8, సెప్టెంబర్ 2024, ఆదివారం
నడక దారిలో -44
నడక దారిలో -44
వేసవి సెలవుల్లోనే వీర్రాజుగారి అరవయ్యేళ్ళ పుట్టిన రోజు వచ్చింది.అప్పటికి నాకు ఆపరేషన్ అయ్యి నెల కూడా దాటలేదు.అందుకని హడావుడి ఏమీ చేయకుండా వీర్రాజుగారి బాల్యమిత్రుడు సత్యనారాయణగారి కుటుంబం,కుటుంబమిత్రులు శంకరంగారి కుటుంబం, వీర్రాజుగారి తమ్ముళ్ళ కుటుంబాల్ని సాయంత్రం పిలిచి ఉపాహారాలతో జరిపాం.పక్కింటిలోని పోలాప్రగడ దంపతులు కూడా వచ్చారు.అంతకుముందు ప్రక్కఇంటిలో వుండే విఠల్ రావుగారి కుటుంబం వచ్చారు వాళ్ళ అబ్బాయి రఘు కేక్ తీసుకొచ్చి వీర్రాజుగారిచే కట్ చేయించాడు.పల్లవి అట్ట మీద 60 అనే సంఖ్యని ఎంబ్రాయిడరీ తో ఫోటో ఫ్రేమ్ చేసి మా ఫొటోలను అందులో పెట్టి పోష్టు ద్వారా పంపింది.వీర్రాజుగారు అది చూసి మురిసిపోయి అందరికీ చూపించేవారు.
మా పెద్దక్కకు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదని తెలిసింది.నేను కొంత కంగారు పడ్డాను.విజయనగరం వెళ్తే బాగుణ్ణు అని అనుకున్నాను.కానీ చిన్నక్క తనఉత్తరంలో 'వైద్యం మొదలైందని కాస్త నెమ్మదిగా ఆరోగ్యం కుదుట పడుతోంద'ని రాసాక మరి ఆలోచన మానుకున్నాను.
స్కూల్ తెరిచే నాటికి ఆపరేషనై మూడు నెలలు దాటటంతో కొంత కోలుకున్నాను.మళ్ళా పనుల్లో పడ్డాను.
పెద్దమరిది చనిపోయాక ఆ కుటుంబ బాధ్యతలు నాకు మరీ పెరిగాయి.పెద్దమ్మాయి ఏదో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది.సర్వే ఆఫ్ ఇండియాలో సర్వీసులో వుండగానే అతను పోయినందుకు కారుణ్య నియామకంగా ఆ అమ్మాయికి అందులో ఉద్యోగం కోసం అందులో పనిచేస్తున్న తెలిసిన వారికి చెప్పాము.రెండో అమ్మాయి ఇంటర్ పూర్తిచేసి మా స్కూల్ కి దగ్గరగా విద్యానగర్ లోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చేరింది.ప్రతీ నెలా నేను వెళ్ళి ఫీజు కట్టి వచ్చేదాన్ని.
ఇక రాజకీయాలు దగ్గరకు వస్తే--
ఈసారి 1998లో లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇతరపార్టీలతో కల్సి జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA)గా అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రిగా ఉంటున్నప్పుడే జయలలిత ఎన్.డి.ఏ.కి మద్దతును ఉపసంహరించుకోవటంతో లోక్‌సభలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆశ్చర్యకరంగా విశ్వాసం కోల్పోయి ప్రభుత్వం కుప్పకూలింది.
కానీ కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన మరో సంచలనఆవిష్కరణగా చెప్పుకోవాల్సిన విశేషం 1998లో రాజస్థాన్ లోని పోఖ్రాన్లో 5 అణుపరీక్షలు జరిపి భారతదేశానికి అనధికార అణు హోదా ప్రతిపత్తిని కల్పించటం. అంతేకాకుండా కార్గిల్ పోరాటంలో పాకిస్తాన్ పై పైచేయి సాధించింది. మంచుపర్వతాలలో కూడా శక్తివంచన లేకుండా పోరాడే శక్తి భారత్ కు ఉందని నిరూపించింది. ఇవన్నీ అప్పటి వాజ్ పేయి ప్రభుత్వానికి కలిసివచ్చిన సంఘటనలే అని చెప్పాలి.
అయినా1999 లో తిరిగి ఎన్.డి.ఏ. కూటమి తిరిగి గెలవటంతో వాజ్‌పేయి ముచ్చటగా మూడో సారి ప్రధాన మంత్రి అయ్యారు. ఈ సారి మాత్రం ఎన్.డి.ఏ. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగింది.
మా కుటుంబమిత్రులు కె.కె.మీనన్ గారు సరోగసీ అంశంతో చాలా పరిశోధనాత్మకంగా రాసిన క్రతువు నవల పుస్తకంగా ప్రచురించారు.దానిని తన స్వంత వూరు రామరాజులంక గ్రామంలో ఆవిష్కరణ చేయతలపెట్టారు.ఆ సభలో పాల్గొనటానికి జ్వాలాముఖిగారూ,నాళేశ్వరం శంకరంగారూ, వీర్రాజుగారూ,నేనూ, మీనన్ గారితో పాటూ బయలుదేరాం.రైలు ఎక్కి సఖినేటిపల్లి లో దిగి అక్కడి పడవ ఎక్కి ఆ గ్రామం చేరాము.ఆ రోజే పుస్తకావిష్కరణ జరిగింది.జ్వాలాముఖిగారూ,శంకరంగారూ క్రతువు పుస్తకం గురించి కూలంకుషంగా జనరంజకంగా ప్రసంగించారు.వీర్రాజుగారు ఆవిష్కర్త కనుక ఎప్పటిలాగే మాట్లాడారు.ఆ కార్యక్రమం అనంతరం బస్సెక్కి శంకరగుప్తం బయలుదేరాం.శంకరగుప్తంలో కథక్ మిత్ర పేరుతో కథలు రాసే వేమూరి నరసింహారావుగారి ఇల్లు చేరేసరికే సాయంత్రం అయ్యింది.వేమూరి నరసింహారావుగారి శ్రీమతి ప్రేమతో తయారుచేసిన స్వీటు,మసాలా కాజూ తిని లంకలోనితోటలూచూడటానికీ, తర్వాత సముద్రంవొడ్డుకీ బయలుదేరాం.
లంకగ్రామమైన శంకరగుప్తం ఇరవై ఏళ్ళక్రితం నా వివాహం అయిన కొత్తలో అన్ని రకాల ప్రయాణసాధనాలు ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది.ఇప్పుడు ONGC కోసం కొత్తగా తోటలమధ్య తారు రోడ్డు పడింది. కరెంట్ కూడా వచ్చింది.వూరుకూడా మార్పు చెందింది.పొలాలన్నీ చేపల చెరువులు అయిపోయాయి.సముద్రం ఒడ్డుకు వెళ్ళేసరికి ఎక్కడా కూర్చునేందుకు వీలులేకుండా అపరిశుభ్రంగా వుంది.భరించలేని కంపు.అసంతృప్తిగా ఇక ఇంటికి తిరుగుముఖం పట్టాం.
రాత్రి జీడిపప్పు కూర మొదలైన వాటితో మంచిభోజనం చేసి,కాసేపు కబుర్లు చెప్పుకున్నాక మేమంతా కొబ్బరి చెట్లు కిందనే హాయిగా పడుకుంటాం అని అంటే మడత మంచాలు వేసారు.
అయితే శంకరం తప్ప జ్వాలాముఖిగారూ,మీనన్ గారూ ,మేమిద్దరం దోమలకీ,వేడికీ రాత్రంతా జాగారం చేసాం.రెండ్రోజులు ఉందామనుకున్నవాళ్ళం కాస్తా మధ్యాహ్నం భోజనం కాగానే కొవ్వూరులో వున్న మా అక్క కూతురు శ్రీదేవి ఇంటికి హూటాహుటిని బయలుదేరి వెళ్ళిపోయాము.రాత్రిభోజనంచేసి కూలర్,ఫేనూ ఉండేసరికి అందరం మత్తుగా నిద్ర పోయాము.నగరసౌకర్యాలకు మేము ఎంత అలవాటు పడిపోయామో అర్థం అయ్యింది.
ఈ అనుభవం ఆధారంగా అక్కడినుండి వచ్చిన వెంటనే " మార్పు వెనుక మనిషి" కథ రాసాను.ఈకథ బ్రౌన్ అకాడమి వాళ్ళు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందింది. ఆ కథకి ఇంగ్లీషులో కూడా అనువాదం జరిగి సంకలనంలో చేరింది.బ్రౌన్ అకాడమీ వాళ్ళుకూడా బహుమతి కథలు పేరిట సంకలనంగా వేసారు.
ఇంకో విశేషం ఏమంటే తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ తెలుగులో మార్పు వెనుక మనిషి కథని పాఠ్యాంశంగా చేర్చారు.
నా అయిదో కవితా సంపుటి ఒప్పులకుప్ప పుస్తకం ఆ ఏడాది ప్రచురించాము.నిర్మలానందగారి అధ్యక్షతన, కాత్యాయనీ విద్మహేగారు వక్తగా పుస్తక పరిచయం చేసేలా పుస్తకావిష్కరణ ఏర్పాటు చేసాము. అమ్మాయి పల్లవి ఇక్కడ ఉంటుండగానే పుస్తకావిష్కరణ జరిగింది.కాత్యాయనీ విద్మహే పుస్తకాన్ని గురించి చాలా బాగా మాట్లాడటమే కాక అందులోని శేషవస్త్రం,పడుగూపేక కవితలను ప్రత్యేకించి చాలా ఇష్టపడ్డారు.అందుకనే ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఎమ్మే వాళ్ళకు పడుగూ పేక కవితను పాఠ్యాంశంగా పెట్టేలా చేసారు.కొన్నాళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీవారికి కూడా పాఠ్యాంశంగా ఉంది.పలుమార్లు ప్రసంగాలలో కూడా కాత్యాయనీ విద్మహే నా కవిత 'పడుగూ పేక' ని ప్రస్తావించుతూ వుంటారు.
పల్లవి రావటంతో మళ్ళీ ఇంట్లో సందడి వచ్చింది.డిసెంబర్ కనుక నేను దాచుకున్న సెలవులను అప్పుడప్పుడు పెట్టాను.ఇంతకాలం పల్లవి డిపెండెంట్ వీసాతోనే వుంది.త్వరలో తన వీసా మారితే వుద్యోగంలో చేరుతానని చెప్పింది .
అయితే అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో
సహస్రాబ్ది ప్రారంభానికి దారితీసిన
Y2K సమస్య 1990ల చివరనుండే ప్రధాన చర్చనీయాంశంగా ఉండేది. సామాజిక మాధ్యమాలు, వార్తాపత్రికలు ఈ విషయం గురించి చాలా చర్చిస్తూ వుండేవి. రెండు-అంకెల సంవత్సరాలను ఎదుర్కొంటున్న ప్రోగ్రామ్‌లు 1900 మరియు 2000 తేదీల మధ్య తేడాను గుర్తించలేవని కొన్ని సమయాల్లో భయంకరమైన హెచ్చరికలు జనంలో సంచలనం కలిగించాయి.
2000 సంవత్సరాన్ని 1900 నుండి వేరు చేయలేని విధంగా తేదీలను సరిగ్గా గుర్తించలేక పోవటంవలన కంప్యూటర్ సిస్టమ్‌ల అసమర్థత వలన కంప్యూటర్ ఆధారిత పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా కుదేలై పోతాయని ప్రపంచవ్యాప్తంగా అంతటా ప్రచారం ముమ్మరమైంది.
Y2K , 2000 సంవత్సరం తర్వాత తేదీల కోసం క్యాలెండర్ డేటా యొక్క ఫార్మాటింగ్ గురించి పేపర్ల నిండా వ్యాసాలు వచ్చాయి. చాలా మందికి "Y2K భయం" గురించి తెలిసింది.
బ్యాంకులలో డబ్బు Y2K సమస్య వలన డ్రాచేయటం కష్టం అని మరోవైపు పుకార్లతో కొందరు బ్యాంకుల నుండి సొమ్ము డ్రా చేసుకోవటం కూడా మొదలెట్టారు.అయితే మొత్తం మీద ప్రశాంతంగా ఏమాత్రం సంచలనం లేకుండానే కొత్త మిలేనియంలోకి ఉత్సాహంగా అడుగు పెట్టాం.
అజయ్ కూడా వచ్చాక అతనితో పాటు పల్లవి విజయనగరం వెళ్ళి తిరిగి ఇద్దరూ కలిసి యూఎస్ వెళ్ళిపోయారు.మళ్ళీ మా గూటిలో మేమిద్దరం మిగిలి పోయాం.
పల్లవి యూఎస్ వెళ్ళాక న్యూజెర్సీలో కొన్ని నెలల ట్రైనింగ్ అనంతరం అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసింది.ఆ తదనంతరం చికాగోకి వెళ్ళింది.వారాంతంలో మినియాపోలీస్ కి వెళ్ళి మళ్ళా సోమవారం చికాగో వెళ్ళేది.ఒక్కోసారి వారాంతంలో ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళేవారు.ఆటువంటప్పుడు మాకు ఫోన్ చేసే సమయాలు మారిపోతుండేవి.
మినియాపోలీస్ సంవత్సరానికి పది నెలలు మంచుకురిసే ప్రాంతం.అందువలన వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కినా అది లాండ్ కావటానికి వాతావరణం అనుకూలించకపోవటం వలన వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరిగేదని పల్లవి చెప్తుంటే కొంతభాగం కలిగేది. చదువులకో,ఉద్యోగాలకో అక్కడకు వెళ్ళి పిల్లలు సుఖపడుతున్నదేమిటీ? కేవలం డాలర్ల వెనుక పరుగులేనా అనిపించింది.ఉద్యోగాలూ శాస్వతం కాదు ఎప్పుడు అకస్మాత్తుగా పింక్ స్లిప్ ఇస్తారో తెలియదు.అంతటి అభద్రతాభావంతో పిల్లలు అక్కడ బతుకుతున్నారు.గ్రీన్ కార్డుగానీ,సిటిజన్ షిప్ గానీ వచ్చేవరకూ అభద్రతతోనే బతకాలనేది మాకు తెలియవచ్చింది.
పల్లవీ,అజయ్ వచ్చినప్పుడు ఏదో సందర్భంలో " సడెన్ గా ఇండియా వచ్చేయాల్సి వస్తే కనీసం ఇక్కడ ఒక ఇల్లూ, మరో వుద్యోగం దొరికే వరకూ సంవత్సరం పాటూ బ్రతకటానికి బేంక్ బేలన్స్ ఉండాలి అత్తయ్యగారు " అన్నాడు అజయ్.
అందుకని ఏదైనా ఒక అపార్ట్మెంట్ ఉంటే కొంటాము చూడమని చెప్పారు అజయ్,పల్లవీ. ఎలాగూ వుద్యోగం చేస్తుంది కనుక పల్లవి డబ్బుతో కొంటామన్నారు.మంచి ప్రాంతంలో అపార్ట్మెంట్ ఉంటే చూడమని మేమూ కొంతమంది మిత్రులకి చెప్పాము.
ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు వీర్రాజు గారికి అవార్డు ఇస్తున్నామని ఫోను చేసారు.గిరీశం పేరుతో కథలు రాసే ఆర్. విద్యాసాగరరావు గారు,రామవరపు గణేశ్వరరావుగారూ అందులో సభ్యులు.ఆర్ విద్యాసాగరరావు గారు అప్పట్లో కేంద్రజలసంస్థ లో ఉద్యోగం చేసేవారు.తెలంగాణా ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసారు.వీర్రాజుగారితో పాటూ నన్ను కూడా ఆహ్వానించటంతో ఇద్దరం బయలుదేరాము.మొదటిసారి దేశరాజధానిలో అడుగు పెట్టటం కొంత ఉద్వేగం కలిగింది.
ఆర్.విద్యాసాగరరావు గారు హైదరాబాద్ లో వున్నప్పుడు వీర్రాజుగారికి మిత్రులే.అప్పట్లో కొత్తగా కథలు రాస్తున్న గిరీశం( విద్యాసాగరరావు)కథ,నాదీ,చిన్నన్నయ్య మొదలగు
ఒక పదిహేను మంది కథలతో దీపిక అనే సంకలనం కూడా వీర్రాజు గారు కథా సాహితి పబ్లిషింగ్ పేరుతో ప్రచురించారు.అప్పట్లో ఆ పేరుతో మిత్రుల కథల పుస్తకాలు ప్రచురించేవారు.
భండారు దత్తాత్రేయ అధ్వర్యంలో ఆంధ్రా భవన్ లోనే పురస్కారం సమావేశం జరిగింది.తర్వాత ఒక రోజంతా గాంధీ సమాధి, ఎర్రకోట, తాజ్ మహల్ , కుతుబ్ మీనార్ ,బిర్లా టెంపుల్ మొదలైనవి చూసాము.నా జీవితంలో తాజ్ మహల్ చూడగలనా అనుకున్నాను.చాలా ఆనందం కలిగింది.
మాది ఆర్టీసీ హైస్కూల్ కావటాన వాళ్ళు మా స్కూల్ విద్యార్థుల విజ్ఞాన యాత్రల కోసం ఇంచుమించుగా ప్రతీ ఏడాదీ రెండు బస్సులు,నలుగురు డ్రైవర్లతో ఉచితంగా ఇచ్చేవారు.ఆ విధంగా దక్షిణ ప్రాంతాలను చాలా వరకూ నేను చూడగలిగాను.కాని ఉత్తరాది ప్రాంతాలేవీ చూడలేదు.అనుకోకుండా ఢిల్లీ చూడటం
చాలా సంతోషమనిపించింది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి