8, సెప్టెంబర్ 2024, ఆదివారం
నడక దారిలో -44
నడక దారిలో -44
వేసవి సెలవుల్లోనే వీర్రాజుగారి అరవయ్యేళ్ళ పుట్టిన రోజు వచ్చింది.అప్పటికి నాకు ఆపరేషన్ అయ్యి నెల కూడా దాటలేదు.అందుకని హడావుడి ఏమీ చేయకుండా వీర్రాజుగారి బాల్యమిత్రుడు సత్యనారాయణగారి కుటుంబం,కుటుంబమిత్రులు శంకరంగారి కుటుంబం, వీర్రాజుగారి తమ్ముళ్ళ కుటుంబాల్ని సాయంత్రం పిలిచి ఉపాహారాలతో జరిపాం.పక్కింటిలోని పోలాప్రగడ దంపతులు కూడా వచ్చారు.అంతకుముందు ప్రక్కఇంటిలో వుండే విఠల్ రావుగారి కుటుంబం వచ్చారు వాళ్ళ అబ్బాయి రఘు కేక్ తీసుకొచ్చి వీర్రాజుగారిచే కట్ చేయించాడు.పల్లవి అట్ట మీద 60 అనే సంఖ్యని ఎంబ్రాయిడరీ తో ఫోటో ఫ్రేమ్ చేసి మా ఫొటోలను అందులో పెట్టి పోష్టు ద్వారా పంపింది.వీర్రాజుగారు అది చూసి మురిసిపోయి అందరికీ చూపించేవారు.
మా పెద్దక్కకు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదని తెలిసింది.నేను కొంత కంగారు పడ్డాను.విజయనగరం వెళ్తే బాగుణ్ణు అని అనుకున్నాను.కానీ చిన్నక్క తనఉత్తరంలో 'వైద్యం మొదలైందని కాస్త నెమ్మదిగా ఆరోగ్యం కుదుట పడుతోంద'ని రాసాక మరి ఆలోచన మానుకున్నాను.
స్కూల్ తెరిచే నాటికి ఆపరేషనై మూడు నెలలు దాటటంతో కొంత కోలుకున్నాను.మళ్ళా పనుల్లో పడ్డాను.
పెద్దమరిది చనిపోయాక ఆ కుటుంబ బాధ్యతలు నాకు మరీ పెరిగాయి.పెద్దమ్మాయి ఏదో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది.సర్వే ఆఫ్ ఇండియాలో సర్వీసులో వుండగానే అతను పోయినందుకు కారుణ్య నియామకంగా ఆ అమ్మాయికి అందులో ఉద్యోగం కోసం అందులో పనిచేస్తున్న తెలిసిన వారికి చెప్పాము.రెండో అమ్మాయి ఇంటర్ పూర్తిచేసి మా స్కూల్ కి దగ్గరగా విద్యానగర్ లోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చేరింది.ప్రతీ నెలా నేను వెళ్ళి ఫీజు కట్టి వచ్చేదాన్ని.
ఇక రాజకీయాలు దగ్గరకు వస్తే--
ఈసారి 1998లో లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇతరపార్టీలతో కల్సి జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA)గా అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రిగా ఉంటున్నప్పుడే జయలలిత ఎన్.డి.ఏ.కి మద్దతును ఉపసంహరించుకోవటంతో లోక్‌సభలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆశ్చర్యకరంగా విశ్వాసం కోల్పోయి ప్రభుత్వం కుప్పకూలింది.
కానీ కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన మరో సంచలనఆవిష్కరణగా చెప్పుకోవాల్సిన విశేషం 1998లో రాజస్థాన్ లోని పోఖ్రాన్లో 5 అణుపరీక్షలు జరిపి భారతదేశానికి అనధికార అణు హోదా ప్రతిపత్తిని కల్పించటం. అంతేకాకుండా కార్గిల్ పోరాటంలో పాకిస్తాన్ పై పైచేయి సాధించింది. మంచుపర్వతాలలో కూడా శక్తివంచన లేకుండా పోరాడే శక్తి భారత్ కు ఉందని నిరూపించింది. ఇవన్నీ అప్పటి వాజ్ పేయి ప్రభుత్వానికి కలిసివచ్చిన సంఘటనలే అని చెప్పాలి.
అయినా1999 లో తిరిగి ఎన్.డి.ఏ. కూటమి తిరిగి గెలవటంతో వాజ్‌పేయి ముచ్చటగా మూడో సారి ప్రధాన మంత్రి అయ్యారు. ఈ సారి మాత్రం ఎన్.డి.ఏ. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగింది.
మా కుటుంబమిత్రులు కె.కె.మీనన్ గారు సరోగసీ అంశంతో చాలా పరిశోధనాత్మకంగా రాసిన క్రతువు నవల పుస్తకంగా ప్రచురించారు.దానిని తన స్వంత వూరు రామరాజులంక గ్రామంలో ఆవిష్కరణ చేయతలపెట్టారు.ఆ సభలో పాల్గొనటానికి జ్వాలాముఖిగారూ,నాళేశ్వరం శంకరంగారూ, వీర్రాజుగారూ,నేనూ, మీనన్ గారితో పాటూ బయలుదేరాం.రైలు ఎక్కి సఖినేటిపల్లి లో దిగి అక్కడి పడవ ఎక్కి ఆ గ్రామం చేరాము.ఆ రోజే పుస్తకావిష్కరణ జరిగింది.జ్వాలాముఖిగారూ,శంకరంగారూ క్రతువు పుస్తకం గురించి కూలంకుషంగా జనరంజకంగా ప్రసంగించారు.వీర్రాజుగారు ఆవిష్కర్త కనుక ఎప్పటిలాగే మాట్లాడారు.ఆ కార్యక్రమం అనంతరం బస్సెక్కి శంకరగుప్తం బయలుదేరాం.శంకరగుప్తంలో కథక్ మిత్ర పేరుతో కథలు రాసే వేమూరి నరసింహారావుగారి ఇల్లు చేరేసరికే సాయంత్రం అయ్యింది.వేమూరి నరసింహారావుగారి శ్రీమతి ప్రేమతో తయారుచేసిన స్వీటు,మసాలా కాజూ తిని లంకలోనితోటలూచూడటానికీ, తర్వాత సముద్రంవొడ్డుకీ బయలుదేరాం.
లంకగ్రామమైన శంకరగుప్తం ఇరవై ఏళ్ళక్రితం నా వివాహం అయిన కొత్తలో అన్ని రకాల ప్రయాణసాధనాలు ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది.ఇప్పుడు ONGC కోసం కొత్తగా తోటలమధ్య తారు రోడ్డు పడింది. కరెంట్ కూడా వచ్చింది.వూరుకూడా మార్పు చెందింది.పొలాలన్నీ చేపల చెరువులు అయిపోయాయి.సముద్రం ఒడ్డుకు వెళ్ళేసరికి ఎక్కడా కూర్చునేందుకు వీలులేకుండా అపరిశుభ్రంగా వుంది.భరించలేని కంపు.అసంతృప్తిగా ఇక ఇంటికి తిరుగుముఖం పట్టాం.
రాత్రి జీడిపప్పు కూర మొదలైన వాటితో మంచిభోజనం చేసి,కాసేపు కబుర్లు చెప్పుకున్నాక మేమంతా కొబ్బరి చెట్లు కిందనే హాయిగా పడుకుంటాం అని అంటే మడత మంచాలు వేసారు.
అయితే శంకరం తప్ప జ్వాలాముఖిగారూ,మీనన్ గారూ ,మేమిద్దరం దోమలకీ,వేడికీ రాత్రంతా జాగారం చేసాం.రెండ్రోజులు ఉందామనుకున్నవాళ్ళం కాస్తా మధ్యాహ్నం భోజనం కాగానే కొవ్వూరులో వున్న మా అక్క కూతురు శ్రీదేవి ఇంటికి హూటాహుటిని బయలుదేరి వెళ్ళిపోయాము.రాత్రిభోజనంచేసి కూలర్,ఫేనూ ఉండేసరికి అందరం మత్తుగా నిద్ర పోయాము.నగరసౌకర్యాలకు మేము ఎంత అలవాటు పడిపోయామో అర్థం అయ్యింది.
ఈ అనుభవం ఆధారంగా అక్కడినుండి వచ్చిన వెంటనే " మార్పు వెనుక మనిషి" కథ రాసాను.ఈకథ బ్రౌన్ అకాడమి వాళ్ళు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందింది. ఆ కథకి ఇంగ్లీషులో కూడా అనువాదం జరిగి సంకలనంలో చేరింది.బ్రౌన్ అకాడమీ వాళ్ళుకూడా బహుమతి కథలు పేరిట సంకలనంగా వేసారు.
ఇంకో విశేషం ఏమంటే తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ తెలుగులో మార్పు వెనుక మనిషి కథని పాఠ్యాంశంగా చేర్చారు.
నా అయిదో కవితా సంపుటి ఒప్పులకుప్ప పుస్తకం ఆ ఏడాది ప్రచురించాము.నిర్మలానందగారి అధ్యక్షతన, కాత్యాయనీ విద్మహేగారు వక్తగా పుస్తక పరిచయం చేసేలా పుస్తకావిష్కరణ ఏర్పాటు చేసాము. అమ్మాయి పల్లవి ఇక్కడ ఉంటుండగానే పుస్తకావిష్కరణ జరిగింది.కాత్యాయనీ విద్మహే పుస్తకాన్ని గురించి చాలా బాగా మాట్లాడటమే కాక అందులోని శేషవస్త్రం,పడుగూపేక కవితలను ప్రత్యేకించి చాలా ఇష్టపడ్డారు.అందుకనే ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఎమ్మే వాళ్ళకు పడుగూ పేక కవితను పాఠ్యాంశంగా పెట్టేలా చేసారు.కొన్నాళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీవారికి కూడా పాఠ్యాంశంగా ఉంది.పలుమార్లు ప్రసంగాలలో కూడా కాత్యాయనీ విద్మహే నా కవిత 'పడుగూ పేక' ని ప్రస్తావించుతూ వుంటారు.
పల్లవి రావటంతో మళ్ళీ ఇంట్లో సందడి వచ్చింది.డిసెంబర్ కనుక నేను దాచుకున్న సెలవులను అప్పుడప్పుడు పెట్టాను.ఇంతకాలం పల్లవి డిపెండెంట్ వీసాతోనే వుంది.త్వరలో తన వీసా మారితే వుద్యోగంలో చేరుతానని చెప్పింది .
అయితే అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో
సహస్రాబ్ది ప్రారంభానికి దారితీసిన
Y2K సమస్య 1990ల చివరనుండే ప్రధాన చర్చనీయాంశంగా ఉండేది. సామాజిక మాధ్యమాలు, వార్తాపత్రికలు ఈ విషయం గురించి చాలా చర్చిస్తూ వుండేవి. రెండు-అంకెల సంవత్సరాలను ఎదుర్కొంటున్న ప్రోగ్రామ్‌లు 1900 మరియు 2000 తేదీల మధ్య తేడాను గుర్తించలేవని కొన్ని సమయాల్లో భయంకరమైన హెచ్చరికలు జనంలో సంచలనం కలిగించాయి.
2000 సంవత్సరాన్ని 1900 నుండి వేరు చేయలేని విధంగా తేదీలను సరిగ్గా గుర్తించలేక పోవటంవలన కంప్యూటర్ సిస్టమ్‌ల అసమర్థత వలన కంప్యూటర్ ఆధారిత పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా కుదేలై పోతాయని ప్రపంచవ్యాప్తంగా అంతటా ప్రచారం ముమ్మరమైంది.
Y2K , 2000 సంవత్సరం తర్వాత తేదీల కోసం క్యాలెండర్ డేటా యొక్క ఫార్మాటింగ్ గురించి పేపర్ల నిండా వ్యాసాలు వచ్చాయి. చాలా మందికి "Y2K భయం" గురించి తెలిసింది.
బ్యాంకులలో డబ్బు Y2K సమస్య వలన డ్రాచేయటం కష్టం అని మరోవైపు పుకార్లతో కొందరు బ్యాంకుల నుండి సొమ్ము డ్రా చేసుకోవటం కూడా మొదలెట్టారు.అయితే మొత్తం మీద ప్రశాంతంగా ఏమాత్రం సంచలనం లేకుండానే కొత్త మిలేనియంలోకి ఉత్సాహంగా అడుగు పెట్టాం.
అజయ్ కూడా వచ్చాక అతనితో పాటు పల్లవి విజయనగరం వెళ్ళి తిరిగి ఇద్దరూ కలిసి యూఎస్ వెళ్ళిపోయారు.మళ్ళీ మా గూటిలో మేమిద్దరం మిగిలి పోయాం.
పల్లవి యూఎస్ వెళ్ళాక న్యూజెర్సీలో కొన్ని నెలల ట్రైనింగ్ అనంతరం అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసింది.ఆ తదనంతరం చికాగోకి వెళ్ళింది.వారాంతంలో మినియాపోలీస్ కి వెళ్ళి మళ్ళా సోమవారం చికాగో వెళ్ళేది.ఒక్కోసారి వారాంతంలో ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళేవారు.ఆటువంటప్పుడు మాకు ఫోన్ చేసే సమయాలు మారిపోతుండేవి.
మినియాపోలీస్ సంవత్సరానికి పది నెలలు మంచుకురిసే ప్రాంతం.అందువలన వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కినా అది లాండ్ కావటానికి వాతావరణం అనుకూలించకపోవటం వలన వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరిగేదని పల్లవి చెప్తుంటే కొంతభాగం కలిగేది. చదువులకో,ఉద్యోగాలకో అక్కడకు వెళ్ళి పిల్లలు సుఖపడుతున్నదేమిటీ? కేవలం డాలర్ల వెనుక పరుగులేనా అనిపించింది.ఉద్యోగాలూ శాస్వతం కాదు ఎప్పుడు అకస్మాత్తుగా పింక్ స్లిప్ ఇస్తారో తెలియదు.అంతటి అభద్రతాభావంతో పిల్లలు అక్కడ బతుకుతున్నారు.గ్రీన్ కార్డుగానీ,సిటిజన్ షిప్ గానీ వచ్చేవరకూ అభద్రతతోనే బతకాలనేది మాకు తెలియవచ్చింది.
పల్లవీ,అజయ్ వచ్చినప్పుడు ఏదో సందర్భంలో " సడెన్ గా ఇండియా వచ్చేయాల్సి వస్తే కనీసం ఇక్కడ ఒక ఇల్లూ, మరో వుద్యోగం దొరికే వరకూ సంవత్సరం పాటూ బ్రతకటానికి బేంక్ బేలన్స్ ఉండాలి అత్తయ్యగారు " అన్నాడు అజయ్.
అందుకని ఏదైనా ఒక అపార్ట్మెంట్ ఉంటే కొంటాము చూడమని చెప్పారు అజయ్,పల్లవీ. ఎలాగూ వుద్యోగం చేస్తుంది కనుక పల్లవి డబ్బుతో కొంటామన్నారు.మంచి ప్రాంతంలో అపార్ట్మెంట్ ఉంటే చూడమని మేమూ కొంతమంది మిత్రులకి చెప్పాము.
ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు వీర్రాజు గారికి అవార్డు ఇస్తున్నామని ఫోను చేసారు.గిరీశం పేరుతో కథలు రాసే ఆర్. విద్యాసాగరరావు గారు,రామవరపు గణేశ్వరరావుగారూ అందులో సభ్యులు.ఆర్ విద్యాసాగరరావు గారు అప్పట్లో కేంద్రజలసంస్థ లో ఉద్యోగం చేసేవారు.తెలంగాణా ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసారు.వీర్రాజుగారితో పాటూ నన్ను కూడా ఆహ్వానించటంతో ఇద్దరం బయలుదేరాము.మొదటిసారి దేశరాజధానిలో అడుగు పెట్టటం కొంత ఉద్వేగం కలిగింది.
ఆర్.విద్యాసాగరరావు గారు హైదరాబాద్ లో వున్నప్పుడు వీర్రాజుగారికి మిత్రులే.అప్పట్లో కొత్తగా కథలు రాస్తున్న గిరీశం( విద్యాసాగరరావు)కథ,నాదీ,చిన్నన్నయ్య మొదలగు
ఒక పదిహేను మంది కథలతో దీపిక అనే సంకలనం కూడా వీర్రాజు గారు కథా సాహితి పబ్లిషింగ్ పేరుతో ప్రచురించారు.అప్పట్లో ఆ పేరుతో మిత్రుల కథల పుస్తకాలు ప్రచురించేవారు.
భండారు దత్తాత్రేయ అధ్వర్యంలో ఆంధ్రా భవన్ లోనే పురస్కారం సమావేశం జరిగింది.తర్వాత ఒక రోజంతా గాంధీ సమాధి, ఎర్రకోట, తాజ్ మహల్ , కుతుబ్ మీనార్ ,బిర్లా టెంపుల్ మొదలైనవి చూసాము.నా జీవితంలో తాజ్ మహల్ చూడగలనా అనుకున్నాను.చాలా ఆనందం కలిగింది.
మాది ఆర్టీసీ హైస్కూల్ కావటాన వాళ్ళు మా స్కూల్ విద్యార్థుల విజ్ఞాన యాత్రల కోసం ఇంచుమించుగా ప్రతీ ఏడాదీ రెండు బస్సులు,నలుగురు డ్రైవర్లతో ఉచితంగా ఇచ్చేవారు.ఆ విధంగా దక్షిణ ప్రాంతాలను చాలా వరకూ నేను చూడగలిగాను.కాని ఉత్తరాది ప్రాంతాలేవీ చూడలేదు.అనుకోకుండా ఢిల్లీ చూడటం
చాలా సంతోషమనిపించింది .
1, సెప్టెంబర్ 2024, ఆదివారం
చాగంటి తులసి రచనల్లో రంగులూ రాగాలూ-
~ చాగంటి తులసి రచనల్లో రంగులూరాగాలూ~
విజయనగరం అనగానే గంటస్తంభం గుర్తొచ్చినట్లు,
మధురవాణో,గిరీశమో ఎదురైనట్లు,నోట్లోచుట్టతో దీర్ఘంగా చూస్తున్న చాసో కనబడినట్లు ఆలోచనల్లోకి ముఖం నిండా ప్రసరించే నవ్వుతో చాగంటి తులసి కూడా వస్తుంది.
ఆమె కొన్నిరచనలు సరదాగా చదువుకునేలా సాధారణ పాఠకుడికి అనిపిస్తాయేమో కాని లోతుగా పరిశీలించినప్పుడు ప్రతీదీ విభిన్నకోణంలో ఆలోచింపజేస్తాయి.
'రంగంటే ఇష్టం" పేరిట సాహితి చింతనలు అనే టాగ్ లైన్ తో ఓనలభై వ్యాసాలతో సంపుటి వెలయించారు తులసి. అందులో తొమ్మిది గురజాడ సాహిత్య చింతనలే. గురుజాడ కవిత్వం గురించి గురజాడ కార్యకారణ సంబంధ జ్ఞానంతో హేతుబద్ధతతో ప్రజల బతుకు గురించి ఆలోచించి జీవిత వాస్తవికతను అవగాహన చేసు కున్నాడంటారు రచయిత్రి. గురజాడ సమకాలీన భారతీయ కథకుల గురించి చెప్పారు. పూర్ణమ్మ కథని ఎత్తుకున్న దగ్గరనుండి. ముగింపు వరకూ ఏకోన్ముఖంగా అనుకున్న అంశాన్ని తీసుకు వెళ్ళడం వలన పూర్ణమ్మ కథాకావ్యాన్ని విశిష్టమైనదిగా ఆలోచన కలిగేటట్లు చేసాడంటారు రచయిత్రి . గురజాడ ప్రతిభావంతుడు కాబట్టి ఆధునిక కధానికా ప్రక్రియను ఆరంభిస్తూనే వాస్తురీత్యా, శిల్ప రీత్యా పరాకాష్ఠకు చేరుకునేలా రాయగలిగాడంటారు. ఆధునిక కావ్యాలైన తృణకంకణం, రామిరెడ్డిగారి నల్లజారమ్మకథ, అబ్బూరివారి మల్లికాంబ, నారాయణబాబు దేశమాత, శ్రీశ్రీ భిక్షువర్షీయసి వంటి అనేక స్త్రీపాత్రలలో గురుజాడ జాడవుందని రచయిత్రి సోదాహరణంగా వివరించారు. కన్యాశుల్కంలో 'ఎత్తడం' పేకాట గురించి, సమాజంలో ఆ ఆట కొనసాగింపు ఆ ఆటకి చెందినవిషయాలన్నీ తెలియజేసారు. తరతమ భేదాలున్నప్పటికీ నిరసనగానో, ధిక్కారంగానో, చాకచక్యంగానో, బుద్ధి కుశలతగానో, చదువూ సంస్కారాల మేళవింపు వలన వచ్చిన తెలివిడిగానో. నిస్సహాయతలోని ఎదురుదాడిగానో, బతుకునేర్పిన విజ్ఞతతో అణిగి మణిగి ఉంటున్నట్టే ఉంటూ సాఫల్యం చేసుకునే కార్యసాధకులుగా గురజాడ రచనలలో స్త్రీల స్వభావాలు ఉంటాయని ఒక పేరా లో గురజాడ సాహిత్యమంతటినీతెలియజేస్తూ ఈ వ్యాసాల్లో విశ్లేషించటం విశేషం.
కారా, చాసో, పతంజలి, రావిశాస్త్రి, ఉప్పల లక్ష్మణరావు ,నారాయణబాబు, రామలక్ష్మి రచనల గురించే కాక అనేక మంది భారతీయ రచయిత్రుల సాహిత్య విశ్లేషణలను సుమారు 350 పేజీల యీ గ్రంథంలో ఆనందంగా చదువుకోవచ్చు .
విశిష్ట చిత్రకారిణి అయిన మహాదేవివర్మ కవితలను అనువదించి , మహాదేవివర్మ వేసిన వర్ణ చిత్రాలతో పాటుగా తెలుగు సాహితీ లోకానికి చాగంటి తులసి పుస్తకంగా వేసారు.
గొప్పదైన ఆత్మ సౌందర్యం, దయాగుణం కల్గిన, సంస్కర్త అయిన మహాదేవివర్మ కవిత్వంలోని మూలభావాల సౌందర్యాన్ని తెలుగులోకి అనువదించటంలో సాఫల్యత సాధించింది తులసి అని డా. బాల గాలిసౌరిరెడ్డి గారు ప్రశంసించారు.తన ముందు మాటలో 'మూలంలోని పదసంయోజనాన్ని అది ఎక్కడెక్కడ సంస్కృత సమంగా ఉందో దాన్నంతా జాగ్రత్తగా అనువదించటంలో సాధారణంగా చాలా అనువాదాలలో కనిపించే శ్రవణ నిష్టూరుత్వం కని పించలేద'నీ ప్రశంసించారు వాడ్రేవు చిన వీరభద్రుడు. అంతేకాక ఒక కవయిత్రి తన కన్నీటితో తుడిచిన వేదన మరకను ఎంతో సున్నితంగా సాహిత్యపిపాసులకు ప్రేమతో అందించారని అన్నారు.
అనువాదం చేయటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మరో భాషలోని కథనైనా కవితనైనా తెలుగు లోనికి అనువాదం చేసేటప్పుడు మూలరచయిత అంతరంగాన్నే కాక మూల రచనలోని ఎసెన్స్ ను కూడా ఆకళింపు చేసుకొని భావస్పోరకంగా అనువదించడం నిజానికి కత్తిమీద సామే.అది చాగంటి తులసి సునాయాసంగా చేయగలరనేది ఆమె ఒరియా భాష నుండి తెలుగు లోనికి అనువదించిన కథలే తార్కాణం.
మహాదేవి వర్మ మూలకవితలను, ఆ వెంటనే తన అనువాదాన్ని రెండింటినీ ప్రచురించి పుస్తకంగా వేశారు చాగంటి తులసి ."మహా కవయిత్రి మహాదేవి వర్మ గీతాలు పేరిట వున్న తెలుగు అనువాద కవితలు కూడా తేలికైన అచ్చతెలుగు పదబంధాలతో వుంటాయి.
"బ్రద్దలు కొట్టు క్షితిజాన్ని
అవలోకిస్తాను నేనూ
అవతలవైపు ఏముందో!
ఎందుకని నన్ను చుట్టబెట్టి
బంధిస్తోంది ప్రాచీరమై
నాశ్వాస ఈవేళ " అంటూ స్వీయకవితలేనేమో అనేలా అనువాదం చేసి తెలుగు పాఠకులకు పరిచయం చేశారు.
ఇంక కథలు దగ్గరకు వస్తే స్త్రీవాదం యింకా వేళ్ళూనక ముందే వచ్చిన 'యాష్ ట్రే (1976) 'కథలో స్త్రీని ఆత్మ గౌరవం , ఉన్నత వ్యక్తిత్వానికి కు అద్దం పడుతూ, సమాజంలో ఆలోచనలో కొత్తగా మార్పుచెందుతోన్న స్త్రీ పాత్రగా మలిచారు.ఈ కథ అనేక సంకలనాలు లో చేరటమే కాకుండా అనేక భాషల్లోకీ అనువాదమైంది.
సమాజం వలయంలో ఇమడలేని వ్యక్తుల బాధ్యతారాహిత్యం, పలాయనబుద్ధిని ‘వలయం‘ కథ చెబుతుంది. మానవసంబంధాల మధ్య డబ్బునిర్వహిస్తున్న పాత్రను విమర్శనాత్మకంగా అనేక కథలలో స్పష్టం చేశారు.ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక సంబంధాల పెత్తనాన్ని స్త్రీ పురుష అసమానత్వాన్ని ,ఆడపిల్లల పెంపకం, చదువు, ఉద్యోగం, పెళ్ళి, ప్రవర్తన మొదలైన అంశాలలో మధ్యతరగతి ఆర్థిక , సామాజిక పరిస్థితుల ప్రభావం, దానిని ధిక్కరించడానికి స్త్రీలు చేసే పోరాటాలు చిన్న దేవేరి,యాష్ ట్రే, వలయం కథలలో గమనించవచ్చు.
అమాయకపు ఆడవాళ్లపై జరిగే మగాళ్ళ దాష్టీకాన్నీ,దానికి వంత పాడే కొందరు ఆడవాళ్ళపాత్రనీ ' ఆడదాయికి నోరుండాల్సిందే', శరణ్యం కథలలో రచయిత్రి అక్షరీకరించారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే ఇటీవల అయిదారు నెలలు క్రితం వరకూ యీ మాట అంతర్జాలంలో రాస్తున్న ఊహల ఊట పేరిట అందించిన బాల్య జ్ణాపకాలు ఇంద్రధనుస్సు మీద విహరించేంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.ఉత్తరాంధ్ర మాండలికసొబగునీ,సుమారు అరవై ఏళ్ళక్రితం ఇళ్ళల్లో వాడిన వస్తు పరిచయం,ఆటలూ,పాటలూ బ్రాహ్మణ కుటుంబాలలోని వ్యావహారిక పెదాలతో కూడిన కబుర్లనీ చదువుతో న్న పాఠకులు కూడా బాల్యపు తొడుగులోనికి దూరిపోయి తులసితో చేయి కలిపి తిరిగిన అనుభూతిని కలిగిస్తాయి.
చివరగా "బతుకు గతుకుల్లో గట్టి దెబ్బ తగిలి నప్పుడు అవి కరిగి బయటకు తేలతాయి. నమ్మిన వాళ్లకు దేవుడు ఒక ఆసరా. ‘‘నాకు నేనే ఆసరా, నాకు నేనే బలం’’ అనుకుంటే, మనసును స్వాధీనపరచుకోగలిగితే, కార్యకారణ సంబంధాలను హేతుబద్ధతతో వివేచించగలిగితే దారి స్పష్టమ వుతుంది." అనే చాగంటి తులసి నవల,కథా, అనువాదం , వ్యాసం యిలా ఏ రచన చేసినా ఆమెదైన శైలీ, దృక్పథం వెల్లడౌతుంది.
(ఈమాట - సెప్టెంబర్ 2023)
చిలకలంచు జరీకోక-నవలాసమీక్ష
~ బడుగు జీవుల కష్టసుఖాల కలనేత -
చిలకలంచు జరీకోక~
ఒక చీర కొనాలని షాపుకి వెళ్తే ముందు చీరలో పడుగు, పేకల నేత చీరంతా ఒకే తీరుగానే వుందా లేకపోతే కొన్ని చోట్ల జాడలు జాడలుగా వచ్చిందా అని పరిశీలిస్తాం. తర్వాత నూలు నాణ్యతను గమనిస్తాం. దుకాణదారుడు చెప్పిన నాణ్యతగల నూలుతోనే చీర నేయబడిందా అని చూస్తాం. ఆ తర్వాతే రంగునూ, రంగుల మేళవింపునూ, డిజైన్ నేయటంలోని పనితనాన్నీ, కొంగులోని అందాల్నీ పట్టి పట్టి చూస్తాం. మనం అనుకుంటున్నట్లుగా ఉండి, ధర సంతృప్తి కలిగిన పిమ్మట చీరని కొనుక్కుంటాం.
అట్లాగే 'చిలకలంచు జరీకోక' మన ముందు పరచి ఒక్కొక్క పొరనే విప్పి చూపుతూ, నూలులోని రకాలు మొదలుకొని, చీర నేయటంలోని కష్టనష్టాల్నీ, గుంతలో కూర్చున చిరుగుపాతలు ధరించి జనం కోసం తన సర్వశక్తులూ సమకూర్చుకొని నేస్తున్న నేతన్నల పనికౌశలాన్నీ, బడుగు శ్రామికుల జీవితాల్లోని చీకటి కోణాల్నీ, కులవృత్తినే నమ్ముకొని ఆర్థిక విధ్వంసాల నడుమ జీవితాన్ని భారంగా వెళ్ళబుచ్చుతోన్న నేత కార్మికుని వెతలను, నేతపరిశ్రమ తీరుతెన్నులను పండు వలచి చూపిన తీరులో యర్రమిల్లి విజయలక్ష్మి తన 'చిలకలంచు జరీకోక'లో చక్కని కథనాన్ని మన ముందు పరిచారు.
నవల ఆసాంతం ప్రధానంగా నేత కుటుంబంలోని పలు జీవనకోణాల్ని తెరిచి చూపటంతో పాటూ, నేత పరిశ్రమలో వాడే నూలు రకాలూ, ఏ రకం నూలుతో ఏ రకం వస్త్రాలు నేస్తారో వంటి సూక్ష్మవిషయాల్ని సైతం తెలిపారు. నేత కొరకు వాడే అనేకానేక పనిముట్లు తయారీలో పాలుపంచుకునే ఇతర ఉత్పత్తి కులాల సహకారం, నేతలో రకాలు, చీరాలనుండి పోచంపల్లి వరకూ మారే విభిన్న నేత డిజైన్ల వివరాలూ, ఆ డిజైన్లు నేయటంలోని సులువు, బులువులు -ఇలా నేత పరిశ్రమ యావత్తూ దారం వడికిన దగ్గరనుండి రాట్నానికి చుట్టటం, 'సరి' పోయటం, పోగులకు గంజి పట్టించే విధానం, ఆసు పోయటం, మగ్గానికి
అమర్చటం, మగ్గంపై చీరగా మారేందుకు గల వివిధ దశలనూ; ఆ క్రమంలో మొత్తం కుటుంబసభ్యులందరూ సామూహికంగా పనిలో పాలుపంచుకోవలసిన పరిస్థితులనూ సవివరంగా, పరిశోధనాత్మకంగా రచయిత్రి సోదాహరణంగా పాఠకుడికి బోధిస్తున్నట్లుగా నడుస్తుందీ నవల.
రచయిత్రి నేత పరిశ్రమ గురించే చెప్తున్నారని పాఠకుడికి అనిపించే సమయానికి చటుక్కున కథలోకి లాక్కొచ్చేస్తారు విజయలక్ష్మి.
నవల సగం వరకూ నేతపరిశ్రమలోని కష్టనష్టాల్నీ, తీరుతెన్నుల్నీ వివరిస్తూ వచ్చిన రచయిత్రి సమయానుకూలంగా ఆర్ధికప్రాతిపదికను బడుగు జీవుల జీవన విధ్వంసాలను ఎన్నింటినో సంఘటనాత్మకంగా కళ్ళముందు దృశ్యమానం చేశారు.
ఆడపిల్లలను రజస్వలానంతరం ఆగిపోయే చదువులు, మగపిల్లాడిని తమలా కాకుండా ఉద్యోగస్తుడిగా చూడాలనుకునే తల్లులు, తమ కలల్ని సాకారం చేసుకోలేని అసహాయత, ఆడపిల్లల పెళ్ళికి కట్నకానుకలు సమకూర్చుకోలేక తల్లిదండ్రులు పడే తాపత్రయం, తల తాకట్టు పెట్టి పెళ్ళి చేసినా ఆగని వరకట్న వేధింపులు, ఆడపిల్లను కన్నందుకు ఎదుర్కొనే నిరసనలు, వరకట్న వేధింపులు, ఆడపిల్లను కన్నందుకు ఎదుర్కొనే నిరసనలు, వరకట్న హత్య, కన్న తల్లిదండ్రుల వృద్ధాప్యం సమస్యలు, ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రుల్ని కూడా అన్నదమ్ములు పంచుకోవాల్సి రావటం - ఇలా సమకాలీన సామాజిక సమస్యలనెన్నింటినో నవలలో విడమరచి చూపటంలో రచయిత్రికి సామాజిక సమస్యల పట్లగల అవగాహన, సామాజిక బాధ్యత వ్యక్తమౌతుంది.
ముందు సాదాసీదాగా మొదలైన కథనం, సంఘటనలూ మందగమనంతో నడచిన కథ చివరికి వచ్చేసరికి వేగం పుంజుకొని నేత కార్మికుడి జీవనయానంలో సుడులు తిరిగిన పాఠకుడి గుండె ద్రవించేలా రాశారు రచయిత్రి.
విక్టోరియా రాణికి అగ్గిపెట్టెలో చీరని బహూకరించే నైపుణ్యంగల చేనేత కళ, ఆ నేత కార్మికులకు రోజు రోజుకూ ప్రోత్సాహం కొరవడి పాలకుల నిర్లక్ష్యం, యాంత్రీకరణల మధ్య, మధ్య దళారుల కపటత్వంతో ఎంత భారంగా మారిందో అర్థమయ్యేలా రాయటంలో రచయిత్రి నేర్పు కనిపిస్తుంది.
వృత్తిపనివారల జీవితాలపై తెలుగు సాహిత్యంలో కవిత్వం ఎక్కువగా వచ్చింది. కథలు కూడా కొన్ని వచ్చాయి. కానీ మొత్తంగా ఒక వృత్తి నేపథ్యంలో సాగిన నవలలు తక్కువగానే వున్నాయి. నేత కార్మిక జీవనంపై ఇంతకుముందు పోరంకి దక్షిణామూర్తి, వనం నరసింహారావు, మంథా భానుమతిగారు రాసిన నవలలు నాకు తెలిసినంతవరకూ గ్రంథరూపంలో వచ్చాయి. ఆ కోవలోనిదే యర్రమిల్లి విజయలక్ష్మిగారి 'చిలకలంచు జరీకోక' నవల.
ఉత్పత్తి కులాలలో కవయిత్రులు ఎక్కువమందే వున్నారు. కానీ నవలలు రాసే రచయిత్రులు వేళ్ళమీద లెక్కపెట్టే అంతమంది మాత్రమే ఉండటం వల్ల కావచ్చు, ఆయా అంశాలపై రాసే సాహసం చేసినవారు లేరు. అటువంటిది ఉత్పత్తి కులానికి చెందకపోయినా యర్రమిల్లి విజయలక్ష్మిగారు ఎంతో సన్నిహితంగా ఆ పరిసరాలలో అత్యధిక సంఖ్యాకులైన నేత కుటుంబాలను దగ్గరగా చూడటం, సునిశితంగా వారి జీవనవిధానం పరిశీలించినట్లుగా నవల చదివిన పాఠకుడికీ అర్ధమౌతుంది.
ఒక మంచి అంశాన్ని నవలకు ఎంచుకోవటం ఒక ఎత్తైతే, దాన్ని ప్రతిభా వంతంగానూ, అంశాన్ని బలంగానూ చెప్పటానికి తగినరీతిలో సంఘటనల అల్లికనీ, సంభాషణల సమకూర్పునీ బట్టి రచయితా, రచయిత్రుల రచనా సామర్థ్యం తెలుస్తుంది. ఆ రకంగానే యర్రమిల్లి విజయలక్ష్మి కష్టసాధ్యమైన అంశాన్ని స్వీకరించి, ఒక వృత్తిని గూర్చిన అనేకానేక విషయాంశాలు గుదిగుచ్చి పరిశోధనాత్మక నవలగా ఈ 'చిలకలంచు జరీకోక'ను కలనేతగా నేసి మనకి అందించారు.ఒకనాడు 'ఆంధ్రప్రదేశ్' ఉగాది నవలల పోటీలో బహుమతి అందుకోవటంలోనే ఈ నవలకు రాణింపు వచ్చినట్లయింది.
గత యాభై ఏళ్ళకు పైగానే రచనారంగంలో వుంటూ విజయలక్ష్మిగారు అనేక నవలలు, కథలు, వ్యాసాలు రాసి గ్రంథాలుగా వెలువరించారు. నేతవృత్తి గురించి నాకు తెలిసినదాని కంటే మరింత పరిచయం ఈ నవలద్వారా నాకు అందింది. సామాజిక బాధ్యతతో పరిశోధనాత్మక నవలగా 'చిలకలంచు జరీకోక'ను అందించారు యర్రమిల్లి విజయలక్ష్మిగారు
16, ఆగస్టు 2024, శుక్రవారం
నాకు నచ్చిన నా రచన - యుద్ధం ఒక గుండె కోత
నాకు నచ్చిన నా రచన – యుద్ధం ఒక గుండెకోత - నేపథ్యం
ఆధునిక కథానికకు ఆద్యుడైన గురజాడ అడుగుజాడలు విజయనగరంలో జన్మించడం వలన కావచ్చు, నా తోబుట్టువులు పి. సరళాదేవి, కొడవంటి కాశీపతిరావులు కథకులు కావటం వలన కావచ్చు, అప్పట్లో వచన సాహిత్య పఠనం వలన కావచ్చు. 1970లో కథారచనతోనే నా సాహిత్య ప్రవేశం జరిగింది.
శీలావీర్రాజుగారితో వివాహానంతరం భాగ్యనగరంలో అడుగుపెట్టాక ముఖచిత్రాల కోసం ఇంటికి కవులు ఎక్కువగా రావడం, ఇంట్లో కవిత్వ పుస్తకాలే ఎక్కువగా ఉండడంతో కవిత్వ పఠనం ఎక్కువైంది. రానురాను ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, పిల్లలూ, ఆర్థిక సంక్షోభం వీటన్నిటితో సమయం, సావకాశం లేని పరిస్థితుల్లో మనసులోని సంఘర్షణ, ఆలోచనలు పేపరుమీద పెట్టేందుకు కవిత్వ రచనవైపు మొగ్గుచూపాను. ఆ విధంగా కవితారంగంలోకి వచ్చినా కథారచనని పూర్తిగా వదిలేయలేదు. 1975లో మొదటి కవిత ప్రచురితమైన నాటి నుండి అవిశ్రాంతంగా రాస్తూనే ఉన్నాను. ఈ 50 ఏళ్ళ కాలంలో ఏడు కవితాఖండికల సంపుటులు, రెండు దీర్ఘ కావ్యగ్రంథాలు, మూడు కథానికా సంపుటాలు, వ్యాససంపుటి, రెండు మోనోగ్రాఫ్ లు, ఒక నవల వెలుగుచూసాయి.
నా రచనలన్నీ నాకిష్టమైనవే అయినా పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందిన 'యుద్ధం ఒక గుండె కోత' పట్ల నాకు మరింత మక్కువ.
2001 సెప్టెంబరు 11న అమెరికాలోని జంట టవర్లను ఉగ్రవాదులు కూల్చిన దుర్ఘటనతో ఈ దీర్ఘ కావ్యం మొదలౌతుంది. తదనంతరం అమెరికా, ఆఫ్ఘన్ యుద్ధ నేపథ్యంలో జరిగిన అనేకానేక సంఘటనలు జన జీవితంలో కలిగించిన ప్రకంపనలు, కవిత అంతటాపరచుకుంటాయి. రెండు నెలల వ్యవధిలోనే రాసి డిసెంబరు నాటికి గ్రంథ రూపంలోకి తీసుకువచ్చాను.
ఇందులో యుద్ధమూలాలు అన్వేషించటమేకాక, మత విద్వేషాలు యుద్ధానికెలా దోహదమౌతాయో, ఎన్ని కుటుంబాలు, సంక్షోభాలలో ఇరుక్కుంటాయో, యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఎందరు తల్లులు గర్భశోకంలో గుండెకోతను అనుభవిస్తారో, వీటన్నిటికీ నా దృష్టి కోణంలో కార్యకారణాలను అక్షరీకరించాను.
యుద్ధం ఒక గుండెకోతను ముప్ఫై అధ్యాయాలుగా రాసాను. ప్రతీ అధ్యాయంలో యుద్ధం ఏ విధంగా జనజీవనాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందో తెలియజేశాను. యుద్ధోన్మాదులైన నాయకుల మనస్తత్వానికి కారణాలూ, అమాయక ప్రజల ధన మాన ప్రాణాల్ని కొల్లగొట్టే మత విద్వేష రాక్షస ప్రవృత్తికి మూలాలూ, బాల్యంలోనే హింసా ప్రవృత్తికి బీజం వేస్తున్న పరిస్థితులూ అక్షరీకరించాను.
“బాధ/సన్నటి సూదిములుకై / రక్తంలో ప్రవేశించింది/నరాల్ని కుట్టుకుంటూ/ శరీరమంతటా / ప్రవహించటం మొదలైంది" అంటూ ఈ కావ్యాన్ని ప్రారంభించాను. ఆకాశం నిండా లోహ విహంగాలు పెనుబాంబులుగా రూపాంతరం చెంది పెఠేల్ మంటే ఎక్కడో ఏ మూలో తల్లిపేగు ఎలా ఖణేల్ మంటుందో, యుద్ధం చేసే గాయాల చారికల్ని తల్లి గర్భంపై చూపాను. యుద్ధాలకు ప్రధాన కారణంగా మారుతోన్న మతాల్ని నిరసించాను.
"నిజానికి మనం మతాల్ని కడుపులో మోయం కదా తల్లులారా మీరన్నా చెప్పండి / మీరెవరైనా మతాన్ని గర్భంలో దాచుకున్నారా” అని ప్రశ్నించి గర్భాన పుట్టిన వాళ్ళని అనామికలుగా పెంచుదాం. పుట్టాక వారి పేరు వారే సంపాదించుకుంటారని నివేదించాను.
అసలైన యుద్ధం మొదలైంది గుండె కేన్వాసుపై కన్నీటితో లిఖిస్తున్న స్త్రీల ఆలోచనల్లోనే అని ప్రతిపాదించాను.“ఎక్కడ ఏ యుద్ధం జరిగినా / పరిజన సమేతంగా దిగుడు బావుల్లో దూకాల్సిందే / అంతఃపురాలు ఆహుతి కావల్సిందే కదా” అని అనాదిగా జరిగిన చారిత్రక యుద్ధ పరిణామాల్ని అక్షరబద్ధం చేశాను.
“ఆయుధాలతో బిళ్ళంగోడి ఆడుతూ / అక్షరాలు దిద్దాల్సిన వయసులో / అమ్ముల పొదులౌతోన్న బాల్యం” గూర్చి కన్నీరు కార్చాను. పసితనంలోనే హింసాయుత క్రీడల్ని మనమే అలవాటు చేస్తున్నామా అని మథనపడ్డాను. “ప్రపంచాన్ని పాలిస్తున్నది ఇప్పుడు మతమే / ప్రజలిప్పుడు అనకొండ గర్భంలో ఉన్నారు" అని కళవళపడ్డాను.
“ఎక్కడో మసీదులు కూలినా/ ఇంకెక్కడో శిలువ విరిగిపడినా/మరోచోట విగ్రహాలు శకలాలైపోయినా/ ఇన్నివేల మైళ్ళదూరాన/ శిరస్సులు తెగిపడడమేమిటో / భయం గుప్పిట్లో దేశాలు ఉండటమేమిటో అర్థంకాక అయోమయంలో మునిగిపోయాను.
"తల్లులారా/ మనదుఃఖాన్ని, మన ఆగ్రహాన్ని, మన ఔదార్యాన్ని ముప్పేటలుగా అల్లి / త్రివేణీ సంగమ ప్రవాహం చేసి/ క్షుభిత హృదయాల్ని చల్లార్చుదాం రండి / ఓ మహా యుద్ధానలమా / చల్లని నవనీతం పూసి / సేదతీర్చటం తెలిసిన తల్లులం/ మాకు సోకుతున్న సెగని తట్టుకొనైనా / నిన్ను ఉపశమింపజేయటమే మాలక్షణం” అంటూ నా నిర్ణయాన్నీ ప్రకటించాను.
మనం ప్రేమించిన మానవ విలువల అద్భుత కట్టడాన్ని / ఎనిమిదో వింతగా / ఏ మసీదు ముంగిట్లోనైనా కడదామా/ గుండె గాయాల్ని స్రవిస్తున్న రక్తాశ్రువులలో / ఏమందిర దైవాన్నైనా అభిషేకించుదామా / మన హృదయాల్ని పిండి కొవ్వొత్తిని చేసి/ ఏ చర్చి ముందైనా వెలిగించి వేలాడదీద్దామా / పంచభూతాల సాక్షిగా / యుద్ధమైకంతో ఊగుతోన్న దేశాల్నిండా / అమ్మతనాన్ని వర్షిద్దాం రండి” అని ఆక్రోసించాను.
ముగింపులో “ఒక సంపూర్ణ మానవాంకురాన్ని పొదిగేందుకు / ఒక తల్లి గర్భం కావాలి / శాపగ్రస్తులై రాతిగా మారిన అహల్యలారా / మళ్ళీ ఈ భూగోళాన్ని / మానవీయ స్పర్శతో పునీతం చేసే / మనుషులతో నింపుదాం” అంటూ మాతృ హృదయాన్ని పరచి ఆహ్వానించాను.
ఈ విధంగా 56 పేజీల దీర్ఘకావ్యంగా 'యుద్ధం ఒక గుండెకోత' ఆవిష్కరించాను. ఈ పుస్తకం అన్నివాదాల వారితో, అన్ని వర్గాల వారితో మమేకం అయ్యేలా చేసింది. ఎందుకంటే ప్రతీ యింటి నుండీ రెక్కలు కట్టుకొని ఎగిరిపోతోన్న వలస పక్షులున్నారు. ఆనాడు 2001లో అమెరికా ఆఫ్ఘన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వారి వారి పిల్లల కోసం గుండె చెరువులై సప్తసముద్రాలు దాటి భూమి రెండో వైపుకు వెళ్ళలేక గుబులుగా ఉన్నారు. కావ్యంలో నేను ప్రతిపాదించిన అనేకానేక విషయాలపట్ల అందరూ సానుకూలంగా స్పందించారు.
నేను ఇది రాసినపుడు కూడా నా గుండె తడితో రాశాను. ఆ విధంగా కూడా ఈ రచన నాకు చాలా ఇష్టమైంది. ఆఫ్ఘన్ లో దాడికి గురైన మలాలా బాలికా విద్యపట్ల అంకితభావానికి నోబుల్ శాంతి బహుమతి అందుకోవడం అందరికీ తెలిసిందే. 2001 నాటికి బహుశా మలాలా రెండేళ్ళ పాప అయి ఉండొచ్చు. నేను 2001లో రాసిన ఈ గ్రంథంలో సూచనప్రాయంగా ఆఫ్ఘన్ లో చదువుకునే హక్కులేని బాలికల స్థితిని తెలిపే వాక్యాలు "అక్షరం ఆకారం తెలియని పసిది / సిగ్గుతో మెలికలు తిరుగుతూ వేళ్ళని గుండెల్లో దాచుకొని / జనానాలోకి పారిపోతోంది” అని దిగులుపడ్డాను.
యుద్ధ నేపథ్యంలో తెలుగులో అప్పటికి ఎవరూ కావ్యాలు రాసినట్లు లేదు. ఆ విధంగా కూడా దీనికి ప్రత్యేకత లభించింది.
2002లోనే డా. పి. భార్గవీరావు, డా. పోపూరి జయలక్ష్మిగారు ఆంగ్లానువాదం చేశారు. అది కూడా అప్పుడే గ్రంథరూపం సంతరించుకుంది. "WAR, A Hearts' Ravage'
నిర్మలానంద వాత్సాయన్ గారు 'యుద్ధ ఏక్ దిల్ కి వ్యధ' పేరున హిందీలోకి అనువదించినది కూడా గ్రంథరూపంలోకి వచ్చింది.'ఉళ్ళక్ కుమురల్' పేరిట రాజేశ్వరి కోథండం గారు చేసిన తమిళానువాదం పుస్తకంగా వచ్చింది.
డా. ఆవంత్స సోమసుందర్ గారు ప్రతీ ఏటా దీర్ఘ కవితల ప్రక్రియలో ఇచ్చే దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి రాజహంస పురస్కారం 2011లో నేను అందుకున్నాను.యుద్ధం ఒక గుండె కోత మీద మథుర కామరాజు విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఫిల్ పరిశోధన జరిగింది.
2001లో ఈ దీర్ఘ కావ్యం రాసే నాటికి కవులలో కొందరు మాత్రమే దీర్ఘకావ్యాలు రాశారు. కవయిత్రులలో నుండి వచ్చిన మొదటి దీర్ఘకావ్యంగా విమర్శకులు గుర్తించారు. తర్వాత ఏడేళ్ళకు 'బతుకు పాటలో అస్తిత్వరాగం' పేరుతో మరో దీర్ఘకావ్యాన్ని కూడా రాశాను. ఆ గ్రంథంలో ఆడబిడ్డ పిండంగా ఏర్పడినది మొదలు వృద్ధాప్యం వరకూ ఏడు అధ్యాయాలుగా రాశాను. ప్రతీ అధ్యాయంలో తొలి సూర్యకిరణం వెలుగు చూసినది మొదలు సూర్యస్తమయం వరకు, విత్తనం మొలకగా విచ్చుకున్నది మొదలు మోడుగా మారేవరకూ స్త్రీ జీవితంతో పోలిక చెప్తూ రాశాను.
కవిత్వ రంగంలో పేరున్న కవులందరూ దీర్ఘకావ్యాలు రాయటంలో ఆసక్తి చూపారు. కానీ కవయిత్రులు ఎందుకనో దీర్ఘ కావ్య ప్రక్రియ పట్ల సుముఖత చూపటం లేదు. నేను కాకుండా మరో అయిదారు మంది తప్ప రాసిన వారు లేరు.
మత విద్వేషాలపై దేశవ్యాప్తంగా జరుగుతోన్న చర్చలు, దుర్ఘటనలు, హింసల నేపథ్యంలో కూడా నా 'యుద్ధం ఒక గుండె కోత' అనుకున్నంతగా ప్రాచుర్యం చేసుకోలేకపోయాను. బహుశా అందుకనే అంతర్జాతీయ సమస్యని చర్చించిన గ్రంథమే అయినా సాహిత్య రాజకీయాలతో మరుగునపడిపోతోంది. ఏది ఏమైనా దీర్ఘకావ్యంగా 'యుద్ధం ఒక గుండెకోత' మనసుతో రాసినదిగా నాకు చాలా ఇష్టమైన రచన.
(పెనుగొండలో జరిగిన 'ప్రరవే' సదస్సులో చదివిన ప్రసంగ వ్యాసం)
సృజన క్రాంతి లో ప్రచురితమైనది
8, ఆగస్టు 2024, గురువారం
సప్తపది
తెలుగులో రచయిత్రుల తొలి గొలుసు నవల- సప్తపది
"మానవజీవితాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా దర్శించ డానికి నవలాకారునికున్నంత అవకాశం ఓ మహర్షికి గానీ, ఓతాత్వికునికి గానీ, ఓకవికి గాని లేదు" అంటారు సుప్రసిద్ధ నవలారచయిత డీ.హెచ్. లారెన్స్.
ఇంత ప్రసిద్ధమైన నవలా ప్రక్రియ తెలుగుసాహిత్యంలో నరహరి గోపాల కృష్ణమ్మ సెట్టి రాసిన సోనాబాయ్ పరిణయం( శ్రీరంగరాజు చరిత్ర,1872) లేదా కందుకూరి వీరేశలింగం పంతులు గారి రాజశేఖర చరిత్ర (1878) సంశయం ఉంది. ఏదేమైనా మొత్తం మీద ఈ సుదీర్ఘ ప్రక్రియకు
నవల అనే పేరు స్థిరపడింది. (ఆంగ్లంలో నావల్ అనే
పదం నుండి వచ్చినట్లుగా).
అయితే ఈ వ్యాసంలో చర్చించాల్సిన అంశం గొలుసునవల. కీ.శే. ఇరివెంటి కృష్ణమూర్తిగారి వద్ద "తెలుగులో గొలుసు కట్టు నవలలు" అంశంపై శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు తన ఎం.ఫిల్ పరిశోధనను 1977 లో మొదలు పెట్టి 1980 నాటికి పూర్తి చేస్తారు.దీని కొరకు విఠలాచార్యగారు చాలా అధ్యయనం చేయవలసి వచ్చిందనిఅంటారు. దీని గురించి సరియైన విషయసేకరణ కొరకు అనేక మంది సుప్రసిద్ధ సాహితీవేత్తలను కలిసి, అవసరమైన మేరకు ఇంటర్వ్యూలు చేసి అనేక గ్రంధాలయాలు సందర్శించి తెలుగు వచ్చిన గొలుసు కట్టు నవలలను, వివరాలను సేకరించానని తెలియజేసారు. గొలుసుకట్టు నవల లేదా గొలుసు నవలను విఠలాచార్య గారు సమిష్టి సాహిత్యరచనగా అభివర్ణించారు.
విఠలాచార్యగారి మాటల్లో - "సమిష్టి సాహిత్య రచనకు రచయితలు ఖండఖండాలుగా ఒకరి తర్వాత మరొకరు రచనలు చేస్తూ,ఒకరు విడిచి పెట్టిన భాగాన్ని మరొకరు,మరొకరు విడిచి పెట్టిన భాగాన్ని ఇంకొకరు చేపట్టి గొలుసు కట్టుగా రచనను చేసుకుంటూ కథను సమాప్తం చేస్తారు."
అయితే ఈ ప్రక్రియ తెలుగులో ప్రచురణ రూపంలో కాక ఆకాశవాణిలో ప్రసారణ రూపంలో మొదలైంది.అందుచేత వీటిని రేడియో నవలలుగా తెలియజేసారు.
మద్రాసు ఆలిండియా రేడియోతొలిసారి 1947 లో " ఆదర్శజీవులు" అనే ఆరు అధ్యాయాలుగా గొలుసు నవలను కొడవటిగంటి కుటుంబరావు , పాలగుమ్మి పద్మరాజు, మునిమాణిక్యం నరసింహారావు, త్రిపురనేని గోపీచంద్, శ్రీరంగం శ్రీనివాసరావు,చింతా దీక్షితులతో గొలుసు నవలగా రాయించి ప్రసారం చేసింది.
విజయవాడ ఆకాశవాణి కేంద్రం 1959 జూలై, ఆగష్టునెలలలో ఏడువారాలపాటు స్త్రీల కార్యక్రమంలో ధారావాహికంగా ప్రసారం చేసిన గొలుసునవల "సప్తపది "దీనిని శ్రీమతి కనపర్తి వరలక్ష్మమ్మ , శ్రీమతి డా.పి.శ్రీదేవి, శ్రీమతి మాలతీచందూర్, శ్రీమతి దుర్గాకుమారి,శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి,శ్రీమతి కె. రామలక్ష్మీ, శ్రీమతి పి. సరళాదేవి అను ఆనాటి సమకాలీన రచయిత్రులచే రాయించి ప్రసారం చేయటం ఒక విశేషం.
ఈ నవలను తదనంతరం 1963 జూన్ లో విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ-4.వారు ఒక్క రూపాయి మాత్రమే ధరతో 1250 కాపీలను స్వతంత్ర ఆర్ట్ ప్రింటర్స్ ద్వారా ముద్రించారు.
ముందుగా క్లుప్తంగా కథాంశాన్ని నిర్ణయించుకుని ప్రతిభాగానికి మొదలు తుది అంశాలుగా కథను విభజించి రచయిత్రులకు అందజేసారు . ఎవరికి వారు ఒకరు ఒకపాత్రకు అందించిన ఊపును మరొకరు అందుకొని, వారు ఒక సమస్యను మొదలు పెట్టి అందించిన దానిని మరొకరు మరో మలుపుకు మళ్ళించి మొత్తంగా ఏడుభాగాలలో కథను ముగింపుకు తీసుకు వస్తారు.
"సమకాలీన రచయిత్రులే అయినప్పటికీ వారివారి వాదం,భావం, సిద్ధాంతం, అభిప్రాయం, అభిరుచి, ప్రవృత్తి, దృక్పథం మొదలగు వాటిలో ఎంతగా కథను వేరువేరు పుంతలు తొక్కించినా సమకాలినమైన యథార్ధాన్ని మాత్రం యీ గొలుసు నవల ద్వారా ఆవిష్కరిస్తారు.భిన్న దృష్టులు కలిగిన రచయితలు ఒక వాస్తవం పరిస్థితి పై ఏకదృష్టి కలిగి ఉండుట ఈ ప్రక్రియ ద్వారా నే గోచరిస్తుంది " కూరెళ్ళ విఠలాచార్య గారు తన పరిశోధన లో విశదీకరించారు.
ఈ విషయం పైనే "సప్తపది" నవలలో ఏడుగురు రచయిత్రులు కథను నడిపించిన విధానాన్ని వివరముగా తెలుసుకుందాం. 1)తీరనిసమస్య - శ్రీమతి కనపర్తి వరలక్ష్మమ్మ.
కమల బియ్యే చదివిన అమ్మయి. కథ ప్రారంభం ఈ బియ్యే ఫలితాలతోనే ప్రారంభించి కమల తర్డ్ క్లాసులో పాసయినందుకు బాధ పడిందని మొదలుపెడతారు రచయిత్రి.కమల చదువే కాక సంగీతం,నృత్యం నేర్చిన చురుకైన పిల్ల.
కమల తండ్రి చిరుద్యోగి. నలుగురుఆడపిల్లలు,ఒక మొగపిల్లవాడు.కమల రెండవది. మొదటి అమ్మాయి కి ఉన్న అయిదు ఎకరాల్లో ఒక ఎకరం అమ్మి పెళ్ళి చేస్తాడు.
అప్పటికీ అల్లుడు కట్నకానుకలు కోసం మామగారిని వేధిస్తుంటాడు.పెద్దకూతురు దానికి వంత పాడుతుంటుంది.
కమల తండ్రి స్నేహితుడు కామరాజు వచ్చి
" మగపిల్లాడిని చదివిస్తే జీతం, వచ్చే కోడలు తెచ్చిన కట్నకానుకలు, బంగారం అంతా మనదే అవుతుంది.ఆడపిల్లని చదివిస్తే ఖర్చు, పెళ్ళి ఖర్చు,పెట్టిన బంగారం ,ఆమె జీతం అంతా వేరొకరికి దక్కుతుంది "అని హితబోధ చేస్తాడు." పెళ్ళి చేయాలన్నా బియ్యే చదివిన పిల్ల తనతో సమానమైన వాడిని, తక్కువ చదివిన వాడినీ ఒప్పుకోదు, అంతకన్నా ఎక్కువ చదివిన వాడికి చాలా కట్నకానుకలు పొయ్యాలి "అని స్నేహితులు ఇద్దరూ వాపోతుంటారు.
పురిటికి వచ్చే పెద్దకూతురు,ఆ ఖర్చు తలచుకొని బెంగ పెడతాడు తండ్రి.
తల్లి, తండ్రి మిగతా పొలం అమ్మి కమల పెళ్ళి చేస్తే మిగతావాళ్ళు గతి ఏమిటనీ, పెద్దకూతురు పెట్టుపోతలెట్లా అని తర్జనభర్జన పడటం చూసి కుమారులకు పెళ్ళంటే అసహ్యం కలుగుతుంది.
ఉద్యోగం ప్రయత్నం లో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లో ఉద్యోగం వస్తుంది.ఆఫీస్ లో ఆడవాళ్ళు ఉండరు.కమల జాయిన్ కాగానే ఇక ఆపీసులో కచేరీలు,నృత్య ప్రదర్శనలు కాబోలని వెటకారాలు. అటెండరు దగ్గర నుండి ఆఫీసరు వరకూ కమలతో ప్రవర్తించే తీరు కమలని బాధపెడుతుంది.
ఈభాగంలో ఆనాటి చిరుద్యోగుల ఇళ్ళల్లో పిల్లల వెతలు, వారి మనోభావాలు, ఆడపిల్లల వివాహం గుదిబండ కావడం, చదువుకున్న, ఉద్యోగం చేసే ఆడవారిపై చూపే నిరసనలు, అపోహలు ఆ కాలపు మధ్యతరగతి జీవితాలకు అద్దం పడతాయి. ఈ భాగం రచయిత్రి కనపర్తి వరలక్ష్మమ్మగారు సమాజ సేవకురాలు కూడా కావటం ఆమె గమనించిన జీవితాల్ని తన భాగంలో ప్రస్తావించారు.
2)- ఉద్యోగం లో--శ్రీమతి డా.పి.శ్రీదేవి.
ఉద్యోగం లో చేరిన కమలకు రెండు నెలలకే ఉత్సాహం, గర్వం తగ్గిపోతుంది.పెళ్ళిచేసుకుని తండ్రిని అప్పులపాలు చేయకూడదని ఉద్యోగంలో చేరిన కమలకు ప్రతీనెల తన జీతానికి రెక్కలు వచ్చి ఎగిరిపోవటం నిరాశ పరిచింది.అఃతకుముందు తండ్రి ఎలా సంసారం గడిపాడో కానీ కమలజీతంతో అంతకుముందు చేసిన అప్పులను తీర్చడానికి, కుదువ పెట్టిన గొలుసు విడిపించుకోటానికి, సంసార ఖర్చులకు తీసుకోవటంతో కమలకి స్వంతంగా ఒకచీరో,చెప్పులో కూడా కొనుక్కోలేని అసహాయత కు బాధ పడుతుంది .
ఆఫీసులో కూడా హెడ్ గుమాస్తా మందలించక పోవటం తోటి ఉద్యోగుల కు మంట కలిగించింది ఆడపిల్ల అని ఏమీ అనటంలేదని గుసగుసలు పోవటం చికాకు కలిగిస్తుంది.
ఈ సందర్భంలో రచయిత్రి శ్రీదేవి ఇలా రాస్తుంది.-"కమలకి కావలసినది మనిషి మనిషితో మాట్లాడినట్లు మాట్లాడటం- అంతే కానీ మగవాడు ఆడదానితో మాట్లాడినట్లు కాదు. కానీ ఆఫీసులో ఒకరూ కమలకి కావలసినట్టు మాట్లాడరు." ఈ మాటల్లో కాలాతీతవ్యక్తులలో ఇందిరను తలపిస్తుంది.
కమలకి తన స్నేహితురాలు ఇందిర కలుస్తుంది. ఆమె పెళ్ళై, బిడ్డ తల్లి .ప్రతి స్త్రీకి పెళ్ళి ముఖ్యావసరంగా ఆమె కమలతో మాట్లాడుతుంది.. కముమల ఆలోచనలో పడుతుంది. ఇంటికి వచ్చే సరికి తల్లిదండ్రులు పెద్దకూతురికి పెట్టాల్సిన పెట్టుపోతల గురించి చెప్పేసరికి
"అవాంతర ఖర్చులు తనపై రుద్దతారేమిటి తనకు సరదాలు ఉండవా? 'అనితనని తాను ప్రశ్నించు కొంటుంది.కమలకి స్నేహితురాలి వైవాహిక జీవితం సుఖవంతంగా అనుకోవాలో,అక్క బానిస జీవితం చూసి అసహ్యించుకోవాలో అర్థం కాదు.
"ఏమైనా స్వేచ్ఛా, వ్యక్తిత్వం లేని చీకటి బతుకులో తాను మునిగి పోకూడదు" అని నిశ్చయించుకోవటంలో శ్రీదేవి రచనలలోని ఆత్మనిర్భరత ఈ భాగంలో గమనించ వచ్చు.
6 సంఘర్షణ - శ్రీమతి మాలతీచందూర్
పెద్దకూతురు ,భర్తా పిల్లలతో పురిటి కాని వస్తుంది.అది చూసి కమల 'మొత్తం కుటుంబం అంతా ఇక్కడే ఉంటారా' అని ఖర్చులు గురించి దిగులు పడుతుంది.తల్లీతండ్రీ పెట్టుకోవాలి గురించి కమలకి గుర్తు చేస్తారు.
కొందరు పురుషులకు చదువుకున్న సమర్ధత కలిగిన స్త్రీలే గిట్టదు.అందుకే మాటిమాటికీ అక్క భర్త ' గ్రాడ్యుయేట్ కమలా' అని సంభోదించడం చిరాకు కలిగిస్తుంది. అది ఒకతిట్టులా వినిపిస్తోంది.
' బియ్యే చదివిన ఉద్యోగం చేసే వాళ్ళని ఎవరూ పెళ్ళి చేసుకోరు' అంటాడు.ప్రతీ సారీ సూట్లకి, బట్లకీ పోట్లాడే బావగారికి తన చదువు గురించి, ఉద్యోగం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని కమల తీవ్రంగా సమాధానం ఇస్తుంది. దాంతో ఇంట్లో దుమారం రేగింది .తండ్రి ఉద్యోగం మానేయమని,రెండో పెళ్ళి సంబంధం ఒకటి తీసుకొస్తాడు.
ఎవరితోనూ మాట్లాడకుండా కమల తనలో తాను ముడుచుకుపోతుంది.పెళ్ళి చూపుల సమయంలో కమల్ తీవ్రమైన వత్తిడి కి గురై విరుచుకు పడిపోతుంది.
ఈభాగంలో మాలతీ చందూర్ చదువుకొని,ఉద్యోగం చేస్తున్నా మహిళలకు స్వావలంబన లేకపోవటం,వారి పట్ల సమాజం చూసే వివక్షతను తెలియజేస్తారు.ధైర్యంగా స్వేచ్ఛగా ఉండే స్త్రీలను పెళ్ళి చేసుకునే ధైర్యం లేని పురుషులను,అటువంటి స్త్రీలను మానసికంగా దుర్బలులనుచేసే ప్రయత్నాలు అభివ్యక్తీకరిస్తారు.అందులో భాగంగానే జరిగే వివాహతతంగాలూ బట్టబయలు చేస్తారు.
4) మబ్బులు విడిపోయాయి.- శ్రీమతి దుర్గాకుమారి
కమలకు ఏదో గ్రహచేష్టనీ అంటూ ఆమె తల్లి శాంతి కోసం ప్రదక్షిణలు, చన్నీళ్ళ స్నానాలు , నేలమీద పడుకోవడం వంటివన్నీ చేయిస్తుంది . కమల "ఇవన్నీ ఏమిటమ్మా నాకు లేని పిచ్చిని పట్టిస్తున్నారు" అని దుఃఖిస్తుంది. కమలకి దైవభక్తి ఉన్నా 'చెవులు చిల్లులు పడేలా స్మరించడం,భజన చేయటం, లేని భక్తిని బాహ్యప్రదర్శనాల ద్వారా అభినయించడం రోత పుట్టిస్తాయి. స్వాముల వద్దకు తీసుకుపోయి బోధనలు చెప్పించటం నచ్చదు.'ప్రతీ స్త్రీ కలలు కనే మధురమైన బాధ్యతలు,అర్థం చేసుకునే భర్త ,ప్రశాంత జీవితం కావాలి.అవన్నీ మృగ్యం అవుతున్నాయి' అని నిరంతర ఘర్షణలో నలిగిపొతుంది.కమల.
ఆ పరిస్థితిలో మేనత్త శారదాంబ వచ్చి తన కూతురు పెళ్ళని సాయింకోసం వస్తుంది. కమల తాను వెళ్తానని బయలు దేరుతుంది. అయితే తనని పెళ్ళి గురించి ఎవరూ అడగకుండా చూడమంటుంది.
ప్రశాంతమైన పల్లెటూరు, ప్రకృతి శోభ కమలకు మధురంగా కనిపించాయి. అమాయకమైన పల్లె పడుచులు, అక్కడ జరిగిన పెళ్ళిసంబరాలు గిలిగింతలు పెడతాయి. తన భావాలను తన స్నేహితురాలికి ఉత్తరంగా రాయబోయేసరికి ఒక కథగా రూపొందింది.దానిని పత్రికకు పంపితే అచ్చవుతుంది.ఆ విధంగా ఉత్సాహంగా రచనలు చేస్తుంది కమల.రచనలో పాత్రల కష్టాలూ,సంఘర్షణలకూ బాధపడే వ్యక్తులు నిజం జీవితంలో అలా స్పందించక పోవడం కమలకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
తనకు తెలిసిన పద్మ పరీక్ష పోయిందని ఆత్మహత్య చేసుకోబోవటాన్ని కాపాడి హితబోధ చేస్తుంది.పాఠాలు చెప్పి పద్మని ప్రయోజకురాల్ని చేస్తుంది. ఈ సంఘటన కమలకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, ఎంతో శక్తినీ ఇచ్చి ఆమె జీవితానికి ఒక భాష్యాన్ని చూపుతుంది.
ఈ భాగాన్ని రాసిన దుర్గాకుమారి ఎవరో తెలియలేదు.కానీ రచనలో రచయిత్రికి గుల ఒకింత హేతువాద దృక్పథం తెలుస్తోంది.గ్రామీణ సౌందర్యం, పెళ్ళిళ్ళలో జరిగే తంతులూ,ఆయా సందర్భాలలో అనేక వేళాకోళాలూ మొదలైనవి హృద్యంగా అక్షరీకరించారు.
5). ప్రజాసేవ- ఇల్లిందల సరస్వతీదేవి
కమల కాపాడిన పద్మ పరీక్ష పాసు కావటంతో పద్మతండ్రి సరియైన శిక్షణ లేక పద్మ ఇన్నాళ్ళూ ఫెయిలయ్యిందని భావించి,తాను స్త్రీల కోసం ఒక సేవా కేంద్రం స్థాపించాలనుకుంటున్నానని కమలని అందులో పనిచేయమని కోరుతాడు.
చరఖా, కుట్టుపనులనీ, వయోజన విద్యా ప్రాధాన్యాయాలుగా సంఘం మొదలయ్యింది.చాలామంది సామాన్య స్త్రీలు చేరి పనులు నేర్చుకుంటారు.కమల చురుకుగా పని చేసి దానిని అభివృద్ధి లోనికి తెచ్చే క్రమంలో కమల మనసు నవచైతన్యాన్ని పొందుతుంది.
వార్షికోత్సవ సందర్భంగా ఒక నృత్య నాటిక ను నేర్పాలనుకుంటుంది.కమల వాళ్ళతో చేయించే ప్రాక్టీసుని ప్రక్కనే ఉన్న ఇంటిలో అతను చెట్టు ఎక్కి దాక్కుని చూడటం గమనించి మందలిస్తుంది.
సలహా సంఘం వారి ముందు వార్షికోత్సవానికి ముందురోజు రిహార్సల్స్ గా నృత్య నాటిక ప్రదర్శిస్తుంది.అయితే వారు వచ్చినప్పుడు
బయటగోడలనిండా కమల గురించి,మహిళలు గురించి అనేక అసభ్యరాతలు రాసి ఉంటాయి.అక్కడ నేర్చుకుంటున్న మహిళలు తమ కష్టంతో అంతోయింతో సంపాదించుకుంటున్నారు.
ఇప్పుడు ఇలా పల్లెటూళ్ళు బాగు చేయవచ్చని భావించిన కమలకు మనసు వికలమై కంటిమీద కునుకు రాలేదు.
ఈ భాగాన్ని భాస్కరభట్ల కృష్ణారావుగారు ' సంఘసేవ' అనే శీర్షికను ఇల్లిందల సరస్వతీ దేవి గారికి ఇచ్చి సప్తపది గొలుసు నవలలో ముందు భాగాలననుసరించి మీ భాగం రాయమన్నారని సరస్వతీ దేవి గారు ఒక సందర్భంలో తెలియజేశారు.ఈ నవలకు ముందు రచయిత్రులు కలిసి సమిష్టిగా కథాంశాన్ని చర్చించుకోలేదనీ చెప్పారు.
ఇల్లిందల సరస్వతీదేవి గారు అంతకుముందు నుంచే సమాజం సేవారంగంలో ఉండటం వలన ఈ రంగంలోని లోతుపాతులు వ్యక్తులను ఉండీ,సమాజం నుండీ ఎదుర్కొనే ఇబ్బందులూ ఆమెకు తెలిసి ఉండటం చేత ఈ భాగంలో ఈ దృష్టికోణాన్ని చక్కగా ఆవిష్కరించారు.
6) కళారంగంలో - శ్రీమతి కె.రామలక్ష్మి.
తన జీవితంలో అలుముకున్న మబ్బులు విడిచి ప్రశాంతంగా వున్నాననుకుంటే మళ్ళీ యీ పరీక్ష ఏమిటనుకుంటుంది కమల.
నృత్యనాటిక అభాసుపాలు కావటంతో బాధకలిగించింది.నృత్యనాటిక రాసి తనతో పనిచేసిన రంగాచారి ' పబ్లిక్ రంగంలో రాణించడానికి యిలాంటి ఢక్కాముక్కీలు ఎన్ని తినాలో.దీనికే భయపడితే యెలా' అంటాడు.
కమల మాత్రం తాను కథలు రాసుకుంటూ బతికితే చాలనుకుంటుంది.కానీ రంగాచారి ఆమె కంటి ముందు కళల కలలు సృష్టిస్తాడు.రంగాచారితో కలసి మద్రాసు వచ్చేస్తుంది కమల.
స్టుడియోలూ, దర్శకులను సందర్శించినా ఫలితం లేక నిరాశతో కుంగిపోయింది. ఆమె కంఠాన్నీ, అందాన్ని నిరసిస్తారు . అటువంటి సమయంలో ఒక నృత్య నాటికలో వేషం దొరుకుతుంది .అందులో కమల మైమరచి నటించింది. దాంతో ఆమె దశ తిరిగింది.
కానీ ఏడాది లోపునే 'కళాప్రపంచంలో శీలానికీ సౌశీల్యానికీ విలువలేదని గ్రహించింది.
అయితే కవి శాస్త్రి ఆత్మీయపరిచయం కమల్ మనసులో ఆప్యాయత నింపింది .సహృదయులు, మితభాషి అయిన శాస్త్రి ఆమెకు దగ్గరయ్యాడు. తనని వ్యక్తిగా గాక అందాలభామగా డబ్బు సంపాదించే వనరుగా మాత్రమే తల్లిదండ్రులు, తోబుట్టువులను చూచి విరక్తి గా నవ్వుకుంది కమల.
' నీ తల్లిదండ్రులు నిన్నొక యంత్రంగా మాత్రమే చూస్తున్నారు. వారికి నీ సంపాదన కావాలి. కాని నీకో సంసారం వుండాలని తలపోయరు.నీ జీవితం గురించి ఆలోచించు కమలా' అంటాడు శాస్త్రి. దీనికో దారి చూడాలి అనుకుంటుంది కమల.
రామలక్ష్మి గారు మద్రాసులో సినీపరిశ్రమ గురించి,అందులోని లొసుగులు గురించి తెలిసిన వ్యక్తి కావటాన వాటినన్నింటినీ కమల పరంగా వ్యక్తీకరించారు.అంతే కాక కమలకు తన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పించి తన భాగాన్ని ఆపారు.
7. పరిష్కృతి - శ్రీమతి పి. సరళాదేవి
కమల తాను వివాహం చేసుకుంటానని తండ్రి తో చెప్తుంది." కూతురు, అల్లుడు కళకళ లాడుతూ తిరగాలని వుండదా,మంచి సంబంధం దొరుకుతే చేస్తానంటాడు.
' తనను అసలు కూతురు గా చూస్తున్నారా? డబ్బు సంపాదించే మగవాడికి అధికారి మైనా వుంటుంది.తన డబ్బు వీళ్ళకు కావాలి అందుకే ఇల్వరికపు అల్లుడు కోసం చూస్తున్నారని బాధ పడుతుంది.
కమల మేనమామ మళ్ళా డైరెక్టర్ రామచంద్రునితో పెళ్ళి సంబంధం తీసుకు వస్తాడు.
కుమారులకు మనసులో వేదన.తళ పెళ్ళి కూడా తన ప్రమెయం లేకపోవడానికి,తన గమ్యం తనకే తెలియక బాధ పడుతుంది.
బీచ్ కి తీసుకువచ్చిన శాస్త్రి రామచంద్రం కి పల్లెటూరిలో భార్య ఉందని చెప్తాడు.కమల నిరాసక్తిని చూసి శాస్త్రి ' రామచంద్రుడిని చేసుకోవాలని మోజు పడ్తున్నావా' అని విసుక్కుంటాడు.
కమల తాను జీవితం అంతా చెప్పి ' తనకు ఎవ్వరూ లేరనీ, జీవితం తనని మోగించింది .ఆఖరికి మనసిచ్చి మాట్లాడే స్నేహితులు కూడాలేరు.ఇక యేదో సాహసం చేసి ముగించాల్సిందే' అని వెక్కివెక్కి ఏడుస్తుంది.
శాస్త్రి ఆమె చేయించుకుని " పద మీనాన్నతో మాట్లాడదాం,నీ ఆదాయం వాళ్ళకే పంపే ఏర్పాటుచేసి నాకు అల్లుడు గా వచ్చే యోగ్యత వుందేమో అడుగుదాం "అంటాడు.ఆమె " రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలియజేస్తాం" ఆనందంగా అంటుంది.ఆనాటి వేదికమీద ఆనందంగా పాడుతుంది.
ఇంటికి రాగానే మేనమామ " బీచ్ లో ఎవరితో తిరుగుతున్నారని గద్దించేసరికి తాను కవియైన శాస్త్రిని మర్నాడు పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలుపుతుంది.
ఇంట్లో వాళ్ళందరి కోపాల్నీ, గుసగుసలనీ, బుడిబుడి ఏడుపులనీ లెక్క చేయకుండా " రేపటి వరకూ కాదు ఇప్పుడే శాస్త్రి దగ్గరకు వెళ్ళి పోతానని పెట్టె పట్టుకుని బయటకు వచ్చేసరికి శాస్త్రి టాక్సీ తో వుంటాడు.కమల నిబ్బరంగా వెళ్ళి అందులో కూర్చుంటుంది.అని ఈ భాగంలో పి.సరళాదేవి ఒక అభ్యుదయ దృక్పథంతో, స్త్రీ చైతన్య పూర్వకంగా కమలకథకి ముగింపుని ఇస్తారు.
ఇది సంక్షిప్తంగా సప్తపది గొలుసు నవల కథ.
ప్రతీ భాగాలన్నీ ఆయా రచయిత్రులు తమతమ మనోభావాలను, ఆలోచనాత్మకంగా,తమ అభ్యుదయ దృక్పథం ప్రస్ఫుటంగా తెలిపే లాగే రాసారు.అంతేగాక సుమారు 70 ఏళ్ళ క్రితం తెలుగు ప్రాంతాలలో మధ్యతరగతి కుటుంబజీవనాన్ని, వారి ఆలోచనా సరళిని ఆనాటి సమాజంలోని వ్యక్తులనూ,వారి విధానాలనూ, స్త్రీ పట్ల పురుషులు ప్రవర్తన,చదువుకున్న,ఉద్యోగినులు పట్ల సమాజదృష్టినీ , ఆడపిల్లల వివాహ వ్యవహారాన్ని ప్రతీభాగం సంపూర్ణంగా ఎత్తి చూపింది.
కథలోని సమస్యను గురించి రచయిత్రులందరూ కథా క్రమంలో ఎవరి బాధ్యతను వారు నిర్వహించటంలో ఒకరు ఇంకొకరికి ఆదర్శమయ్యే విధంగా లోతుగా, నిజాయితీగా వ్యక్తీరించారు కమల వ్యక్తిత్వాన్ని, నృత్యం, సంగీతం, చదువుమొదలైన అన్ని రంగాల్లో చురుకుగా వున్నదనే విష యాన్ని తమభాగంలో రచయిత్రులు సక్రమంగా కమల వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు.
బాలల నేస్తం సుజాతా దేవితో నేను
~ బాలల నేస్తం: డి.సుజాతాదేవితో నేను ~
మాట మలయానిలయం, పాట తేనెల సోన, గేయం వెన్నెల వాక. మరికథో సమాజం మారుమూలలోకి దృష్టి సారించి పరిశీలించి నివ్వెరపోయేలారాసిన అపురూపకథలు.నేలమీద సాము చేయని, నిబద్ధతతో కూడిన కథలు.బాలలనేస్తం, స్నేహపూరితరూపం ఆమే
రచయిత్రి డి. సుజాతాదేవి.
డి. సుజాతాదేవి పేరు వింటే సాహిత్యరంగంలో కొందరు 'ఆమె బాల సాహిత్య రచయిత్రి ' అంటారు. మరికొందరు 'గేయం రాస్తుంది' అంటారు. తమ రచనలు తప్ప ఇతరుల రచనలు చదివే అలవాటు లేని వాళ్ళు 'ఎవరామె? ఏమిటి రాసింది? ఎప్పుడూ పేరు విన్నట్లు లేదే?' అని బోలెడు ఆశ్చర్యంతో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
సుజాత ఎంత రాసింది? ఏమి రాసింది? అనేది అటువంటివారికోసం బయోడాటా చెప్పాల్సిన అవసరం కూడా వుంది అనుకుంటున్నాను. 1970లో సాహిత్యరంగంలోకి అడుగుపెట్టి మూడు కథాసంపుటాలు, మూడు పాటల పుస్తకాలు, ఒక గేయకావ్యం, మూడు నవలలు, ఒక వ్యాసాల పుస్తకం, ప్రముఖులతో చేసిన ముఖాముఖీల సంకలనంతో పాటు రెండు పాటలు కేసెట్లు వెలువరించారని చాలా మందికి తెలియదు. NCERT వాళ్ళ పురస్కారం, బాలల నవలకి జాతీయ పురస్కారం, బాలల లఘుచిత్రానికి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నారన్న విషయం అనేక మందికి తెలియదు. బహుశా 2013 లో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారనే విషయం కొందరికైనా తెలిసే వుంటుంది అనుకుంటాను మరి.
ఇంత కృషిచేసి కూడా ప్రచార పటాటోపం చేసుకోవటం తెలియని సుజాతాదేవి కొంతకాలంగా అంతర్ముఖీనమై, అనేక కారణాలవలన, అనారోగ్యం వలన బాహ్యసమాజానికి దూరమై పోయింది.
సుమారు యాభై ఏళ్ళక్రితం సుజాతతోటి నా పరిచయం రాను రాను స్నేహబంధంగా గాఢమైంది. అనేక సభలలో సమావేశాల్లో కలిసిన మేము తర్వాత తర్వాత మూడునాలుగేళ్ళ క్రితం వరకూ ఫోనులో సాహిత్యం గురించి చర్చలూ, ఒక్కొకప్పుడు ఫోనులోనే పాటలూ,కథలూ రాగరంజితంగా మాట్లాడుకునే వారం.
పద్దెనిమిది ఏళ్ళక్రితం భార్గవీ రావు, ఇంద్రగంటి జానకీబాల, అత్తలూరి విజయలక్ష్మి, నేనూ పాపికొండలకు ప్రయాణం కట్టాము . రాజమండ్రిలో సుజాత కూతురు కమల ఇంట్లోనే దిగాము. పడుకోటానికి వేసుకున్నపక్కలమీద చేరి ఆరాత్రి రెండుగంటల వరకూ పోటా పోటీలుగా పాటలు పాడుకుంటూనే వున్నాము. ఏదో ఒక పాట గురించి చర్చ మొదలు పెట్టి పాట పాడుకుంటూ గడిపిన ఆరాత్రి ఈనాటికీ నామనసులో తాజాగానే రాగాలు తీస్తుంది.
తర్వాత ఏడాది నేను పదవీ విరమణ అయ్యాక వీర్రాజుగారూ, నేనూ ఒక అవార్డు మొదలు పెట్టాలనుకుని ఆ ప్రయత్నం కాకుండా ఎవరైనా ఏదైనా కారణం చేత పుస్తకాలు వేసుకోని రచయితల ఒక పుస్తకం 500 కాపీలు వేసి వాళ్ళకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం .ఆ కోవలో మొట్ట మొదటగా అంతకు ముందు ఈనాడు పత్రికలో ధారావాహికంగా వచ్చిన డి. సుజాతాదేవి' ఆటలో అరటి పండు' పిల్లలకథల్ని పుస్తకరూపంలో వేసి సుజాతకు ఇచ్చాము .
బందరులో గుత్తికొండసుబ్బారావుగారు వారి స్పందన సాహితి తరపున ఆ పుస్తకానికి ఆవిష్కరణ ఏర్పాటు చేసారు. ఆ సభలో నేను ఆవిష్కర్తగా, ఇంద్రగంటి జానకీబాల వక్తగా పాల్గొన టానికోసం ముగ్గురం కలసి ట్రైన్ లో వెళ్ళాం సుబ్బారావుగారి ఇంట్లోనే మాకు వసతి ఏర్పాటు చేసారు.
ప్రయాణమంతానే కాక ఆరెండురోజులు మా ముగ్గురికీ సాహిత్యసంబరమే. ఆ ప్రయాణం మా ముగ్గురినీ మరింత దగ్గర చేసింది.
సుజాత ఆంధ్రమహిళాసభ లిటరసీ హౌస్ లో ఉద్యోగంచేరినరోజుల్లోనూ, బ్రౌను అకాడమీలో పనిచేసినపుడూ కూడా తరుచూ మేము ముగ్గురం కలిసే వాళ్లం.ఒక్కొక్కప్పుడు అత్తలూరి విజయలక్ష్మీ,భార్గవీరావూ కలిసేవారు.కొత్తగా రాసుకున్న కవితో,కథో చదువుకునే వాళ్ళం,పాటలు పాడుకునేవాళ్ళం.అయితే అందరం కలిసి ఒకగొలుసు కథ రాయాలనుకున్న మా ప్రయత్నం మాత్రం కార్యరూపం దాల్చలేదు.
అకస్మాత్తుగా ఒక రోజు రాంకోఠీ కిమ్స్ హాస్పిటల్ లో హార్ట్ ఆపరేషన్ జరిగిందని తెలిసి నేను హాస్పిటల్లో కలిసాను. వాళ్ళ అమ్మాయి "ఆమెను ఉద్యోగం రాజీనామా చేయించి నల్గొండ తన దగ్గరకు తీసుకు వెళ్ళిపోతున్నానని, హైదరాబాద్ లో మరి ఉంచదలచుకోలేద"ని చెప్పినప్పుడు నేను బాధ పడ్డాను .
"ఆఫీసు దగ్గరగా ఇల్లు తీసుకొని ఇక్కడవుంటేనే సుజాతకు బాగుంటుందేమో. నువ్వు ఎలాగూ నల్గొండలోనే వుంటావుకనుక తరుచుగారావచ్చు "అని సలహా ఇవ్వ బోయాను. కానీ నల్గొండ తీసుకు వెళ్ళిపోయారు.
అప్పుడప్పుడు సభల కోసమో, ఏదైనా అవసరార్థమో హైదరాబాదు వచ్చినపుడు కలుస్తూనే ఉన్నాను. సుజాత పెద్దమ్మాయి కొడుకు పెళ్లిలో జానకీ బాలతో సహా మేము ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకున్నాం.
మాడభూషి రంగాచార్యులు స్మారక
పురస్కారం సుజాతాదేవి రాసిన 'చేపలు' కథల సంపుటికి వచ్చినప్పుడూ, మాడభూషి రంగాచార్యుల పురస్కారాల పదేళ్ళ వేడుక సందర్భంగా కూడా మేము కలుసుకున్నాము. అప్పుడే అనుకుంటాను వీర్రాజుగారిని ఇంటర్వ్యూ చేస్తానని వచ్చి రోజంతా మా యింట్లో గడిపింది. ఇలా ఎంతమంది ప్రముఖులనో ఇంటర్వ్యూలను చేసి " ముఖాముఖే సరస్వతి " అనే పేరుతో సుజాత
సంకలనంగా వేసింది.
సుజాతాదేవి సాహిత్యం గురించి చెప్పుకుంటే బాలసాహిత్యంలో ఎంత కృషి చేసిందో, కథారచనలోనూ అంతటి కృషి చేసింది. ఈమె రాసిన చేపలు కథగానీ, సవరాలు కట్టి జీవించే
వారి కధ ' ఎటు చూస్తే అటు', వెట్టిచాకిరీ చేసే బాబ్జీ కథ 'మలుపు', షాపుల ముందు వూడ్చే పనివారి జీవితం 'ఇంతేలే', ఆర్థికంగా వెసులు బాటులేని జీవితాల కథ 'వృత్తం' ఇలా ఏ కథ తీసుకున్నా సుజాత స్వీకరించిన పలు కథాంశాలు అప్పట్లో రచయిత్రులే కాక రచయితలు కూడా సాహిత్యంలోకి తీసుకు రాలేదు -
ఏవో గాలి కబుర్లతో రచనలు చేయటం కాకుండా, సాహిత్యవిలువలు, సామాజిక బాధ్యత తెలిసినది కావటాక ఏ ప్రక్రియ చేపట్టినా నిబద్ధతతో ప్రతిభావంతంగా రాస్తుంది సుజాతాదేవి,
మాకు ఎంతో సంతోషం, సంతృప్తి కలిగించినది ఒకటి వుంది.అదేమిటంటే మేము ప్రచురించి ఇచ్చిన 'ఆటలో అరటిపండు' పుస్తకానికే సుజాతాదేవికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రావటం మాకే వచ్చినంతగా సంబరపడ్డాము నేను, వీర్రాజుగారు.
రెండు మూడేళ్ళుగా సుజాత ఫోన్లు చేస్తున్నా ఆమె మాటలు కొంత అసంబద్ధంగా ఉండటం గమనించి ఆమె పిల్లలతో మాట్లాడాను. "అల్జీమర్ ' లక్షణాలు అప్పట్లోనే గమనించాను. కాని నేను సాహిత్యం గురించి,పాత రచయిత్రుల గురించి మాట్లాడినప్పుడు మామూలు గానే తన అభిప్రాయాలు చెప్తూనే వుంది. భగవద్గీత అంశాలను పాటలుగా రాస్తున్నానని ఫోన్ చేసినపుడు పాడి వినిపించేది. ఫోను చేసినపుడల్లా ఆమెతో " మొత్తం పాటలు తొందరగా రాయటం పూర్తి చేసి పుస్తకంగానో, కేసెట్ గానో చేయమని ప్రోత్సహిస్తూ మాట్లాడేదాన్ని. అప్పటికి అదే ప్రయత్నంలో వున్నానని చెప్తుండేది.
2022 మార్చిలో వీర్రాజుగారి పెయింటింగ్స్ దామెర్ల కళానికేతన్ కి వితరణ చేసిన సందర్భంలో వెళ్ళినప్పుడు కమల వాళ్ళు అమ్మ సుజాతని మేమున్న హోటలుకు తీసుకు వచ్చింది. సుజాత నన్ను గుర్తుపట్టి మాట్లాడిందికాని మధ్య మధ్యలో మౌనంలోకి జారిపోవటం చూసి నేను దిగులు పడ్డాను. అదే నేను ఆమెను ఆఖరు సారి చూడటం.
సుజాతకు ఫోను అందుబాటులో లేకుండా అయిపోవటం వలన అమ్మూయికి సందేశాలు పంపి ఆమెగురించి తెలుసుకునేదాన్ని.
మాడభూషి లలితా దేవీ,నేనూ సుజాత ను చూడటానికి రాజమండ్రివెళ్ళాలని చాలా సార్లు అనుకున్నాము.కానీ కార్యరూపం దాల్చలేదు.
మూడు నెలల క్రితం ఏప్రిల్ లో సుజాత పుట్టినరోజుకి అమ్మాయి కమల నెంబరుకి శుభాకాంక్షలు పంపాను. కమల తన ఫోన్ నుండి నాకు ఫోను చేసి సుజాతకి అందించింది. సుజాత ఫోను చేసి నప్పుడల్లా " ఏమేమి చూసారు? ఇంకేమేమి రాసారు.ఎవరితో సరదాలు తీర్చుకున్నారు " అంటూ పాటతో పలకరించటం అలవాటు, ఎప్పట్లాగే ఆరోజు కూడా అలాగే పలకరించింది. సుజాత అలా పాటతో పలకరించటం, నేను ఫక్కున నవ్వి సమాధానం చెప్పటం ఎన్నేళ్ళుగానో మామధ్యజరుగుతూనే వుండేది.
ఇప్పుడు ఆ నవ్వూ తరలిపోయింది.పాటా కరిగిపోయింది.
ఎప్పుడో ఒకసారి కాకపోతే ఒకసారైనా ఫోను చేస్తావని ఎదురుచూస్తూ వుండేదాన్ని.
"ఆ చిన్నినవ్వుతో ఆ చిలిపి నవ్వుతో
ఇంక నన్ను అలా పలకరించేవారు ఎవరు సుజాతా"
(స్నేహితులదినోత్సవం రోజున అల్జీమర్స్ తో బాధపడుతూ ఆగష్టు నాలుగో తేదీన కన్నుమూసిన ఆత్మీయ స్నేహితురాలు, రచయిత్రి డి.సుజాతాదేవికి
కన్నీళ్ళతో రాసిన అక్షరాంజలి.)
ఇస్కూలు కతలు సమీక్ష
శీలా శుభద్రాదేవిగారి "ఇస్కూలు కతలు"
ప్రభుత్వోపాధ్యాయులకెదురయ్యే మొట్టమొదటి సమస్య-అదనపు బాధ్యతలు.
పేద పిల్లల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ మొదలు జనగణన దాకా అన్నింటిలోనూ అయ్యవార్ల పాత్ర ఉండాల్సిందే. ఒక్క మనిషి అన్ని పాత్రలు ఏకకాలంలో ఎలా పోషించగలడనే విషయం ఈ ప్రభుత్వాలకు తెలియదా? మేమేం మనుషులం కాదా? అంటూ ప్రశ్నించడం మొదలుపెడితే అది హక్కుల సాధన వైపుగా నడిపిస్తుంది. ప్రభుత్వాలని బోనులో నిలబెడుతుంది. ఒకవేళ ఆ అయ్యవార్లకే సామాజిక అభివృద్ధిలో తమవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నామనే ఎరుక కలిగితే? అది బాధ్యతలని మరింత ప్రభావయుతంగా నడిపేవైపుగా ముందడుగు వేయిస్తుంది. అప్పుడు విద్యార్థి అంటే కేవలం విద్యార్థి మాత్రమే కాదనీ అతని కుటుంబ నేపథ్యం కూడా అతనిలోంచీ విడదీయరాని ప్రధానాంశమనే అవగాహన కలుగుతుంది. అది కలిగాలేగానీ అయ్యవార్లకీ పిల్లకాయలకీ మధ్య ఒకానొక బాంధవ్యం పెనవేసుకుపోతుంది. అప్పుడు వారి పట్ల జాలి కలగదు. వారినా పరిస్థితుల్లోంచీ బయట పడెయ్యడం ఎలా? అనే ఆలోచన కలుగుతుంది. అలాంటి ఆలోచనలు రేకెత్తించే కథల పుస్తకమే,"ఇస్కూలు కతలు"
పిల్లలకీ తల్లిదండ్రులకీ ఎలాంటి అనుబంధం ఉంటుందో అలాంటి సంబంధమే ఉపాధ్యాయులకీ విద్యార్థులకీ మధ్య కూడా ఉండాలి. అది ఉన్నప్పుడు విద్యార్థుల ప్రశ్నలకి సమాధానాలు మాత్రమే కాదు, వారి సమస్యలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. అలాంటి పరిష్కారాలు కనుగొన్నప్పుడు కలిగే ఆనందాన్ని జీతాలుగానీ, పదోన్నతులుగానీ, హంసతూలికా తల్పాలవంటి సవాలక్ష సుఖాలుగానీ ఇవ్వలేవు. సుఖాల సరిహద్దుల్ని చెరపడానికీ ఆనందపుటంచులు తాకడానికీ తేడా తెలుసుకోవలసిన మొట్టమొదటి బుద్ధిజీవి అయ్యవారే. ఆ తేడా తెలియజేసేవి ఉపాధ్యాయులకు పనిభారాన్ని పెంచే అదనపు బాధ్యతలే. ఆ అదనపు బాధ్యతలు వారికి సమాజంతో నేరుగా"ముఖా-ముఖీ"ని ఏర్పాటు చేస్తాయి. అందుకే ప్రజల సమస్యలు అందరికంటే ఎక్కువగానూ ముందుగానూ అయ్యవార్లకే తెలుస్తాయి. అందుకే ముందు తరాల్ని ఉన్నతీకరించే సాహిత్య సృజనకారుల్లో అధికశాతం ఉపాధ్యాయులే అయివుంటారు. అది అయ్యవార్లకీ అమ్మయ్యలకీ గర్వకారణం. ఒకవేళ సృజనకారులు ఉపాధ్యాయ వృత్తిలో లేకపోయినా వారిలో బోధనా సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఎందుకంటే విద్యాబోధనని మించిన సృజనాత్మక కళ మరొకటి లేదు. ఉపాధ్యాయులకు బోధన-విద్యార్థులకు సాధన. ఈ రెండూ అర్థ పూర్ణాలు. వాటిని పరిపూర్ణంగా చెయ్యడం మార్కులు, ర్యాంకులవల్ల కాని పని. ఈ విషయం దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా నిరూపితం అవుతూనే ఉంది. దాన్ని అందరికీ తెలియజేసే బాధ్యతని తలకెత్తుకున్న అరుదైన ఉపాధ్యాయిని అరుంధతి. ఆవిడకి సంబంధించిన ముప్ఫై కథలున్నాయిందులో.
ఇందులోని కథలన్నీ చిన్నవి. నాలుగు పుటలకి మించవు. కాబట్టీ ఏ కథా చదువరినించీ ఎక్కువ సమయాన్ని తీసుకోదు. వస్తుపరిధిని దాటి ఒక్కవిషయం కూడా ఉండదు. కథకి అవసరంలేని మాట ఒక్కటికూడా కనపడదు. దేనికదే క్లుప్తంగా సూటిగా స్పష్టంగా చెప్పాల్సింది మాత్రమే చెబుతుంది. కనుక చదవడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. చాలా సరళమైన భాష. సుభద్రాదేవిగారు స్వతహాగా కవయిత్రి కాబట్టీ కథలన్నీ కవితామయంగానూ తరచి చూస్తే తప్ప కనపడని భావాలతోనూ నిండి ఉంటాయేమోనని సందేహించాల్సిన అవసరం లేదు. కథ చెప్పేటప్పుడు కవయిత్రిలా వర్తించకుండా నిగ్రహం పాటించడం వల్లనే ఇది సాధ్యపడింది. అందుకే అరటిపండు వలిచిపెట్టినంత చులాగ్గా సాగుతుంది పఠనం. ఇందులో కథలన్నీ అయ్యవార్లందరికీ అనుభవంలోకి వచ్చేవే. కనుక ఆయా సందర్భాలెదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎలాటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకోవడానికైనా ఉపాధ్యాయులందరూ ఈ కథలు చదవాలి. అందుకే ఈ కథలన్నింటినీ "తెలుగు విద్యార్థి" ధారావాహికంగా ప్రచురించింది. మహారాష్ట్రలోని ఏడవ తరగతి తెలుగు విద్యార్థులకి "ఒకే తాను ముక్కలం"పాఠ్యాంశం.
ఇంక కథల గురించి:
ఇవి "బాధ్యతల్ని గుర్తు చేసే కతలు"అంటూ కథల తూకం వేశారు గంటేడ గౌరునాయుడు. తరవాత "నామాట"మీదుగా వచ్చి ఉపాధ్యాయులకి "అందరం ఒకేతాను ముక్కలం" అని తెలియజెప్పడం ద్వారా అందరి మనసూ గెలుచుకుంటుంది అరుంధతి. ఆ తరువాతే ఆత్మీయంగా ఆరంభమౌతుంది ఆమె పయనం. ఎవరికైనా నడక ఆరంభించగానే ఎదురయ్యే మొదటి ప్రశ్న..,"ఈ దారి ఎక్కడికి?"
దానికి సమాధానమిచ్చే క్రమంలో కొందరు "పరాన్న భుక్కులు"ఎలా ఉంటారో పరిచయం చేసి, విద్యార్థులతో"నువ్వు నేర్పిన విద్యయే"అనిపిస్తారు. ఒకవేళ ఏదైనా "మూఢనమ్మకం"మీద "ఆరాధన" పెంచుకుంటే ఏం జరుగుతుంది? అది "బాధ్యత"లనుండి తప్పించి "పరిస్థితులకు బానిసలు"గా మార్చి "పనిదొంగలు"గా తీర్చి చివరికి "అవును, ఇది సర్కారు బడి మరి!"అనే నైరాశ్యానికి దారితీస్తుంది. "లేత మనసులపై మలిన ముద్రలు" వేస్తుంది. అలాంటప్పుడు పూలబాలలు పెంచిన మంచిని చూపిస్తూ,"ఆమాత్రం చాలు, మనసు పులకించడానికి"అని బుజ్జగిస్తుంది. అంతలోనే కొందరి "మరుగుజ్జు బుద్ధులు"తమ చుట్టూ ఉన్న "పరిసరాలు-పక్కదారులు" తొక్కించే "పందికొక్కులు"ఎలా ఉంటాయో చూపిస్తుంది. వాటినించీ తప్పించుకోవాలనుకునే"లేతమనసులకు, ధైర్యమే లేపనం"అని చెబుతాయి. ఇంతకీ అసలు "తప్పెవరిది?"అని "చేజారిపోతున్న బాల్యం" దీనంగా చూస్తూ"పేదరికపు అంచున"నిరాశా నిస్పృహలతో కర్తవ్య విమూఢంగా నిలబడిపోతుంది. అలాంటప్పుడు ఎవరైనా"లోగుట్టు"కనిపెట్టే ప్రయత్నం చేస్తే"కదిలిన అధికార పీఠం" స్వామికార్యం-స్వకార్యాలని" ఏకకాలంలో చక్కబెట్టగల "భోక్తలు"ఎక్కడ దొరుకుతారా అని గాలించడం మొదలుపెడుతుంది.
"సినిక్ సెన్స్" ఎక్కువైతే "కక్కూర్తి కూడా జాడ్యమే"అవుతుందని చెబుతుంది అరుంధతి. అంతేకాదు "ఆఫీసు జలగలు" పట్టుకుంటే "బకాసురుడు" తినడానికి ఎముకలు తప్ప ఏమీ మిగలదని వివరిస్తుంది. అయితే"చాణక్య రాజకీయం"విసిరే "మోహవలయాలు" ఎంత ఆకర్షిస్తున్నా లొంగకుండా ఏమాత్రం లౌల్యానికి లోనుకాకుండా తన జీవితంలో "తృప్తి"ని కలిగివుండి సమాజాన్ని సేవించుకోవడమే ఉపాధ్యాయ వృత్తికి పరమార్థమని నిరూపిస్తూ శీలా సుభద్రాదేవి పరిచయంతో ముగిస్తుంది. శ్రద్ధగా చదివిన ఉపాధ్యాయునికి మాత్రం భవిష్యత్కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికా రచనకు తగిన స్ఫూర్తినిస్తుంది. ఏ పుస్తకానికైనా ఇంతకంటే కాగల కార్యం ఏముంటుంది-గంధర్వులు తీర్చడానికి?
- jsr Murthy
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)