆశిస్తున్నాను.
సామాజిక కోణంలో అందరి పండుగగా జరపటం ఎప్పటిలాగే సమాజంపట్ల ఈ దంపతులకు గల పునరంకితం కావాలనే ఆశయసిద్ధికి తార్కాణం.
డా.కామేశ్వరీ& డా.సూర్యప్రకాష్ గార్లు
పదవ తేదీన నిర్వహించిన మాతృసంబరం కన్నులపండువగా తల్లుల చేతుల్లో విరిసిన బాలబాలికల సందడితో అందమైన పూలతోటలా ఆ ఆవరణ అంతా కలకలలాడింది.
రెండవరోజు జరిగిన అభినందన కార్యక్రమం అంతే కన్నులపండువగా జరిగింది.
తర్వాత పదిహేను రోజుల పాటూ యువతరానికి పంపిణీ చేసిన పుస్తకాలు కావచ్చు,యువతరాన్ని జాగృతి పరిచేందుకు వారిలో ప్రేమా,నిజాయితీలను అవగాహన చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు కావచ్చు రేపటి భవిష్యత్తుపై సూర్యప్రకాష్,కామేశ్వరి దంపతులకు గల ఆశా,భరోసాలతోనే అని నమ్ముతున్నాను.
పాతికేళ్ళుగా జరిగిన కార్యక్రమాలను పునశ్చరణ చేసుకోవటం డా.కామేశ్వరి, డా. సూర్యప్రకాష్ లకు తిరిగి మరిన్ని కార్యక్రమాలకు పునరంకితం కావలసిన మనోధైర్యాన్ని కలిగించి ఉంటుందని అనుకుంటున్నాను.
డా.సూర్యప్రకాష్ & డా కామేశ్వరి దంపతులకు హృదయపూర్వక శుభాభినందనలు.
-- శీలా సుభద్రాదేవి
పుస్తక ప్రేమికుడు రామడుగు రాధాకృష్ణమూర్తి
~ పుస్తకప్రేమికుడు రామడుగు రాధాకృష్ణమూర్తి ~
అరవై దశకంలో ఎక్కడి ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా బక్క పలుచని అర్భకంగా కనిపించే వ్యక్తి భుజానికో సంచి తగిలించుకుని వచ్చి సభమందిరంలో వెనక సీట్లలో కూర్చునేవారు.అయినా కూడా సభకి వచ్చిన రచయితలందరూ అతనిని పలకరించేవారు.ఆయనే రామడుగు రాధాకృష్ణమూర్తి అని పిలువబడే సాహిత్య ప్రేమికుడు.ఆయన సంచిలో ఎవరి అవసరం కోసమో ఎప్పుడూ పుస్తకాలు ఉంటాయి.
రామడుగుగారికి పరిచయమో,స్నేహమో లేని తెలుగు రచయితలు బహుశా ఉండకపోవచ్చు.ఆయనకు తెలిసిన రచయితలనూ,స్నేహితులైన కథకులనూ,చదివిన పుస్తకాలనూ,నచ్చిన కథలనూ జాబితా చేయాలంటే చాలా కష్టం.ఎందుకంటే అరుణాచలం కూడా వెళ్ళి చలంగారిని కలిసి మాట్లాడి వచ్చిన వారు కదా రామడుగుగారు.
శీలా వీర్రాజుగారు 1961 లో హైదరాబాద్ వచ్చిన మరి కొంతకాలానికే రామడుగు రాధాకృష్ణమూర్తి గారితో పరిచయం మొదలై స్నేహంగా పరిణమించింది .1970 లో స్వాతి పత్రిక ప్రారంభ సంచిక వీర్రాజుగారి ఇంటి ఆవరణలోనే వెలువడింది.
అందులో గౌరవసంపాదకుడుగా వీర్రాజుగారి పేరు చూసి నేను ఆయనకు వీర్రాజుగారి రచనలపై వుత్తరం రాసాను. ఆ వుత్తరం వీర్రాజుగారు రాధాకృష్ణమూర్తిగారికి కూడా చూపించారట.అదిగో అప్పటి నుండీ రాధాకృష్ణమూర్తిగారు నాకు పరోక్ష పరిచయం.
మరికొన్నాళ్లు వీర్రాజుగారితో కలం స్నేహం , తర్వాత మా వివాహం వెనుక కూడా రాధాకృష్ణమూర్తిగారి ప్రోత్సాహం వుంది.నన్ను 'అమ్మాయీ ' అని ఆత్మీయంగా పిలిచేవారు.
నల్లకుంటలో పెద్ద ఆవరణలో అనేక పూలమొక్కల మధ్య కుటీరం లాంటి ఇంట్లో రాధాకృష్ణమూర్తిగారి నివాసం. పుస్తకాల కోసమో, రచయిత లో చిరునామాలకోసమో ఆ దారిలో ఎంతమంది వచ్చే వారో.
నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మా కుటుంబంలోని ప్రతీ అడుగు,ప్రతీ ఎదురుదెబ్బలు, ప్రతీ సంబురాలూ,ప్రతీ కన్నీటి చెలమలో అన్నింటిలోనూ మాకు భరోసా కల్పించిన వారు రామడుగుగారే.
వీర్రాజుగారు ఉద్యోగంలో వాలంటరీ తీసుకున్నాక అప్పటికే రాధాకృష్ణమూర్తిగారు రిటైర్ కావటంతో తరుచుగా ఇంటికి వచ్చేవారు నేను ఉద్యోగానికి వెళ్ళిపోయినా వీర్రాజుగారూ,ఆయనా రోజంతా గడిపేవారు.నేను కవిత్వం ఎక్కువగా రాస్తుంటే " కథలు రాయమ్మా" అని ప్రోత్సహించేవారు.చాలాకాలానికి ఒకసారి వారి గ్రామానికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసీ " అమ్మాయీ నేను మా వూరు వెళ్తే అక్కడ ఇమడలేక పోయాను.నువ్వురాసిన మార్పు వెనుక మనిషి కథే గుర్తువచ్చింది" అన్నారు.అంతకన్నా నాకు గొప్ప అవార్డు ఏముంది?
మా అక్కయ్య పి.సరళాదేవి,అన్నయ్య కొడవంటి కాశీపతిరావు కథలన్నా ఆయనకి చాలా యిష్టం.అందుకే గొరుసు జగదీశ్వరరెడ్డిగారిని విజయనగరం పంపించి అక్కయ్యని ఇంటర్వ్యూ చేయించటం లోనూ, ఎమెస్కో ప్రచురణగా కాశీవతిరావు కథలసంపుటి రావటంలోనూ రామడుగుగారి ప్రమేయం వుంది.
ఇక నేను డా.పి.శ్రీదేవి మీద మోనోగ్రాఫ్ రాయబోతున్నానని తెలిసి రామడుగుగారే రాస్తున్నంతగా సంతోషపడ్డారు.శ్రీకృష్ణాంధ్రభాషా నిలయంకి నన్ను తీసుకువెళ్ళి ఎమ్వీయల్ నరసింహారావుగారికి పరిచయం చేసారు.అంతేకాదు 1956-59 వరకూ గల తెలుగు స్వతంత్రల బౌండులను నాకు ఇంటికి ఇచ్చేలా ఒప్పించారు.ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ పాతబడి శిథిలావస్థలో వున్నాయి.అప్పుడు కెమేరా ఫోనుల్లేవు.జిరాక్స్ చేయడానికీ వీలుగా లేవు.
మూడు చొప్పున ఆ బౌండులను నేను ఇంటికి తెచ్చుకుని కొన్ని నేను కాపీ చేసుకుని శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ ను సమగ్రంగా రాయగలిగానంటే ఆ క్రెడిట్ అంతా రామడుగు రాధాకృష్ణమూర్తి గారిదే.ఆ మోనోగ్రాఫ్ పుస్తకరూపంలో వచ్చాక ఆయన నా కంటే ఎక్కువగా మురిసిపోయారు.
నా కోసమే కాదు ఎవరు ఏ వ్యాసం రాయాలన్నా,పరిశోధనలు చేయ్యాలన్నా ఎలా అయినా పుస్తకం సంపాదించి సమకూర్చే రాయని భాస్కరుడు రామడుగుగారు.మంచి కథల పుస్తకం వెలువడిందని తెలిస్తే కొని భుజానికి వున్న సంచిలో వేసుకునేవారు.అవసరమైనవారికి పంచేవారు.అందుకే ఎవరికైనా పుస్తకం గురించో కథ గురించో అవసరమైన వాళ్ళు మొదట్లో నల్లకుంట లోని ఇంటికి, తర్వాత చిక్కడపల్లి ఇంటికీ వెతుక్కుంటూ వెళ్తారంటే అతిశయోక్తి ఏమీలేదు.
నల్లకుంటలో భార్యవియోగానంతరం ఇల్లు బిల్డర్లకు ఇచ్చి పిల్లలు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు రామడుగు గారు తాను సేకరించిన అనేక పుస్తకాలు మిత్రులకు పంచేసారు.
తన కథల్లోంచి ఎంపిక చేసి ప్రచురించుకున్న శీలా వీర్రాజు కథలు సంపుటిని రాధాకృష్ణమూర్తిగారికి అంకితం చేస్తే కొన్ని పుస్తకాలు తానే కొని స్నేహితులకు పంచిన ఆత్మీయులు రామడుగుగారు. భుజాన వున్న అక్షయపాత్ర లాంటి సంచి నుండి తీసిన పుస్తకాలు అందుకోని ఈ తరం వారికి బహుశా రామడుగు తెలియక పోవచ్చు.
వీర్రాజుగారు తన డెభ్భై అయిదేళ్ళ పుట్టినరోజున తన "అసంబద్ధనిజం" కవితా సంపుటి ఆవిష్కరణ చేసుకుని అదే సందర్భంగా తమ యాభై ఏళ్ళకు పైగా గల స్నేహ బంధాన్ని పురస్కరించుకుని రామడుగు రాధాకృష్ణమూర్తిగారికి స్నేహపురస్కారం అందజేసారు.
రానురాను వయసురీత్యా రెండంతస్తుల మేడ మెట్లు దిగిరాలేక రామడుగుగారూ,ఎక్క లేక వీర్రాజుగారు కలుసుకోవటం తగ్గింది.వినికిడి శక్తి తగ్గి రామడుగుగారు ఫోనుకి దూరం అయ్యారు.దాంతో వారికీ,మా కుటుంబానికి అనివార్యంగా దూరం ఏర్పడింది.
ఇటీవల కొన్ని నెలల క్రితం మాడభూషి రంగాచార్య స్మారక సంస్థ లలితాదేవీ,నేనూ వెళ్ళి రామడుగుగారిని కలిసాము.కానీ మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చింది.మాట్లాడుకున్నామనుకున్నాము కాని మాట్లాడుకోలేదేమో అనిపించింది.కాసేపు కూర్చుని వచ్చేసాము.ఓ పదిహేను రోజుల క్రితం లలితాదేవిగారూ,నేనూ దసరా వెళ్ళాక ఒకసారి రాధాకృష్ణమూర్తి గారిని చూసి రావాలని అనుకున్నాము.తీరా ఆయన తొందరపడి అంతవరకూ ఆగకుండా కన్నుమూసారు. ఆ విషయం తెలిసి హడావుడిగా వెళ్ళినా కంటిచూపుకి అందలేదు.వృద్ధాప్యం నిజంగా శాపమా? మనసులో ఆ రోజంతా కలవరపడుతూనే వున్నాను.
అడిగినవారికి కోరిన పుస్తకం అందజేసే సాహితీ కల్పవృక్షం కూలిపోయింది.
అటువంటి పుస్తకప్రేమికులు అరుదుగా వుంటారు. కథల్ని హృదయానికి హత్తుకునే రామడుగు రాధాకృష్ణమూర్తిగారు దూరమై కథలపుస్తకాలన్నీ చిన్నబోతున్నాయండీ రాధాకృష్ణమూర్తిగారూ మీకు ఇదే అక్షరాశృనివాళులు.
- శీలా సుభద్రాదేవి
18, అక్టోబర్ 2024, శుక్రవారం
నడక దారిలో -45
నడక దారిలో -45
డా.భార్గవీరావు ఒకసారి మాయింటికి వచ్చినప్పుడు 'వందమంది రచయిత్రుల వందకథలను సంకలనం చేయాలనుకుంటున్నాను ' అన్నారు.సరే ముగ్గురం కూర్చొని జాబితా తయారు చేసాం.అయితే కనీసం ఒక సంపుటి అయినా వచ్చిన రచయిత్రులను తీసుకుంటే బాగుంటుందని వీర్రాజుగారు అన్నారు.ఆ రకంగా కొందరి పేర్లు తొలగించాం.వందకన్నా ఎక్కువ పేర్లువున్నాయి.భార్గవిరావు " వారందరికీ వుత్తరాలు రాస్తాను.స్పందించిన వారి కథలు మాత్రమే తీసుకుంటాను.చనిపోయిన వారి కథల్ని మనమే ఎంపిక చేద్దాం" అన్నారు.ఆ పని మొదలైంది.ఆమె మమ్మల్ని ఒక్కరినే కాక చాలా మందిని సంప్రదించింది.దాంతో మొగమాటాలకి లోబడి ఒక్క కథ రాసిన వారివి కూడా ఆమె తీసుకున్నారు.అది మాకు నచ్చకపోయినా మౌనంగా వూరుకున్నాము.భార్గవీరావు సంపాదకత్వంగానే వందమంది రచయిత్రుల వందకథలతో "నూరేళ్ళ పంట" సంకలనం మిళిందీప్రకాశన్ వాళ్ళ ద్వారా వెలువడింది.
నూరేళ్ళపంటకి మంచి గుర్తింపు రావటంతో అదేవిధంగా వందమంది కవయిత్రుల సంకలనం మన ఇద్దరం కలిసి వేద్దాం అంది భార్గవీరావు.మొల్లదగ్గరనుండి మొదలు పెడదాం అంటే సరే అన్నాను.కవయిత్రుల జాబితా తయారుచేసి వాళ్ళందరికీ ఉత్తరాలు రాసి వాళ్ళ కవితా సంపుటాలను పంపించమని కోరాము.అయితే కొందరు కవయిత్రులు వారే తప్ప ఇతరులు కవయిత్రులూ,కథకులు కానేకారని భావించి కవిత ఇవ్వటానికి నిరాకరించారు.ఒకరిద్దరు ఇవ్వనన్నంతలో ఆగదు కదా.
కవితా సంపుటాలు చదివి అంతకుముందు సంకలనాలలో రాని మంచి కవితలను ఎంపిక కోసం చదవటం నాకు ఆనందం కలిగించింది.అనుకున్నట్లుగా వందమంది కవయిత్రులు కవితా సంకలనం " ముద్ర" ను కూడా మిళిందీ ప్రకాశన్ వారే ప్రచురించారు.మేము ముందుమాటలో కొందరు వాళ్ళ కవితలను చేర్చటానికి ఇష్టపడలేదనే మాటల్ని స్పష్టంగా రాసినా సమీక్షలు రాసిన వారు ఒకరిద్దరు ఎత్తి చూపటం భార్గవీరావుకు ఆగ్రహం తెప్పించింది.
" చిన్నన్నయ్యకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఏర్పడ్డాయనీ,ఆపరేషన్ చేయించుకుంటున్నాడనీ,నీకు హిస్ట్రెక్టమి జరిగినప్పుడు సత్యవతి సాయానికి వచ్చింది కనుక నువ్వు వాళ్ళకి సాయం వస్తే బాగుంటుందని " మా పెద్దక్క ఉత్తరం రాసింది.నాకు సంక్రాంతి సెలవులే కనుక రిజర్వేషన్ చేయించుకుని విజయనగరం వెళ్ళాను.నాతో వాళ్ళు సంబంధం తెంచుకున్నా గానీ నేను రావటం ఆశ్చర్యం కలిగింది.నాతో ఎక్కువ మాట్లాడకపోయినా ఆపరేషను అయ్యేవరకూ సాయంగా వుండి తిరిగి వచ్చేసాను.
అప్పట్లో జాతీయ ఛానెల్లో చాలా మంచి ధారావాహికలు రావటంతో ఎంతో అలసిపోయినా సరే చూడటం అలవాటైంది.అమరావతికథలుకూడా హిందీలో నాటకాలుగా వచ్చేవి.అలాగే ఒక సంచలనాత్మక సుదీర్ఘ ధారావాహికగా మొట్టమొదటగా సులోచనారాణి రాసిన "రుతురాగాలు" సప్తగిరి ఛానెల్లో టెలీకాష్ట్ అయ్యేది నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో యద్దనపూడి సీరియల్ యువతరానికీ,మహిళాపాఠకులకూ ఎంత క్రేజ్ కలిగించిందో అంత క్రేజ్ రుతురాగాలు కూడా కలిగించిందనే చెప్పాలి.బిందునాయుడు,మంజునాయుడు దీనిని గొప్పగా తీసారు.సాయంత్రం నాలుగున్నర కల్లా అందర్నీ టీవీ ముందుకు తీసుకువచ్చిన మొట్టమొదటి తెలుగు టీవీ సీరియల్ గా చెప్పుకోవచ్చు.కానీ దానిని తర్వాత్తర్వాత మరీ సాగదీసి విసుగెత్తించారు.
నాకు తొందరగా బస్సు దొరికితే సీరియల్ టైముకు అందుకునే దాన్ని. దాని తర్వాత ఇక పుంఖానుపుంఖాలుగా వాళ్ళవి వస్తూనే వున్నాయి.
ఇంక మా స్కూల్ లో
ఎయిడెడ్ స్కూల్లో సీనియారిటీని బట్టి అందులో ప్రమోషన్ ఇవ్వాలి.అంతకుముందు లెక్కలు పోస్టులో సోషల్ టీచర్కి ఇచ్చారు ఆమె హెచ్చెమ్ గా ప్రమోట్ కావటంతో ఖాళీ అయ్యింది.నన్ను అందులో నింపాలి.కానీ ఆమె నాకు ప్రమోషన్ ఇవ్వటం ఇష్టంలేక దానిని అలా ఖాళీగానే వుంచి నా జూనియర్స్ నింపాలన్నట్లుచూసింది.ఇంక నాకు విపరీతమైన కోపం వచ్చి ఎమ్మె, ఎమ్మెస్సీ పీజీ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు చించి ఆమెపై విసిరేసి అరిచాను.
నా ఆవేశాన్నీ,కోపాన్నీ,ఆవేదననీ పట్టలేక వీర్రాజుగారితో చెప్పాలంటే ఉద్యోగం మానేయమంటారు.అందుకని చెప్పలేదు.క్లాసులు తీసుకోవటం మానేస్తే పిల్లలు నష్టపోతారు.అందుకని పాఠాలు మాత్రం మానేయకుండా ఏంచేయాలో అనే ఆలోచనలో పడ్డాను.
నేను స్కూలు లో జాయిన్ అయిన దగ్గర నుండి జరిగిన పరిణామాల్ని,వివక్షతలతో నాకు ప్రమోషన్ ఇవ్వని విషయాల్ని కూలంకుషంగా ఉత్తరం రాసి అయిదు కాపీలను సంబంధిత అధికారులకు రిజిస్టర్ పోష్టులో మూడు నెలలకు ఒకసారి పోష్టు చేయసాగాను.మన ప్రభుత్వఆఫీసుల సంగతి తెలిసినా పంపిపుతూనే ఉన్నాను. అవి బుట్టదాఖలు అవుతూ వచ్చాయి.అయినా నేను మౌనపోరాటం మలా సాధించాలని చూసాను.
పల్లవి న్యూజెర్సీ నుండి వచ్చేసి మినియాపోలిస్ లోనే ఉద్యోగంలో చేరింది.కాని అక్కడ నిత్యమూ మంచు కురుస్తుంది.అదీగాక టార్నిడోలు కూడా తరుచూ వస్తుంటాయట.
అందుకని నేను పల్లవికి మెయిల్ ద్వారా రోజూ కాంటాక్ట్ లో ఉండాలని నేర్చుకోవటానికి దగ్గర లోని కంప్యూటర్ సెంటర్ లో చేరాను.స్కూలు నుంచి వచ్చి ఆరింటికి వెళ్ళేదాన్ని .అయితే నేర్పించే ముస్లింకుర్రాడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా వచ్చినట్లు లేదు.నాకు ఉర్దూ రాదు.ఇంగ్లీషు పెద్దగా రాదు.ఆ అబ్బాయి ఉర్దూ తప్ప మాట్లాడటం లేదు.దాంతో నెలరోజులు ఎలాగో పూర్తిచేసి మానేసాను.ఆ నెలరోజుల్లో కంప్యూటర్ ఆపరేట్ చేయటం ,PPT లు తయారుచేయటం,కాస్తంత ఎక్సెల్ సీటు నింపడం తప్ప మరేమీ రాలేదు.
భారవి ద్వారా ఒక కంప్యూటర్ కొనుక్కున్నాను.అంతకుముందు పక్కింట్లో ఉండే రఘు నాకు rediff mail ఐడీ చేసి మెయిల్ ఎలా ఇవ్వాలో ,ఎలా ఓపెన్ చేసి చూడాలో నేర్పాడు.ఎప్పుడైనా మర్చిపోతానేమోనని ఒక పుస్తకంలో అన్నీ రాసి చెప్పాడు.
అంతలో ఒక శుభవార్త.నేను అమ్మమ్మను కాబోతున్నానని.నేను సంతోషంతో పొంగి పోయాను.అయితే అమెరికా ప్రయాణం తప్పదు అనుకున్నాము.పల్లవి అత్తగారూవాళ్ళూ ముందుగా వెళ్తామనీ పల్లవి డెలివరీ అయిన తర్వాత మమ్మల్ని రమ్మన్నారు.తర్వాత వాళ్ళ అమ్మాయి డెలివరీ టైమ్ కి అక్కడికి వెళ్ళిపోతామన్నారు.ఏ ఆడపిల్లకైనా తల్లి కాబోతున్న సమయంలో తల్లి పక్కనే వుండాలనుకుంటుంది.నాకు కూడా పల్లవిని గర్భంతో ఉండగా దగ్గర వుండటం, తనకి ఇష్టమైనవి,తినాలనుకున్నవీ చేసి పెట్టాలనే కోరిక తీరలేదు. నేను ఆసమయంలో అనుభవించిన వెలితి పల్లవికి రాకూడదనుకున్నాను.కానీ నాకు నచ్చక పోయినా అదే నిర్ణయం అయ్యింది.
మాకు పాస్పోర్టులు కూడా లేవు.ముందు ఆ ప్రోసెసింగ్ మొదలు పెట్టాము.అంతేకాక డిపార్ట్మెంట్ నుండి నాకు ఆరునెలలు సెలవులకి అంగీకారంకి ప్రయత్నించాలి.
డిసెంబర్ మొదటి వారంలో డెలివరీ కావచ్చని అంచనాతో అజయ్ వాళ్ళ అమ్మా నాన్న నవంబర్ మొదటివారంలో వెళ్ళి రెండు నెలలు ఉండి మేము జనవరిలోనో ఫిబ్రవరి లోనో వస్తే వాళ్ళ
అమ్మాయి దగ్గరకు వెళ్ళాలని నిర్ణయం అయ్యింది.
ప్రతీరోజూ కంప్యూటర్ మెయిల్ చెక్ చేసుకొని పల్లవికి రెండు ముక్కలు రాసే దాన్ని.పల్లవిని కూడా అలానే ఎలా ఉన్నది రాయమనేదాన్ని.
ఆరోజు ఎప్పటిలాగే స్కూలు నుండి వచ్చాక మెయిల్ చూస్తే ఆరోజు హాస్పిటల్ కి చెకప్ కి వెళ్తున్నానని వచ్చాక ఏ విషయమూ మెయిల్ చేస్తానని పల్లవి మెయిల్ పెట్టింది.కంప్యూటర్ ఆఫ్ చేసేసాను.
త్యాగరాజగానసభలో ఏదో సాహిత్య సమావేశం వుందని,నేనూ పక్కింట్లోనే వున్న పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారూ వెళ్దామనుకున్నాము.
ఆరుగంటలకు తయారై ఆటో పిలవాలనుకున్నాము.అయితే కరెంట్ పోయింది.ఎప్పటికీ రావటంలేదు.చిక్కడపల్లి ప్రెస్ కి వెళ్ళిన వీర్రాజుగారు అప్పుడే వచ్చి చిక్కడపల్లి అంతా కరెంట్ పోయింది. గ్రిడ్ లోనే సమస్య వచ్చిందని ఎప్పటికి వస్తుందో తెలియదని అంటున్నారనీ చెప్పారు.ఇంక ఈ చీకట్లో వెళ్ళటం ఎందుకని మేము వెళ్ళే కార్యక్రమం మానుకున్నాము.
సరిగ్గా ఎనిమిదిన్నరకి కరెంటు వచ్చింది.టీవీ ఆన్ చేసాము అమెరికాలో ఉగ్రదాడి అని బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.ముందు మాకేమీ అర్థం కాలేదు.వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంటటవర్లు కూలిపోవడం,పెంటగన్ పై దాడీ టీవీలో చూపిస్తుంటే గుండెల్లోంచి వణుకు మొదలయ్యింది. కంప్యూటర్ తెరిచి పల్లవి మెయిల్ చూడాలనుకుంటే సర్వర్ డౌన్ అయ్యి రావటం లేదు.
అంతలో స్నేహితులనుండి ఫోన్లు రావటం మొదలయ్యాయి. "ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ పల్లవి వాళ్ళు బాగున్నారా " అని ,అలాగే అక్కడవున్న వాళ్ళ పిల్లలు గురించి క్షేమ సమాచారాలు తెలియజేసారు.క్రింద ఇంటి సరోజినీ గారూ,యజ్ణప్రభ గారూ ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు సంగతి చెప్పి పల్లవి గురించి అడిగారు.
అందరి కంఠాల్లో భయం.గుండెల్లో దుఃఖం .పల్లవి నుండి ఫోన్ వస్తుందేమోనని ఒళ్ళంతా చెవులు చేసుకుని ఫోన్ దగ్గరే కూర్చున్నాం.అంతలో ఫోన్ వచ్చింది.హాస్పటల్ కి వెళ్ళి వచ్చానని బాగానే వున్నామని,తమకేమీ ఇబ్బంది లేదని చెప్పాక గుండెలనిండా ఊపిరి తీసుకున్నాం.కానీ ..కానీ... ఆందోళన తగ్గలేదు.దేశదేశాలనుండి చదువులూ,ఉద్యోగాలకూ యువతరం అమెరికాకు తరలిపోతోంది.అప్పులు చేసి మరీ తల్లిదండ్రులు ఆశతో పంపుతున్నారు.ఎంతమందికి గుండెకోత అయ్యిందో కదా అనిపించింది.
మరి కొన్ని రోజులకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా అమెరికా ఆఫ్ఘన్ యుధ్ధం మొదలైంది.
నాలోని ఆందోళననీ,ఆవేదననీ ఓ కవితగా రాసి వీర్రాజు గారికి చూపించాను.చాలా బాగా రాసావనీ,మరికొంత పెంచి దీర్ఘ కవితగా రాయగలవేమో చూడమని వీర్రాజు గారు అన్నారు.
అంతే యుద్ధమూలాలు అన్వేషించటమేకాక, మత విద్వేషాలు యుద్ధానికెలా దోహదమౌతాయో, ఎన్ని కుటుంబాలు, సంక్షోభాలలో ఇరుక్కుంటాయో, యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఎందరు తల్లులు గర్భశోకంలో గుండెకోతను అనుభవిస్తారో,చరిత్ర లోతుల్లోకి వెళ్ళి వీటన్నిటికీ నా దృష్టి కోణంలో కార్యకారణాలను "యుద్ధం ఒక గుండె కోత"ని దీర్ఘ కవిత అక్షరీకరించాను.ఆ వెంటనే పుస్తక రూపంలోకి తీసుకు వచ్చి నాగభైరవ కోటేశ్వరరావు గారి అధ్యక్షతన,అద్దేపల్లి రామమోహనరావు గారు వక్తగా పుస్తకావిష్కరణ జరిపాము.
వడలి మందేశ్వరరావు,కోవెల సంపత్కుమారాచార్య,ఆంవత్స సోమసుందర్ గార్లు నా పుస్తకం అందుకోగానే సుదీర్ఘ వ్యాసాలను రాసారు.అనేకమంది ప్రముఖుల ప్రసంశలు ఆ పుస్తకానికి లభించాయి.
అమెరికాలోని దాడులు,యుద్ధం ఇవన్నీ పల్లవికి సబ్ కాన్సాస్ లో ఆందోళన కలిగించాయి ఓ రోజున అకస్మాత్తుగా ఏడవనెలలోనే నొప్పులు రావటంతో హాస్పిటల్ లో జాయిన్ అయింది.నెలరోజులకు పైనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది.డిస్ఛార్జి అయి ఇంటికి వచ్చి ఓ వారం రోజుల ఆఫీసుకు వెళ్ళేసరికి మళ్ళా అదే సమస్య రావటంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యేది.
రెక్కలు కట్టుకుని నాకు వెళ్ళాలనిపించింది.కానీ ఎలా?
పాస్పోర్టులు వచ్చేసాయి వీసాకి ప్రోసెసింగ్ మొదలెట్టాము.జనవరిలో వెళ్తే వేసవి సెలవులు కలిసొస్తాయని ప్లాన్ చేసాను.డిసెంబర్ కి నేను పోర్షన్ పూర్తి చేసేస్తే పిల్లలకి రివిజన్ చేయిస్తే చాలు అనుకున్నాను.కానీ హెచ్చెమ్ గా వున్న ఉషా " నీవి ఇంపార్టెంట్ సబ్జెక్టులు నీకు బదులుగా ఎవరినైనా ఎంపాయెంట్ చేస్తేనే లీవ్ సెంక్షన్ చేస్తానని చైర్మన్ గారు అన్నారు"అని అంది.నిజానికి అవి ఆమె మాటలే.అంతకు ముందు ఆమె కూడా ఆరేసినెలలు సెలవు పెట్టి వెళ్ళింది.అప్పుడు లేని నిబంధన నాకు పెట్టింది.
ఏమి చేయాలో అనే ఆలోచనలో స్త్రీ సంఘటన లక్ష్మి కలిసినప్పుడు మాటలు సందర్భంలో అన్నాను.లక్ష్మి చెల్లెలు కల్పన ప్రస్తుతం ఖాళీగా వుందని ఆమెని పంపుతానంది.పెద్దసమస్య తీరింది.
మొత్తంమీద నాకు దారి సుగమం అయ్యింది.
పల్లవి అత్త,మామలు నవంబరు మొదటి వారంలో వెళ్ళారు. అనుకోకుండా ఒకరోజు వుదయమే పల్లవికి డెలివరీ అయ్యిందనీ,పాపాయి పుట్టిందని ఫోన్ వచ్చింది.మా ప్రయాణం తేదీ ఇంకా రెండునెలలు వుంది ఈ లోపునే తొందరపడి పాపాయి పుట్టేసింది అనుకున్నాము.
అప్పుడే నాకు ఎరియర్స్ అందటంతో పాపకీ,పల్లవికీ బంగారు గొలుసులు ,ఇంకా కావలసిన వస్తువులు కొన్నాను.
మా ప్రయాణానికి సామాను సర్దుకోవడం ఇవన్నింటికీ రఘు,శంకరం,పొనుగోటి కృష్ణారెడ్డి సహకరించారు.అప్పుడప్పుడు వచ్చి ఇల్లు చూసుకుంటామని, మొక్కలకు నీళ్ళు పోయటం ,పని అమ్మాయితో ఇల్లు శుభ్రం చేయించటం చేయిస్తామని చెప్పారు.
సెప్టెంబర్ 11 సంఘటన జరిగి ఎన్నో రోజులు కాలేదు కనుక ఎయిర్ పోర్ట్ ల్లో తనీఖీలు ఎక్కువగా వుండటం వలన రఘు చెకిన్ అయ్యే వరకూ కూడా లోపలికి రావటానికి కుదరలేదు.లాంజ్ లో కూర్చున్నప్పుడు చంటి పిల్లాడిని ఎత్తుకున్న ఒక అమ్మాయి మమ్మల్ని చూసి తాను కూడా మినియాపొలిస్ కే వస్తున్నట్లు తెలియజేసి తనకి కూడా మా సహాయం కోరింది.మాకు కూడా సహకరించింది.
కలలో కూడా ఊహించని విధంగా తొలిసారి విమానం ఎక్కాము.తీరా ఎక్కినా వెంటనే ఏదో సమస్యవచ్చి ఆగి పోయి ఆలస్యంగా బయలుదేరింది.హైదరాబాద్ లో ఆలస్యం కావటంతో లండన్ లో కనెక్టెడ్ ఫ్లైట్ వెళ్ళిపోయింది.దాంతో లండన్ లో ఆ రాత్రికి హొటల్ రూమ్స్ కి పంపారు.పక్క రూమ్ లోనే ఆ అమ్మాయి కూడా వుండటంతో డిన్నర్ కి తీసుకు వెళ్ళింది.బఫే కావటంతో ఏవి తినదగినవో తెలియకపోతే ఆ అమ్మాయే తీసి ఇచ్చింది.పేరు తెలియని ఆ పధార్థాలేవీ తినలేక తిన్నామనిపించాము.
ఉదయమే లేచి తయారయ్యాము.ఆ అమ్మాయి తను స్నానం చేసేంతవరకూ బాబుని మాకు అప్పగించింది.
హొటలు నుండి బస్సులో ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కించారు.ఎలా అయితేనేం మిన్నియాపోలిస్ ఎయిర్ పోర్ట్ లో దిగాం.మా సూట్ కేసులు కూడ తీసుకోటానికి కూడా ఆ అమ్మాయి సాయం చేసింది.ఆ అమ్మాయి సాయంగా వుండటం మాకు ఇబ్బంది కలగలేదు. కానీ అడుగడుగునా మాకు చెకింగులు అవుతూనే వున్నాయి.అదే పెద్ద ఇబ్బందిగా మారింది.
ముందురోజు రావాల్సిన వాళ్ళం రాకపోయేసరికి పల్లవీ,అజయ్ కంగారు పడ్డారు.తర్వాత వాళ్ళకి విషయం తెలిసింది.అజయ్ , వాళ్ళ నాన్నగారు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు.
ఎయిర్ పోర్ట్ నుండి కారులో ఎక్కే సరికే చిలికి వణుకు పుట్టింది.రోడ్లపక్కనంతా మంచు కుప్పలు.ఎట్టకేలకు పల్లవి ఇల్లు చేరాము.
1, అక్టోబర్ 2024, మంగళవారం
అసామాన్యమైన అద్భుతం అమృతలత
~ అసామాన్యమైన అద్భుతం అమృతలత~
"If four things are followed - having a great aim, acquiring knowledge, hard work, and perseverance - then anything can be achieved." - APJ Abdul Kalam స్వాతంత్య్రానంతరం, రెండవ ప్రపంచయుద్ధం అనంతరం ప్రజాజీవనం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఆ సమయంలో జన్మించిన వారి బాల్యం అనేకానేక ఆటుపోట్లతోనే సాగింది.
సరిగ్గా అదే సమయంలోనే అమృతలత జన్మించారు.జక్రాన్పల్లికి దగ్గరగా పడకల్ లో పట్వారి ఇంట్లో ఆరో సంతానంగా పుట్టిన అల్లరి పిల్ల అమృతలత.
ఇక్కడినుండి తన జీవనగమనాన్ని అక్షరాలలో పరుచుకుంటూ పాదాలకి గుచ్చుకుని గాయం చేసిన ముళ్ళని ఆదరంగా తీసి తన వెనుక వచ్చేవారికి గుచ్చుకోకుండా మనసు పిన్ హోల్డర్ లో దాచుకుంటూ, పడినప్పుడు మోకాళ్ళని గుండెల్నీ ఛిద్రం చేయ ప్రయత్నించిన రాళ్ళనీ ఏరుకుంటూ, పుంతలని సాపుచేసుకుంటూతన భవిష్యత్తును రాజబాట చేసుకోవటమే కాక తనవారినందరినీ చేయిపెట్టుకొని కష్టాలు కడలిని దాటించటానికి ప్రయత్నించిన సాహసి.
అల్లరి పిల్ల అమృతలత బాల్య జ్ణాపకాల్ని చదువుతున్న పాఠకుల హృదయాలను మీటుకుంటూ ఆనందభైరవి రాగంతో బృందగానం సాగుతోంది.ఆహ్లాదంగా సాగుతోన్న రాగంలో అంతలో చేతి గాయం ఒక అపశృతిలోకి తెగి తిరిగి ఆత్మవిశ్వాసంతో కొనసాగుతోంది.
తండ్రి మరణం, వైవాహిక జీవితంలో ఆటుపోట్లు అమృతలత జీవన రాగాన్ని అసావేరి రాగంలోకి మార్చి విషాదం గుండెల్ని చెమ్మగిల్లేలా చేస్తుంది.అంతలోనే అమృతలత గుండె ధైర్యాన్ని పుంజుకొని దృఢవ్యక్తిత్వంతో తానే కాక తనవారిని సైతం వెన్నుతట్టి తన జీవన రాగాన్ని తిరిగి శృతి చేసి ఆహ్లాదకర సంగతులతో కళ్యాణి రాగంతో మైమరపింపజేసి తన కంటిపాప హిమచందన్ కి కళ్యాణవేదికని అమరిస్తుంది.
చిన్ననాటి నుండి సాహిత్య,కళాభిరుచి గల అమృతలత విద్యారంగంలోని ఒత్తిడివలన సాహిత్యానికి దూరమౌతున్నానని భావించి "అమృత కిరణ్" అనే పత్రికని రెండేళ్ళ పాటు నడిపారు.డబ్బూ,సమయం వెచ్చించినా పత్రికా నిర్వహణ అంత సులువేమీ కాదని భావించారు.
పత్రికని నిలిపివేసిన అనంతరం విద్యాసంస్థల నిర్వహణ వత్తిడిలో సాహిత్యసృజనకు విరామం ప్రకటించేసినా వివిధ రంగాలలో కృషిచేసిన వ్యక్తులను ఎంపిక చేసి పదమూడేళ్ళకు పైగా రంగరంగ వైభవంగా ఒక పండుగలా సన్మానించి గౌరవిస్తూ, ఆత్మీయంగా స్నేహ సౌరభాలను అందిస్తూన్న ప్రతి అమృతమయ సంఘటననూ,ప్రతి సందర్భాన్ని అనేక ఫొటోలతో నమోదుచేసి జ్ఞాపకాల ఆల్బంగా ఏకాంత బృందగానాన్ని తీర్చిదిద్దటం అమృతలత కళాభినివేశానికీ,సాహిత్యాభిరుచికీ తార్కాణం.
అదృష్టవశాత్తూఆమెకు లభించిన గొప్పభరోసా ,ఆసరా ఆమె సహోదరులు.
అందుకే వివాహవిచ్ఛిత్తులను సైతం ధైర్యంగా అధిగమించి నిలదొక్కుకున్నారు.ఆ పరిస్థితులలో కూడా కుమార్తెకు తండ్రి లేనితనం తెలియకూడదని హిమచందన్ కు చెందిన ప్రతి సందర్భంలోనూ తండ్రిని పిలిపించి కార్యక్రమాలు సక్రమంగా జరపడం అమృతలత మానసిక దృఢత్వానికి మచ్చుతునక.
పాఠశాలలో జరిగే సృజనాత్మక వేడుకల్లో సైతం సాటి రచయిత్రులనూ,సినీరంగానికి చెందిన వారినీ సగౌరవంగా ఆహ్వానించి సత్కరించటం అమృతలత సహృదయ సాంప్రదాయం.
అమృతలత అధ్వర్యంలో జరిగే వేడుకలు అన్నింటినీ పొందుపరిచి ఒక క్రమపద్ధతిలో తన బృందగానంలో జతిస్వరాలుగా కూర్చారు. బాల్యంలోనే తల్లిని,కొంత పెరిగాక తండ్రినీ కోల్పోయినా, ఆర్థిక ఒడిదుడుకుల నుండి ఇప్పటివరకూ ఇన్ని మెట్లు ఎక్కేందుకు దృఢమైన ఆత్మవిశ్వాసంతో చేసిన జీవనపోరాటాన్ని ఏకాంత బృందగానం అంటూ సచిత్రంగా పాఠకుల ముందు ఆలపించారు .
ఆర్థిక పరిస్థితులు సరేసరి కాని ఆమెకు సంభవించిన ప్రమాదాలు పాఠకుల ఒళ్ళు జలదరింపజేస్థాయి.తుపాకి గుళ్ళ బ్లాస్ట్ లో చేతివేళ్ళు పోగొట్టుకున్నా,ఆత్మన్యూనతకు గురికాకుండా తనని తాను వజ్రంలా చెక్కుకొంటూ అపురూప శిల్పంగా మారే క్రమమే ఏకాంత బృందగానం.
బాల్యం నుండీ తాను చేయిచేయి కలిపి నడిచిన స్నేహితురాళ్ళను, అడుగులలో,అడుగులు వేసి నడిపించిన బంధుజనాన్నీ, పలకరించిన, మాట కలిపిన, మనసు తెలిసిన ప్రతి వారిని గురించి తన గానంలో స్వరాల్ని చేసారు అమృతలత, వీరందరివీ సాధ్యమైనంత వరకు ఆనాటి ఫొటోలను కూడా సేకరించి చేర్చటంలో ఆమెకు గల అంకితభావం, అకుంఠిత దీక్ష వ్యక్తమౌతుంది.
బాలంనుండీ తన జీవనయానంలో కలిసిన వారందరిని కూడగట్టుకొని అమర్చటంలో ఆమె జ్ఞాపకశక్తి ఎంత అద్భుతమైనదో తెలుస్తోంది.
కాలేజీ రోజుల్లో అల్లిన కవితల్ని ఇందులో భాగంగా చేర్చి కూర్చారు. ప్రతి సందర్భంలో తాను కలసిన నాయకులను, సాహితీవేత్తలను, ప్రముఖులను గురించి ఉటంకించారు.
తన రచనలకు సంబంధించిన వివరాలే కాక బాల్యమిత్రులతో సహా తన జీవనయానంలోని ప్రతి సంఘటననూ,ప్రతి సందర్భాన్ని అనేక ఫొటోలతో నమోదుచేసి జ్ఞాపకాల ఆల్బంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, సుమారు యాభై అరవై ఏళ్ళ క్రితం ప్రజాజీవితంలో భాగమైన ఆనాటి పనిముట్లు, వాహనాలు, పాత్రలు, వంటలూ, వార్పులు మొదలైనవాటిని చిత్రకారులతో చిత్రాలు వేయించి ప్రతీ పేజీ నిండుగా పరచటం వలన యీ తరం వారికి పరిచయం అవుతాయి. కానీ అవి ఒక ప్రవాహవేగంతో బృందగానం లో లీనమై చదువుతున్న పాఠకులను కొంత దృష్టి మరల్చి వారిపఠనాన్ని ఆటంకపరుస్తుందేమోననిపించింది. అదే విధంగా రాసే క్రమంలో రాష్ట్రంలో దేశంలో జరిగిన అనేక సందర్భాలను, ఆనాటి నేతలను కూడా తన బృందగానంలో బంధించటం ఆమె నిబద్ధత.
తన సాహిత్యాన్ని, పత్రిక నిర్వహణను, అటుపోట్లుకి ఓర్చి స్థాపించిన వివిధ విద్యాసంస్థలను, ఒక అద్భుత అనుభూతి కారణంగా వెలయించిన అపురూప దేవాలయ నిర్మాణములోనూ తాను ఎదుర్కొన్న కష్టనష్టాలను సవివరంగా జీవనయనంలో వివరించారు.
ఒక అద్భుత అనుభూతి కారణంగానే వెలయించిన అపురూప వేంకటేశ్వర దేవాలయ నిర్మాణములోనూ ఆమె అనుభవాలను అక్షరబద్ధం చేసారు
"నా ఏకాంత బృందగానం" ఆవిష్కరణ సమావేశంలో ఈపుస్తకాన్ని అందుకొని ఇంటికి తెచ్చిన వెంటనే శీలా వీర్రాజుగారే ముందు చదివి నాకు ఇచ్చారు. తదనంతరం నేను చదివి నా అభిప్రాయం పాయంట్లుగా రాసి వ్యాస రూపంలో రాయాలనుకుని పేపర్లు ఆ పుస్తకంలోనే పెట్టాను అయితే. ఫైండింగ్ చేసేటప్పుడు కొన్ని పేజీలు మిస్ అయ్యాయని నేను తెలియజేస్తే అమృతలతగారు స్వయంగా మాఇంటికి వచ్చి మేలు ప్రతిని అందజేసారు. మళ్ళా చదివి పూర్తివ్యాసంగా రాయలనుకొని కూడా మాయింట్లో తదనంతరకాలంలో జరిగిన దుర్ఘటనల వలన మర్చిపోయాను.
ఇటీవల ఏకాంత బృందగానం చదవాలని తీస్తే పుస్తకంలోనే ఉన్న సగం రాసిన వ్యాసాన్ని ఇప్పటికైనా పూర్తి చేయాలని భావించి రాయటం మొదలుపెట్టాను. రెండోసారి చదువుతుంటే ఆమె తనను తానే తీర్చి దిద్దుకున్న అద్భుత శిల్పంగా గోచరించింది.
చిన్నచిన్న విషయాలకే ఒత్తిడికి గురై కృంగిపోతూ జీవితం విలువా, మానవ సంబంధాలవిలువా,కౌటుంబిక జీవితం విలువా అవగాహన లేక అవాంఛిత నిర్ణయాలు తీసుకుంటున్న నేటి యువతరం చదవాల్సిన పుస్తకం ఈ "ఏకాంత బృందగానం "
అబ్దుల్ కలాంగారు అన్నట్లు ఆమె స్వాప్నికురాలే. అయితే అబ్దుల్ కలాం గారి మాటలను అవగాహన చేసుకొని 'కలలు కనటమేకాదు సాకారం చేసుకోవటానికి ఒక లక్ష్యాన్ని నిర్దేసించుకొని, దృఢసంకల్పంతో, అకుంఠిత దీక్షతో కృషిచేసినప్పుడు కన్న కలలు సాకారమౌతాయని అన్నమాటల్ని ఆచరణలో పెట్టి అమృతలత తాను కన్న కలల్ని సాకారం చేసుకొన్న సాధకురాలు.
వ్యక్తిత్వం దృష్ట్యా లోహమహిళ అయిన అమృత లత హృదయం మాత్రం పేరుకు తగినట్లు అమృత పరిమళాలను వెదజల్లే సుమనోహర లతానికుంజము. ఆ స్నేహపరిమళాలు అలదుకొన్న వారిలో నేను కూడా వుండటం నాకు లభించిన గొప్ప బహుమతి.
అటువంటి స్నేహమయి అమృతలతగారికి స్నేహాభినందనలు
-- శీలా సుభద్రాదేవి.
8, సెప్టెంబర్ 2024, ఆదివారం
నడక దారిలో -44
నడక దారిలో -44
వేసవి సెలవుల్లోనే వీర్రాజుగారి అరవయ్యేళ్ళ పుట్టిన రోజు వచ్చింది.అప్పటికి నాకు ఆపరేషన్ అయ్యి నెల కూడా దాటలేదు.అందుకని హడావుడి ఏమీ చేయకుండా వీర్రాజుగారి బాల్యమిత్రుడు సత్యనారాయణగారి కుటుంబం,కుటుంబమిత్రులు శంకరంగారి కుటుంబం, వీర్రాజుగారి తమ్ముళ్ళ కుటుంబాల్ని సాయంత్రం పిలిచి ఉపాహారాలతో జరిపాం.పక్కింటిలోని పోలాప్రగడ దంపతులు కూడా వచ్చారు.అంతకుముందు ప్రక్కఇంటిలో వుండే విఠల్ రావుగారి కుటుంబం వచ్చారు వాళ్ళ అబ్బాయి రఘు కేక్ తీసుకొచ్చి వీర్రాజుగారిచే కట్ చేయించాడు.పల్లవి అట్ట మీద 60 అనే సంఖ్యని ఎంబ్రాయిడరీ తో ఫోటో ఫ్రేమ్ చేసి మా ఫొటోలను అందులో పెట్టి పోష్టు ద్వారా పంపింది.వీర్రాజుగారు అది చూసి మురిసిపోయి అందరికీ చూపించేవారు.
మా పెద్దక్కకు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదని తెలిసింది.నేను కొంత కంగారు పడ్డాను.విజయనగరం వెళ్తే బాగుణ్ణు అని అనుకున్నాను.కానీ చిన్నక్క తనఉత్తరంలో 'వైద్యం మొదలైందని కాస్త నెమ్మదిగా ఆరోగ్యం కుదుట పడుతోంద'ని రాసాక మరి ఆలోచన మానుకున్నాను.
స్కూల్ తెరిచే నాటికి ఆపరేషనై మూడు నెలలు దాటటంతో కొంత కోలుకున్నాను.మళ్ళా పనుల్లో పడ్డాను.
పెద్దమరిది చనిపోయాక ఆ కుటుంబ బాధ్యతలు నాకు మరీ పెరిగాయి.పెద్దమ్మాయి ఏదో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది.సర్వే ఆఫ్ ఇండియాలో సర్వీసులో వుండగానే అతను పోయినందుకు కారుణ్య నియామకంగా ఆ అమ్మాయికి అందులో ఉద్యోగం కోసం అందులో పనిచేస్తున్న తెలిసిన వారికి చెప్పాము.రెండో అమ్మాయి ఇంటర్ పూర్తిచేసి మా స్కూల్ కి దగ్గరగా విద్యానగర్ లోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చేరింది.ప్రతీ నెలా నేను వెళ్ళి ఫీజు కట్టి వచ్చేదాన్ని.
ఇక రాజకీయాలు దగ్గరకు వస్తే--
ఈసారి 1998లో లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇతరపార్టీలతో కల్సి జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA)గా అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రిగా ఉంటున్నప్పుడే జయలలిత ఎన్.డి.ఏ.కి మద్దతును ఉపసంహరించుకోవటంతో లోక్‌సభలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆశ్చర్యకరంగా విశ్వాసం కోల్పోయి ప్రభుత్వం కుప్పకూలింది.
కానీ కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన మరో సంచలనఆవిష్కరణగా చెప్పుకోవాల్సిన విశేషం 1998లో రాజస్థాన్ లోని పోఖ్రాన్లో 5 అణుపరీక్షలు జరిపి భారతదేశానికి అనధికార అణు హోదా ప్రతిపత్తిని కల్పించటం. అంతేకాకుండా కార్గిల్ పోరాటంలో పాకిస్తాన్ పై పైచేయి సాధించింది. మంచుపర్వతాలలో కూడా శక్తివంచన లేకుండా పోరాడే శక్తి భారత్ కు ఉందని నిరూపించింది. ఇవన్నీ అప్పటి వాజ్ పేయి ప్రభుత్వానికి కలిసివచ్చిన సంఘటనలే అని చెప్పాలి.
అయినా1999 లో తిరిగి ఎన్.డి.ఏ. కూటమి తిరిగి గెలవటంతో వాజ్‌పేయి ముచ్చటగా మూడో సారి ప్రధాన మంత్రి అయ్యారు. ఈ సారి మాత్రం ఎన్.డి.ఏ. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగింది.
మా కుటుంబమిత్రులు కె.కె.మీనన్ గారు సరోగసీ అంశంతో చాలా పరిశోధనాత్మకంగా రాసిన క్రతువు నవల పుస్తకంగా ప్రచురించారు.దానిని తన స్వంత వూరు రామరాజులంక గ్రామంలో ఆవిష్కరణ చేయతలపెట్టారు.ఆ సభలో పాల్గొనటానికి జ్వాలాముఖిగారూ,నాళేశ్వరం శంకరంగారూ, వీర్రాజుగారూ,నేనూ, మీనన్ గారితో పాటూ బయలుదేరాం.రైలు ఎక్కి సఖినేటిపల్లి లో దిగి అక్కడి పడవ ఎక్కి ఆ గ్రామం చేరాము.ఆ రోజే పుస్తకావిష్కరణ జరిగింది.జ్వాలాముఖిగారూ,శంకరంగారూ క్రతువు పుస్తకం గురించి కూలంకుషంగా జనరంజకంగా ప్రసంగించారు.వీర్రాజుగారు ఆవిష్కర్త కనుక ఎప్పటిలాగే మాట్లాడారు.ఆ కార్యక్రమం అనంతరం బస్సెక్కి శంకరగుప్తం బయలుదేరాం.శంకరగుప్తంలో కథక్ మిత్ర పేరుతో కథలు రాసే వేమూరి నరసింహారావుగారి ఇల్లు చేరేసరికే సాయంత్రం అయ్యింది.వేమూరి నరసింహారావుగారి శ్రీమతి ప్రేమతో తయారుచేసిన స్వీటు,మసాలా కాజూ తిని లంకలోనితోటలూచూడటానికీ, తర్వాత సముద్రంవొడ్డుకీ బయలుదేరాం.
లంకగ్రామమైన శంకరగుప్తం ఇరవై ఏళ్ళక్రితం నా వివాహం అయిన కొత్తలో అన్ని రకాల ప్రయాణసాధనాలు ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది.ఇప్పుడు ONGC కోసం కొత్తగా తోటలమధ్య తారు రోడ్డు పడింది. కరెంట్ కూడా వచ్చింది.వూరుకూడా మార్పు చెందింది.పొలాలన్నీ చేపల చెరువులు అయిపోయాయి.సముద్రం ఒడ్డుకు వెళ్ళేసరికి ఎక్కడా కూర్చునేందుకు వీలులేకుండా అపరిశుభ్రంగా వుంది.భరించలేని కంపు.అసంతృప్తిగా ఇక ఇంటికి తిరుగుముఖం పట్టాం.
రాత్రి జీడిపప్పు కూర మొదలైన వాటితో మంచిభోజనం చేసి,కాసేపు కబుర్లు చెప్పుకున్నాక మేమంతా కొబ్బరి చెట్లు కిందనే హాయిగా పడుకుంటాం అని అంటే మడత మంచాలు వేసారు.
అయితే శంకరం తప్ప జ్వాలాముఖిగారూ,మీనన్ గారూ ,మేమిద్దరం దోమలకీ,వేడికీ రాత్రంతా జాగారం చేసాం.రెండ్రోజులు ఉందామనుకున్నవాళ్ళం కాస్తా మధ్యాహ్నం భోజనం కాగానే కొవ్వూరులో వున్న మా అక్క కూతురు శ్రీదేవి ఇంటికి హూటాహుటిని బయలుదేరి వెళ్ళిపోయాము.రాత్రిభోజనంచేసి కూలర్,ఫేనూ ఉండేసరికి అందరం మత్తుగా నిద్ర పోయాము.నగరసౌకర్యాలకు మేము ఎంత అలవాటు పడిపోయామో అర్థం అయ్యింది.
ఈ అనుభవం ఆధారంగా అక్కడినుండి వచ్చిన వెంటనే " మార్పు వెనుక మనిషి" కథ రాసాను.ఈకథ బ్రౌన్ అకాడమి వాళ్ళు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందింది. ఆ కథకి ఇంగ్లీషులో కూడా అనువాదం జరిగి సంకలనంలో చేరింది.బ్రౌన్ అకాడమీ వాళ్ళుకూడా బహుమతి కథలు పేరిట సంకలనంగా వేసారు.
ఇంకో విశేషం ఏమంటే తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ తెలుగులో మార్పు వెనుక మనిషి కథని పాఠ్యాంశంగా చేర్చారు.
నా అయిదో కవితా సంపుటి ఒప్పులకుప్ప పుస్తకం ఆ ఏడాది ప్రచురించాము.నిర్మలానందగారి అధ్యక్షతన, కాత్యాయనీ విద్మహేగారు వక్తగా పుస్తక పరిచయం చేసేలా పుస్తకావిష్కరణ ఏర్పాటు చేసాము. అమ్మాయి పల్లవి ఇక్కడ ఉంటుండగానే పుస్తకావిష్కరణ జరిగింది.కాత్యాయనీ విద్మహే పుస్తకాన్ని గురించి చాలా బాగా మాట్లాడటమే కాక అందులోని శేషవస్త్రం,పడుగూపేక కవితలను ప్రత్యేకించి చాలా ఇష్టపడ్డారు.అందుకనే ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఎమ్మే వాళ్ళకు పడుగూ పేక కవితను పాఠ్యాంశంగా పెట్టేలా చేసారు.కొన్నాళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీవారికి కూడా పాఠ్యాంశంగా ఉంది.పలుమార్లు ప్రసంగాలలో కూడా కాత్యాయనీ విద్మహే నా కవిత 'పడుగూ పేక' ని ప్రస్తావించుతూ వుంటారు.
పల్లవి రావటంతో మళ్ళీ ఇంట్లో సందడి వచ్చింది.డిసెంబర్ కనుక నేను దాచుకున్న సెలవులను అప్పుడప్పుడు పెట్టాను.ఇంతకాలం పల్లవి డిపెండెంట్ వీసాతోనే వుంది.త్వరలో తన వీసా మారితే వుద్యోగంలో చేరుతానని చెప్పింది .
అయితే అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో
సహస్రాబ్ది ప్రారంభానికి దారితీసిన
Y2K సమస్య 1990ల చివరనుండే ప్రధాన చర్చనీయాంశంగా ఉండేది. సామాజిక మాధ్యమాలు, వార్తాపత్రికలు ఈ విషయం గురించి చాలా చర్చిస్తూ వుండేవి. రెండు-అంకెల సంవత్సరాలను ఎదుర్కొంటున్న ప్రోగ్రామ్‌లు 1900 మరియు 2000 తేదీల మధ్య తేడాను గుర్తించలేవని కొన్ని సమయాల్లో భయంకరమైన హెచ్చరికలు జనంలో సంచలనం కలిగించాయి.
2000 సంవత్సరాన్ని 1900 నుండి వేరు చేయలేని విధంగా తేదీలను సరిగ్గా గుర్తించలేక పోవటంవలన కంప్యూటర్ సిస్టమ్‌ల అసమర్థత వలన కంప్యూటర్ ఆధారిత పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా కుదేలై పోతాయని ప్రపంచవ్యాప్తంగా అంతటా ప్రచారం ముమ్మరమైంది.
Y2K , 2000 సంవత్సరం తర్వాత తేదీల కోసం క్యాలెండర్ డేటా యొక్క ఫార్మాటింగ్ గురించి పేపర్ల నిండా వ్యాసాలు వచ్చాయి. చాలా మందికి "Y2K భయం" గురించి తెలిసింది.
బ్యాంకులలో డబ్బు Y2K సమస్య వలన డ్రాచేయటం కష్టం అని మరోవైపు పుకార్లతో కొందరు బ్యాంకుల నుండి సొమ్ము డ్రా చేసుకోవటం కూడా మొదలెట్టారు.అయితే మొత్తం మీద ప్రశాంతంగా ఏమాత్రం సంచలనం లేకుండానే కొత్త మిలేనియంలోకి ఉత్సాహంగా అడుగు పెట్టాం.
అజయ్ కూడా వచ్చాక అతనితో పాటు పల్లవి విజయనగరం వెళ్ళి తిరిగి ఇద్దరూ కలిసి యూఎస్ వెళ్ళిపోయారు.మళ్ళీ మా గూటిలో మేమిద్దరం మిగిలి పోయాం.
పల్లవి యూఎస్ వెళ్ళాక న్యూజెర్సీలో కొన్ని నెలల ట్రైనింగ్ అనంతరం అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసింది.ఆ తదనంతరం చికాగోకి వెళ్ళింది.వారాంతంలో మినియాపోలీస్ కి వెళ్ళి మళ్ళా సోమవారం చికాగో వెళ్ళేది.ఒక్కోసారి వారాంతంలో ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళేవారు.ఆటువంటప్పుడు మాకు ఫోన్ చేసే సమయాలు మారిపోతుండేవి.
మినియాపోలీస్ సంవత్సరానికి పది నెలలు మంచుకురిసే ప్రాంతం.అందువలన వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కినా అది లాండ్ కావటానికి వాతావరణం అనుకూలించకపోవటం వలన వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరిగేదని పల్లవి చెప్తుంటే కొంతభాగం కలిగేది. చదువులకో,ఉద్యోగాలకో అక్కడకు వెళ్ళి పిల్లలు సుఖపడుతున్నదేమిటీ? కేవలం డాలర్ల వెనుక పరుగులేనా అనిపించింది.ఉద్యోగాలూ శాస్వతం కాదు ఎప్పుడు అకస్మాత్తుగా పింక్ స్లిప్ ఇస్తారో తెలియదు.అంతటి అభద్రతాభావంతో పిల్లలు అక్కడ బతుకుతున్నారు.గ్రీన్ కార్డుగానీ,సిటిజన్ షిప్ గానీ వచ్చేవరకూ అభద్రతతోనే బతకాలనేది మాకు తెలియవచ్చింది.
పల్లవీ,అజయ్ వచ్చినప్పుడు ఏదో సందర్భంలో " సడెన్ గా ఇండియా వచ్చేయాల్సి వస్తే కనీసం ఇక్కడ ఒక ఇల్లూ, మరో వుద్యోగం దొరికే వరకూ సంవత్సరం పాటూ బ్రతకటానికి బేంక్ బేలన్స్ ఉండాలి అత్తయ్యగారు " అన్నాడు అజయ్.
అందుకని ఏదైనా ఒక అపార్ట్మెంట్ ఉంటే కొంటాము చూడమని చెప్పారు అజయ్,పల్లవీ. ఎలాగూ వుద్యోగం చేస్తుంది కనుక పల్లవి డబ్బుతో కొంటామన్నారు.మంచి ప్రాంతంలో అపార్ట్మెంట్ ఉంటే చూడమని మేమూ కొంతమంది మిత్రులకి చెప్పాము.
ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు వీర్రాజు గారికి అవార్డు ఇస్తున్నామని ఫోను చేసారు.గిరీశం పేరుతో కథలు రాసే ఆర్. విద్యాసాగరరావు గారు,రామవరపు గణేశ్వరరావుగారూ అందులో సభ్యులు.ఆర్ విద్యాసాగరరావు గారు అప్పట్లో కేంద్రజలసంస్థ లో ఉద్యోగం చేసేవారు.తెలంగాణా ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసారు.వీర్రాజుగారితో పాటూ నన్ను కూడా ఆహ్వానించటంతో ఇద్దరం బయలుదేరాము.మొదటిసారి దేశరాజధానిలో అడుగు పెట్టటం కొంత ఉద్వేగం కలిగింది.
ఆర్.విద్యాసాగరరావు గారు హైదరాబాద్ లో వున్నప్పుడు వీర్రాజుగారికి మిత్రులే.అప్పట్లో కొత్తగా కథలు రాస్తున్న గిరీశం( విద్యాసాగరరావు)కథ,నాదీ,చిన్నన్నయ్య మొదలగు
ఒక పదిహేను మంది కథలతో దీపిక అనే సంకలనం కూడా వీర్రాజు గారు కథా సాహితి పబ్లిషింగ్ పేరుతో ప్రచురించారు.అప్పట్లో ఆ పేరుతో మిత్రుల కథల పుస్తకాలు ప్రచురించేవారు.
భండారు దత్తాత్రేయ అధ్వర్యంలో ఆంధ్రా భవన్ లోనే పురస్కారం సమావేశం జరిగింది.తర్వాత ఒక రోజంతా గాంధీ సమాధి, ఎర్రకోట, తాజ్ మహల్ , కుతుబ్ మీనార్ ,బిర్లా టెంపుల్ మొదలైనవి చూసాము.నా జీవితంలో తాజ్ మహల్ చూడగలనా అనుకున్నాను.చాలా ఆనందం కలిగింది.
మాది ఆర్టీసీ హైస్కూల్ కావటాన వాళ్ళు మా స్కూల్ విద్యార్థుల విజ్ఞాన యాత్రల కోసం ఇంచుమించుగా ప్రతీ ఏడాదీ రెండు బస్సులు,నలుగురు డ్రైవర్లతో ఉచితంగా ఇచ్చేవారు.ఆ విధంగా దక్షిణ ప్రాంతాలను చాలా వరకూ నేను చూడగలిగాను.కాని ఉత్తరాది ప్రాంతాలేవీ చూడలేదు.అనుకోకుండా ఢిల్లీ చూడటం
చాలా సంతోషమనిపించింది .
1, సెప్టెంబర్ 2024, ఆదివారం
చాగంటి తులసి రచనల్లో రంగులూ రాగాలూ-
~ చాగంటి తులసి రచనల్లో రంగులూరాగాలూ~
విజయనగరం అనగానే గంటస్తంభం గుర్తొచ్చినట్లు,
మధురవాణో,గిరీశమో ఎదురైనట్లు,నోట్లోచుట్టతో దీర్ఘంగా చూస్తున్న చాసో కనబడినట్లు ఆలోచనల్లోకి ముఖం నిండా ప్రసరించే నవ్వుతో చాగంటి తులసి కూడా వస్తుంది.
ఆమె కొన్నిరచనలు సరదాగా చదువుకునేలా సాధారణ పాఠకుడికి అనిపిస్తాయేమో కాని లోతుగా పరిశీలించినప్పుడు ప్రతీదీ విభిన్నకోణంలో ఆలోచింపజేస్తాయి.
'రంగంటే ఇష్టం" పేరిట సాహితి చింతనలు అనే టాగ్ లైన్ తో ఓనలభై వ్యాసాలతో సంపుటి వెలయించారు తులసి. అందులో తొమ్మిది గురజాడ సాహిత్య చింతనలే. గురుజాడ కవిత్వం గురించి గురజాడ కార్యకారణ సంబంధ జ్ఞానంతో హేతుబద్ధతతో ప్రజల బతుకు గురించి ఆలోచించి జీవిత వాస్తవికతను అవగాహన చేసు కున్నాడంటారు రచయిత్రి. గురజాడ సమకాలీన భారతీయ కథకుల గురించి చెప్పారు. పూర్ణమ్మ కథని ఎత్తుకున్న దగ్గరనుండి. ముగింపు వరకూ ఏకోన్ముఖంగా అనుకున్న అంశాన్ని తీసుకు వెళ్ళడం వలన పూర్ణమ్మ కథాకావ్యాన్ని విశిష్టమైనదిగా ఆలోచన కలిగేటట్లు చేసాడంటారు రచయిత్రి . గురజాడ ప్రతిభావంతుడు కాబట్టి ఆధునిక కధానికా ప్రక్రియను ఆరంభిస్తూనే వాస్తురీత్యా, శిల్ప రీత్యా పరాకాష్ఠకు చేరుకునేలా రాయగలిగాడంటారు. ఆధునిక కావ్యాలైన తృణకంకణం, రామిరెడ్డిగారి నల్లజారమ్మకథ, అబ్బూరివారి మల్లికాంబ, నారాయణబాబు దేశమాత, శ్రీశ్రీ భిక్షువర్షీయసి వంటి అనేక స్త్రీపాత్రలలో గురుజాడ జాడవుందని రచయిత్రి సోదాహరణంగా వివరించారు. కన్యాశుల్కంలో 'ఎత్తడం' పేకాట గురించి, సమాజంలో ఆ ఆట కొనసాగింపు ఆ ఆటకి చెందినవిషయాలన్నీ తెలియజేసారు. తరతమ భేదాలున్నప్పటికీ నిరసనగానో, ధిక్కారంగానో, చాకచక్యంగానో, బుద్ధి కుశలతగానో, చదువూ సంస్కారాల మేళవింపు వలన వచ్చిన తెలివిడిగానో. నిస్సహాయతలోని ఎదురుదాడిగానో, బతుకునేర్పిన విజ్ఞతతో అణిగి మణిగి ఉంటున్నట్టే ఉంటూ సాఫల్యం చేసుకునే కార్యసాధకులుగా గురజాడ రచనలలో స్త్రీల స్వభావాలు ఉంటాయని ఒక పేరా లో గురజాడ సాహిత్యమంతటినీతెలియజేస్తూ ఈ వ్యాసాల్లో విశ్లేషించటం విశేషం.
కారా, చాసో, పతంజలి, రావిశాస్త్రి, ఉప్పల లక్ష్మణరావు ,నారాయణబాబు, రామలక్ష్మి రచనల గురించే కాక అనేక మంది భారతీయ రచయిత్రుల సాహిత్య విశ్లేషణలను సుమారు 350 పేజీల యీ గ్రంథంలో ఆనందంగా చదువుకోవచ్చు .
విశిష్ట చిత్రకారిణి అయిన మహాదేవివర్మ కవితలను అనువదించి , మహాదేవివర్మ వేసిన వర్ణ చిత్రాలతో పాటుగా తెలుగు సాహితీ లోకానికి చాగంటి తులసి పుస్తకంగా వేసారు.
గొప్పదైన ఆత్మ సౌందర్యం, దయాగుణం కల్గిన, సంస్కర్త అయిన మహాదేవివర్మ కవిత్వంలోని మూలభావాల సౌందర్యాన్ని తెలుగులోకి అనువదించటంలో సాఫల్యత సాధించింది తులసి అని డా. బాల గాలిసౌరిరెడ్డి గారు ప్రశంసించారు.తన ముందు మాటలో 'మూలంలోని పదసంయోజనాన్ని అది ఎక్కడెక్కడ సంస్కృత సమంగా ఉందో దాన్నంతా జాగ్రత్తగా అనువదించటంలో సాధారణంగా చాలా అనువాదాలలో కనిపించే శ్రవణ నిష్టూరుత్వం కని పించలేద'నీ ప్రశంసించారు వాడ్రేవు చిన వీరభద్రుడు. అంతేకాక ఒక కవయిత్రి తన కన్నీటితో తుడిచిన వేదన మరకను ఎంతో సున్నితంగా సాహిత్యపిపాసులకు ప్రేమతో అందించారని అన్నారు.
అనువాదం చేయటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మరో భాషలోని కథనైనా కవితనైనా తెలుగు లోనికి అనువాదం చేసేటప్పుడు మూలరచయిత అంతరంగాన్నే కాక మూల రచనలోని ఎసెన్స్ ను కూడా ఆకళింపు చేసుకొని భావస్పోరకంగా అనువదించడం నిజానికి కత్తిమీద సామే.అది చాగంటి తులసి సునాయాసంగా చేయగలరనేది ఆమె ఒరియా భాష నుండి తెలుగు లోనికి అనువదించిన కథలే తార్కాణం.
మహాదేవి వర్మ మూలకవితలను, ఆ వెంటనే తన అనువాదాన్ని రెండింటినీ ప్రచురించి పుస్తకంగా వేశారు చాగంటి తులసి ."మహా కవయిత్రి మహాదేవి వర్మ గీతాలు పేరిట వున్న తెలుగు అనువాద కవితలు కూడా తేలికైన అచ్చతెలుగు పదబంధాలతో వుంటాయి.
"బ్రద్దలు కొట్టు క్షితిజాన్ని
అవలోకిస్తాను నేనూ
అవతలవైపు ఏముందో!
ఎందుకని నన్ను చుట్టబెట్టి
బంధిస్తోంది ప్రాచీరమై
నాశ్వాస ఈవేళ " అంటూ స్వీయకవితలేనేమో అనేలా అనువాదం చేసి తెలుగు పాఠకులకు పరిచయం చేశారు.
ఇంక కథలు దగ్గరకు వస్తే స్త్రీవాదం యింకా వేళ్ళూనక ముందే వచ్చిన 'యాష్ ట్రే (1976) 'కథలో స్త్రీని ఆత్మ గౌరవం , ఉన్నత వ్యక్తిత్వానికి కు అద్దం పడుతూ, సమాజంలో ఆలోచనలో కొత్తగా మార్పుచెందుతోన్న స్త్రీ పాత్రగా మలిచారు.ఈ కథ అనేక సంకలనాలు లో చేరటమే కాకుండా అనేక భాషల్లోకీ అనువాదమైంది.
సమాజం వలయంలో ఇమడలేని వ్యక్తుల బాధ్యతారాహిత్యం, పలాయనబుద్ధిని ‘వలయం‘ కథ చెబుతుంది. మానవసంబంధాల మధ్య డబ్బునిర్వహిస్తున్న పాత్రను విమర్శనాత్మకంగా అనేక కథలలో స్పష్టం చేశారు.ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక సంబంధాల పెత్తనాన్ని స్త్రీ పురుష అసమానత్వాన్ని ,ఆడపిల్లల పెంపకం, చదువు, ఉద్యోగం, పెళ్ళి, ప్రవర్తన మొదలైన అంశాలలో మధ్యతరగతి ఆర్థిక , సామాజిక పరిస్థితుల ప్రభావం, దానిని ధిక్కరించడానికి స్త్రీలు చేసే పోరాటాలు చిన్న దేవేరి,యాష్ ట్రే, వలయం కథలలో గమనించవచ్చు.
అమాయకపు ఆడవాళ్లపై జరిగే మగాళ్ళ దాష్టీకాన్నీ,దానికి వంత పాడే కొందరు ఆడవాళ్ళపాత్రనీ ' ఆడదాయికి నోరుండాల్సిందే', శరణ్యం కథలలో రచయిత్రి అక్షరీకరించారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే ఇటీవల అయిదారు నెలలు క్రితం వరకూ యీ మాట అంతర్జాలంలో రాస్తున్న ఊహల ఊట పేరిట అందించిన బాల్య జ్ణాపకాలు ఇంద్రధనుస్సు మీద విహరించేంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.ఉత్తరాంధ్ర మాండలికసొబగునీ,సుమారు అరవై ఏళ్ళక్రితం ఇళ్ళల్లో వాడిన వస్తు పరిచయం,ఆటలూ,పాటలూ బ్రాహ్మణ కుటుంబాలలోని వ్యావహారిక పెదాలతో కూడిన కబుర్లనీ చదువుతో న్న పాఠకులు కూడా బాల్యపు తొడుగులోనికి దూరిపోయి తులసితో చేయి కలిపి తిరిగిన అనుభూతిని కలిగిస్తాయి.
చివరగా "బతుకు గతుకుల్లో గట్టి దెబ్బ తగిలి నప్పుడు అవి కరిగి బయటకు తేలతాయి. నమ్మిన వాళ్లకు దేవుడు ఒక ఆసరా. ‘‘నాకు నేనే ఆసరా, నాకు నేనే బలం’’ అనుకుంటే, మనసును స్వాధీనపరచుకోగలిగితే, కార్యకారణ సంబంధాలను హేతుబద్ధతతో వివేచించగలిగితే దారి స్పష్టమ వుతుంది." అనే చాగంటి తులసి నవల,కథా, అనువాదం , వ్యాసం యిలా ఏ రచన చేసినా ఆమెదైన శైలీ, దృక్పథం వెల్లడౌతుంది.
(ఈమాట - సెప్టెంబర్ 2023)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)