28, అక్టోబర్ 2024, సోమవారం
జి.ఎస్ లక్ష్మి నవలకు ముందు మాట
~ యువతరానికో కరదీపిక - నాన్నలూ! నేర్చుకోండిలా ~
"జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్పవిజయాలు సాధించగలరు " అంటారు స్వామి వివేకానంద.
పిల్లల కోసం మంచి నీతికథలు చెప్పిన జి.ఎస్.లక్ష్మిగారు, పెద్దలకు కాజాలాంటి మంచి
మాటల సుద్దులు చెప్పిన లక్ష్మిగారు, యువతరానికో బాట చూపిస్తూ రాసిన నవల 'నాన్నలూ నేర్చుకోండిలా'
చిన్నప్పటి నుండీ తల్లిదండ్రులు పిల్లల్ని రేంకుల వెంటా, తదనంతరం రూపాయల వెంటా పరుగులు పెట్టిస్తూ డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో తయారుచేయాలనుకుంటారు. అయితే జీవితవిలువల గురించి, సామాజిక బాధ్యతల గురించి తల్లిదండ్రులే కాదు ఏ విద్యాలయాలూ నేర్పవు.
అందుకే బుద్ధిగా తల్లిదండ్రుల మాట విని చదువు కొని సాఫ్టువేరును పట్టుకొని కొంత దూరం ఎదిగిన తర్వాత తాము అణచి పెట్టుకున్న తమ తమ కలల సాకారం కోసం ఈనాడు బీటెక్కుల పిల్లలు తమరూటు మార్చుకొని గాయకులుగానో, నటులుగానో, దర్శకులుగానో, రచయితలుగానో సినీరంగం వైపు వెళ్తే, మరి కొందరు పొలాలు కొని సేంద్రీయ వ్యవసాయాలవైపు, ఇంకొందరు వండి వారుస్తామని చెఫ్ లు గానూ ఆత్మవిశ్వాసంతో కొత్తదారిలో వెళ్ళిపోతున్నారు.
అటువంటి ఔత్సాహికుడైన సాఫ్టువేరు యువకుడిని బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు చేసుకొని నిర్వహించడానికి దోహదం చేసిన కార్య కారణాలన్నీ జి ఎస్ లక్ష్మిగారి మాటల్లాగే సున్నితంగా, సరళంగానే కాక ఆసక్తికరంగా పాఠకులను పరుగులు పెట్టించి చదివించే పఠనీయత కలిగిన చిన్న నవల " నాన్నలూ!-నేర్చుకోండిలా! "
నేను కథ చెప్పను. రచనలో చూపిన ఆసక్తికర అంశాలు మాత్రమే వివరిస్తాను.
నవలలో ముఖ్యమైన పాత్రలు రెండు సాఫ్ట్ వేరు జంటలు. మధు, శృతి ఒక జంట ఐతే, సుమ, రవీంద్ర మరో జంట. సాఫ్ట్ వేరు జీవులకుండే కష్టనష్టాలన్నీ వీళ్ళకీ ఉంటాయి.అన్నింటికన్నా ప్రధానమైన సమస్య తమ పిల్లల పెంపకం.ఇరువురి తల్లిదండ్రులూ కొంతకాలం వుండి చూస్తారు. ఆ తర్వాత ?...
. తూతు మంత్రంగా కేవలం వ్యాపారాత్మకంగా పనిచేసే కేర్ సెంటర్లలో తమ పిల్లలు అనారోగ్యం పాలు అవుతూంటే తల్లడిల్లుతారు.శృతి ఉద్యోగం కెరియర్ పై ఆసక్తిగల అమ్మాయిగా కనిపిస్తుంది. అందువలన కూతురి బాధ్యత గురించిన ఆ తల్లడింపులోంచి మధుకి పుట్టిన ఆలోచనే తానే ఒక కేర్ సెంటర్ ఎందుకు పెట్టకూడదనేది.
అసలు పాత్రలు కాకుండా ఉన్న మిగిలిన పాత్రలు కూడా వీళ్ళ సహఉద్యోగులే కనుక అవే ఆలోచనలు, అవే ఇబ్బందులు . అందులో ఒంటరి తల్లులు కూడా ఉండటం గమనార్హం. అయితే అందరూ కూడా మంచి ఆలోచనాపరులు, బాధ్యతగల వారే, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కలవారు.
మధు తన కూతురి కోసం కేర్ సెంటరు నడపాలనే ఆలోచన గురించి, దానిని నడపటంలో చేయల్సిన కృషిని మాత్రమే కాకుండా పిల్లల శారీరక, మానసిక వికాసం గురించి కూడా ఆలోచించటం అనేది ప్రధాన అంశం. దానిని సమర్థించే విధంగా రచయిత్రి కథలోని పాత్రల్నే కాకుండా చదువుతున్న పాఠకులను కూడా కన్విన్స్ చేసే విధంగా నవలను ఆసాంతం రాయటంలో ఈ సమాజం పట్ల ఆమెకు గల అంకితభావం వ్యక్త మౌతుంది .
విదేశాలు వెళ్ళి డాలర్లు సంపాదించే నైపుణ్యం గల యువకుడు కనీసం స్వదేశంలో రూపాయల వెనకైనా పరుగెత్తకుండా చంటిపిల్లల ముక్కులూ, మూతులు తుడిచి, డైపర్లు మారుస్తూ ఉండాలనుకోవటం తల్లిదండ్రుల నుండే కాక, బంధువుల, స్నేహితుల నుండీ నిరసన ఎదుర్కోవటం సహజమే కదా.
దానిని ఆత్మవిశ్వాసంతో సమర్థవంతంగా ఎదుర్కొని తన కార్యాచరణను వ్యక్త పరచి విశదంగా వివరించటం కోసం ముఖ్యంగా ఆఫీసు వేదికగా పి.పి.టి ప్రజంటేషన్ చేయటం చాలా వివరంగా రాస్తారు రచయిత్రి. నిజానికి ఈ నవల ఈవిధంగా తమ కెరియర్ని తీర్చి దిద్దుకొని తాము కూడా కార్పోరేటు తరహా కేర్ సెంటర్ ప్రారంభించాలనుకునే వారికి కరదీపికగా ఉపయోగపడ వచ్చుననిపించింది.
ఈ క్రమంలో కొన్నిచోట్ల ఉపన్యాస ధోరణిలో సుదీర్ఘ సంభాషణలు వున్నా అవి ఏమంతగా నవలానుక్రమణలో అడ్డంకిగా అనిపించవు.ఏ సంఘటన ఎంతవరకూ రాయాలో ,ఏ సంభాషణ ఎంతవరకూ చెప్పాలో అంతవరకే చెప్పారు.అనవసర పొడిగింపులేవీ లేవు. అందుకు కారణం జి. ఎస్. లక్ష్మిగారి సున్నితమైన, సాత్వికమైన, సుతిమెత్తని రచనా విశేషం .
బహుశా పిల్లల కథలు రాసే అనుభవం వల్లన కావచ్చు జి. ఎస్. లక్ష్మిగారు ఈ చిన్ని నవల నేటి యువతరానికి అవసరమైన అంశాన్ని తీసుకొని యువతరానికి అవగాహన కలిగించేలా, ఆలోచనాత్మకంగా రచించారు.
జి. ఎస్ .లక్ష్మిగారి నుండి మరిన్ని మంచి రచనలు వస్తాయని అభిలషిస్తూ మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి