26, సెప్టెంబర్ 2021, ఆదివారం
బుల్లెట్టు బండి పాట గురించి
నేను ఎక్కువగా పాల్గొనే ఒక వాట్సప్ గ్రూప్ లో రమణి అనే స్నేహితురాలు పంచుకొన్న విషయం.ఇది ముఖ్యం గా మహిళలందరూ ఆలోచించవలసినది గా అనిపించింది.అందుకే ఫేస్బుక్ లో కూడా పంచుకుంటున్నాను.
నేను మీతో పంచుకోవాలి అనుకున్న విషయం ఒక పాట గురించి. అలాంటి పాటలు ఏ విధంగా మనకు తెలియకుండానే మన మెదడును ఎలా పితృ స్వామ్య భావజాలం తో నింపేస్తున్నాయి అని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్న.
బుల్లెట్ బండి పాట ఏ భావజాలం కు ప్రతీక??
గత కొన్ని రోజులు గా బుల్లెట్ బండి పాట వాట్సాప్ లలో, ఫేస్బుక్ లోను ప్రతిధ్వనిస్తుంది. పాట అనేది మనుషులను ఆకట్టు కుంటుంది. అందులోను జానపద బానీ లో వుండే పాట సామాన్య ప్రజలను కుడా కట్టి పడేస్తుంది. శాస్ట్రీయ సంగీతం కొంతమంది ని ఆకట్టుకుంటే, శ్రమ జీవులను, నిరక్షారాస్యులను సైతం ఆకట్టు కునేది జానపదం. అందుకే విప్లవ కారులు చాలా మంది జానపద బానీ లోనే పాటలు రాసి, పాడిఈ దోపిడీ వ్యవస్థ గురించి, అసమానతల తో కూడిన సమాజం గురించి అందరికి అర్థం అయేలా చేసే ప్రయత్నం చేశారు.
ఈ బుల్లెట్ బండి పాట కుడా ఇంతలా ప్రజాదరణ పొందడానికి మూడు ముఖ్యం ఐన కారణాలు వున్నాయి.
1. ఈ పాట లో సాహిత్యం, అంటే పాట లో వుండే ప్రతి పదం అందరికి సులభంగా అర్థం అయ్యే బాష లో ఉండటం.
2. ఈ పాట లో సంగీతం జానపద బానీ లో హుషారుగా ఉండటం.
3. పాట పాడిన వారు చక్కగా పాడటం.
అయితే మరి లక్షల మంది ఇష్టపడిన ఈ పాట ఎలాంటి భావజాలం ను మన బుర్రలోకి ఎక్కిస్తుందో ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్న.
ఈ పాట ను ఇప్పటికి చాలా మంది వినే వుంటారు కనుక పాట ను నేను పోస్ట్ చేయడం లేదు.
ఈ పాటలో సాహిత్యం ను గమనిస్తే
1. మొదట ఆమె అంటే పెళ్లికూతురు ఏమేమి ముస్తాబు చేసుకుంది అనేది ఉంటుంది. ఈ ముస్తాబు అంత ఎవరికోసం? పెళ్లికుమారుని కోసం. అంటే పెళ్లికూతురు (స్త్రీ ) చేసుకునే ముస్తాబు అంత పెళ్లి కుమారుడు (పురుషుడు ) కోసమే అనే పితృస్వామ్య భావజాలం ను మనకు తెలియకుండానే మన బుర్రలోకి పంపిస్తుంది.
2. నా చేతిని, నీ చేతికి ఇచ్చి, నీ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తాను అని చెప్పడం ఆమెకు అంటే భార్య కాబోయే స్త్రీ కి స్వంత వ్యక్తిత్వం లేదు, అతని అడుగుజాడల్లో నడవడమే ఆమె పని అని సూచన ఇస్తుంది
3. మంచి మర్యాదలు తెలిసిన దాన్ని, మట్టి మనుషుల్లో పెరిగిన దాన్ని అని చెప్పడం పల్లెల్లో మనుషులు పట్టణాలలో మనుషుల కన్నా అంత చాలా మంచి వారు అనే అర్థం ఇస్తుంది. కానీ మన పల్లెల్లో కుల పరమైన, లింగ పరమైన అణచివేత, అసమానతలు నగ్నంగా కనిపిస్తాయి. అంటే పట్టణాలలో ఈ అణచివేత లు లేవు అని కాదు, కానీ పల్లెల్లో వాటి విశ్వ రూపం కనిపిస్తుంది. ఈ విధంగా ఈ మాటలు పట్టణాలలో వున్న ఎంతో కొంత ఆధునిక భావాలు కల మనుషులకన్నా పల్లెల్లో ని సాంప్రదాయ భావాలు కల మనుషులు మంచివారు అనే ఒక అభిప్రాయం ను పెంచుతుంది.
4.ఇంక అవ్వ సాటు ఆడపిల్లను అని మొదలు పెట్టి చెప్పేది అంత ఆడపిల్లలు ఎవరో ఒకరి సాటుగా ఉండాలి, ముఖ్యంగా పెళ్లి అయ్యేంత వరకు తల్లి తండ్రులు, అన్నదమ్ముల చాటుగా, పెళ్లి ఐన తరువాత భర్త చాటుగా ఉండాలి అనే భావాన్ని పెంచి పోషిస్తుంది. అంతే కాక పెళ్లి అయ్యేంత వరకు తల్లి తండ్రులు, అన్న తమ్ములు జాగ్రత్తగా చూసుకొని, పెళ్లి అప్పుడు ఆమె ను చూసుకోవాల్సిన బాధ్యత ను భర్త కు అప్పగించడం అంటే ఆమె నిరంతరం ఎవరో ఒకరి బాధ్యత గా ఉంటుంది. ఆమె బాధ్యత ను ఆమెనే నిర్వహించగల ఒక స్వతంత్ర మైన మనిషి గా ఉండదు.
5. ఇంక చివరగా పెళ్లి తరువాత ఎలా ఉంటుందో చెప్తుంది. ఆమె కుడికాలు పెట్టిన వెంటనే సిరి సంపదలు కల్గుతాయి. అంటే ఎలా? ఆమె తెచ్చే కట్న కానుకల వల్లనా? పెళ్లి తరువాత సంప్రదాయం పేరుతో ఎదో ఒక వంకన, ఆమె తల్లి తండ్రుల నుండి డబ్బులు గుంజడం వల్లనా? అంతే కాక ఈ వాక్యం కోడలు కుడి కాలు పెట్టి గృహప్రవేశం చేసిన తరువాత అంతే మంచి జరుగుతుంది అనే మూఢనమ్మకం ను కల్గిస్తుంది. దీని వలన ఒక వేల ఆమె అత్త వారింట్లో అడుగు పెట్టిన తరువాత ఆ ఇంట్లో ఏ అనర్ధాలు, నష్టాలు జరిగినా ఆమెనే బాధ్యురాలును చేసే అవకాశం వుంది.
6.పెళ్లి తరువాత ఆమె ఎలా ఉంటుంది అనేది తరువాత చెప్తుంది. చుక్కపొద్దుతో నిద్ర లేచి వాకిట్లో ముగ్గులు పెట్టడం నుండి ఇంక అన్ని పనులు చేస్తుంది. ఇంకా పెళ్లి తరువాత భర్తను కన్న వాళ్లనే, తన కన్నవాళ్లుగా భావిస్తుంది. మరి ఇన్ని రోజులు ఆమె మాటల్లోనే అంత అపురూపం గా పెంచిన తల్లి తండ్రుల బదులుగా తన అత్త, మామ లనే తల్లి తండ్రులు గా భావిస్తుంది. పెళ్లి తరువాత అత్త వారిల్లె ఆడపిల్లకు సర్వస్వం అనే పితృ స్వామ్య భావజాలం కు నిలువెత్తు నిదర్శనం కాదా ఇది. ఈ విధంగా ఒక జన్మ కాదు ఏడు జన్మలు అతనితోనే కలిసి జీవిస్తాను అని చెప్తుంది ఆమె. పెళ్లి అంటే ఏడు జన్మల బంధం అనే హిందూ సాంప్రదాయ భావనకు ప్రతీక ఇది.
కనుక ఆ నాటి "ఆలయన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లలే ఈ జగతికి జీవన జ్యోతి " పాట నుండి ఈ నాటి "బుల్లెట్ బండి " పాట వరకు స్త్రీ లను తమకంటూ
ఒక స్వంత ఆస్తిత్వం లేకుండ, నిరంతరం భర్త కు, అతని కుటుంబానికి సేవ చేయాలి అననే ,పెళ్లి ఐన తరువాత ఇంకా పుట్టిన ఇంటికన్నా మెట్టింటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే పితృస్వామ్య భావజాలం ను పెంచి పోషిస్తున్నాయి. ఈ విషయాలు ప్రజాస్వామిక, అభ్యుదయ వాదులు ముఖ్యం గా స్త్రీలు గుర్తించాలి.
చివరిగా తమ బానిసత్వాన్ని గురించిన పాటలు తామే సంతోషం గా పాడి, డాన్సులు చేసి వాటికి ప్రచారం కల్పించకుండా స్త్రీ లు జాగ్రత్త వహించాలి. తాము కుడా మనుషులమే, తమకు స్వంత వ్వక్తిత్వం, అభిప్రాయాలూ ఉంటాయి అని, తమ గురించి తామే బాధ్యత వహించగలం అనే చైతన్యం ను పెంచుకుని, ఆత్మగౌరవం తో తమ హక్కుల కొరకు, ఈ సమాజం లో గౌరవప్రదం ఐన జీవితం కొరకు పోరాటం చేయాలి అని కోరుకుంటూ, ఇంతసేపు చదివిన మీకు అందరికి ధన్యవాదములు. మీరు మీ అభిప్రాయాలను పంచుకొని, ఈ చర్చను ముందుకు తీసుకొని పోతారని ఆశిస్తున్నాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి