25, అక్టోబర్ 2021, సోమవారం
నడక దారిలో--8
నడక దారిలో----8
ఎస్సెల్సీ పరీక్షలు రాసిన తర్వాత అక్కయ్య కి డెలివరీ సమయం అని అమ్మా నేనూ సామర్లకోట వెళ్ళాం. అన్నట్లు అప్పట్లో పురుళ్ళకి హాస్పటల్ కి వెళ్ళటం తక్కువే అనుకుంటాను. ఇంట్లోనే మంత్రసాని తన చేతులమీదుగా డెలివరీలు చేసేదనుకుంటాను.ఏదైన క్లిష్టపరిస్థితుల్లో మాత్రమే హాస్పటల్ లో చేరేవారేమో.ఇవన్నీ అప్పటికి నాకు అంతగా తెలిసే విషయం కాదు.
మంత్రసాని వచ్చింది.ఆ రాత్రంతా అక్కయ్య మూలుగులూ అరుపులూ, హడావుడి నాకు గాభరాగా బెంగగా అనిపించింది.అక్కయ్య ఎప్పుడూ గంభీరంగా,ధైర్యంగా,ఉండేది. స్పష్టంగా నిర్భయంగా మాట్లాడుతుందనీ ఆమెతో మాట్లాడాలంటే అందరూ జంకుతారు.అటువంటిది ఇలా బేలగా మూలుగుతుంటే నాకు దిగులుగా అనిపించింది.
అక్కయ్య పెద్ద కూతురుని దగ్గరకు తీసుకుని కలత నిద్రలోనే ఆడవాళ్ళ అవస్థలు గురించి, స్త్రీల జీవితాల గురించి ఆలోచనలతో వేగిపోతూ రాత్రంతా గడిపి తెల్లవారుజామున కను రెప్పల్ని వాల్చాను.
ఉదయం లేచేసరికి అక్కయ్య పక్కనే బుజ్జి పాపాయి ని చూసేసరికి రాత్రి ఆలోచనలన్నీ మటుమాయం అయ్యాయి.
ఆరోజే నా ఎస్సెల్సీ రిజల్ట్ రావటం మంచి మార్కులు తో పాసవటం తో ఎంతో మరింత సంబరం కలిగింది.అనుకున్నది సాధించానన్న తృప్తితో మనసు ఉప్పొంగి పోయింది.
ఆ తర్వాతరోజులు గడుస్తున్నా కొద్దీ కొంచెం కొంచెం గా బెంగ నన్ను ఆవరించటం మొదలైంది.తర్వాత ఏం చెయ్యాలి,చదివిస్తారా? సెకెండరీ గ్రేడ్ ట్రైనింగ్ చేయనా? చేస్తే ఉద్యోగం చేయనిస్తారా?
ఎస్సెల్సీ పరీక్షకి ఫారం నింపేటప్పుడు జన్మతేదీ,తండ్రి పేరు అవీ తప్పులు సరిచేసుకోమని క్లాసులో అందరికీ ఫారాలు ఇచ్చి మాష్టారు చెప్పినప్పుడు నా జన్మతేదీ తప్పు ఉండటం చూసి అన్నయ్యను అడిగాను."ఫర్వాలేదులే ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా ? అలా ఉండనీ పర్వాలేదులే " అన్నాడు.మారుమాటాడకుండా మాష్టారుకి నింపి తిరిగి ఇచ్చేసాను. అది గుర్తు వచ్చి చదివిస్తారోలేదో అనే దిగులు మనసుని ముంచెత్తింది.
మాకుటుంబాలలో స్కూలు చదువు పూర్తి చేసినవారూ,ఉద్యోగాలు చేస్తున్న వారూ ఎవరున్నారా అని ఆలోచిస్తే మెడిసిన్ లో చేరిన మా మామయ్య కూతురు తప్పా ఎవరూ కనిపించలేదు.స్కూల్ ఫైనల్ వరకూ చదివిన వారు కూడా తక్కువే.మా అక్క చెల్లెళ్ళు మాత్రమే అంతవరకూ చదివాము.దాంతో మరింత దిగులు కలిగింది.
మరేం చేయాలి.మా నాన్న గారి మరణానంతరం మా అమ్మ ఆర్థిక అస్తవ్యస్తల వలన ఎవరి ముందూ అసహాయంగా చేయి చాపటం లేదనే కోపంతో " అందం ,ఆస్తులూ ఉన్నవాళ్ళకే పెళ్ళిళ్ళు కావటం లేదు.అంత బింకంగా ఉంటుంది.రేప్పొద్దుట ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా చేస్తుందో చూడాలి"అని నలుగురి ముందూ అన్నమాటలూ గుర్తు వచ్చాయి.చిన్నక్క పెళ్ళి ఐతే అయిపోయింది.ఇక నా పరిస్థితి ఏమిటి? చదువుకి పులుష్టాప్ పెట్టేసి ఏం చెయ్యాలి?ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవలసిందేనా? ఇంట్లో పరిస్థితులు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుండటం వలన ఎలాగైనా చదువుకోవాలి నా కాళ్ళమీద నేను నిలబడేలా ఏదైనా ఉద్యోగం చేసి తీరాలి అనుకున్న నా సంకల్పం ఏమౌతుంది!? మనసంతా అయోమయంగా అయిపోయింది.
లెక్కలు క్లాస్ లో మాష్టారు లెక్క వివరించి మేము చేయడానికి ఒక రెండు లెక్కలు బోర్డు మీద రాసి కూర్చునేసరికి నేను చేసేసానని నిలబడేదాన్ని.అప్పడే చేసావా అని ఆశ్చర్యపోయి శకుంతలా దేవి అంతటి దానివౌతావు అనే వారు.అప్పుడప్పుడే గణితశాస్త్ర వేత్త శకుంతలా దేవి ప్రతిభ వార్తలు గా కథనాలు గా వస్తుండేవి.అదివిని నాకు నేనే భుజాలు చరచుకునేదాన్ని.మరి ఇప్పుడు?
నేను నోటు పుస్తకాల్లో చివరి పేజీల్లో KSDevi MSc(Maths) అని మురిసి పోతూ రాసుకున్న అక్షరాలు నా కళ్ళ ముందు వెక్కిరిస్తున్నట్లుగా మనసులో మెదులుతుంటే ఊరికూరికే కళ్ళు చెమ్మగిల్లసాగాయి.
అక్కయ్య చంటిపిల్లల్తో చేసుకోలేదని ఇక్కడే ఉండాల్సి వస్తుందేమోనని మరో బెంగ పెట్టుకొన్నాను.కానీ పాపకి నెలదాటిన తర్వాత అమ్మా నేను విజయనగరం వచ్చేసాము.
ఒక రెండు రోజులయ్యాక మా ఇంటికి పది పన్నెండు ఇళ్ళు అవతల ఉన్న కుమారి ఇంటికి వెళ్ళాను.కుమారీ,కమలా,రాజీ మహారాజా మహిళా కళాశాల లో పీయూసీ హ్యుమానిటీ గ్రూపు లో చేరారట.కాసేపు కుమారీ కాలేజీ కబుర్లు చెప్తుంటే మౌనంగా విన్నాను." నీ మార్కులకు కళ్ళకద్దుకుని కాలేజీలో సీటు ఇస్తారులే.నువ్వు కాలేజీలో చేరుతున్నావా? "అని ప్రశ్నించిన కుమారికి ఏమో అని మాత్రమే సమాధానం చెప్పి ఇంటికి తిరిగి వచ్చాను.
నాకు నోరు తెరిచి ఇది కావాలి అని అడిగే అలవాటు ఎప్పుడూ లేదు.పెద్దన్నయ్య ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడు.పేయింగ్ గెస్ట్ లా వీథి గదిలోనే ఉంటాడు.చిన్నన్నయ్య మాట్లాడుతాడు.కానీ మనసులో మాటలు చెప్పుకోలేను.ఏం చెప్పుకోవాలన్నా అమ్మకే.కానీ ఆమె కూడా అస్వతంత్రురాలు.మనసులోనే మధన పడ్డాను.
ఇంటికి వచ్చాక రాత్రి వంటకు కూరగాయలను తీసుకుని అమ్మ పక్కనే తరుగుతూ నెమ్మదిగా ,"కుమారీ వాళ్ళూ కాలేజీలో చేరారు" అని చెప్పాను.ఉల్లిపాయలు కోస్తున్నందుకో చదువుకోలేక పోతున్నందుకో తెలియని విధంగా కళ్ళనుండి జలజలా నీళ్ళు రాలాయి.
"ఇందాక మామయ్య వచ్చాడు.చిన్నాకి స్కూల్ ఫైనల్ ఐపోయింది కదా మావాడికిచ్చి పెళ్ళి చేయకూడదా"అని అన్నాడు.అప్పుడే ఇంట్లోకి వచ్చిన అన్నయ్య "మా చెల్లిని చదివిస్తాం.ఇలాపెళ్ళి మాటలు మాట్లాడేటట్లైతే రావద్దు "అని గసిరాడు"అంది.
అంతవరకు మనసంతా కారుమబ్బులు నిండి ముసురు పట్టినట్లు ఉన్నది కాస్తా మబ్బులన్నీ గుప్పున చెదిరి ఎగిరి పోయినట్లుగా ఆ మాట వినేసరికి నా ముఖం వెలిగిపోయింది. ."నిజమేనా? !!"అయినా అప్పుడే ఆగష్టు వచ్చేసింది.కాలేజీలో సీటు దొరుకుతుందా అనుమానం.
మర్నాడు అన్నయ్య దగ్గర కు వెళ్ళి నెమ్మది గా కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోనా అని వినిపించీ వినిపించినట్లు అడిగాను.మనసులో ఇంకా జంకు పోలేదు."బాబ్జి( చిన్నన్నయ్య) ని కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని రమ్మని చెప్పు" అన్నాడు ప్రశాంతంగానే.
.ఇక్కడ ఇంకో మాట చెప్పాలి.పేపర్లూ,పెన్నులూ,ఆఖరుకు బట్టలు కూడా చిన్నన్నయ్య వెళ్ళి తీసుకు రావాల్సిందే. స్నేహితుల ఇళ్ళకి తప్ప ఆడపిల్లలు బజార్లు తిరిగి కొనుక్కునే అవకాశం మా ఇళ్ళల్లో ఉండేది కాదు.అప్పుడు ఇంకు పెన్నులే కనుక ఇంకు బాటిల్ కొంటే అదే బోల్డు రోజులు వచ్చేది.
ఆ మర్నాడు చిన్నన్నయ్య కాలేజీ కి వెళ్ళి అప్లికేషన్ తేవటం, MPC గ్రూప్ తో పీయూసి లో చేరటానికి ఫీజు కట్టటం చకచకా జరిగిపోయింది.
మొత్తం మీద కాలేజీలో చేరాను.మా కుటుంబంలో నేను మొదటిసారి కాలేజీ మెట్లు ఎక్కబోతున్నాను.మనసు సీతాకోకచిలుక లా రెక్కలు విప్పుకున్నట్లు గా గాలిలో తేలిపోయాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి