8, ఆగస్టు 2024, గురువారం
ఛాయాదేవి గారితో నా అనుబంధం
ఛాయాదేవి గారితో నా అనుబంధం
అబ్బూరి ఛాయాదేవిగారు 1994లో అబ్బూరి వరదరాజేశ్వరరావుగారి ఛాయాచిత్రాలు, రచనలు, జ్ఞాపకాలు అన్నింటినీ ‘వరద స్మృతి పేరిట ఒక బృహద్ గ్రంథంగా వెలువరించే సంకల్పంతో శీలా వీర్రాజుగారినీ, కుందుర్తి సత్యమూర్తి గారినీ దాని రూపకల్పనకు సహకరించాల్సిందిగా కోరారు. ఆ సందర్భంలో ఫోన్ల ద్వారా ఛాయాదేవిగారు నాకు పరిచయం అయ్యారు.
కుందుర్తి ఆంజనేయులుగారి పెద్దమ్మాయీ, ఛాయాదేవి గారలు తోడికోడళ్ళు. మా కుటుంబానికి కుందుర్తి కుటుంబమంతా ఆత్మీయ బంధుమిత్రులు. అందువలన కుందుర్తి గారి నలుగురు కుమార్తెలు, కుమారుడు సత్యమూర్తి కుటుంబాలలో జరిగే సంతోష సందర్భాలలోనూ, విషాద సన్నివేశాలలోనూ కూడా ఛాయాదేవిగారు నేను కలుసుకోవటంలో నాకు ఆమె మరింత సన్నిహితులయ్యారు.
వాసిరెడ్డి సీతాదేవిగారి ఆధ్వర్యంలో సీనియర్ రచయిత్రులందరితో ఏర్పాటైన సఖ్య సాహితి సమావేశాలు ఒక ఏడాదిపాటు రచయిత్రుల ఇళ్ళల్లోనే జరిగేవి. వాటికి చాలాసార్లు ఛాయాదేవిగారితోనే వెళ్ళేదాన్ని. అదేవిధంగా భూమిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రచయిత్రుల సమావేశాలకు బాగ్‌లింగంపల్లికి దగ్గర్లోనే ఉన్న మా పాఠశాల పూర్తయిన తర్వాత ఛాయాదేవిగారింటికి వెళ్ళేదాన్ని. అక్కడ కాస్త సేదతీర్చుకొని సమావేశాలకు కలిసివెళ్ళేవాళ్ళం. ఆ సందర్భంలో ఆమెకు నాకు మధ్య అనేకానేక అంశాలు కలబోసుకునే అవకాశం కలిగింది. నాకు కూడా బొమ్మల తయారీపట్ల ఆసక్తీ, అభిరుచి ఉండడం వలన ఛాయాదేవిగారు తాను చేసిన ప్రతీ బొమ్మనీ చూపి, దాని తయారీని వివరించేవారు. పనికిరావనుకునే వస్తువులను అద్భుత కళాఖండాలుగా మార్చే వారి సృజనాత్మకశక్తికి అబ్బురపడి ఆమెపై మరింత ప్రేమ పెంచుకున్నాను. ‘బొమ్మలు చేయటం ఎలా’ పుస్తకాన్ని, శీలా వీర్రాజుగారికి అంకితం చేసారు ఛాయాదేవిగారు.
ఛాయాదేవిగారి మరో సుగుణం ప్రచురితమైన రచన చదవగానే ఫోను చేసి మాట్లాడేవారు. నా ఎనిమిది కవితా సంపుటాలనూ కలిపి ప్రచురించిన సమగ్ర కవితాసంపుటి ‘శీలా సుభద్రాదేవి కవిత్వం’ సంపూర్తిగా చదవటమే కాకుండా అందులోని 195 కవితలకూ, రెండు దీర్ఘకావ్యాలకూ ప్రతీ ఒక్క దానికీ విడివిడిగా వ్యాఖ్యానం రాసి పంపించారు. ‘‘ఎవరైనా పరిశోధకులకు పనికి వస్తుందని రాసాను’’ అని చెప్పిన వారి ఓపిక, సహృదయత నన్ను కదలించింది. అందుకని ఆమెపై గౌరవంతో నా రచనలపై వచ్చిన వ్యాససంపుటి ‘గీటురాయిపై అక్షరదర్శనం’ పుస్తకంలో ఆమె రాసిన అభిప్రాయ మాలికను పొందుపరిచాను.
అతి సౌమ్యురాలు, స్నేహశీలి, మృదుభాషిణి కావటాన ఛాయాదేవిగారు అనేకమందికి ఆత్మీయులయ్యారు. పుస్తకం చదివి అభిప్రాయం తెలియజేసే లక్షణం అరుదు. ఆ లక్షణం కూడా ఛాయాదేవి గారిని రచయితలకు దగ్గర చేసింది.
బాగ్ లింగంపల్లిలో ఉన్నప్పుడు తరచూ కలిసేదాన్ని. సి.ఆర్. ఫౌండేషన్ కి వెళ్ళాక అయిదుసార్లకన్నా ఎక్కువ కలవలేకపోయాను. ఎనిమిదో తరగతిలో మా మనవరాలు ఛాయాదేవిగారి బోన్సాయి బతుకులు పాఠం చదివి ఆమె గురించి అడిగితే మా అమ్మాయినీ, మనవరాలినీ తీసుకొని వెళ్ళాను. మా మనవరాలు ఆశ్లేషని పరిచయం చేస్తే ‘నా నక్షత్రం కూడా ఆశ్లేషే’ అని ముచ్చటపడిపోయారు.
‘బొమ్మలు తయారుచేయటం ఎలా?’ అన్న పుస్తకాన్నే కాక వారి బంధువులెవరో ఆమె కోసం విదేశాల నుండి తెచ్చి యిచ్చిన కలరింగ్ పుస్తకం, కలర్స్ మా ‘ఆశ్లేషకు ప్రేమతో అమ్మమ్మ’ అని సంతకంతో ఇచ్చారు. ఫోను చేసినప్పుడల్లా పాప గురించి అడిగేవారు.
పాలపిట్టలో నేను రాసిన ఇల్లిందల సరస్వతి కథలపై వ్యాసం చదివి నెలరోజుల కిందటే ఫోను చేసి చాలాసేపు మాట్లాడారు. ‘ఎండలు తగ్గాక పిల్లల్ని తీసుకువస్తానని’ అంటే ‘ఇంతదూరం అంత శ్రమపడి రావద్దండీ ఫోనులో మాట్లాడుకుంటున్నాం కదా’ అన్నారు.
ఒక సోదరిలా, ఒక ఆత్మీయబంధువులా హృదయానికి దగ్గరగా వచ్చిన సౌజన్యమూర్తి అబ్బూరి ఛాయాదేవిగారు. ఎటువంటి క్లిష్ట సందర్భాన్ని సైతం ఒక చమత్కారంతో తేలికగా తీసుకునే లక్షణం బహుశా జిడ్డు కృష్ణమూర్తి గారి రచనల ద్వారానే వారికి సాధ్యమై వుంటుంది. చివరి రోజున మా యింటికి దగ్గర్లోని డా. సూర్యప్రకాష్ గారి యింట్లోనే ఉన్నారని మొదట్లో తెలియకపోవటంతో కలవలేకపోయాను.
జిడ్డు కృష్ణమూర్తిగారి తాత్త్వికతను మనోవాక్కాయకర్మలా నమ్మినవారు, ఆచరించినవారు కనుకనే తన జీవితం ఎలా నడవాలో, ఎలా ముగించాలో నిర్ధారించుకున్నారు. అదే పద్ధతిలో జీవించారు. అదే విధంగా నిష్క్రమించారు.
భౌతికంగా దూరమైన తర్వాత నిత్యచైతన్యమూర్తిని, ప్రతీ విషయాన్ని పోజిటివ్ గానే తీసుకునే మనస్వినిని నిర్జీవంగా చూడలేక వెళ్ళలేదు. కానీ ఆమె జ్ఞాపకాలు, మాటలూ స్నేహానుభూతులూ నా మనసులో పదిలంగా ఉన్నంతకాలం నాలో ఆమె చిరంజీవిగానే ఉంటారు.
- శీలా సుభద్రాదేవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి