16, ఆగస్టు 2024, శుక్రవారం
నాకు నచ్చిన నా రచన - యుద్ధం ఒక గుండె కోత
నాకు నచ్చిన నా రచన – యుద్ధం ఒక గుండెకోత - నేపథ్యం
ఆధునిక కథానికకు ఆద్యుడైన గురజాడ అడుగుజాడలు విజయనగరంలో జన్మించడం వలన కావచ్చు, నా తోబుట్టువులు పి. సరళాదేవి, కొడవంటి కాశీపతిరావులు కథకులు కావటం వలన కావచ్చు, అప్పట్లో వచన సాహిత్య పఠనం వలన కావచ్చు. 1970లో కథారచనతోనే నా సాహిత్య ప్రవేశం జరిగింది.
శీలావీర్రాజుగారితో వివాహానంతరం భాగ్యనగరంలో అడుగుపెట్టాక ముఖచిత్రాల కోసం ఇంటికి కవులు ఎక్కువగా రావడం, ఇంట్లో కవిత్వ పుస్తకాలే ఎక్కువగా ఉండడంతో కవిత్వ పఠనం ఎక్కువైంది. రానురాను ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, పిల్లలూ, ఆర్థిక సంక్షోభం వీటన్నిటితో సమయం, సావకాశం లేని పరిస్థితుల్లో మనసులోని సంఘర్షణ, ఆలోచనలు పేపరుమీద పెట్టేందుకు కవిత్వ రచనవైపు మొగ్గుచూపాను. ఆ విధంగా కవితారంగంలోకి వచ్చినా కథారచనని పూర్తిగా వదిలేయలేదు. 1975లో మొదటి కవిత ప్రచురితమైన నాటి నుండి అవిశ్రాంతంగా రాస్తూనే ఉన్నాను. ఈ 50 ఏళ్ళ కాలంలో ఏడు కవితాఖండికల సంపుటులు, రెండు దీర్ఘ కావ్యగ్రంథాలు, మూడు కథానికా సంపుటాలు, వ్యాససంపుటి, రెండు మోనోగ్రాఫ్ లు, ఒక నవల వెలుగుచూసాయి.
నా రచనలన్నీ నాకిష్టమైనవే అయినా పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందిన 'యుద్ధం ఒక గుండె కోత' పట్ల నాకు మరింత మక్కువ.
2001 సెప్టెంబరు 11న అమెరికాలోని జంట టవర్లను ఉగ్రవాదులు కూల్చిన దుర్ఘటనతో ఈ దీర్ఘ కావ్యం మొదలౌతుంది. తదనంతరం అమెరికా, ఆఫ్ఘన్ యుద్ధ నేపథ్యంలో జరిగిన అనేకానేక సంఘటనలు జన జీవితంలో కలిగించిన ప్రకంపనలు, కవిత అంతటాపరచుకుంటాయి. రెండు నెలల వ్యవధిలోనే రాసి డిసెంబరు నాటికి గ్రంథ రూపంలోకి తీసుకువచ్చాను.
ఇందులో యుద్ధమూలాలు అన్వేషించటమేకాక, మత విద్వేషాలు యుద్ధానికెలా దోహదమౌతాయో, ఎన్ని కుటుంబాలు, సంక్షోభాలలో ఇరుక్కుంటాయో, యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఎందరు తల్లులు గర్భశోకంలో గుండెకోతను అనుభవిస్తారో, వీటన్నిటికీ నా దృష్టి కోణంలో కార్యకారణాలను అక్షరీకరించాను.
యుద్ధం ఒక గుండెకోతను ముప్ఫై అధ్యాయాలుగా రాసాను. ప్రతీ అధ్యాయంలో యుద్ధం ఏ విధంగా జనజీవనాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందో తెలియజేశాను. యుద్ధోన్మాదులైన నాయకుల మనస్తత్వానికి కారణాలూ, అమాయక ప్రజల ధన మాన ప్రాణాల్ని కొల్లగొట్టే మత విద్వేష రాక్షస ప్రవృత్తికి మూలాలూ, బాల్యంలోనే హింసా ప్రవృత్తికి బీజం వేస్తున్న పరిస్థితులూ అక్షరీకరించాను.
“బాధ/సన్నటి సూదిములుకై / రక్తంలో ప్రవేశించింది/నరాల్ని కుట్టుకుంటూ/ శరీరమంతటా / ప్రవహించటం మొదలైంది" అంటూ ఈ కావ్యాన్ని ప్రారంభించాను. ఆకాశం నిండా లోహ విహంగాలు పెనుబాంబులుగా రూపాంతరం చెంది పెఠేల్ మంటే ఎక్కడో ఏ మూలో తల్లిపేగు ఎలా ఖణేల్ మంటుందో, యుద్ధం చేసే గాయాల చారికల్ని తల్లి గర్భంపై చూపాను. యుద్ధాలకు ప్రధాన కారణంగా మారుతోన్న మతాల్ని నిరసించాను.
"నిజానికి మనం మతాల్ని కడుపులో మోయం కదా తల్లులారా మీరన్నా చెప్పండి / మీరెవరైనా మతాన్ని గర్భంలో దాచుకున్నారా” అని ప్రశ్నించి గర్భాన పుట్టిన వాళ్ళని అనామికలుగా పెంచుదాం. పుట్టాక వారి పేరు వారే సంపాదించుకుంటారని నివేదించాను.
అసలైన యుద్ధం మొదలైంది గుండె కేన్వాసుపై కన్నీటితో లిఖిస్తున్న స్త్రీల ఆలోచనల్లోనే అని ప్రతిపాదించాను.“ఎక్కడ ఏ యుద్ధం జరిగినా / పరిజన సమేతంగా దిగుడు బావుల్లో దూకాల్సిందే / అంతఃపురాలు ఆహుతి కావల్సిందే కదా” అని అనాదిగా జరిగిన చారిత్రక యుద్ధ పరిణామాల్ని అక్షరబద్ధం చేశాను.
“ఆయుధాలతో బిళ్ళంగోడి ఆడుతూ / అక్షరాలు దిద్దాల్సిన వయసులో / అమ్ముల పొదులౌతోన్న బాల్యం” గూర్చి కన్నీరు కార్చాను. పసితనంలోనే హింసాయుత క్రీడల్ని మనమే అలవాటు చేస్తున్నామా అని మథనపడ్డాను. “ప్రపంచాన్ని పాలిస్తున్నది ఇప్పుడు మతమే / ప్రజలిప్పుడు అనకొండ గర్భంలో ఉన్నారు" అని కళవళపడ్డాను.
“ఎక్కడో మసీదులు కూలినా/ ఇంకెక్కడో శిలువ విరిగిపడినా/మరోచోట విగ్రహాలు శకలాలైపోయినా/ ఇన్నివేల మైళ్ళదూరాన/ శిరస్సులు తెగిపడడమేమిటో / భయం గుప్పిట్లో దేశాలు ఉండటమేమిటో అర్థంకాక అయోమయంలో మునిగిపోయాను.
"తల్లులారా/ మనదుఃఖాన్ని, మన ఆగ్రహాన్ని, మన ఔదార్యాన్ని ముప్పేటలుగా అల్లి / త్రివేణీ సంగమ ప్రవాహం చేసి/ క్షుభిత హృదయాల్ని చల్లార్చుదాం రండి / ఓ మహా యుద్ధానలమా / చల్లని నవనీతం పూసి / సేదతీర్చటం తెలిసిన తల్లులం/ మాకు సోకుతున్న సెగని తట్టుకొనైనా / నిన్ను ఉపశమింపజేయటమే మాలక్షణం” అంటూ నా నిర్ణయాన్నీ ప్రకటించాను.
మనం ప్రేమించిన మానవ విలువల అద్భుత కట్టడాన్ని / ఎనిమిదో వింతగా / ఏ మసీదు ముంగిట్లోనైనా కడదామా/ గుండె గాయాల్ని స్రవిస్తున్న రక్తాశ్రువులలో / ఏమందిర దైవాన్నైనా అభిషేకించుదామా / మన హృదయాల్ని పిండి కొవ్వొత్తిని చేసి/ ఏ చర్చి ముందైనా వెలిగించి వేలాడదీద్దామా / పంచభూతాల సాక్షిగా / యుద్ధమైకంతో ఊగుతోన్న దేశాల్నిండా / అమ్మతనాన్ని వర్షిద్దాం రండి” అని ఆక్రోసించాను.
ముగింపులో “ఒక సంపూర్ణ మానవాంకురాన్ని పొదిగేందుకు / ఒక తల్లి గర్భం కావాలి / శాపగ్రస్తులై రాతిగా మారిన అహల్యలారా / మళ్ళీ ఈ భూగోళాన్ని / మానవీయ స్పర్శతో పునీతం చేసే / మనుషులతో నింపుదాం” అంటూ మాతృ హృదయాన్ని పరచి ఆహ్వానించాను.
ఈ విధంగా 56 పేజీల దీర్ఘకావ్యంగా 'యుద్ధం ఒక గుండెకోత' ఆవిష్కరించాను. ఈ పుస్తకం అన్నివాదాల వారితో, అన్ని వర్గాల వారితో మమేకం అయ్యేలా చేసింది. ఎందుకంటే ప్రతీ యింటి నుండీ రెక్కలు కట్టుకొని ఎగిరిపోతోన్న వలస పక్షులున్నారు. ఆనాడు 2001లో అమెరికా ఆఫ్ఘన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వారి వారి పిల్లల కోసం గుండె చెరువులై సప్తసముద్రాలు దాటి భూమి రెండో వైపుకు వెళ్ళలేక గుబులుగా ఉన్నారు. కావ్యంలో నేను ప్రతిపాదించిన అనేకానేక విషయాలపట్ల అందరూ సానుకూలంగా స్పందించారు.
నేను ఇది రాసినపుడు కూడా నా గుండె తడితో రాశాను. ఆ విధంగా కూడా ఈ రచన నాకు చాలా ఇష్టమైంది. ఆఫ్ఘన్ లో దాడికి గురైన మలాలా బాలికా విద్యపట్ల అంకితభావానికి నోబుల్ శాంతి బహుమతి అందుకోవడం అందరికీ తెలిసిందే. 2001 నాటికి బహుశా మలాలా రెండేళ్ళ పాప అయి ఉండొచ్చు. నేను 2001లో రాసిన ఈ గ్రంథంలో సూచనప్రాయంగా ఆఫ్ఘన్ లో చదువుకునే హక్కులేని బాలికల స్థితిని తెలిపే వాక్యాలు "అక్షరం ఆకారం తెలియని పసిది / సిగ్గుతో మెలికలు తిరుగుతూ వేళ్ళని గుండెల్లో దాచుకొని / జనానాలోకి పారిపోతోంది” అని దిగులుపడ్డాను.
యుద్ధ నేపథ్యంలో తెలుగులో అప్పటికి ఎవరూ కావ్యాలు రాసినట్లు లేదు. ఆ విధంగా కూడా దీనికి ప్రత్యేకత లభించింది.
2002లోనే డా. పి. భార్గవీరావు, డా. పోపూరి జయలక్ష్మిగారు ఆంగ్లానువాదం చేశారు. అది కూడా అప్పుడే గ్రంథరూపం సంతరించుకుంది. "WAR, A Hearts' Ravage'
నిర్మలానంద వాత్సాయన్ గారు 'యుద్ధ ఏక్ దిల్ కి వ్యధ' పేరున హిందీలోకి అనువదించినది కూడా గ్రంథరూపంలోకి వచ్చింది.'ఉళ్ళక్ కుమురల్' పేరిట రాజేశ్వరి కోథండం గారు చేసిన తమిళానువాదం పుస్తకంగా వచ్చింది.
డా. ఆవంత్స సోమసుందర్ గారు ప్రతీ ఏటా దీర్ఘ కవితల ప్రక్రియలో ఇచ్చే దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి రాజహంస పురస్కారం 2011లో నేను అందుకున్నాను.యుద్ధం ఒక గుండె కోత మీద మథుర కామరాజు విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఫిల్ పరిశోధన జరిగింది.
2001లో ఈ దీర్ఘ కావ్యం రాసే నాటికి కవులలో కొందరు మాత్రమే దీర్ఘకావ్యాలు రాశారు. కవయిత్రులలో నుండి వచ్చిన మొదటి దీర్ఘకావ్యంగా విమర్శకులు గుర్తించారు. తర్వాత ఏడేళ్ళకు 'బతుకు పాటలో అస్తిత్వరాగం' పేరుతో మరో దీర్ఘకావ్యాన్ని కూడా రాశాను. ఆ గ్రంథంలో ఆడబిడ్డ పిండంగా ఏర్పడినది మొదలు వృద్ధాప్యం వరకూ ఏడు అధ్యాయాలుగా రాశాను. ప్రతీ అధ్యాయంలో తొలి సూర్యకిరణం వెలుగు చూసినది మొదలు సూర్యస్తమయం వరకు, విత్తనం మొలకగా విచ్చుకున్నది మొదలు మోడుగా మారేవరకూ స్త్రీ జీవితంతో పోలిక చెప్తూ రాశాను.
కవిత్వ రంగంలో పేరున్న కవులందరూ దీర్ఘకావ్యాలు రాయటంలో ఆసక్తి చూపారు. కానీ కవయిత్రులు ఎందుకనో దీర్ఘ కావ్య ప్రక్రియ పట్ల సుముఖత చూపటం లేదు. నేను కాకుండా మరో అయిదారు మంది తప్ప రాసిన వారు లేరు.
మత విద్వేషాలపై దేశవ్యాప్తంగా జరుగుతోన్న చర్చలు, దుర్ఘటనలు, హింసల నేపథ్యంలో కూడా నా 'యుద్ధం ఒక గుండె కోత' అనుకున్నంతగా ప్రాచుర్యం చేసుకోలేకపోయాను. బహుశా అందుకనే అంతర్జాతీయ సమస్యని చర్చించిన గ్రంథమే అయినా సాహిత్య రాజకీయాలతో మరుగునపడిపోతోంది. ఏది ఏమైనా దీర్ఘకావ్యంగా 'యుద్ధం ఒక గుండెకోత' మనసుతో రాసినదిగా నాకు చాలా ఇష్టమైన రచన.
(పెనుగొండలో జరిగిన 'ప్రరవే' సదస్సులో చదివిన ప్రసంగ వ్యాసం)
సృజన క్రాంతి లో ప్రచురితమైనది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి