8, ఆగస్టు 2024, గురువారం

సప్తపది

తెలుగులో రచయిత్రుల తొలి గొలుసు నవల- సప్తపది "మానవజీవితాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా దర్శించ డానికి నవలాకారునికున్నంత అవకాశం ఓ మహర్షికి గానీ, ఓతాత్వికునికి గానీ, ఓకవికి గాని లేదు" అంటారు సుప్రసిద్ధ నవలారచయిత డీ.హెచ్. లారెన్స్. ఇంత ప్రసిద్ధమైన నవలా ప్రక్రియ తెలుగుసాహిత్యంలో నరహరి గోపాల కృష్ణమ్మ సెట్టి రాసిన సోనాబాయ్ పరిణయం( శ్రీరంగరాజు చరిత్ర,1872) లేదా కందుకూరి వీరేశలింగం పంతులు గారి రాజశేఖర చరిత్ర (1878) సంశయం ఉంది. ఏదేమైనా మొత్తం మీద ఈ సుదీర్ఘ ప్రక్రియకు నవల అనే పేరు స్థిరపడింది. (ఆంగ్లంలో నావల్ అనే పదం నుండి వచ్చినట్లుగా). అయితే ఈ వ్యాసంలో చర్చించాల్సిన అంశం గొలుసునవల. కీ.శే. ఇరివెంటి కృష్ణమూర్తిగారి వద్ద "తెలుగులో గొలుసు కట్టు నవలలు" అంశంపై శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు తన ఎం.ఫిల్ పరిశోధనను 1977 లో మొదలు పెట్టి 1980 నాటికి పూర్తి చేస్తారు.దీని కొరకు విఠలాచార్యగారు చాలా అధ్యయనం చేయవలసి వచ్చిందనిఅంటారు. దీని గురించి సరియైన విషయసేకరణ కొరకు అనేక మంది సుప్రసిద్ధ సాహితీవేత్తలను కలిసి, అవసరమైన మేరకు ఇంటర్వ్యూలు చేసి అనేక గ్రంధాలయాలు సందర్శించి తెలుగు వచ్చిన గొలుసు కట్టు నవలలను, వివరాలను సేకరించానని తెలియజేసారు. గొలుసుకట్టు నవల లేదా గొలుసు నవలను విఠలాచార్య గారు సమిష్టి సాహిత్యరచనగా అభివర్ణించారు. విఠలాచార్యగారి మాటల్లో - "సమిష్టి సాహిత్య రచనకు రచయితలు ఖండఖండాలుగా ఒకరి తర్వాత మరొకరు రచనలు చేస్తూ,ఒకరు విడిచి పెట్టిన భాగాన్ని మరొకరు,మరొకరు విడిచి పెట్టిన భాగాన్ని ఇంకొకరు చేపట్టి గొలుసు కట్టుగా రచనను చేసుకుంటూ కథను సమాప్తం చేస్తారు." అయితే ఈ ప్రక్రియ తెలుగులో ప్రచురణ రూపంలో కాక ఆకాశవాణిలో ప్రసారణ రూపంలో మొదలైంది.అందుచేత వీటిని రేడియో నవలలుగా తెలియజేసారు. మద్రాసు ఆలిండియా రేడియోతొలిసారి 1947 లో " ఆదర్శజీవులు" అనే ఆరు అధ్యాయాలుగా గొలుసు నవలను కొడవటిగంటి కుటుంబరావు , పాలగుమ్మి పద్మరాజు, మునిమాణిక్యం నరసింహారావు, త్రిపురనేని గోపీచంద్, శ్రీరంగం శ్రీనివాసరావు,చింతా దీక్షితులతో గొలుసు నవలగా రాయించి ప్రసారం చేసింది. విజయవాడ ఆకాశవాణి కేంద్రం 1959 జూలై, ఆగష్టునెలలలో ఏడువారాలపాటు స్త్రీల కార్యక్రమంలో ధారావాహికంగా ప్రసారం చేసిన గొలుసునవల "సప్తపది "దీనిని శ్రీమతి కనపర్తి వరలక్ష్మమ్మ , శ్రీమతి డా.పి.శ్రీదేవి, శ్రీమతి మాలతీచందూర్, శ్రీమతి దుర్గాకుమారి,శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి,శ్రీమతి కె. రామలక్ష్మీ, శ్రీమతి పి. సరళాదేవి అను ఆనాటి సమకాలీన రచయిత్రులచే రాయించి ప్రసారం చేయటం ఒక విశేషం. ఈ నవలను తదనంతరం 1963 జూన్ లో విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ-4.వారు ఒక్క రూపాయి మాత్రమే ధరతో 1250 కాపీలను స్వతంత్ర ఆర్ట్ ప్రింటర్స్ ద్వారా ముద్రించారు. ముందుగా క్లుప్తంగా కథాంశాన్ని నిర్ణయించుకుని ప్రతిభాగానికి మొదలు తుది అంశాలుగా కథను విభజించి రచయిత్రులకు అందజేసారు . ఎవరికి వారు ఒకరు ఒకపాత్రకు అందించిన ఊపును మరొకరు అందుకొని, వారు ఒక సమస్యను మొదలు పెట్టి అందించిన దానిని మరొకరు మరో మలుపుకు మళ్ళించి మొత్తంగా ఏడుభాగాలలో కథను ముగింపుకు తీసుకు వస్తారు. "సమకాలీన రచయిత్రులే అయినప్పటికీ వారివారి వాదం,భావం, సిద్ధాంతం, అభిప్రాయం, అభిరుచి, ప్రవృత్తి, దృక్పథం మొదలగు వాటిలో ఎంతగా కథను వేరువేరు పుంతలు తొక్కించినా సమకాలినమైన యథార్ధాన్ని మాత్రం యీ గొలుసు నవల ద్వారా ఆవిష్కరిస్తారు.భిన్న దృష్టులు కలిగిన రచయితలు ఒక వాస్తవం పరిస్థితి పై ఏకదృష్టి కలిగి ఉండుట ఈ ప్రక్రియ ద్వారా నే గోచరిస్తుంది " కూరెళ్ళ విఠలాచార్య గారు తన పరిశోధన లో విశదీకరించారు. ఈ విషయం పైనే "సప్తపది" నవలలో ఏడుగురు రచయిత్రులు కథను నడిపించిన విధానాన్ని వివరముగా తెలుసుకుందాం. 1)తీరనిసమస్య - శ్రీమతి కనపర్తి వరలక్ష్మమ్మ. కమల బియ్యే చదివిన అమ్మయి. కథ ప్రారంభం ఈ బియ్యే ఫలితాలతోనే ప్రారంభించి కమల తర్డ్ క్లాసులో పాసయినందుకు బాధ పడిందని మొదలుపెడతారు రచయిత్రి.కమల చదువే కాక సంగీతం,నృత్యం నేర్చిన చురుకైన పిల్ల. కమల తండ్రి చిరుద్యోగి. నలుగురుఆడపిల్లలు,ఒక మొగపిల్లవాడు.కమల రెండవది. మొదటి అమ్మాయి కి ఉన్న అయిదు ఎకరాల్లో ఒక ఎకరం అమ్మి పెళ్ళి చేస్తాడు. అప్పటికీ అల్లుడు కట్నకానుకలు కోసం మామగారిని వేధిస్తుంటాడు.పెద్దకూతురు దానికి వంత పాడుతుంటుంది. కమల తండ్రి స్నేహితుడు కామరాజు వచ్చి " మగపిల్లాడిని చదివిస్తే జీతం, వచ్చే కోడలు తెచ్చిన కట్నకానుకలు, బంగారం అంతా మనదే అవుతుంది.ఆడపిల్లని చదివిస్తే ఖర్చు, పెళ్ళి ఖర్చు,పెట్టిన బంగారం ,ఆమె జీతం అంతా వేరొకరికి దక్కుతుంది "అని హితబోధ చేస్తాడు." పెళ్ళి చేయాలన్నా బియ్యే చదివిన పిల్ల తనతో సమానమైన వాడిని, తక్కువ చదివిన వాడినీ ఒప్పుకోదు, అంతకన్నా ఎక్కువ చదివిన వాడికి చాలా కట్నకానుకలు పొయ్యాలి "అని స్నేహితులు ఇద్దరూ వాపోతుంటారు. పురిటికి వచ్చే పెద్దకూతురు,ఆ ఖర్చు తలచుకొని బెంగ పెడతాడు తండ్రి. తల్లి, తండ్రి మిగతా పొలం అమ్మి కమల పెళ్ళి చేస్తే మిగతావాళ్ళు గతి ఏమిటనీ, పెద్దకూతురు పెట్టుపోతలెట్లా అని తర్జనభర్జన పడటం చూసి కుమారులకు పెళ్ళంటే అసహ్యం కలుగుతుంది. ఉద్యోగం ప్రయత్నం లో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లో ఉద్యోగం వస్తుంది.ఆఫీస్ లో ఆడవాళ్ళు ఉండరు.కమల జాయిన్ కాగానే ఇక ఆపీసులో కచేరీలు,నృత్య ప్రదర్శనలు కాబోలని వెటకారాలు. అటెండరు దగ్గర నుండి ఆఫీసరు వరకూ కమలతో ప్రవర్తించే తీరు కమలని బాధపెడుతుంది. ఈభాగంలో ఆనాటి చిరుద్యోగుల ఇళ్ళల్లో పిల్లల వెతలు, వారి మనోభావాలు, ఆడపిల్లల వివాహం గుదిబండ కావడం, చదువుకున్న, ఉద్యోగం చేసే ఆడవారిపై చూపే నిరసనలు, అపోహలు ఆ కాలపు మధ్యతరగతి జీవితాలకు అద్దం పడతాయి. ఈ భాగం రచయిత్రి కనపర్తి వరలక్ష్మమ్మగారు సమాజ సేవకురాలు కూడా కావటం ఆమె గమనించిన జీవితాల్ని తన భాగంలో ప్రస్తావించారు. 2)- ఉద్యోగం లో--శ్రీమతి డా.పి.శ్రీదేవి. ఉద్యోగం లో చేరిన కమలకు రెండు నెలలకే ఉత్సాహం, గర్వం తగ్గిపోతుంది.పెళ్ళిచేసుకుని తండ్రిని అప్పులపాలు చేయకూడదని ఉద్యోగంలో చేరిన కమలకు ప్రతీనెల తన జీతానికి రెక్కలు వచ్చి ఎగిరిపోవటం నిరాశ పరిచింది.అఃతకుముందు తండ్రి ఎలా సంసారం గడిపాడో కానీ కమలజీతంతో అంతకుముందు చేసిన అప్పులను తీర్చడానికి, కుదువ పెట్టిన గొలుసు విడిపించుకోటానికి, సంసార ఖర్చులకు తీసుకోవటంతో కమలకి స్వంతంగా ఒకచీరో,చెప్పులో కూడా కొనుక్కోలేని అసహాయత కు బాధ పడుతుంది . ఆఫీసులో కూడా హెడ్ గుమాస్తా మందలించక పోవటం తోటి ఉద్యోగుల కు మంట కలిగించింది ఆడపిల్ల అని ఏమీ అనటంలేదని గుసగుసలు పోవటం చికాకు కలిగిస్తుంది. ఈ సందర్భంలో రచయిత్రి శ్రీదేవి ఇలా రాస్తుంది.-"కమలకి కావలసినది మనిషి మనిషితో మాట్లాడినట్లు మాట్లాడటం- అంతే కానీ మగవాడు ఆడదానితో మాట్లాడినట్లు కాదు. కానీ ఆఫీసులో ఒకరూ కమలకి కావలసినట్టు మాట్లాడరు." ఈ మాటల్లో కాలాతీతవ్యక్తులలో ఇందిరను తలపిస్తుంది. కమలకి తన స్నేహితురాలు ఇందిర కలుస్తుంది. ఆమె పెళ్ళై, బిడ్డ తల్లి .ప్రతి స్త్రీకి పెళ్ళి ముఖ్యావసరంగా ఆమె కమలతో మాట్లాడుతుంది.. కముమల ఆలోచనలో పడుతుంది. ఇంటికి వచ్చే సరికి తల్లిదండ్రులు పెద్దకూతురికి పెట్టాల్సిన పెట్టుపోతల గురించి చెప్పేసరికి "అవాంతర ఖర్చులు తనపై రుద్దతారేమిటి తనకు సరదాలు ఉండవా? 'అనితనని తాను ప్రశ్నించు కొంటుంది.కమలకి స్నేహితురాలి వైవాహిక జీవితం సుఖవంతంగా అనుకోవాలో,అక్క బానిస జీవితం చూసి అసహ్యించుకోవాలో అర్థం కాదు. "ఏమైనా స్వేచ్ఛా, వ్యక్తిత్వం లేని చీకటి బతుకులో తాను మునిగి పోకూడదు" అని నిశ్చయించుకోవటంలో శ్రీదేవి రచనలలోని ఆత్మనిర్భరత ఈ భాగంలో గమనించ వచ్చు. 6 సంఘర్షణ - శ్రీమతి మాలతీచందూర్ పెద్దకూతురు ,భర్తా పిల్లలతో పురిటి కాని వస్తుంది.అది చూసి కమల 'మొత్తం కుటుంబం అంతా ఇక్కడే ఉంటారా' అని ఖర్చులు గురించి దిగులు పడుతుంది.తల్లీతండ్రీ పెట్టుకోవాలి గురించి కమలకి గుర్తు చేస్తారు. కొందరు పురుషులకు చదువుకున్న సమర్ధత కలిగిన స్త్రీలే గిట్టదు.అందుకే మాటిమాటికీ అక్క భర్త ' గ్రాడ్యుయేట్ కమలా' అని సంభోదించడం చిరాకు కలిగిస్తుంది. అది ఒకతిట్టులా వినిపిస్తోంది. ' బియ్యే చదివిన ఉద్యోగం చేసే వాళ్ళని ఎవరూ పెళ్ళి చేసుకోరు' అంటాడు.ప్రతీ సారీ సూట్లకి, బట్లకీ పోట్లాడే బావగారికి తన చదువు గురించి, ఉద్యోగం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని కమల తీవ్రంగా సమాధానం ఇస్తుంది. దాంతో ఇంట్లో దుమారం రేగింది .తండ్రి ఉద్యోగం మానేయమని,రెండో పెళ్ళి సంబంధం ఒకటి తీసుకొస్తాడు. ఎవరితోనూ మాట్లాడకుండా కమల తనలో తాను ముడుచుకుపోతుంది.పెళ్ళి చూపుల సమయంలో కమల్ తీవ్రమైన వత్తిడి కి గురై విరుచుకు పడిపోతుంది. ఈభాగంలో మాలతీ చందూర్ చదువుకొని,ఉద్యోగం చేస్తున్నా మహిళలకు స్వావలంబన లేకపోవటం,వారి పట్ల సమాజం చూసే వివక్షతను తెలియజేస్తారు.ధైర్యంగా స్వేచ్ఛగా ఉండే స్త్రీలను పెళ్ళి చేసుకునే ధైర్యం లేని పురుషులను,అటువంటి స్త్రీలను మానసికంగా దుర్బలులనుచేసే ప్రయత్నాలు అభివ్యక్తీకరిస్తారు.అందులో భాగంగానే జరిగే వివాహతతంగాలూ బట్టబయలు చేస్తారు. 4) మబ్బులు విడిపోయాయి.- శ్రీమతి దుర్గాకుమారి కమలకు ఏదో గ్రహచేష్టనీ అంటూ ఆమె తల్లి శాంతి కోసం ప్రదక్షిణలు, చన్నీళ్ళ స్నానాలు , నేలమీద పడుకోవడం వంటివన్నీ చేయిస్తుంది . కమల "ఇవన్నీ ఏమిటమ్మా నాకు లేని పిచ్చిని పట్టిస్తున్నారు" అని దుఃఖిస్తుంది. కమలకి దైవభక్తి ఉన్నా 'చెవులు చిల్లులు పడేలా స్మరించడం,భజన చేయటం, లేని భక్తిని బాహ్యప్రదర్శనాల ద్వారా అభినయించడం రోత పుట్టిస్తాయి. స్వాముల వద్దకు తీసుకుపోయి బోధనలు చెప్పించటం నచ్చదు.'ప్రతీ స్త్రీ కలలు కనే మధురమైన బాధ్యతలు,అర్థం చేసుకునే భర్త ,ప్రశాంత జీవితం కావాలి.అవన్నీ మృగ్యం అవుతున్నాయి' అని నిరంతర ఘర్షణలో నలిగిపొతుంది.కమల. ఆ పరిస్థితిలో మేనత్త శారదాంబ వచ్చి తన కూతురు పెళ్ళని సాయింకోసం వస్తుంది. కమల తాను వెళ్తానని బయలు దేరుతుంది. అయితే తనని పెళ్ళి గురించి ఎవరూ అడగకుండా చూడమంటుంది. ప్రశాంతమైన పల్లెటూరు, ప్రకృతి శోభ కమలకు మధురంగా కనిపించాయి. అమాయకమైన పల్లె పడుచులు, అక్కడ జరిగిన పెళ్ళిసంబరాలు గిలిగింతలు పెడతాయి. తన భావాలను తన స్నేహితురాలికి ఉత్తరంగా రాయబోయేసరికి ఒక కథగా రూపొందింది.దానిని పత్రికకు పంపితే అచ్చవుతుంది.ఆ విధంగా ఉత్సాహంగా రచనలు చేస్తుంది కమల.రచనలో పాత్రల కష్టాలూ,సంఘర్షణలకూ బాధపడే వ్యక్తులు నిజం జీవితంలో అలా స్పందించక పోవడం కమలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. తనకు తెలిసిన పద్మ పరీక్ష పోయిందని ఆత్మహత్య చేసుకోబోవటాన్ని కాపాడి హితబోధ చేస్తుంది.పాఠాలు చెప్పి పద్మని ప్రయోజకురాల్ని చేస్తుంది. ఈ సంఘటన కమలకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, ఎంతో శక్తినీ ఇచ్చి ఆమె జీవితానికి ఒక భాష్యాన్ని చూపుతుంది. ఈ భాగాన్ని రాసిన దుర్గాకుమారి ఎవరో తెలియలేదు.కానీ రచనలో రచయిత్రికి గుల ఒకింత హేతువాద దృక్పథం తెలుస్తోంది.గ్రామీణ సౌందర్యం, పెళ్ళిళ్ళలో జరిగే తంతులూ,ఆయా సందర్భాలలో అనేక వేళాకోళాలూ మొదలైనవి హృద్యంగా అక్షరీకరించారు. 5). ప్రజాసేవ- ఇల్లిందల సరస్వతీదేవి కమల కాపాడిన పద్మ పరీక్ష పాసు కావటంతో పద్మతండ్రి సరియైన శిక్షణ లేక పద్మ ఇన్నాళ్ళూ ఫెయిలయ్యిందని భావించి,తాను స్త్రీల కోసం ఒక సేవా కేంద్రం స్థాపించాలనుకుంటున్నానని కమలని అందులో పనిచేయమని కోరుతాడు. చరఖా, కుట్టుపనులనీ, వయోజన విద్యా ప్రాధాన్యాయాలుగా సంఘం మొదలయ్యింది.చాలామంది సామాన్య స్త్రీలు చేరి పనులు నేర్చుకుంటారు.కమల చురుకుగా పని చేసి దానిని అభివృద్ధి లోనికి తెచ్చే క్రమంలో కమల మనసు నవచైతన్యాన్ని పొందుతుంది. వార్షికోత్సవ సందర్భంగా ఒక నృత్య నాటిక ను నేర్పాలనుకుంటుంది.కమల వాళ్ళతో చేయించే ప్రాక్టీసుని ప్రక్కనే ఉన్న ఇంటిలో అతను చెట్టు ఎక్కి దాక్కుని చూడటం గమనించి మందలిస్తుంది. సలహా సంఘం వారి ముందు వార్షికోత్సవానికి ముందురోజు రిహార్సల్స్ గా నృత్య నాటిక ప్రదర్శిస్తుంది.అయితే వారు వచ్చినప్పుడు బయటగోడలనిండా కమల గురించి,మహిళలు గురించి అనేక అసభ్యరాతలు రాసి ఉంటాయి.అక్కడ నేర్చుకుంటున్న మహిళలు తమ కష్టంతో అంతోయింతో సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఇలా పల్లెటూళ్ళు బాగు చేయవచ్చని భావించిన కమలకు మనసు వికలమై కంటిమీద కునుకు రాలేదు. ఈ భాగాన్ని భాస్కరభట్ల కృష్ణారావుగారు ' సంఘసేవ' అనే శీర్షికను ఇల్లిందల సరస్వతీ దేవి గారికి ఇచ్చి సప్తపది గొలుసు నవలలో ముందు భాగాలననుసరించి మీ భాగం రాయమన్నారని సరస్వతీ దేవి గారు ఒక సందర్భంలో తెలియజేశారు.ఈ నవలకు ముందు రచయిత్రులు కలిసి సమిష్టిగా కథాంశాన్ని చర్చించుకోలేదనీ చెప్పారు. ఇల్లిందల సరస్వతీదేవి గారు అంతకుముందు నుంచే సమాజం సేవారంగంలో ఉండటం వలన ఈ రంగంలోని లోతుపాతులు వ్యక్తులను ఉండీ,సమాజం నుండీ ఎదుర్కొనే ఇబ్బందులూ ఆమెకు తెలిసి ఉండటం చేత ఈ భాగంలో ఈ దృష్టికోణాన్ని చక్కగా ఆవిష్కరించారు. 6) కళారంగంలో - శ్రీమతి కె.రామలక్ష్మి. తన జీవితంలో అలుముకున్న మబ్బులు విడిచి ప్రశాంతంగా వున్నాననుకుంటే మళ్ళీ యీ పరీక్ష ఏమిటనుకుంటుంది కమల. నృత్యనాటిక అభాసుపాలు కావటంతో బాధకలిగించింది.నృత్యనాటిక రాసి తనతో పనిచేసిన రంగాచారి ' పబ్లిక్ రంగంలో రాణించడానికి యిలాంటి ఢక్కాముక్కీలు ఎన్ని తినాలో.దీనికే భయపడితే యెలా' అంటాడు. కమల మాత్రం తాను కథలు రాసుకుంటూ బతికితే చాలనుకుంటుంది.కానీ రంగాచారి ఆమె కంటి ముందు కళల కలలు సృష్టిస్తాడు.రంగాచారితో కలసి మద్రాసు వచ్చేస్తుంది కమల. స్టుడియోలూ, దర్శకులను సందర్శించినా ఫలితం లేక నిరాశతో కుంగిపోయింది. ఆమె కంఠాన్నీ, అందాన్ని నిరసిస్తారు . అటువంటి సమయంలో ఒక నృత్య నాటికలో వేషం దొరుకుతుంది .అందులో కమల మైమరచి నటించింది. దాంతో ఆమె దశ తిరిగింది. కానీ ఏడాది లోపునే 'కళాప్రపంచంలో శీలానికీ సౌశీల్యానికీ విలువలేదని గ్రహించింది. అయితే కవి శాస్త్రి ఆత్మీయపరిచయం కమల్ మనసులో ఆప్యాయత నింపింది .సహృదయులు, మితభాషి అయిన శాస్త్రి ఆమెకు దగ్గరయ్యాడు. తనని వ్యక్తిగా గాక అందాలభామగా డబ్బు సంపాదించే వనరుగా మాత్రమే తల్లిదండ్రులు, తోబుట్టువులను చూచి విరక్తి గా నవ్వుకుంది కమల. ' నీ తల్లిదండ్రులు నిన్నొక యంత్రంగా మాత్రమే చూస్తున్నారు. వారికి నీ సంపాదన కావాలి. కాని నీకో సంసారం వుండాలని తలపోయరు.నీ జీవితం గురించి ఆలోచించు కమలా' అంటాడు శాస్త్రి. దీనికో దారి చూడాలి అనుకుంటుంది కమల. రామలక్ష్మి గారు మద్రాసులో సినీపరిశ్రమ గురించి,అందులోని లొసుగులు గురించి తెలిసిన వ్యక్తి కావటాన వాటినన్నింటినీ కమల పరంగా వ్యక్తీకరించారు.అంతే కాక కమలకు తన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పించి తన భాగాన్ని ఆపారు. 7. పరిష్కృతి - శ్రీమతి పి. సరళాదేవి కమల తాను వివాహం చేసుకుంటానని తండ్రి తో చెప్తుంది." కూతురు, అల్లుడు కళకళ లాడుతూ తిరగాలని వుండదా,మంచి సంబంధం దొరుకుతే చేస్తానంటాడు. ' తనను అసలు కూతురు గా చూస్తున్నారా? డబ్బు సంపాదించే మగవాడికి అధికారి మైనా వుంటుంది.తన డబ్బు వీళ్ళకు కావాలి అందుకే ఇల్వరికపు అల్లుడు కోసం చూస్తున్నారని బాధ పడుతుంది. కమల మేనమామ మళ్ళా డైరెక్టర్ రామచంద్రునితో పెళ్ళి సంబంధం తీసుకు వస్తాడు. కుమారులకు మనసులో వేదన.తళ పెళ్ళి కూడా తన ప్రమెయం లేకపోవడానికి,తన గమ్యం తనకే తెలియక బాధ పడుతుంది. బీచ్ కి తీసుకువచ్చిన శాస్త్రి రామచంద్రం కి పల్లెటూరిలో భార్య ఉందని చెప్తాడు.కమల నిరాసక్తిని చూసి శాస్త్రి ' రామచంద్రుడిని చేసుకోవాలని మోజు పడ్తున్నావా' అని విసుక్కుంటాడు. కమల తాను జీవితం అంతా చెప్పి ' తనకు ఎవ్వరూ లేరనీ, జీవితం తనని మోగించింది .ఆఖరికి మనసిచ్చి మాట్లాడే స్నేహితులు కూడాలేరు.ఇక యేదో సాహసం చేసి ముగించాల్సిందే' అని వెక్కివెక్కి ఏడుస్తుంది. శాస్త్రి ఆమె చేయించుకుని " పద మీనాన్నతో మాట్లాడదాం,నీ ఆదాయం వాళ్ళకే పంపే ఏర్పాటుచేసి నాకు అల్లుడు గా వచ్చే యోగ్యత వుందేమో అడుగుదాం "అంటాడు.ఆమె " రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలియజేస్తాం" ఆనందంగా అంటుంది.ఆనాటి వేదికమీద ఆనందంగా పాడుతుంది. ఇంటికి రాగానే మేనమామ " బీచ్ లో ఎవరితో తిరుగుతున్నారని గద్దించేసరికి తాను కవియైన శాస్త్రిని మర్నాడు పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలుపుతుంది. ఇంట్లో వాళ్ళందరి కోపాల్నీ, గుసగుసలనీ, బుడిబుడి ఏడుపులనీ లెక్క చేయకుండా " రేపటి వరకూ కాదు ఇప్పుడే శాస్త్రి దగ్గరకు వెళ్ళి పోతానని పెట్టె పట్టుకుని బయటకు వచ్చేసరికి శాస్త్రి టాక్సీ తో వుంటాడు.కమల నిబ్బరంగా వెళ్ళి అందులో కూర్చుంటుంది.అని ఈ భాగంలో పి.సరళాదేవి ఒక అభ్యుదయ దృక్పథంతో, స్త్రీ చైతన్య పూర్వకంగా కమలకథకి ముగింపుని ఇస్తారు. ఇది సంక్షిప్తంగా సప్తపది గొలుసు నవల కథ. ప్రతీ భాగాలన్నీ ఆయా రచయిత్రులు తమతమ మనోభావాలను, ఆలోచనాత్మకంగా,తమ అభ్యుదయ దృక్పథం ప్రస్ఫుటంగా తెలిపే లాగే రాసారు.అంతేగాక సుమారు 70 ఏళ్ళ క్రితం తెలుగు ప్రాంతాలలో మధ్యతరగతి కుటుంబజీవనాన్ని, వారి ఆలోచనా సరళిని ఆనాటి సమాజంలోని వ్యక్తులనూ,వారి విధానాలనూ, స్త్రీ పట్ల పురుషులు ప్రవర్తన,చదువుకున్న,ఉద్యోగినులు పట్ల సమాజదృష్టినీ , ఆడపిల్లల వివాహ వ్యవహారాన్ని ప్రతీభాగం సంపూర్ణంగా ఎత్తి చూపింది. కథలోని సమస్యను గురించి రచయిత్రులందరూ కథా క్రమంలో ఎవరి బాధ్యతను వారు నిర్వహించటంలో ఒకరు ఇంకొకరికి ఆదర్శమయ్యే విధంగా లోతుగా, నిజాయితీగా వ్యక్తీరించారు కమల వ్యక్తిత్వాన్ని, నృత్యం, సంగీతం, చదువుమొదలైన అన్ని రంగాల్లో చురుకుగా వున్నదనే విష యాన్ని తమభాగంలో రచయిత్రులు సక్రమంగా కమల వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి