8, ఆగస్టు 2024, గురువారం
బాలల నేస్తం సుజాతా దేవితో నేను
~ బాలల నేస్తం: డి.సుజాతాదేవితో నేను ~
మాట మలయానిలయం, పాట తేనెల సోన, గేయం వెన్నెల వాక. మరికథో సమాజం మారుమూలలోకి దృష్టి సారించి పరిశీలించి నివ్వెరపోయేలారాసిన అపురూపకథలు.నేలమీద సాము చేయని, నిబద్ధతతో కూడిన కథలు.బాలలనేస్తం, స్నేహపూరితరూపం ఆమే
రచయిత్రి డి. సుజాతాదేవి.
డి. సుజాతాదేవి పేరు వింటే సాహిత్యరంగంలో కొందరు 'ఆమె బాల సాహిత్య రచయిత్రి ' అంటారు. మరికొందరు 'గేయం రాస్తుంది' అంటారు. తమ రచనలు తప్ప ఇతరుల రచనలు చదివే అలవాటు లేని వాళ్ళు 'ఎవరామె? ఏమిటి రాసింది? ఎప్పుడూ పేరు విన్నట్లు లేదే?' అని బోలెడు ఆశ్చర్యంతో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
సుజాత ఎంత రాసింది? ఏమి రాసింది? అనేది అటువంటివారికోసం బయోడాటా చెప్పాల్సిన అవసరం కూడా వుంది అనుకుంటున్నాను. 1970లో సాహిత్యరంగంలోకి అడుగుపెట్టి మూడు కథాసంపుటాలు, మూడు పాటల పుస్తకాలు, ఒక గేయకావ్యం, మూడు నవలలు, ఒక వ్యాసాల పుస్తకం, ప్రముఖులతో చేసిన ముఖాముఖీల సంకలనంతో పాటు రెండు పాటలు కేసెట్లు వెలువరించారని చాలా మందికి తెలియదు. NCERT వాళ్ళ పురస్కారం, బాలల నవలకి జాతీయ పురస్కారం, బాలల లఘుచిత్రానికి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నారన్న విషయం అనేక మందికి తెలియదు. బహుశా 2013 లో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారనే విషయం కొందరికైనా తెలిసే వుంటుంది అనుకుంటాను మరి.
ఇంత కృషిచేసి కూడా ప్రచార పటాటోపం చేసుకోవటం తెలియని సుజాతాదేవి కొంతకాలంగా అంతర్ముఖీనమై, అనేక కారణాలవలన, అనారోగ్యం వలన బాహ్యసమాజానికి దూరమై పోయింది.
సుమారు యాభై ఏళ్ళక్రితం సుజాతతోటి నా పరిచయం రాను రాను స్నేహబంధంగా గాఢమైంది. అనేక సభలలో సమావేశాల్లో కలిసిన మేము తర్వాత తర్వాత మూడునాలుగేళ్ళ క్రితం వరకూ ఫోనులో సాహిత్యం గురించి చర్చలూ, ఒక్కొకప్పుడు ఫోనులోనే పాటలూ,కథలూ రాగరంజితంగా మాట్లాడుకునే వారం.
పద్దెనిమిది ఏళ్ళక్రితం భార్గవీ రావు, ఇంద్రగంటి జానకీబాల, అత్తలూరి విజయలక్ష్మి, నేనూ పాపికొండలకు ప్రయాణం కట్టాము . రాజమండ్రిలో సుజాత కూతురు కమల ఇంట్లోనే దిగాము. పడుకోటానికి వేసుకున్నపక్కలమీద చేరి ఆరాత్రి రెండుగంటల వరకూ పోటా పోటీలుగా పాటలు పాడుకుంటూనే వున్నాము. ఏదో ఒక పాట గురించి చర్చ మొదలు పెట్టి పాట పాడుకుంటూ గడిపిన ఆరాత్రి ఈనాటికీ నామనసులో తాజాగానే రాగాలు తీస్తుంది.
తర్వాత ఏడాది నేను పదవీ విరమణ అయ్యాక వీర్రాజుగారూ, నేనూ ఒక అవార్డు మొదలు పెట్టాలనుకుని ఆ ప్రయత్నం కాకుండా ఎవరైనా ఏదైనా కారణం చేత పుస్తకాలు వేసుకోని రచయితల ఒక పుస్తకం 500 కాపీలు వేసి వాళ్ళకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం .ఆ కోవలో మొట్ట మొదటగా అంతకు ముందు ఈనాడు పత్రికలో ధారావాహికంగా వచ్చిన డి. సుజాతాదేవి' ఆటలో అరటి పండు' పిల్లలకథల్ని పుస్తకరూపంలో వేసి సుజాతకు ఇచ్చాము .
బందరులో గుత్తికొండసుబ్బారావుగారు వారి స్పందన సాహితి తరపున ఆ పుస్తకానికి ఆవిష్కరణ ఏర్పాటు చేసారు. ఆ సభలో నేను ఆవిష్కర్తగా, ఇంద్రగంటి జానకీబాల వక్తగా పాల్గొన టానికోసం ముగ్గురం కలసి ట్రైన్ లో వెళ్ళాం సుబ్బారావుగారి ఇంట్లోనే మాకు వసతి ఏర్పాటు చేసారు.
ప్రయాణమంతానే కాక ఆరెండురోజులు మా ముగ్గురికీ సాహిత్యసంబరమే. ఆ ప్రయాణం మా ముగ్గురినీ మరింత దగ్గర చేసింది.
సుజాత ఆంధ్రమహిళాసభ లిటరసీ హౌస్ లో ఉద్యోగంచేరినరోజుల్లోనూ, బ్రౌను అకాడమీలో పనిచేసినపుడూ కూడా తరుచూ మేము ముగ్గురం కలిసే వాళ్లం.ఒక్కొక్కప్పుడు అత్తలూరి విజయలక్ష్మీ,భార్గవీరావూ కలిసేవారు.కొత్తగా రాసుకున్న కవితో,కథో చదువుకునే వాళ్ళం,పాటలు పాడుకునేవాళ్ళం.అయితే అందరం కలిసి ఒకగొలుసు కథ రాయాలనుకున్న మా ప్రయత్నం మాత్రం కార్యరూపం దాల్చలేదు.
అకస్మాత్తుగా ఒక రోజు రాంకోఠీ కిమ్స్ హాస్పిటల్ లో హార్ట్ ఆపరేషన్ జరిగిందని తెలిసి నేను హాస్పిటల్లో కలిసాను. వాళ్ళ అమ్మాయి "ఆమెను ఉద్యోగం రాజీనామా చేయించి నల్గొండ తన దగ్గరకు తీసుకు వెళ్ళిపోతున్నానని, హైదరాబాద్ లో మరి ఉంచదలచుకోలేద"ని చెప్పినప్పుడు నేను బాధ పడ్డాను .
"ఆఫీసు దగ్గరగా ఇల్లు తీసుకొని ఇక్కడవుంటేనే సుజాతకు బాగుంటుందేమో. నువ్వు ఎలాగూ నల్గొండలోనే వుంటావుకనుక తరుచుగారావచ్చు "అని సలహా ఇవ్వ బోయాను. కానీ నల్గొండ తీసుకు వెళ్ళిపోయారు.
అప్పుడప్పుడు సభల కోసమో, ఏదైనా అవసరార్థమో హైదరాబాదు వచ్చినపుడు కలుస్తూనే ఉన్నాను. సుజాత పెద్దమ్మాయి కొడుకు పెళ్లిలో జానకీ బాలతో సహా మేము ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకున్నాం.
మాడభూషి రంగాచార్యులు స్మారక
పురస్కారం సుజాతాదేవి రాసిన 'చేపలు' కథల సంపుటికి వచ్చినప్పుడూ, మాడభూషి రంగాచార్యుల పురస్కారాల పదేళ్ళ వేడుక సందర్భంగా కూడా మేము కలుసుకున్నాము. అప్పుడే అనుకుంటాను వీర్రాజుగారిని ఇంటర్వ్యూ చేస్తానని వచ్చి రోజంతా మా యింట్లో గడిపింది. ఇలా ఎంతమంది ప్రముఖులనో ఇంటర్వ్యూలను చేసి " ముఖాముఖే సరస్వతి " అనే పేరుతో సుజాత
సంకలనంగా వేసింది.
సుజాతాదేవి సాహిత్యం గురించి చెప్పుకుంటే బాలసాహిత్యంలో ఎంత కృషి చేసిందో, కథారచనలోనూ అంతటి కృషి చేసింది. ఈమె రాసిన చేపలు కథగానీ, సవరాలు కట్టి జీవించే
వారి కధ ' ఎటు చూస్తే అటు', వెట్టిచాకిరీ చేసే బాబ్జీ కథ 'మలుపు', షాపుల ముందు వూడ్చే పనివారి జీవితం 'ఇంతేలే', ఆర్థికంగా వెసులు బాటులేని జీవితాల కథ 'వృత్తం' ఇలా ఏ కథ తీసుకున్నా సుజాత స్వీకరించిన పలు కథాంశాలు అప్పట్లో రచయిత్రులే కాక రచయితలు కూడా సాహిత్యంలోకి తీసుకు రాలేదు -
ఏవో గాలి కబుర్లతో రచనలు చేయటం కాకుండా, సాహిత్యవిలువలు, సామాజిక బాధ్యత తెలిసినది కావటాక ఏ ప్రక్రియ చేపట్టినా నిబద్ధతతో ప్రతిభావంతంగా రాస్తుంది సుజాతాదేవి,
మాకు ఎంతో సంతోషం, సంతృప్తి కలిగించినది ఒకటి వుంది.అదేమిటంటే మేము ప్రచురించి ఇచ్చిన 'ఆటలో అరటిపండు' పుస్తకానికే సుజాతాదేవికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రావటం మాకే వచ్చినంతగా సంబరపడ్డాము నేను, వీర్రాజుగారు.
రెండు మూడేళ్ళుగా సుజాత ఫోన్లు చేస్తున్నా ఆమె మాటలు కొంత అసంబద్ధంగా ఉండటం గమనించి ఆమె పిల్లలతో మాట్లాడాను. "అల్జీమర్ ' లక్షణాలు అప్పట్లోనే గమనించాను. కాని నేను సాహిత్యం గురించి,పాత రచయిత్రుల గురించి మాట్లాడినప్పుడు మామూలు గానే తన అభిప్రాయాలు చెప్తూనే వుంది. భగవద్గీత అంశాలను పాటలుగా రాస్తున్నానని ఫోన్ చేసినపుడు పాడి వినిపించేది. ఫోను చేసినపుడల్లా ఆమెతో " మొత్తం పాటలు తొందరగా రాయటం పూర్తి చేసి పుస్తకంగానో, కేసెట్ గానో చేయమని ప్రోత్సహిస్తూ మాట్లాడేదాన్ని. అప్పటికి అదే ప్రయత్నంలో వున్నానని చెప్తుండేది.
2022 మార్చిలో వీర్రాజుగారి పెయింటింగ్స్ దామెర్ల కళానికేతన్ కి వితరణ చేసిన సందర్భంలో వెళ్ళినప్పుడు కమల వాళ్ళు అమ్మ సుజాతని మేమున్న హోటలుకు తీసుకు వచ్చింది. సుజాత నన్ను గుర్తుపట్టి మాట్లాడిందికాని మధ్య మధ్యలో మౌనంలోకి జారిపోవటం చూసి నేను దిగులు పడ్డాను. అదే నేను ఆమెను ఆఖరు సారి చూడటం.
సుజాతకు ఫోను అందుబాటులో లేకుండా అయిపోవటం వలన అమ్మూయికి సందేశాలు పంపి ఆమెగురించి తెలుసుకునేదాన్ని.
మాడభూషి లలితా దేవీ,నేనూ సుజాత ను చూడటానికి రాజమండ్రివెళ్ళాలని చాలా సార్లు అనుకున్నాము.కానీ కార్యరూపం దాల్చలేదు.
మూడు నెలల క్రితం ఏప్రిల్ లో సుజాత పుట్టినరోజుకి అమ్మాయి కమల నెంబరుకి శుభాకాంక్షలు పంపాను. కమల తన ఫోన్ నుండి నాకు ఫోను చేసి సుజాతకి అందించింది. సుజాత ఫోను చేసి నప్పుడల్లా " ఏమేమి చూసారు? ఇంకేమేమి రాసారు.ఎవరితో సరదాలు తీర్చుకున్నారు " అంటూ పాటతో పలకరించటం అలవాటు, ఎప్పట్లాగే ఆరోజు కూడా అలాగే పలకరించింది. సుజాత అలా పాటతో పలకరించటం, నేను ఫక్కున నవ్వి సమాధానం చెప్పటం ఎన్నేళ్ళుగానో మామధ్యజరుగుతూనే వుండేది.
ఇప్పుడు ఆ నవ్వూ తరలిపోయింది.పాటా కరిగిపోయింది.
ఎప్పుడో ఒకసారి కాకపోతే ఒకసారైనా ఫోను చేస్తావని ఎదురుచూస్తూ వుండేదాన్ని.
"ఆ చిన్నినవ్వుతో ఆ చిలిపి నవ్వుతో
ఇంక నన్ను అలా పలకరించేవారు ఎవరు సుజాతా"
(స్నేహితులదినోత్సవం రోజున అల్జీమర్స్ తో బాధపడుతూ ఆగష్టు నాలుగో తేదీన కన్నుమూసిన ఆత్మీయ స్నేహితురాలు, రచయిత్రి డి.సుజాతాదేవికి
కన్నీళ్ళతో రాసిన అక్షరాంజలి.)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి