12, సెప్టెంబర్ 2021, ఆదివారం

వేదుల మీనాక్షీ దేవి కథలు

విస్మృత కథారచయిత్రి – వేదుల మీనాక్షీదేవి శీలా సుభద్రాదేవి Posted on December 8, 2020 by భూమిక ఆధునిక సాహిత్యరంగంలో స్వాతంత్య్రానంతరం అధిక సంఖ్యలోనే మహిళలు సాహిత్య రంగంలోకి వచ్చారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే దానికి సమాంతరంగా స్త్రీ విద్యపై కూడా మహిళలు కొంత ఉద్యమస్ఫూర్తితో రచనలు చేయటం కావచ్చు, స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు కావటం వలన కావచ్చు, సాంస్కృతికంగా, ఆర్థికపరంగా వెసులుబాటుగల కుటుంబాలలోని స్త్రీలకు విద్యావంతులయ్యే అవకాశం లభించింది. విద్యతోపాటుగా సాహిత్యంతో అనుబంధం గల కుటుంబంలోని ఆడపిల్లలకు తెలుగు, సంస్కృత గ్రంథపఠనం చేయించటం వలన కూడా ఆనాటి సామాజికంగా ఉన్నతస్థాయి కుటుంబ స్త్రీలు సాహిత్య రచనారంగంవైపు దృష్టి సారించారు. అయితే రచనా రంగంలోకి వచ్చిన వారందరూ గుర్తింపు పొందే అవకాశం కూడా లభించలేదు. అందుకు కొంత కారణం రచనలు చేయడమైతే చేస్తున్నారు కానీ కుటుంబ భారం వలన కావచ్చు, ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోవచ్చు, కుటుంబ ప్రోత్సాహం దొరకక కావచ్చు, గ్రంథస్తం కాకుండా మరుగున పడినవి కూడా ఎక్కువే. విస్తృతంగా కథలు రాసిన వాళ్ళు సైతం కాలక్రమేణా సాహిత్య చరిత్రలో అనామకంగా మిగిలిపోయారు. ఆ విధంగా విస్మృతులైన రచయిత్రులను గురించి ఏ విధమైన సమాచారమూ లభించే అవకాశం లేకపోవడం శోచనీయం. ఆ విధంగా మరుగునపడిన రచయిత్రులలో వేదుల మీనాక్షీదేవి ఒకరు… ఆమె కాకినాడలో 27 జూన్‌, 1917లో జన్మించినట్లు తెలుస్తోంది. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి మనవరాలు కావటాన బాల్యం నుండి సంస్కృతాంధ్ర రచనలు బాగా చదివారు. భర్త ఉద్యోగరీత్యా రాజమండ్రిలో నివసించారు. సభావేదిక, అష్టమహిషీ కళ్యాణం, రాగరేఖలు వీరి రచనలు. నలభైకి పైగా కథలు కథానిలయంలో లభ్యమైనప్పుడు అన్ని కథలు రాసినా వేదుల మీనాక్షీదేవి కథలు ఏ సంకలనంలోనూ చోటుచేసుకోకపోవడం, ఏ సందర్భంలోనూ సాహిత్యంలో ఆమె ప్రస్తావన కనిపించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. 1968లో కె.రామలక్ష్మిగారు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కొరకు పొందుపరచిన ‘రచయిత్రుల సమాచార సూచిక’లో లభ్యమైన అతి తక్కువ వివరాలను బట్టి 1933 నుండి మీనాక్షీదేవి రచనలు చేసేవారని తెలుస్తోంది. కానీ కథానిలయంలో లభ్యమైన కథలను బట్టి 1950 సంవత్సరంలో గృహలక్ష్మి పత్రికలో ప్రచురితమైన ‘దినదినగండం’ కథతో ఆధునిక కథారచనకు స్వీకారం చుట్టారని భావించాలి. 1950 నుండి 1983 వరకు విస్తృతంగా కథలు రాశారు. మరీ ముఖ్యంగా యాభయ్యవ దశకంలో ఎక్కువగా అన్ని పత్రికలలోను మీనాక్షీదేవి కథలు ప్రచురితమయ్యాయి. తర్వాత బహుశా కుటుంబ బాధ్యతల వలన రచనలు చేయటం తగ్గినా, తిరిగి డెబ్బయ్యవ దశకంలో ఎక్కువగా రాశారు. యాభయ్యవ దశకం నాటికి కుటుంబ నియంత్రణ అమలు లేకపోవడం వలన మీనాక్షీదేవి రాసిన కుటుంబ కథల్లో చాలావాటిలో అయిదు మందికి తక్కువ కాకుండా బహుసంతానం, చిరుద్యోగాలు, ఆర్థిక ఇబ్బందుల వలన లోటు బడ్జెటులతో అవస్థలు, పొదుపుగా సంసారాలు చేసుకునే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగినులైన స్త్రీ పాత్రలు గల కథలు చాలా తక్కువ. అంతమాత్రాన కేవలం కుటుంబ కథలు మాత్రమే రాయలేదు. కుటుంబాల చుట్టూ ఆవరించుకున్న సామాజిక పరిస్థితులు, ఆర్థిక రాజకీయాలూ, సమాజంలో ఎదురయ్యే భిన్న ప్రవృత్తుల మానవదృక్పథాల్ని గురించిన కథలూ ఎక్కువగానే ఉన్నాయి. చదువూ, విద్యార్థులూ, పరీక్షా విధానాల గురించిన కథలు కూడా చాలానే ఉన్నాయి. వేదుల మీనాక్షీదేవి కథలు రాసిన కాలంలో స్వాతంత్య్రానంతర యుద్ధ పరిస్థితుల వలన కరువు కాటకాలు ఏర్పడడం, పనులు తక్కువై, నిరుద్యోగ పరిస్థితుల వలన దొంగతనాలు పెరగడం, గుడులూ, బడులూ కడతామనో, పిల్లకి పెళ్ళి చేయాలనో చందాల పేరిట అడుక్కునే ఘరానా దొంగల మోసాల మీద కథలు రాశారు. ప్రజలలోని మూక మనస్తత్వాన్ని గురించి మొదలుపెట్టిన రచయిత్రి వాస్తవాన్ని తెలియజేసే సంస్కారానికీ, కృత్రిమమైన నాగరికతకూ గల వైరుధ్యాలను వివరిస్తూనే, డబ్బూ హోదా వలన మనిషిలో పెరిగే అహం బాల్యస్నేహితులలో సైతం ఏ విధంగా మానసిక దూరాన్ని పెంచుతాయో తెలియజేసిన కథ ‘నీ ఋణం తీర్చుకోలేను’ (1968). ఎన్నో ఏళ్ళ తర్వాత బాల్యస్నేహితురాలు అరవిందను కలుసుకోవడానికి వెళ్ళిన విశాలకు డబ్బు తెచ్చిన అహంతో అరవింద, తన పిల్లలకు నేర్పుతున్న నాగరికత ఏ విధంగా సంస్కారాలను అవహేళన చేసేలా ఉందో తెలుసుకుని బాధ కలుగుతుంది. తానున్న రెండు, మూడు రోజులైనా పిల్లలకి ప్రాచీన గ్రంథాలలోని మంచి విషయాలు నేర్పబోయి తిరస్కారానికి గురవుతుంది. చివరికి వారిని అసహాయంగా చూసి జాలిపడుతూ తిరుగు ప్రయాణం కడుతుంది. ఈ కథలో విశాల పాత్రతో అనేక ప్రాచీన కావ్య విశేషాల్ని అపురూపమైన విధంగా, పిల్లలకు అర్థమయ్యేలా రచయిత్రి చెప్పించడం మీనాక్షీదేవికి ప్రాచీన కావ్యాలైన పెద్దన మనుచరిత్ర, శ్రీనాధుని కాశీఖండం వంటి గ్రంథాల పట్ల గల అభినివేశం స్పష్టమౌతుంది. ఎలా అయినా కొడుకుని ఎమ్మే చదివించాలనే ఆశయంతో రాత్రీ పగలూ ట్యూషన్లు చెప్పి, షాపుల్లో లెక్కలు రాసి కష్టపడిన తండ్రి తన కోర్కె తీరకుండానే పరీక్షలకు ముందు చనిపోతాడు. పరీక్ష హాలులో కూర్చొని తండ్రి తన కోసం పడిన కష్టాల్ని తలపోసి కన్నీళ్ళ పర్యంతమైన కొడుకు పరీక్ష రాయలేక ఖాళీ పేపరు ఇచ్చేస్తాడు. చదువుకునే అవకాశాలు లేని తండ్రికి కొడుకునైనా చదివించాలనే తపన, నిజాయితీగా బతికే చిరుద్యోగి ఆర్థిక పరిస్థితుల జీవన చిత్రాన్ని రచయిత్రి 1952లో రాసిన ‘బ్లాంక్‌ పేపర్‌’ కథలో చూపుతారు. ఢిల్లీ ప్రాంతంలో మహేంద్రగడ్‌ పరిసరాల్లో ‘బాలచరిత్ర నిర్మాణ్‌’ అనే ఆదర్శ సంస్థను చూసి, ఆ సంస్థ పాటించే పద్ధతులూ, ఆదర్శాలూ, అక్కడి విద్యార్థులనూ గమనించారు రచయిత్రి. ‘ఆచరించు, ఆలోచించు, ప్రచారం చేయి’ అనే సిద్ధాంతంతో పనిచేసే ఆ సంస్థ స్థాపకుడు విశ్వనాథ్‌ కనోడియా యొక్క స్వప్న సంస్థను చూసి ప్రభావితురాలైన రచయిత్రి మీనాక్షీదేవి రాసిన కథ ‘జాతీయం’. ఇది 1955లో ‘గృహలక్ష్మి’ పత్రికలో ప్రచురితమైంది. ఉద్యోగాలు సమకూర్చలేని ప్రభుత్వాలను నిందిస్తూ కూర్చోకుండా విద్యావంతుడైన రాజారాం ఏ విధంగా గ్రామప్రజల్ని జాగృతపరచి పాఠశాలని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాడో తెలియచేస్తుంది. పాఠశాల ప్రారంభోత్సవానికి రావటానికి తిరస్కరించిన ప్రభుత్వ ప్రతినిధులు ఆ పాఠశాల క్రమక్రమంగా అభివృద్ధి పొందిన తర్వాత ఆ పాఠశాలకు దాతల ద్వారా వస్తోన్న ఆదాయం తెలుసుకుని, ఆ పాఠశాల పురోభివృద్ధికి తామే కారకులుగా ప్రచారం చేసుకుని, దాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం కొసమెరుపు. ‘గృహలక్ష్మి’ స్త్రీల పత్రిక కదా ఏవో వంటింటి కథలే ఉంటాయేమో అనుకునేవారికి ప్రభుత్వ వైఫల్యాల్నీ, రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల్నీ ఎండగడుతూ చెప్పిన కథలూ, సమాజ దర్పణాలుగా ఉండే కథలూ ఉంటాయనేది ఈ కథని బట్టి తెలుసుకోవచ్చు. చిరుద్యోగి అయిన మూర్తి పెద్ద సంసారాన్ని నడపలేక ఒత్తిడికి గురై దాని నుండి తట్టుకోలేక తాగుబోతవుతాడు. అతన్ని చూసి బాధపడిన స్నేహితుడు డాక్టర్‌ మధు సైకియాట్రిక్‌ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ‘లాటరీ’లో లక్ష రూపాయలు వస్తే ఏం చేస్తావో ఆలోచించి చెప్పమంటాడు. మెదడుకి తీరకలేని పని కల్పిస్తే తాగుడు మీద మనసు పోదని అనుకుంటాడు. కానీ ‘లాటరీ’ వచ్చిన భ్రమలోకి వెళ్ళిపోయి రాత్రీ పగలూ లెక్కలు వేస్తూ పూర్తిగా అనారోగ్యం పాలై మరణిస్తాడు మూర్తి. తాను చెప్పినది వికటించినందుకు దుఃఖపడతాడు స్నేహితుడు మధు. స్థూలంగా కథ ఇదే కానీ ఇందులో బహు కుటుంబీకుడు ఆర్థిక ఒత్తిడికి గురైన విధమూ, బీదవారి పాలిట లాటరీలు కల్పవృక్షంలా భ్రమ కల్పించి జీవితాల్ని మరింత ఛిద్రం చేయటం మరో పార్శ్వంగా చిత్రించారు రచయిత్రి. 1955 నాటికి ‘గృహలక్ష్మి’లో ప్రచురితమైన ‘జగమెరిగిన త్యాగి’ స్వలాభాపేక్ష లేకుండా పరోపకారిగా క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ, స్వాతంత్య్రోద్యమంలోనూ నిస్వార్థంగా పనిచేసే రంగయ్య తాత కథ. మనోవాక్కాయ కర్మలా అవసరమున్న వారికి సేవ చేయటం, మశూచికం వంటి భయంకర వ్యాధిగ్రస్తులకు సైతం సేవ చేస్తూ ఉండటమే కాకుండా జబ్బులు ఎవరికైనా రావచ్చుననే సందేశంతో పనిచేసే వ్యక్తి రంగయ్య తాత. తన భార్య పోయినప్పుడు తనకు మాత్రమే లోటు అని భావించిన వ్యక్తి, గాంధీ మహాత్ముడు మరణం మాత్రం దేశానికే లోటని కన్నీరు మున్నీరవుతాడు. ఆంధ్రరాష్ట్రం సిద్ధించినప్పుడు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణకు నీరాజనాలిస్తాడు. సరిహద్దు గాంధీ మొదలైన వారి సేవానిరతి గురించి నలుగురికీ తెలియచేస్తాడు. ఈ విధంగా ప్రభుత్వం గుర్తించని ఒక త్యాగమూర్తి గురించి రచయిత్రి చెప్పిన ఈ కథలో దేశ చరిత్రలోని మూలఘట్టాలను స్పృశిస్తూ, ఆనాటి ప్రజల మనస్తత్వాలను, తర్వాత్తర్వాత మారిపోయిన సమాజపు తీరుతెన్నులను సాదృశ్యం చేస్తూ చెప్పిన కథ. మీనాక్షీదేవి రాసిన ‘మరలరాని మమత’ (1965) కథ గుర్తించదగిన వాటిలో ఒకటి. మనవసేవే మాధవసేవ అని భావించే సత్యానందం అనాధాశ్రమంలో పెరిగిన రాజేశ్వరిని వివాహం చేసుకుని ఒక సేవా సంస్థ స్థాపించి భార్యతో, మిత్రులతో కలిసి సమాజసేవ చేస్తుంటాడు. కొడుకు పుట్టాక కూడా భార్యాభర్తలిద్దరూ అనాధలు, అభాగ్యులకు సంస్థ ద్వారా విద్య, ఉపాధికి సహాయ సహకారాలందిస్తుంటారు. ఒకసారి అకస్మాత్తుగా ఇల్లు విడిచి వెళ్ళిపోయిన సత్యానందం సన్యాసిగా తిరిగివచ్చి ఆ సంస్థలోనే మఠం ఏర్పాటు చేసుకుంటాడు. రాజేశ్వరి ఒంటరిగా కొడుకుని పెంచి సంస్థ సహకారంతోనే చదివిస్తుంది. తననీ, కొడుకునీ అనాథల్ని చేయవద్దని భర్తను వేడుకున్నా అతను ఆమె మాటలను తిరస్కరిస్తాడు. ‘ముక్కు మూసుకుని మోక్షం కోసం సన్యసించిన వ్యక్తికి రెండు ప్రాణాల్ని గాలికి వదిలేస్తే మోక్షం వస్తుందా?’ అని ప్రశ్నించిన రాజేశ్వరి ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం పాఠకులను ఆలోచింపచేస్తుంది. కాలేజీలో డిగ్రీ చదువుకుని స్కాలర్‌షిప్‌ కోసం ప్రయత్నిస్తే తండ్రిగా సత్యానందం నుండి ఉత్తరం ఇవ్వాలి అని అడిగితే సత్యానందం అంగీకరించడు. భార్యా పిల్లలు అక్కరలేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అని భార్య నిలదీస్తుంది. ఆఖరుకి కాలేజీవాళ్ళే స్కాలర్‌షిప్‌కు అంగీకరిస్తారు. ఈ కథలో యశోధరని, రాహులుడిని, వదిలివెళ్ళిన సిద్ధార్థుడితో రచయిత్రి పోల్చిన విధం చదివినప్పుడు సిద్దార్ధుడిపైన కూడా నిందాగర్భితంగా ఉండడం బుద్ధుడి మీద రచయిత్రికి గల నిరసన వ్యక్తమవుతుంది. రచయిత్రి రచనలలో సందర్భోచితంగా ఆంధ్రాంగ్ల భాషా రచనలోని ఆయా విశేషాలతో పాటు బెర్నార్డ్‌ షా, క్రానిన్‌, వేల్స్‌ వంటి ఆంగ్ల కవులను ఉటంకించి తన అభిప్రాయ ప్రకటన చేస్తుండటం చదివినప్పుడు పాఠకలకు మీనాక్షీదేవికి గల సారస్వతాభిరుచి, భాషమీద గల పట్టు తెలుస్తుంది. తాను చెప్పదలచుకున్న దానిని సారూప్యత గల మరో రచనలోని సంఘటనతో పోల్చడం కొన్ని కథలలో గమనించవచ్చు. ఉద్యోగాల వలనా, పెళ్ళిళ్ళై సంసారాలతోనూ దూరమైపోయిన తోబుట్టువులందరూ తల్లి కోరిక మేరకు పుట్టినింటిలో కలవాలనుకుంటారు… ‘ఉత్తమ పురుష’లో రాసిన ‘సంక్రాంతికి సంకెళ్ళు’ (1958) కథలో. ఆ సందర్భంలో కథానాయిక తమ్ముడు ‘సంకెళ్ళు వదిలించుకొని అందరూ రావాలి’ అంటాడు. తన కూతురు అల్లుడు పండగకి వస్తుంటే తాను పుట్టింటికి వెళ్ళడం ఎట్లా అని బాధపడుతుంది. అంతేకాక మిగతా పిల్లలు, భర్త అందరూ కలిసి వెళ్ళడానికి ఇబ్బందే. ఆ ఆలోచనతో సతమతమవుతున్న భార్యకి పిల్లల్ని తాను చూసుకుంటానని, చిన్నపిల్లను తీసుకెళ్ళమని ప్రోత్సహిస్తాడు భర్త. భోగి రోజు ఉదయమే వెళ్ళి మర్నాడు చీకటినే తిరిగి వచ్చేయాలనుకొని బయల్దేరుతుంది. తోబుట్టువుల కుటుంబాలతో ఎంతటి ఆత్మీయతలు పంచుకున్నా, తల్లి ప్రేమ మనసును కట్టేస్తున్నా, భర్తనీ పిల్లల్నీ వదిలి వచ్చినందుకు బాధపడుతుంది. దానికి తోడు చుట్టుపక్కల బంధువులు పలకరించడానికి వచ్చి ‘కూతురూ అల్లుడూ వస్తుంటే, పిల్లల్నీ, భర్తనూ వదిలేసి పుట్టింటికి ఎలా వచ్చేసిందో’ అని గుసగుసలు పోవడమే కాకుండా, దారిలో బస్సు ప్రయాణంలో కూడా పక్కన కూర్చున్న ఆమె కూడా అదే మాట అని బుగ్గలు నొక్కుకోవడం గుర్తుకువస్తుంది. మర్నాడు ఉదయం బయల్దేరదామనుకున్నది మరదలు కట్టి ఇచ్చిన తినుబండారాలు మోసుకుని రాత్రికి రాత్రే తిరుగు ప్రయాణమై బస్సు దిగాక ఆ రాత్రిలో రిక్షా దొరకక అవస్థ పడుతుంది. తెల్లవారుఝామున భర్త ‘బస్సుకు తొందరగా బయల్దేరాలి లేచి తయారవ్వమని’ లేపడంతో మెలకువ వస్తుంది. అదంతా కలే కదా అని నిట్టూరుస్తుంది. ఇంతమందిని వదిలి నేనెక్కడికి పోతాననీ, పెళ్ళయ్యాక స్త్రీకి అన్నీ బంధనాలే అనుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ కథలో సంక్రాంతి పండుగ తోబుట్టువులతో కలిసి జరుపుకునే సంబరాలూ, ఆత్మీయ మానవ సంబంధాలూ, పిల్లల ఆటలూ వీటన్నింటితో పాటు స్త్రీలకు గల కుటుంబ బాధ్యతలు, బరువులు ఎంతగా జీవితంతో పెనవేసుకుంటాయో, వాటినుండి విడిపించుకుని బతకాలన్నా బతకలేనితనం కథంటతా పరుచుకుని ఉంటుంది. మరొక తమాషా ఏమిటంటే ఇవే పాత్రలతో దీనికి ముందు కథలా మరొకటి కూడా రాశారు రచయిత్రి. మీనాక్షీదేవి కథల్లో మరొక విశేషం రెండు కథలు ఒకదానికొకటి కొనసాగింపులా, ఒకే కథాంశంతో భిన్న దృక్కోణాలలో నడిపించడం చాలా కథల్లో గమనించవచ్చు. రచయిత్రి రాస్తున్న ‘మానివేసిన కత’ (1958) కథలోంచి పాత్ర వచ్చి తన పాత్ర ఎలా ఉండాలో చెప్తూ, ‘పాశ్చాత్య పోకడలు మన సాహిత్యానికి పనికిరాదనీ, అస్వాభావికమైన ఇలాంటి కథలు రాయకపోతేనేం?’ అని రచయిత్రిని దబాయించటం ఉంటుంది. ఆ కోవలోనే సమకాలీన కథలు ఎలా ఉన్నాయో, అవకాశం కోసమని నిజాయితీ లేకుండా రచనలు చేస్తున్న విధానాన్ని ఇలా సాహిత్య సృజన గురించి కథలోని పాత్ర వచ్చి చర్చించినట్లుగా రాసినా అవన్నీ సమకాలీన సాహిత్యం మీద రచయిత్రికి గల అభిప్రాయాలుగానే గుర్తించాలి. అరవైఏళ్ళ కిందటి కథలో ఆనాటి సాహిత్యంలో అవకాశవాద సాహితీవేత్తల గురించి చెప్పినా ఆ మాటలు నేటికి కూడా అన్వయిస్తాయంటే రచయిత్రికి గల క్రాంతదర్శిత్వం అర్థమవుతోంది. ఈ కథ రాస్తూ రాస్తూ నిద్రపోయిన రచయిత్రి కలలో కథంతా జరిగినట్లుగా, కళ్ళు తెరిచేసరికి పిల్లలు రచయిత్రి రాసిన కథా కాగితాలను పడవలు చేసుకుంటూ కేకలు వేస్తుంటే మెలకువ వచ్చినట్లుగా ముగిస్తారు ‘మానివేసిన కథ’ (1952)ని మీనాక్షీదేవి. ఇంచుమించుగా కథ రాయటం గురించే రాసిన మరో కథ ‘మంచికథ’ (1955). రచయిత్రికి కథా నిర్మాణం, కథన పద్ధతిలోని ప్రత్యేకతని పట్టి చూపే మరో కథ ‘కాలాతీత వ్యక్తి’ (1955). హాస్టల్‌లో చదువుతోన్న పార్వతీశం కోసం ఎవరో వచ్చారంటే, పరీక్షల కోసం దీక్షగా చదువుతోన్న పార్వతీశం విసుక్కుంటూనే వెళ్తాడు. తిరిగి వచ్చాక ఎవరితోనూ మాట్లాడకుండా మౌనిలా ఉండిపోతాడు. వచ్చినతను ఏమైనా విషాదవార్త మోసుకొచ్చాడేమోనని ఇతర విద్యార్థులు అడిగినా సమాధానం ఇవ్వడు. మర్నాడు పరీక్ష కష్టంగా ఉందని విద్యార్థులంతా బాధపడుతుంటే పార్వతీశం వంచిన తల ఎత్తకుండా పరీక్ష రాసి ‘తేలిగ్గా ఉంద’ని అంటాడు. తర్వాతి రోజు వార్తాపత్రికలో పిచ్చాసుపత్రి నుంచి ఒక వ్యక్తి పారిపోయాడని, అంతకుముందు అతను కాలేజీలో పనిచేసి, విద్యార్థులు చేసిన ఘోర అవమానంతో మతి చలించిన వ్యక్తి అనీ, పరీక్షలో వస్తాయంటూ అందరికీ ప్రశ్నలు చెప్తుంటాడనీ, ఆ వ్యక్తిని వర్ణిస్తూ వార్త వస్తుంది. ఆ వర్ణనతో సరిపోలిన వ్యక్తే తనను కలిసి ప్రశ్నలు చెప్పడం, సరిగ్గా పరీక్షలో అవే ప్రశ్నలు రావటం గుర్తుకువచ్చి పార్వతీశం నివ్వెరపోతాడు. ఇదే కథని ప్రారంభం నుండి పార్వతీశం చుట్టూ నడిపి, హాస్టల్లో విద్యార్థుల అల్లరి, పరీక్ష వాతావరణాన్నీ వివరిస్తూ పాఠకులను కథలోకి మమేకం చేస్తూ చెప్పడంలో రచయిత్రికి కథన నిర్మాణం పట్ల గల ఖచ్చితత్వం తెలుస్తుంది. ముగ్గురు కొడుకుల తర్వాత పుట్టిన జానకికి వివాహం చేయాలని పన్నెండో ఏట నుండీ ప్రయత్నించిన తండ్రి, ఏవో అవాంతరాలతో, ఫస్టున పాసవుతున్న కూతురి చదువుని ఎమ్మే వరకూ కొనసాగించే ఇతివృత్తంతో సాగిన కథలో స్త్రీల వివాహ సమస్య ఆనాటి సమాజంలో ఎన్ని విధాలుగా రూపాంతరం చెందుతోందో, జీవితంలో ఎదురీదుతున్న స్త్రీలను అసహాయులుగా చేయటానికి ఎలాంటి అభాండాలకు, అవమానాలకు గురిచేస్తోందో తెలియచెప్పే కథ ‘ఎదురీత’. ఒక సందర్భంలో తండ్రి ”ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా స్త్రీ పట్ల గౌరవం చూపించలేకపోతుంది సంఘం. బాహ్యమైన నాగరికతలో జాతి ఎంత పురోగమించినా సంఘం స్త్రీల పట్ల మానసికంగా వీసమెత్తు ప్రగతిని చూపలేకపోతోంది” అని అంటాడు. ఈ మాట నేటికీ వర్తిస్తుంది. ఇది ఆ పాత్ర అభిప్రాయం మాత్రమే కాదు, మీనాక్షీదేవి అభిప్రాయం కూడా. ”మతాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం అయిదు వేలు ప్రోత్సాహకంగా ఇస్తుందనీ, డబ్బు అవసరం మన ఇద్దరికీ ఉంది కనుక రిజిస్టర్‌ ఆఫీసులో పెళ్ళి చేసుకుని ఆ డబ్బును చెరిసగం పంచుకుని, ఎవరింట్లో వారు ఉండి ఏడాది దాటాక విడాకులు తీసుకుందామని” రామశాస్త్రి తన సహోద్యోగి మేరీని అడుగుతాడు. అత్యవసర స్థితిలో ఉన్న మేరీ అందుకు అంగీకరిస్తుంది. ఏడాది అయ్యాక ”ఒకసారి వివాహం అయ్యాక తెంచుకుపోలేను” అని మేరీ కోర్టుకు రావడానికి ఇష్టపడదు. ఆర్థికావసరాలు ఎటువంటి ‘వంచన’కైనా పురిగొల్పుతాయని తెలియజేసే కథ ఇది. తరాల అంతరాలలో తల్లికి ఏమీ తెలియదు అనే భావాన్ని ప్రకటించే పిల్లల తీరుకి చిన్నబుచ్చుకునే తల్లి ఆవేదన ”ఔటాఫ్‌ డేట్‌” కథ. ఇదే అంశంలో నేటికీ చాలా కథలు వస్తూనే ఉన్నాయి. డబ్బు వెనక పరిగెత్తే స్వభావాన్ని పెంచుకుంటే అది ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో తెలిపే కథ ‘ఆర్జన’. కొడుకుల చదువుకి అప్పిచ్చానని ప్రోనోటు రాయించుకునే తండ్రులు ఉంటారా అంటే ఉండొచ్చు. ఖర్చు పెట్టిన దాన్ని కొడుకు పెళ్ళిలో కట్నంగా రాబట్టడానికి ఎత్తుగా రాసిన కథ ‘కన్నబిడ్డల చదువుకు మధువు’. బ్యాంకు ఉద్యోగి చెక్కు నుండి వస్తున్న ‘కునేగా’ పరిమళానికి పరవశించి ఆ చెక్కు తాలూకు వ్యక్తిని గురించి ఊహించుకొని భంగపడిన కథ ‘కునేగా’. వంద ఏళ్ళకు ముందు జన్మించిన వేదుల మీనాక్షీదేవి కథలలో ఉన్న ఆధునిక భావజాలం, స్త్రీల కుటుంబ జీవితాల పట్ల స్పష్టమైన అవగాహన, విద్యావిధానం పట్ల గల చింతన, సమాజ కౌటుంబిక జీవనంలో మారాల్సిన దృక్కోణం మొదలైనవి రచయిత్రికి గల నిబద్ధతను తెలియచేస్తుంది. మీనాక్షీదేవి కథల్లో మూడొంతులకు పైగా ఈనాడు చదివినా నేటి సమాజానికీ సమకాలీన కథల్లాగే పాఠకులను ఆకర్షిస్తాయి. అంతేకాదు ఈ రచయిత్రి రాసిన కథాంశాలతో ఏవో చిన్న చిన్న మార్పులతో ఇప్పటికీ కథలు వస్తూనే ఉన్నాయంటే రచయిత్రి సృజనాశక్తిని గుర్తించాల్సిందే కదా! కానీ నేటితరం పాఠకుల విమర్శకులకే కాదు సాహితీరంగంలో ఉన్నవారికి కూడా తెలియకుండా మిగిలిపోయిన విస్మృత రచయిత్రి వేదుల మీనాక్షీదేవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి