1, నవంబర్ 2021, సోమవారం
నడక దారిలో-- 10
నడక దారిలో--10
మహారాజా మహిళా కళాశాల మెట్లు ఎక్కిన రోజు ఎవరెస్ట్ ఎక్కినంత ఉద్వేగం పొందాను.అందులో ఒక్కదాన్నే కాలేజీ కి వెళ్ళటం.పెద్దగా వెడల్పాటి కారిడార్.సింహాచలం లోని కప్పస్తంభాల్లాంటి స్తంభాలు.పూసపాటి రాజుల రాజభవనం కావటాన ఎత్తైన సీలింగు.భవనానికి నాలుగు వైపులా మెట్లుఉండేవి.రెండు మూలల్లోని మెట్లు బయటకు పోయేందుకు.రెండు మూలల్లోని మెట్లు బిల్డింగ్ వెనుక ఉన్న హాస్టల్ రూమ్ లకూ,గార్డెన్ లోకీ వెళ్ళేందుకు ఉంటాయి.
వెళ్ళగానే ఏ రూం లోకి వెళ్ళాలో తెలియలేదు.దారిలో కనిపించిన అమ్మాయిని పి.యూసి ఎంపీసీ క్లాసులు ఏ రూమ్ లో జరుగుతాయని అడిగాను.
ఆ అమ్మాయి చెప్పిన వైపు వెళ్తే పెద్ద హాలు ఉంది.గుమ్మందగ్గర నిలబడ్డాను.అదృష్ట వశాత్తూ ఆ క్లాసులో ఉన్న కుమారి లెక్చరర్ నుంచి పర్మిషన్ అడిగి బయట కొచ్చింది.ఆ క్లాస్ లో హిస్టరీ జరుగుతుందిట.ఆ హాలు కి పక్కనే చిన్న పార్టిషన్ గది ఉంది.అక్కడ మేథ్స్ క్లాస్ అని చెప్పింది.
ఇక ఆ ప్రక్కనే గది ద్వారం దగ్గర నిలబడితే అప్పటికే పాఠం చెప్తున్న లెక్చరర్ నన్ను చూసి ఇంగ్లీష్ లో ప్రశ్నించారు.అప్పుడు గుర్తు వచ్చింది.ఇప్పటివరకూ తెలుగు మీడియం లో చదివాను.ఇప్పుడు కాలేజీ విద్య తెలుగు మాధ్యమం కాదనీ, ఇంగ్లీష్ లోనే అని.ఒక్కసారి భయం నన్ను అలుముకుంది."న్యూస్టూడెంట్ నండి "అని చెప్తే లోపలికి రమ్మన్నారు.క్లాసులో నాతో కలిపి తొమ్మిది మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు
సీట్లో కూర్చుంటూ బోర్డు వైపు చూసాను.Radian అని హెడ్డింగ్ రాసి,వృత్తం లో గుర్తించి ఉంది.అంతలోనే బోర్డు చెరిపి రేడియన్ అంటే ఏమిటో వివరించమని పరీక్ష పెట్టారు.
పేపరు మీద అంతకుముందు బోర్డు మీద చూసిన పటం వేసి రేడియన్ అని రాసాను.లెక్చరర్ ఉమాకుమారిగారు అందరిదగ్గరా పేపర్లు తీసుకుని దిద్ది ఇచ్చేసారు."క్లాసుకి టైముకి రావాలి.ఇలాచదువుతే లాభం లేదు"అని నావైపు చూసి కోపంగా అన్నారు.
మొదటిక్లాసులోనే తిట్లు తిన్నానని దిగులు వేసింది.క్లాసులో అందరూ కొత్త వాళ్ళు నేనేమో తొందరగా స్నేహం చేయలేను.అందులోను ఇంగ్లీష్ లో చదవగలనా అని ఒక భయంవేసింది.
పీయూసీ లో గణితం లో కేవలం తొమ్మిది మంది విద్యార్థినులే ఉండేవాళ్ళం కదా .మాకు ఆ చిన్న పార్టిషన్ రూమ్ లోనే క్లాసులు జరిగేవి.ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసులు ఆయా లేబ్ లను ఆనుకొని ఉన్న రూమ్ లో జరిగేవి. కెమిస్ట్రీ క్లాసులో BZC వాళ్ళుకూడా కలవటం వలన ముప్పై మందివరకూ ఉండేవాళ్ళం.ఇంగ్లీషు, తెలుగు క్లాసులకు అన్ని గ్రూపులు వాళ్ళూ కలుస్తారు కనుక వందకి పైగా ఉండేవాళ్ళం.అదే హాలు లో బియ్యే వాళ్ళకు క్లాసులు జరుగుతాయి.అందువలన మేము ఎంత పరుగున వచ్చినా వెనుక బెంచీలలోనే కూర్చోవలసి వచ్చేది. నా బడి మిత్రులు కుమారీ ,కమలా అదే క్లాసులో ఉన్నా వాళ్ళు ముందు సీట్లో కూర్చోవటం వలన వాళ్ళతో మాట్లాడటానికే కుదిరేది కాదు.అందుచేత సెలవు రోజుల్లోనే ఒకరింటికి ఒకరు వెళ్ళి కబుర్లు చేప్పుకునే వారం.
ఒకరోజు NCC లో చేరేవాళ్ళకోసం సర్కులర్ వచ్చింది.చిన్నక్క ఇంటికి కోరుకొండ సైనిక స్కూల్ కి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు మార్చ్ పాష్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి ప్రభావితురాలిని కావటం చేత చేరేందుకు NCC ఇన్చార్జి సంజీవి మేడం కి పేరు ఇచ్చాను.సంజీవిమేడం సన్నగా చిన్నగా ఉన్నా మంచి కమేండింగ్ వాయిస్ కలిగి ఉంటారు. ముఖంలో దృఢమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.ఒక రెండు రోజులు కాలేజీ ఐన తర్వాత ఫిట్నెస్ టెస్ట్ కోసం నడిపించేసరికి కళ్ళు తిరిగి పడిపోయాను." నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు.NCC కి పనికిరావు" అన్నారు సంజీవి మేడం.
తర్వాత కాలేజీలో సంగీతం లో డిగ్రీ చేస్తున్న అమ్మాయి కాలేజీ అయ్యాక మహారాజా సంగీత నృత్య కళాశాల కు వెళ్తుందని తెలిసి ఆ అమ్మాయి తో కలిసి వెళ్ళి కర్నాటక సంగీతం గాత్రం నేర్చుకోడానికి చేరిపోయాను.రోజూ కాలేజీ పూర్తి అయ్యాక అటునుంచి అటే సంగీత కళాశాల కి వెళ్ళి ఇంటికి వచ్చేదాన్ని.
అన్నట్లు మా కాలేజీ లో విద్యార్థినులకు యూనిఫాం ఉండేది.తెల్లచీర,తెల్లజాకెట్టు.ఒకరిద్దరు తెల్లవే లంగా వోణి వేసుకునేవారు.ఇక నా సంగతికి వస్తే మా పెద్ద మామయ్య మా నాన్నగారు పోయిన తర్వాత అమ్మకి ఏ రెండేళ్ళకో ఒకసారి అరవై కౌంట్ వో, ఎనభై కౌంట్ వో నేతచీరలు మగ్గం మీద ఒక సరి మీద వచ్చే ఆరు చీరలు నేయించి ఇచ్చేవారు.అందులో రెండు తనకోసం అమ్మ ఉంచుకోగా మిగతా నాలుగు చీరలూ నాకు పెట్టీకోట్లూ, పరికిణీలకూ, గలేబులకూ వాడేవాళ్ళం.కాలేజీకి చీరలు కావాలి కనుక బోర్డర్ లేని ఆ ముతక చీరలకు రకరకాల ఎంబ్రైడరీ బోర్డర్లు కుట్టు కొన్నాను.నాలుగేళ్ళ కాలేజీ చదువూ వాటితోనే గడిచిపోయింది.
కాలేజీలో చేరిన తర్వాత పెద్దక్కయ్య ఒకసారి తెల్లని మెత్తని గ్లాస్కో చీర ఇచ్చింది.కానీ ఎంతో ముచ్చటగా కట్టుకున్న రోజునే కెమిస్ట్రీ ప్రాక్టికల్ క్లాసులో ప్రయోగం చేసే సమయంలో నా పక్కనే ప్రయోగం చేస్తున్న అమ్మాయి ఎవరో పిలిచారని గభాలున తిరగటం లో పరీక్షనాళిక లోని సల్ప్యురిక్ ఆమ్లం మొత్తం నాచీర మీద పడింది.వెంటనే నీళ్ళు చల్లుకున్నాను.మా మేడం రిక్షా పిలిపించి ఇంటికి పంపారు.ఇంటికి వెళ్ళగానే చల్లనీళ్ళతో స్నానం చేసి చీర బకెట్టు లో వేసేసరికి అప్పటికే చీర పీలికలు ఐపోయింది.నాకు అక్కడక్కడా చిన్న పొక్కులు వచ్చాయి తప్పా ప్రమాదం జరగలేదు.
మొత్తం మీద చిన్న చిన్న అవాంతరాలతో ఏడాది గడచి పోయింది.కాలేజీ వార్షికోత్సవానికి నాకు సాయంగా మామయ్య కూతుర్లను తీసుకొని వెళ్ళాను.మొదట అందరి ఉపన్యాసాలు అనంతరం బహుమతుల ప్రదానం మొదలయ్యింది.ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల మొదలు కాకపోవటంతో నా బడి మిత్రులం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం.అంతలో నాపేరు వినిపించింది.పొరపాటున పిలిచారేమోనని నేను చూస్తుంటే 'సుభద్రా నిన్నే' అని మిత్రులు తోసారు.ఆశ్చర్య పోతూనే వేదిక వైపు వెళ్ళాను.
మా మేథ్స్ మేడం ఉమాకుమారి గారు ఆ ఏడాదంతా పెట్టిన మేథ్స్ పరీక్షల్లో అత్యథిక మార్కులు సాధించినందుకు ప్రొఫీషియన్సీ ఇన్ మేథ్స్ అని నాకు ట్రిగొనామెట్రి విదేశీ ఎడిషన్ పుస్తకం ఇచ్చారు.మొదటిక్లాసులో కోప్పడిన లెక్చరర్ చేతిమీదుగా బహుమతి అందుకోవటం నాకు పట్టరాని సంతోషం కలిగించింది.ఇంటికి వెళ్ళాక మా అన్నయ్యలకు చూపిస్తే వాళ్ళ ముఖాల్లో కూడా ఆనందం కనిపించింది.
ఉమాకుమారిగారి ప్రభావం వలనే నేను ఉద్యోగం చేసిన పాతికేళ్ళూ ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు మొదటి రేంక్ వచ్చిన పిల్లలకు పుస్తకాలే కాక నగదు బహుమతి కూడా ఇచ్చేదాన్ని.
పరీక్షలు పూర్తి చేసాను.రిజల్ట్స్ కూడా వచ్చాయి.పేపర్లో నెంబర్ ఎక్కడా కనబడకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాను.దుఃఖ సముద్రం నిలువెల్లా ముంచెత్తింది.మధ్యాహ్నం రిజల్ట్ చూసుకుని కుమారి మా ఇంటి కి వచ్చి విషయం తెలిసి "అదేమిటి సుభద్రా నీది పోవటమేంటి ?" అని తెల్లబోయింది.ఏదో పొరపాటై ఉంటుంది.మార్కులు వచ్చాక తెలుస్తాయి అని ఓదార్చింది.
మార్కులు కూడా వచ్చాయి.లెక్కలు149/150 వచ్చి మిగతావాటిలో70/ పైనే వచ్చి ఇంగ్లీష్ లో మాత్రం 34/ వచ్చి పరీక్షపోయింది.ఇప్పటిలా ఇన్స్టెంట్ పరీక్షలు లేనందున సెప్టెంబర్ లోనే రాయాలి. ఒక ఏడాది వృథా అయినట్లే. మళ్ళా నేను డిగ్రీ చదవగలనా? మళ్ళీనా చదువు కథ మొదటి కే వచ్చింది .నా చదువుకి ఇన్ని అవాంతరాలు ఏమిటో???
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి