1, అక్టోబర్ 2024, మంగళవారం
అసామాన్యమైన అద్భుతం అమృతలత
~ అసామాన్యమైన అద్భుతం అమృతలత~
"If four things are followed - having a great aim, acquiring knowledge, hard work, and perseverance - then anything can be achieved." - APJ Abdul Kalam స్వాతంత్య్రానంతరం, రెండవ ప్రపంచయుద్ధం అనంతరం ప్రజాజీవనం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఆ సమయంలో జన్మించిన వారి బాల్యం అనేకానేక ఆటుపోట్లతోనే సాగింది.
సరిగ్గా అదే సమయంలోనే అమృతలత జన్మించారు.జక్రాన్పల్లికి దగ్గరగా పడకల్ లో పట్వారి ఇంట్లో ఆరో సంతానంగా పుట్టిన అల్లరి పిల్ల అమృతలత.
ఇక్కడినుండి తన జీవనగమనాన్ని అక్షరాలలో పరుచుకుంటూ పాదాలకి గుచ్చుకుని గాయం చేసిన ముళ్ళని ఆదరంగా తీసి తన వెనుక వచ్చేవారికి గుచ్చుకోకుండా మనసు పిన్ హోల్డర్ లో దాచుకుంటూ, పడినప్పుడు మోకాళ్ళని గుండెల్నీ ఛిద్రం చేయ ప్రయత్నించిన రాళ్ళనీ ఏరుకుంటూ, పుంతలని సాపుచేసుకుంటూతన భవిష్యత్తును రాజబాట చేసుకోవటమే కాక తనవారినందరినీ చేయిపెట్టుకొని కష్టాలు కడలిని దాటించటానికి ప్రయత్నించిన సాహసి.
అల్లరి పిల్ల అమృతలత బాల్య జ్ణాపకాల్ని చదువుతున్న పాఠకుల హృదయాలను మీటుకుంటూ ఆనందభైరవి రాగంతో బృందగానం సాగుతోంది.ఆహ్లాదంగా సాగుతోన్న రాగంలో అంతలో చేతి గాయం ఒక అపశృతిలోకి తెగి తిరిగి ఆత్మవిశ్వాసంతో కొనసాగుతోంది.
తండ్రి మరణం, వైవాహిక జీవితంలో ఆటుపోట్లు అమృతలత జీవన రాగాన్ని అసావేరి రాగంలోకి మార్చి విషాదం గుండెల్ని చెమ్మగిల్లేలా చేస్తుంది.అంతలోనే అమృతలత గుండె ధైర్యాన్ని పుంజుకొని దృఢవ్యక్తిత్వంతో తానే కాక తనవారిని సైతం వెన్నుతట్టి తన జీవన రాగాన్ని తిరిగి శృతి చేసి ఆహ్లాదకర సంగతులతో కళ్యాణి రాగంతో మైమరపింపజేసి తన కంటిపాప హిమచందన్ కి కళ్యాణవేదికని అమరిస్తుంది.
చిన్ననాటి నుండి సాహిత్య,కళాభిరుచి గల అమృతలత విద్యారంగంలోని ఒత్తిడివలన సాహిత్యానికి దూరమౌతున్నానని భావించి "అమృత కిరణ్" అనే పత్రికని రెండేళ్ళ పాటు నడిపారు.డబ్బూ,సమయం వెచ్చించినా పత్రికా నిర్వహణ అంత సులువేమీ కాదని భావించారు.
పత్రికని నిలిపివేసిన అనంతరం విద్యాసంస్థల నిర్వహణ వత్తిడిలో సాహిత్యసృజనకు విరామం ప్రకటించేసినా వివిధ రంగాలలో కృషిచేసిన వ్యక్తులను ఎంపిక చేసి పదమూడేళ్ళకు పైగా రంగరంగ వైభవంగా ఒక పండుగలా సన్మానించి గౌరవిస్తూ, ఆత్మీయంగా స్నేహ సౌరభాలను అందిస్తూన్న ప్రతి అమృతమయ సంఘటననూ,ప్రతి సందర్భాన్ని అనేక ఫొటోలతో నమోదుచేసి జ్ఞాపకాల ఆల్బంగా ఏకాంత బృందగానాన్ని తీర్చిదిద్దటం అమృతలత కళాభినివేశానికీ,సాహిత్యాభిరుచికీ తార్కాణం.
అదృష్టవశాత్తూఆమెకు లభించిన గొప్పభరోసా ,ఆసరా ఆమె సహోదరులు.
అందుకే వివాహవిచ్ఛిత్తులను సైతం ధైర్యంగా అధిగమించి నిలదొక్కుకున్నారు.ఆ పరిస్థితులలో కూడా కుమార్తెకు తండ్రి లేనితనం తెలియకూడదని హిమచందన్ కు చెందిన ప్రతి సందర్భంలోనూ తండ్రిని పిలిపించి కార్యక్రమాలు సక్రమంగా జరపడం అమృతలత మానసిక దృఢత్వానికి మచ్చుతునక.
పాఠశాలలో జరిగే సృజనాత్మక వేడుకల్లో సైతం సాటి రచయిత్రులనూ,సినీరంగానికి చెందిన వారినీ సగౌరవంగా ఆహ్వానించి సత్కరించటం అమృతలత సహృదయ సాంప్రదాయం.
అమృతలత అధ్వర్యంలో జరిగే వేడుకలు అన్నింటినీ పొందుపరిచి ఒక క్రమపద్ధతిలో తన బృందగానంలో జతిస్వరాలుగా కూర్చారు. బాల్యంలోనే తల్లిని,కొంత పెరిగాక తండ్రినీ కోల్పోయినా, ఆర్థిక ఒడిదుడుకుల నుండి ఇప్పటివరకూ ఇన్ని మెట్లు ఎక్కేందుకు దృఢమైన ఆత్మవిశ్వాసంతో చేసిన జీవనపోరాటాన్ని ఏకాంత బృందగానం అంటూ సచిత్రంగా పాఠకుల ముందు ఆలపించారు .
ఆర్థిక పరిస్థితులు సరేసరి కాని ఆమెకు సంభవించిన ప్రమాదాలు పాఠకుల ఒళ్ళు జలదరింపజేస్థాయి.తుపాకి గుళ్ళ బ్లాస్ట్ లో చేతివేళ్ళు పోగొట్టుకున్నా,ఆత్మన్యూనతకు గురికాకుండా తనని తాను వజ్రంలా చెక్కుకొంటూ అపురూప శిల్పంగా మారే క్రమమే ఏకాంత బృందగానం.
బాల్యం నుండీ తాను చేయిచేయి కలిపి నడిచిన స్నేహితురాళ్ళను, అడుగులలో,అడుగులు వేసి నడిపించిన బంధుజనాన్నీ, పలకరించిన, మాట కలిపిన, మనసు తెలిసిన ప్రతి వారిని గురించి తన గానంలో స్వరాల్ని చేసారు అమృతలత, వీరందరివీ సాధ్యమైనంత వరకు ఆనాటి ఫొటోలను కూడా సేకరించి చేర్చటంలో ఆమెకు గల అంకితభావం, అకుంఠిత దీక్ష వ్యక్తమౌతుంది.
బాలంనుండీ తన జీవనయానంలో కలిసిన వారందరిని కూడగట్టుకొని అమర్చటంలో ఆమె జ్ఞాపకశక్తి ఎంత అద్భుతమైనదో తెలుస్తోంది.
కాలేజీ రోజుల్లో అల్లిన కవితల్ని ఇందులో భాగంగా చేర్చి కూర్చారు. ప్రతి సందర్భంలో తాను కలసిన నాయకులను, సాహితీవేత్తలను, ప్రముఖులను గురించి ఉటంకించారు.
తన రచనలకు సంబంధించిన వివరాలే కాక బాల్యమిత్రులతో సహా తన జీవనయానంలోని ప్రతి సంఘటననూ,ప్రతి సందర్భాన్ని అనేక ఫొటోలతో నమోదుచేసి జ్ఞాపకాల ఆల్బంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, సుమారు యాభై అరవై ఏళ్ళ క్రితం ప్రజాజీవితంలో భాగమైన ఆనాటి పనిముట్లు, వాహనాలు, పాత్రలు, వంటలూ, వార్పులు మొదలైనవాటిని చిత్రకారులతో చిత్రాలు వేయించి ప్రతీ పేజీ నిండుగా పరచటం వలన యీ తరం వారికి పరిచయం అవుతాయి. కానీ అవి ఒక ప్రవాహవేగంతో బృందగానం లో లీనమై చదువుతున్న పాఠకులను కొంత దృష్టి మరల్చి వారిపఠనాన్ని ఆటంకపరుస్తుందేమోననిపించింది. అదే విధంగా రాసే క్రమంలో రాష్ట్రంలో దేశంలో జరిగిన అనేక సందర్భాలను, ఆనాటి నేతలను కూడా తన బృందగానంలో బంధించటం ఆమె నిబద్ధత.
తన సాహిత్యాన్ని, పత్రిక నిర్వహణను, అటుపోట్లుకి ఓర్చి స్థాపించిన వివిధ విద్యాసంస్థలను, ఒక అద్భుత అనుభూతి కారణంగా వెలయించిన అపురూప దేవాలయ నిర్మాణములోనూ తాను ఎదుర్కొన్న కష్టనష్టాలను సవివరంగా జీవనయనంలో వివరించారు.
ఒక అద్భుత అనుభూతి కారణంగానే వెలయించిన అపురూప వేంకటేశ్వర దేవాలయ నిర్మాణములోనూ ఆమె అనుభవాలను అక్షరబద్ధం చేసారు
"నా ఏకాంత బృందగానం" ఆవిష్కరణ సమావేశంలో ఈపుస్తకాన్ని అందుకొని ఇంటికి తెచ్చిన వెంటనే శీలా వీర్రాజుగారే ముందు చదివి నాకు ఇచ్చారు. తదనంతరం నేను చదివి నా అభిప్రాయం పాయంట్లుగా రాసి వ్యాస రూపంలో రాయాలనుకుని పేపర్లు ఆ పుస్తకంలోనే పెట్టాను అయితే. ఫైండింగ్ చేసేటప్పుడు కొన్ని పేజీలు మిస్ అయ్యాయని నేను తెలియజేస్తే అమృతలతగారు స్వయంగా మాఇంటికి వచ్చి మేలు ప్రతిని అందజేసారు. మళ్ళా చదివి పూర్తివ్యాసంగా రాయలనుకొని కూడా మాయింట్లో తదనంతరకాలంలో జరిగిన దుర్ఘటనల వలన మర్చిపోయాను.
ఇటీవల ఏకాంత బృందగానం చదవాలని తీస్తే పుస్తకంలోనే ఉన్న సగం రాసిన వ్యాసాన్ని ఇప్పటికైనా పూర్తి చేయాలని భావించి రాయటం మొదలుపెట్టాను. రెండోసారి చదువుతుంటే ఆమె తనను తానే తీర్చి దిద్దుకున్న అద్భుత శిల్పంగా గోచరించింది.
చిన్నచిన్న విషయాలకే ఒత్తిడికి గురై కృంగిపోతూ జీవితం విలువా, మానవ సంబంధాలవిలువా,కౌటుంబిక జీవితం విలువా అవగాహన లేక అవాంఛిత నిర్ణయాలు తీసుకుంటున్న నేటి యువతరం చదవాల్సిన పుస్తకం ఈ "ఏకాంత బృందగానం "
అబ్దుల్ కలాంగారు అన్నట్లు ఆమె స్వాప్నికురాలే. అయితే అబ్దుల్ కలాం గారి మాటలను అవగాహన చేసుకొని 'కలలు కనటమేకాదు సాకారం చేసుకోవటానికి ఒక లక్ష్యాన్ని నిర్దేసించుకొని, దృఢసంకల్పంతో, అకుంఠిత దీక్షతో కృషిచేసినప్పుడు కన్న కలలు సాకారమౌతాయని అన్నమాటల్ని ఆచరణలో పెట్టి అమృతలత తాను కన్న కలల్ని సాకారం చేసుకొన్న సాధకురాలు.
వ్యక్తిత్వం దృష్ట్యా లోహమహిళ అయిన అమృత లత హృదయం మాత్రం పేరుకు తగినట్లు అమృత పరిమళాలను వెదజల్లే సుమనోహర లతానికుంజము. ఆ స్నేహపరిమళాలు అలదుకొన్న వారిలో నేను కూడా వుండటం నాకు లభించిన గొప్ప బహుమతి.
అటువంటి స్నేహమయి అమృతలతగారికి స్నేహాభినందనలు
-- శీలా సుభద్రాదేవి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి