29, అక్టోబర్ 2021, శుక్రవారం
శీలావీ వేసిన తైలవర్ణ చిత్రాల గురించి
మిత్రులారా.మీతో ఓ విషయం పంచుకోవాలనుకుంటున్నాను.
శీలా వీర్రాజు గారు తన జీవితకాలంలో ఇన్నేళ్ళుగా వేసిన నూట ఇరవైకి పైగా తైలవర్ణ చిత్రాలలో మిత్రులకు, బంధువులకూ ఇచ్చి వేయగా మిగిలిన సుమారు ఎనభై వరకూ చిత్రాలను రాజమండ్రి లోని దామెర్ల రామారావు స్మారక ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ కి ఇచ్చేస్తున్నాము.అంతకు ముందు ఈ చిత్రాలను హైదరాబాద్,విజయవాడ, రాజమండ్రి, కావలి, యానాం, వైజాగ్ లలో ప్రదర్శనలు నిర్వహించాము.ఆ సమయం లో కొందరు చిత్రాలను కొనాలని అభిలషించారు.ఈమని శివనాగిరెడ్డి గారు విజయవాడ లో కన్వెన్షన్ సెంటర్ కోసం లక్షకు ఒక నాలుగు చిత్రాలను కొంటానన్నారు.కానీ డబ్బుకోసం అమ్మటానికి ఇష్టపడక వారికి ఒక చిత్రాన్ని బహుమతి గా ఇచ్చారు వీర్రాజు గారు.
మేమిద్దరం వయసు రీత్యా బాగా పెద్దవారిమయ్యాము.మా తదనంతరం అన్ని పెయింటింగ్స్ మా అమ్మాయి ఒక్కతే సంరక్షించటం చాలా కష్ట మౌతుంది.ఇంకా ఇంట్లో ఉన్న అపారమైన సాహిత్య సంపద, కళాకృతులు ఇవన్నిటినీ నిర్వహించే బాధ్యత కూడా ఆమెపై ఉంది.
అందుకే అన్నీ ఆలోచించి మేమిద్దరం ఉంటున్నప్పుడే ఈ పెయింటింగులు అన్నీ వీర్రాజు గారి జన్మస్థలం,అంతే కాకుండా వారు చిత్రకళని అభ్యసించిన దామెర్ల రామారావు స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ గ్యాలరీ లోనే కనుక అక్కడే ఇవ్వటానికి నిర్ణయించాము.ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక ఆర్ట్ గ్యాలరీ.
ఇంతకాలం అపురూపంగా చూసుకున్న అమూల్యమైన పెయింటింగ్స్ ఇచ్చేయడం కొంత బాధగానే ఉన్నా తరతరాలుగా ఆయన పేరుతో గ్యాలరీలో ప్రదర్శింపబడుతూ ఉండటం, వీర్రాజు గారు జీవితకాలంలో చిత్రకళలో చేసిన కృషి,ప్రతిభ చిరస్థాయిగా నిలవటం మాకు సంతోషమే కదా.అందుకనే చిత్రకళాభిమానులకు అంకితంగా ఉచితంగా చిత్రకళా పరిషత్ కి ఇచ్చేస్తున్నాము.
ఆ పనిలో గత నెలరోజులుగా అక్కడ ప్రిన్సిపాల్,ఇతర పెద్దలనుండి శాస్వత అనుమతి కోసం దరఖాస్తు చేసాము. చివరకు సరియైన పద్ధతిలో అనుమతి దొరికింది.
ఈ పెయింటింగులు గ్యాలరీ లో అమర్చి ప్రారంభోత్సవం చేయటం బహుశా నవంబర్ నెలాఖరుకు జరుగుతుందనుకుంటాను.అప్పుడు మళ్ళా తెలియజేస్తాను.
ఆ తర్వాత మీరు ఎప్పుడైనా రాజమండ్రి వైపు వెళ్తే తప్పకుండా దామెర్ల రామారావు స్మారక ప్రభుత్వ చిత్రకళా పరిషత్ లో ఉన్న శీలా వీర్రాజు గారు వేసిన తైలవర్ణ చిత్రాలు చూసి ఆనందించితే మా సంకల్పం నెరవేరుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి