3, నవంబర్ 2021, బుధవారం
శ్రీదేవి మోనోగ్రాఫ్ పై తెలుగు తూలిక లో ని.మాలతి సమీక్ష
డా. పి. శ్రీదేవి. రచన శీలా సుభద్రాదేవి
సాహిత్య ఎకాడమీ ఆధ్వర్యంలో డా. పి. శ్రీదేవిగారి సాహిత్యవ్యాసంగం క్షుణ్ణంగా పరిశీలించి ప్రముఖ కవయిత్రీ రచయిత్రీ శీలా సుభద్రాదేవి రచించిన పుస్తకం ఇది.
పి. శ్రీదేవి అంటే కాలాతీతవ్యక్తులు, కాలాతీతవ్యక్తులు అంటే పి. శ్రీదేవి అని తెలుగులోకంలో సుప్రసిద్ధం. కొంతమందికి ఆమె తెలుగు స్వతంత్రలో ఉపసంపాదకులుగా పని చేసేరని తెలిసిఉండొచ్చు. కానీ శ్రీదేవి చిన్నకథలు, కవితలు కూడా రాసేరనీ, విమర్శలు, సమీక్షలు కూడా ప్రచురించేరనీ, ఆమెకి చిత్రలేఖనంలో పరిచయం ఉందనీ తెలిసినవారు లేరేమో. ఉంటే చాలా తక్కువ అనుకోవాలి.
ఈ మోనోగ్రాఫ్‌లో లభ్యమైనంతవరకూ శ్రీదేవి జీవితచరిత్ర, తెలుగు సాహిత్యంలో వివిధశాఖలలో ఆమె చేసిన కృషిని సూక్ష్మదృష్టితో పరిశీలించి, విశ్లేషణాత్మకంగా వివరించేరు సుభద్రాదేవి. సుమారు పది సంవత్సరాలలో వృత్తిరీత్యా వైద్యరంగంలో పని చేస్తూనే సాహిత్యంలో ఇంత కృషి చేసేరా అని ఆశ్చర్యం కలుగుతుంది సుభద్రాదేవి సమకూర్చిన సమాచారం చూస్తే.
ఒక్క కాలాతీతవ్యక్తులు నవల 38 పేజీలలో విశ్లేషించేరు రచయిత్రి. ఇతివృత్తం, పాత్రచిత్రణ, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులనేపథ్యంలో శ్రీదేవి ఈనవలను ఎంత సమర్థవంతంగా నిర్వహించేరో గ్రంథస్థం చేయడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయం. శ్రీదేవిగారి తాత్వికచింతనగురించిన విశ్లేషణ ప్రత్యేకంగా బాగుంది.
కవయిత్రి సుభద్రాదేవి శ్రీదేవి కవితలను సాటికవయిత్రిగా విశ్లేషించినతీరు మనసుకి హత్తుకునేలా ఉంది. అలాగే శ్రీదేవి ఉపసంపాదకురాలిగా పని చేస్తున్న రోజులలో చేసిన విమర్శలూ, సమీక్షలూ కూడా ప్రతిభావంతంగా చేసేరంటారు సుభద్రాదేవి.
తెలుగు సాహిత్యచరిత్రలో చెప్పుకోదగ్గ రచయిత్రి డా. పి. శ్రీదేవి. స్త్రీల సాహిత్యచరిత్ర, కాల్పనికసాహిత్యచరిత్రలలో ఆసక్తి గలవారు తప్పక చదవవలసిన పుస్తకం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి