3, నవంబర్ 2021, బుధవారం

శ్రీదేవి మోనోగ్రాఫ్ పై తెలుగు తూలిక లో ని.మాలతి సమీక్ష

డా. పి. శ్రీదేవి. రచన శీలా సుభద్రాదేవి సాహిత్య ఎకాడమీ ఆధ్వర్యంలో డా. పి. శ్రీదేవిగారి సాహిత్యవ్యాసంగం క్షుణ్ణంగా పరిశీలించి ప్రముఖ కవయిత్రీ రచయిత్రీ శీలా సుభద్రాదేవి రచించిన పుస్తకం ఇది. పి. శ్రీదేవి అంటే కాలాతీతవ్యక్తులు, కాలాతీతవ్యక్తులు అంటే పి. శ్రీదేవి అని తెలుగులోకంలో సుప్రసిద్ధం. కొంతమందికి ఆమె తెలుగు స్వతంత్రలో ఉపసంపాదకులుగా పని చేసేరని తెలిసిఉండొచ్చు. కానీ శ్రీదేవి చిన్నకథలు, కవితలు కూడా రాసేరనీ, విమర్శలు, సమీక్షలు కూడా ప్రచురించేరనీ, ఆమెకి చిత్రలేఖనంలో పరిచయం ఉందనీ తెలిసినవారు లేరేమో. ఉంటే చాలా తక్కువ అనుకోవాలి. ఈ మోనోగ్రాఫ్‌లో లభ్యమైనంతవరకూ శ్రీదేవి జీవితచరిత్ర, తెలుగు సాహిత్యంలో వివిధశాఖలలో ఆమె చేసిన కృషిని సూక్ష్మదృష్టితో పరిశీలించి, విశ్లేషణాత్మకంగా వివరించేరు సుభద్రాదేవి. సుమారు పది సంవత్సరాలలో వృత్తిరీత్యా వైద్యరంగంలో పని చేస్తూనే సాహిత్యంలో ఇంత కృషి చేసేరా అని ఆశ్చర్యం కలుగుతుంది సుభద్రాదేవి సమకూర్చిన సమాచారం చూస్తే. ఒక్క కాలాతీతవ్యక్తులు నవల 38 పేజీలలో విశ్లేషించేరు రచయిత్రి. ఇతివృత్తం, పాత్రచిత్రణ, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులనేపథ్యంలో శ్రీదేవి ఈనవలను ఎంత సమర్థవంతంగా నిర్వహించేరో గ్రంథస్థం చేయడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయం. శ్రీదేవిగారి తాత్వికచింతనగురించిన విశ్లేషణ ప్రత్యేకంగా బాగుంది. కవయిత్రి సుభద్రాదేవి శ్రీదేవి కవితలను సాటికవయిత్రిగా విశ్లేషించినతీరు మనసుకి హత్తుకునేలా ఉంది. అలాగే శ్రీదేవి ఉపసంపాదకురాలిగా పని చేస్తున్న రోజులలో చేసిన విమర్శలూ, సమీక్షలూ కూడా ప్రతిభావంతంగా చేసేరంటారు సుభద్రాదేవి. తెలుగు సాహిత్యచరిత్రలో చెప్పుకోదగ్గ రచయిత్రి డా. పి. శ్రీదేవి. స్త్రీల సాహిత్యచరిత్ర, కాల్పనికసాహిత్యచరిత్రలలో ఆసక్తి గలవారు తప్పక చదవవలసిన పుస్తకం.

1, నవంబర్ 2021, సోమవారం

నడక దారిలో-- 10

నడక దారిలో--10 మహారాజా మహిళా కళాశాల మెట్లు ఎక్కిన రోజు ఎవరెస్ట్ ఎక్కినంత ఉద్వేగం పొందాను.అందులో ఒక్కదాన్నే కాలేజీ కి వెళ్ళటం.పెద్దగా వెడల్పాటి కారిడార్.సింహాచలం లోని కప్పస్తంభాల్లాంటి స్తంభాలు.పూసపాటి రాజుల రాజభవనం కావటాన ఎత్తైన సీలింగు.భవనానికి నాలుగు వైపులా మెట్లుఉండేవి.రెండు మూలల్లోని మెట్లు బయటకు పోయేందుకు.రెండు మూలల్లోని మెట్లు బిల్డింగ్ వెనుక ఉన్న హాస్టల్ రూమ్ లకూ,గార్డెన్ లోకీ వెళ్ళేందుకు ఉంటాయి. వెళ్ళగానే ఏ రూం లోకి వెళ్ళాలో తెలియలేదు.దారిలో కనిపించిన అమ్మాయిని పి.యూసి ఎంపీసీ క్లాసులు ఏ రూమ్ లో జరుగుతాయని అడిగాను‌. ఆ అమ్మాయి చెప్పిన వైపు వెళ్తే పెద్ద హాలు ఉంది.గుమ్మందగ్గర నిలబడ్డాను.అదృష్ట వశాత్తూ ఆ క్లాసులో ఉన్న కుమారి లెక్చరర్ నుంచి పర్మిషన్ అడిగి బయట కొచ్చింది.ఆ క్లాస్ లో హిస్టరీ జరుగుతుందిట.ఆ హాలు కి పక్కనే చిన్న పార్టిషన్ గది ఉంది.అక్కడ మేథ్స్ క్లాస్ అని చెప్పింది. ఇక ఆ ప్రక్కనే గది ద్వారం దగ్గర నిలబడితే అప్పటికే పాఠం చెప్తున్న లెక్చరర్ నన్ను చూసి ఇంగ్లీష్ లో ప్రశ్నించారు.అప్పుడు గుర్తు వచ్చింది.ఇప్పటివరకూ తెలుగు మీడియం లో చదివాను.ఇప్పుడు కాలేజీ విద్య తెలుగు మాధ్యమం కాదనీ, ఇంగ్లీష్ లోనే అని.ఒక్కసారి భయం నన్ను అలుముకుంది."న్యూస్టూడెంట్ నండి "అని చెప్తే లోపలికి రమ్మన్నారు.క్లాసులో నాతో కలిపి తొమ్మిది మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు సీట్లో కూర్చుంటూ బోర్డు వైపు చూసాను.Radian అని హెడ్డింగ్ రాసి,వృత్తం లో గుర్తించి ఉంది.అంతలోనే బోర్డు చెరిపి రేడియన్ అంటే ఏమిటో వివరించమని పరీక్ష పెట్టారు. పేపరు మీద అంతకుముందు బోర్డు మీద చూసిన పటం వేసి రేడియన్ అని రాసాను.లెక్చరర్ ఉమాకుమారిగారు అందరిదగ్గరా పేపర్లు తీసుకుని దిద్ది ఇచ్చేసారు."క్లాసుకి టైముకి రావాలి.ఇలాచదువుతే లాభం లేదు"అని నావైపు చూసి కోపంగా అన్నారు. మొదటిక్లాసులోనే తిట్లు తిన్నానని దిగులు వేసింది.క్లాసులో అందరూ కొత్త వాళ్ళు నేనేమో తొందరగా స్నేహం చేయలేను.అందులోను ఇంగ్లీష్ లో చదవగలనా అని ఒక భయంవేసింది. పీయూసీ లో గణితం లో కేవలం తొమ్మిది మంది విద్యార్థినులే ఉండేవాళ్ళం కదా .మాకు ఆ చిన్న పార్టిషన్ రూమ్ లోనే క్లాసులు జరిగేవి.ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసులు ఆయా లేబ్ లను ఆనుకొని ఉన్న రూమ్ లో జరిగేవి. కెమిస్ట్రీ క్లాసులో BZC వాళ్ళుకూడా కలవటం వలన ముప్పై మందివరకూ ఉండేవాళ్ళం.ఇంగ్లీషు, తెలుగు క్లాసులకు అన్ని గ్రూపులు వాళ్ళూ కలుస్తారు కనుక వందకి పైగా ఉండేవాళ్ళం.అదే హాలు లో బియ్యే వాళ్ళకు క్లాసులు జరుగుతాయి.అందువలన మేము ఎంత పరుగున వచ్చినా వెనుక బెంచీలలోనే కూర్చోవలసి వచ్చేది. నా బడి మిత్రులు కుమారీ ,కమలా అదే క్లాసులో ఉన్నా వాళ్ళు ముందు సీట్లో కూర్చోవటం వలన వాళ్ళతో మాట్లాడటానికే కుదిరేది కాదు.అందుచేత సెలవు రోజుల్లోనే ఒకరింటికి ఒకరు వెళ్ళి కబుర్లు చేప్పుకునే వారం. ఒకరోజు NCC లో చేరేవాళ్ళకోసం సర్కులర్ వచ్చింది.చిన్నక్క ఇంటికి కోరుకొండ సైనిక స్కూల్ కి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు మార్చ్ పాష్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి ప్రభావితురాలిని కావటం చేత చేరేందుకు NCC ఇన్చార్జి సంజీవి మేడం కి పేరు ఇచ్చాను.సంజీవిమేడం సన్నగా చిన్నగా ఉన్నా మంచి కమేండింగ్ వాయిస్ కలిగి ఉంటారు. ముఖంలో దృఢమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.ఒక రెండు రోజులు కాలేజీ ఐన తర్వాత ఫిట్నెస్ టెస్ట్ కోసం నడిపించేసరికి కళ్ళు తిరిగి పడిపోయాను." నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు.NCC కి పనికిరావు" అన్నారు సంజీవి మేడం. తర్వాత కాలేజీలో సంగీతం లో డిగ్రీ చేస్తున్న అమ్మాయి కాలేజీ అయ్యాక మహారాజా సంగీత నృత్య కళాశాల కు వెళ్తుందని తెలిసి ఆ అమ్మాయి తో కలిసి వెళ్ళి కర్నాటక సంగీతం గాత్రం నేర్చుకోడానికి చేరిపోయాను.రోజూ కాలేజీ పూర్తి అయ్యాక అటునుంచి అటే సంగీత కళాశాల కి వెళ్ళి ఇంటికి వచ్చేదాన్ని. అన్నట్లు మా కాలేజీ లో విద్యార్థినులకు యూనిఫాం ఉండేది.తెల్లచీర,తెల్లజాకెట్టు.ఒకరిద్దరు తెల్లవే లంగా వోణి వేసుకునేవారు.ఇక నా సంగతికి వస్తే మా పెద్ద మామయ్య మా నాన్నగారు పోయిన తర్వాత అమ్మకి ఏ రెండేళ్ళకో ఒకసారి అరవై కౌంట్ వో, ఎనభై కౌంట్ వో నేతచీరలు మగ్గం మీద ఒక సరి మీద వచ్చే ఆరు చీరలు నేయించి ఇచ్చేవారు.అందులో రెండు తనకోసం అమ్మ ఉంచుకోగా మిగతా నాలుగు చీరలూ నాకు పెట్టీకోట్లూ, పరికిణీలకూ, గలేబులకూ వాడేవాళ్ళం.కాలేజీకి చీరలు కావాలి కనుక బోర్డర్ లేని ఆ ముతక చీరలకు రకరకాల ఎంబ్రైడరీ బోర్డర్లు కుట్టు కొన్నాను.నాలుగేళ్ళ కాలేజీ చదువూ వాటితోనే గడిచిపోయింది. కాలేజీలో చేరిన తర్వాత పెద్దక్కయ్య ఒకసారి తెల్లని మెత్తని గ్లాస్కో చీర ఇచ్చింది.కానీ ఎంతో ముచ్చటగా కట్టుకున్న రోజునే కెమిస్ట్రీ ప్రాక్టికల్ క్లాసులో ప్రయోగం చేసే సమయంలో నా పక్కనే ప్రయోగం చేస్తున్న అమ్మాయి ఎవరో పిలిచారని గభాలున తిరగటం లో పరీక్షనాళిక లోని సల్ప్యురిక్ ఆమ్లం మొత్తం నాచీర మీద పడింది.వెంటనే నీళ్ళు చల్లుకున్నాను.మా మేడం రిక్షా పిలిపించి ఇంటికి పంపారు.ఇంటికి వెళ్ళగానే చల్లనీళ్ళతో స్నానం చేసి చీర బకెట్టు లో వేసేసరికి అప్పటికే చీర పీలికలు ఐపోయింది.నాకు అక్కడక్కడా చిన్న పొక్కులు వచ్చాయి తప్పా ప్రమాదం జరగలేదు. మొత్తం మీద చిన్న చిన్న అవాంతరాలతో ఏడాది గడచి పోయింది.కాలేజీ వార్షికోత్సవానికి నాకు సాయంగా మామయ్య కూతుర్లను తీసుకొని వెళ్ళాను.మొదట అందరి ఉపన్యాసాలు అనంతరం బహుమతుల ప్రదానం మొదలయ్యింది.ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల మొదలు కాకపోవటంతో నా బడి మిత్రులం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం.అంతలో నాపేరు వినిపించింది.పొరపాటున పిలిచారేమోనని నేను చూస్తుంటే 'సుభద్రా నిన్నే' అని మిత్రులు తోసారు.ఆశ్చర్య పోతూనే వేదిక వైపు వెళ్ళాను. మా మేథ్స్ మేడం ఉమాకుమారి గారు ఆ ఏడాదంతా పెట్టిన మేథ్స్ పరీక్షల్లో అత్యథిక మార్కులు సాధించినందుకు ప్రొఫీషియన్సీ ఇన్ మేథ్స్ అని నాకు ట్రిగొనామెట్రి విదేశీ ఎడిషన్ పుస్తకం ఇచ్చారు.మొదటిక్లాసులో కోప్పడిన లెక్చరర్ చేతిమీదుగా బహుమతి అందుకోవటం నాకు పట్టరాని సంతోషం కలిగించింది.ఇంటికి వెళ్ళాక మా అన్నయ్యలకు చూపిస్తే వాళ్ళ ముఖాల్లో కూడా ఆనందం కనిపించింది. ఉమాకుమారిగారి ప్రభావం వలనే నేను ఉద్యోగం చేసిన పాతికేళ్ళూ ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు మొదటి రేంక్ వచ్చిన పిల్లలకు పుస్తకాలే కాక నగదు బహుమతి కూడా ఇచ్చేదాన్ని. పరీక్షలు పూర్తి చేసాను.రిజల్ట్స్ కూడా వచ్చాయి.పేపర్లో నెంబర్ ఎక్కడా కనబడకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాను.దుఃఖ సముద్రం నిలువెల్లా ముంచెత్తింది.మధ్యాహ్నం రిజల్ట్ చూసుకుని కుమారి మా ఇంటి కి వచ్చి విషయం తెలిసి "అదేమిటి సుభద్రా నీది పోవటమేంటి ?" అని తెల్లబోయింది.ఏదో పొరపాటై ఉంటుంది.మార్కులు వచ్చాక తెలుస్తాయి అని ఓదార్చింది. మార్కులు కూడా వచ్చాయి.లెక్కలు149/150 వచ్చి మిగతావాటిలో70/ పైనే వచ్చి ఇంగ్లీష్ లో మాత్రం 34/ వచ్చి పరీక్షపోయింది.ఇప్పటిలా ఇన్స్టెంట్ పరీక్షలు లేనందున సెప్టెంబర్ లోనే రాయాలి. ఒక ఏడాది వృథా అయినట్లే. మళ్ళా నేను డిగ్రీ చదవగలనా? మళ్ళీనా చదువు కథ మొదటి కే వచ్చింది .నా చదువుకి ఇన్ని అవాంతరాలు ఏమిటో???

29, అక్టోబర్ 2021, శుక్రవారం

శీలావీ వేసిన తైలవర్ణ చిత్రాల గురించి

మిత్రులారా.మీతో ఓ విషయం పంచుకోవాలనుకుంటున్నాను. శీలా వీర్రాజు గారు తన జీవితకాలంలో ఇన్నేళ్ళుగా వేసిన నూట ఇరవైకి పైగా తైలవర్ణ చిత్రాలలో మిత్రులకు, బంధువులకూ ఇచ్చి వేయగా మిగిలిన సుమారు ఎనభై వరకూ చిత్రాలను రాజమండ్రి లోని దామెర్ల రామారావు స్మారక ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ కి ఇచ్చేస్తున్నాము.అంతకు ముందు ఈ చిత్రాలను హైదరాబాద్,విజయవాడ, రాజమండ్రి, కావలి, యానాం, వైజాగ్ లలో ప్రదర్శనలు నిర్వహించాము.ఆ సమయం లో కొందరు చిత్రాలను కొనాలని అభిలషించారు.ఈమని శివనాగిరెడ్డి గారు విజయవాడ లో కన్వెన్షన్ సెంటర్ కోసం లక్షకు ఒక నాలుగు చిత్రాలను కొంటానన్నారు.కానీ డబ్బుకోసం అమ్మటానికి ఇష్టపడక వారికి ఒక చిత్రాన్ని బహుమతి గా ఇచ్చారు వీర్రాజు గారు. మేమిద్దరం వయసు రీత్యా బాగా పెద్దవారిమయ్యాము.మా తదనంతరం అన్ని పెయింటింగ్స్ మా అమ్మాయి ఒక్కతే సంరక్షించటం చాలా కష్ట మౌతుంది.ఇంకా ఇంట్లో ఉన్న అపారమైన సాహిత్య సంపద, కళాకృతులు ఇవన్నిటినీ నిర్వహించే బాధ్యత కూడా ఆమెపై ఉంది. అందుకే అన్నీ ఆలోచించి మేమిద్దరం ఉంటున్నప్పుడే ఈ పెయింటింగులు అన్నీ వీర్రాజు గారి జన్మస్థలం,అంతే కాకుండా వారు చిత్రకళని అభ్యసించిన దామెర్ల రామారావు స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ గ్యాలరీ లోనే కనుక అక్కడే ఇవ్వటానికి నిర్ణయించాము.ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక ఆర్ట్ గ్యాలరీ. ఇంతకాలం అపురూపంగా చూసుకున్న అమూల్యమైన పెయింటింగ్స్ ఇచ్చేయడం కొంత బాధగానే ఉన్నా తరతరాలుగా ఆయన పేరుతో గ్యాలరీలో ప్రదర్శింపబడుతూ ఉండటం, వీర్రాజు గారు జీవితకాలంలో చిత్రకళలో చేసిన కృషి,ప్రతిభ చిరస్థాయిగా నిలవటం మాకు సంతోషమే కదా.అందుకనే చిత్రకళాభిమానులకు అంకితంగా ఉచితంగా చిత్రకళా పరిషత్ కి ఇచ్చేస్తున్నాము. ఆ పనిలో గత నెలరోజులుగా అక్కడ ప్రిన్సిపాల్,ఇతర పెద్దలనుండి శాస్వత అనుమతి కోసం దరఖాస్తు చేసాము. చివరకు సరియైన పద్ధతిలో అనుమతి దొరికింది. ఈ పెయింటింగులు గ్యాలరీ లో అమర్చి ప్రారంభోత్సవం చేయటం బహుశా నవంబర్ నెలాఖరుకు జరుగుతుందనుకుంటాను.అప్పుడు మళ్ళా తెలియజేస్తాను. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా రాజమండ్రి వైపు వెళ్తే తప్పకుండా దామెర్ల రామారావు స్మారక ప్రభుత్వ చిత్రకళా పరిషత్ లో ఉన్న శీలా వీర్రాజు గారు వేసిన తైలవర్ణ చిత్రాలు చూసి ఆనందించితే మా సంకల్పం నెరవేరుతుంది.

25, అక్టోబర్ 2021, సోమవారం

నడక దారిలో--8

నడక దారిలో----8 ఎస్సెల్సీ పరీక్షలు రాసిన తర్వాత అక్కయ్య కి డెలివరీ సమయం అని అమ్మా నేనూ సామర్లకోట వెళ్ళాం. అన్నట్లు అప్పట్లో పురుళ్ళకి హాస్పటల్ కి వెళ్ళటం తక్కువే అనుకుంటాను. ఇంట్లోనే మంత్రసాని తన చేతులమీదుగా డెలివరీలు చేసేదనుకుంటాను.ఏదైన క్లిష్టపరిస్థితుల్లో మాత్రమే హాస్పటల్ లో చేరేవారేమో.ఇవన్నీ అప్పటికి నాకు అంతగా తెలిసే విషయం కాదు. మంత్రసాని వచ్చింది.ఆ రాత్రంతా అక్కయ్య మూలుగులూ అరుపులూ, హడావుడి నాకు గాభరాగా బెంగగా అనిపించింది.అక్కయ్య ఎప్పుడూ గంభీరంగా,ధైర్యంగా,ఉండేది. స్పష్టంగా నిర్భయంగా మాట్లాడుతుందనీ ఆమెతో మాట్లాడాలంటే అందరూ జంకుతారు.అటువంటిది ఇలా బేలగా మూలుగుతుంటే నాకు దిగులుగా అనిపించింది. అక్కయ్య పెద్ద కూతురుని దగ్గరకు తీసుకుని కలత నిద్రలోనే ఆడవాళ్ళ అవస్థలు గురించి, స్త్రీల జీవితాల గురించి ఆలోచనలతో వేగిపోతూ రాత్రంతా గడిపి తెల్లవారుజామున కను రెప్పల్ని వాల్చాను. ఉదయం లేచేసరికి అక్కయ్య పక్కనే బుజ్జి పాపాయి ని చూసేసరికి రాత్రి ఆలోచనలన్నీ మటుమాయం అయ్యాయి. ఆరోజే నా ఎస్సెల్సీ రిజల్ట్ రావటం మంచి మార్కులు తో పాసవటం తో ఎంతో మరింత సంబరం కలిగింది.అనుకున్నది సాధించానన్న తృప్తితో మనసు ఉప్పొంగి పోయింది. ఆ తర్వాతరోజులు గడుస్తున్నా కొద్దీ కొంచెం కొంచెం గా బెంగ నన్ను ఆవరించటం మొదలైంది.తర్వాత ఏం చెయ్యాలి,చదివిస్తారా? సెకెండరీ గ్రేడ్ ట్రైనింగ్ చేయనా? చేస్తే ఉద్యోగం చేయనిస్తారా? ఎస్సెల్సీ పరీక్షకి ఫారం నింపేటప్పుడు జన్మతేదీ,తండ్రి పేరు అవీ తప్పులు సరిచేసుకోమని క్లాసులో అందరికీ ఫారాలు ఇచ్చి మాష్టారు చెప్పినప్పుడు నా జన్మతేదీ తప్పు ఉండటం చూసి అన్నయ్యను అడిగాను."ఫర్వాలేదులే ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా ? అలా ఉండనీ పర్వాలేదులే " అన్నాడు.మారుమాటాడకుండా మాష్టారుకి నింపి తిరిగి ఇచ్చేసాను. అది గుర్తు వచ్చి చదివిస్తారోలేదో అనే దిగులు మనసుని ముంచెత్తింది. మాకుటుంబాలలో స్కూలు చదువు పూర్తి చేసినవారూ,ఉద్యోగాలు చేస్తున్న వారూ ఎవరున్నారా అని ఆలోచిస్తే మెడిసిన్ లో చేరిన మా మామయ్య కూతురు తప్పా ఎవరూ కనిపించలేదు.స్కూల్ ఫైనల్ వరకూ చదివిన వారు కూడా తక్కువే.మా అక్క చెల్లెళ్ళు మాత్రమే అంతవరకూ చదివాము.దాంతో మరింత దిగులు కలిగింది. మరేం చేయాలి.మా నాన్న గారి మరణానంతరం మా అమ్మ ఆర్థిక అస్తవ్యస్తల వలన ఎవరి ముందూ అసహాయంగా చేయి చాపటం లేదనే కోపంతో " అందం ,ఆస్తులూ ఉన్నవాళ్ళకే పెళ్ళిళ్ళు కావటం లేదు.అంత బింకంగా ఉంటుంది.రేప్పొద్దుట ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా చేస్తుందో చూడాలి"అని నలుగురి ముందూ అన్నమాటలూ గుర్తు వచ్చాయి.చిన్నక్క పెళ్ళి ఐతే అయిపోయింది.ఇక నా పరిస్థితి ఏమిటి? చదువుకి పులుష్టాప్ పెట్టేసి ఏం చెయ్యాలి?ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవలసిందేనా? ఇంట్లో పరిస్థితులు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుండటం వలన ఎలాగైనా చదువుకోవాలి నా కాళ్ళమీద నేను నిలబడేలా ఏదైనా ఉద్యోగం చేసి తీరాలి అనుకున్న నా సంకల్పం ఏమౌతుంది!? మనసంతా అయోమయంగా అయిపోయింది. లెక్కలు క్లాస్ లో మాష్టారు లెక్క వివరించి మేము చేయడానికి ఒక రెండు లెక్కలు బోర్డు మీద రాసి కూర్చునేసరికి నేను చేసేసానని నిలబడేదాన్ని.అప్పడే చేసావా అని ఆశ్చర్యపోయి శకుంతలా దేవి అంతటి దానివౌతావు అనే వారు.అప్పుడప్పుడే గణితశాస్త్ర వేత్త శకుంతలా దేవి ప్రతిభ వార్తలు గా కథనాలు గా వస్తుండేవి.అదివిని నాకు నేనే భుజాలు చరచుకునేదాన్ని.మరి ఇప్పుడు? నేను నోటు పుస్తకాల్లో చివరి పేజీల్లో KSDevi MSc(Maths) అని మురిసి పోతూ రాసుకున్న అక్షరాలు నా కళ్ళ ముందు వెక్కిరిస్తున్నట్లుగా మనసులో మెదులుతుంటే ఊరికూరికే కళ్ళు చెమ్మగిల్లసాగాయి. అక్కయ్య చంటిపిల్లల్తో చేసుకోలేదని ఇక్కడే ఉండాల్సి వస్తుందేమోనని మరో బెంగ పెట్టుకొన్నాను.కానీ పాపకి నెలదాటిన తర్వాత అమ్మా నేను విజయనగరం వచ్చేసాము. ఒక రెండు రోజులయ్యాక మా ఇంటికి పది పన్నెండు ఇళ్ళు అవతల ఉన్న కుమారి ఇంటికి వెళ్ళాను.కుమారీ,కమలా,రాజీ మహారాజా మహిళా కళాశాల లో పీయూసీ హ్యుమానిటీ గ్రూపు లో చేరారట.కాసేపు కుమారీ కాలేజీ కబుర్లు చెప్తుంటే మౌనంగా విన్నాను." నీ మార్కులకు కళ్ళకద్దుకుని కాలేజీలో సీటు ఇస్తారులే.నువ్వు కాలేజీలో చేరుతున్నావా? "అని ప్రశ్నించిన కుమారికి ఏమో అని మాత్రమే సమాధానం చెప్పి ఇంటికి తిరిగి వచ్చాను. నాకు నోరు తెరిచి ఇది కావాలి అని అడిగే అలవాటు ఎప్పుడూ లేదు.పెద్దన్నయ్య ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడు.పేయింగ్ గెస్ట్ లా వీథి గదిలోనే ఉంటాడు.చిన్నన్నయ్య మాట్లాడుతాడు.కానీ మనసులో మాటలు చెప్పుకోలేను.ఏం చెప్పుకోవాలన్నా అమ్మకే.కానీ ఆమె కూడా అస్వతంత్రురాలు.మనసులోనే మధన పడ్డాను. ఇంటికి వచ్చాక రాత్రి వంటకు కూరగాయలను తీసుకుని అమ్మ పక్కనే తరుగుతూ నెమ్మదిగా ,"కుమారీ వాళ్ళూ కాలేజీలో చేరారు" అని చెప్పాను.ఉల్లిపాయలు కోస్తున్నందుకో చదువుకోలేక పోతున్నందుకో తెలియని విధంగా కళ్ళనుండి జలజలా నీళ్ళు రాలాయి. "ఇందాక మామయ్య వచ్చాడు.చిన్నాకి స్కూల్ ఫైనల్ ఐపోయింది కదా మావాడికిచ్చి పెళ్ళి చేయకూడదా"అని అన్నాడు.అప్పుడే ఇంట్లోకి వచ్చిన అన్నయ్య "మా చెల్లిని చదివిస్తాం.ఇలాపెళ్ళి మాటలు మాట్లాడేటట్లైతే రావద్దు "అని గసిరాడు"అంది. అంతవరకు మనసంతా కారుమబ్బులు నిండి ముసురు పట్టినట్లు ఉన్నది కాస్తా మబ్బులన్నీ గుప్పున చెదిరి ఎగిరి పోయినట్లుగా ఆ మాట వినేసరికి నా ముఖం వెలిగిపోయింది. ."నిజమేనా? !!"అయినా అప్పుడే ఆగష్టు వచ్చేసింది.కాలేజీలో సీటు దొరుకుతుందా అనుమానం. మర్నాడు అన్నయ్య దగ్గర కు వెళ్ళి నెమ్మది గా కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోనా అని వినిపించీ వినిపించినట్లు అడిగాను.మనసులో ఇంకా జంకు పోలేదు."బాబ్జి( చిన్నన్నయ్య) ని కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని రమ్మని చెప్పు" అన్నాడు ప్రశాంతంగానే. .ఇక్కడ ఇంకో మాట చెప్పాలి.పేపర్లూ,పెన్నులూ,ఆఖరుకు బట్టలు కూడా చిన్నన్నయ్య వెళ్ళి తీసుకు రావాల్సిందే. స్నేహితుల ఇళ్ళకి తప్ప ఆడపిల్లలు బజార్లు తిరిగి కొనుక్కునే అవకాశం మా ఇళ్ళల్లో ఉండేది కాదు.అప్పుడు ఇంకు పెన్నులే కనుక ఇంకు బాటిల్ కొంటే అదే బోల్డు రోజులు వచ్చేది. ఆ మర్నాడు చిన్నన్నయ్య కాలేజీ కి వెళ్ళి అప్లికేషన్ తేవటం, MPC గ్రూప్ తో పీయూసి లో చేరటానికి ఫీజు కట్టటం చకచకా జరిగిపోయింది. మొత్తం మీద కాలేజీలో చేరాను.మా కుటుంబంలో నేను మొదటిసారి కాలేజీ మెట్లు ఎక్కబోతున్నాను.మనసు సీతాకోకచిలుక లా రెక్కలు విప్పుకున్నట్లు గా గాలిలో తేలిపోయాను.

26, సెప్టెంబర్ 2021, ఆదివారం

బుల్లెట్టు బండి పాట గురించి

నేను ఎక్కువగా పాల్గొనే ఒక వాట్సప్ గ్రూప్ లో రమణి అనే స్నేహితురాలు పంచుకొన్న విషయం.ఇది ముఖ్యం గా మహిళలందరూ ఆలోచించవలసినది గా అనిపించింది.అందుకే ఫేస్బుక్ లో కూడా పంచుకుంటున్నాను. నేను మీతో పంచుకోవాలి అనుకున్న విషయం ఒక పాట గురించి. అలాంటి పాటలు ఏ విధంగా మనకు తెలియకుండానే మన మెదడును ఎలా పితృ స్వామ్య భావజాలం తో నింపేస్తున్నాయి అని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్న. బుల్లెట్ బండి పాట ఏ భావజాలం కు ప్రతీక?? గత కొన్ని రోజులు గా బుల్లెట్ బండి పాట వాట్సాప్ లలో, ఫేస్బుక్ లోను ప్రతిధ్వనిస్తుంది. పాట అనేది మనుషులను ఆకట్టు కుంటుంది. అందులోను జానపద బానీ లో వుండే పాట సామాన్య ప్రజలను కుడా కట్టి పడేస్తుంది. శాస్ట్రీయ సంగీతం కొంతమంది ని ఆకట్టుకుంటే, శ్రమ జీవులను, నిరక్షారాస్యులను సైతం ఆకట్టు కునేది జానపదం. అందుకే విప్లవ కారులు చాలా మంది జానపద బానీ లోనే పాటలు రాసి, పాడిఈ దోపిడీ వ్యవస్థ గురించి, అసమానతల తో కూడిన సమాజం గురించి అందరికి అర్థం అయేలా చేసే ప్రయత్నం చేశారు. ఈ బుల్లెట్ బండి పాట కుడా ఇంతలా ప్రజాదరణ పొందడానికి మూడు ముఖ్యం ఐన కారణాలు వున్నాయి. 1. ఈ పాట లో సాహిత్యం, అంటే పాట లో వుండే ప్రతి పదం అందరికి సులభంగా అర్థం అయ్యే బాష లో ఉండటం. 2. ఈ పాట లో సంగీతం జానపద బానీ లో హుషారుగా ఉండటం. 3. పాట పాడిన వారు చక్కగా పాడటం. అయితే మరి లక్షల మంది ఇష్టపడిన ఈ పాట ఎలాంటి భావజాలం ను మన బుర్రలోకి ఎక్కిస్తుందో ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్న. ఈ పాట ను ఇప్పటికి చాలా మంది వినే వుంటారు కనుక పాట ను నేను పోస్ట్ చేయడం లేదు. ఈ పాటలో సాహిత్యం ను గమనిస్తే 1. మొదట ఆమె అంటే పెళ్లికూతురు ఏమేమి ముస్తాబు చేసుకుంది అనేది ఉంటుంది. ఈ ముస్తాబు అంత ఎవరికోసం? పెళ్లికుమారుని కోసం. అంటే పెళ్లికూతురు (స్త్రీ ) చేసుకునే ముస్తాబు అంత పెళ్లి కుమారుడు (పురుషుడు ) కోసమే అనే పితృస్వామ్య భావజాలం ను మనకు తెలియకుండానే మన బుర్రలోకి పంపిస్తుంది. 2. నా చేతిని, నీ చేతికి ఇచ్చి, నీ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తాను అని చెప్పడం ఆమెకు అంటే భార్య కాబోయే స్త్రీ కి స్వంత వ్యక్తిత్వం లేదు, అతని అడుగుజాడల్లో నడవడమే ఆమె పని అని సూచన ఇస్తుంది 3. మంచి మర్యాదలు తెలిసిన దాన్ని, మట్టి మనుషుల్లో పెరిగిన దాన్ని అని చెప్పడం పల్లెల్లో మనుషులు పట్టణాలలో మనుషుల కన్నా అంత చాలా మంచి వారు అనే అర్థం ఇస్తుంది. కానీ మన పల్లెల్లో కుల పరమైన, లింగ పరమైన అణచివేత, అసమానతలు నగ్నంగా కనిపిస్తాయి. అంటే పట్టణాలలో ఈ అణచివేత లు లేవు అని కాదు, కానీ పల్లెల్లో వాటి విశ్వ రూపం కనిపిస్తుంది. ఈ విధంగా ఈ మాటలు పట్టణాలలో వున్న ఎంతో కొంత ఆధునిక భావాలు కల మనుషులకన్నా పల్లెల్లో ని సాంప్రదాయ భావాలు కల మనుషులు మంచివారు అనే ఒక అభిప్రాయం ను పెంచుతుంది. 4.ఇంక అవ్వ సాటు ఆడపిల్లను అని మొదలు పెట్టి చెప్పేది అంత ఆడపిల్లలు ఎవరో ఒకరి సాటుగా ఉండాలి, ముఖ్యంగా పెళ్లి అయ్యేంత వరకు తల్లి తండ్రులు, అన్నదమ్ముల చాటుగా, పెళ్లి ఐన తరువాత భర్త చాటుగా ఉండాలి అనే భావాన్ని పెంచి పోషిస్తుంది. అంతే కాక పెళ్లి అయ్యేంత వరకు తల్లి తండ్రులు, అన్న తమ్ములు జాగ్రత్తగా చూసుకొని, పెళ్లి అప్పుడు ఆమె ను చూసుకోవాల్సిన బాధ్యత ను భర్త కు అప్పగించడం అంటే ఆమె నిరంతరం ఎవరో ఒకరి బాధ్యత గా ఉంటుంది. ఆమె బాధ్యత ను ఆమెనే నిర్వహించగల ఒక స్వతంత్ర మైన మనిషి గా ఉండదు. 5. ఇంక చివరగా పెళ్లి తరువాత  ఎలా ఉంటుందో చెప్తుంది. ఆమె కుడికాలు పెట్టిన వెంటనే సిరి సంపదలు కల్గుతాయి. అంటే ఎలా? ఆమె తెచ్చే కట్న కానుకల వల్లనా? పెళ్లి తరువాత సంప్రదాయం పేరుతో ఎదో ఒక వంకన, ఆమె తల్లి తండ్రుల నుండి డబ్బులు గుంజడం వల్లనా? అంతే కాక ఈ వాక్యం కోడలు కుడి కాలు పెట్టి గృహప్రవేశం చేసిన తరువాత అంతే మంచి జరుగుతుంది అనే మూఢనమ్మకం ను కల్గిస్తుంది. దీని వలన ఒక వేల ఆమె అత్త వారింట్లో అడుగు పెట్టిన తరువాత ఆ ఇంట్లో ఏ అనర్ధాలు, నష్టాలు జరిగినా ఆమెనే బాధ్యురాలును చేసే అవకాశం వుంది. 6.పెళ్లి తరువాత ఆమె ఎలా ఉంటుంది అనేది తరువాత చెప్తుంది. చుక్కపొద్దుతో నిద్ర లేచి వాకిట్లో  ముగ్గులు పెట్టడం నుండి ఇంక అన్ని పనులు చేస్తుంది. ఇంకా పెళ్లి తరువాత భర్తను కన్న వాళ్లనే, తన కన్నవాళ్లుగా భావిస్తుంది. మరి ఇన్ని రోజులు ఆమె మాటల్లోనే అంత అపురూపం గా పెంచిన తల్లి తండ్రుల బదులుగా తన అత్త, మామ లనే తల్లి తండ్రులు గా భావిస్తుంది. పెళ్లి తరువాత అత్త వారిల్లె ఆడపిల్లకు సర్వస్వం అనే పితృ స్వామ్య భావజాలం కు నిలువెత్తు నిదర్శనం కాదా ఇది. ఈ విధంగా ఒక జన్మ కాదు ఏడు జన్మలు అతనితోనే కలిసి జీవిస్తాను అని చెప్తుంది ఆమె. పెళ్లి అంటే ఏడు జన్మల బంధం అనే హిందూ సాంప్రదాయ భావనకు ప్రతీక ఇది. కనుక ఆ నాటి "ఆలయన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లలే ఈ జగతికి జీవన జ్యోతి " పాట నుండి ఈ నాటి "బుల్లెట్ బండి " పాట వరకు స్త్రీ లను తమకంటూ ఒక స్వంత ఆస్తిత్వం లేకుండ, నిరంతరం భర్త కు, అతని కుటుంబానికి సేవ చేయాలి అననే ,పెళ్లి ఐన తరువాత ఇంకా పుట్టిన ఇంటికన్నా మెట్టింటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే పితృస్వామ్య  భావజాలం ను పెంచి పోషిస్తున్నాయి. ఈ విషయాలు ప్రజాస్వామిక, అభ్యుదయ వాదులు ముఖ్యం గా స్త్రీలు గుర్తించాలి. చివరిగా తమ బానిసత్వాన్ని గురించిన పాటలు తామే సంతోషం గా పాడి, డాన్సులు చేసి వాటికి ప్రచారం కల్పించకుండా స్త్రీ లు జాగ్రత్త వహించాలి. తాము కుడా మనుషులమే, తమకు స్వంత వ్వక్తిత్వం, అభిప్రాయాలూ ఉంటాయి అని, తమ గురించి తామే బాధ్యత వహించగలం అనే చైతన్యం ను పెంచుకుని, ఆత్మగౌరవం తో తమ హక్కుల కొరకు, ఈ సమాజం లో గౌరవప్రదం ఐన జీవితం కొరకు పోరాటం చేయాలి అని కోరుకుంటూ, ఇంతసేపు చదివిన మీకు అందరికి ధన్యవాదములు. మీరు మీ అభిప్రాయాలను పంచుకొని, ఈ చర్చను ముందుకు తీసుకొని పోతారని ఆశిస్తున్నాను.

12, సెప్టెంబర్ 2021, ఆదివారం

వేదుల మీనాక్షీ దేవి కథలు

విస్మృత కథారచయిత్రి – వేదుల మీనాక్షీదేవి శీలా సుభద్రాదేవి Posted on December 8, 2020 by భూమిక ఆధునిక సాహిత్యరంగంలో స్వాతంత్య్రానంతరం అధిక సంఖ్యలోనే మహిళలు సాహిత్య రంగంలోకి వచ్చారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే దానికి సమాంతరంగా స్త్రీ విద్యపై కూడా మహిళలు కొంత ఉద్యమస్ఫూర్తితో రచనలు చేయటం కావచ్చు, స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు కావటం వలన కావచ్చు, సాంస్కృతికంగా, ఆర్థికపరంగా వెసులుబాటుగల కుటుంబాలలోని స్త్రీలకు విద్యావంతులయ్యే అవకాశం లభించింది. విద్యతోపాటుగా సాహిత్యంతో అనుబంధం గల కుటుంబంలోని ఆడపిల్లలకు తెలుగు, సంస్కృత గ్రంథపఠనం చేయించటం వలన కూడా ఆనాటి సామాజికంగా ఉన్నతస్థాయి కుటుంబ స్త్రీలు సాహిత్య రచనారంగంవైపు దృష్టి సారించారు. అయితే రచనా రంగంలోకి వచ్చిన వారందరూ గుర్తింపు పొందే అవకాశం కూడా లభించలేదు. అందుకు కొంత కారణం రచనలు చేయడమైతే చేస్తున్నారు కానీ కుటుంబ భారం వలన కావచ్చు, ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోవచ్చు, కుటుంబ ప్రోత్సాహం దొరకక కావచ్చు, గ్రంథస్తం కాకుండా మరుగున పడినవి కూడా ఎక్కువే. విస్తృతంగా కథలు రాసిన వాళ్ళు సైతం కాలక్రమేణా సాహిత్య చరిత్రలో అనామకంగా మిగిలిపోయారు. ఆ విధంగా విస్మృతులైన రచయిత్రులను గురించి ఏ విధమైన సమాచారమూ లభించే అవకాశం లేకపోవడం శోచనీయం. ఆ విధంగా మరుగునపడిన రచయిత్రులలో వేదుల మీనాక్షీదేవి ఒకరు… ఆమె కాకినాడలో 27 జూన్‌, 1917లో జన్మించినట్లు తెలుస్తోంది. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి మనవరాలు కావటాన బాల్యం నుండి సంస్కృతాంధ్ర రచనలు బాగా చదివారు. భర్త ఉద్యోగరీత్యా రాజమండ్రిలో నివసించారు. సభావేదిక, అష్టమహిషీ కళ్యాణం, రాగరేఖలు వీరి రచనలు. నలభైకి పైగా కథలు కథానిలయంలో లభ్యమైనప్పుడు అన్ని కథలు రాసినా వేదుల మీనాక్షీదేవి కథలు ఏ సంకలనంలోనూ చోటుచేసుకోకపోవడం, ఏ సందర్భంలోనూ సాహిత్యంలో ఆమె ప్రస్తావన కనిపించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. 1968లో కె.రామలక్ష్మిగారు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కొరకు పొందుపరచిన ‘రచయిత్రుల సమాచార సూచిక’లో లభ్యమైన అతి తక్కువ వివరాలను బట్టి 1933 నుండి మీనాక్షీదేవి రచనలు చేసేవారని తెలుస్తోంది. కానీ కథానిలయంలో లభ్యమైన కథలను బట్టి 1950 సంవత్సరంలో గృహలక్ష్మి పత్రికలో ప్రచురితమైన ‘దినదినగండం’ కథతో ఆధునిక కథారచనకు స్వీకారం చుట్టారని భావించాలి. 1950 నుండి 1983 వరకు విస్తృతంగా కథలు రాశారు. మరీ ముఖ్యంగా యాభయ్యవ దశకంలో ఎక్కువగా అన్ని పత్రికలలోను మీనాక్షీదేవి కథలు ప్రచురితమయ్యాయి. తర్వాత బహుశా కుటుంబ బాధ్యతల వలన రచనలు చేయటం తగ్గినా, తిరిగి డెబ్బయ్యవ దశకంలో ఎక్కువగా రాశారు. యాభయ్యవ దశకం నాటికి కుటుంబ నియంత్రణ అమలు లేకపోవడం వలన మీనాక్షీదేవి రాసిన కుటుంబ కథల్లో చాలావాటిలో అయిదు మందికి తక్కువ కాకుండా బహుసంతానం, చిరుద్యోగాలు, ఆర్థిక ఇబ్బందుల వలన లోటు బడ్జెటులతో అవస్థలు, పొదుపుగా సంసారాలు చేసుకునే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగినులైన స్త్రీ పాత్రలు గల కథలు చాలా తక్కువ. అంతమాత్రాన కేవలం కుటుంబ కథలు మాత్రమే రాయలేదు. కుటుంబాల చుట్టూ ఆవరించుకున్న సామాజిక పరిస్థితులు, ఆర్థిక రాజకీయాలూ, సమాజంలో ఎదురయ్యే భిన్న ప్రవృత్తుల మానవదృక్పథాల్ని గురించిన కథలూ ఎక్కువగానే ఉన్నాయి. చదువూ, విద్యార్థులూ, పరీక్షా విధానాల గురించిన కథలు కూడా చాలానే ఉన్నాయి. వేదుల మీనాక్షీదేవి కథలు రాసిన కాలంలో స్వాతంత్య్రానంతర యుద్ధ పరిస్థితుల వలన కరువు కాటకాలు ఏర్పడడం, పనులు తక్కువై, నిరుద్యోగ పరిస్థితుల వలన దొంగతనాలు పెరగడం, గుడులూ, బడులూ కడతామనో, పిల్లకి పెళ్ళి చేయాలనో చందాల పేరిట అడుక్కునే ఘరానా దొంగల మోసాల మీద కథలు రాశారు. ప్రజలలోని మూక మనస్తత్వాన్ని గురించి మొదలుపెట్టిన రచయిత్రి వాస్తవాన్ని తెలియజేసే సంస్కారానికీ, కృత్రిమమైన నాగరికతకూ గల వైరుధ్యాలను వివరిస్తూనే, డబ్బూ హోదా వలన మనిషిలో పెరిగే అహం బాల్యస్నేహితులలో సైతం ఏ విధంగా మానసిక దూరాన్ని పెంచుతాయో తెలియజేసిన కథ ‘నీ ఋణం తీర్చుకోలేను’ (1968). ఎన్నో ఏళ్ళ తర్వాత బాల్యస్నేహితురాలు అరవిందను కలుసుకోవడానికి వెళ్ళిన విశాలకు డబ్బు తెచ్చిన అహంతో అరవింద, తన పిల్లలకు నేర్పుతున్న నాగరికత ఏ విధంగా సంస్కారాలను అవహేళన చేసేలా ఉందో తెలుసుకుని బాధ కలుగుతుంది. తానున్న రెండు, మూడు రోజులైనా పిల్లలకి ప్రాచీన గ్రంథాలలోని మంచి విషయాలు నేర్పబోయి తిరస్కారానికి గురవుతుంది. చివరికి వారిని అసహాయంగా చూసి జాలిపడుతూ తిరుగు ప్రయాణం కడుతుంది. ఈ కథలో విశాల పాత్రతో అనేక ప్రాచీన కావ్య విశేషాల్ని అపురూపమైన విధంగా, పిల్లలకు అర్థమయ్యేలా రచయిత్రి చెప్పించడం మీనాక్షీదేవికి ప్రాచీన కావ్యాలైన పెద్దన మనుచరిత్ర, శ్రీనాధుని కాశీఖండం వంటి గ్రంథాల పట్ల గల అభినివేశం స్పష్టమౌతుంది. ఎలా అయినా కొడుకుని ఎమ్మే చదివించాలనే ఆశయంతో రాత్రీ పగలూ ట్యూషన్లు చెప్పి, షాపుల్లో లెక్కలు రాసి కష్టపడిన తండ్రి తన కోర్కె తీరకుండానే పరీక్షలకు ముందు చనిపోతాడు. పరీక్ష హాలులో కూర్చొని తండ్రి తన కోసం పడిన కష్టాల్ని తలపోసి కన్నీళ్ళ పర్యంతమైన కొడుకు పరీక్ష రాయలేక ఖాళీ పేపరు ఇచ్చేస్తాడు. చదువుకునే అవకాశాలు లేని తండ్రికి కొడుకునైనా చదివించాలనే తపన, నిజాయితీగా బతికే చిరుద్యోగి ఆర్థిక పరిస్థితుల జీవన చిత్రాన్ని రచయిత్రి 1952లో రాసిన ‘బ్లాంక్‌ పేపర్‌’ కథలో చూపుతారు. ఢిల్లీ ప్రాంతంలో మహేంద్రగడ్‌ పరిసరాల్లో ‘బాలచరిత్ర నిర్మాణ్‌’ అనే ఆదర్శ సంస్థను చూసి, ఆ సంస్థ పాటించే పద్ధతులూ, ఆదర్శాలూ, అక్కడి విద్యార్థులనూ గమనించారు రచయిత్రి. ‘ఆచరించు, ఆలోచించు, ప్రచారం చేయి’ అనే సిద్ధాంతంతో పనిచేసే ఆ సంస్థ స్థాపకుడు విశ్వనాథ్‌ కనోడియా యొక్క స్వప్న సంస్థను చూసి ప్రభావితురాలైన రచయిత్రి మీనాక్షీదేవి రాసిన కథ ‘జాతీయం’. ఇది 1955లో ‘గృహలక్ష్మి’ పత్రికలో ప్రచురితమైంది. ఉద్యోగాలు సమకూర్చలేని ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చోకుండా విద్యావంతుడైన రాజారాం ఏ విధంగా గ్రామప్రజల్ని జాగృతపరచి పాఠశాలని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాడో తెలియచేస్తుంది. పాఠశాల ప్రారంభోత్సవానికి రావటానికి తిరస్కరించిన ప్రభుత్వ ప్రతినిధులు ఆ పాఠశాల క్రమక్రమంగా అభివృద్ధి పొందిన తర్వాత ఆ పాఠశాలకు దాతల ద్వారా వస్తోన్న ఆదాయం తెలుసుకుని, ఆ పాఠశాల పురోభివృద్ధికి తామే కారకులుగా ప్రచారం చేసుకుని, దాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం కొసమెరుపు. ‘గృహలక్ష్మి’ స్త్రీల పత్రిక కదా ఏవో వంటింటి కథలే ఉంటాయేమో అనుకునేవారికి ప్రభుత్వ వైఫల్యాల్నీ, రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల్నీ ఎండగడుతూ చెప్పిన కథలూ, సమాజ దర్పణాలుగా ఉండే కథలూ ఉంటాయనేది ఈ కథని బట్టి తెలుసుకోవచ్చు. చిరుద్యోగి అయిన మూర్తి పెద్ద సంసారాన్ని నడపలేక ఒత్తిడికి గురై దాని నుండి తట్టుకోలేక తాగుబోతవుతాడు. అతన్ని చూసి బాధపడిన స్నేహితుడు డాక్టర్‌ మధు సైకియాట్రిక్‌ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ‘లాటరీ’లో లక్ష రూపాయలు వస్తే ఏం చేస్తావో ఆలోచించి చెప్పమంటాడు. మెదడుకి తీరకలేని పని కల్పిస్తే తాగుడు మీద మనసు పోదని అనుకుంటాడు. కానీ ‘లాటరీ’ వచ్చిన భ్రమలోకి వెళ్ళిపోయి రాత్రీ పగలూ లెక్కలు వేస్తూ పూర్తిగా అనారోగ్యం పాలై మరణిస్తాడు మూర్తి. తాను చెప్పినది వికటించినందుకు దుఃఖపడతాడు స్నేహితుడు మధు. స్థూలంగా కథ ఇదే కానీ ఇందులో బహు కుటుంబీకుడు ఆర్థిక ఒత్తిడికి గురైన విధమూ, బీదవారి పాలిట లాటరీలు కల్పవృక్షంలా భ్రమ కల్పించి జీవితాల్ని మరింత ఛిద్రం చేయటం మరో పార్శ్వంగా చిత్రించారు రచయిత్రి. 1955 నాటికి ‘గృహలక్ష్మి’లో ప్రచురితమైన ‘జగమెరిగిన త్యాగి’ స్వలాభాపేక్ష లేకుండా పరోపకారిగా క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ, స్వాతంత్య్రోద్యమంలోనూ నిస్వార్థంగా పనిచేసే రంగయ్య తాత కథ. మనోవాక్కాయ కర్మలా అవసరమున్న వారికి సేవ చేయటం, మశూచికం వంటి భయంకర వ్యాధిగ్రస్తులకు సైతం సేవ చేస్తూ ఉండటమే కాకుండా జబ్బులు ఎవరికైనా రావచ్చుననే సందేశంతో పనిచేసే వ్యక్తి రంగయ్య తాత. తన భార్య పోయినప్పుడు తనకు మాత్రమే లోటు అని భావించిన వ్యక్తి, గాంధీ మహాత్ముడు మరణం మాత్రం దేశానికే లోటని కన్నీరు మున్నీరవుతాడు. ఆంధ్రరాష్ట్రం సిద్ధించినప్పుడు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణకు నీరాజనాలిస్తాడు. సరిహద్దు గాంధీ మొదలైన వారి సేవానిరతి గురించి నలుగురికీ తెలియచేస్తాడు. ఈ విధంగా ప్రభుత్వం గుర్తించని ఒక త్యాగమూర్తి గురించి రచయిత్రి చెప్పిన ఈ కథలో దేశ చరిత్రలోని మూలఘట్టాలను స్పృశిస్తూ, ఆనాటి ప్రజల మనస్తత్వాలను, తర్వాత్తర్వాత మారిపోయిన సమాజపు తీరుతెన్నులను సాదృశ్యం చేస్తూ చెప్పిన కథ. మీనాక్షీదేవి రాసిన ‘మరలరాని మమత’ (1965) కథ గుర్తించదగిన వాటిలో ఒకటి. మనవసేవే మాధవసేవ అని భావించే సత్యానందం అనాధాశ్రమంలో పెరిగిన రాజేశ్వరిని వివాహం చేసుకుని ఒక సేవా సంస్థ స్థాపించి భార్యతో, మిత్రులతో కలిసి సమాజసేవ చేస్తుంటాడు. కొడుకు పుట్టాక కూడా భార్యాభర్తలిద్దరూ అనాధలు, అభాగ్యులకు సంస్థ ద్వారా విద్య, ఉపాధికి సహాయ సహకారాలందిస్తుంటారు. ఒకసారి అకస్మాత్తుగా ఇల్లు విడిచి వెళ్ళిపోయిన సత్యానందం సన్యాసిగా తిరిగివచ్చి ఆ సంస్థలోనే మఠం ఏర్పాటు చేసుకుంటాడు. రాజేశ్వరి ఒంటరిగా కొడుకుని పెంచి సంస్థ సహకారంతోనే చదివిస్తుంది. తననీ, కొడుకునీ అనాథల్ని చేయవద్దని భర్తను వేడుకున్నా అతను ఆమె మాటలను తిరస్కరిస్తాడు. ‘ముక్కు మూసుకుని మోక్షం కోసం సన్యసించిన వ్యక్తికి రెండు ప్రాణాల్ని గాలికి వదిలేస్తే మోక్షం వస్తుందా?’ అని ప్రశ్నించిన రాజేశ్వరి ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం పాఠకులను ఆలోచింపచేస్తుంది. కాలేజీలో డిగ్రీ చదువుకుని స్కాలర్‌షిప్‌ కోసం ప్రయత్నిస్తే తండ్రిగా సత్యానందం నుండి ఉత్తరం ఇవ్వాలి అని అడిగితే సత్యానందం అంగీకరించడు. భార్యా పిల్లలు అక్కరలేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అని భార్య నిలదీస్తుంది. ఆఖరుకి కాలేజీవాళ్ళే స్కాలర్‌షిప్‌కు అంగీకరిస్తారు. ఈ కథలో యశోధరని, రాహులుడిని, వదిలివెళ్ళిన సిద్ధార్థుడితో రచయిత్రి పోల్చిన విధం చదివినప్పుడు సిద్దార్ధుడిపైన కూడా నిందాగర్భితంగా ఉండడం బుద్ధుడి మీద రచయిత్రికి గల నిరసన వ్యక్తమవుతుంది. రచయిత్రి రచనలలో సందర్భోచితంగా ఆంధ్రాంగ్ల భాషా రచనలోని ఆయా విశేషాలతో పాటు బెర్నార్డ్‌ షా, క్రానిన్‌, వేల్స్‌ వంటి ఆంగ్ల కవులను ఉటంకించి తన అభిప్రాయ ప్రకటన చేస్తుండటం చదివినప్పుడు పాఠకలకు మీనాక్షీదేవికి గల సారస్వతాభిరుచి, భాషమీద గల పట్టు తెలుస్తుంది. తాను చెప్పదలచుకున్న దానిని సారూప్యత గల మరో రచనలోని సంఘటనతో పోల్చడం కొన్ని కథలలో గమనించవచ్చు. ఉద్యోగాల వలనా, పెళ్ళిళ్ళై సంసారాలతోనూ దూరమైపోయిన తోబుట్టువులందరూ తల్లి కోరిక మేరకు పుట్టినింటిలో కలవాలనుకుంటారు… ‘ఉత్తమ పురుష’లో రాసిన ‘సంక్రాంతికి సంకెళ్ళు’ (1958) కథలో. ఆ సందర్భంలో కథానాయిక తమ్ముడు ‘సంకెళ్ళు వదిలించుకొని అందరూ రావాలి’ అంటాడు. తన కూతురు అల్లుడు పండగకి వస్తుంటే తాను పుట్టింటికి వెళ్ళడం ఎట్లా అని బాధపడుతుంది. అంతేకాక మిగతా పిల్లలు, భర్త అందరూ కలిసి వెళ్ళడానికి ఇబ్బందే. ఆ ఆలోచనతో సతమతమవుతున్న భార్యకి పిల్లల్ని తాను చూసుకుంటానని, చిన్నపిల్లను తీసుకెళ్ళమని ప్రోత్సహిస్తాడు భర్త. భోగి రోజు ఉదయమే వెళ్ళి మర్నాడు చీకటినే తిరిగి వచ్చేయాలనుకొని బయల్దేరుతుంది. తోబుట్టువుల కుటుంబాలతో ఎంతటి ఆత్మీయతలు పంచుకున్నా, తల్లి ప్రేమ మనసును కట్టేస్తున్నా, భర్తనీ పిల్లల్నీ వదిలి వచ్చినందుకు బాధపడుతుంది. దానికి తోడు చుట్టుపక్కల బంధువులు పలకరించడానికి వచ్చి ‘కూతురూ అల్లుడూ వస్తుంటే, పిల్లల్నీ, భర్తనూ వదిలేసి పుట్టింటికి ఎలా వచ్చేసిందో’ అని గుసగుసలు పోవడమే కాకుండా, దారిలో బస్సు ప్రయాణంలో కూడా పక్కన కూర్చున్న ఆమె కూడా అదే మాట అని బుగ్గలు నొక్కుకోవడం గుర్తుకువస్తుంది. మర్నాడు ఉదయం బయల్దేరదామనుకున్నది మరదలు కట్టి ఇచ్చిన తినుబండారాలు మోసుకుని రాత్రికి రాత్రే తిరుగు ప్రయాణమై బస్సు దిగాక ఆ రాత్రిలో రిక్షా దొరకక అవస్థ పడుతుంది. తెల్లవారుఝామున భర్త ‘బస్సుకు తొందరగా బయల్దేరాలి లేచి తయారవ్వమని’ లేపడంతో మెలకువ వస్తుంది. అదంతా కలే కదా అని నిట్టూరుస్తుంది. ఇంతమందిని వదిలి నేనెక్కడికి పోతాననీ, పెళ్ళయ్యాక స్త్రీకి అన్నీ బంధనాలే అనుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ కథలో సంక్రాంతి పండుగ తోబుట్టువులతో కలిసి జరుపుకునే సంబరాలూ, ఆత్మీయ మానవ సంబంధాలూ, పిల్లల ఆటలూ వీటన్నింటితో పాటు స్త్రీలకు గల కుటుంబ బాధ్యతలు, బరువులు ఎంతగా జీవితంతో పెనవేసుకుంటాయో, వాటినుండి విడిపించుకుని బతకాలన్నా బతకలేనితనం కథంటతా పరుచుకుని ఉంటుంది. మరొక తమాషా ఏమిటంటే ఇవే పాత్రలతో దీనికి ముందు కథలా మరొకటి కూడా రాశారు రచయిత్రి. మీనాక్షీదేవి కథల్లో మరొక విశేషం రెండు కథలు ఒకదానికొకటి కొనసాగింపులా, ఒకే కథాంశంతో భిన్న దృక్కోణాలలో నడిపించడం చాలా కథల్లో గమనించవచ్చు. రచయిత్రి రాస్తున్న ‘మానివేసిన కత’ (1958) కథలోంచి పాత్ర వచ్చి తన పాత్ర ఎలా ఉండాలో చెప్తూ, ‘పాశ్చాత్య పోకడలు మన సాహిత్యానికి పనికిరాదనీ, అస్వాభావికమైన ఇలాంటి కథలు రాయకపోతేనేం?’ అని రచయిత్రిని దబాయించటం ఉంటుంది. ఆ కోవలోనే సమకాలీన కథలు ఎలా ఉన్నాయో, అవకాశం కోసమని నిజాయితీ లేకుండా రచనలు చేస్తున్న విధానాన్ని ఇలా సాహిత్య సృజన గురించి కథలోని పాత్ర వచ్చి చర్చించినట్లుగా రాసినా అవన్నీ సమకాలీన సాహిత్యం మీద రచయిత్రికి గల అభిప్రాయాలుగానే గుర్తించాలి. అరవైఏళ్ళ కిందటి కథలో ఆనాటి సాహిత్యంలో అవకాశవాద సాహితీవేత్తల గురించి చెప్పినా ఆ మాటలు నేటికి కూడా అన్వయిస్తాయంటే రచయిత్రికి గల క్రాంతదర్శిత్వం అర్థమవుతోంది. ఈ కథ రాస్తూ రాస్తూ నిద్రపోయిన రచయిత్రి కలలో కథంతా జరిగినట్లుగా, కళ్ళు తెరిచేసరికి పిల్లలు రచయిత్రి రాసిన కథా కాగితాలను పడవలు చేసుకుంటూ కేకలు వేస్తుంటే మెలకువ వచ్చినట్లుగా ముగిస్తారు ‘మానివేసిన కథ’ (1952)ని మీనాక్షీదేవి. ఇంచుమించుగా కథ రాయటం గురించే రాసిన మరో కథ ‘మంచికథ’ (1955). రచయిత్రికి కథా నిర్మాణం, కథన పద్ధతిలోని ప్రత్యేకతని పట్టి చూపే మరో కథ ‘కాలాతీత వ్యక్తి’ (1955). హాస్టల్‌లో చదువుతోన్న పార్వతీశం కోసం ఎవరో వచ్చారంటే, పరీక్షల కోసం దీక్షగా చదువుతోన్న పార్వతీశం విసుక్కుంటూనే వెళ్తాడు. తిరిగి వచ్చాక ఎవరితోనూ మాట్లాడకుండా మౌనిలా ఉండిపోతాడు. వచ్చినతను ఏమైనా విషాదవార్త మోసుకొచ్చాడేమోనని ఇతర విద్యార్థులు అడిగినా సమాధానం ఇవ్వడు. మర్నాడు పరీక్ష కష్టంగా ఉందని విద్యార్థులంతా బాధపడుతుంటే పార్వతీశం వంచిన తల ఎత్తకుండా పరీక్ష రాసి ‘తేలిగ్గా ఉంద’ని అంటాడు. తర్వాతి రోజు వార్తాపత్రికలో పిచ్చాసుపత్రి నుంచి ఒక వ్యక్తి పారిపోయాడని, అంతకుముందు అతను కాలేజీలో పనిచేసి, విద్యార్థులు చేసిన ఘోర అవమానంతో మతి చలించిన వ్యక్తి అనీ, పరీక్షలో వస్తాయంటూ అందరికీ ప్రశ్నలు చెప్తుంటాడనీ, ఆ వ్యక్తిని వర్ణిస్తూ వార్త వస్తుంది. ఆ వర్ణనతో సరిపోలిన వ్యక్తే తనను కలిసి ప్రశ్నలు చెప్పడం, సరిగ్గా పరీక్షలో అవే ప్రశ్నలు రావటం గుర్తుకువచ్చి పార్వతీశం నివ్వెరపోతాడు. ఇదే కథని ప్రారంభం నుండి పార్వతీశం చుట్టూ నడిపి, హాస్టల్లో విద్యార్థుల అల్లరి, పరీక్ష వాతావరణాన్నీ వివరిస్తూ పాఠకులను కథలోకి మమేకం చేస్తూ చెప్పడంలో రచయిత్రికి కథన నిర్మాణం పట్ల గల ఖచ్చితత్వం తెలుస్తుంది. ముగ్గురు కొడుకుల తర్వాత పుట్టిన జానకికి వివాహం చేయాలని పన్నెండో ఏట నుండీ ప్రయత్నించిన తండ్రి, ఏవో అవాంతరాలతో, ఫస్టున పాసవుతున్న కూతురి చదువుని ఎమ్మే వరకూ కొనసాగించే ఇతివృత్తంతో సాగిన కథలో స్త్రీల వివాహ సమస్య ఆనాటి సమాజంలో ఎన్ని విధాలుగా రూపాంతరం చెందుతోందో, జీవితంలో ఎదురీదుతున్న స్త్రీలను అసహాయులుగా చేయటానికి ఎలాంటి అభాండాలకు, అవమానాలకు గురిచేస్తోందో తెలియచెప్పే కథ ‘ఎదురీత’. ఒక సందర్భంలో తండ్రి ”ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా స్త్రీ పట్ల గౌరవం చూపించలేకపోతుంది సంఘం. బాహ్యమైన నాగరికతలో జాతి ఎంత పురోగమించినా సంఘం స్త్రీల పట్ల మానసికంగా వీసమెత్తు ప్రగతిని చూపలేకపోతోంది” అని అంటాడు. ఈ మాట నేటికీ వర్తిస్తుంది. ఇది ఆ పాత్ర అభిప్రాయం మాత్రమే కాదు, మీనాక్షీదేవి అభిప్రాయం కూడా. ”మతాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం అయిదు వేలు ప్రోత్సాహకంగా ఇస్తుందనీ, డబ్బు అవసరం మన ఇద్దరికీ ఉంది కనుక రిజిస్టర్‌ ఆఫీసులో పెళ్ళి చేసుకుని ఆ డబ్బును చెరిసగం పంచుకుని, ఎవరింట్లో వారు ఉండి ఏడాది దాటాక విడాకులు తీసుకుందామని” రామశాస్త్రి తన సహోద్యోగి మేరీని అడుగుతాడు. అత్యవసర స్థితిలో ఉన్న మేరీ అందుకు అంగీకరిస్తుంది. ఏడాది అయ్యాక ”ఒకసారి వివాహం అయ్యాక తెంచుకుపోలేను” అని మేరీ కోర్టుకు రావడానికి ఇష్టపడదు. ఆర్థికావసరాలు ఎటువంటి ‘వంచన’కైనా పురిగొల్పుతాయని తెలియజేసే కథ ఇది. తరాల అంతరాలలో తల్లికి ఏమీ తెలియదు అనే భావాన్ని ప్రకటించే పిల్లల తీరుకి చిన్నబుచ్చుకునే తల్లి ఆవేదన ”ఔటాఫ్‌ డేట్‌” కథ. ఇదే అంశంలో నేటికీ చాలా కథలు వస్తూనే ఉన్నాయి. డబ్బు వెనక పరిగెత్తే స్వభావాన్ని పెంచుకుంటే అది ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో తెలిపే కథ ‘ఆర్జన’. కొడుకుల చదువుకి అప్పిచ్చానని ప్రోనోటు రాయించుకునే తండ్రులు ఉంటారా అంటే ఉండొచ్చు. ఖర్చు పెట్టిన దాన్ని కొడుకు పెళ్ళిలో కట్నంగా రాబట్టడానికి ఎత్తుగా రాసిన కథ ‘కన్నబిడ్డల చదువుకు మధువు’. బ్యాంకు ఉద్యోగి చెక్కు నుండి వస్తున్న ‘కునేగా’ పరిమళానికి పరవశించి ఆ చెక్కు తాలూకు వ్యక్తిని గురించి ఊహించుకొని భంగపడిన కథ ‘కునేగా’. వంద ఏళ్ళకు ముందు జన్మించిన వేదుల మీనాక్షీదేవి కథలలో ఉన్న ఆధునిక భావజాలం, స్త్రీల కుటుంబ జీవితాల పట్ల స్పష్టమైన అవగాహన, విద్యావిధానం పట్ల గల చింతన, సమాజ కౌటుంబిక జీవనంలో మారాల్సిన దృక్కోణం మొదలైనవి రచయిత్రికి గల నిబద్ధతను తెలియచేస్తుంది. మీనాక్షీదేవి కథల్లో మూడొంతులకు పైగా ఈనాడు చదివినా నేటి సమాజానికీ సమకాలీన కథల్లాగే పాఠకులను ఆకర్షిస్తాయి. అంతేకాదు ఈ రచయిత్రి రాసిన కథాంశాలతో ఏవో చిన్న చిన్న మార్పులతో ఇప్పటికీ కథలు వస్తూనే ఉన్నాయంటే రచయిత్రి సృజనాశక్తిని గుర్తించాల్సిందే కదా! కానీ నేటితరం పాఠకుల విమర్శకులకే కాదు సాహితీరంగంలో ఉన్నవారికి కూడా తెలియకుండా మిగిలిపోయిన విస్మృత రచయిత్రి వేదుల మీనాక్షీదేవి.

8, ఆగస్టు 2021, ఆదివారం

నా పని-నా ఆనందం

 నాపని-నాఆనందం 

                             పనిఅంటే ఇంటి పనా,పిల్లల పనా,ఉద్యోగమా,రచనారంగమా దేని గురించి చెప్పాలి.గొప్ప డైలమాలో పడ్డాను.

       నిజానికి   work is worship అనేది నాసిద్ధాంతం.ఏ పని ఐనా అంకితం భావం తోనే చేస్తాను.ఎందుకొచ్చిన బాధరా బాబూ అనుకునే మనిషిని కాదు.ఏదైనా పని నాకు అప్పగించినప్పుడు నేను చేయగలిగినది ఐతే వప్పుకొని ఆనందంగానే చేస్తాను.నచ్చకపోతే ముందే ఖచ్చితంగా చేయనని చెప్పేస్తాను.

       ఇంటిపనీ,పిల్లలపనీ ఇవి ప్రతీ స్త్రీ కి తప్పని, తప్పించుకోలేని బాధ్యత.అయినా ప్రతీ మహిళా తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా బాధ్యతంతా భుజాన వేసుకుని ఇష్టపూర్వకంగా చేస్తుంది. ఇది చేయటంలో సంతోషమూ ఉంటుంది.ఒకింత స్వార్థమూ ఉంటుంది.అలాగే నేనూ చేసాను.

       అమ్మకి ఆర్ధిక స్వావలంబన లేక చిన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు చూడటం, అనుభవించటం వలన చదువుకొని ఉద్యోగం చేయాలనే గాఢమైన పట్టుదలని వివాహానంతరం పదేళ్ళకి గాని సాకారం చేసుకోలేకపోయాను.అందుకని టీచరు ఉద్యోగంలో పిల్లలతో మమేకం అవుతూ పాఠాలు చెప్పటం లోనూ, స్కూలు కి సంబంధించిన విజ్ఞాన ప్రదర్శనలూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం లో సంతోషం పొందాను. స్కూల్ లో ఉన్నంతసేపూ ఇంకేం విషయాలూ గుర్తు రానంతగా ఆనందం పొందాను.

           కొందరు టీచర్లు ఎప్పుడు రిటైర్ అవుతామో అని సంవత్సరాలు,నెలలూ లెక్కబెట్టుకుంటుంటే అంత బాధ పడి బడికి రావటం మెందుకు? ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకోవచ్చు కదా మరొకరికి ఉద్యోగం అన్నా వస్తుంది అనుకునేదాన్ని.

           నేను ఫ్రెండ్ అనుకున్న ఆమె అప్పట్లో హెడ్ మిస్ట్రెస్ గా ఉంది.ఆమె ప్రమోషన్  నాకు రాకుండా  నన్ను టార్చర్ పెట్టటానికీ,నాకై నేను ఉద్యోగం మానేసేలా  ప్రయత్నం చేసినా ఎదుర్కొని నిలదొక్కుకున్నానే కానీ ఉద్యోగం వదిలి పారిపోలేదు. నిబద్ధతతో పాఠాలు చెప్తూ విద్యార్ధులతో కలిసి మెలిసి ఉండటం లోని ఆనందాన్ని కోల్పోలేదు.

        ఇక నా ప్రవృత్తి రచనా రంగం .1970 లో కథాప్రచురణతో మొదలై యాభై ఏళ్ళు దాటిన నా రచనా ప్రస్ధానం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూనే వుంది.ఉద్యోగవిరమణ అనంతరం నాకు సంతోషం కలిగించే లలిత సంగీతం, చిత్రలేఖనంలో కూడా సాధనచేయాలనుకున్నా అంతగా కుదరలేదు.అందుకే  మరింతగా రచనా వ్యాసంగం లోనే నా ఆనందాన్ని నింపుకున్నాను.

      చిన్నప్పటి నుంచి నన్ను నేను తీర్చిదిద్దుకున్నది పుస్తక పఠనం వలనే.  ఎప్పుడైనా మనసు నొచ్చుకున్నా,చికాకుగా ఉన్నా కాసేపు ఏ పుస్తకమైనా చదువుకుంటే స్నేహితురాలి వలన ఓదార్పు పొందినట్లు మనసు తేలికైపోతుంది.అందుకే ఎంత పని ఒత్తిడిలో తీరికలేకుండా ఉన్నా,అనారోగ్యంగా ఉన్నా   రాత్రి తప్పని సరిగా ఓ నాలుగైదు కవితలో ఓ రెండు కథలో చదివిన తర్వాతే నిద్రకు ఉపక్రమించటం చిన్నప్పటి నుంచీ అలవాటు.

        నా ఆవేదన,నా ఆవేశం,నా దుఃఖం,నా ఆక్రోశం,నన్ను కలవరపరిచే అన్ని అనుభూతులను మరిపించి ఆనందాన్నీ, సంతృప్తినీ కలిగించి మనసుతేలికపరచేది నా సాహిత్య పఠనమూ,రచనలే.ఎన్ని ఒడుదుడుకుల్ని నా జీవితపర్యంతమూ  ఎదుర్కొన్నా నా ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరకుండా సంయమనంతో ఉండేలా చేసినవి నాకు తోడుగా ఉన్న నా అక్షరాలే.