21, అక్టోబర్ 2024, సోమవారం
పుస్తక ప్రేమికుడు రామడుగు రాధాకృష్ణమూర్తి
~ పుస్తకప్రేమికుడు రామడుగు రాధాకృష్ణమూర్తి ~
అరవై దశకంలో ఎక్కడి ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా బక్క పలుచని అర్భకంగా కనిపించే వ్యక్తి భుజానికో సంచి తగిలించుకుని వచ్చి సభమందిరంలో వెనక సీట్లలో కూర్చునేవారు.అయినా కూడా సభకి వచ్చిన రచయితలందరూ అతనిని పలకరించేవారు.ఆయనే రామడుగు రాధాకృష్ణమూర్తి అని పిలువబడే సాహిత్య ప్రేమికుడు.ఆయన సంచిలో ఎవరి అవసరం కోసమో ఎప్పుడూ పుస్తకాలు ఉంటాయి.
రామడుగుగారికి పరిచయమో,స్నేహమో లేని తెలుగు రచయితలు బహుశా ఉండకపోవచ్చు.ఆయనకు తెలిసిన రచయితలనూ,స్నేహితులైన కథకులనూ,చదివిన పుస్తకాలనూ,నచ్చిన కథలనూ జాబితా చేయాలంటే చాలా కష్టం.ఎందుకంటే అరుణాచలం కూడా వెళ్ళి చలంగారిని కలిసి మాట్లాడి వచ్చిన వారు కదా రామడుగుగారు.
శీలా వీర్రాజుగారు 1961 లో హైదరాబాద్ వచ్చిన మరి కొంతకాలానికే రామడుగు రాధాకృష్ణమూర్తి గారితో పరిచయం మొదలై స్నేహంగా పరిణమించింది .1970 లో స్వాతి పత్రిక ప్రారంభ సంచిక వీర్రాజుగారి ఇంటి ఆవరణలోనే వెలువడింది.
అందులో గౌరవసంపాదకుడుగా వీర్రాజుగారి పేరు చూసి నేను ఆయనకు వీర్రాజుగారి రచనలపై వుత్తరం రాసాను. ఆ వుత్తరం వీర్రాజుగారు రాధాకృష్ణమూర్తిగారికి కూడా చూపించారట.అదిగో అప్పటి నుండీ రాధాకృష్ణమూర్తిగారు నాకు పరోక్ష పరిచయం.
మరికొన్నాళ్లు వీర్రాజుగారితో కలం స్నేహం , తర్వాత మా వివాహం వెనుక కూడా రాధాకృష్ణమూర్తిగారి ప్రోత్సాహం వుంది.నన్ను 'అమ్మాయీ ' అని ఆత్మీయంగా పిలిచేవారు.
నల్లకుంటలో పెద్ద ఆవరణలో అనేక పూలమొక్కల మధ్య కుటీరం లాంటి ఇంట్లో రాధాకృష్ణమూర్తిగారి నివాసం. పుస్తకాల కోసమో, రచయిత లో చిరునామాలకోసమో ఆ దారిలో ఎంతమంది వచ్చే వారో.
నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మా కుటుంబంలోని ప్రతీ అడుగు,ప్రతీ ఎదురుదెబ్బలు, ప్రతీ సంబురాలూ,ప్రతీ కన్నీటి చెలమలో అన్నింటిలోనూ మాకు భరోసా కల్పించిన వారు రామడుగుగారే.
వీర్రాజుగారు ఉద్యోగంలో వాలంటరీ తీసుకున్నాక అప్పటికే రాధాకృష్ణమూర్తిగారు రిటైర్ కావటంతో తరుచుగా ఇంటికి వచ్చేవారు నేను ఉద్యోగానికి వెళ్ళిపోయినా వీర్రాజుగారూ,ఆయనా రోజంతా గడిపేవారు.నేను కవిత్వం ఎక్కువగా రాస్తుంటే " కథలు రాయమ్మా" అని ప్రోత్సహించేవారు.చాలాకాలానికి ఒకసారి వారి గ్రామానికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసీ " అమ్మాయీ నేను మా వూరు వెళ్తే అక్కడ ఇమడలేక పోయాను.నువ్వురాసిన మార్పు వెనుక మనిషి కథే గుర్తువచ్చింది" అన్నారు.అంతకన్నా నాకు గొప్ప అవార్డు ఏముంది?
మా అక్కయ్య పి.సరళాదేవి,అన్నయ్య కొడవంటి కాశీపతిరావు కథలన్నా ఆయనకి చాలా యిష్టం.అందుకే గొరుసు జగదీశ్వరరెడ్డిగారిని విజయనగరం పంపించి అక్కయ్యని ఇంటర్వ్యూ చేయించటం లోనూ, ఎమెస్కో ప్రచురణగా కాశీవతిరావు కథలసంపుటి రావటంలోనూ రామడుగుగారి ప్రమేయం వుంది.
ఇక నేను డా.పి.శ్రీదేవి మీద మోనోగ్రాఫ్ రాయబోతున్నానని తెలిసి రామడుగుగారే రాస్తున్నంతగా సంతోషపడ్డారు.శ్రీకృష్ణాంధ్రభాషా నిలయంకి నన్ను తీసుకువెళ్ళి ఎమ్వీయల్ నరసింహారావుగారికి పరిచయం చేసారు.అంతేకాదు 1956-59 వరకూ గల తెలుగు స్వతంత్రల బౌండులను నాకు ఇంటికి ఇచ్చేలా ఒప్పించారు.ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ పాతబడి శిథిలావస్థలో వున్నాయి.అప్పుడు కెమేరా ఫోనుల్లేవు.జిరాక్స్ చేయడానికీ వీలుగా లేవు.
మూడు చొప్పున ఆ బౌండులను నేను ఇంటికి తెచ్చుకుని కొన్ని నేను కాపీ చేసుకుని శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ ను సమగ్రంగా రాయగలిగానంటే ఆ క్రెడిట్ అంతా రామడుగు రాధాకృష్ణమూర్తి గారిదే.ఆ మోనోగ్రాఫ్ పుస్తకరూపంలో వచ్చాక ఆయన నా కంటే ఎక్కువగా మురిసిపోయారు.
నా కోసమే కాదు ఎవరు ఏ వ్యాసం రాయాలన్నా,పరిశోధనలు చేయ్యాలన్నా ఎలా అయినా పుస్తకం సంపాదించి సమకూర్చే రాయని భాస్కరుడు రామడుగుగారు.మంచి కథల పుస్తకం వెలువడిందని తెలిస్తే కొని భుజానికి వున్న సంచిలో వేసుకునేవారు.అవసరమైనవారికి పంచేవారు.అందుకే ఎవరికైనా పుస్తకం గురించో కథ గురించో అవసరమైన వాళ్ళు మొదట్లో నల్లకుంట లోని ఇంటికి, తర్వాత చిక్కడపల్లి ఇంటికీ వెతుక్కుంటూ వెళ్తారంటే అతిశయోక్తి ఏమీలేదు.
నల్లకుంటలో భార్యవియోగానంతరం ఇల్లు బిల్డర్లకు ఇచ్చి పిల్లలు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు రామడుగు గారు తాను సేకరించిన అనేక పుస్తకాలు మిత్రులకు పంచేసారు.
తన కథల్లోంచి ఎంపిక చేసి ప్రచురించుకున్న శీలా వీర్రాజు కథలు సంపుటిని రాధాకృష్ణమూర్తిగారికి అంకితం చేస్తే కొన్ని పుస్తకాలు తానే కొని స్నేహితులకు పంచిన ఆత్మీయులు రామడుగుగారు. భుజాన వున్న అక్షయపాత్ర లాంటి సంచి నుండి తీసిన పుస్తకాలు అందుకోని ఈ తరం వారికి బహుశా రామడుగు తెలియక పోవచ్చు.
వీర్రాజుగారు తన డెభ్భై అయిదేళ్ళ పుట్టినరోజున తన "అసంబద్ధనిజం" కవితా సంపుటి ఆవిష్కరణ చేసుకుని అదే సందర్భంగా తమ యాభై ఏళ్ళకు పైగా గల స్నేహ బంధాన్ని పురస్కరించుకుని రామడుగు రాధాకృష్ణమూర్తిగారికి స్నేహపురస్కారం అందజేసారు.
రానురాను వయసురీత్యా రెండంతస్తుల మేడ మెట్లు దిగిరాలేక రామడుగుగారూ,ఎక్క లేక వీర్రాజుగారు కలుసుకోవటం తగ్గింది.వినికిడి శక్తి తగ్గి రామడుగుగారు ఫోనుకి దూరం అయ్యారు.దాంతో వారికీ,మా కుటుంబానికి అనివార్యంగా దూరం ఏర్పడింది.
ఇటీవల కొన్ని నెలల క్రితం మాడభూషి రంగాచార్య స్మారక సంస్థ లలితాదేవీ,నేనూ వెళ్ళి రామడుగుగారిని కలిసాము.కానీ మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చింది.మాట్లాడుకున్నామనుకున్నాము కాని మాట్లాడుకోలేదేమో అనిపించింది.కాసేపు కూర్చుని వచ్చేసాము.ఓ పదిహేను రోజుల క్రితం లలితాదేవిగారూ,నేనూ దసరా వెళ్ళాక ఒకసారి రాధాకృష్ణమూర్తి గారిని చూసి రావాలని అనుకున్నాము.తీరా ఆయన తొందరపడి అంతవరకూ ఆగకుండా కన్నుమూసారు. ఆ విషయం తెలిసి హడావుడిగా వెళ్ళినా కంటిచూపుకి అందలేదు.వృద్ధాప్యం నిజంగా శాపమా? మనసులో ఆ రోజంతా కలవరపడుతూనే వున్నాను.
అడిగినవారికి కోరిన పుస్తకం అందజేసే సాహితీ కల్పవృక్షం కూలిపోయింది.
అటువంటి పుస్తకప్రేమికులు అరుదుగా వుంటారు. కథల్ని హృదయానికి హత్తుకునే రామడుగు రాధాకృష్ణమూర్తిగారు దూరమై కథలపుస్తకాలన్నీ చిన్నబోతున్నాయండీ రాధాకృష్ణమూర్తిగారూ మీకు ఇదే అక్షరాశృనివాళులు.
- శీలా సుభద్రాదేవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి